Friday, January 22, 2016

అష్టమహిషీకల్యాణము -6

(భాగవత రామాయణము)

ఈలంకనుండు నయ్యింద్రారిబంధు
జాలంబుతనుఁ గొల్వ జగదేక వీర
యామహారిపుఁ జంపియచటనుత్తాల
భూమిజామృతఫలంబును నీవకొనుచు
ననుడు రామానుజుండా రామచంద్రుఁ
ఘనయంబు హర్షించి హరికులోద్భవులు
బరుగరాజీవకు శాండజశాల
వరయుక్తమైన యవ్వనరాశిడాసి
యరితమ్ముఁ గనుఁగొని యభయమున్నంత
నరిదినీలంకకు నధిపుఁజేసెదము
అనుచునగాళి బిట్టగలంగ శరధి               (1440)
పెనుపొందఁగట్టె నభేద్యధర్మంబు
తనకేలఁగొనిసేన దారుణార్భటుల
వనచరపంక్తి దిగ్వలయంబు ముట్ట
ననుజన్ముతోరాముఁడా మహావనము
ననుపమంబైన భటాళితోఁగడచి
స్యందన మత్తేభచయ హరిఖడ్గ
బృందంబుచేఁ గడుభీమమౌదాని
తరుణీమృగీమదతతులచేఁ గనక
సరసులచేనొప్పు సవరించుదాని
ఘనసాలజాలసంకలితమౌదాని                (1450)
దనుజేంద్రవసతినత్తఱిఁ జేరవిడియ
సహచరసైన్యంబు చనుదెంచి దైత్య
సహచరసైన్యంబు జడియఁగొట్టుచును
తాలముల్పఱచి చిత్రంపు సాలములఁ
గూలఁదన్నుచుమున్నె కొమ్మలగ్రుచ్చి
శంకింపకెదురుగాఁ జనుదెంచురిపుల
డుంకఁబట్టుచుఁ బండ్లుడుల్లంగఁగొట్టి
చిత్రంబులైనట్టి సింహనాదముల
పత్రసంతతిఁగాల బ్రామివేయుచును
గరిబృందములనిరుగడలఁ జూపట్టు          (1460)
గరుతలఘంటలఁ గొట్టివైచుచును
వేవిధంబుల దైత్య వీరులనొగులు
గ్రావసంఘంబులఁ గప్పిరొప్పుచును
దనుజులుబెగడ గంధములెల్లఁ బెఱికి
కనలుచుహతుల సంఘముల నొప్పించి
కలిగిన పుండరీకముల జాలముల
నలిసేసి బాణాసనములెల్లనఱికి
శరములద్రుంచి తచ్చయముల రిపుల
నురములుగాఁడంగనురిదిగుప్పుచును
రామసైన్యంబిట్లు రణకేళిసలుప              (1470)
నామహాసైన్యంబు నాసేన బలిమి
ప్రకటవివేక సౌభాగ్యగరిస్ఠ
శుకవాక్యములచేతఁ జొప్పడవిన్న
దనుజేశుపనుపునఁ దడయకవ్వేళె
ఘనసింహనాదముల్ కడిదిఁజేయుచును
అతికాయ వజ్రదంష్ట్రానల రోమ
శతమాయ ఘనబహుబాహుశాలి భుజంగ
రోమ ధూమ్రాక్ష విరూపాక్ష ఖడ్గ
రోమ వృశ్చికరోమ రుధిరాక్ష మేఘ
నాదనరామరాంతక దేవజిన్మ                  (1480)
హోదరభయద విద్యుజ్జిహ్వ శౌర్య
భీకర దైతేయబృందంబు వెడలి
కైకోకమాహరి ఘనవంశసంభవులు
పటుతరబాణాళిఁ బఱపి వెండియును
గుటిల రాక్షసులనుగ్గులు సేసి సేసి
సందనంబుల నాగచములహరుల
సందోహములనెల్లఁ జిక్కుగావించి
చట్తలు చీరిరాక్షస వీరవరుల
యట్టలు దివిముట్ట నట్టాహాసముల
భటులయార్భటుల దిక్పటంబుచిటులఁ        (1490)
గుటిల దానవకంఠ కుహరముల్ దునిమి
హరులఁబట్టుచును నగాళి గుట్టుచును
వరుస దానవవీరవరులభంజి ప
ఖరభావ హితుఁడు రాక్షసలోకవిభుఁడు
కరముగ్రముగ రాముగదియనవ్విభఁడు
పంక్తికంధర శిరోభాగముల్ దునియఁ
బంక్తిగాఁబటు కదంబములు వేయుచును
నుడుగనితమివెండియును మహార్భటులఁ
బొడకట్టు రిపుశిరంబులు ద్రుంచివైచి
కర్ణముల్ నిక్కరాక్షసుల సొంపెక్క           (1500)
ఘూర్ణితనేత్రుఁడై ఘోరనాదముల
మొనయుతద్రిపుపదంబులు పట్టితునుమ
కనవెడు భీషణాకరకాండమపుడు
పఱపియుత్తాల భూభాగమునందుఁ
గఱకురక్కసుఁగుర్చి కడకమైనార్చె
నపుడు తద్దానవాహతిఁదరుల్ గిరులు
విపులనాదములతో వీఁగెవీఁగుటయు
హరివహ్ని శమన దైత్య జలాధీశ పవన
నరవాహ శంకరుల్ నురులౌచు సుతులు
చేయుచువిరులచే చేతమజ్జనము                (1510)
సేయుచుఁ గొలువులు సేయుచున్నంత
క్షితిసహచరుల వీక్క్షింపఁ గావించు
ప్రతినవిభీషణ పట్టంబుగాఁగ
నామోదమున దిక్కులందద్భూమి
భుమిజాధికఫల పుంజంబుతోడ
ననుజన్ముతోడ భృత్యాళి సేవింప
వనరాశిగడచి యవ్వలి భరద్వాజ
వరకృత్యములకు భూవరసుతుల్మెచ్చ
దరులనొప్పెడు తపోదరుల సోదరుల
గడచి పాలిత గ్రహాకారుఁడై యతఁడు         (1520)
నుడుగణంబులతోడి యుడురాజుఁబోలె
భటకోటితో జనార్భటకోటితోడఁ
జటుతర నిజనివాసముఁ బ్రవేశించె
ననియోగిజన పాలుఁ డాజనపాలుఁ
డనుమోదమంది నిట్లనియానతిచ్చె
నని సుధాపాణికి నబ్జపాణికిని
వనజాస్యమాతకు వనధిజాతకును
గనకగాత్రికిని బ్రకామధాత్రికిని
వాణీశనుతునకును వ్రతకక్షివిచల            (1530)
దేణికి శ్రీవేంకటేశు రాణికిని
సారసగేహకుఁ జారుబాహుకును
సారలావణ్యకు సకలగణ్యకును
బరమకల్యాణికి భ్రమరవేణికిని
దరుణేందుఫాలకుదారశీలకును
రామాభిరామకప్రతిమధామకును
హైమసంవ్యానకు హంసయానకును
నింద్రభావితకు గజేంద్రసేవితకుఁ
జంద్రికాహాసకుఁ జారునాసకును
నగసుతానకుఁ బన్నగతల్పయుతకు          (1540)
మృగమదాంబకు నలమేలుమంగకును
నంకితంబుగను శ్రీహరిభక్తినికర
పంకజార్యమ తాళ్ళపాకన్నయార్య
తనయ తిమ్మార్యనందన రత్నశూంభ
దనువదు శ్రీవెంకటాధీశదత్త
మకర కుండలయుగ్మ మండితకర్ణ
సుకవిజీవంజీవ సోమరాజీవ
సదనావధూ లబ్ధసరస కవిత్వ
విదిత మానస తిరువేంగళనాధ
విరచితంబగు ప్రతిద్విపదసంశ్రవణ       (1550)
తరళిత విబుధమస్త ప్రీణీతోరు
మనసిజ జనకాష్టమహిషీవివాహ
మనకావ్యమునఁ బ్రథమాశ్వాసమయ్యె

(అష్టమహిషీకల్యాణమను ద్విపద కావ్యమున ప్రథమాశ్వాసము సమాప్తం)
(తరువాత భాగంలో "ద్వితీయాశ్వాసము" శ్రీదేవిమహిమవర్ణన తో ప్రారంభం)

No comments:

Post a Comment