Friday, November 11, 2016

భ్రమరాంబామల్లీశ్వరసంవాదము

భ్రమరాంబామల్లీశ్వరసంవాదము

శివాలయములలో ఈ పద్యములను ఉత్సవవిగ్రహములకు పవ్వళింపు సేవవేళ ద్వారములలోన ఒకరు, బయట ఒకరు నుండి చెరిసగముగా పాడుతారు.


శా. శ్రీమద్భూమిధరాధిరాజతనయా శృంగారగాత్రోజ్జ్వలా
నామీఁదన్ దయలేక నీవును వృథా నన్నేల వీక్షింపవే :-
ప్రేమన్ వేఁటనెపంబునం జని పరస్త్రీఁ గూడినా విప్పుడున్
శ్రీమించన్ ననుఁ గూడనేల పదరా శ్రీశైలమల్లీశ్వరా!

శా. భామారత్నమ! యవ్వతో మఱుఁగుగాఁ బాటించి చెప్పంగఁబో
నేమైన్ గుఱుతిందుకుం గలదటే యీసందియంబేలనే? :-
యామోదంబున నీవువచ్చినవిధం బాతీరు గన్పించెరా
శ్రీమించన్ గురులేటికిం జెదరెరా శ్రీశైలమల్లీశ్వరా!

మ. మృగసందోహమువెంబడిన్ బొడల దూరిపోవఁగాఁ గొమ్మలన్
దగులంగాఁ గురు లన్నియుం జదరెనే తథ్యంబుగాఁ జూడవే :-
మిగులం బొంకితి విందుకుం జతిరతన్ నీమోవిపైనేటికిన్
జిగిమించం బలం బలుగెంపు లెక్కడివిరా శ్రీశైలమల్లీశ్వరా!

మ. చిలుకం దెచ్చిన ముద్దు సేయుతఱిఁ జూచెం బింబభావంబునన్
జెలియా గ్రక్కున నాదు మోవిఁ గఱచెన్ సిద్ధంబుగాఁ జూడవే:-
బళిరా! నేర్పునబొంకిచెప్పితివిగా బాగాయె నీకోకలన్
జిలిమించన్ బస పేటికంటెఁ జెపురా శ్రీశైలమల్లీశ్వరా!

మ. వరపద్మాకరమధ్యమస్థలములన్ వర్తింపఁ బద్మంబులం
దొరయన్ గోఁకలనంటెఁ బుప్పొడులివే యొచ్చెంబు చేసేవటే:-
సరసత్వంబున బొంకి చెపితివి నీస్వభావమే చెక్కులన్
స్థిరవీటీరసమేటి కంటెఁజెపురా శ్రీశైలమల్లీశ్వరా!

శా. సింగం బున్నగుహాంతముల్ వెదకుచోఁ జేగుర్లపై డిగ్గుచుం
డంగం జెక్కుల జేగురంటె నెఱయన్ నారీశిరోత్నమా!
అంగీకారముచేసికొంటి వది నీయంగంబుపైఁ గ్రొన్నెలల్
సింగారించినభానుపేరు చెపురా శ్రీశైలమల్లీశ్వరా!

మ. తరుణీరత్నమ! డేగ వీడ్వడి మహాదర్పంబునం బోవఁగాఁ
టెరుగం బట్టఁగ డేగగోరులుపయిన్ దీవ్రంబుగా నాఁటెనే:-
సరవి నన్నిటి కన్ని బొంకితివిగా సర్వజ్ఞనీకన్నులన్
సిరిమించ న్నెఱు పేటికంటెఁ జెపురా శ్రీశైలమల్లీశ్వరా!

శా. వేమాఱున్ నను నేరముల్ పలుకఁగా వ్రీడాంతరంగుండ నై
నీమీదన్ గఠినోగ్రదృష్టి నిలుపన్ నేత్రంబు లిట్లాయెనే
నీమాటే యొక్కటైన సత్యమటరా నే విశ్వసించం జుమీ
శ్రీమత్కాంచన శైలకార్ముకధరా! శ్రీశైలమల్లీశ్వరా!

శా. ఏమింజెప్పిన నమ్మఁజాలవుదే యేప్రొద్దు నన్నేఁచకే
పాముం దెచ్చెదఁ బట్టెదన్ వినవె నీపంతంబు లీడేరఁగాఁ
బామే సొమ్ముగఁ జేసినావుగదరా పట్టేదినీకెంతరా
శ్రీమద్భూధరరాజకార్ముకధరా శ్రీశైలమల్లీశ్వరా!

మ. అది గాకున్నను బాసచేసెదము నీవట్లైన నమ్మన్గదే
తుది నాజిహ్వను మడ్డు దాల్చెద నిదే తుచ్ఛంబుగాఁ జూడకే
అది నీకెంత యుగాంతకాలగరళం బన్నంబుగాఁ జేయఁగా
ద్రిదశేంద్రాచ్యుత పూజితాంఘ్రికమల శ్రీశైలమల్లీశ్వరా!

మ. చెలియా! యేమనివిన్నవించిన మదిన్ జేపట్ట వింతైన నా
వలన న్నేరము లెన్నియుంగలిగినన్ వామాక్షి కావంగదే
పలుమారిట్టు హళామాళుల్ పలుకఁగాఁ బాండిత్యమావోరినీ
చెలువం బిక్కడఁ జూపవచ్చితటరా! శ్రీశైలమల్లీశ్వరా!

శా. ఏమే! పూర్ణశశాంకబింబవదనా యేమే జగన్మోహినీ
నీమీఁదాన మఱెక్కడన్ నినువినా నేనెక్కడన్ జొక్కనే
నామీఁదం గరుణించి యేలఁగదవే నన్నుంగటాక్షింపవే
శ్రీమించన్ భ్రమరాంబికా గుణమణీ స్త్రీలోకచూడామణీ!

Wednesday, November 9, 2016

ఆంధ్రనామశేషము - 4 - అడిదము సూరకవి (చివరిభాగం)

సీ. బిట్టు గ ట్టనఁ బెల్లు పెద్దయుఁ దద్దయు, నురవడి పరువడి యుద్దవిడియుఁ
బనివడి పదపడి బలివిడి తలకొని, నెట్టన యెంతేని నెఱి గరంబు
లలి వార కేడ్తెఱ పెలుచ వావిరి యన, నఱిముఱి యనఁ బొరిఁ బొరి యనంగ
గడుఁజాల మిగిలంగ గాటం బనంగ న, త్యంతముగ ననుట కాఖ్య లయ్యె

తే. నుడుకు సెక వెట్ట వేఁడిమి యుబ్బ యావి
యుక్క యన నొప్పు నామంబు లుష్ణమునకుఁ
దాల్మి యోరిమి సైరణ తాళుకొంట
సైఁచు టోర్చుట యనఁగను క్షాంతి పేళ్లు                (57)

టీ. బిట్టు, గట్టి, పెల్లు, పెద్దయు, తద్దయు, ఉరవడి, పరువడి, ఉద్దవిడి పా. ఉద్దపడి, పనివడి పదపడి బలివిడి, తలకొని, నెట్టన, ఎంతేని, నెఱి, కరము, లలి వారక, ఏడ్తెఱ, పెలుచ, వావిరి, అఱిముఱి, పొరిపొరి, కడు, చాల, మిగుల, గాటము - ఈ పదిహేడును అత్యంతమనుటకు పేర్లు. ఉడుకు, సెక, వెట్ట, వేడిమి, ఉబ్బ, అవి, ఉక్క - ఈఏడును ఉష్ణమునకు నామములు. తాల్మి 9రూ. తాలిమి), ఓరిమి, సైరణ, తాళుకొంట, సైచుట, ఓర్చుట - ఈ ఆరును క్షాంతికి పేర్లు.

తే. పెద్దనిద్దురఁ జెండించెఁ బిలుకుమార్చె
గీటణంచెను గుదెతాల్పు వీటి కనిచెఁ
గూలిచెను రూపుమాపెను నేలఁగలిపె
ననఁగ హతిచేసె ననుట కాఖ్యలు దనర్చు               (58)

టీ. పెద్దనిద్దుర చెందించె, పిలుకుమార్చె, గీటణంచె, గుదెతాల్పు వీటికనిచె = యమపురికి పంపెను, కూలిచె, రూపుమాపె, నేలగలిపె - ఈ ఏడును చంపె ననుటకు పేర్లు.

క. పరిచేర్ణ మయ్యె ననుటకు
వరుసన్ నామంబు లగుచు వర్తిలుచుండున్
దుఱుమయ్యెన్ బరుమయ్యెన్
నుఱుమయ్యెన్ బిండియయ్యె నుగ్గయ్యె ననన్                  (59)

టీ. తుఱుమయ్యె, పరుమయ్యె, నుఱుమయ్యె, పిండియయ్యె, నుగ్గయ్యె - ఈ అయిదును చూర్ణమయ్యె ననుటకు పేర్లు.

క. కునుకె నిదురించెఁ గూర్కెను
గనుమోడ్చె ననంగ నిద్రగనుటకు బేళ్ళౌ
గనువిచ్చె ననఁగ మేల్కొనె
ననఁగఁ బ్రభోధంబు నొందె ననుటకుఁ బేళ్ళౌ         (60)

టీ. కునికె, నిదురించె, కూర్కెను, కనుమోడ్చెను - ఈ నాల్గును నిద్రపోయెను అనుటకు పేర్లు. కనివిచ్చె, మేల్కొనె - ఈ రెండును నిద్రలేచె ననుటకు పేర్లు.

క. డులిచె వదలించె నూడ్చెను
దొలగించెన్ బాపె ననఁగ ద్రోచె ననంగ
వెలికొత్తె ననఁగ బేళ్లై
యలరున్ విఘటన మొనర్చె ననుటకు (శర్వా)              (61)

టీ. డులిచె, వదలించె, ఊడ్చె, తొలగించె, పాపె, త్రోచె, వెలికొత్తె _ ఈ ఏడును విఘటన మొనర్చె ననుటకు పేర్లు.

క. పొలయలుక యనఁగ నెయ్యపు
టలుక యనం బ్రణయకలహ మలరారుఁ గుచం
బుల కొప్పు నామములు గు
బ్బలనంగాఁ జన్ను లనఁగఁ బాలిండ్లనఁగన్            (62)

టీ. పొలయలుక, నెయ్యపుటలుక (నెయ్యము+అలుక- నెయ్యపు + అలుక-నెయ్యపుటలుక) - ఈ రెండును ప్రణయకలహమునకు నామములు. గుబ్బలు, చన్నులు పాలిండ్లు (పాలు+ఇండ్లు = పాలుండుచోట్లు) - ఈ మూడును కుచములకు నామములు.

తే. చౌటిమున్నీ రనఁగ నుప్పు సంద్రమనఁగ
రాజిలుచు నుండు లవణవారాశి పేళ్లు
కాలు వన బట్టె యనఁగను జా లనంగఁ
గుల్య కభిధాన మై పొల్చుఁ (గుధరనిలయ)          (63)

టీ. చౌటిమున్నీరు, ఉప్పుసముద్రము - ఈ రెండును లవణ సముద్రము పేర్లు. కాలువ, (రూ.కాల్వ) బట్టె, జాలు - ఈ మూడును కుల్యకు నామములు.

తే. పెల్లగించెను బెకలించెఁ బెఱికె ననఁగ
నాఖ్య లుత్పాటన మొనర్చె ననుట కలరు
నాహ్వయంబులు చేదించె ననుట కయ్యెఁ
జించె నన వ్రచ్చె నన వ్రక్కలించె ననఁగ           (64)

టీ. పెల్లగించె, పెకలించె, పెఱికి - ఈ మూడును ఉత్పాటన మొనర్చె ననుటకు పేర్లు. చించె, వ్రచ్చె, వ్రక్కలించె - ఈ మూడును చేదించె ననుటకు నామములు.

తే. కనుమొఱఁగె నేమఱించె నాఁగను నిగూఢ
వర్తన మొనర్చె ననుట కాహ్వయము లడరు
మొయి లన మొగు ళ్లనంగను మొనయు మబ్బు
లన ఘనంబుల కాఖ్యలై (యభ్రకేశ)                 (65)

టీ. కనుమొఱగె, ఏమరించె - ఈ రెండును నిగూఢవర్తనము చేసె ననుటకు పేర్లు. మొయిలు, మొగళ్లు, మబ్బులు - ఈ మూడును మేఘములకు నామములు.

క. పగ ఱనఁగ మార్తు రనఁగను
పగవాం డ్రనఁ బగతు రనఁగఁ బరిపంథికిఁ బే
ళ్లగు మెగ మనంగ మెక మన
మృగమునకు నభిక్య లయ్యె (మేరుశరాసా)                 (66)

టీ. పగఱు, మార్తురు, పగవాండ్రు, పగతురు - ఈ నాలుగును విరోధికి నామములు. మెగము, మెకము - ఈ రెండును మృగమునకు పేర్లు.

తే. ఇంకె నడుగంటె వట్టె నానివిరె ననఁగ
నిర్జలం బయ్యె ననుటకునెగడుఁ బేళ్లు
నిండెఁ గ్రిక్కిఱిస్వ్ ననఁ బూర్ణించె ననుట
కాఖ్యలై తనరారు (సుధాంశుమకుట)                  (67)

టీ. ఇంకె, అడుగంటె, వట్టె, ఇవిరె - ఈ నాలుగును నిర్జలమయ్యె ననుటకు నామములు. నిండె, క్రిక్కిఱిసె - ఈ రెండును పూర్ణించె ననుటకు పేర్లు.

తే. పెచ్చు పెరిగె ననం బురివిచ్చె మోఱె
నన విజృంభించె ననుటకు నాఖ్యలయ్యెఁ
దిండికాఁ డనఁ దిండీఁడు తిండిపోత
నంగ భక్షకునకు దనర్చుఁ బేళ్లు                  (68)

టీ. పెచ్చుపెరిగె, పురివిచ్చె, మీఱె - ఈ మూడును విజృంభించెననుటకు పేర్లు. తిండికాడు, తిండీడు, తిండిపోతు - ఈ మూడును భక్షకునకు పేర్లు.

క. పెనఁగొనె గిఱికొనియెను వల
గొనియెన్ మెలికొనియెఁ జుట్టుకొనె సుడిగొనె నాఁ
గను నులిగొనె నన నాఖ్య ల
గును వలయిత మయ్యె ననుటకును (శితికంఠ)             (69)

టీ. పెనగొనె, గిఱికొనె, వలగొనె, మెలికొనె, చుట్టుకొనె, చుట్టుకొనె, సుడికొనె, నులిగొనె - ఈ ఏడును వలయిత మయ్యె ననుటకు పేర్లు.

సీ. మొగరా లన స్తంభములు చిట్టకము దంభ, మెరగలి వనవహ్ని యొడ్డె మూర్ఖుఁ
డుడుగర యుపహార మూఱట విశ్రాంతి, మొద లని యనఁగను మూల మనుట
తఱు లన తళులు చిందమనంగ శంఖంబు, తఱ టనాంగఁ గశాభుధాన మయ్యె
దమ టనఁ గీల పదం బగు మెట్టన, గాయకులకుఁ బేరు గాణ లనఁగ

తే. మృత్యువునకును బే రయ్యె మిత్తి యనఁగ
మకుటమున కాఖ్య లగు బొమిడిక మనంగ
నోముట యనఁగఁ బోషించు టూడిగంబు
సేవ కభిధానమై యొప్పు (శేషభూష)                  (70)

టీ. మొగరాలు = స్థంభము, చిట్టకము = దంభము, మిష, ఎరవలి -పా.ఎరగలి=కాఱుచిచ్చు, ఎడ్డె = మూర్ఖుడు, ఉడుగర = కానుక, ఊఱట, విడుమర, మొదలు = మూలము, తఱులు = మడతలి, చిందము = శంఖము, తఱటు = జూటి, చబుకు, తమట = నిప్పుమంట, మెట్ట = పాదము, గాణ = గాయకుడు, మిత్తి (ప్ర. మృత్యువు) = చావు, బొమిడికము =  కిరీటము, ఓముట = పోషించుట, ఊడిగము = సేవ.

సీ. ఎట్టకేల కనంగ నెనయును సకృదర్థ, మఖిలం బటంటకు నంతపట్టు
ఏకాకి యొక్కటనేకులు పలువురు, వేనవేల్ పెక్కండ్రు వేరు రనఁగ
నలరు నో చేదర్థ మై9 కానినాఁ డన, నేతాదృశులె యంట కిట్టివారె
మిన్నక యూరకయున్నఁ దూష్టీమర్థ, మనుసరించి యుటంట కగును దొట్టి

తే. యొండొకఁ డనంగ మఱియు వేఱొకఁడు లాఁతి
వాఁడు పెఱవాఁడు దక్కినవాఁడనంగ
నన్యునకు నాఖ్య లగుచుఁ బెంపారుచుండు
(శతఘటితశూల వైయాఘ్రచర్మచేల)                 (71)

టీ. ఎట్టకేలకు = ఒకానొకప్పుడు, అంతపట్టు = అఖిలమును, ఎక్కటి = ఏకాకి, పలువురు, వేనవేలు, పెక్కండ్రు, వేవురు - ఈ నాలుగును అనేకులు. కానినాడు = అటుకాకపోయిన, ఇట్టివారె = ఈలాటివారే యనుట, మిన్నక, ఊరక - ఈ రెండును తూష్ణీమర్థకములు. తొట్టి = అనురించి. ఒండికడు, వేఱొకడు, లాటివాడు, వెఱవాడు, తక్కునవాడు - ఈ అయిదును అన్యునకు పేర్లు.

నానార్థములు

క. వడి యనఁగాఁ గాలం బగు
వడి యన వేగంబునకు వర్తిలు బేరై
మడి యనఁ గేదారం బగు
మాడి యనఁగా శుద్ధికిని సమాహ్వాయ మయ్యెన్            (72)

టీ. 1. వడి = కాలము, వేగము. 2. మడి = వరిచేను, శుద్ధి

క. ఈ డనఁగ వయసుపే రగు
నీ డన సామ్యంబునకును వెసఁగును బేరై
నా డన రాజ్యము పేరగు
నాఁ డనఁ దత్కాలమం దనఁగఁ బెంపారున్            (73)

టీ. 1. ఈడు = వయస్సు, సాటి. 2. నాడు = దేశము, అప్పుడు (రెండవ అర్థమున "నాఁడు" అని యరసున్న గలదు)

క. మొన యన సైన్యముపే రగు
మొన యనఁగా నగ్రభాగమునకును బే రౌ
దొన యనఁ దూణీరం బగు
దొన యన నవసానమునకుఁ దొడరును బేరై             (74)

1. మొన = సైన్యము, ముందుభాగము. 2. దొన = అమ్ములపొది, కొన.

క. వె న్ననఁగ బీజమంజరి
వె న్ననఁ జరమాంగమునకు వెలయును బేరై
కన్ను లనం బర్వంబులు
కన్ను లనన్ లోచనములు (కంఠేకాలా)                  (75)

టీ. 1. వెన్ను = కంకి, వీపు. 2. కన్ను = గణుపు, నేత్రము.

క. తమ్మి యనఁ దరువిశేషము
తమ్మి యనం బంకజాభిధానం బయ్యెన్
నెమ్మి యనఁ బ్రియముపేరగు
నెమ్మి యన మయూరమునకు నెగడుం బేరై              (76)

టీ. 1. తమ్మి = వృషవిశేషము, తామర. 2. నెమ్మి = సుఖము, నెమలి.

క. దండ యనన్ సాన్నిధ్యము
దం డన సుమమాలికాభిధానం బయ్యెన్
మం దనఁ బ్రకోష్ఠ మయ్యెన్
మం డన మృత్పాత్రకును సమాహ్వయ మయ్యెన్             (77)

టీ. దండ = చేరువ, పూలదండ. 2. మండ = ప్రకోష్ఠము, మంటికుండ.

క. తెలుఁగుం గబ్బపుమర్మము
తెలుఁగుకవీంద్రులకుఁ దేటతెల్లము గాఁగన్
దెలియఁగ నడిదము సూరయ
చెలువారఁగ నాంధ్రనామశేషముఁ జెప్పెన్            (78)

సటీకాంధ్రనామశేషము
సంపూర్ణము

Wednesday, November 2, 2016

ఆంధ్రనామశేషము - 3 - అడిదము సూరకవి

క. తడవు వడి కా రనంగా
నడరుం గాలంబు శిథిలమయ్యె ననుట యౌ
విడె వీడె నూడె విచ్చెను
సడలె నురలె వదలె బ్రిదిలె జాఱె ననంగన్           (36)

టీ. తడవు, వడి, కారు - ఈ మూడును కాలమునకు పేర్లు. విడె, వీడె, ఊడె,  విచ్చె, సడలె, ఉరలె, ఉరలె, వదలె, ప్రిదిలె, జాఱె - ఈ తొమ్మిదియు శిథిలమయ్యె ననుటకు పేర్లు.

క. మది డెంద ముల్ల మొద యన
హృదయంబున కాఖ్యలయ్యె నీఱం బనఁగాఁ
బొదరి ల్లనఁగ నికుంజము
(సదయాంతఃకరణ తరుణ చంద్రాభరణా)             (37)

టీ. మది (ప్ర. మతి) డెందము, ఉల్లము, ఎద - ఈ నాలుగును హృదయమునకు పేర్లు. ఈఱము, పొదరిల్లు (పొద+ఇల్లు) - ఈ రెండును నికుంజమునకు పేర్లు.

క. తెగ దినుసు తోయ మనఁగను
నెగడుఁ బ్రాకారంబునకును నెఱి నామములై
మెగ మనఁగ మెక మనంగను
మృగమునకు నభిఖ్యలయ్యె (మేరుశరాసా)             (38)

టీ. తెగ, దినుసు, తోయము - ఈ మూడును ప్రకారమునకు నామములు. మెగము, మెకము (ఈ రెండును మృగ శబ్ధభవములు) - ఈ రెండును మృగమునకు పేర్లు.

క. ఎడ దవ్వు కేళ వనంగా
నడరున్ దూరంబునకు సమాఖ్యలు నలి నాఁ
బొడి నుగ్గు తురుము నూరు మన
బెడఁగడరుం జూర్ణమునకుఁ బేళ్ళై (శర్వా)         (39)

టీ. ఎడ, దవ్వు, కెఖవు - ఈ మూడును దూరమునకు పేర్లు. నలి, పొడి, నుగ్గు, తురుము, నుఱుము - ఈ అయిదును చూర్ణమునకు పేర్లు.

క. ప్రేరేచెను బురికొలిపెను
దారిచె ననఁ జోదనకును దగు నాఖ్యలు పెం
పారును జంబుద్వీపము
నేరెడుదీవి తొలుదీవనెడు నామములన్                  (40)

టీ. ప్రేరేచెను, పురికొలిపెను, తారిచెను - ఈ మూడును ప్రేరణ చేసెననుటకు పేర్లు. నేరెడుదీవి = నేరేడుచెట్టుగల ద్వీపము, తొలుదీవి = మొదటి ద్వీపము - ఈ రెండును జంబూద్వీపమునకు పేర్లు.

క. తొలఁగెం బాసె ననంగా
నలరున్ విముఖతకుఁ బ్రాప్తమయ్యె ననుటపే
ళ్ళలమె నొదవె దక్కొనియెను
నెలకొనియెన్ జెందె ననఁగ నెక్కొనియె ననన్             (41)

టీ. తొలగెను, పాసెను - ఈ రెండును దూరముగా పోవుటకు పేర్లు. అలమె, ఒదవె, దక్కుకొనియె, నెలకొనియె చెందె నెక్కొనియె -  ఈ ఆరును లభించె ననుటకు పేర్లు.

క. వెనుకఁ దరువాతఁ బిమ్మట
ననఁగా నంతట ననంగ నంత ననంగాఁ
దనరుం బశ్చాదర్థము
(కనకాచలచాప చంద్రఖండకలాపా)                    (42)

టీ. వెనుకన్, తరువాతన్, పిమ్మటన్, అంతటన్, అంతన్ - ఈ అయిదును అనంతర మనుటకు పేర్లు.

క. పల్లఱపులు రజ్జు లనం
బ్రల్లదము లనంగ వ్యర్థభాషణములకున్
బేళ్లై వర్తిల్లు నోలిగ
(నుల్లోకజయాభిసరణ యురగాభరణా)                      (43)

టీ. పల్లఱపులు, రజ్జులు, ప్రల్లదములు - ఈ మూడును పనికిమాలిన మాటలకు పేర్లు.

క. కైసేఁ తలంకరించుట
బేసి యనన్ విషమమునకుఁ బేరై వెలయున్
సేసలు దీవనఁబ్రా లన
భాసిలు మంత్రాక్షతలకుఁ బర్యాయములై                (44)

టీ. కైసేత (కై+చేత) అనగా అలంకరించుట, బేసి = సరికాని సంఖ్య. సేసలు, దీవనబ్రాలు - ఈ రెండును మంత్రాక్షత లకు నామములు.

క. కో రనఁ బా లన సంశం
బేఱన వాఁక యన నదికి నెసఁగును బేళ్లై
నీరాజనంబు పేళ్ళగు
నారతి నివ్వాళి యనఁగ (నంగజదమన)                (45)

టీ. కోరు, పాలు - ఈ రెండును భాగమునకు నామములు. ఏఱు, వాక - ఈ రెండును నదికి నామములు. ఆరతి (ప్ర. హారతి), నివ్వాళి - ఈ రెండును నీరాజనమునకు నామములు.

ఆ. మొఱబవోయె ననఁగ మొద్దువోయె ననంగఁ
గుంఠమయ్యె ననుటకుం ఫనర్చు
శాతమునకు నాఖ్యలై తనరారును
జుఱుకు వాఁడి తెగువ కఱ కనంగ                   (46)

టీ. మొఱవవోయె (మొఱవ+పోయె) మొద్దువోయె (మొద్దు+పోయె) - ఈ రెండును పదును లేనివయ్యె ననుటకు పేర్లు. చుఱుకు, వాడి, తెగువ, కఱకు - ఈ నాలుగును పదునుకు పేర్లు.

సీ. యామికులకు నాఖ్యలై ప్రవర్తిలుచుండు, నారెకు లనఁగఁ దలారు లనఁగఁ
గళ్లెంబు  వాగె నాఁగను ఖలీనంబు పే, ళ్ళలరు దంతంబుపేరౌ డనంగఁ
దఱపి నా ముదురు నాఁ దరుణేతరం బంట, యిం చనఁ జెఱ కన నిక్షు వలరు
నష్టం బొనర్చె నంటకు నాహ్వయము లయ్యె, బోకార్చె ననఁగ గోల్పుచ్చె ననఁగఁ

తే. గుదె యనఁగ దు డ్డనంగను గదకుఁ బేళ్లు
ఇవ మనఁగ మం చనంగను హిమముపేళ్లు
కాన యన నడవి యనంగఁ గాననంబు
షడ్ఢకుఁడు తోడియల్లుఁడు జగిలెఁ డనఁగ           (47)

టీ. ఆరెకులు, తలారులు - ఈ రెండును తలవర్లకు పేర్లు. కళ్లెము వాగె - ఈ రెండును ఖలీనమునకు పేర్లు. ఔడు (రూ. అవుడు) అనగా దంతము నకు పేరు. తఱపి, ముదురు - ఈ రెండును లేతది కానిదానికి నామములు. ఇంచు, (ప్ర. ఇక్షువు) చెఱకు = ఈ రెండును ఇక్షువునకు నామములు. పోకార్చె, కోల్పుచ్చె (రూ. కోలుపుచ్చె) - ఈ రెండును నష్టము చేసెననుటకు పేర్లు. గుదె, దుడ్డు - ఈ రెండును గదకు పేర్లు, ఇవము (ప్ర. హిమము) మంచు - ఈ రెండును హిమమునకు పేర్లు. కాన (ప్ర. కాననము) అడవి (ప్ర. అటవి) - ఈ రెండును అరణ్యమునకు పేర్లు. తోడియల్లుడు, జగిలెడు - ఈ రెండును షడ్ఢకునికి పేర్లు.

క. తేనియ యన జు న్నన నభి
ధానంబులు మధువునకును దనరుం బేళ్లై
పానకము చెఱకుపా లనఁ
గా నిక్షురసంబునకును (గంఠేకాలా)                       (48)

టీ. తేనియ, జున్ను - ఈ రెండును మధువునకు పేర్లు. పానకము, చెఱకుపాలు - ఈ రెండును చెఱకురసమునకు నామములు.

క. ఉడిగెను జాలించెను నా
నడరు విరామం బొనర్చె ననుటకుఁ బేళ్లై
తొడరుం బశ్చాద్భాగము
పెడ యనఁగ వెనుక యనఁగఁ బిఱుఁదు యనంగన్         (49)

టీ. ఉడిగెను, చాలించెను - ఈ రెండును విరమించెననుటకు పేర్లు. పెడ, వెనుక, పుఱుఁదు - ఈ మూడును పశ్చాద్భాగమునకు పేర్లు.

క. విడుమర యన విడిదల యనఁ
గడముట్టుట యనఁగ శాంతిగనుటకుఁ బేళ్లౌ
నెడ వంక చక్కి చో టన
నడరు స్థలంబునకు నాఖ్య లై (శితికంఠా)                (50)

టీ. విడుమర, విడుదల, కడముట్టుట - ఈ మూడును శాంతిగనుటకు పేర్లు. ఎడ, వంక చక్కి, చోటు - ఈ నాలుగును స్థలమునకు పేర్లు.

క. చనుఁ గ్రుద్ధుఁ డయ్యె ననుటకుఁ
గినిసెఁ గనలె నలిగెఁ గోపగించె ననంగాఁ
దనరున్ మర్మములకుఁ బే
ళ్లనువు లనఁగ నెఱఁకు లనఁగ నాయము లనఁగన్         (51)

టీ. కినిసె, కనలె, అలిగె, కోపగించె - ఈ నాలుగును క్రుద్ధుడయ్యె ననుటకు పేర్లు. అనువులు, నెఱకులు, ఆయములు -  ఈ మూడును మర్మములకు నామములు.

ఆ. పరఁగుఁ బేళ్లు కార్యకరునకుఁ బార్పత్తె
కాఁ డనంగ మణివకాఁడనంగఁ
దేజరిల్లుచుండు దేవేరి దొరసాని
రాణి యనెడుపేళ్ల రాజపత్ని                             (52)

టీ. పార్పత్తెకాడు, మణివకాడు - ఈ రెండును కార్యకరునకు పేర్లు. దేవేరి, దొరసాని, రాణి - ఈ మూడును రాజపత్ని నామములు.

క. మ్రింగె నన గ్రుక్కగొనియ న
నంగన్ దగుఁ గబళనం బొనర్చె ననుటకున్
బ్రుంగె మునింగె ననంగ (న
నంగహరా) మగ్నమయ్యె ననుటకుఁ బేళ్లౌ                  (53)

టీ. మ్రింగె, గ్రుక్కగొనియె - ఈ రెండును కబళనము చేసెననుటకు పేర్లు. బ్రుంగె, మునింగె - ఈ రెండును మగ్నమయ్యె ననుటకు పేర్లు.

సీ. ఆఖ్యలై తనరు ధనాగారమునకు ను, గ్రాణం బనంగ బొక్కస మనంగ
నాస్థానమండపాహ్వయము లై తనరు హ, జారం బనంగ మోసల యనంగ
దయకు నీరెం డభిధానంబు లయ్యెను, గనికర మనఁగ నక్కటిక మనఁగ
బాల్యస్థునకుఁ బేళ్లు బరిఢ విల్లును బిన్న, వాఁ డన గొండికవాఁ డనంగ

తే. సంధ్య కాఖ్యలు మునిమాపు సంజ యనఁగఁ
జూద మన నెత్త మనఁగ దురోదరంబు
జడి యనఁగ వాన యనఁగ వర్షంబుపేళ్లు
నొలి యుంకువ యన శుల్క మొప్పు (నభవ)                      (54)

టీ. ఉగ్రాణము, బొక్కసము - ఈ రెండును ధనముంచెడి గృహమునకు పేర్లు. హజారము (రూ. హాజారము), మోసల - ఈ రెండును ఆస్థానమండపమునకు పేర్లు. కనికరము, అక్కటికము - ఈ రెండును దయకు పేర్లు. పిన్నవాడు, కొండికవాడు - ఈ రెండును బాల్యస్థునకు పేర్లు. మునిమాపు, సంజ - ఈ రెండును సంధ్యాకాలమునకు పేర్లు. జూదము (ప్ర. ద్యూతము) నెత్తము - ఈ రెండును ద్యూతమునకు పేర్లు. జడి, వాన - ఈ రెండును వర్షమునకు పేర్లు. ఓలి, ఉంకువ - ఈ రెండును శుల్కమునకు పేర్లు.

సీ. పయ్యెద యనఁగను పైఁట యనంగ సం, వ్యానంబునకు నాఖ్యలై తనర్చు
నొక్కపెట్ట ననంగ నువ్వెత్తుగ ననంగ, యుగపత్పదంబున కొప్పుఁ బేళ్లు
కవఱ లనం బాచిక లనంగ నక్షముల్, బన్న మొచ్చె మనంగఁ బరిభవంబు
వ్యాపార మగు చెయ్ద మనఁ జెయ్ది యనఁగను, గన్ననఁ గీలనఁ గపటచేష్ట

తే. కందుకము బంతి చెం డనఁగను దనర్చు
నఱపఱలు చిద్రుప లన ఖండాహ్వయముల
కాఁచుపడియంబు లనఁగను గైరవళ్ల
నంగ ఖాదిరఘుటిక (లనంగదమన)                    (55)

టీ. పయ్యెద, పైట - ఈ రెండును ఉత్తరీయమునకు పేర్లు. ఒక్కపెట్ట, ఉవ్వెత్తుగ -ఈ రెండును ఒకసారిగ ననుటకు పేర్లు. కవఱలు, పాచికలు -ఈ రెండును అక్షములకు పేర్లు. బన్నము (ప్ర. భంగము) ఒచ్చెము - ఈ రెండును తిరస్కారమునకు పేర్లు. చెయ్దము, చెయ్ది - ఈ రెండును వ్యాపారమునకు పేర్లు. కన్ను, కీలు - ఈ రెండును కపటచేష్టకు పేర్లు. బంతి, చెండు - ఈ రెండును కందుకమునకు పేర్లు. అఱవఱలు, చిద్రుపలు - ఈ రెండును ఖండములకు పేర్లు. కాచువడియములు, కైరవళ్లు - ఈ రెండును ఖాదిరఘటికలకు పేర్లు.

సీ. మాగాని రాజ్యంబు మణివ ముద్యోగంబు, చిట్టలు చిత్రముల్ చిలుకు శరము
ఎత్తికోలు ప్రయత్న మీలువు మానంబు, బారి యనంగ నుపద్రవంబు
విన్నను వనఁగఁ బ్రావీణ్యం బెలర్చును, దార్కాణ మనఁగ నిదర్శనంబు
నిట్టపంట యనంగ నిష్కారణం బంట, బాననం బనఁగ మహాసనంబు

తే. నామ మేకాంతమునకు మంతన మనంగ
నంతిపుర మన శుద్ధాంత మలరుచుండు
నుదిరి యనఁ దప్తకాంచన మెప్పుచుండుఁ
దిరువుట యభిలాషించుట (దేవదేవ)                   (56)

టీ. మాగాని=దేశము, మణివము=ఉద్యోగము, చిట్ట = ఆశ్చర్యము, చిలుకు = బాణము, ఎత్తికోలు = ప్రయత్నము, ఈలువు= అభిమానము, బారి, ఉపద్రవము, విన్ననువు = ప్రావిణ్యము లేక నేర్పు, తార్కాణము = నిదర్శనము, నిట్టపంట = నిష్కారణము, బానసము = వంటయిల్లు, మంతనము = ఏకాంతము, అంతిపురము = అంతఃపురము, ఉదిరి = అపరంజి, తిరివుట = కోరుట.