Saturday, May 12, 2012

కోకిలమ్మ పెండ్లి -- విశ్వనాధ సత్యనారాయణ -- Part 2

ఒక్క మధ్యాహనంబునందున
చెక్కులను కుండల ప్రభలవి
పిక్కటిల బ్రాహ్మణుం డొకరు
డక్కడికి వచ్చెన్

చిలకతల్లీ తల్లితండ్రులు
చేరవచ్చిన అతనికోసము
కోరినట్టివి యన్ని యిచ్చీ
ఆదరించారూ

వేదపననలు చెప్పుకుంచూ
వాదములకూ కాలు త్రవ్వుచూ
ఆయనా తెలుగురాజింట్లో
ఆగిఉన్నాడూ

అతని వేదధ్వనులు వించూ
అతని వర్చస్సంత కంచూ
చిలకతల్లీ అతని తనలో
నిలిపివేశిందీ

సంగతంతా తెలిసి ఱేడూ
పొంగిపోయాడేమొ కానీ
తల్లికే చిలకతల్లంటే
వెళ్ళుకొచ్చిందీ


కోనలందూ అడవులందూ
కోకిలమ్మా తిరుగుతోందీ
ఎంత యేడుస్తోందొ తల్లీ
యింటికే రాదూ

ఏ యెఱుంగని నేలవాడో
యింటికొస్తే వాడిమీదా
చిలకతల్లీ వలపు తానూ
నిలిపివేశిందీ

కోకిలమ్మా ఇంటికైనా
రాక అడవుల్లోనె తిరుగుతూ
పోకిళ్ళమారైంది, తల్లికి
కాకపోయిందీ

అడవులెంటా కోనవెంటా
బుడబుడా చను సెలలవెంటా
అడుగులూ తడబడా వెదుకుతు
నడచిపోయిందీ 



రెండుజాముల వేళ పులులూ
పండుకొని రొప్పెటి నీడల
గుండె గుబగుబలాడా పోయీ
కూతు వెదకిందీ

పెద్దపులులూ సివంగులూ ద
ప్పికలు తీరగ నీరు త్రాగే
దొంగత్రోవల సెలమొదళ్ళా
తొంగిచూశిందీ

అడవిమెకములు తిరుగులాడే
ఎడములేనీ అడుగులొప్పే
అడవిలోపలి కోన లెల్లా
తడివిచూసిందీ


పెద్దపులులను కూడ చంపీ
పీల్చి పిప్పిగ చేసివేసే
అడవికుక్కలు ప్రాకులాడే
కడలు చూశిందీ

కోళ్ళనూ తిని కొందసిలువలు
కళ్ళు మూసుకు నిదురపోయే
బిల్లుడడవిలో వుస్సురంటూ
వెళ్ళిచూసిందీ

ఎచ్చట పోయీ వెదకినానూ
ఎందులేదూ కోకిలమ్మా,
ఎచ్చటుందో తల్లి గుండే
వ్రచ్చిపోయిందీ

ఒక్క సెలయేట్లోకి వేరూ
మిక్కిలిపోయినా ముషిణీ
ప్రక్క చెట్టుక్రింద కూర్చుని
స్రుక్కిపోయిందీ

తల్లివెనకా యింతసేపూ
మెల్లగా వస్తోంది కోకిల
తల్లిబాధా కళ్ళచూసీ
గొల్లుమన్నాదీ

ఉరుములా వురిమింది కోకిల
మెరుపులా మెరిసింది కోకిల
ఒక్కగంతున తల్లిఒళ్ళో
వచ్చిపడ్డాదీ 



తల్లి బిడ్డను బిడ్డ తల్లిని
కళ్ళు మూసుకు కౌగిలించీ
ఒళ్ళుతెలియక చెట్టుమొదటా
ఒరిగిపోయారూ

ఒరిగిపోయిన తల్లి బిడ్డా
ఒరిగినట్లే అయిరిగానీ
ఒక్కరైనా లేచి కళ్ళూ
తెరవనేలేదూ

తల్లిబిడ్దల ప్రేమ అంటే
యిల్లాగు వుండాలటంటూ
మెల్లగా పాడింది అడివిలొ
పిల్ల సెలయేరూ

తల్లిబిడ్దల ప్రేమ అంటే
యిల్లాగు వుండాలటంటూ
కానలోనీ తీగలన్నీ
కదలులాడాయీ

తల్లిబిడ్దల ప్రేమ అంటే
యిల్లాగు వుండాలటంటూ
గాలిపిల్లలు వెదురులో రా
గాలు తీశారూ

తల్లిబిడ్దల ప్రేమ అంటే
యిల్లాగు వుండాలటంటూ
ప్రకృతిదేవీ వొళ్ళుతెలియక
పాట పాడిందీ

ఎప్పుడూ గిలకల్లే అడివిలో
ఎచ్చట చూస్తే అచట వుండే
చిన్ని కోకిల లేక అడవీ
చిన్నవోయిందీ

కోకిలమ్మా తానమాడని
కోకిలమ్మా పుక్కిలించని
అడవిలోపల వూటయేటికి
అందమే లేదూ 



కోకిలమ్మా చివురు కోయని
కోకిలమ్మా పూలు తురుమని
అడవిలోపల చిన్న చెట్లకు
అందమేలేదూ

కోకిలమ్మా తిరుగులాడని
కోకిలమ్మా లేని అడవీ
కోనలకు తొలుకారుటందం
కొరతవడ్డాదీ

తల్లీంటే అంత ప్రేమా
వెళ్ళక్రక్కిన కోకిలమ్మకు
చావులేదని మావిచివురూ
సాగులాడిందీ

తల్లీంటే అంత ప్రేమా
వెళ్ళగ్రక్కిన కోకిలమ్మ
మునిగిపోదని అడవివూటా
ముర్మురించిందీ

తల్లీంటే అంత ప్రేమా
వెళ్ళగ్రక్కిన కోకిలమ్మ
బ్రతికి వస్తుందంచు అడివీ
పాటపాడిందీ

ప్రొద్దుకూకేవేళ వెన్నెల
ముద్దుగా కాసింది జాబిలి,
చావులేనే లేదు ప్రేమకి
చావులేదందీ

వానలన్నీ వెనుకపట్టీ
కోనలన్నీ నీరువట్టీ
ఆకురాలే కారుకూడా
ఆగిపోయిందీ

చిన్న మొగమున కుంకుమిడినా
కన్నెపేరంటాలి మల్లే
చెలువుగా అడివంత క్రొత్తగ
చివిరు తొడిగిందీ

గోదుమావన్నె త్రాచల్లే
కొబ్బరీపాలల్లె అడివి
చిన్నివూటా ఒదిగి ఒదిగి
చెన్ను వొలికిందీ 



ఎక్కడో అడివిలో చివరా
చక్కగా సన్నగా యేదో
చిక్కనైనా తేనెపాటా
జీరువారిందీ

ఆపాట వింటూనె అడివీ
అడివిగా నిలువెల్ల, పోయిన
ఒక్కచుట్టం వచ్చినట్లూ
వులికిపడ్డాదీ

సన్నగా పోతున్నవూటా
జాలు జాలింతై వెడల్పై
పట్టలేకా ఓర్పు జలజల
పరువులెత్తిందీ

కోకిలమ్మా అదిగొ మళ్ళీ
కూసెనంటే కూసె నానీ
వచ్చెనంటే వచ్చెనానీ
బ్రతికెనంటే బ్రతికెనానీ

ఒళ్ళుతెలియక అడవివూటా
పొర్లిపోయిందీ
చెన్ను తరుగని మావి మోకా
చివురు తొడిగిందీ

అంతలోపల నడవికందం
అతిశయించిందీ


అంతలో పూవుల్ల రేడూ
వింత వింతల సోకు లేలిక
చెక్కులా నవ్వూలు చిలుకుతూ
చేరవచ్చాడూ

ఏడాది కొకసారి వస్తా
డేడాది కొకసారి తెస్తా
డెన్ని పువ్వులు, అతనివేనూ
వన్నెలూ చిన్నెల్ 



వచ్చావటయ్యా పూలఱేడా,
తెచ్చావటయ్యా పూలరాజా
నీవు తెచ్చిన పూవులే కా
నికల కిస్తామూ

కోకిలమ్మను ముద్దుపెళ్ళీ
కూతురును చేస్తాము, పెళ్ళీ
కొడుకునూ చేస్తాము నిన్నూ,
కూర్చివేస్తామూ

కోరి నీ అందానికీ మా
కోకిలమ్మా గొంతుకునకూ
సొగసుచేతా పాటచేతా
తగిపోయిందీ

రావయ్య ఓ పూలరాజా
రావయ్య ఓ అందగాడా
కోకిలమ్మ నీవు, నీకూ
కోకిలా తగునూ


వారిపెళ్ళికి అడివి అంతా
తోరణాలైనాయి చివురులు
కాపలా కాసినై పులులు
గండశిలలందూ

సన్నాయి పాడింది తెల్లని
సన్ననీ సెలవూట పూలా
వెన్నెలై ప్రకృతి తల్లేమో
కన్ను తెరిచిందీ

పూలసోనలు కురిసినై, తే
నెలపాటలు విరిసినై, అం
దాల త్రోవలు వెలిసినై, రాజ
నాలు పండినవి

చిలకతల్లి మహాన్వయంబున
నిలిచినవి సంస్కృతికవాక్కులు
కోకిలమ్మా తెనుగు పలుకూ
కూడబెట్టిందీ. 

కోకిలమ్మ పెండ్లి -- విశ్వనాధ సత్యనారాయణ -- Part 1

లేతబుర్రలు కొక్కిరిస్తే
అతగాళ్ళతో యేమిగానీ
తాతతాతలనాటి కతలూ
తవ్విపోస్తానోయ్

ఊగులాడే కడలి తరగలు
నాగుబాముల కోడెలల్లే
ఒడ్డుదాకా ప్రాకి ప్రాకీ
ఒరిగిపోతాయోయ్

ఒడ్డుదాకా అడివి, అడివిలో
దొడ్డచెట్లున్నాయి తరగల
వూగులాడే గాలిచేత
వూగులాడుతుంటాయోయ్

అడవిలోనూ కడలిలోనూ
అద్దరాత్తిరివేళ అప్పుడు
తొగరుకన్నుల చుక్కకన్నెలు
తొంగిచూస్తారోయ్

పొద్దుకూకేవేళ ఒడ్డున
ముద్దుముద్దుగ తిరుగుతుంటూ
సొగసునడకల గాలిపిల్లలు
సోకుపోతారోయ్

సుళ్ళు తిరిగే కడలినడుమా
చూపుకందీ అందకుండా
తెప్పలేసుకు పాముపడుచులు
తేలిపోతారోయ్

ఒడ్డునే బంగారుచేలూ
ఒడ్డునే పూవుల్లుచేత్తో
ఊరికే యిట్లంటె చాల్ పా
లుబికిపోతాయోయ్

నేను చెప్పేకతలు జరిగి
యెన్నినాళ్ళయిందో అప్పుడు
మలలు పొదలు కొండకోనలు
తెలుగునా డంతా 



కడలివొడ్డున పల్లె ఒకటి
కలదు, ఱేడున్నాడు దానికి,
అప్పటికే యీ తెలుగులంతా
గొప్ప యెకిమీళ్ళు

వెదురులో ముత్యాలపేరులు
కదురులో దారాలబట్టలు
ఎదురుగా నెలపొడిచినట్లే
ఏపుమీ రేడోయ్

దొడ్డదొర, అతగాడినేలలో
ఎడ్డెపనులే చేయ రెవ్వరు,
దొంగ నాగరికతలో దేశం
తూలిపోలేదోయ్

ఉన్నవాళ్లకు ఎంతనేలా
దున్నుకుంటే చాలుతుందో
మించి ముట్టరుకూడ పైనా
చిన్న చెక్కయినా

మిగిలినా అడవూలు, కొండల
కెగురుతూ, మబ్బుల కన్నెల
తగులుతూ, తరిలోన వానలు
కురుస్తుంటాయోయ్

అందరికి కావలసినంతా
వుంది, యెవ్వరితోడా నెవరికి
నెన్నడు చూడలేమన్నా
చిన్ని తగవైనా

ఆ దొరకి కూతుళ్ళు ఇద్దరు,
మోదుగులు పూశాయి పెదవులు
వారిపేరులు, చిలక తల్లి,
కోకిలమ్మానూ

కోకిలమ్మ నల్లనిదే
చిలకతల్లి పచ్చనిదే
చిలక తల్లికి కోకిలమ్మకు
ఎప్పుడూ పడదూ 



చిలకతల్లి చిన్ననాడే
పలుక మొదలెట్టింది ముద్దుల
మొలకలై తండ్రికీ మేనూ
పులకరించిందీ

ఎన్నో ఏళ్ళు వచ్చినాయీ
కన్నులింతగా తెరచినాదీ
పాపమేమో ! కోకిలమ్మకు
మాటలేరావూ

చిలకతల్లికి రంగురంగుల
చీరలూ తెస్తాడు తండ్రీ,
కోకిలమ్మను ఊరకేనే
కోపపడతాడూ

చిలకతల్లీ నవ్విపోతే
తండ్రి మారూ పలుకకుంటే
తల్లివంకా చూచి కోకిల
తెల్లపోతుందీ

చిలకతల్లి వెక్కిరిస్తే
తండ్రి వచ్చీ కసురుకుంటే
తల్లివెనుకా దాగిపోతూ
తల్లడిలుతుందీ

తల్లి ఏమీ చెయ్యలేకా
తాను కూడా విసుక్కుంటే
కోకిలమ్మా లోనె లోనే
కుమిలిపోతుందీ

రోజు రోజూ కడలి తరగల
రొదలలో కలిసి ఏడుస్తూ
నురుసులోపల వట్టిచూపులు
నిలిపి పోతుందీ

అడవిలో యే చెట్టుకిందో
అంత యెగ్గులు తలచుకోనీ
కూరుచున్నది కూరుచుండే
కుమిలిపోతుందీ 



చెట్టుతోనో పుట్టతోనో
చెప్పుకుందామన్న గానీ
ఎట్టివాడో వాడు నోరూ
పెట్టలేదాయే

కొండవాగుల్లోను ప్రొద్దూ
గూకులూ కూర్చుండి యిసకలో
గూళ్ళులేనీ పిచ్చికలకీ
గూళ్ళు కడుతుందీ

కొండవాగులవెంట పోతూ
కొండపువ్వుల వంక చూస్తూ
ఎంత పొద్దోయినా గానీ
యింటికే పోదూ

ఒక్కొక్కప్పుడు తెల్లవార్లు
అడివిలోనే ఉండిపోతే
తల్లి ఊరక తెల్లవార్లూ
తల్లడిల్లుతుందీ

వానరోజులు వచ్చిపోగా
చలిపగళ్ళు సాగిపోగా
ఆకురాలుట ఆగి చివురులు
జోకతాల్చాయీ

చివురులూ కొమ్మలాచివరా
గుబురులై గుబురులాచివరా
పూవులూ నాలుగూవైపుల
బుగులుకొన్నాయీ

చివురులో ఈనెల్లే, పసిరిక
పువ్వుల్లో తేనెల్లే, పలపల
చిలకతల్లికి కోకిలమ్మకు
వయసు వచ్చిందీ

చిలకతల్లీ చదువు చూచీ
చిలకతల్లీ సొగసు చూచీ
గాలిపిల్లకూడ లోపల
కలతపడ్డారూ 



చిలకతల్లీ అందమంతా
చిందిపోయీ అన్నివైపుల
కనులచూడని వారుకూడా
అనుకునేవారే

చెట్లరాణీ తలాడిస్తూ
చిలకతల్లీవోసుకతలే
నింగిలో దవ్వూన యెచటో
పొంగి పాడిందీ

పొద్దుకూకేవేళ తిరుగుతు
ముద్దులొలికే గాలిపిల్లలు
చిలకతల్లి అందమెప్పుడు
వొలకపోస్తారూ

ఎల్లవారూ చిలకతల్లినె
పెళ్ళికై కోరారు, తండ్రి
తల్లి మాత్రము పిల్లదాన్నీ
కళ్ళ కాస్తారూ

కడలీదవుల ఱేండ్లు తమలో
కలుపుకుంటారేమొ అనుకుని
గడపదాటీ చిలకతల్లిని
కదలిపోనీరూ

ఇంటిముంగిలి దాటనీకా
ఇంటిపనులూ చేయనీకా
కంటికీ రెప్పాకి మల్లే
కాచుకుంటారూ

చిలకతల్లీ సొగసులవాకలు
చిలవలై పలవలై యందపు
మొలకలై తేనెలాచినుకులు
గలపరించాయీ

చిలకతల్లీ అందమేమో
చిలకతల్లీ పెళ్ళియేమో
తల్లి తండ్రీ కోకిలమ్మను
తలచనేపోరూ
 

*        *        *        *        *