Monday, September 6, 2010

వైజయంతీ విలాసం

తెలుగు కావ్యాలలో "వైజయంతీ విలాసము"కి ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ కావ్యాన్ని సారంగు తమ్మయ అనే కవి రచించాడు. ఈయన గురించి పెద్దగా విషయాలేమి తెలియవు కానీ ఈయన బహుశా 1600 దశాబ్దం వాడు కావచ్చునని ఒక వాదన. 

        కథా వస్తువు: 

        వైజయంతీ విలాసము మహాభక్తుడైన విప్రనారాయణుని జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల మీద ఆధారం చేసుకుని రచించిన కావ్యం. ఇందులో వచ్చే ముఖ్య పాత్రలు... 


  1. విప్రనారాయణుడు
  2. మధుర వాణి
  3. దేవదేవి

        ఇంకా విప్రునివేషంలో వచ్చిన శ్రీరంగనాధుడు, మహారాజు మొదలైన వారు. 

        కథ క్లుప్తంగా: 

        శ్రీరంగపురం దగ్గరి కావేరీ నది తీరాన మండగుడి అనే అగ్రహారంలో నారాయణుడు అనే బ్రాహ్మణుడు, అతని భార్య లక్ష్మీ నివసిస్తూ ఉండేవారు. ఆ దంపతులకు సంతానం లేదు. ఒకనాడు ఒక యతి భిక్షకై ఆ ఇంటికి వచ్చినప్పుడు, ఆ ఇల్లాలు భిక్ష వేయపోగా "సంతాన హీనుల నుండి భిక్ష స్వీకరింపను" అని ఆ యతి నిరాకరిస్తాడు. అప్పుడు ఆ ఇల్లాలు "మహాత్మా ఇది విష్ణు ప్రసాదం. మహాత్ములు మీరు దీనిని నిరకరింప తగునా? మీరు అన్ని ధర్మములు తెలిసిన వారు కదా ?" అని ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆ యతి కొంచంసేపు ఆలోచించి భిక్ష తీసుకొని వెళ్ళిపోతాడు. 

        తరువాత ఇంటికి వచ్చిన భర్త నారాయణునితో జరిగినది అంతా వివరించి సంతానం లేనందువలననే కదా ఇట్టి పరిస్థితి అని బాధపడుతుంది. నారాయణుడు ఆమెను ఓదారుస్తాడు. ఆ రోజు రాత్రి ఆ గృహిణికి కలలో శ్రీ మాహావిష్ణువు దర్శనమిచ్చి, వైజయంతి అను నలుపు తెలుపు రంగుల పూలదండ ఇస్తాడు. ఆ పూలదండ మహిమ వలన కాల క్రమేణా ఆ గృహిణి గర్భందాల్చి ఒక శుభమూహూర్తాన మగబిడ్డని ప్రసవిస్తుంది. 

        వైజయంతి అనే మాలిక అంశన పుట్టిన బిడ్డని చరిత్రము కాబట్టి దీనికి "వైజయంతీ విలాసము" అనే పేరు వచ్చింది. 



 అలా జన్మించిన బిడ్డ విప్ర నారాయణుని పేరుతో ప్రసిద్ధి కెక్కాడు. చాలా కొద్దికాలంలోనే సర్వశాస్త్రాలలో పండితుడైనాడు. మాలికాంశమున జన్మించటం వలన ఆలయంలోని భగవానిడికి మాలికలని సమర్పించాలి అనే ఆశతో ప్రతి దినం పూలన్ని ప్రోగుచేసి మాలలు కట్టి శ్రీరంగనాధుడికి సమర్పిస్తుండేవాడు. కొంతకాలానికి కావేరీ తీరంలో శ్రీమకుటద్వీపం అనే స్థలాన్ని కొని అక్కడ ఒక పెద్ద పూలతోట పెంచి, అందులోని పూలతో రంగనాధుడిని కొలుచుకుంటు ఉండేవాడు.

        ఇలా కొంత కాలం ప్రశాంతంగా గడిచిపోయింది. ఒక నాడు శ్రీరంగం నుండి దేవదేవీ, మరియు ఆమె అక్క మధురవాణి అను వారాంగనలు వచ్చి మహారాజుని తమ ఆటపాటలతో సంతోష పరిచి, అనేక బహుమతులు పొంది సంతోషంగా మరలి ఇంటికి వెల్తున్నారు. అదే సమయాన పూజ ముగించుకొని విప్రనారాయణుడు తన నివాసానికి బయలుదేరాడు. ఆయన రాకను గమనించిన ఆ వేశ్యాంగనలు దూరము నుండే ఆయనకు నమస్కరించారు. ఏదో ఆలోచనలో ఉన్న విప్ర నారాయణుడు వారిని గమనించకనే వెళ్ళిపోయాడు.అది చూసిన దేవదేవికి ఒళ్ళుమండింది. 


మ్రొక్కిన నెవ్వరే మనఁడు, మో మటు వెట్టుక చక్కఁబోయె, నీ
దిక్కుని జూడఁడాయె, ఒక దీవెన మాటయు నాడఁడాయె, వీఁ
డెక్కడివైష్ణవుండు; మనమేటికి మ్రొక్కితిమమ్మ, యకటా!
నెక్కొని వెఱ్ఱిబుద్ధిమొయి నిద్దురయోయిన కాళ్ళకున్ !
        అందుకు మధురవాణి "వారు చూసినా చూడకున్న మనకేమిటి? పూజ్యులకు నమస్కరించటం మన విధి"అని ఎన్నో విధాల నచ్చ చెప్పింది. ఐనా దేవదేవి శాంతించలేదు. మాటా మాటా పెరిగింది. తాను ఎలాగైనా ఆ విప్రుని తన వలలో వేసుకోగలను అని దేవదేవి అన్నది. ఇద్దరూ పందెం వేసుకున్నారు. పందెం ప్రకారం దేవదేవి కనుక ఆ విప్రుని వలలో వేసుకుంటే మధురవాణి వేశ్యావృత్తి మానుకోవాలి లేదా దేవదేవి మానుకోవాలి.

        మరునాడు దేవదేవి తన ఆభరాణాలు అన్నిటిని వదిలి ఒక దాసరివేషం ధరించింది. అలా దాసరి వేషం వేసిన దేవదేవి విప్రనారాయణుని ఆశ్రమానికి వచ్చి అక్కడ మాలలని అల్లుతున్న విప్రనారాయణుని చూసి పాదాభివందనం చేసిమ్రొక్కుతు నిలుచుంది. అప్పుడు ఆమెను చూసిన విప్రనారాయణుడు, "ఎవరు నీవు? నీ పేరు ఏమి?" అని అడిగాడు.



అందుకు ఆమె "అయ్యా ! నేను శూద్ర కులము దానను. నాకెవ్వరునూ లేరు. ఏదిక్కునూ లేదు. హరిభక్తులు, జితేంద్రియులైన తమ పాద సేవకై వచ్చాను" అన్నది.

        "నీకెవ్వరు లేరనుచున్నావు. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు? ఈ విరక్తికి కారణం ఏమిటి?" అని అడిగాడు విప్రనారాయణుడు.

        "స్వామీ ! నా జన్మ పరమ నికృష్టమైనది. నాపేరు దేవదేవి. నేనొక వేశ్యాపుత్రికను. సంగీత నాట్య కళలన్నీ నేర్చుకున్నాను" అని తన వృత్తిలోని లోటు పాట్లను అన్ని వివరించి, తను ఎటుల శ్రీమద్భాగవత పురాణములోని పింగళోపాఖ్యానము విని విష్ణుభక్తురాలిగా మరినదో వివరించింది.

        "దేవదేవీ ! శ్రీవైష్ణవులకు వేశ్యలతో సహవాసం తగదు. మీతో సహవాసం చేసిన లోకులేమందురో ?" అని విప్రనారాయణుడు సందేహం వెలుబుచ్చాడు.

        "స్వామీ ! దేహవాంచ్చేయున్న యెడల తమ వద్దకు ఎందుకు వస్తానూ. అన్నిటి మీద విరక్తి చేతనే మీ వద్దకు వచ్చాను. నన్ను తమ దాసిగా స్వీకరించండి. తమకు అన్ని పనులు చేసిపెడతాను" అని ఎన్నో విధాల వేడుకున్నది.

        అందుకు విప్రనారాయణుడు ఆలోచించి చివరకు ఆమెను తన ఆశ్రమంలో ఉండటానికి అనుమతిని ఇచ్చాడు.

        దేవదేవి ఆ మాటలకు సంతోషించి, అతని ఆశ్రమంలోనే ఉంటూ అతనికి అన్ని పనులలో చేదోడు వాదోడుగా మెలగ సాగింది. అలా కొంతకాలం గడిచింది. అన్నిపనులకి చేదోడువాదోడుగా ఉంటూ తలలో నాలిక వలే ఉన్న దేవదేవి మీద విప్రనారాయణునికి నెమ్మదిగా అభిమానం పెరగ సాగింది. అది గమనించిన దేవదేవి తన ఎత్తు పారుతున్నందుకు లోలోన సంతోషించ సాగింది.

        ఇలా ఉండగా ఒకనాడు భోరున వర్షం కురవసాగింది. అది చూసిన విప్రనారాయణుడు దేవదేవిని తన కుటీరంలోనికి ఆహ్వానించాడు. దేవదేవి అందుకు కొంత బెట్టు చూపించింది. తన రాకవలన బ్రాహ్మణుడు అపవిత్రం ఐపోతాడని, అతని నిష్టని భంగం చేయటం తనకు తగదనీ ఎన్నో మార్లు చెప్పింది. ఐనా విప్రనారాయణుడు వదలక ఆమెను తన కుటీరంలోనికి తీసుకుని వెళ్ళి తన ఇచ్చని తెలియచేసాడు. ముందు కొంత బెట్టు చేసిన దేవదేవి చివరకు అంగీకరించింది. ఆవిధంగా దేవదేవి తన ప్రతిఙ్ఞ నేరవేర్చుకుంది. విప్రనారాయణుడు బ్రష్టుడయ్యాడు. 



కొంతకాలం గడిచాక తన ప్రతిఙ్ఞ నేరవేరిందికనుక ఇంక తను శలవు తీసుకోతలచి విప్రనారయణునితో"స్వామీ! నేను ఇక్కడ ఉన్న విషయం తెలిసి మా అమ్మగారు ఈ ఊరు వచ్చియున్నారు. ప్రస్తుతం మా అక్క గారి వద్ద ఉన్నారు. నేను ఈ రోజు పోయి వారిని దర్శించి మరల రేపు ఉదయం తిరిగి వస్తాను" అన్నది.

        ఆ మాటలకి విప్రనారయణుని కాళ్ళు చల్ల బడ్డాయి. అంతసేపు ఆమెని విడిచి ఉండలేక ఆమెతో బయలుదేరాడు. కానీ అక్కడా అతనికి అవమానమే ఎదురయింది. వేశ్యమాత అతనిని అనరాని మాటలతో అవమానించింది. ఆ మాటలని పడలేక విప్రనారాయణుడు కుటీరానికి తిరుగు మొహంపట్టాడు. కుటీరం చేరిన విప్రనారాయణుడు, తన దుస్థితికి చాలా విచారించాడు. తను ఎల బ్రష్టుడయ్యింది తలుచుకొని చాలా బాధ పడ్డాడు. తనని ఆ పాపం నుంచి రక్షించమని శ్రీహరిని వేడుకొన్నాడు.

        అతని బాధకి శ్రీహరికి అతని మీద జాలి కలిగింది. తను ఒక బ్రహ్మణకుమారుని వేషం ధరించి ఆలయంలోని ఒక బంగారు పాత్రని తీసుకొని వేశ్యమాతవద్దకు వెళ్ళాడు. ఆమె అ విప్ర కుమారుడిని ఆదరించి వివరాలు అడిగింది. "అమ్మా నేను ఒక బ్రహ్మణ కుమారుడను. నాపేరు రంగడు. విప్ర నారయణుని శిష్యుడను. వారు పంపగా వచ్చాను. వారు తమకు ఈ పాత్రను ఇచ్చి రమ్మన్నారు" అని ఆ బంగారు పాత్రను ఆమెకు అందచేసాడు.

        అంత బీదవాని వద్ద బంగారు పాత్ర ఉండటం నమ్మని వేశ్యమాత స్వర్ణకారుణ్ణి పిలిపించి ఆ పాత్రని పరిక్ష చేయించింది. స్వర్ణకారుడు ఆ పాత్రను గుడిలోని పాత్రగా గుర్తించినా ఏమియూ చెప్పక అది మంచి విలువైన మేలిమి బంగారమని నిర్ణయించి వెళ్ళి పోతాడు. ఆ బ్రహ్మణుని వద్ద ఇంకా బంగారు సామాగ్రి ఉండవచ్చనే అనుమానంతో వేశ్యమాత కావేరీ అను దాసిని పంపి విప్రనారాయణుని మరల తన ఇంటికి పిలిపించుకుంటుంది.

        మరునాడు నైవేద్యం సమయంలో గుడిలోని బంగారు పాత్ర కానక అర్చకులు దేవాలయాధికారికి ఆ విషయాన్ని తెలియ చేసారు. ఆతను విచారణ జరిపి చివరకు స్వర్ణకారుని ద్వారా ఆ పాత్ర వేశ్యావాటికలో ఉన్న విషయం తెలుసుకొని దేవదాసినీ, విప్రనారాయణుని రాజ సభకు పిలిపించారు. రాజ విచారణ ప్రారంభం అయ్యింది. విప్రనారాయణుడు తాను నిర్దోషి అని ఎంతచెప్పినా ఎవ్వరూ వినలేదు. అతనిని దోషిగా నిర్ణయించి దేశబహిష్కార శిక్ష విధించారు. ఆ అవమానం భరించలేని విప్రనారాయణూడు శ్రీహరిని ప్రార్ధించాడు. అప్పుడు అందరు ఆశ్చర్య పడేలాగున శ్రీ హరి ప్రత్యక్షమై జియ్యరుతో "ఈ విప్రనారాయణుడు నిర్దోషి. ఇదంతా నేను జలిపిన లీలా వినోదం. ఈ విప్రనారయణుడు నా వనమాలిక వైజయంతి అంశతో జన్మించినవాడు. మహాభక్తుడు. ఈ దేవదేవి పుర్వజన్మాన ఒక అప్సరకాంత. ఆమెకు నేను స్వయంగా ఇచ్చిన బంగారు పాత్రను వెనుకకు తీసుకొనరాదు" అని తీర్పు చెప్పి అంతర్ధానం అయ్యాడు. 



 అంత అక్కడి భక్తులందరు విప్రనారాయణునికి బ్రహ్మరధం పట్టారు. ఆయనను రంగనాధుని ఆలయానికి తీసుకొనివెళ్ళగా అక్కడ ఆయన రంగనాధుని అనేక విధాల ప్రస్తుతించాడు. అతని భక్తికి మెచ్చిన రంగనాధుడు ప్రసన్నుడై "నీకు నా సామీప్య పదవిని ఇస్తున్నాను. ఇక మీదట నీవు తొండరడిప్పాడి ఆళ్వారు అనే పేరు ప్రసిద్ధి కలుగుతుంది" అని వరమిస్తాడు.

        ఆ తరువాత విప్రనారాయణుడు స్వామిపై అచంచల భక్తితో ఆయనను సేవిస్తూ ధన్యుడయ్యాడు. దేవదాసి కూడా తనకు లభించిన బంగారు పాత్రతో పాటు తనవద్ద ఉన్న సంపద అంతా పంచివేసి దైవ ధ్యానంలో జీవితం గడిపి వేస్తుంది.

        ఇది "వైజయంతీ విలాసం" కథ. ఈ కావ్యంలోని పద్యాలు చక్కని సులువైన భాషలో ఉండి చదవటానికి ఎంతో ఆనందం కలగ చేస్తాయి. కావ్యంలో కథతో పాటు అద్భుతమైన వర్ణనలు ఎన్నో ఉన్నాయి. కథలో భక్తితో పాటుగా వేశ్యాలోలత్వం వల్ల కలిగే నష్టాలు, కష్టాలు గురించి కూడా మనకి తెలియచేస్తుంది.

        ఇది అందరు చదివి ఆనందించవలసిన ఒక మంచి కావ్యం. మీరూ చదవండి. మిగిలిన వారితో చదివించండి. 

Monday, August 30, 2010

విజయవిలాసం

కవి పరిచయం: 

        విజయవిలాస కర్త చేమకూర వేంకటకవి 17వ శతాబ్ధికి చెందినవాడు. తంజావూరు నాయకరాజులలో ప్రసిద్ధుడైన రఘునాధరాజు ఆస్థానంలో ఉండేవాడు. ఈయన తండ్రి పేరు లక్ష్మణ కవి. ఈయన కూడా పెద్ద పండితుడే. వేంకటకవి తన గురించి ఎక్కడ చెప్పుకోలేదు. కారణాలు ఏమైనది మనకు అంతగా తెలియదు కానీ ఈయన వ్రాసిన "విజయ విలాసము", "సారంగధర చరిత్రము" మాత్రం ఈయనకు చాలా గొప్ప పేరు సంపాదించి పెట్టాయి. కారణం ఈ గ్రంధంలో ఆయన వ్రసిన అద్భుతమైన వర్ణనలు, యమకములు, అలంకారములు. ఉదాహరణకు... 

పాఱఁ జూచినఁ పరసేన పాఱఁ జూచు,
వింటికొరిగిన రిపురాజి వింటి కొరగుఁ
వేయునేటికి? నల పాండవేయు సాటి
వీరుఁ డిలలేఁడు; ప్రతి రఘువీరుఁడొకడు
        పాఱఁ జూసిన = పరికించి చూస్తే శత్రుసేనలు పారిపోతాయట 
        వింటికోరిగిన = ధనుస్సు చేపడితే శత్రురాజులు మిన్ను (ఆకాశం)కి పోతారుట. 

        ఇటువంటి ఎన్నో పద్యాలు మనకు ఈ కావ్యంలో కనిపిస్తాయి. 

        క్లుప్తంగా కథ: 

        ద్వారకనుండి గదుడనేవాడు పాడవులను దర్శించటానికి వస్తాడు. ఆప్పుడు అర్జునునితో శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్ర సౌందర్యన్ని వర్ణిస్తాడు. 

కానన్ సుభద్రకున్ సమంబు గాఁగ నే మృగి విలో
కనన్ ; నిజంబు గాఁగ నే జగంబునందుఁ జూచి కా
కానన్ దదీయ వర్ణనీయ హావభావ ధీ వయః
కన న్మనోఙ్ఞ రేఖ లెన్నఁగాఁ దరంబె గ్రక్కనన్?
        ఆమె అద్భుత సౌందర్యాన్ని గురించి విన్న అర్జునుడు ఆమెపై మరులుకొంటాడు. పాండవులు తమలో తాము ఒక నియమాన్ని ఏర్పరచుకున్నారు. అదేమిటంటే ద్రౌపతి ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి వద్ద ఉండేటట్టుగానూ ఆ సమయంలో మిగిలిన వారు వారి ఏకాంతతకు భంగం కలిగించ రాదని, ఒకవేళ అలా భంగం కలిగించితే వారు ఒక సంవత్సరకాలం దేశాటన చేయ్యాలని నియమం. ఒక వృద్ధ బ్రాహ్మణుని గోసంరక్షణార్ధం అర్జునుడు ఆ నియమాన్ని ఉల్లంఘించి అన్నగారైన ధర్మరాజు మందిరంలో ఉన్న తన శస్త్రాస్త్రాలను తెచ్చుకొని నియమ భంగం చేస్తాడు. నియమోల్లంఘన జరిగింది కాబట్టి అర్జునుడు భూప్రదక్షిణకి బయలుదేరతాడు. అన్నగారు వారించినా ఒప్పుకోలేదు. ఆ సాకుతో ద్వారకకు వెళ్ళి సుభద్రని చేపట్టాలని అర్జునుని ఆలోచన. తనవెంట ధౌమ్యుని తమ్ముడి కొడుకు మిత్రుడు ఐన విశారదుడు, మరికొంత పరివారంతో భూప్రదక్షిణకి బయలుదేరాడు.

        అలా బయలుదేరిన అర్జునుడు గంగానదీతీరానికి చేరాడు. గంగాతీరం చేరిన అర్జునుడు గంగాభవానిని స్తుతించి ఆ రోజుకి గంగాతీరాన విశ్రమిస్తాడు. ఆ గంగలో ఉన్న ఉలూచి అనే నాగ కన్య అర్జునిపైన ఎన్నేళ్ళుగానో మరులు కొంది. ఆమె కోరిక తీరే సమయం ఆసన్నమయింది. గంగాతీరాన్న విశ్రమించిన అర్జునుని చూసి"రాజసము తేజరిల్లు నీరాజుఁ గూడి ఇంపుసొంపులు వెలయ గ్రీడింపవలదే" అని అనుకొని అతనిని తన నాగలోకానికి తీసుకొని పోయింది. అక్కడ అర్జునుడు కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. ఉలూచి అతనికి తన కోరిక వెల్లడించింది. "భూమి ప్రదక్షిణము సేయఁ బోయెడివానిన్ గామించి తోడి తేఁ దగవా? మగువ ! వివేక మించుకైన వలదా ?" అని అడిగాడు. ఎన్ని విధాల చెప్పినా ఆమె మాట వినలేదు. తనను చేపట్టకపోతే ప్రాణత్యాగం చేస్తా అని...
చెఱకువిలుకాని బారికి వెఱచి నీదు
మఱుగుఁ చేరితిఁ; జేపట్టి మనుపు నన్నుఁ;
బ్రాణదానంబు కన్నను వ్రతము గలదే?
యెఱుఁగవే ధర్మపరుఁడవు నృపకుమార !
        అన్నది.
 ఆవిధంగా అతనిని ఒప్పించిన ఉలూచికి ఇలావంతుడనే కుమారుడు పుట్టాడు. (ఇదంతా ఒకే రాత్రిలో జరిగింది). మరునాడు ఉదయం తన మిత్రులంతా ఎదురు చూస్తారని వెళ్ళకపోతే వారు కలత చెందుతారని ఉలూచికి నచ్చచెప్పి అక్కడనుండి బయలుదేరి మిత్రులని కలిసి తన భూప్రదక్షిణ ప్రారంభిస్తాడు. అవిధంగా తిరుగుతూ దక్షిణ భారతంలో పాండ్యదేశరాజధాని ఐన మణిపురానికి చేరుకున్నాడు. ఆ రాజ్యానికి రాజు మలయధ్వజుడు. ఆతనికి ఒక కుమార్తె ఉన్నది పేరు చిత్రాంగద. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన అర్జునుడు విశారదునితో పెండ్లికి రాయబారం పంపుతాడు. అర్జునుడు అల్లుడిగా చేసుకునేందుకు మలయధ్వజుడు సంతోషంగా అంగీకరిస్తాడు. అలావారి వివాహం అత్యంత వైభవంగా జరిగిపోతుంది. కాలక్రమేణా చిత్రాంగద గర్భందాల్చి బబ్రువాహనుడికి జన్మమిస్తుంది. కుమారుని అచ్చట్లు ముచట్లు తీరాక అర్జునుడు మరల తన భూప్రదక్షిణకు బయలుదేరాడు. అలా తిరుగుతూ సౌభద్ర నదిలో శాపగ్రస్తులైన మొసళ్ళకు శాపవిమోచనం కలిగించి అక్కడనుండి పశ్చిమాన్న ఉన్న ద్వారకా నగరానికి చేరుకున్నాడు.

        అక్కడికి చేరుకున్నాక అర్జునుడూ శ్రీకృష్ణుని తలచుకొన్నాడు. శ్రీకృష్ణుడు అతనికి ప్రత్యక్షమయి అతనికి సాధువేషంలో రైవతక పర్వతం మీద ఉండమని అదేశిస్తాడు. మరునాడు అక్కడ ఒక గొప్ప సన్యాసి వచ్చి ఉన్నాడని ద్వారక ప్రజలంతా వస్తారు. బలరామ శ్రీకృష్ణులు కూడా వచ్చి ఆయన దర్శనం చేసుకుంటారు. అప్పుడు బలరాముడు అర్జునుని నిజమైన సన్యాసిగా భావించి తన రాజ్యానికి ఆహ్వానిస్తాడు. అర్జునుడు ఆ ఆహ్వానాన్ని మన్నించి ద్వారకకు చేరుకున్నాడు. బలరాముడు అతని సేవకై సుభద్రని నియమిస్తాడు. సుభద్ర ఆ కపట సన్యాసికి సేవలు చేస్తుండగా ఒకనాడు ఆమెకు శకున శాస్త్రం చెప్తాడు. మాటల్లో ఒకనాడు సుభద్ర... 

మీ రింద్రప్రస్థముఁ గని
నారా? పాండవులఁ జూచినారా ? సఖులై
వారందఱు నొకచో ను
న్నారా? వీరాగ్రగణ్యు నరు నెఱుఁగుదురా?

ఎగు భుజంబులవాఁడు, మృగరాజ మధ్యంబు
పుడికి పుచ్చుకొను నెన్నడుమువాఁడు
నెఱివెండ్రుకలవాడు, నీలంపు నికరంపు
మెఱుఁగుఁ జామనచాయ మేనివాఁడు
గొప్ప కన్నులవాఁడు, కోదండ గుణ కిణాం
కములైన ముంజేతు లమరువాఁడు
బరివి గడ్డమువాఁడు, పన్నిదం బిడి దాఁగ
వచ్చు నందపు వెను మచ్చవాఁడు
గరగరనివాఁడు, నవ్వు మొగంబువాఁడు
చ్గూడఁ గలవాఁడు, మేలైన సొబగువాఁడు,
వావి మేనత్తకొడుకు కావలయు నాకు
నర్జునుండు పరాక్ర మొపార్జునుండు.
        అని అడిగింది.

        ఆమె మనసును గ్రహించిన అర్జునుడు తనే అర్జునుడని అసలు విషయం బయటపెడతాడు.
నీకై తపంబు జేసెద
నీ కైవడి; దాఁపనేల? యే నర్జునుఁడన్
లోకోత్తర శుభలగ్నం
బో కోమలి! నేడు కోర్కులొడఁగూర్పఁ గదే !
        అన్నాడు.

        తన నిజరూపం తెలియచేసిన ఆర్జునుడు తనని గాంధర్వ వివాహం చేసుకోమని సుభద్రని అర్ధించాడు. సుభద్ర అందుకు ఒప్పుకోలేదు. పెద్దల సమక్షాన్నే కళ్యాణం అని చెప్పివేసింది. చేసేదిలేక ఆమెను వదిలి వేసాడు. పెళ్ళివరకు ఇద్దరు విరహ తాపాన్ని అనుభవించారు. చంద్రుణ్ణి తిట్టుకున్నారు. మన్మధుడిని తూలనాడారు. బలరామునికి ఈ విషయం ఇంకా తెలియదు. అంతా శ్రీకృష్ణుని ఆధ్వర్యంలోనే నడుస్తోంది. సరైన సమయం చూసి శ్రీకృష్ణుడు వారికి దొంగపెళ్ళి జరిపించాడు. వారి ఆనందానికి అంతులేదు. అంత సుభద్రని తీసుకొనివెళ్ళే సమయంలో యాదవ వీరులు అతనిని అడ్డగించారు. సుభద్ర సారధ్యం చెయ్యగా అర్జునుడు వారందరిని ఓడించి ఇంద్రప్రస్థం చేరుకున్నారు. సుభద్ర వివాహం సంగతి బలరామునికి తెలిసింది. కోపంతో మండి పడ్డాడు. శ్రీకృష్ణుడు జరిగినది బలరాముని కి చెప్పి వారిని శాంతపరిచాడు. వారందరు కలిసి ఇంద్రప్రస్థం చేరి దంపతులను ఆశీర్వదించారు. మరల వారిద్దరికీ ఐదురోజుల పెండ్లి జరిపించారు. వారి ప్రేమకు అనురాగానికి గుర్తుగా అభిమన్యుడు జన్మించాడు.

        ఇక్కడితో కథ ముగుస్తుంది. ఈ కథ ముఖ్యంగా విజయ నామధేయుడైన అర్జునుని భూప్రదక్షణ, ఉలూచి, చిత్రంగద, సుభద్రలతో వివాహం వరకు వివరించినా కథ చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. చక్కని తేట తెలుగు పద్యాలతో ఉండే ఈ కావ్యం, అందరు తప్పక చదవాల్సిన పుస్తకం.

        మీరూ చదవండి. అందరి చేతా చదివించండి.
అందరికీ  వందనాలు. మన  తియ్యని  తెలుగుసాహిత్యంలోని అమూల్యరత్నాలని మన మిత్రుల చేరువకి తీసుకురావాలనే  ఉద్దేశ్యంతో ఈ బ్లాగుని  మొదలు  పెట్టాను . ఇలాంటి  బ్లాగులు  ఇంకా   ఎన్నో  ఉన్నాయి .  ఈ  బ్లాగు వాటికీ పోటి అస్సలు కాదు.   అందరు సాదరంగా ఆహ్వానించి ఆదరిస్తారని ఆశిస్తాను.