Saturday, August 4, 2012

భోగినీ దండకము - బమ్మెరపోతన


శ్రీసర్వజ్ఞ సింగరాజు వర్ణనము

శ్రీమన్మహా మంగళాకారు, నాకార లక్ష్మీకుమారుం, గుమారీమనోరాము, రామాంబరీషాది రాజన్య రాజదశః కాముఁ, గామాహిత క్షీరవారాశి తారాశి వాగేంద్ర మందారకుం దారవిందేహి తాకాశకల్లోలినీ కాశవిఖ్యాత సత్కీర్తిముక్తావళీభూషి తాశాంగనాలోకసీమంతు, సీమంతినీమానసారామవాటీ వసంతున్, వసంతావనినాధ సంసేవితాంచత్పదాంభోజు, నంభోజరాజీసుహృత్తేజు, దేజో జయప్రాభవోద్దాము, నుద్దామజన్యావనీభీము, భీమప్రతాపానలాభీలకిలావినిర్మూలితారతి పండ్యక్షమాపాల దుర్వార గర్వాటనీవారు, వారాధిపోరుప్రభా భాసురస్ఫార కల్యాణదుర్వారు, వారాశివేలా పరీతావనీభార ధౌరేయరాజ న్మహాబాహు, బాహాకఠోరాసిధారా వినిర్భిన్న సోమాన్వయోత్పన్న భూభృత్సమూహున్, సమూహా మహాశమూషీ కుంఠితాశేష శత్రుక్షమావల్లభున్, వల్లభామానసాదుర్లభున్, దుర్లభారిక్షమానాథ మత్తేభయూధంబులం జించి చెండాడు రాసింగమున్, సింగభూపాలు, భూపాల గోపాల గోపాలికా కృష్ణ గోపాలు, గోపాలదేవోత్సవ క్రీడలో, మేడలోనుండి జాలాంతరాళంబులన్ వారయోషాతనూజాత విద్యావయోరూప సౌందర్యచాతుర్య విఖ్యాత చంచద్గుణోపేత భృంగాంగ వాలబ్ధకేళి మహాహస్త కంజాతసంకాశ, తూణీనిరుద్ధప్రసూనేషుసూనేషునీకాశ యై యుండి తద్వైభవముల్ విమర్శించి, 

వేశ్యాకన్య రాజుం జూచి మోహించుట

హర్షించి, సంతోషభాష్పంబుపూరంబు వర్షించి,కందర్పబాణాహతింజెంది, లోఁగుంది, మోహించి, సంగంబునూహించి, ' యేవేళఁ దల్లింబ్రమోషింతు, నేలీల భూపాలకుంజేరి భాషింతు, నేరీతిఁ గామానలంబున్ నివారింతు, నేనాతితోడన్ విచారింతు, నేవెంట రాచూలి వంచింతు, నేజంటఁఘొర్కుల్ ప్రపంచింతు ము న్నేప్రశస్తారవిందంబనైనన్ మహిపాలు హస్తారవిందంబుపై నేఁడు లీలారవిందంబనై యుందుఁబో, రత్నహారంబనైనన్ శుభాకారు వక్షోవిహారంబుఁ గైకొందుబో, యేల యిట్లైతి నెట్లోకదే' యంచు శోకించుచున్, నిత్యకల్యాణు లీలావతీ పంచబాణున్ మనోవీథినంకించుచున్, ఘోషమాణాలికిన్ జిత్తభూభల్లికిన్ దల్లికిన్ లోఁగి, కామానలజ్వాలలన్ వేఁగి, చింతాభరాక్రాంతయై యేఁగి, సంతాపఘర్మంబులందోఁగి, చింతించు నింతిం బరీక్షించి, బుద్ధిన్ విచక్షించి, తన్మాత 

వారకన్యతల్లి వచ్చి కూఁతునవస్థఁ గనుఁగొనుట.

మాయాపరాభూత జామాత మిథ్యానయోపేత విజ్ఞాతనానావశీకార మంత్రౌషధవ్రాత లోకైకవిఖ్యాత వారాంగానాధర్మశిక్షాదిసంభూత సమ్మోహితానేక రాజన్యసంఘాత వాచాలతాబద్ధ నానామహాభూత యేతెంచినీతిన్ విచారించి, బాలన్ మిళత్కుంతల వ్రాత ఫాలన్ గరాంభోజ రాజత్కపోలన్ సమందోష్ణనిశ్శ్వాసజాలన్ విపర్యస్తసంవ్యానచేలన్ మహందోల నప్రేంఖితస్వర్ణడోలన్, మృగేంద్రావలగ్నన్, దయావృష్టిమగ్నన్, మనోజాగ్నిభగ్నన్, నిరంధన్, బరిత్రస్తధమిల్లబంధన్, సముద్విగ్న మోహానుబంధన్ నిరాలాప నావర్జితాలేప నస్వీకృతానేకకేయూరహారన్, గళద్బాష్పధారన్ బరిత్యక్తలాస్యన్ బరాభూత లీలావయస్యన్ బదాలేఖనాలక్షితక్షోణిభాగన్ బరీక్షీణ రాగన్ విలోకించి, బుద్ధిన్ వివేకించి, లోనం బరాయుత్తయై, చిత్తజాతాసి ధారాచలచిత్తయై, విన్నయై, ఖిన్న్యై, యున్న భావంబుభావించి, నెయ్యంబు

తల్లి కూఁతునకుఁ గులవృత్తి ధర్మములను బోధించి రాజుపై వలపును వారింపఁజూచుట

గావించి, రావించి 'బాలా! జడత్వంబు మేలా, వినోదింపవేలా, విచారింపనేలా, వివేకింపకేలా వయోధర్మముల్ రిత్తగాఁ బుచ్చునీ వృత్తికిన్ మెత్తురే, వత్తురే కాముకుల్డాయఁగాయంబు విద్యున్నికాయోపమేయంబు హేయంబు ప్రాయంబు ధారాధరచ్చాయ మెన్నెనుపాయంబులన్ విత్తమాయత్తంఉంజేయుమా. రిత్తవారంబు నేరంబుగా దీవిచారంబు వంశనుచారంబు, సంసారసారంబు, లాభాధికారంబు, చర్చింప నీకున్నలంకారమే కాన ధిక్కారముం జేయరా దీ వికారంబు లేలే, శుభాకార యేలే, గుణోదార యేలే, కులోద్ధార యేలే, తటిద్దేహ యేలే, వరారోహ యేలే లలాటాలకవ్యూహయేలే, మహోత్సాహ యేలే, విరాజన్ముఖాభోజ యేలే, మహోరోజ యేలే, కలాలాప యేలే, జగద్మోహనరూప యేలే, చలచ్చంచలాలోకనవ్రాత యేలే, నయోపేత యేలే, మహామర్మభేదంబులై సుప్రసాదంబులై కౌముదీమూలకందంబులై మందమందంబులై చూద నందంబులై, మోహనశ్రీవిలాసంబులై యున్న నీచారుహాసంబులన్ సోలియోలిన్ భుజంగాలి బాళింబడదార్చుటో;  కాక, లోలంబులై, మోహజాలంబులై, కాము బాణంబులై, యప్రమానంబులై, మీనశోభంబులై, చంచలాంబులై, మోహితాశేషలోకంబులై యొప్పు లీలావలోకంబులన్ బ్రౌఢలోకంబులన్ సద్వివేకంబులం బాపితాపాతిరేకంబులం గూర్చుటో; కాక, రాజత్రిలోకీవశీకార మంత్రంబులై, యుల్లసత్కామతంత్రంబులై, దర్పకోద్రేకయంత్రంబులై, ంఓహవారాసిభంగంబులై, సూచితానేక నర్మప్రసంగంబులై, కాముకేళీకలాపంబులై, యొప్పు నీభాసమానానులాపంబులన్ విత్తవల్లోక చిత్తంబులన్ రాగమత్తంబులంజేసి త్తన్నిమిత్తంబులన్ నిత్యమున్ విత్తమెల్లం బ్రమోషించి దూషించి భర్జించి తర్జించుటో; కాక, తోరంబులై, మధ్యభారంబులై, నిర్జితానంగసౌధోపరి స్వర్ణకుంభంబులై యొప్పు నీ విప్పు వక్షోజకుంభంబులం జూపి పౌరావళిన్ నర్మలీలా కురంగావళింజేసి నిర్జించి వర్జించుటో; కాక, నీ కీ కులాచారముల్ మాన నే కీరసల్లాప భోదించెనో! నేడు నాతోడు నాతోడ నాతోడ మాటాడుమా. చూడుమా కన్యకాలోక చింతామణీ, గోత్రరక్షామనీ, ధీమణి, ఎవ్వ రెవ్వాని భూషించిరే, ఏమి భాషించిరే, నేఁడు నీతోడ భాసించు ప్రోడల్ కుమారీ! కుమారాన్నపో తావనీనాథ సూమన్ వధూచిత్త విత్తాపహారవధానున్ సదాదాన విద్యానిరూఢున్ మనోజాత హృద్యానవద్యైక విద్యావలిడున్ ప్రభాభాను, రాగానుసంధాను, మయూరమానాథు సర్వజ్ఞసింగక్షమానాథు నీసన్నిధానంబునం జెప్పిరో, ఏమి వాతప్పిరో, అప్పరో, అప్పయోజాతగంధుల్ సుగంధుల్ పురిన్ నీవయస్యల్ మహాసౌమన్స్యల్ సువర్ణా, సువర్ణంబు లార్జించుటల్ చూడవా. చూడ వాంచింతురా రాజులన్ వారలారాజులం గానరా. రాజుఁ గామింతురా, రాజబింబాననా! రాజరాజాధి రాజోన్నతిన్ రాజులన్ మించి రాజిల్లు నారాజు వంచింప నెంచంగ శోభిల్లునే, చెల్లునే, భూమి నీజాతి యేనాతి యీరీతిఁ బ్రీతిం బ్రకాశించి రాజిల్లునే, చెల్లదే నీ పటుత్వంబు వాచా కటుత్వంబు, బాలేంద్రుశోభాలికా! బాలికల్ సేయు యత్నంబులే నీప్రయత్నంబు? లంభోజనాళాంతరాళ స్ఫురత్తంతుయోగంబునం జిక్కునే గంధనాగంబు? కంపించునే మక్షికాపక్ష విక్షేప వాతాహతిం గాంచనాగంబు? మిథ్యామమత్వంబులన్ రంజకత్వంబులన్ గూఢయంత్రంబులన్ మోహమంత్రంబులన్ మారుతంత్రంబులన్ కిక్కఁడే. చొక్కఁడే దిక్కులం జిక్కులంబెట్టు మేధన్ మహావేధనైనన్  విరోధించి వాకట్టు, నీతిన్ బలారాతిమంత్రిం బ్రమోషించు, భాషావిషేషంబులన్ శేషుతోనైన భాషించు, మాయావిధానంబులన్ మాధవున్ మెచ్చఁ, డచ్చోట నెప్పాట మెప్పించెదే. చీటికిన్ మాటికిన్ బోటి యామేటి యిచ్చోటికిన్ రాఁడు పాటించి. నీపాటిపాఠీననేత్రల్ ధరిత్రీశుచిత్తంబు మత్తంబుగాఁజేయఁగాఁ జాలరే. ఏల రేలుంబగళ్ళున్ విచారంబు? చాలింపవే. వారావేశ్యాభుజంగుండు గాఁడే; మహారాయవేశ్యా భుజంగుండు నిన్నేలయేలున్? పరస్త్రీలకున్ వేళ యీఁడెన్నఁడున్. దత్తుఁ బాంచాలు భద్రున్ మరుంగూచిమారున్ వినం గోరవుం జీరవుం జేర వీరీతి నేనాతిచేవింటివే యింటి నీవంటి దీవెంటలం దంటయై గెంటిపోఁ? దమ్మిజంటీ, నునుంగంట యీవెంతకా? హా! కనుంఒంటినీగొంటు చెద్యంబు. దైవంబు క్రేఁగంటి కేనెంత కంటైతినో! జంట నింటింటికిన్ వెంటం వెంటం బడన్ బంటనే? దాఁట నింటిన్, జేనంటీ! చిరంటీ గుణంబేటికే? మాయలాఁడే విభుండైనఁబోఁడే వినోదింపనీఁడే నిమగ్నుండు గాఁడే మముం జేరనీడే నినుంజేరరాఁడే ప్రవేశింపరాదే ప్రమోషింపఁగాదే. ప్రవర్తింతు వెచ్చొట నచ్చోటి కేమేఁ బ్రియంబాడరామే నినుంబాయలేమే. మహోపాయవై కన్యకా! ధన్యునన్యున్ మదిం గోరుమా, చేరుమా. చేరుమా కిష్టముల్. వీటలేరేమగల్ చేరరారేనినుం గోరి తారే విహారేహులై గేహళీవాటికిన్ మాటికిన్ వచ్చు నేవారి నీవారిఁగాఁ జూడవున్ గూడవున్. వారిజామోద! యీవార రామల్ మనోరాములన్ రిత్తపోరాములంగాని నిక్కంపుఁ బోరాములం జేసి గారాములం జిక్కరే. చొక్కిరే. వారు వారాదికృత్యంబులం జేయవారక్రియల్ చెల్లవే. తల్లి రాజుల్ బహువ్యాజులే భోజులే చంచలచ్చిత్తులే మత్తులే ప్రేరకాయత్తులే నూతనాసక్తులే లోభసంయుక్తులే దోషసంసిక్తులే రంధ్రసంపాదులే వీతమర్యాదులే. వారి సేవింపఁగా రాదులే, కాదులే, వాదులేలా, నవైలాలతాదేహ! సందేహమే దేహమేలే నలంపన్, నిలింపాంగనాభా! సునాభ! మదిన్ మానవే మనవేశాభిలాషంబులన్. నిన్ను లేమా! భరింపంగలేమా? కరంగింప లేమా నరేశున్ జితశ్రీసురేశున్. గతిశ్రీజితోద్దండ వేదండ! మాదండ నేదండముంజెందదే. రాచదండంబు గండంబు పుండ్రేక్షు కోదండ విబ్రాజితభ్రూయుగా! భూమిపాలావరోధంబు లో సన్నిరోధంబు నీకున్ మహాభద్రమా? భద్రమాతంగకుంభస్తనీ! కన్నవారంబుగా మాహితాదేశముల్ సేయఁగా మాకు ధర్మంబు. కామాశుగాలోకనా! ఏల కామాతురత్వంబునుం జెంద, రామా! భవత్సంగతిన్ మున్నుగామా, త్రిలోకాభిరామాంబరానేకహేమాదులున్ నీకునీమా. కులోత్తంస! నే మాకులత్వంబునుంబొంద మామాట లేపాట వేమాటులాలింపువారిన్ నిరీకింపకీమానవాధిశుపై మానసంబేల పట్టించెదే. ముద్దుపట్టీ, భవచ్చాతురిం బట్టి సర్వజ్ఞ్సింగ క్షమానాథుఁ దప్పించి దర్పించి లోకత్రయిన్ నీకునర్పింతునే. మారునిం జారుఁ గావించి రప్పింతునే. బ్రాఁతియేపైడి? నాపైఁడి! ఏపైఁడిలేదింటిలో? వింతివా రాచపోరామి యిట్టిట్టుఁ బోరామికిన్ మూలమే. మేలమే? ఇందునవ్యారవిందాననా! ముందు విందాననే లాట కఋణాట పాంచాల బంగాళ చోళాది రాజన్య కన్యల్ వయోరూప ధన్యల్ సదాసక్తలై దాసి యున్నారటే. రారటేపాసి. తత్పాదరాజీవసందర్శ నారంభ సంరంబులై వీతహృద్దంభులై కుంభినీశుల్ బహూపాయనద్రవ్యహస్తుల్ ప్రశస్తుల్ హమాభక్తి నక్తందివంబుల్ ప్రవేశించియున్నారు. కన్నారు విన్నారు లోకుల్. వరాలోక నీకేల లీలావకాశంబు సిద్ధించు? సిద్ధించెనా మన్మథాకారుతోఁ గూడి క్రీడింపఁగాఁ బోలదే. వానివాణిన్ తద్భాహుపీఠిన్ దిశాకుంభి కుంభీన సాగేంద్ర కూర్మాదులం బాసి కూర్మిన్ విలోకంబులన్ లచ్చి వర్తించునే. దిక్కులందెల్లఁగీర్తుల్ ప్రవతించునే. దుర్లభుండే! బహుప్రేయసీవల్లభుండే! సదైకానుషంగంబు భంగంబు పణ్యాంగనాజాతికిన్ నీతికిందప్పితేఁజెప్పితిం గూన! సిద్ధంబు తద్ధాతమున్ వారభామాతనూజాతకున్ నేతగా మాతనూజ్జాత గావించె. నిర్ణీతమే యేతదర్థంబు మర్యాద నిమ్మేదిన్ వారమే నాదినుండిం బ్రయోగింతునే దాదినై. కామశాస్త్రాదివిద్యాసమేతన్ భన్మాత నుద్దామమాయాప్రభూతన్ గురంగీవిలోకా నిరంగీకృతుల్ మాని నామాట నీమాటు పాటింపవే. నందనీ! నిందనీయంబు గాదే. మహానందనీయంబుఁ జిత్తంబులోనందనీవే. జనానందనీయా! కఠోరాచలవ్రాత కాఠిణ్యమున్ డింప, రత్నాకరశ్రేణిలోఁతున్ నివేదింప, విత్తేశుగేహంబునున్ రిత్తసేయన్, జగచ్చక్షువుం గన్నుమూయన్, సదాగామినాఁకట్ట, నుద్యద్భుజంగావలింబట్ట, వారాంగనాజాతికిన్ న్యాయమే.మామకన్యాయసంపన్నవై పన్ని యోకన్య నీవన్యులన్ బౌరసంపన్నులన్ భిన్నులన్ ఖిన్నులన్ జేసి మన్మందిరాళింద భూమండలాసన్నులం జేయుమీ. రాచబిడ్డేటికే బిడ్డ! వాచాటతల్ సాఁగవే. సాఁగినన్ నీకు జూదంబులా, కాక వీణావినోదంబులా, గద్య పద్యానువాదంబులా, మాళవీముఖ్యరాగానుగానంబులా, దండలాస్యాది నృత్యవధానంబులా, ఇంద్రజాలాది మాయా విధానంబులా, వశ్యమంత్ర ప్రయోగోపసంహార విద్యావిచారంబులా, మందిరారామ వాటీలతాజాల మూలాభిషేక ప్రచారంబులా,హేమదోలావరోహంబులా, నీరజవాసవీచీసమూహావగాహంబులా, బంధుగేహప్రవేశంబులా,రాజహంసావళీ మందయానోపదేశంబులా, నీలకంఠావళీ నృత్యశిఖావిశేషంబులా, కాముకవ్రాతచిత్త ప్రమోషంబులా, బొమ్మరిండ్లాటలా, పాతలా, పాటలామోద, రాజోపకంఠానంబుల్ కఠోరాసిధారావలేహంబులే, సింహయోగంబులే, సర్పవాల్మీక భోగంబులే, శైలశృంగాగ్రవీథీ విహారావధానంబులే, తుంగతాళాగ్రకోటీతపస్సంవిధానంబులే, మత్తశార్ధూలకుంజ ప్రచారంబులే, సింధుమధ్యప్రతారంబులే, గంధశుండాల శుండావినోదంబులే, సప్రమాదంబులే, కొమ్మ, మాకొమ్మదే రాచసఖ్యం బసౌఖ్యంబు మేమొల్ల, మేమొల్లముల్ మాకులాభంబులే? డింభ కేవేళ నమ్మోము సొంపారు, నేవేళఁ బాలిండ్లు పెంపారు, నేవేళ ఫాలంబున గుంతల శ్రేణుల్లలాడు, నేవేళ మైదీఁగయున్ వీడు, నేవేళనాయాస మున్నూడు నంచు బ్రతీక్షింప నీ వంతవై యింతవై నేఁడు భూపాలుపాలై ప్రవర్తించుచోఁ గంబుకంఠీ, భవద్దర్శనోత్కంఠతన్ రాజగేహోపకంఠంబులన్ వచ్చునీవారి వారింతురే వారి దౌవారుకుల్ వారధర్మంబు వారంచు దుర్వారులై. తన్మహాగేహ నిర్యూహ సేవారతాయాత భూపాలక వ్రాత వేదండ గండస్థలీ నిస్సార ద్దానధరావళీ జాతజంబాల సంఘంబు దుర్లంఘనీయంబు మాకున్, మహాదుర్గమంబృ చొరన్ నిర్గమింపన్, మహోత్సాహవై వత్సా! మత్సాహసచర్యంబు కార్యంబు గైకొందు రమ్మంచు లెమ్మంచు వల్లించు తల్లిన్ ధనాదాన 

వారకన్య తల్లి పల్కు నిరాకరించుట

విద్యామతల్లిన్ విటస్వాంతభల్లిన్ నిరూపించి కోపించి బుద్ధింబ్రదీపించి ' అమ్మా! విననొల్లఁబొమ్మా, విచారించుకొమ్మా, భవన్నీతి దుర్నీతి, సన్మానుషం బింతయున్ లేని దుర్మానవశ్రేణి నీవేల యీవేలభూషించెదే? ఏమిభాషించెదే? ఏలనన్నుం బ్రమోషించెడే. రాయ చౌహత్తమమల్లున్ వధూటీ సరోజాతభల్లున్ మహారాజవేశ్యాభుజంగున్ హయనేకపగ్రామహేమాది నానామహాదాన చంగున్ వధూలోకపాంచాలు సర్వజ్ఞసింగక్షమాపాలుఁ గైకొంట తప్పే? కకుప్పాలసంకాశుఁడే. వాని యొప్పుల్ సతుల్ చెప్పఋఏ? ఏల నొప్పింప? మాతల్ తనూజాతలన్ జాతవిత్తాశలై యాశలం బేశలత్వంబు లే కర్నిలింబాసినారోటు? రారోటు రక్షారతిన్? గోర్రుకులీరోటు? నీవింత సెగ్గింప నెగ్గేమి గావించితిన్. లోకనిర్మాత నిర్మాతగాఁ జేయకేల సదురాత్మఁగావించె! విజ్ఞాతయోషా మనోవృత్త సంఘాతవున్, మాతవున్, గామసిద్ధాంత విఖ్యాతవున్, జూడ నేతద్దురాలాపముల్ చిత్తసంతాపముల్గాఁ బ్రయోగింతురే? కూఁతుఁ జింతానదిన్ ముంతురే? పిన్ననాఁడెల్ల నాఁడెవ్వరింగోరవే, చేరవే? మున్ను రంభోర్వశీమేనకాదుల్ సుకందర్ప సిద్ధాంతవేదుల్ వశీకార విద్యాధురీణుల్ ప్రవీణుల్ వరశ్రేణి నూహింపరే! చూచి మోహింపరే! వార లూహింపరే నీతులన్?  నిర్దయాలాపవైపాపవై పాపవేల మనోజవ్యథన్? నిన్ను నేమందు? నేమందులన్ మానదే మానసత్త్వంబు. చింతింపుమవ్వా! విభుండేమి దవ్వా? ఎఱిగించి రప్పించెదో, కాక, కామానలజ్వాలకున్ నన్ను నొప్పించెదో! ఇంత ఱంతేల నీకుం గొఱంతేలసద్ద్రావ్యముల్. తల్లి నే నెల్లవేళన్ మనోజాజ్ఞిచేఁ గంది లోఁ గుందగా మ్రంద, వీమందటల్ చాలు ముందేటికిం గంటివే? కెంటసంబేల ఘంటాభవై మ్రోసెదే? అన్యకుం గన్యఁగానైతి. ఉద్దామశృంగారుపై దీనమందారుపై భూమిభృద్గాయగోవాళుపైఁ గామినీలోలుపై రాయశుండాలహర్యక్షుపై రాయకందర్ప ఫాలాక్షుపై రాయగోపాంగనాబృందగోవిందుపై సంతతానందుపైఁ బోచమాంబాలసద్గర్భ సంజాతుపై లోకవిఖ్యాతుపైఁ బాదపీఠాంకితారాతిభూపావళీపాలుపై, సింగభూపాలిపై వ్రాలి, నాచిత్త మున్మత్తమై సోలి, కామానలాయుత్తమై రాదు తేరాదు. నే నామరుండైన గౌరీవరుండైన వాణీధరుండైన లక్ష్మీవిభుండైన దేవప్రభుండైన నన్యున్ మదిం గోరఁగా నొల్లనే. ఉల్లసత్ఫుల్లమందార రాజన్మరందంబు నదంబునం గ్రోలు మత్తాళిదుత్తూరముం గోరునే? హేమరాజీవరాజీరజోరాజితాకాశ గంగానదీలోల కల్లోల డోలాచల ద్రాజహంసంబు శైవాలజంబాల గండూపదీభేకభేకీ ఢులీ సంకులాసార కాసారముం జేరునే? మండితాఖండలానీత జీమూత నిర్యత్పయోధారలంద్రావుసారంగి కుంభంతరాంభఃప్రపూరంబులం ద్రావునే? మాధవోజ్జాత చూతాంకురస్వాదలీలాలసత్కోకిలేంద్రంబు ఝుల్లీరవక్రూర భిల్లాతకీశాఖకుం బోవునే? సింగభూపాలబాహా పరీరంభ సంరంభ సంజాత సంతోషముం గోరు యోషాశిరోరత్న మాశించునే నీచసంభోగ మంబా! కుతర్కావలంబా! చలంబా! విలం బానులాపంబులన్ బాలసూర్యభూనిం బాయనాడన్. పురోభాగినీ! భోగినీ రాజుకంటెన్ మహాభాగు, నాభాగ సౌభాగ్య శోభాగరిష్ఠున్, వరిష్ఠుం బ్రవేశించి నీతిం బ్రకాశించి, నృత్తవధానంబులన్ మంజుగానంబులన్ జిత్తమార్జింతునే. విత్తమున్ లేమి వర్జింతునే. ఎట్టిదిన్ విత్తమే రిత్తమై యేటికే? నిత్యదంభా! దురారంభయుక్తిం బ్రమోషింప విద్వేషినే? ఏలనే గోలనే బాలనే, మానలెనే నరధీశచూడామణిన్, వారకన్యా జనగ్రామణీ, పాపజాతీ! భవజ్జాతి దుర్జాతి పొ ' మ్మంచు ' లె 'మ్మంచు 'నోచెల్లనేఁజెల్ల రేచెర్లగోత్రోద్భవున్ మానలే ' నంచు ' నాయన్నాలా, యన్యులం జేరబో ' నంచు హృద్భల్లితో వక్రవాగ్భిల్లితోఁ దల్లితో మాటఁ జాలించి ధైర్యంబు గీలించి సంజాత శాతోదరిన్ సోదరిం జూచి 

వారకన్య సోదరిని దనవెత దీర్ప వేఁడుట

'అక్కా! ప్రసూనాస్త్రుధిక్కారముం జూచితే నేడు రాకేందుతాకం దురాకంపముం బొందె డెందంబు. చైతన్య సంచాలియై కీలియై గాలి ఏతెంచె. కోదండియై, తూణియై, బాణియై, కంపిత ప్రాణియై, కాముకారాతి తోఁతెంచె. వాసంతవేళా రమాకంద మాకందశాఖావళిం గోకిలారావకోలాహలంబుల్ విటస్వాంతహాలాహలంబుల్ దిశల్ మించి యేతెంచెనే. నేఁడు బాలామనోతంతుతోఁ గంతుతో, సింగభూమీశుతో, భోగదేవేశుతో, న న్ని వేదింపవే. కాము సంతాపమున్ డింపవే డింపి 

వారకన్యసోదరి దానివలపును సింగరాజునకుఁదెలిపి కావవేఁడుట.

పుణ్యంబునం బోఁగదే, రాఁగదే, లేగదే, వేగదే ' యంచుఁజింతించు నాత్మానుజాతందనూజాతశంకాసమేతం గృశీభూతఁగమ్గెంచు ' బాలా! లలాటాక్షు సేవింపుమీ, రాహుభావింపుమీ, శేషభోగిం బ్రకర్షింపుమీ, చంపకశ్రేణి వర్షింపుమీ ' యంచుభీతిన్ నివారించి నీతిన్ విచారించి యారామ యారామసౌధంత రాళస్థలిన్ నర్తనాగారవేదికన్ మణిస్వర్ణ పర్యాంకికా భాసమానున్, మనోభూసమానున్, ఘనున్, రావుసింగక్షమానాధపౌత్రున్, సమీచీనరేచర్లగోత్రంబు సంజాతమిత్రున్, మహోదారచారిత్రు, సర్వజ్ఞసింగోర్వరాధ్యక్షు నీక్షించి దండప్రణామంబు సాపేక్షఁ గావించి హస్తాబ్జముల్ మోడ్చి ' దేవా! భన్న్యస్త సౌజన్య ధన్యన్, జగన్మాన్యఁ, గన్యన్, నిరన్యాంకపీఠాధిరోహన్, నిరన్యోపగూహన్, నిరన్నాభిలాషన్, నిరన్యాభిభాషన్, నిరన్యావకాశన్, నిరన్యప్రకశన్, బ్రసూలోచనక్షిప్తభాష్పంబుపూరన్, మనోజాతబాణావళీ శంకితప్రాణభారన్, సఖీమానసన్యస్త చింతాసమూహన్, భగిన్యంక సం

సింగరాజు వారకన్యనుజేపట్టీ భోగినిఁగాఁజేయుట

ప్రాపితానేకదేహన్, భవద్వైభవాకృష్టచిత్తన్ బరాయుత్త వృత్తన్ గృపం జూడు ' మంచు ప్రశసింప నాభోగదేవేంద్రుఁ దా సత్యభాషా హరిశ్చంద్రుఁ డాకామినీలోకపాంచలుఁ డాసింగభూపలుఁ డాబాల నాబాలశీతాంశుఫాలన్, సరోజతహస్తన్, బ్రశస్తన్, శుకాధీశవాణిన్, లసన్నీలవేణిన్, మృగేంద్రావలగ్నన్, మనోకాగ్నిమగ్నన్, దయదృష్టి రావించి భావించి నెయ్యంబుగావించి బాహాపరీరంభసమ్రంభనిర్ముక్త సంతాపఁ గావించి కందర్పకేళిన్ వినోదించి సద్భోగినింగాఁ బ్రసాదించి తన్మాత నుద్యద్గజారూఢఁ జేయించి విఖ్యాతి మ్రోయించియిష్టంబు లిప్పించి యొప్పెంగడున్.

ఉ: పండితకీర్తనీయుఁ డగుబమ్మెరపోతన యాసుధాంశుమా
ర్తండకులాచలాంబునిధితారకమై విలసిల్ల భోగినీ
దండకమున్ రచించె బహుదానవిహర్తకు రావుసింగభూ
మండలభర్తకున్ విమతమానవనాధమదాపహర్తకున్

Friday, July 13, 2012

బమ్మెర పోతనామాత్య కృత "నారాయణ శతకం" - Part 2


మ. పసులంగాపరి యేమెఱుంగు మధురప్రాయోల్లాసద్వృత్తవా
గ్విసరారావము మోవిదా వెదురు గ్రోవిం బెట్టి నాఁడంచు నిన్
గసటుల్ సేయఁగ నాఁడు గోపికల తద్గానంబులన్ మన్మథ
వ్యసనాసక్తలఁ జేయుచందములు నేవర్ణింతు నారాయణా

మ. జడియొంతేఁ దడవయ్యె జెయ్యియలసెన్ శైలంబు మాచేతులం
దిడుమన్నన్ జిరునవ్వుతో వదలినన్ హీనోక్తిగీపెట్టనె
క్కుడుగోవుల్ బ్రియమంద నింద్రుఁ డడలంగోవర్ధనాద్రీద్రమున్
గొడుగైయుండగఁ గేలఁబూనితిగదాగోవింద నారాయణా

మ. లలితాకుంచితవేణి యందడవి మొల్లల్ జాఱ ఫాలస్థలిన్
దిలకం బొయ్యనజాఱఁ గుండలరుచుల్ దీపింపలేఁ జెక్కులన్
మొలకన్నవ్వుల చూపులోరగిల మేన్మువ్వంకన్ బోవఁగ
నలిగైకొందువుగాదె నీవు మురళీనాట్యంబు నారాయణా

శా. మాపాలం గడుగ్రొవ్వి గోపికలతో మత్తిల్లి వర్తింతువే
మాపాలెంబుల వచ్చియుండుదు వెసన్మాపాలలో నుండుమీ
మాపాలైన సుఖాబ్ధిలో మునుగుచున్ మన్నించి తాగొల్లలన్
మాపాంగల వేల్పు నీవెయని కా మన్నింతు నారాయణా.

మ. ఒక కాంతామణి కొక్కడీవు మఱియున్నొక్కరై కొక్కండవై
సకలస్త్రీలకు సంతసంబలర రసక్రీడతన్మధ్య క
ల్పకమూలంబున వేణునాదరస మొప్పంగా, బదార్వేలగో
పికలంజెంది వినోద మొందునెడ  నీపెంపొప్పు నారాయణా

మ. లలితంబైన భవత్తనూవిలసనన్ లావణ్యదివ్యామృతం
బలుఁగుల్వారఁగ నీకటాక్షమునఁ దామందంద గోపాంగనల్
తలఁపుల్పాదులుకట్టి కందళితనూత్న శ్రీలు వాటింతురా,
నెలతల్ తీవెలు చైత్రవిస్ఫురణమౌ నీయొప్పు నారాయణా

శా. లీలన్ బూతకిప్రాణవాయువులు పాలిండ్లందు వెళ్ళించి దు
శ్శాలుండై చనుబండిదానవు వెసంజిందై పడందన్ని యా
రోలన్మద్దులు గూల్చి ధేనుదనుజున్ రోఁజంగ నీల్గించి వే
కూలం గంసునిఁగొట్టి గోపికలకోర్కుల్ దీర్తు నారాయణా

మ. రసనాగ్రంబున నీదునామరుచియున్ రమ్యంబుగాఁ జెవ్లుకు
న్నసలారంగ భవత్కథాభిరతియున్ హస్తాబ్జ ముగ్మంబులన్
వెసనీపాదసుపూజితాదియుగమున్ విజ్ఞాన మధ్యాత్మకున్
వెస నింపొందనివాఁడు దాఁ బశువు సూవేదాత్మ నారాయణా

మ. వరకాళిందితరంగడోలికలలో వైకుంఠధామంబులో
వెరవొప్పార నయోధ్యలో మధురలో వ్రేపల్లెలో ద్వారకా
పురిలో నాడెడు భంగి నాదుమదిలో భూరిప్రసన్నాననాం
బురుహం బొప్ప నటించుటొప్పును సితాంభోజాక్ష నారాయణా

శా. చల్లల్వేఱొకయూర నమ్ముకొను నాసంబొవుచోఁ ద్రోవ నీ
వుల్లాసంబున నడ్డకట్టి మదనోద్యోగానులాపంబులన్
చల్లన్ జల్లనిచూపు జల్లుమని గోపస్త్రీలపైఁ జల్లు మీ
చల్లంబోరు తెఱంగు జిత్తమున నే జర్చింతు నారాయణా

మ. కలయన్వేదములున్ బురాణములు బ్రఖ్యాతంబుగా తెల్పి మీ
వలనన్ భక్తిహీనుఁడైనపిదపన్ వ్యర్థప్రయత్నంబెపో
గులకాంతామణి గొడ్డువోయినగతిం గ్రొవ్వారు సస్యంబు దా
ఫలకాలంబున నీచపోవుపగిదిన్ పద్మాక్ష నారాయణా

శా. స్నానంబుల్ నదులందుజేయుట గజస్నానంబు చందంబగున్
మౌనంబొప్ప జపించువేదమటనీ మధ్యంబులో నేడ్పగున్
నానాహోమములెల్ల బూడిదలలోన న్వేల్చునెయ్యై చను
న్నినామోక్తియు నీపదాబ్జరతియున్ లేకున్న నారాయణా

మ. అలనీటందగు రొంపిపైఁ జిలికిన న్నానీట నేపాయు నా
యిలపాపంబులు దుర్భరత్వము మహోహేయంబునం బొందినం
బలువై జీవుని దొప్పఁ దోఁగినవి యీబాహ్యంబునం బాయునే
పొలియుంగాక భవత్సుపాదజలముం బ్రోక్షింప నారాయణా

మ. తనచిత్తాబ్జము మీపదాబ్జములకుం దాత్పర్య సద్భక్తితం
తున బంధించిన బంధనంబుకతనం దుష్పాపపుంజంబు లె
ల్లను విచ్చిన్నములై యడంగు మహిమోల్లాసాబ్ధియైనట్టి దా
సున కింపొందును మోక్షవైభవము దా సుశ్లోక నారాయణా

మ. తనువుం జీవుఁడు నేకమైనపిదపన్ ధర్మక్రియారంభుఁడై
యనయంబున్మది దన్నెఱుంగక తుదిన్నామాయచే మగ్నుఁడై
తనుతత్వాది వియోగమైనపిదపం దానేర్చునే నీదుద
ర్శన మింపారఁగ భక్తివైభవ మహాసంకాశ నారాయణా

మ. తనకున్ సాత్వికసంపదాన్విత మహాదాసోహ భావంబునన్
ననయంబున్మది నన్యదైనభజనం బారంగ దూలింపుచున్
జనితాహ్లాదముతోడ నీ చరణముల్ సద్భక్తి పూజించి నిన్
గనుగొన్నంతనె కల్మషంబు లడఁగుం గర్మఘ్న నారాయణా

మ. పరికింపన్ హరిభక్తి భేషజునకున్ భవ్యంబుగా మీఁద మీ
చరణాంభోరుహ దర్శనంబు గలదే సంప్రీతి నెట్లన్నఁ దా
ధరలోఁ జోరుఁడు గన్న దుస్తర పరద్రవ్యంబుపై నాశలం
బొరయన్నేర్చునె దుర్లభంబగు గృపాంభోజాక్ష నారాయణాఉ

మ. పరమజ్ఞాన వివేక పూరిత మహాభవ్యాంతరాళంబునన్
పరగ న్నీ నిజనామమంత్ర మొనరన్ భక్తిన్ననుష్ఠింపుచుం
దురితాన్వేషణ కాలభూతము వెసన్ దూలంగ వాకట్టు వాఁ
డరుగున్ భవ్యపదంబు నొందుటకునై యవ్యక్త నారాయణా

మ. సరిఘోరంధక బోధకారణ విపత్సంసార మాలిన్యమున్
పరమానంద సుబోధకారణ లసద్భస్మంబు పై నూఁది యా
నిరతజ్ఞానసుకాంతి దర్పణమున న్నిస్సంగుఁడై తన్నుదా
నరయం గాంచిన వాఁడు నిన్నుఁ గనువాఁడబ్జాక్ష నారాయణా

మ. పరుషాలాపములాడ నోడి మదినీపాపార్జన నారంభుఁడై
నిరసించేరికిఁ గీడుసేయక మది న్నిర్ముక్త కర్ముండునై
పరమానంద నిషేధముల్ సమముగా భావించి వీక్షించునా
పరమజ్ఞాని భవత్కృపం బొరయ నో పద్మాక్ష నారాయణా

మ. ఒరులం దన్ను నెఱుంగు నియ్యెఱుకయు న్నొప్పార నేకాంతమం
దరయంబైపడు నన్యభామినులపై నాకాంక్షదూరత్వమున్
మరణావస్ఠను నీదునామములె సన్మానంబునం దోఁచుటల్
ధరలోన న్నివి దుర్లభంబులు సుధాధామాక్ష నారాయణా

మ. వెరవొప్ప న్బహుశాస్త్రమంత్రము లొగి న్వీక్షించి వేతెల్పిమీ
వరనామామృతపూర మానుచుఁ దగన్ వైరాగ్యభావంబునన్
సరి నశ్రాంతముఁ గోరువారు పిదపన్ సంద్సారమాతుఃపయో
ధరదుగ్ధంబులు గ్రోలనేరరు వెసన్ దైత్యారి నారాయణా

శా. వేదంబందు సునిశ్చయుండగు మహా వేల్పెవ్వఁడో యంచు నా
వేదవ్యాసపరాశరుల్ వెదకిన న్వేఱొండు లేఁడంచు మీ
పాదాంభోజము లెల్లప్రొద్దు మదిలో భావింతు రత్యున్నతిన్
శ్రీదేవీ వదనారవింద మధుపా శ్రీరంగా నారాయణా

మ. సుతదారాప్తజనాది విత్తములపై శూన్యాభిలాషుండునై
యతనోద్రేకయుతంబులై పొదలునయ్యై యింద్రియవ్రాతముల్
మృతిఁబొందించి దమంబునన్ శమమున్ మీఱంగవర్తించు ని
ర్గతసంసారి భవత్కృపంబొరయ నో కంజాక్ష నారాయణా

మ. ప్రమదం బారగఁ పుణ్యకాలగతులన్ భక్తిన్ననుష్ఠింపుచున్
నమర న్నన్న సువర్ణగోసలిల కన్యాధారుణిగ్రామదా
నము లామ్నాయవిధోక్తి భూసురులకున్ సన్మార్గుఁడై యిచ్చువాఁ
డమరేంద్రార్చిత వైభవోన్నతుఁడగు న్నామీఁద నారాయణా

మ. ఇల నెవ్వారిమనంబులో నెఱుకదా నెంతెంత గల్గుండునా
కొలదింజెంది వెలుంగుచుందు కలయన్గోవింద నీరూపులన్
యలర న్నంబు మితంబులై సరసిలో నంభోరుహంబుల్ దగన్
నిలనొప్పారెడుతందమొందెదెపుడు న్నీలాంగ నారాయణా

మ. మదిలో నుత్తమభక్తి పీఠముపయిన్ మానాథ మీపాదముల్
గదియం జేర్చినవానికేనొడయఁడన్ గాదంచు సత్యున్నతిన్
పదిలుండై సమవర్తి మృత్యువునకున్ బాఠంబుగాఁ బల్కు మీ
పదపద్మార్చకు లెంతపుణ్యులో కృపాపారీణ నారాయణా

మ. కులమెన్నంగొలదేల యేకులజుఁడుం గోత్రాభి మానాభిలా
షలు నజ్ఞానము బాసి జ్ఞానము మదిన్ సంధించి శుద్ధాత్ముఁడై
యలరారం బరుసంబుసోఁకు నినుమున్ హేమాకృతస్తోమమై
వెలయు న్నాగతి వాఁడుముక్తికరుగున్ వేదాత్మ నారాయణా

మ. నిరతానందనియోగులై నియతులై నిర్భాగ్యులై నీచులై
కరుణాహీనమనస్కులై మలినులై కష్టాత్ములై నష్టులై
పరుషవ్యాధినిబద్ధులై పతితులై భగ్నంగులై మ్రగ్గువై రరయ
న్నిన్నొగి నాత్మయుం దిడనివా రబ్జాక్ష నారాయణా

మ. ఘనభోగాస్పదులై గతౌఘమతులై కారుణ్యలై ముక్తులై
ధనకీర్తిప్రదులై దయాభిరతులై ధర్మాత్ములై నిత్యులై
మనుజాధీశ్వరులై మనోజనిభులై మాన్యస్థులై స్వస్థులై
యొవరన్నొప్పెడువారు నీపదరుచుల్ యూహించు నారాయణా

మ. విదితామ్నాయ నికాయభూతములలో విజ్ఞానసంపత్కళా
స్పదయోగీంద్ర మనస్సరోజములలో బ్రహ్మేంద్రదిక్పాలక
త్రిదశవ్రాతకిరీటరత్నములలో దీపించుచున్నట్టి మీ
పదపద్మంబులు భావగేహమున నే భావింతు నారాయణా

మ. వెలయన్ యౌవనకాలమునందు మరుడుఁన్ వృద్ధప్యకాలంబునన్
బలురోగంబులు నంత్యమందు యముఁడుం బాధింపఁనట్లైన యీ
పలుజన్మంబులు చాలదూలితి ననుం బాలింపవే దేవ మీ
ఫలితానంద దయావలోకనము నాపైఁజూపు నారాయణా

మ. బలుకర్మాయుత పాశబంధవితతిన్ బాహాపరిశ్రేణికిన్
జలయంత్రాన్వితబంధయాతనగతిన్ సంసారకూపంబులో
నలరం ద్రిమ్మరుచుండు నన్ను నకటా! యార్తుండనై వేఁడెదన్
వెలయ న్నీకృపచేతఁ జేకొనవె నన్ వేవేగ నారాయణా

మ. మమహంకారవికారసన్నిభ మహామత్తాది లోభాంధకా
రముచే ముక్తికి నేఁగుమార్గ మెఱుగన్ రాదింక నాలోన
విమలాపాంగదయాదివాకరరుచిన్ వెల్గింపు మింపార నో
కమలానంద విహారవక్షలలితా! కంజాక్ష నారాయణా

మ. పరిపంథిక్రియ నొత్తి వెంటఁబడు నప్పాపంబుఁ దూలించి మీ
చరణాబ్జస్థితిపంజరంబు శరణేచ్చం జొచ్చితిం గావుమీ
బిరుదుం జూడుము మీరు సూడఁగ భవధ్భృత్యుండు దుఃఖంబులం
బొరయ న్మీకపకీర్తిగాదె శరదాంభోజాక్ష నారాయణా

మ. సతతాచారము సూనృంతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్
నతి శాంతత్వము చిత్తశుద్ధి కరమున్ నధ్యాత్మయున్ ధ్యానమున్
దృతియున్ ధర్మము సర్వజీవహితముం దూరంబుగాకుండ స
మ్మతికిం జేరువ మీ నివాససుఖమున్ మానాథ నారాయణా

మ. భవనాసిన్ గయ తుంగభద్ర యమునన్ భాగీరథిం గృష్ణ
వేత్రావతి న్నర్మద పెన్న గౌతమి పయోరాశి న్వియద్గంగయుం
దవగాహంబున నైనపుణ్యములు బెంపారంగ నేఁ డిచ్చటన్
భవదంఘ్రీ స్మరణంబునం గలుగు నోపద్మాక్ష నారాయణా

మ. ధర గ్రామాధిపు నింటిదాసుఁడు వెసం దాద్రోహముం జేసినన్
పరగం జెల్లుట సూచితీ భువన సంపాద్యుండ వైనట్టి మీ
వరదాసావలి దానదాసినని దుర్వారౌఘముల్ జేసితిన్
కరుణంజేకొని కావుమయ్య త్రిజగత్కల్యాణ నారాయణా

మ. గణుతింపన్ బహుధర్మశాస్త్ర నిగమౌఘం బెప్పుడు న్ని న్న కా
రణబంధుండనిచెప్ప నతైఱఁగు దూరంబందకుండంగనే
బ్రణతుల్ జేసెదఁ గొంతయైన గణుతింపం బాడిలేకుండినన్
ఋణమానానుతి నీవు శ్రీపతివి నీకేలప్పు? నారాయణా

మ. కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై యీశ మీ
శరణంబన్నఁ గృశానుభాను శతతేజస్ఫూర్తియైనట్టి మీ
కరచక్రంబున నక్రకంఠము వెసన్ ఖండించి మించెం దయా
పరసద్భక్తభయానక ప్రకర సత్ప్రాకట్య నారాయణా

శా. ఏభావంబున నిన్ దలంచె గజయూధేంద్రుండు ఆపన్నుఁడై
యేభావంబున ద్రౌపదయ్యెడ రమాధీశా యనె న్వాయసం
బేభావంబున నీశరణ్య మనెనో యీనీకృపాదృష్టిచే
నాభావంబున నీతలంపుఁ గలుగ న్నాకిమ్ము నారాయణా

శా. నీలగ్రీవుఁడు చేతిపున్క విడిచె న్నీయింతి భిక్షంబునిన్
నీలగ్రీవుఁడు యీశ్వరాఖ్యఁ దనరె న్నీనామజప్యంబునన్
నీలగ్రీవుఁడు మించిత్రుంచెఁ బురముల్ నీ ప్రాపు సేవించినన్
నీలగ్రీవమఖాబ్జభాస్కరకృపానిత్యాత్మ నారాయణా

మ. నినువర్ణింపనివాఁడు మూఁగ మదిలో నీనామమున్ వీనులన్
విని మోధింపనివాండు చెవ్డుమరినిన్ వేడ్కన్ మనోవీధినిన్
గనిపూజింపనివాఁడు నాశకరుఁడౌ కర్మక్రియారంభుండై
తనలోఁ గాననివాఁడు నీచమతివో తత్వజ్ఞ నారాయణా

మ. నినువర్ణింపని నీచబంధమతి దానిర్మగ్నమూఢాత్ముఁడై
పెనుదైవంబులఁ గోరి తా మనమునన్ సేవించుచందంబుతా
ననలం బారిన భూతియందు వెలయ న్నాజ్యాహుతుల్ పూనివే
ల్చినచందంబున వ్యర్ధమై తనరు, జూచిద్రూప నారాయణా

మ. నిను వర్ణింపని జిహ్వదాఁబదటికా? నీలాభ్రదేహాంగకా
నినునాలింపనిచెవులు దాఁబదటికా! నీరజపత్రేక్షణా
నినుఁబూజింపని కేలు దాఁ బదటికా? నిర్వాహకక్ష్మాతలా
నినుఁ జింతింపనియాత్మ దాఁబదటికా? నిర్వాణ నారాయణా

శా. నీవేతల్లివి నీవేతండ్రి వరయన్నీవే జగన్నధుఁడౌ
నీవేనిశ్చలబాంధవుణ్డ వరయ న్నీవేమునిస్తుత్యుఁడౌ
నీవేశంకరమూలమంత్ర మరయన్ నీవే జగత్కర్తవున్
నీవేదిక్కను వారి వారలె కడు న్నీవారు నారాయణా

మ. అపరాధంబులు నిన్ను నమ్మి వినుమే నాజన్మపర్యంతమున్
విపరీతంబుగఁ జేసినాఁడనిఁక నీవేదిక్కు నాలోనికిన్
గపటం బింతయులేక దండధరుకుం గట్టీక రక్షింపుమీ
కృపకుం బాత్రుఁడనయ్య ధర్మపురిలక్ష్మీనాథ నారాయణా

శా. చెల్లంజేసితి పాతకంబులు మదిన్ శ్రీనాధ మీనామముల్
పొల్లుల్ బోవనినమ్మి పద్యశతమున్ బూర్ణంబుగాఁ జెప్పితిన్
చెల్లం బోనను నమ్మె వీఁడని దయం జేపట్టి రక్షింపుమీ
తల్లిందండ్రియు నీవుగాక యొరులో తర్కింప నారాయణా

మ. నరసింహాచ్యుత వాసుదేవ విక సన్నాళీకపత్రాక్షభూ
ధరగోవిందముకుందకేశవ జగత్త్రాతాహితల్పాంబుజో
దరదామోదరతార్క్ష్యవాహనమహాదైత్యారివైకుంఠమం
దిరపీతాంబరభక్తవత్సల కృపన్ దీపింపు నారాయణా

మ. కడకంట గడలేని సంపదలొగిం గావింపు లక్ష్మీశపా
ల్కడలిన్ బన్నగశాయివై  భువనముల్ గల్పించు సత్పుత్రినిన్
బొడమన్ జేసిన నాభిపంకజ జగత్పుణ్యాత్మ భాగీరథీ
పడతింగన్న పదార విందముల నే భావింతు నారాయణా

మ. తపముల్ మంత్రసమస్త యజ్ఞఫలముల్ దానక్రియారంభముల్
జపముల్ పుణ్యసుతీర్ధసేవాఫలముల్ సద్వేదవిజ్ఞానమున్
ఉపవాస వ్రతశీలకర్మ ఫలముల్ యొప్పార నిన్నాత్మలో
నుపమింపం గలవారికే గలుగు వేయిన్నేల నారాయణా

శా. శ్రీనారాయణా యన్నఁ జాలు దురితశ్రేణి న్నివారింపఁగా
నానందస్థితి గల్గునంచు నిగమార్థానేక మెల్లప్పుడున్
నానాభంగులఁ జెప్ప నేను విని శ్రీనారాయణా యంచు ని
న్నేనేనెప్పుడు గొల్తు బ్రోవఁగదె తండ్రీ నన్ను నారాయణా

మ. కలితాఘౌఘ వినాశకారి యగుచుం గైవల్య సంధాయియై
నలి నొప్పారెడు మంత్రరాజ మగు నీనామంబు ప్రేమంబునన్
అలరన్నెవ్వాని వాక్కునం బొరయదో యన్నీచుదేహంబు దా
వెలయన్ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ నారాయణా

మ. రమణీయంబుగ నాదిమంబు నవతారంబున్ భవద్దివ్యరూ
పము నామామృతమున్ దలంప దశకప్రాప్తయ్యెఁ గృష్ణావతా
రము సుజ్ఞానము మోక్షమున్ ద్వివిధసంప్రాప్తిన్ శతాంధ్రఖ్యకా
వ్యము నర్పించితి మీ పదాబ్జములకున్ వైకుంఠ నారాయణా

శా. నీమూర్తుల్ గన నీకథల్ వినఁ దుదిన్ నీపాదనిర్మాల్య ని
ష్ఠామోదంబు నెఱుంగ, నీచరణతోయంబాడ, నైవేద్యముల్
నీమంబొప్ప భజింప నీజపము వర్ణింపన్ గృపం జేయవే
శ్రీమించన్ బహుజన్మజన్మములకున్ శ్రీయాది నారాయణా

ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన నారాయణ శతకంబున 
సర్వంబును సంపూర్ణము.

Saturday, June 23, 2012

బమ్మెర పోతనామాత్య కృత "నారాయణ శతకం" - Part 1

శ్రీరమామణి పాణిపంకజ మృదుశ్రీతఙ్ఞ శృం గారాకారశరీర చారుకరుణాగంభీర సద్భక్తమం దారాంభోరుహపత్రలోచన కళాధారోరు సంపత్సుధా పారవారవిహార నాదురితంల్ భజింపు నారాయణా మ. కడకుం బాయక వెయ్యినోళ్ళు గలయాకాకోదరాధీశుఁడున్ గడముట్ట న్వినుతింపలేక నిగుడన్ గ్రాలంగ నొప్పారు మి మ్మడరన్ సన్నుతిసేయ నాదువశమే యజ్ఞాని లోభాత్ముడన్ జడుఁడన్నజ్ఞుడ నైకజిహ్వుఁడ జనస్తబ్ధుండ, నారాయణా. శా. నే నీదాసుఁడ నీవు నాపతివి నిన్నే కాని యెండెవ్వరిన్ ధ్యానింఫం బ్రణుతింప నట్లగుటకున్నానేర్చు చందంబునన్ నీనామస్తుతు లాచరించునెడల న్నేతప్పులుం గల్గినన్ వానిన్ లోఁగొనుమయ్య తండ్రు! విహిత వ్యాపార, నారాయణా. మ. నెరయ న్నిర్మల మైన నీస్తుతి కథానీకంబు పద్యంబులో నొరుగుల్ మిక్కిలి గల్గె నేనియుఁ గడు న్యోగంబె చర్చింపఁగాఁ గుఱుగణ్పైనను వంకబోయినఁ గడుం గుజ్జైనఁ బేడెత్తినం జెఱుకుం గోలకు తీపు గాక కలదే చే దెందు, నారాయణా మ. చదువుల్ పెక్కులు సంగ్రహించి పిదపంజాలంగ సుజ్ఞానియై మదిలోఁ బాయక నిన్ను నిల్పఁదగు నామర్మంబు నీక్షింపఁడే మొదలం గాడిద చారుగంధవితతుల్ మోవంగ శక్యంబె కా కది సౌరభ్యపరీక్ష జూడ కుశలేయవ్యక్త, నారాయణా. మ. లలిఁ గబ్బంబు కరాట మివ్వసుధ నెల్లన్మించెఁ బో నీకధా వలి కర్పూరము నించిన న్నితరమౌ వ్యర్ధార్థకామోదముల్ పెలుచం బూనినయక్కరాటము తుదిన్ బేతేకరాటంబెపో చలదిం దీవరపత్రలోచన ఘనశ్యామాంగ, నారాయణా. మ. ఘనమార న్నచలేంద్రజాధిపతికి న్మస్తాగ్రమాణిక్య మై మునికోపానలదగ్ధ రాజతతికి న్ముక్తిస్ఫురన్నార్గమై యెనయున్ సాయక శాయికిం జననియై యేపారుమిన్నేటికిం జనిమూలం బగు నంఘ్రి మాదుమదిలోఁజర్చింతు, నారాయణా శా. నీపుత్రుండు చరాచరప్రతతుల న్నిర్మించి పెంపారఁగా నీపుణ్యాంగన సర్వజీవతతుల న్నిత్యంబు రక్షింపఁగా నీపాదోదక మీజగత్త్రయముల న్నిష్పాపులం జేయఁగా నీపెం పేమని చెప్పవచ్చు సుగుణా నిత్యాత్మ, నారాయణా. శా. బ్రహ్మాండావలిలోన సత్వగుణివై బాహ్యంబునం దాదిమ బ్రహ్మాఖ్యం బరతత్వబోధములకున్ భవ్యాధినాథుండవై బ్రహ్మేంద్రామర వాయుభుక్పతులకున్ భవ్యాధినాథుండవై జిహ్మవ్యాప్తుల నెన్న నాదువశమే చిద్రూప, నారాయణా మ. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగసత్పుత్రియై వరుస న్నీఘనరాజసంబు నిజమై వర్ధిల్లు, నారాయణా మ. మగమీనాకృతి వార్ధిఁజొచ్చి యసుర న్మర్ధించి యవ్వేదముల్ మగుడందెచ్చి విరించి కిచ్చి యతని న్మన్నించి యేపారఁగాఁ బగ సాధించినదివ్యమూర్తివని నే భావింతు నెల్లప్పుడున్ ఖగరాజధ్వజ భక్తవత్సల ధగత్కారుణ్య, నారాయణా మ. అమరుల్ రాక్షసనాయకుల్ కడకతో నత్యంతసామర్ధ్యులై భ్రమరీదండము మందరాచలముగా బాథోనిధిం ద్రచ్చగా దమకించెన్ భువనత్రయంబును గిరుల్ దంతావళుల్ మ్రొగ్గినం గమఠంబై ధరియించి మించిన జగత్కల్యాణ, నారాయణా. శా. భీమాకారవరాహమై భువనముల్ భీతిల్ల కంపింపను ద్ధామోర్విం గొనిపోయి నీరధిలో డాఁగున్న గర్వాంధునిన్ హేమాక్షాసురు వీఁకఁదాకిఁ జయలక్ష్మిన్ గారవింపగ నీ భూమిం దక్షిణదంష్ట్ర నెత్తిన నినుం బూజింతు నారాయణా. శా. స్తంభంబందు నృసింహమై వెడలి యచ్చండాట్టహాసధ్వనుల్ దంభోళిం గడువంగ హేమకశి పోద్దండా నురాధీశ్వరున్ శుంభద్గర్భము వ్రచ్చి నానిసుతునిన్ శోభిల్ల మన్నించియ జ్జంభారాతిని బ్రీతిఁదేల్చిన నినుం జర్చింతు, నారాయణా. మ. మహియు న్నాకసముం బదద్వయపరీమాణంబుగాఁ బెట్టి యా గ్రహ మొప్పం బలిమస్తకం బొకపదగ్రస్తంబుగా నెమ్మితో విహరించింద్ర విరించి శంకరమహావిర్భూతదివ్యాకృతిన్ సహజంబై విలసిల్లు వామనల సచ్చారిత్ర నారాయణా. మ. ధరణిన్ రక్తమహాహ్రదంబు లెలమిం ద్రైలోక్య నిర్దిష్టమై పరగం బైతృక తర్పణంబుకొఱకై ప్రఖ్యాతిగాఁ దీవ్రతన్ నిరువయ్యొక్కటిమారు క్షత్రమరులన్నే పార నిర్జించి త త్పరశుభ్రాజితరామనామము కడున్ ధన్యంబు నారాయణా మ. వరుసం దాటకిఁ జంపి కౌశికు మఘస్వాస్థ్యంబు గావించి శం కరుచాపం బొగిఁద్రుంచి జానకిఁ దగం గల్యాణమై తండ్రి పం పరుదారన్ వనభూమికేఁగి జగదాహ్లాదంబుగా రావణున్ ధరణింగూల్చిన రామనామము కడున్ ధన్యంబు నారాయణా. మ. యదువంశంబునఁ గృష్ణు కగ్రజుఁడవై యాభీల శౌర్యోన్నతిన్ మదవద్ధేనుక ముష్టికాద్యసురులన్ మర్ధించి లీలారసా స్పదకేళీరతి రేవతీవదన కంజాతాంతబృంగంబనన్ బిదితంబౌ బలరామమూర్తివని నిన్ వీక్షింతు నారాయణా మ. పురముల్మూడుఁను మూఁడులోకములు నేప్రొద్దు న్విదారింపఁ ద త్పురనారీ మహిమోన్నతుల్ సెడుటకై బుద్ధుండవై బుద్ధితో వరబోధద్రుమ సేవఁజేయుటకునై వారిం బ్రబోదించియ ప్పురముల్ గెల్చిన మీయుపాయము జగత్పూజ్యంబు నారాయణా మ. కలిధర్మంబునఁ బాపసంకలితులై గర్వాంధులై తుచ్చులై కులశీలంబులు మాని హేయగతులం గ్రొవ్వారు దుష్టాత్ములం బలిగాఁజేయఁదలంచి ధర్మమెలమిం బాలించి నిల్పంగ మీ వలనం గల్క్యావతార మొందఁగల నిన్ వర్ణింతు బారాయణా మ. ఇరవొందన్ సచరాచరప్రతతుల న్నెన్నంగ శక్యంబుకా కరయన్ పద్మభవాండ భాండచయమున్నారంగ మీకుక్షిలో నరుదార న్నుదయించుఁ బెంచు నడఁగు న్నన్నారికేళోద్భవాం తరవాఃపూరము చందమొంది యెపుడున్ దైత్యారి నారాయణా మ. దళదిందీవర నీలనీరదసముద్యద్భాసితాకార శ్రీ లలనా కౌస్తుభచారువక్ష విబుధశ్లాఘోద్భవ స్థానకో మలనాభీ చరణారవింద జనితామ్నాయాద్య గంగా! లన జ్జలజాతాయతనేత్ర నిన్నుమదిలోఁ జర్చింతు నారాయణా మ. జగదాధారక భక్తవత్సల కృపాజన్మాలయా పాంగ! భూ గగనార్కేందుజలాత్మ పావక మరుత్కాయా! ప్రదీపయ్రో గిగణస్తుత్య మహాఘనాశన! లసద్గీర్వాణసంసేవితా! త్రిగుణాతీత! ముకుంద! నాదుమదిలో దీపింపు నారాయణా శా. భూతవ్రాతము నంబూజాసనుఁడవై పుట్టింతు విష్ణుండవై ప్రీతిం బ్రోతు హరుండవై చెఱుతు నిర్భేద్యుండవై త్రైగుణో పేతంబై పరమాత్మవై నిలుతు నీపెంపెవ్వరుం గాన ర బ్జాతోద్భూత సుజాత పూజత పదాబ్జశ్రేష్ఠ నారాయణా మ. వరనాభీధవళాంబుజోదరమునన్ వాణీశుఁ గల్పించి య ప్పురుషశ్రేష్ఠుని ఫాలమందు శివునిం బుట్టించి యామేటికిం మరమోత్తంసముగా వియత్తలనదిం బాదంబులం గన్న మీ సరి యెవ్వారలు మీరుదక్కఁగ రమాసాధ్వీశ నారాయణా మ. ప్రభ మీనాభి జనించినట్టి విలసత్పద్మోరుసద్మంబునం బ్రభవంబైన విరించిఫాలజనితప్రస్వేదసంభూతుఁడై యభిధానంబును గోరి కాంచెను భవుండార్వేశులూహింపఁగా నభవాఖ్యుండవు నిన్నె ఱుంగవశమే యాబ్జాక్ష నారాయణా మ. పటుగర్భాంతరగోళభాగమున నీబ్రహ్మాండభాండంబు ప్రా కటదివ్యాద్భుతలీలఁ దాల్చి మహిమం గల్పాంత మంబోధిపై పటపత్రాగ్రముఁ జెంది యొప్పినమిము న్వర్ణింపఁగా శక్యమే నిటలాక్షాంబురుహాసనాదికులకు న్నిర్వాణ నారాయణా మ. సవిశేషోరుసువర్ణ బిందువిలసచ్చక్రాంకలింగా కృతిన్ భవిచే నుద్దవుచేఁ బయోజభవుచేఁ బద్మారిచే భానుచే ధ్రువుచే నా దివిధినాయకులచే దివ్యన్మునీంద్రాళిచే నవదివ్యార్చన లందుచుందువు రమానారీశ నారాయణా మ. సర్వంబున్ వసియించు నీతనువునన్ సర్వంబునం దుండఁగా సర్వాత్వా! వసియించు దీవనిమదిన్ సార్ధంబుగాఁ జూచి యా గీర్వాణాదులు వాసుదేవుఁడనుచున్ గీర్తింతు రేప్రొద్దు నా శీర్వాదంబు భవన్మహామహిమ లక్ష్మీనాథ నారాయణా మ. గగనాద్యంచిత పంచభూతమయమై కంజాత జాండావలిన్ సగుణబ్రహ్మమయాఖ్యతం దనరుచున్ సంసారివై చిత్కళా సుగుణంబై విలసిల్లుదీవు విపులస్థూలంబు సూక్షంబునై నిగమోత్తంస గుణావతంస సుమహా నిత్యాత్మ నారాయణా మ. ఎలరారన్ భవదీయనామకథనం బేమర్త్యుచిత్తంబులోఁ బొలుపారం దగిలుండునేని యఘముల్ పొందంగ నెట్లో పెడున్ కలయం బావకుచేతఁ బట్టువడు నక్కాష్టంబుపైఁ గీటముల్ నిలువన్నేర్చునె భక్తపోషణ కృపానిత్యాత్మ నారాయణా మ. కలయం దిక్కులు నిండి చండతరమై కప్పారు మేఘౌఘముల్ వెలయన్ ఘోరసమీరణస్ఫురణచే వేపాయుచందంబునన్ జలదంభోళిమృగాగ్ని తస్కర రుజా శత్రోరగవ్రాతముల్ దొలఁగున్న్మీగదు దివ్యమంత్రపఠనన్ దోషాఘ్న నారాయణా మ. కలుషగాథా వినాశకారి యగుచుం గైవల్య సంధాయియై నలి నొప్పారెడు మంత్రరాజమగు నీనామంబు ప్రేమంబుతో నలర న్నెవ్వానివాక్కునం బొరయదే నన్నీచు ఘోరాత్మయున్ వెలయన్ భూరుహకోటరంబదియ సూ వేదాత్మ నారాయణా మ. పరమంబై పరతత్వమై సకలసంపత్సారమై భవ్యమై సురసిద్ధోరగ యక్షపక్షిముని రక్షోహృద్గుహాభ్యంతర స్థిరసుజ్జానసుదీపమై శ్రుతికళాసిద్ధాంతమై సిద్ధమై సరిలేకెప్పుడు నీదునామ మమరున్ సత్యంబు నారాయణా మ. అధికాఘౌఘతమో దివాకరమునై యద్రీంద్రజా జిహ్వకున్ సుధయై వేదవినూత్న రత్నములకున్ సూత్రాభిధానంబునై బుధసందోహ మనోహరాంకురమునై భూదేవతాకోటికిన్ విధులై మీబహునామరాజి వెలయున్ వేదాత్మ నారాయణా మ. పొనరన్ముక్తికిఁ ద్రోవ వేదములకుం బుట్టిల్లు మోదంబునం దునికిస్థానము యిష్టభోగములకు న్నుత్పత్తి యేప్రొద్దునున్ ఘనపాపంబులవైరి షడ్రిపులకున్ గాలావసానంబు మీ వినుతాంఘ్రి ద్వయపద్మసేవనగదా విశ్వేశ నారాయణా మ. భవరోగంబులమందుపాతకతమౌ బాలార్క బింబంబు క ర్మ విషజ్వాలసుధాంశుగామృతతుషార వ్రాతపాథోధిమూ ర్తివి కైవల్యపదావలోకన కళాదివ్యాంజనశ్రేష్ఠమై భువిలో మీదగుమంత్రరాజ మమరున్ భూతాత్మ నారాయణా మ. వరుసన్ గర్మపిపీలికాకృత తనూవల్మీకనాళంబులోఁ బరుషాకారముతో వసించిన మహా పాపోరగశ్రేణికిం బరమోచ్చాటనమై రహస్యమహిమం బాటింపుచు న్నుండుమీ తిరుమంత్రంబగు మంత్రరాజ మమరుం దివ్యాత్మ నారాయణా మ. హరునిన్నద్రిజ నాంజనేయుని గుహు న్నయ్యంబరీషున్ ధ్రువుం గరిఁ బ్రహ్లాదు విభీ'ణాఖ్యుని బలిన్ ఘంటాశ్రవు న్నారదున్ గరమొప్ప న్విదురున్ బరశరసుతున్ గాంగేయునిన్ ద్రౌపదిన్ నరునక్రూరునిఁ బాయకుండును భవన్నామంబు నారాయణా శా. శ్రీకిన్మందిరమైన వక్షము సురజ్యేష్ఠోద్భవస్థాననా భీకఁజాతము చంద్రికాంతర సుధాభివ్యక్తనేత్రంబులున్ లోకస్తుత్యమరున్న దీజనక మాలోలాంఘ్రియున్ గల్గు నా లోకారాధ్యుడవైన నిన్నెప్పుడు నాలోఁజూతు నారాయణా శా. విందుల్ విందులటంచు గోపరమణుల్ వ్రేపల్లెలోఁ బిన్ననాఁ డందెల్ మ్రోయఁగ ముద్దుమో మలర ని న్నాలింగితున్ సేయుచో డెందముల్ దనివార రాగరసవీటీలీలలన్ దేల్చుమీ మందస్మేరముఖేందురోచులు మము న్మన్నించు నారాయణా శా. విందుల్వచ్చిరి మీయశోదకడకు న్వేగంబెపొమ్మయ్యయో నందానందన! చందనాంకురమ! కృష్ణా! యింకఁ బోవేమి మా మందం జాతరసేయఁ బోదమిదే రమ్మా యంచు మిమ్మెత్తుకో చందంబబ్బిన నుబ్బకుండుదురే ఘోషస్త్రీలు నారాయణా శా. అన్నా కృష్ణమ నేఁడు వేల్పులకు మీఁదన్నార మీచట్లలో వెన్నల్ ముట్టకు మన్ననాక్షణము నన్విశ్వాకృతిస్ఫూర్తివై యున్నన్ దిక్కులు చూచుచున్ బెగడి ని న్నోలి న్నుతుల్ సేయుచున్ గన్నుల్ మూయ యశోదకున్ జిఱుతవై కన్పించు నారాయణా శా. ఉల్లోలంబులుగాఁ గురుల్ నుదుటిపైనుప్పొంగ మోమెత్తి ధ మ్మిల్లం బల్లలనాడ రాగరస సమ్మిశ్రంబుగా నీవు వ్రే పల్లెందాడుచు గోపగోనివహ గోపస్త్రీలయుల్లంబు మీ పిల్లంగ్రోవిని జుట్టిరాఁదిగుదు నీపెంపొప్పు నారాయణా మ. కసవొప్పన్ పసి మేసి ప్రొద్దుగలుగం గాంతారముం బాసి య ప్పసియు న్నీవును వచ్చుచో నెదురుగాఁ బైకొన్న గోపాంగనా రసవద్వృత్తపయోధరద్వయహరిద్రాలేపనామోదముల్ పసిఁ గొంచున్ బసిఁ గొంచువచ్చుటలు నే భావింతు నారాయణా శా. చన్నుల్ మీఁదికి చౌకళింప నడుముం జవ్వాడ కందర్పసం పన్నాఖ్యంబు నటించుమాడ్కి కబరీభారంబు లూటాడఁగ విన్నాణంబు నటింప గోపజన గోబృందంబుతో వచ్చు మీ వన్నెల్ కన్నుల ముంచి గ్రోలుటలు నే వర్ణింతు నారాయణా మ. పెరుగుల్ ద్రచ్చుచు నొక్కగోపిక మిముం బ్రేమంబునం జూచి రా గరసావేశత రిత్తద్రచ్చనిడ నాకవ్వంబు నీవు న్మనో హరలీలం గనుంగొంచు థేనువని యయ్యాఁబోతునుం బట్టితీ వరవృత్తాంతము లేను పుణ్యకథగా వర్ణింతు నారాయణా శా. కేలన్ గోలయు గూటిచిక్కము నొగిం గీలించి నెత్తంబునం బీలీపింఛముఁ జుట్టి నెన్నడుమునం బింఛావళిన్ గట్టి క ర్ణాలంకారకదంబగుచ్చమధుమత్తాలీస్వనంబొప్పనీ వాలన్ గాచినభావమిట్టిదని నే వర్ణింతు నారాయణా శా. కాళిందీతటభూమి నాలకదుపుల్ కాలూఁది మేయన్ సము త్తాలాలోల తమాలపాదపళిఖంతస్థుండవై వేణురం ధ్రాలిన్ రాగరసంబునిండ విలసద్రాగంబు సంధించి గో పాలవ్రాతము గండుగోయిలలుగా వర్ణింతు నారాయణా శా. రాణించెన్ గడునంచు నీసహచరుల్ రాగిల్లి సోలంగ మీ వేణుక్వాణము వీనులంబడి మనోవీథుల్ బయల్ ముట్టఁగా ఘోనాగ్రంబులు మీఁదికెత్తుకొని లాంగూలంబు లల్లార్చి గో శ్రేణుల్ చిందులు ద్రొక్కి యాడుటలు నేఁ జర్చింతు నారాయణా

Saturday, May 12, 2012

కోకిలమ్మ పెండ్లి -- విశ్వనాధ సత్యనారాయణ -- Part 2

ఒక్క మధ్యాహనంబునందున
చెక్కులను కుండల ప్రభలవి
పిక్కటిల బ్రాహ్మణుం డొకరు
డక్కడికి వచ్చెన్

చిలకతల్లీ తల్లితండ్రులు
చేరవచ్చిన అతనికోసము
కోరినట్టివి యన్ని యిచ్చీ
ఆదరించారూ

వేదపననలు చెప్పుకుంచూ
వాదములకూ కాలు త్రవ్వుచూ
ఆయనా తెలుగురాజింట్లో
ఆగిఉన్నాడూ

అతని వేదధ్వనులు వించూ
అతని వర్చస్సంత కంచూ
చిలకతల్లీ అతని తనలో
నిలిపివేశిందీ

సంగతంతా తెలిసి ఱేడూ
పొంగిపోయాడేమొ కానీ
తల్లికే చిలకతల్లంటే
వెళ్ళుకొచ్చిందీ


కోనలందూ అడవులందూ
కోకిలమ్మా తిరుగుతోందీ
ఎంత యేడుస్తోందొ తల్లీ
యింటికే రాదూ

ఏ యెఱుంగని నేలవాడో
యింటికొస్తే వాడిమీదా
చిలకతల్లీ వలపు తానూ
నిలిపివేశిందీ

కోకిలమ్మా ఇంటికైనా
రాక అడవుల్లోనె తిరుగుతూ
పోకిళ్ళమారైంది, తల్లికి
కాకపోయిందీ

అడవులెంటా కోనవెంటా
బుడబుడా చను సెలలవెంటా
అడుగులూ తడబడా వెదుకుతు
నడచిపోయిందీ 



రెండుజాముల వేళ పులులూ
పండుకొని రొప్పెటి నీడల
గుండె గుబగుబలాడా పోయీ
కూతు వెదకిందీ

పెద్దపులులూ సివంగులూ ద
ప్పికలు తీరగ నీరు త్రాగే
దొంగత్రోవల సెలమొదళ్ళా
తొంగిచూశిందీ

అడవిమెకములు తిరుగులాడే
ఎడములేనీ అడుగులొప్పే
అడవిలోపలి కోన లెల్లా
తడివిచూసిందీ


పెద్దపులులను కూడ చంపీ
పీల్చి పిప్పిగ చేసివేసే
అడవికుక్కలు ప్రాకులాడే
కడలు చూశిందీ

కోళ్ళనూ తిని కొందసిలువలు
కళ్ళు మూసుకు నిదురపోయే
బిల్లుడడవిలో వుస్సురంటూ
వెళ్ళిచూసిందీ

ఎచ్చట పోయీ వెదకినానూ
ఎందులేదూ కోకిలమ్మా,
ఎచ్చటుందో తల్లి గుండే
వ్రచ్చిపోయిందీ

ఒక్క సెలయేట్లోకి వేరూ
మిక్కిలిపోయినా ముషిణీ
ప్రక్క చెట్టుక్రింద కూర్చుని
స్రుక్కిపోయిందీ

తల్లివెనకా యింతసేపూ
మెల్లగా వస్తోంది కోకిల
తల్లిబాధా కళ్ళచూసీ
గొల్లుమన్నాదీ

ఉరుములా వురిమింది కోకిల
మెరుపులా మెరిసింది కోకిల
ఒక్కగంతున తల్లిఒళ్ళో
వచ్చిపడ్డాదీ 



తల్లి బిడ్డను బిడ్డ తల్లిని
కళ్ళు మూసుకు కౌగిలించీ
ఒళ్ళుతెలియక చెట్టుమొదటా
ఒరిగిపోయారూ

ఒరిగిపోయిన తల్లి బిడ్డా
ఒరిగినట్లే అయిరిగానీ
ఒక్కరైనా లేచి కళ్ళూ
తెరవనేలేదూ

తల్లిబిడ్దల ప్రేమ అంటే
యిల్లాగు వుండాలటంటూ
మెల్లగా పాడింది అడివిలొ
పిల్ల సెలయేరూ

తల్లిబిడ్దల ప్రేమ అంటే
యిల్లాగు వుండాలటంటూ
కానలోనీ తీగలన్నీ
కదలులాడాయీ

తల్లిబిడ్దల ప్రేమ అంటే
యిల్లాగు వుండాలటంటూ
గాలిపిల్లలు వెదురులో రా
గాలు తీశారూ

తల్లిబిడ్దల ప్రేమ అంటే
యిల్లాగు వుండాలటంటూ
ప్రకృతిదేవీ వొళ్ళుతెలియక
పాట పాడిందీ

ఎప్పుడూ గిలకల్లే అడివిలో
ఎచ్చట చూస్తే అచట వుండే
చిన్ని కోకిల లేక అడవీ
చిన్నవోయిందీ

కోకిలమ్మా తానమాడని
కోకిలమ్మా పుక్కిలించని
అడవిలోపల వూటయేటికి
అందమే లేదూ 



కోకిలమ్మా చివురు కోయని
కోకిలమ్మా పూలు తురుమని
అడవిలోపల చిన్న చెట్లకు
అందమేలేదూ

కోకిలమ్మా తిరుగులాడని
కోకిలమ్మా లేని అడవీ
కోనలకు తొలుకారుటందం
కొరతవడ్డాదీ

తల్లీంటే అంత ప్రేమా
వెళ్ళక్రక్కిన కోకిలమ్మకు
చావులేదని మావిచివురూ
సాగులాడిందీ

తల్లీంటే అంత ప్రేమా
వెళ్ళగ్రక్కిన కోకిలమ్మ
మునిగిపోదని అడవివూటా
ముర్మురించిందీ

తల్లీంటే అంత ప్రేమా
వెళ్ళగ్రక్కిన కోకిలమ్మ
బ్రతికి వస్తుందంచు అడివీ
పాటపాడిందీ

ప్రొద్దుకూకేవేళ వెన్నెల
ముద్దుగా కాసింది జాబిలి,
చావులేనే లేదు ప్రేమకి
చావులేదందీ

వానలన్నీ వెనుకపట్టీ
కోనలన్నీ నీరువట్టీ
ఆకురాలే కారుకూడా
ఆగిపోయిందీ

చిన్న మొగమున కుంకుమిడినా
కన్నెపేరంటాలి మల్లే
చెలువుగా అడివంత క్రొత్తగ
చివిరు తొడిగిందీ

గోదుమావన్నె త్రాచల్లే
కొబ్బరీపాలల్లె అడివి
చిన్నివూటా ఒదిగి ఒదిగి
చెన్ను వొలికిందీ 



ఎక్కడో అడివిలో చివరా
చక్కగా సన్నగా యేదో
చిక్కనైనా తేనెపాటా
జీరువారిందీ

ఆపాట వింటూనె అడివీ
అడివిగా నిలువెల్ల, పోయిన
ఒక్కచుట్టం వచ్చినట్లూ
వులికిపడ్డాదీ

సన్నగా పోతున్నవూటా
జాలు జాలింతై వెడల్పై
పట్టలేకా ఓర్పు జలజల
పరువులెత్తిందీ

కోకిలమ్మా అదిగొ మళ్ళీ
కూసెనంటే కూసె నానీ
వచ్చెనంటే వచ్చెనానీ
బ్రతికెనంటే బ్రతికెనానీ

ఒళ్ళుతెలియక అడవివూటా
పొర్లిపోయిందీ
చెన్ను తరుగని మావి మోకా
చివురు తొడిగిందీ

అంతలోపల నడవికందం
అతిశయించిందీ


అంతలో పూవుల్ల రేడూ
వింత వింతల సోకు లేలిక
చెక్కులా నవ్వూలు చిలుకుతూ
చేరవచ్చాడూ

ఏడాది కొకసారి వస్తా
డేడాది కొకసారి తెస్తా
డెన్ని పువ్వులు, అతనివేనూ
వన్నెలూ చిన్నెల్ 



వచ్చావటయ్యా పూలఱేడా,
తెచ్చావటయ్యా పూలరాజా
నీవు తెచ్చిన పూవులే కా
నికల కిస్తామూ

కోకిలమ్మను ముద్దుపెళ్ళీ
కూతురును చేస్తాము, పెళ్ళీ
కొడుకునూ చేస్తాము నిన్నూ,
కూర్చివేస్తామూ

కోరి నీ అందానికీ మా
కోకిలమ్మా గొంతుకునకూ
సొగసుచేతా పాటచేతా
తగిపోయిందీ

రావయ్య ఓ పూలరాజా
రావయ్య ఓ అందగాడా
కోకిలమ్మ నీవు, నీకూ
కోకిలా తగునూ


వారిపెళ్ళికి అడివి అంతా
తోరణాలైనాయి చివురులు
కాపలా కాసినై పులులు
గండశిలలందూ

సన్నాయి పాడింది తెల్లని
సన్ననీ సెలవూట పూలా
వెన్నెలై ప్రకృతి తల్లేమో
కన్ను తెరిచిందీ

పూలసోనలు కురిసినై, తే
నెలపాటలు విరిసినై, అం
దాల త్రోవలు వెలిసినై, రాజ
నాలు పండినవి

చిలకతల్లి మహాన్వయంబున
నిలిచినవి సంస్కృతికవాక్కులు
కోకిలమ్మా తెనుగు పలుకూ
కూడబెట్టిందీ. 

కోకిలమ్మ పెండ్లి -- విశ్వనాధ సత్యనారాయణ -- Part 1

లేతబుర్రలు కొక్కిరిస్తే
అతగాళ్ళతో యేమిగానీ
తాతతాతలనాటి కతలూ
తవ్విపోస్తానోయ్

ఊగులాడే కడలి తరగలు
నాగుబాముల కోడెలల్లే
ఒడ్డుదాకా ప్రాకి ప్రాకీ
ఒరిగిపోతాయోయ్

ఒడ్డుదాకా అడివి, అడివిలో
దొడ్డచెట్లున్నాయి తరగల
వూగులాడే గాలిచేత
వూగులాడుతుంటాయోయ్

అడవిలోనూ కడలిలోనూ
అద్దరాత్తిరివేళ అప్పుడు
తొగరుకన్నుల చుక్కకన్నెలు
తొంగిచూస్తారోయ్

పొద్దుకూకేవేళ ఒడ్డున
ముద్దుముద్దుగ తిరుగుతుంటూ
సొగసునడకల గాలిపిల్లలు
సోకుపోతారోయ్

సుళ్ళు తిరిగే కడలినడుమా
చూపుకందీ అందకుండా
తెప్పలేసుకు పాముపడుచులు
తేలిపోతారోయ్

ఒడ్డునే బంగారుచేలూ
ఒడ్డునే పూవుల్లుచేత్తో
ఊరికే యిట్లంటె చాల్ పా
లుబికిపోతాయోయ్

నేను చెప్పేకతలు జరిగి
యెన్నినాళ్ళయిందో అప్పుడు
మలలు పొదలు కొండకోనలు
తెలుగునా డంతా 



కడలివొడ్డున పల్లె ఒకటి
కలదు, ఱేడున్నాడు దానికి,
అప్పటికే యీ తెలుగులంతా
గొప్ప యెకిమీళ్ళు

వెదురులో ముత్యాలపేరులు
కదురులో దారాలబట్టలు
ఎదురుగా నెలపొడిచినట్లే
ఏపుమీ రేడోయ్

దొడ్డదొర, అతగాడినేలలో
ఎడ్డెపనులే చేయ రెవ్వరు,
దొంగ నాగరికతలో దేశం
తూలిపోలేదోయ్

ఉన్నవాళ్లకు ఎంతనేలా
దున్నుకుంటే చాలుతుందో
మించి ముట్టరుకూడ పైనా
చిన్న చెక్కయినా

మిగిలినా అడవూలు, కొండల
కెగురుతూ, మబ్బుల కన్నెల
తగులుతూ, తరిలోన వానలు
కురుస్తుంటాయోయ్

అందరికి కావలసినంతా
వుంది, యెవ్వరితోడా నెవరికి
నెన్నడు చూడలేమన్నా
చిన్ని తగవైనా

ఆ దొరకి కూతుళ్ళు ఇద్దరు,
మోదుగులు పూశాయి పెదవులు
వారిపేరులు, చిలక తల్లి,
కోకిలమ్మానూ

కోకిలమ్మ నల్లనిదే
చిలకతల్లి పచ్చనిదే
చిలక తల్లికి కోకిలమ్మకు
ఎప్పుడూ పడదూ 



చిలకతల్లి చిన్ననాడే
పలుక మొదలెట్టింది ముద్దుల
మొలకలై తండ్రికీ మేనూ
పులకరించిందీ

ఎన్నో ఏళ్ళు వచ్చినాయీ
కన్నులింతగా తెరచినాదీ
పాపమేమో ! కోకిలమ్మకు
మాటలేరావూ

చిలకతల్లికి రంగురంగుల
చీరలూ తెస్తాడు తండ్రీ,
కోకిలమ్మను ఊరకేనే
కోపపడతాడూ

చిలకతల్లీ నవ్విపోతే
తండ్రి మారూ పలుకకుంటే
తల్లివంకా చూచి కోకిల
తెల్లపోతుందీ

చిలకతల్లి వెక్కిరిస్తే
తండ్రి వచ్చీ కసురుకుంటే
తల్లివెనుకా దాగిపోతూ
తల్లడిలుతుందీ

తల్లి ఏమీ చెయ్యలేకా
తాను కూడా విసుక్కుంటే
కోకిలమ్మా లోనె లోనే
కుమిలిపోతుందీ

రోజు రోజూ కడలి తరగల
రొదలలో కలిసి ఏడుస్తూ
నురుసులోపల వట్టిచూపులు
నిలిపి పోతుందీ

అడవిలో యే చెట్టుకిందో
అంత యెగ్గులు తలచుకోనీ
కూరుచున్నది కూరుచుండే
కుమిలిపోతుందీ 



చెట్టుతోనో పుట్టతోనో
చెప్పుకుందామన్న గానీ
ఎట్టివాడో వాడు నోరూ
పెట్టలేదాయే

కొండవాగుల్లోను ప్రొద్దూ
గూకులూ కూర్చుండి యిసకలో
గూళ్ళులేనీ పిచ్చికలకీ
గూళ్ళు కడుతుందీ

కొండవాగులవెంట పోతూ
కొండపువ్వుల వంక చూస్తూ
ఎంత పొద్దోయినా గానీ
యింటికే పోదూ

ఒక్కొక్కప్పుడు తెల్లవార్లు
అడివిలోనే ఉండిపోతే
తల్లి ఊరక తెల్లవార్లూ
తల్లడిల్లుతుందీ

వానరోజులు వచ్చిపోగా
చలిపగళ్ళు సాగిపోగా
ఆకురాలుట ఆగి చివురులు
జోకతాల్చాయీ

చివురులూ కొమ్మలాచివరా
గుబురులై గుబురులాచివరా
పూవులూ నాలుగూవైపుల
బుగులుకొన్నాయీ

చివురులో ఈనెల్లే, పసిరిక
పువ్వుల్లో తేనెల్లే, పలపల
చిలకతల్లికి కోకిలమ్మకు
వయసు వచ్చిందీ

చిలకతల్లీ చదువు చూచీ
చిలకతల్లీ సొగసు చూచీ
గాలిపిల్లకూడ లోపల
కలతపడ్డారూ 



చిలకతల్లీ అందమంతా
చిందిపోయీ అన్నివైపుల
కనులచూడని వారుకూడా
అనుకునేవారే

చెట్లరాణీ తలాడిస్తూ
చిలకతల్లీవోసుకతలే
నింగిలో దవ్వూన యెచటో
పొంగి పాడిందీ

పొద్దుకూకేవేళ తిరుగుతు
ముద్దులొలికే గాలిపిల్లలు
చిలకతల్లి అందమెప్పుడు
వొలకపోస్తారూ

ఎల్లవారూ చిలకతల్లినె
పెళ్ళికై కోరారు, తండ్రి
తల్లి మాత్రము పిల్లదాన్నీ
కళ్ళ కాస్తారూ

కడలీదవుల ఱేండ్లు తమలో
కలుపుకుంటారేమొ అనుకుని
గడపదాటీ చిలకతల్లిని
కదలిపోనీరూ

ఇంటిముంగిలి దాటనీకా
ఇంటిపనులూ చేయనీకా
కంటికీ రెప్పాకి మల్లే
కాచుకుంటారూ

చిలకతల్లీ సొగసులవాకలు
చిలవలై పలవలై యందపు
మొలకలై తేనెలాచినుకులు
గలపరించాయీ

చిలకతల్లీ అందమేమో
చిలకతల్లీ పెళ్ళియేమో
తల్లి తండ్రీ కోకిలమ్మను
తలచనేపోరూ
 

*        *        *        *        * 

Monday, January 23, 2012

పింగళి సూరనామాత్యుని చిత్ర కవిత్వం

పింగళి సూరనామాత్యుని గురించి తెలియని సాహిత్యాభిమానులు ఉండరు. ఆయన రచించిన కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నము, రాఘవ పాండవీయం మెదలైన ప్రతికావ్యంలో కవిత్వంలోని అనేకమైన ప్రయోగాలు కనిపిస్తాయి. ముఖ్యంగా చిత్రకవిత్వం చెప్పటంలో ఆయన దిట్ట. కళాపూర్ణోదయంలో అలాంటి రెండు పద్యాలను తెలుసుకుందాం.

కం :  మా య మ్మాన సు వీవే
        రాయల వై కావ దేవరా జే జే జే!
        మా యాతుమ లానినయది
        పాయక సంతోస మున్న పల పల సామి

ఈ పద్యాన్ని మాములుగా చూసినప్పుడు గ్రామ్య భాషలో చెప్పిన తెలుగు పద్యం. కానీ జాగ్రత్తగా పదవిభజన చేస్తే సంస్కృతశ్లోకంగా అన్వయిస్తుంది. అంటే ఒకేపద్యంలో రెండు అర్థాలను చూపించిన ఒక చిత్ర కవిత్వం అన్నమాట. అదెలాగో చూద్దాము.

సూరన్న గారే పైన చెప్పిన పద్యము ఎలా చదువుకోవాలో సూచించారు. 


సీ; ఆయనంబు సరకు సేయకుము, శోభన మూల
         ధనుఁడ! ధనం బచ్చిదంబు ముఖ్య
    మైనయట్టిది, తంపు నదియ ఱేని, కజు య
         జించువానికి లక్ష్మి చేరుఁ, బాత
    కములు చేరవు, రక్షకా! కోవిదులు కల్గి
         రా  యస మొదుండవై యరుగకు,
    సమ్మిశ్రభావంబు సలుపు మా! యా 'లక్ష్మి
         కోవిదు ' లనియెడు దేవభాష


ఆ:  వరుసఁ బద విభాగ విరచనతో నర్థ
     మరయః దోఁచుచున్న యది కరంబు
     తెలియఁ జూడుఁ, దేతదీ యాంధ్ర వచన సం
     దర్భమునను శబ్ధ తంత్రవిదులు.


తెలుగు పద్యంగా పదవిభజన చేస్తే: మా, అమ్మ, ఆన, చు, నీవె, రాయలవై, కావన్, దేవరా, జే, జే, జే, మా, ఆతుమలు, అనిన యది, పాయక, సంతోసము, ఉన్న వల్ము, ఇల సామి,

అర్థము: దేవరా=ఓ రాజా! జే జే జే=జయము జయము జయము, ఇలసామి=ఓ భూపతి, వే రాయలవై= ప్రభువువై, రావన్=కాపాడుటచే, సంతోసము=ఆనందము, పాయక=వదలక, మా ఆతుమలు= మా మనసులను, ఆనినయది=పొందియున్నది, ఉన్న వలము=ఇది మాకు గలిగిన ఫలము, మా+అమ్మ+ఆన+చు+మా=మా తల్లి తోడు సుమా.

రాజా ! నీకు జయము జయము, జయము! మా తల్లిపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నారము. నీవు రాజువై రక్షించుటచే మా మనసులానంద భరితములైనవి.

ఇదే పద్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే సంస్కృత శ్లోకంగా కూడా చదువ వచ్చును. అదెలాగునో చూద్దాం.
సంస్కృత శ్లోకానికి ఈ క్రింది విధముగా పద విభాగము చేసుకొనవాచ్చును.

మా, ఆయం, మాన, సునీవే, రాః, అలనా, ఏకా, ఆవత్,
ఏవ, రాజే, అజేజే, మా, ఆయాతు, మాలాని, న, యది, పాయక,
సంతః, అసముత్, న, పల, మిల, సా, అమీ,

ఇప్పుడు అర్థం చూద్దాం.

సు నీవె=శుభమైన మూల ధనము గల ఓ రాజా! ఆయం=రాబడిని, మామాన=సరకుగొనకుము, అలవా=తరుగని, రాః=ధనము, ఏక+ఏవ=ఒక్కటియే, ఆవత్స్(రాజును) కాపాడును, అజేజే=భగవంతు నారాధించు, రాజే=రాజు కొరకు, మా=లక్ష్మి, ఆయాతు=వచ్చును, మలాని=పాపములు, న=చేరవు, ఆయక=ఓ రక్షకుడా! సంత్సః=పండితులు, యది=అయినచో, అసమత్=సంతోషము లేనివాడవై, న వల=తొలగిపోకుము, మిల=వారిని కలిసికొనుము, అమీ=ఈ పండితులే, సా=ఆ లక్ష్మి.

భావము:  ఓ రాజా! రాబడిని నమ్మి మూలధమ్మును వమ్ము సేయకుము. తరుగని సంపదయే నృపతికి కమిత మోదమును గూర్చునది. భగవంతుని గొలుచు రాజును సర్వ సంపదలు చేరును. పాతకములు దరికి రావు. ప్రభూ! పండితులను గాంచినంతనే పరాజ్ముఖుడవు కాకుండుము. వారి సాంగత్యము నభిలషింపుము. ఆపండితులే 'లక్ష్మి ' అను సూక్తిని గుర్తింపుము.

ఒకే పద్యంలో తెలుగు సంస్కృత అర్థాలను ఈ పద్యంలో చూపించిన పద్దతి చూస్తుంటే, కవికి భాషమీద ఉన్న పట్టు తెలుస్తుంది.

ఇప్పుడు  ఇదే  కావ్యంలో ఇంకొక పద్యం చూద్దాం. ఈ పద్యం,  గత పద్యంలా కాకుండా అనులోమ విలోమ పద్యంగా గుర్తించవచ్చు. ఆంటే  పద్యాన్ని మొదటి నుంచి చదివితే ఒక అర్థం లోను చివరి నుంచి చదివితే మరొక ఆర్థంలోను ఉంటుందన్న మాట. ఈపద్యంలో మొదటి నుండి చదివితే తెలుగు పద్యంగా చివరినుంచి చదివితే సంస్కృత పద్యంగా ఆర్థం ఇస్తుంది.



కం.   తా వినువారికి సరవిగ
        భావనతో నాను నతి విభావి సుతేజా
        దేవర గౌరవ మహిమన
       మా వలసిన కవిత మరిగి మాకు నధీశా

మొదట తెలుగు పద్యానికి అర్థం చూద్దాం.


అతి విభావి సుతేజా=మిక్కిలి ప్రకాశించు పరాక్రముగల, అదీశా=రాజా, దేవర గౌరవ మహిమన=ఏలినవారి మహిమాతిశయము చేతనే, మా వలసిన కవిత=మా ప్రియమైన కవిత్వము, తాన్=అది, వినువారికిన్=శ్రోతలకు, సరవిగన్=తగు రితి, భావనతొన్=తలచినంతనే, మాకున్, మరిగి= స్వాధీనమై, ఆనున్=భాసిల్లును.


భావము: రాజా! ఆశ్రమదాతలైన తమ మహిమాతిశయము చేతనే శ్రోతలకానందము గూర్చు ఈ కవిత మాకు వశవర్తినియై మెఱుగారుచున్నది.


ఇదే పద్యాన్ని తుదినుండి చదివితే, ఈ పద్యం క్రింది విధం గా ఉంటుంది.



        శాధీన కు మాగిరి సుత
        వికనసి లవమాన మహిమ వర గౌరవదే
        జాతే సువిభా వితి నను
        నాతో నవ భాగ విరసకరి నా ను వితా!


పద భాగము: శాధి, ఇన కుం, ఆగిరి, మత వికనసి, లవ, మాన, మహిమ వర గౌరవదే, జాతే, సి విభౌ, ఇతి, నను, నా, అతః నవ భాః, గవి, రస, కిరి, అనువితా.


అర్థము: ఇన=రాజా!, ఆగిరి=పర్వతము లున్నంత కాలము, కుం=భూమిని, శాధి=పాలింపుము, మత=సర్వసమ్మతుడా, వికనసి=మిక్కిలి కీర్తిచే విరాజిల్లు చున్నాడవు, లవమాన=శ్రీరాముని కుమారుడగు లవునివలే మానవంతుడవగు, నను=ఓ రాజా! మహిమ వర గౌరవదే=గొప్పదనముచే మిక్కిలి గౌరవమునిచ్చు, సువిభౌ=నీ వంటి ప్రభువు, ఇతి=ఈరితి, జాతే=కలిగియుండగా, నా=మనుజుడు, (పండితుడు), అతః=ఇటువంటి గౌరవము వలన, నవ భాః=క్రొత్త వికాసము గలవాడై, రస కిరి=నవరసములు వెదజల్లు, గని=భాషయందు, అనువితా నా=స్తుతింపకుండునా?


భావము: ఓ రాజా! ధరలో గిరులున్నంతకాలమీ యిలనేలుము. శ్రీరామకుమారుడయిన లవునివంతి మనధనుడా! గౌరవాదరములు చూపు నీ వంటి మహాప్రభువును గాంచినంతనే సత్కవులు నూతనోత్తేజితులై పలుకుల రసము లుట్టిపడ వర్ణన సేయకుందురా?


ఈ పద్యాన్ని ఎలా చదవాలో కూడా సూరన్నగారు సూచించారు:


సీ:  ఏలు మో నాయక! యిల గిరు లెంత కా
          ల మ్మంత కాల మో సమ్మతుండ!
     మివుల శొభ్ల్లెదు, లవ కుమార సమాన
          మానుఁడ! మహిమ ననూనమైన
     గౌరవం బొసఁగు, చక్కని ప్రభు విట్లు గ
          ల్గఁగ నోయి! పురుషుఁ డీ గౌరవమున
     నభినవ తేజస్కుఁడై, వాణి రసములు 
          గులికెడునట్టిది గలుగఁగాను
తే:  వినుతి సేయనివాఁడే యంచును, మహార్థ
     మున్నయది సంస్కృతంబునఁ జెన్నుమీఱ
     వరుసఁ దుదనుండి మొదలికిఁ దిరుగఁ జదువ
     నా తెనుఁగు పద్యమున బుధు లరసికొనుఁడు.



ఇటువంటి అనేకమైన చిత్రకవిత్వ ప్రక్రియలు మనకు పింగళి సూరనామాత్యుని రచనలలో కనిపిస్తాయి.ఈయన రచించిన రాఘవపాండవీయం అనే కావ్యం ' ద్వార్థి ' కావ్యం. అంటె ఒకే పద్యానికి రామాయణ పరంగానూ భారతపరంగానూ అర్థం చెప్పుకోవచ్చును. ఆ విషయాలు మళ్ళీ ఎప్పుడైనా ముచ్చటించుకుందాము.





Sunday, January 1, 2012

శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం - చివరిమాట

పల్నాటి వీరచరిత్ర ద్విపదకావ్యం పూర్తి అయ్యింది. ఈ కావ్య రచయిత శ్రీనాథుని గురించి తెలియని సాహిత్యప్రియులు ఉండరనే తలుస్తాను. ఆయన వ్రాసిన కావ్యాలేకాక, చాటువులు మొదలైనవికూడా ప్రతివారికీ తెలిసినవే. పలనాటి వీరచరిత్ర ఆయన వ్రాసిన కావ్యాలలో చివరికావ్యంగా పేర్కొంటారు. 

ఈ కావ్యంలో శ్రీనాథుడు తాను రాయల ఆస్థానంలో ఉండి చూసిన అనేకమైన ఆచార వ్యవహారాలను యథాతధంగా పొందుపరచటమే కాకుండా అనేక చారిత్రికాంశలను మనముందు తీసుకువచ్చారు. రాజనీతి, యుద్ధనీతి వంటి విషయాలను బ్రహ్మనాయుని నోటిద్వారా, స్త్రీ ధర్మాలను మాంచాల తల్లిద్వారా మనకు తెలియచేసారు. 

పల్నాటివీరచరిత్రలో శ్రీనాథుడు కేవలం బాలచంద్రుని యుద్ధం వరకు మాత్రమే రచించాడు. మిగిలిన కథను ఇతర రచయితలు రచించారు. అవికూడా దొరికితే మీతో తప్పకుండా పంచుకుంటాను.

నా ఈ పోష్టులలో అనేకమైన తప్పులు ఉన్నాయి. అనేకమంది మిత్రులు తప్పులను సూచించారు. సవరిస్తూనే ఉన్నాను. ఐనా ఇంకా ఉన్నాయనటంలో సందేహం లేదు. ఓపికగా చదివిన వారికి ధన్యవాదాములు. ఇంక త్వరలో మరొక కొత్త కావ్యంతో మీ ముందుకు వస్తాను.

మరొక మారు ధన్యవాదములు.