Tuesday, June 7, 2016

ఆంధ్రనామ సంగ్రహము - 3

సీ. వడిగలజింకతత్తడి నెక్కు నెఱరౌతు, మేటిపాములమేఁత నీటితాత
యొడలితాల్పులపిండుకుసురగు బలియుండు, సోకుదయ్యము మింటిచూలి గాలి
కరువలి తెమ్మెర గాడ్పు పయ్యర యొంటి, మ్రాకులపెనుముప్పు మబ్బువిప్పు
సుతటివీవులఁబుట్టు సుడిగొట్టు చలినట్టు, బక్కవారల పెనుబాద యీఁద
తే. అబ్బురపుఁదియ్యవిలుకాని నిబ్బరంపు
దెబ్బపోరుల నలయిక ప్రబ్బుబొంట్ల
గబ్బిగుబ్బలచెమటల యుబ్బడంచు
గబ్బినాఁ జను మారుతాఖ్యలు (మహేశా)      (22)

క. మరుదాఖ్య లొప్పుచుండును
ధర వినుచూలి యన సోఁకుదయ్య మనం బ
య్యొర యన గొ ట్టని నీఁ దనఁ
గరువలి యనఁ దెమ్మె రనఁగ గాలి యనంగన్       (23)


టీ. వడిగలజింకతత్తడినెక్కునెఱరౌతు= వేహ్గముగల లేడి వాహనమునెక్కు నేర్పరి. మేటిపాములమేత= శ్రేష్ఠములగు పాములకు ఆహారమైనవాడు, నీటితాత= ఉదకములకు తాత, బడలితాల్పులపిండు కుసురగు బలియుండు= దేహధారులకు ప్రాణమైన బలిమిగలవాడు, సోఁకుదయ్యము=స్పర్శగుణము కలవాడు, మింటిచూలి= ఆకాశంబున పుట్టినవాడు, గాలి, కరువలి, తెమ్మెర, గాడ్పు, పయ్యర, ఒంటిమ్రాకుల పెనుముప్పు= ఒంటరిగా ఉన్న చెట్లకు మిక్కిలి బాధ కలిగించునది, మబ్బునిప్పు= మబ్బులను చెదరగొట్టునది, సురటివీవులబుట్టు= సురటి వీచుటచే పుట్టినది, సుడిగొట్టు= గుండ్రముగా వీచునది, చలినట్టు= శీతమునకు ఉనికిపట్టయినది, బక్కవారల పెనుబాధ= కృశించినవారికి మిక్కిలి బాధాకరుడు, ఈడ, అబ్బురపుఁదియ్యవిలుకాని నిబ్బరంపు దెబ్బపోరుల నలయిక ప్రబ్బుబోంట్ల గబ్బిగుబ్బల చెమటల యుబ్బడగించుగబ్బి= ఆశ్చర్యకరములై మన్మధుని బాణముల ప్రహారమువలన నలతనొందిన యువతులయొక్క గొప్పస్తనములమీది చమట పోగొట్టు నేర్పరి, వినుచూలి=ఆకాశమున పుట్టిన దేవుడు, గొట్టు, ఈ 21 యును గాలికి పేర్లు.

క. ముక్కంటియనుఁగుఁజెలి వడ
చక్కేలిక చాగకాఁడు జక్కులదొర బల్
రొక్కమెకిమీఁడు మానిసి
నెక్కెడువాఁ డనఁగ జను ధనేశుం (డభవా)         (24)

టీ. ముక్కంటియనుఁగుఁజెలి= ఈశ్వరునికి బ్రాణస్నేహితుడు, వడచక్కేలిక= ఉత్తరదిక్కి నేలెడి ప్రభువు, చా(తే)గకాడు= ధనము ఇచ్చేవాడు, జక్కులదొర= యక్షులకు రాజు, బల్ రొక్కమెకిమీడు= ఎక్కువ కలిమికి రాజు, మానిసి నెక్కెడువాడు= నరవాహనుడు, అను ఈ 6 ను కుబేరునికి నామములు.

క. విడిముడి గల వేలుపుచెలి
జడముడిజంగంబు గడదెసం గాపరి యౌ
యెడయండు పాఁపతొడవుల
నిడియెడివే ల్పనఁగ నొప్పు నీశానుఁ డిలన్         (25)

టీ. విడిముడిగల వేలుపుచెలి = రొక్కముగల వేల్పునకు (కుబేరునకు) మిత్రుడు, జడముడిజంగంబు= జడలను దాల్చిన బిచ్చగాడు, కడదేశగాపరియౌ యడయండు= కడపటి దిక్కగు ఈశాన్య దిక్కునేలెడు ప్రభువు, పాప తొడవుల నిడియెడివేలుపు= నాగభూషణు డగు దేవుడు - ఈ 4 ను ఈశానుని పేర్లు

క. దేవాలయాహ్వయంబులు
కోవెల యన దేవళంబు గుడి నా వెలయున్
దేవ ళ్ళన జేజేలనఁ
గా వేలుపు లనఁగ వెలయుఁ గ్రతుభుగభిఖ్యల్     (26)

టీ. కోవెల, దేవళంబు, గుడి, ఈ మూడును దేవాలయములకు పేర్లు. దేవళ్లు, జేజేలు, వేల్పులు అను ఈ 3 ను దేవతలకు పేర్లు

ఆ. క్షితిని బేళ్ళు దనరు సీద్రంపుఁబెద్ద బల్
పాఁపఱేఁడు వెన్ను పానుపనఁగఁ
బుడమితాలు పనఁగఁ దడవులనిడుపఁడు
చిలువఱెఁ డనంగ శేషునకు                 (27)

టీ. సీద్రంపుఁబెద్ద=కుబుసముగల గొప్పవాడు, బల్పాపఱేడు= పాములపెద్దలకు పెద్దదైన పాము, వెన్నుపానుపు = విష్ణువుయొక్క పానుపైనవాడు, పుడమితాలుపు= భూమిని మోయువాడు, తడవులనిడుపడు = చిరకాలజీవి, చిలువఱేడు=పాపరాజు,-- ఈ 6 ను ఆదిశేషునకు పేర్లు.

క. మర్రునయ్యతేజి పులుఁగుల
దొర పాములవేఁటకాఁడు తూరుపునా డేల్
దొరబువ్వఁ గొన్నలావరి
గరుటామంతుఁ డన నొప్పు గరుడుం (డభవా)       (28)

టీ. మరునయ్యతేజి=మన్మథునితండ్రియగు విష్ణునకు వాహనము, పులుగులదొర=పక్షింద్రుడు, పాములవేటకాడు= పన్నగశత్రువు, తూరుపునాడేలుదొరబువ్వగొన్నవావరి= పూర్వదిశను పాలించు దేవుడగు నింద్రుని ఆహారం అయిన అమృతం తెచ్చిన బలవంతుడు, గరుటామంతుడు - ఈ 5 ను గరుత్మంతుని పేర్లు.

ఆ. నల్లవలువతాల్పు తెల్లనిమైదంట
వెన్నదొంగయన్న వెఱ్ఱినీళ్ల
మేలువాఁడు దుక్కివాలుదాలుపు దాటి
పడగవాఁ డనంగ బలుఁడు (రుద్ర)              (29)

టీ. నల్లవలువతాల్పు= నల్లనిబట్ట దాల్చినవాడు, తెల్లనిమైదంట= తెల్లని దేహము గల్గిన దిట్ట, వెన్నదొంగయన్న= కృష్ణునికి అన్న, వెఱ్ఱినీళ్లమేలువాడు= మధ్యపానము నందాసక్తి కలవాడు, దుక్కివాలుదాలుపు= నాగలి ఆయుధముగా కలవాడు, తాటిపడగవాడు - ఈ 6 ను బలరామునికి పేర్లు

క. వడముడి యనఁగా గాడుపు
కొడుకన నివి రెండు బేళ్ళగున్ భీమునకుం
బుడమిం గఱ్ఱి యనంగ
వ్వడి యన వివ్వచ్చుఁ డనఁగ వాసవి (యీశా)        (30)

టీ. వడముడి, గాడుపుకొడుకు=వాయుపుత్రుడు - ఈరెండును భీమునికి పేరులు, కఱ్ఱి, కవ్వడి=రెండుచేతులతో బాణప్రయోగము చేయువాడు, వివ్వచ్చుడు (భీభత్స శబ్ధభవము) -

ఈమూడును అర్జునునికి పేర్లు.

తే. వేలుపులత్రోవ యుప్పర వీదు యాక
సంబు విను విన్ను మిను మిన్ను చదలు నింగి
దివి మొయిలుదారి చుక్కలతెరువు బయలు
గాడ్పుతం డ్రన నభ మొప్పు (గరళకంఠ)      (31)

టీ. వేలుపులత్రోవ= దేవతలు సంచరించు మార్గము, ఉప్పరవీధి= పైనుండుమార్గము, ఆకసంబు (ఆకాశ శబ్ధభవము), విను విన్ను, మిను, మిన్ను, చదలు, నింగి, దివి, మొయిలుదారి=మేఘ మార్గము, చుక్కలతెరువు= నక్షత్ర మార్గము, బయలు, గాడ్పుతండ్రి= వాయువు తండ్రి = ఈ 14 ను ఆకశమునకు పేర్లు

తే. వెలయు ధరణిఁ జతుర్దశల్ నలుఁగడ లన
నలరు దచ్చికడ లన దిశాష్టకంబు
దనరు నీరైదుకడలు నా దశదిశలును
(మౌళి ధృతగంగ యంగజ మదవిభంగ)        (32)

టీ. నలుఁగడలు=నాలుగు దిక్కులకు పేరు, దచ్చికడలు= ఎనిమిది దిక్కులకు పేరు, ఈరైదికడలు (ఈరు=రెండు, ఐదులు=పది) పది దిక్కులకు పేరు

ఆ. తాటిసిడమువాని తల్మి కూఁతురిబిడ్డ
వెన్ను నడుగుపాప మిన్నువాఁక
వేల్పుటేఱు గడలి వెలఁదుక ముత్త్రోవ
ద్రిమ్మ రనఁగ నొప్పు (దివిజగంగ)            (33)

టీ. తాటిసిడమువానితల్లి= తాలధ్వజుడగు భీష్ముని తల్లి, కూఁతురిబిడ్డ= తనకూతురగు లక్ష్మికి కూతురు, వెన్నునడుగుపాప= విష్ణుపాదమున పుట్టిన చిన్నది, మిన్నువాఁక= ఆకశమునందు పాఱునది, వేల్పుటేఱు= దేవతల నది, కడలివెలఁదుక= సముద్రుని భార్య, ముత్త్రోవద్రిమ్మరి= మూడుత్రోవలుగా పాఱు నది, త్రిపథగ- ఈ ఏడును గంగానదికి పేర్లు.

తే. వేలుపులగౌరు చౌదంతి వెల్లయేనుఁ
గనఁగ నైరావతంబున కాఖ్యలమరు
వేల్పుదొరతేజి యనఁగను వెల్లగుఱ్ఱ
మడఁగ నుచ్చైశ్రవం బొప్పు నంబికేశ      (34)

టీ. వేలుపులగౌరు= దేవతల ఏనుగు, చౌదంతి= నాలుగు దంతములు గలది, వెల్లయేనుఁగు = తెల్ల యేనుగు -- ఈ మూడును ఐరావతమునకు పేర్లు. వేల్పుదొరతేజి= దేవేంద్రుని వాహనమగు గుఱ్ఱము, వెల్లగుఱ్ఱము= తెల్లని గుఱ్ఱము, -- ఈ రెండును ఉచ్చైశ్శ్రవమునకు నామములు.

ఆ. పుడుకుఁదొడుకు వేలు పులగిడ్డి వెలిమొద
వనఁగఁ గామధేను వలరుచుండు
గల్పకంబు దనరు వేల్పుఁజెట్టీవుల
మ్రాను వెల్లమ్రాను నా (నుమేశ)             (35)

టీ. పుడుకుఁదొడుకు = కోర్ర్కుల నొసగునట్టి ఆవు, వేలుపులగిడ్డి= దేవతల ఆవు, వెలిమొదవు= తెల్లనియావు, -- ఈ మూడును కామధేనువునకు పేర్లు. వేల్పుజెట్టు = దేవతల వృక్షము, దెల్లమ్రాను= తెల్లని చెట్టు, ఈవులమ్రాను = కోరికెలను తీర్చెడి చెట్టు, -- ఈ మూడును కల్పవృక్షమునకు నామములు

ఆ. అవని గుడుసుకైదు వనఁగ వేయంచుల
కైదు వనఁగ జుట్టుఁ గైదు వనఁగ
బట్టువుఁగైదు వనఁగఁ బరఁగు సుదర్శన
చక్రమునకు బేళ్ళు (చంద్రమౌళి)                        (36)

టీ. గడుసుకైదువు= గుండ్రని ఆయుధము, వేయంచులకైదువు = వేయి మొనలుగల ఆయుధము, చుట్టుఁగైదువు = గుండ్రమైన ఆయుధము, బట్టువుఁగైదువు= దిట్టమైన ఆయుధము, -- ఈ నాలుగును విష్ణుచక్రమైన సుదర్శనము నకు పేర్లు.

ఆ. వలమురి యనఁ జుట్టు వాలుజో డనఁ గల్మి
కొమ్మమగనిబూర గొమ్మనంగఁ
దనరుఁ బాంచజన్యమునకు నభిఖ్యలు
(ధృతకురంగ ధవళ వృషతురంగ)                (37)

టీ. వలమురి = కుడితట్టుగ తిరిగి యుండూనది, చుట్టువాలుజోడు= సుదర్శనమునకు తోడైనది, కల్కికొమ్మమగనిబూరగొమ్ము= లక్ష్మి దేవి భర్త పూరించు వాద్య విశేషము -- అను ఈ 3 పాంచజన్యమనెడి శంఖమునకు పేర్లు.

తే. రిక్కలనఁ జుక్కలమగను ఋక్షములకు
నాఖ్యలై యొప్పుఁ దెఱఁగంటి యన్నులనఁగ
నచ్చర లనంగ వేలుపు మచ్చకంటు
లనఁగ సురకాంతలకు నాఖ్యలగు (గిరీశా)            (38)

టీ. రిక్కలు, చుక్కలు అని ఈ రెండును నక్షత్రములకు పేర్లు. తెఱఁగంటియన్నులు= అనిమిషస్త్రీలు, అచ్చరలు (అప్సర శబ్ధమునకు వికృతి) వేలుపుమచ్చకంతులు= దేవతల

స్త్రీలు, -- ఈ మూడును అప్సరసలకు పేర్లు.

తే. పవలు పగ లనఁ బేళ్లొప్పు దివమునకును
రాత్రిపే ళ్లొప్పు రే రేయి రాతి రనఁగ
వెలయుచుండును రేయెండ వెన్నె లనఁగఁ
జంద్రికకును సమాఖ్యలు (చంద్రమౌళి)          (39)

టీ. పవలు, పగలు -- ఈ రెండును దినమునకు పేర్లు, రే, రేయి, రాతిరి -- ఈ మూడును రాత్రికి పేర్లు, రేయెండ= రాత్రులందు కాయు ఎండ, వెన్నెల= తెల్లని చంద్రుడు గలది (వెలి+నెల) ఈ రెండును చంద్రకాంతికి పేర్లు.

క. మించు లన మెఱుపు లనఁగను        
జంచలలకుఁ బేళ్లు దనరు, జలధరములు రా
ణించుం బలుకంగ మొయి
ళ్లంచు మొగుళ్లంచు మబ్బులంచున్ (భర్గ)           (40)

టీ. మించులు, మెఱుపులు -- ఈ రెండును మెఱుపులకు పేర్లు. మొయిలు, మొగులు, మబ్బు -- ఈ మూడును మేఘములకు పేర్లు

క. తొలుచదువులు ప్రాఁజదువులు
దొలుమినుకులు ప్రామినుకులు దొలుపలుకులు ప్రాఁ
బలుకులు పెనుమినుకులు నా
వెలయున్ శ్రుతులకును బేళ్లు (విశ్వాధిపతీ)            (41)

టీ. తొలుచదువులు, ప్రాఁజదువులు, తొలిమినుకులు, ప్రామినుకులు, తొలిపలుకులు, ప్రాఁబలుకులు (ఈ ఆరు పదములకు "ఆదివాక్యము" లను అర్థము) పెనుమినుకులు= విస్తారవాక్యములు అని ఈ ఏడు ను వేదములకు పేర్లు.

క. ఇది దేవవర్గు దీనిం
జదివిన వ్రాసినను వినిన జనులకు నిత్యా
భ్యుదయంబు లొసఁగుచుండును
వదలక కాశీనివాసవాసుఁడు పేర్మిన్               (42)

ఈ దేవవర్గు నెవరు చదువుచున్నారో, ఎవరు వ్రాయుచున్నారో ఎవరు వినుచున్నారో వారికి కాశీవిశ్వేశ్వరుడు కరుణించి యెడతెగని సంపద లొసగును.

దేవవర్గు సమాప్తము
(తరువాయి భాగము "మానవవర్గు")

No comments:

Post a Comment