Wednesday, June 1, 2016

అష్టమహిషీ కల్యాణము - 16

పంచమాశ్వాసము
(శ్రీదేవి మహిమవర్ణన)
(ద్విపద)

అసమానలావణ్య యసమశరణ్య
బిసకాండసమబాహ బిసరుహగేహ
నిరుపమాలంకార నిత్యశృంగార                   (5580)
హరిభుజాంతరసంగ యనమేలుమంగ
యవధరింపుము దేవి యఖిలభూనాధ
కువలయసందోహ కువలయాహితుఁడు
చిన్మయాత్ముఁడ పరీక్షన్నరనాధుఁ
డున్నతోన్నత శుకయోగికిట్లనియె

2. ద్వితీయ పట్టమహిషీ
శ్రీ జాంబవతీదేవి వివాహ వర్ణన ప్రసంగము
------

వరరూపవతి జాంబవతి మొదలైన
తరుణుల నుత్పలదళవిలోచనల
నేరీతి వరియించె నిందిరానాధుఁ
డారీతి రీతిగా నానతిమ్మనుఁడు
మిత్రగోరూపాయ మిత్రుఁడైనట్టి                  (5590)
సత్రజితాఖ్యుండు శత్రుసూదనుఁడు
తపసు గుఱిఁచి ఘోరతపమొనరించి
తపన స్యమంతక తపముఁ గైకొనుచు
ధరణికేతెంచెను దరణినేఁడనుచుఁ
బురజనులెల్ల నబ్బురమంది చూడ
ద్వారకసొచ్చి మోదంబుతోఁ జక్ర
ధారియౌ యదుకులోద్ధారి నీక్షించి
ప్రణతులొనర్ప గోపాలపాలకుఁడు
మణిపీఠియందు సన్మానితుఁ జేసి
గుణివర్య యెచటఁ గైకొంతివీ దివ్య             (5600)
మణిచూడఁగ నభోమణికాంతి గలది
యిమ్మనుజులకెల్ల నిదియేలదక్కు
నిమ్మని యదుభర్తకిమ్మనియనినఁ
బకబక నవ్వి తప్పక చూచి శౌరి
నొకమాట మోమోట యుడిగి యిట్లనియె
నగములకేగి వానలఁ దొప్పఁ దోఁగి
చిగురుల నమలి మించిన యెండఁ గమరి
భానుచేఁ గొనియటు పటురత్నమొరుల
కీను బంగరుకుప్ప లీనునాయింట
నని దీనినీఁ గూడదని యింటికతడు                 (5610)
చనియె నమ్మణి విలాసమున నొక్కెడను
భూనాధ యతనితోఁ బుట్టు జితారి
సైనుఁడైనట్టి ప్రసేనుండు దాల్చి
సమకట్ల జల్లులస యోగమొనర
సమకట్టినట్టి యశ్వము నెక్కినిక్కి
రాజులు భటవీరరాజులుఁ గొలువ
వాజి దాఁటించి తీవ్రత వేఁటవెడలి
బాగైన యపరంజి పట్టేడల్నిగుడ
సాగి గుఱ్ఱనుగాఁగ జాగిలంబులును
గిరిగొన్నకైదు కక్కెరలఁ గొక్కరల              (5620)
జరగనీ యకపతఁ జాలుడేగలును
కాఁచిపుటంబిడి కనకంబు వెట్టి
తూఁచి కైకొన్నట్టి తోచిగాడులును
మువ్వల గిలగిల మొఱయ జాడించి
క్రొవ్వుననుప్పొంగు కొమరు సాళ్వములు
కనినంతనే కురంగముల సంఘముల
పెనుపడి చెండాడు పెనుబండిపులులు
సెలకట్టియలు గొప్ప జేవడంబులును
సిలకట్టియలు పెక్కు చిక్కులవలలు
పెనువిండ్లు సగము జాబిల్లియమ్ములును                  (5630)
ఘనములౌ కత్తులు కడిఁది తిత్తులును
బూని వేటరులు గబ్బులుమీఱి కదల
నెనాదులకుమున్నె యేగ నారాజు
కోల గాలవజాల కుంద ముకుంద
సాల బాలాంకోల జంబు కదంబ
తుంగ నారంగ బంధూక మధూక
తుంగ రంగత్తాళ ధూప నీపాట
తరులఁ బాఱెడు నేర్లదరుల శైలభ
కరులచే నొప్పారు కానసొత్తెంచి
మేఁటి రౌతులఁ జుట్టి మీటుగా నిలిపి               (5640)
వేటరులును దాను వేఁటాడఁ దెణఁగె
సారెకుఁ గోఱలు చప్పఱించుచును
దోరంబులైన పందులరోసి యేసి
పట్టెడ లెడలించి పచరించిచాయఁ
బట్టఁ గుక్కలదాని పైనుసకొలుపఁ
గవిసి యాయంబులు గఱచి విదిర్చి
తవిలి గొంతుల నల్లఁ ద్రావుచునుండఁ
బొదలఁ గ్రక్కదలఁ జోఁపుడు కొలచోప
నుదురి బిట్టెగసిన యుదిరికైదులును
లావులుగా సోఁగ లావులు నివిరి                      (5650)
కైవాలకుండుడే గలఁ బూఁచి లైవఁ
గ్రక్కున బాఱి ఱెక్కలమీఁద నెక్కి
యక్క పక్కియ చెక్కు నడియనొక్కుచును
గువ్వల వడిబట్టి గువ్వలైన
నవ్వుల కుందేళ్ల నాడేళ్ల లేళ్ల
చాయకమును మింటఁ జను సాళువములు
నాయెడ బోయని నార్చి పిల్చుటయు
భోరునదూరి తెప్పుననెత్తి దొత్తి
క్రూరత మెదడు ముక్కుల గ్రుచ్చిమింగ
గవులలోఁ బులులఁజే కత్తుల కడిమి               (5660)
నవలీలఁ బొడిచి సాహసములు నెఱపఁ
బొదలైన యొడలు నబ్బురమైననడలు
జిగిగొన్న పొడలికెం జాయలేఁ దొడలు
కలిగి మిక్కిలి చూడఁ గలిగిన దుప్పి
చెలుప మీక్షించి ప్రసేనుఁ డంకించి
పరివారమీదుప్పిఁ బరిమార్నవలదు
పరికింపుఁ డిదెదానిఁ బట్టిదెచ్చుటను
నని వారి వారించి యచ్చోటనునిచి
ఘనతర తనవారిఁ గైకొన్న మేగము
వలనెల్ల నివ్వలవ్వలగాఁగ నఱికి             (5670)
స్వ్లవింటి కోలయేసిన రీతిఁ గదలఁ
గ్రమ్మి యామృగ తీవ్రగతితోడఁ గూడ
సమ్మెట నటన పంచార మంటించి
యదరంటధేయని యార్వనావాజి
పద రవోద్ధుతరాజి బలువాజిఁ దోలి
చొచ్చిన చోట్లను జొచ్చిపోనీక
విచ్చల విడివడి వెన్నాడి పోయి
కరిఘటా నిటల సంఘటిత నఖాగ్ర
హరి కహకహ విరావాకులంబైన
కానలో నాదుప్పిఁ గానకతప్పి                    (5680)
నూని నీళ్లుల టెంకియున్న యత్తఱిని
నీరంధ్ర తరు లతా నికర మధ్యమున
నీరెండగాయుచు నీమణిఁ జూచి
గంహ్వారి ధరగుహ కడతెంచియొక్క
సింహ్వంబు నరనాధసింహుపై కెగసి
హరితోడఁ గూడంగ హరియించి మణియు
హరియించి యొకత్రోవ నరుగుచు నుండ
నాతత బలవంతుఁడగు జాంబవంతుఁ
డాతఱి సింహంబు నవనిపైఁ గెడపి
యామణిఁ గైసొని యలరి వేఁడుకల              (5690)
యామనితోయాడ నాత్మీయ గుహకుఁ
జనిరత్నమపుడు పచ్చనిత్రాట గ్రుచ్చి
తనపట్టి తోట్టిమీఁదటఁ గట్టెనంత
గగనేశుఁ డరిది దిక్కన్యక యఱుతఁ
దగిలించు రత్నంబు తాళిబొట్టనఁగఁ
జదురైన యఱసంజ జవ్వని చంటఁ
బొదవిన సిబ్బంపు పొడయో యనంగఁ
గొంచక దినయాంత్రికుండు సురల్మెచ్చఁ
బొంచివైచినగచ్చు బొమ్మరంబనఁగఁ
బచ్చమావుల రెండు పసగల కెంపు               (5700)
పచ్చనిచాయ లంబరమున నిగడఁ
గ్రుంకుడుకొండఁ ద్రొక్కుచు నపరాబ్ధిఁ
గ్రుంకి చీకట్లు ద్రిక్కులవేగుఁ జూడఁ
దుద భానుభాను విద్రుమ లతల్ లిష్ఠ
పదమును రెంటింట బలసెనోయనఁగ
సురిచిరంబేక కౌసుంభాంబరంబు
కరణి దిక్తటులు చూపట్టి నభ్రమునఁ
గడిఁది మున్నమృతంబు గరుడుండుగొనుచుఁ
గడువడిఁ జనఁగఁ దత్కలశంబు తొలఁకై
చెదరియాకసమునఁ జింది చూపట్టు                     (5710)
తుదలేని యమృతంపు తుంపురులనఁగ
వికసించు చేమంతి విరులచందమునఁ
బ్రకటంబులై కనుపట్టెఁ దారకలు
తేరిచి విరహి వీధినిగామరుండు
కోరి కట్టిన రసఘటికయోయనఁగఁ
గలువలుచెలఁగఁ జక్రంబులు దొలఁగ
వలరాజుకొసర జీవనజముల్గసరఁ
బొడలైన మించుల పొడపు గుబ్బలినిఁ
బొడసూపెనంత వేల్పుల మేఁతకుప్ప
కలికిరే రాఝు నక్షత్ర మాలికకుఁ                   (5720)
గొలికిపూసనఁగ వేగురుచుక్క పొడిచెఁ
గఱక చీఁకట్లను కరులమాయింపఁ
బఱతెంచు సింగంబు పగిదిఁ జూపట్టు
భానుండు సారుణభానుఁడై పొడిచె
సేనలారే యిప్రసేనుని వెదకి
కాకకేయిరవును గానకేతెంచి
తోన సత్రాజిత్తు విన్నవింపఁ
బొక్కి సొంపులు దక్కి పొదలు దుఃఖమునఁ
జిక్కితా నవివేకచిత్తుఁడై పలికె
బరమ మాయావి శ్రీపతి ప్రతిలేని                       (5730)
వరమణి యాదవవరుని కిమ్మన్నఁ
దమ్ముఁ గైకొనకున్నఁ దమ్మునిఁజంపింప
యమ్మణి శ్రీమణి హరియింపఁ బోలు
నన విని రోషించి యాదానవారి
తనవారిజనుల సత్రాజిత్తువారి
జొప్పున రమ్మని సోమకాసురుని
చొప్పెత్తు తలవరిచూడఁ జోద్యముగ
మునువాఁడుచను మార్గమును జూపికొనుచుఁ
జని వన మంజుకుంజముల పుంజముల
సరసఁ బ్రాణములు తేజము దక్కి స్రుక్కి              (5740)
ధరఁ ద్రెళ్ళియున్న సత్రాజిత్తు తమ్ముఁ
గనుఁ గొని యత్తురంగమును సింగమును
జనులకుఁ జూపఁ గేసరి నేలఁ గూల్చి
యెలుఁ గులఱేఁడు వోయిన తోవఁ బోవ
నలరు చీకటి రథంబగు బిలంబొకటి
నాలోనగనిఁ జాడ లరయంగఁ జూడ
లోలోనఁ గనువట్టె నివిచూడుఁ డనుచు
నల బలంబవునని యల బలంబులను
బిలము వాకిటఁ బెట్టి పీతాంబరుండు
నా మహాగుహ సొచ్చి నట నొక్క హేమ              (5750)
ధామ ధామంబురోధామ సద్మమున
నుదుటు మారునివాడి నొకముద్దులాడి
ముదురు గోయిల గ్రొల్చు మోహనంబలర
బంగారు గొలుసులు గట్టిపాలిండ్ల
ముంగిళ్ళుఁ గదలఁ దమ్ముఁడతంచు నూచి
జోలఁ బాడఁగఁ దొట్లఁ జొక్కుచు నవ్వు
బాలుచే పడుడుచు నూఁపఁగ మిట్టిపడుచుఁ
జక చక ద్యుతుల భాస్కర కరావళికిఁ
దుకతుక లొసఁగు బంధుర రత్నమపుడు
కొని వేడ్కనొడిఁ బెట్టుకొనినంతఁ జెంత          (5760)
వనితహాయని జాంబవంతుని బిలువ
పదవడి యా ఋక్షపతి రమాపతిని
గదిసి కోపాటోపకంఠుఁడై నిక్కి
శూలికిఁ గేలికి సురలకసురల
కౌలోను జొఱఁగరాదెట్లు జొచ్చితివి
అనుచు దర్పించి మిన్నగల గర్జించి
ఘనవృక్షమునవై వఁ గంసారి దాని
దనిమె భుజమును బంధురతరాహతిని
గనలి మేఘములీల గర్జించి పొంచి
పాణినాతఁడు చక్రపాణిమైవైవ                (5770)
జాణూరమర్ధి కంసధ్వంసి ముష్టి
నా ఋక్షపతి వక్షమపుడు తాటించె
నారూఢ జయధరుండగు ఋక్షవరుఁడు
హరిఁ ఘొట్టెనతను శ్రీహరిఱవ్వె నతఁడు
ధరణీశువైచె నాతని శౌరి యొడిసె
బహుగుగాగహన సంభరితోగ్ర సహజ
మహితారవంబులు మహిఁ బిక్కటిలఁగఁ
గరియును గరియు సాగరము సాగరము
హరియును హరియుఁ బూర్వాపరాగములు
పొదివిన కరణినేర్పునఁ బోరుసరణిఁ         (5780)
గదియు చందమున డగ్గఱిన యందమున
మల్లయుద్ధముననే మఱకయయ్యచ్ఛ
భల్లభర్తయుఁ బంచభల్ల కర్తయును
నిరువది యొకదినం బీరీతిఁ బోర
హరి ధృతతరకరాహతులకు జడిసి
వక్రారి వనశుక్ర వంచిత శుశ్ర
విక్రమధామ త్రివిక్రమ స్వామి
ప్రతిలేని గతి నిరువదియొక్కమాఱు
క్షితిప్రదక్షిణము సేసితినింతయలయఁ
గందువు వంక్తికంధరునితో మున్ను                        (5790)
బంధురగతి నెదుర్పడియునే జడియఁ
బరుఁడు గాఁడితఁడజ భవముఖులకును
బరుఁడై నయల పరాత్పరుఁడుగా నోపు
నని తలపోసి పద్మాక్షుని డాసి
వినతుఁడై భల్లూకవిభుఁడు కేల్మొగిచి

(గోమూత్రికాబంధము)

కమలేశ నరహరి ఖగరాజగమన
...........................
కరుణాకటాక్ష శ్రీకలితోరువక్ష
పరమయోగీశ హృత్పద్మ దినేశ
యపరాధి నపరాధి నని ప్రొక్కి స్రుక్కి                 (5800)
కృపణుఁడై శౌరికిఁ గృపబుట్టఁ బలికె
తమ్ములై మ్ర్ఱుఁగు ముత్యమ్ములై శోభి
తమ్ములై బెళికెడు తళుకుఁ గన్నులును
దామరై కళాలకా దామరై శీత
ధామరై శాంతి మెంతయునొప్పుమోము
గొప్పలై యొప్పుల కుప్పలపై పసిఁడి
తిప్పలై నిగ్గులు దేఱు పాలిండ్లు
సన్నమై మేఖలాసన్నమై గగన
మున్నమై నొప్పుచునున్న నెన్నడుము
చక్రమై సౌందర్యచక్రమై విసల                   (5810)
వక్రమై చెన్నొందు వలుద పిఱుందు
రంభలై మోహనారంభలై కాంతి
కుంభలై యొఱుపులు గుల్కునూరువులు
మించులై పవడంపు మించుతలిరుల
వంచులై యొప్పెడు చరణముల్గలిగి
మరుమోహనాస్త్రంబు మాడ్కిఁజెన్నొందు
తరళ తోయజనేత్రి తనదు సత్పుత్రి
వరరూపవతి జాంబవతి యనుకన్య
సిరికూర్మి మగనికిచ్చిన సంతసించి
మామనొప్పులు దీర్చి మన్నించి చంద                  (5820)
మామయర్మిలి బావ మహనీయ బిలము
యత్నంబు సమకూరెనని వేడ్క వెడలి
రత్నంబుఁ గామినీరత్నంబుఁ గొనుచు
ద్వారక సౌధాగ్ర తారకసొచ్చె
నా రమాపతిఁ జేరి యాదవోత్తములు
రవిదేరఁ గొన్న సారసరాజి రీతి
ధవళాంశుఁగన్న యుత్పలముల రీతి
గంటిమె కృష్ణులోఁగలఁ కలువీడఁ
గంటిమనుచు వేడుకలఁ జిక్కు చుండి
రరసి తద్వాసనలవియ చెప్పెడిని                  (5830)
సారసాంగి నడుమాక సంబౌటనట్టు
లరుదు మించిన సొమ్ములవియ చెప్పెడిని
............................
కామిని పిరుఁదు చక్రంబౌట నట్టు
లాముద్దు వట్రువు లలియె చెప్పెడిని
అని కొని యాడంగ యాదవువ్విప్ర
జనమును గీర్వాణజనము గీర్తింప
రామతో జయరమారామతోఁ గూడి                     (5840)
రామానుజుఁడు నగరము ప్రవేశించి
తనదు మాతకును దాతకును బ్రాతకును
వినతుఁడై సభలోన విభుదులు గొల్వ
నన్న సంగడినుండి హరి యింతచేసె
నన్న సత్రజిత్తు నటకురప్పించి
యకలంకుఁడగు శౌరియందఱు వినఁగ
సకలంకుడైన యజ్జనపాలు ననియె
బంధుడై కొండంత బలఁగంబులోన
నిందించి తేటికి నిర్నిమిత్తముగ
హరినాదు రత్నంబు హరియించె ననుచు                (5850)
సరిచుట్టములకెల్లఁ జాటి చెప్పితివి
అడుగు మివ్విధము నీయర్మిలి యనుజు
నడుగు ముందరిచొప్పు లరయుమీవారిఁ
గారులాడెడువారు కారుమీవార
లూరకమమునాడ నుచితమే నీకు
ననిమాని కొమ్ముకొమ్మని మీఁదవైచెఁ
బెనగొన్న సిగ్గుతో బెగడొంది యతఁడు
యోగివంద్యుని నీతి యుడిఁగి మిధ్యాభి
యోగిఁ జేసిన పాపయుక్తుండ నేను
నీపాటియని పారమెన్నంగ రాని                   (5860)
యీపాప మిఁకఁ బాపనెవ్వరు గలరు
అని వంతచింతయు నంతంతఁ బొదల
తన యింటికేగి నెంతయు నూహసేసి
యరయ సర్వ ద్రోహినైన వాక్రుచ్చి
శరణన్నఁగాఁచు నబ్జదళాక్షుఁ డనుచు
నీలంపు రంగులో నికరంపు కప్పు
బాలేందులోపల పసపట్టునొసలు
వలరాజువిండ్ల జీవాళముల్బొమలు
కలువలలోని చొక్కములు నేత్రములు
మెఱుఁగు కెంపులలోని మిసిమి పల్వరుస                 (5870)
చిఱుత వెన్నెలలోని చిక్కని నవ్వు
పసిఁడి సంపంగిలో పలిత్రాణనాస
రసముల చిగురు సారసము కెమ్మోవి
శ్రీకారములలోని చెల్వును వీను
లాకంజసమితి మోహనము నెమ్మోము
ఒసపరిసంకున యుసురుకంఠంబు
పసిఁడి తీవలమేలు పట్టు బాహువులు
మేఁటి జక్కవలలో మీటుచన్దోయి
తేఁటి దాఁటులమీఁది తేటనూగారు
గగనంబులోపలఁ గలమేనునడుము                      (5880)
జిగిమీఱు పులినంబు చెలువంబు పిఱుఁదు
మించు రంభలలోని మెఱుపులు తొడలు
మంచి తామరల మర్మములు పాదములు
నని మెచ్చఁదగు నవయువములనొప్పు

(తరువాతి భాగము "తృతీయ పట్టమహిషీ శ్రీ సత్యభామాదేవీ వివాహవర్ణన) ప్రసంగము"

No comments:

Post a Comment