Friday, June 10, 2016

అష్టమహిషీ కల్యాణము - 17

3. తృతీయ పట్టమహిషీ
శ్రీ సత్యభామాదేవీ వివాహవర్ణన ప్రసంగము

ననుపమనుత ధామయగు సత్యభామ
యను కన్యకామణి నామణినపుడు
కొని శౌరిఁ జేరి నూల్కొను భీతితోడ
ధరసాగి మ్రొక్కి హస్తంబులు మోడ్చి
కరుణాకలాపాంగ కమలాంతరంగ
యనఘ శరణ్య నాయపరాధ మెడయ             (5890)
వనితాశిరోమణి వనజాప్తమణియుఁ
గానుకగా నీవు గైకొమ్మటన్న
నాననజితసోమయగు సత్యభామఁ
గొనకొన్న ప్రేమచేఁ గొని సంతసించి
దనుజేంద్రజిత్తు సత్రాజిత్తుఁ జూచి
యీ వేళమాణిక్యమే నొల్ల నాకు
నీ వధూమాణిక్యమే చాలుననుచుఁ
జతుర వాచామృత సారంబుచేత
నతని శోకాగ్ని చల్లార్చెనంతటను
బలుఁడు పురంబు దర్పణచామరాది               (5900)
లలితంబుగాఁగ నలంకరింపించె
బలరామునానతి బలసహోదరుఁడు
సలలిత మంగళస్నానంబుఁ జేసి
చుంగులై కాఱు మించులఁ గెరలించు
బంగారురెంటెంబు బాబుగాఁ గట్టి
యాతత మణిమయంబై సూర్యకోటి
తీతిఁ జూపట్టు కిరీటంబు దాల్చి
రత్నకరాత్మజా రత్నానుజన్మ
రత్నసంకలిత హారంబులు పూని
కడివోనిపూబాసికము సవరించి                    (5910)
వడి వివాహుండు వివాహ మంటపము
నడుమశోభిల్లెఁ గాంతాజనంబపుడు
తడయకెంతయు ధళధళలుట్టిపడుచు
నాణెంబులగుచు విన్నాణంపు వగల
రాణించు చీనాంబరబులు గట్టి
నామమున్ రాచ యందముగఁ జేలోజు
మామకోయనియను మానింపఁ దీర్చి
మెఱయు చక్కెరవింట మొదలు తుమ్మెదల
దరము క్రొన్నెఱులు బిత్తరముగా దువ్వి
సిరులఁ జూపట్టు బాసికములు గట్టి              (5920)
సరసరత్నముల సూసకములమర్చి
ససువత్తగలనగవుల సయ్యాటమాడు
నొసపరినెమ్మోము నొకకొంతవంచి
జిలుఁగుమేలతికల చెఱఁగు లల్లాడ
నలఘు శోభనవతియగు జాంబవతిని
హసితనిర్జిత భామయగు సత్యభామ
నసమానలగు చెలులటకుఁదో తేర
నపుడు సత్రాజిత్తుఁ డాజాంబవంతుఁ
డపరిమితానందులగుచుఁ బూజించి
పంకజాక్షుల మధుపర్క పూర్వముగఁ                (5930)
బంకజాక్షునకు శోభనవేళ నొసఁగ
నెలుఁగెత్తి నిజపురోహితుఁడు సువ్రతుఁడు
సలలిత మంగళాష్టకములు చదువఁ
దిరమగు ప్రేమనత్తెఱనిక్కి విప్ర
వరులు దీవెన విప్రవరుల చెలంగి
తళుకు చూపులకల్వ దండలొండొరుల
గళములఁ దగిలి ప్రకాశింపుచుండఁ
గదిసి ముఖావలోకనములు జేసి
అదనుతో విష్ణుఁడగు విషుఁడంతఁ
తొలి తొలి నాల్గువేతులు దోయిలించి                   (5940)
పొలుపొంద నవరత్నములు ముంచి మించి
కలహంసికా యుగ్మకము చెల్వమొదవు
తలిరుఁ బోడుల మీఁదఁ దలఁబ్రాలునించె
నపుడు దోయిళ్ల గన్యామణుల్మణులు
నిపుణతనించి శ్రీనిలయుపైఁ జెలఁగి
కచభరంబులు వెనుకకు వీఁగనచల
కచకుంభములు ముద్దు గునియంగనిక్క
తలఁబ్రాలు నించి రత్తఱిమరువాడి
చిలుకు చూపులు ముద్దుఁ జిలుకు భామినులు
చిలుపగాలికిని జెంజి గురులు బెళుకు                 (5950)
చెలువున మోవులు చీమంతకదల
శుకపిక నికరంబు బోడుగాఁ గూడి
సుకుమార గతిఁ బల్కు సొబగు దీపింప
బిసరుహాక్షుని కూర్మి పేర్మి వర్ణించి
పసమించ శోభనాల్పాడిరీ రీతిఁ
గన్యకామణుల నాగమవిధి నబ్ధి
కన్యకాధవుఁడు లోకములు గీర్తింప
పరియించె గీర్వాణవరులు భూవరులు
వరనుతుల్సేసిరి వసుమతీసురులు
అతిమోదమున వివాహంబును గోరి                     (5960)
సుతులకు శౌరిసంస్తుతలు నేర్పుచును
ప్రాకుపండ్లూడి వెల్వెడఁగ నేత్రములు
చీకిలింపుచుదిట్ట చేతులు సాచి
పనస చక్కకఁ జెప్ప పనసయటంచుఁ
దనయ శిష్యులకు వేదముఁ జెప్పికొనుచుఁ
జెవినెఱ్ఱ పోఁగు దాల్చిన వారినెల్లఁ
దవిలి వేఁడుచు నక్షతంబు లిచ్చుచిను
గ్రాసమిప్పింపుఁడు కాదేనియొక్క
కాసైనదానమీఁ గదరేయటంచు
బదుగురైదుగురొక్క పౌఁజుగాఁ గూడీ              (5970)
పదరి యందలములో పలివానినైన
లోఁగక పల్లకిలో వానినైన
వీఁగక తుంపురుల్వె డలంగఁ బెద్ద
యెలుఁగున నడిగి వారిచ్చినందులకు 
నలయపాళ్లకును దిట్లాడంగవారి
సతులంత పతులతో సహభోజనములు
మతులఁ గాంక్షించి సమ్మతుల నొండొరులు
అచ్చికూచక్క వోయకు మంచి మంచి
యచ్చావధానుల యక్కచ్చిలచ్చి
అచ్చిబూరెల బుచ్చి యందఱుమీరు                    (5980)
వచ్చెదరే మన వారందఱిప్పు
డాయెడ హరి వివాహంబును గోరి
పోయిరే మనమును బోవలెస్సగును
పప్పుఁనేతులు  పెర్వు బంతులు బట్టి
గుప్పుదు రట్టేని కూర్కొని త్రావ
సారంపు వాసన సగుడమైనట్టి
వారినెవ్వారి నెవ్వారికోనైన
చాఁపట్టులును బాయసము సొజ్జి బూరె
లోఁపినవారల కోఁపంత కొలది
కలలోన గంజియే కాని మాయత్త                (5990)
పిలిచి యొకింతైనఁ బెట్టదన్నంబు
నడివచ్చెననుచు వేసరియప్పి గాని
వడువువాహుఁడ యింత వంఠంబు వెట్టె
తడిలేని త్రావుడు త్రావంగఁ జంటఁ
దడీలేదు పాపఁడు ధరియింప నీఁడు
తడవేల కుడువఁబోదమురారె యొడలు
కడిగికోఁగదరె యోకైకలారనుచుఁ
దాలికల్గట్టి చెంతలఁగొంత జాఱ
పాలముల్పచ్చగాఁ బసుపులు పూసి
దళముగా నవ తైలధారతో మెదిచి              (6000)
వెలయఁ జెంద్రపు బొట్లు వింతగాఁ బెట్టి
పచ్చనక్షతములాపై నిగడిచ్చు
విచ్చుటాకులు వెడవెడఁ జుట్టి తాల్చి
కాటుక కన్నులఁ గలయంగ నలఁది
.......................
బలువిడి నెఱకల బారగాఁ దివిచి
నులిచిన పెనుబొగ్గు నూళులువైచి
పాడువారినయట్టి పల్ల వెంటుకలు
కూడ దువ్వుచునులి కొప్పులు వెట్టి
కడుముదుకగు చాయగల చీరలెల్ల                 (6010)
ముడూకులనొరయంగ ముఱియుచుఁ గట్టి
చతురాస్యుడాస్య రసంబుల నిట్లు
లతివలఁ గావించె ననిజనుల్వొగడఁ
గన్నబిడ్డలను జంకలఁ బెట్టిమున్ను
మున్నచెంతలఁ బెను మూకగా నడువఁ
గుసిగుంపు నడకల కోడెబాపెతలు
అసమాన గతివచ్చి నావిప్రవరులు
సతులతో సుతులతో జాడ్యంబు దేఱు
గతులతో రుక్మిణీకాంతుని జేరి
కరములు చూఁచి యాగమములు చదివి              (6020)
హరి నీకు వేదోక్తమాయుష్యమస్తు
కంటగించని నీదు కల్యాణ మహిమ
వింటిమి మునుపని వింటిమీ వేళ
కృష్ణయొడ్డుననుండి కృష్ణమాయాత్మ
తృష్ణ దీర్చె దవని తివిరివచ్చితిము
పూనిన కార్పణ్యముడుగు సువర్ణ
దానంబు పరమాన్న దానమిప్పింపు
వరదుఁడవీవయీ వలయును గాక
యరయనన్యుల కీయ నలవియే కృష్ణ
యన విని హరి నవ్వి యారీతి విప్ర                   (6030)
జనములకెల్ల భోజనము గావించి
భూరి రత్నాంబర భూషణావలులు
భూరిగా నొసఁగి యప్పుడు వీడుకొలిపి
నీల నీలాం బుదనిభ దేహుఁ డపుడు
బాలేందుసమ ఫాలబాలలతోడ
సమరభూపాలంబు చయ్యన నెక్కి
........................
ధరదివ్య భేరివాద్యములు వాద్యముల
యురుతర ఘోషంబు లుడువీధిఁ బొదువఁ
గమ్మవిల్కాని సృంగారంపు తరువు                      (6040)
కొమ్మలోయన నొప్పుకొమ్మలంతంత
నురుతరాయత నేత్రయుగళ భావంబు
అరవిందముల మూయ నారతులొసఁగఁ
బురవీధినేగ గోపురవరద్రాజ
తరుణు లాసతులా సౌందర్య మీక్షించి
ఘననీల ఘనమిరుఁ గడలఁ జూపట్టు
మినుకైన క్రొక్కాఱు మెఱుఁగులో కాక
లలితేంద్రనీల శైలముల పార్శ్వముల
దలకొత్తు కనకలతాయుగ్మకంబొ
గట్టిగా నడుమునఁ గాంచనాంబరుఁడు              (6050)
చుట్టు బంగారుదట్టి చుంగులోయనఁగ
నలినాయతాక్షులనలు వెన్ని మఱియు
మృగనేత్రనాతోడు మొలఁతుకకొప్పు
గగన నీలిమకన్నఁ గప్పౌనొకాదొ
యన మఱియును గొప్పులట నవ్విధమున
వెనుకకుమఱి విఱ్ఱవీఁ గంగవలదె
చెలియ నీగురునాన చెలువ నేత్రములు
కలువల కన్నఁ జొక్కలౌనొ కావొ
అవునే మఱియు గన్నులట నివ్వివిధమునఁ         (6060)
గవగూడి తళుకులఁ గనుపట్టవలదె
కుసుమాంగి నీయాన కొమ్మకెమ్మోవి
కిసలయంబున కన్నఁ గెంపౌనొ కాదొ
యడర మఱియు మోవులట నవ్విధమున
వడిఁదేనిఁ జాటజొట వడియంగవలదె
నీకనులాన యన్నెలఁత కర్ణములు
శ్రీకారములను మించినవౌనొ కావొ
యతివ మఱియు వీనులట నవ్విధమున
జితనవసంజ్ఞలై చెలువందవలదె
అని పెక్కుగతుల నయ్యంబుజాననలు              (6070)
కొనియాడ సౌందర్యగుణ హారి శౌరి
యలఘుశోభాకరంబగు పురంబెల్ల
వెలయంగ మెఱసి యవ్వెఁలదులతోడ
సుముకులై సుమన్నస్సుల్సుమవృష్టి గుఱియ
రమణీయ నిజమందిరమునఁ బ్రవేశించి
యతుల యౌవనసీమయగు సత్యభామ
కతిమోదమునఁ బ్రసేనాగ్రజుఁ డపుడు
సామజ తతులతో సతులతోఁ గూడ
నామణినర్పించె నరణంబుగాఁగ
దేవతల్ధారుణీ దేవతల్వొగడ                  (6080)
దేవకీతనయుఁడెంతేవేడ్కనుండె
చటుల నిందా సర్వ సర్పారియగుచుఁ
గుటిల పాతక దైత్యకుల చక్రవర్తి
ధరమించునిట్టి చిత్రపు చరిత్రంబు
వర చతురతర కావ్యము సేయువారి
కున్నతోన్నతమతి నొకమాఱు పేరు
కొన్నవారలనుమాఁ కొన్నవారలను
తాపంబు లఖిలనిందలు చెందవమిత
పాపముల్వాయు సంపదలెల్లడాయు
కమనీయ గుణహారి కమలావిహారి                   (6090)
యమరారికుల హారి యౌ శౌరియంతఁ
గెంపు మించిన తురంగీలాగి వెట్టి
సొంపుగానందుపైఁ జొక్కంబుచుట్టి
మెఱుఁగుఁ జుక్కల మిసమిస తేటలెల్ల
మఱపించు నవకుందమాలిక వైచి
యకలంకమై కెంపుటంచులు గల్గి
శుకవర్ణమైన యంశుకము ధరించి
కిసలయవాదనా కృతులైన శ్రుతులు
మిసిమి యందంబుతో మించుకందంబు
కడువెడఁ దైచెన్ను గలిగిన వెన్ను                (6100)
నుడురాజుపూర్ణ తనొందు పిఱుందు
నరుణాంశుధామంబులైన రోమములు
తరుణేందుమై మించుఁ దలపించుచుంచు
నలఘు తేజోజ్వాలమైన వాలమును
గలుగు నుత్తమ హయకంఠీరవమును
సంజోగ మొనరించి సాహిణియెదుట
రంజిలి నిలిపి పరాకంచుఁ బలుకఁ
దననిటు కేలిబిత్తర పల్లెవాటు
గనుఁగొని జనులు చొక్కఁగఁ బదాగ్రమున
నిరతుఁడై యంక వన్నియమెట్టి సర్ప               (6110)
హరతురంగుఁడు తురంగారూఢుఁ డగుచు
నిండిన నిజకీర్తి నికరంబులనఁగఁ
బుండరీక ద్వయంబునుఁ జెంతనలర
నెలమి భూనాధులు హేమకాండముల
విలసిల్లుచుండెడు వీఁచోపులిడఁగ
కుడినీరు బిందియ కుంచ కాళాంజి
యడపంబుగిండియు నందంపు సురటి
మొదలైన యూడిగములఁ దాల్చి కదిసి
పదరక చెదరక పరిజనంబరుగ
నతిభయావహ మహాహవభూ ఖురాగ్ర                 (6120)
హతి కంపితారి కరాళింగరాళి
నరిశంభ భీకరుఁడగు నరుండెక్కి
యురుతర గతుల రాహుతులతోనడువ
దేవ! హెచ్చరిక దైతేయారి! యనుచు
ఠీవిమైమున్న కటికవారునడువ
నలరు శంఖ ధ్వనులడరంగ దైత్య
కులవధూ గర్భార్భకులు రెంజితుంజి
యఱి ముఱిమరువేపనా వాద్యగతులఁ
గుఱుచల నిడుదలఁ గూడి వాయింప
సన్నయెఱింగి యాసన్న కాళియులు                   (6130)
సన్నలోనుగఁ గూడి జమళిఁ బూరింప
యరి భీషణాకారియగు భేరిరవము
ధరనభోంతరము పాతాళంబు బొదువ
ఢక్కాహు ఢుక్కాది ఢమ ఢమ ధ్వనులు
దిక్కులు నిండి యెంతే భోరుకలఁగ
కడిఁదీ హెగ్గళ్లు హెగ్గెడికత్తియలును
బడిబడివడి బరాబరి సేయుచుండ
వాలుఁ గన్నులు రాణి వాసముల్చాలు
కీలుచుమ్మల పల్లకీలెక్కియరుగఁ
గనకభూషల పటికలనంబువారి                  (6140)
ఘనతర వస్తుసంఘములచే మిగుల
నలరుచువెక్కసం బగు బొక్కసంబుఁ
బలువేసడంబులు భరియించినడువ
నమృతాన్నవర కాంక్షితాధరబింబ
రమణులనగు వారరమణులే తేర
రాజులు భటవీరరాజులుఁ గొలువ
వాజిదాఁటించి భావజగురుండపుడు
కేలవాగియ చక్కఁ గీలించి కుదిచి
తాళముల్ద్రొక్కించి దాఁటి యాడుచును
జోడనఁ గొనిపించి సొగసుగా జుట్టి            (6150)
వేడెంబు వడినడ్డ వేడెంబు ద్రోలి
నిగుడంగఁ గుఱుచల నిడుదలనూకి
మగిచివైచుచుఁగేల మస్తరించుచును
పొడకట్టి జనపదంబులు నదంబులును
కడతెంచి పోయి పంకజలోచనుండు
వృషభాజిద్వాది విస్ఫూర్తి గలిగి
విషధరోత్తంస నివేశంబు పోలె
వరుణ కౌశికముఖ్య వర్ణితంబగుచు
వరుసనెన్నఁగ దిశావలయంబు పోలె
ఘన పద్మపత్ర ప్రకాశత కలిగి             (6160)
గనుపట్టు గగన మార్గంబునుం బోలె
నందమై నిరతిశయానందమొసఁగు
బృందావనము గల్గి పెంపొందువనము
కనుఁగొని సొత్తెంచి కాంతలుఁ దాను
వనకేళిఁ దవిలి యవ్వసుదేవు చూలి     
కమ్మగా వాసనల్గ్రమ్మఁగా నొక్క
కొమ్మపూఁ గొమ్మగై కొమ్మనియొసఁగ
మంజీర కుచయోర్తు మంజుల కుంజ
మంజరులొసఁగ నమ్మాధవుండలరి
విరిమొల్లనొల్లను వెలఁది నీచన్ను              (6170)
విరిగుత్తులే నాకు వేడుకయనినఁ
గడివాని తీఁపులు గలుగు నెమ్మోవి
పడఁతి యొక్కతెదొండ పండుచేనొసఁగ
బింబమే నొల్లనో పికవాణి యధర
బింబమిమ్మని చేరఁ బిలిచెఁ గృష్ణుండు
మఱికొన్ని యెడలనే మఱియున్న చిఱుత
యుఱుతలఁ దఱుముచు నువిదలొండొరులు
ఇత్తమా శౌరికి నిత్తమాలములు
హత్తియా పికముల నందందబట్టి
నాగకేసరమేల నాగకేసరుగ                   (6180)
నీగు బాగులుమాని యీఁగదే యమ్మ
యతిసౌరభంబైన యతిసౌరభంబు
తతిపూచెఁ గంటిరే తరళాయతాక్షి
నాగేంద్రగమన పున్నాగంబు సుమము
లాగడంబులు మాని యందికోఁ గదరె
దవనంబు ఘనశారద వనంబు చూడ
దవళాక్షిమైఁ జల్లఁ దావిచల్లెడిని
నని యిట్లు చతురవాక్య ప్రౌఢి నెఱయ
వనకేళి సల్పి జీవనకేళి సల్పఁ
దలపోయ శౌరి వైదర్భియాదిగను                 (6190)
గలకలకంఠులు కదిసి వేనడువ
నాకీర్ణ కోకిలకానీక పుండఁ
రీకవర్గముఁ జంచరీక వర్గమును
నమల కారండవ హంస గాంగేయ
కమల విస్ఫూర్తియంగముల విస్ఫూర్తి
తావిజొంపములతో దరులఁ జానొందు
మావుల వెడవిల్తు మావులు గలిగి
వర కేకి పిక మధువర నినాదములఁ
గరమొప్పుడున్నట్టి కమలాప్త తనయఁ
జేరి బిత్తరివగ జిలుగు పుట్టముల               (6200)
సారసలోచనల్సవరింప హరియు
వాలారుచుంగు క్రేవలనాడ మడుపు
తాళిగోణంబు వింతలుమీఱఁ గట్టి
మంచు నీరును గుంకుమము మేళవించి
నించినయొక మంచి నేత్రంబు పూని
సుకుమారముగఁ గళ సోఁకంగనొక్క
సకియమెఱుంగారు చనుదోయిలైవ
నానలోనాన నానాగేంద్ర యాన
దానవారికిని హస్తము మాఁటుఁ జేసి
చొక్కపుతావులఁ జొక్కవేరొక్క                (6210)
లక్కకుప్పియవైచి లాఁగించి మఱియు
ఘనసార మృగమద ఘనసారజలము
కనక శృంగముల వేడ్కలనించి సతులు
జలజాక్షుమైఁ జల్లి చల్లించికొనుచు
నలరుగుత్తులవేఁటు లాడుచు మఱియు
నలినాక్షుతోఁగూడ నలినలోచనలు
కలయ వసంతమీగలి నాడియాడి
కుంకుమపంక సంకుమద మృగాంగ
సంకులాంబువుల నచ్చటఁ దొప్పఁదోఁగి
యలపెల్లఁదీర నాఊమున నాయమున            (6220)
జలకేళి మనమింక సవరింతమనుచుఁ
గిసలయాధరలుకే కిసలనాదరులు
నసమానగతుల రాయంచలఁ బట్టి
సారసంబులఁ బట్టి సరసజానొందు
సారసంబులఁ బోఁపి సరసమాడఁగను
నహు కరేణిలతోడ భద్రకుంజరము
విహరించుగతి శౌరి విహరింపఁ దొణఁగె
కమనీయగతిఁ దరంగంబులు సాఁచి
రమణీయ రమణుల రాసిపోనీక
యొఱపులఁ దిట్టుచు నోలఁ బెట్టుచును               (6230)
దఱుమఁ బెట్టుచు వడిఁదరులు మెట్టుచును
నరలి నారాయణ శబ్దార్థమనిన
నరులకుఁ దెలుపు చందముగ శోభిలఁగ
నొకలేమఁ గని యొకానొక మోహనాంగి
చికిరి నవ్వులఁ జేరి చేయి బట్టినను
జేలఁ గట్టఁగ నన్ను సెలసి పట్టెదవు
మోలమో యిదిమంద మేలమోయనుచు
మెండుతుమ్మెదలతో మేకులు జేయు
పుందరీకములన పూఁ బోణివైవఁ
దరుణులు మెచ్చ నాతరళాక్షి వెనుక                (6240)
మరలఁ దామరలఁ దామరలవైచినను
వెండియు నీలాహి వేణులుద్దండ
నొండొరుల్దమలోన నుద్దించికొనుచు
జడియ కుంచలను గొంచలను గిట్టుచును
నడిచి మీనముల ఫేనములఁ బట్టుచును
దొడరి చెందొవల కందువుల వైచుచును
గడిఁగి చక్రముల చక్రములఁ బోఁపుచును
అలమోముదమ్ముల కచటితమ్ములకు
నెలకొన్ననగవు వెన్నెల వింతలనఁగఁ
నలకభృంగములకు నచటిభృంగమ్మ                   (6250)
లలవిమీరిన మ్రోఁత లవియెవింతనఁగఁ
జనుజక్కవలకు నచ్చటి జక్కవలకు
ననయంబుతాయని యదియెవింతనఁగ
నొప్పునంగములతో నొప్పు లతాంగ
లప్పంకజాక్షులా యమునలో వెడలి
చుట్టు బవంతులఁ జూపట్టు పట్టు
పుట్తముల్గట్టి యొప్పుగనుఁగైసేయఁ
గనకాంబరుండు గనకాంబరాది
ఘనతర శృంగార కలితుఁడై యపుడు
కందలామంజక కుటజ పున్నాగ                         (6260)
నందదిందిందిర నలిన గుచ్ఛముల
ఆవేళకాలాంత రాంతరంబునకు
కుంతీతనూజు దోడ్కొని శౌరియరిగి
.......................
పసిఁడి కుందలమాఱు పఱచు పాలిండ్లు
కుసుమాంగి యీర్తు చెక్కులడాలు మెఱయ
సలలితరేఖఁ గంచము పట్లు చేసి
వలిపె దుప్పటి నిజావదమీఁదఁ బఱచి                 (6270)
నిగనిగమనెడు వన్నియల గిన్నియలఁ
దగఁ గ్రమం బెఱిఁగి చెంతలఁ బాదుపఱచి
యంబళ విరళంబులకు నూత్నరత్న
కంబళములఁ బొందుగానంద పఱచి
యాయెడ హరిఁ జేరి యారగింపంగ
నాయత్తమనుఁడుఁ గంజాయతాక్షుండు
ఉరుతరంబైన వేఱొక్క పాత్రమున
సరస మారుతజన్ము సహజన్మునునిచి
తన పట్టమహిషులుఁ దాను నచ్చోట
నొనర నాసీనుఁడై యుండె నుండుటయుఁ                  (6280)
దెలిఱెక్కపులుఁగులఁ దెగడెడునడల
గల సతులాత్రముల్గరములఁ దాల్చి
కంకణ ఝణఝణత్కారముల్వివిధ
కింకిణి కిణకిణత్కృతులతో బొఱయ
పొడవడిరాలుచుఁ బొదలిన రుచులు
గడుఁ బ్రకాశముగల కలవంతకములు
ముప్పిరి సంభారముల మించినేఁతఁ
జొప్పిల వగ్గళించిన తాళిదములు
పరిపక్వమై దోరబాఱికన్నులకు
నురుదైన తురుఁగులు నప్పడంబులును             (6290)
నటులైన బేడల పగిదినేయొప్పు
పటుతర మృదు రూపముల సూపములుఁ
గ్రమము తప్పక పచ్చగందకతెచ్చి
యమృతోపమానంబులైన రాజాన్నములను
నంబుజ మోదంబులై నవకుంకు
మాంబుధారల రీతులైన నేతులును
మరిచ జీరక కొత్తుమరి మిరియముల
మెఱయుచు రుచులచేమించు చేరులును               (6300)
దిరమైన యొప్పలఁ దేరుచు దేవ
పరమాన్నముల సజ్జ పరమాన్నములును
జలలగాబూపు వాసనగట్టి తెచ్చి
వల్లగట్టిన రసావళ్లు నంబళ్లు
నిరవైన చవినోట నిడినంతతోన
కరుఁగునో యననొప్పు కజ్జాయములును
గడలేని రుచుల మీఁగడ పెరుంగులను
........................
రవరవ గానుప్పు రవగూటి సొంటి
లవయుక్తమైన చల్లని మజ్జిగయును             (6310)
నెడనీరు నెడనెడ నింపుసొంపైన
కుడినీరు వేరుసఁజేకొనుచు వడ్డింప
సరసిజాక్షులుఁ దాను సరసిజాక్షుండు
సరసభావముల నీసరణి భుజింప
నంబుజ శశివాసితాంబుల జీవ
నంబుచేఁజే మజ్జనంబు గావించి
గారవంబున సారకర్పూర పూర
చారు వీటికలెల్ల జనులకు నొసఁగి
యొకకొంత తడవందునురు సౌఖ్యకేళి
వికచాబ్జముఖులతో విహరించియంత              (6320)
కమలారి బింబరాగంబుమై పసలు
తెమలించు నిండు చంద్రిక దట్టిగట్టి
శ్రీరామచంద్రుని చెలువు దీపింప
నారూఢ కోదండుఁడై ప్రకాశించి
సకలసైన్యంబు నచ్చటనుంచి పార్థుఁ
డొక్కఁడు దానొక్కఁడు వేఱొకచోటి కరిగి
(భ్రమకము)
వరకు తాల నవనవ నీలతాకురవ
కరక సారస కనక సరసాకరక
కలదర వీరక కరవీర దలక
కలకద వాసి కకసి వాసిదలక              (6330)
తరుముక్య వివిధ లతావితానములఁ
గరమొప్పు నొక మహాగహనంబు సొచ్చి
కరిణుల హరిణులఁ గరుల సూకరుల
శరభ శార్ధూల పుంజములఁ జెండుచును
లీలవైఁ గన్నియలేళ్లఁ బూరెళ్లఁ
దోలిపోనీయకయే దులను గైదులను
వడిసూడి పట్టి యవ్వలను గవ్వలను
గడపుచువేఁట నీ క్రియఁ జల్పు వేళఁ
దఱచైన పికిలి పూదందలనొప్పు
నొఱయు గుబ్బలలోడ నొఱయుచునుండ         (6340)
నొఱపులు చిల్కు బిట్టుల్కు కన్గొనలఁ
జిఱుత వెన్నల తేట చిందఁ గన్గొనుచు
పుప్పొడిపొడల యోపుల చన్నుఁగవలు
గప్పనేరక శౌరిఁ గన్గొను వేడ్క
సమరంద గణగణ సంశోభితాధ
రములపై దంతగౌరత తేజరిలఁగఁ
గోకిలములు కేరిగొణఁగు చందమునఁ
బికము చందముమాట బిల్చుచెంచెతలు
కందర్పునకు నాది కందర్పుఁ డగుచు
ముందరనున్న యమ్మురవైరిఁ జూచి                   (6350)
మదకరి మద సంకుమద మృగమదము
లుదుటైన డేగలనోరణంబులును
గానుకలొనరింపఁ గైకొని వేడ్క
లానవేపిన్నపాయమున నాయమున
దరులనాపూరి నెత్తముల మొత్తముల
గరిమ గోగణములఁ గాచుచందములఁ
గ్రీడికిఁ దెల్పుడు గ్రీడింప శంప
జాడల నన్నదీ జలమధ్యమునను
శశికాంత శిలమీఁద శశికాంతమించి
శశిబింబ ముఖియోర్తు సరసభావముల            (6360)
హరిమూల ములనప్వునవి పంక్తి నెఱియు
నరిపదాధిక్యంబు నలరెడుతురుము
జలజంబు తెగబేడ సలబెళుకులును
గలువల సోఁగయుఁ గలకన్నుఁ దోయి
యమరెడువట్రువ యందంబు మెఱుఁగు
కమలంబు తావియుఁ గలుగకమ్మోము
తలిరుమై జిగికి పంచదారలో మేలు
కలిత బింబము కెంపుఁ గలిగినమోది
పూఁ గొమ్మబిగి బిసముల జిగితేఁత
తీగెల సొబగు వర్తిల్లు బాహులును                (6370)
గొందల పొడవు పూగుత్తుల మురువు
మిండ జక్కవ నీటు మెఱయు పాలిండ్లు
సైకతముల నవ్వు చక్రంబు బటువు
నాకేభ మస్తకోన్నతిగల పిఱుఁదు
కరితుండముల తీరు కరభంబు బాగువి
సరస రంభలనిగ్గు సవరించుతొడలు
కమలకోమలతాలాక్షారక్తిమంబు
విమల కూర్మాకృతివెలయు పాదములుఁ
గలిగి యాకలశాబ్ధికన్య చందమున
విలసిల్లుచుండునా వికసాబ్జనేత్రఁ              (6380)
గని శౌరి గోరిచొక్కక్కఁగ భావభావ
మనువొందఁ దెలిసి యయ్యమరేంద్ర సుతుఁడు
కమ్మవిల్తుని తల్లిగతినున్న కొమ్మ
యమ్మ నీవెవ్వతెవనిన నాచెలువ

(తరువాయి భాగము "చతుర్థ  పట్టమహిషీ - శ్రీకాళిందీదేవి వివాహ వర్ణనము")

No comments:

Post a Comment