4. చతుర్థ పట్టమహిషీ
శ్రీకాళిందీదేవి వివాహవర్నన ప్రసంగము
యేను గాళిందిని యనున్ కన్యఁ గన్యఁ
గాను శ్రీపతి పతిగాఁ గోరి యిచట
నున్నతిఁ దపము సేయుచునుంటినన్న
మున్నంది కృష్ణుండు మెలత నీక్షించి
యాతపంబునఁ జేయు నాతపంబెల్ల
నాతినీకొనఁ గూడె ననుఁగూడుమిప్పు (6390)
డనిశంబు భర్తగానాత్మనీవెన్ను
వనమాలినేనయో వనజాప్తపుత్రి
యనుచు నూదార్చి యొయ్యననెదఁణ్ జేర్చి
ఘనతర కుతుకాబ్ధిఁ గడునోల లార్చి
కమలాప్తుఁ డపుడు కమలాప్తు కూర్మి
కొమరితఁ దోకొని కొమరు దీపింప
మును వసించిన వనమునకేఁగుదెంచి
యనుపమ సకలసైన్యంబులు గొలువఁ
బౌరులునల నాకపౌరులుఁ బొగడ
ద్వారకాపురికిఁ దీవ్రనేగుదెంచి (6400)
వరమణిమునులాది వస్తుసంతతులఁ
బురముకై సేయించి పురమెల్లఁ బొగడఁ
బాండవేయుల సర్వ బంధుజాలముల
వెండియుఁ బిలిపించి విభవంబుమెఱయ
వేదోక్తి వేధవిధు లాచరించి
యాదేవదేవుఁడ డత్యాదరంబొదువఁ
జారు ప్రసూన కాంచనచేల గంధ
భూరి భూషణగణ భూషితుండగుచు
శ్రుతులు ఘోషింప సంస్తుతులతో నాక
పతులు గంధర్వదంపదులుఁ బాడంగ (6410)
హరిపిత దేవకి యాదవుల్దాము
హరిరాణిఁ గొనివచ్చి యర్థిఁ బూజింప
ఝుల్లరీ కాహళీ శంఖ మృదంగ
వల్లకీధ్వనులు దిగ్విలయంబుఁ బొదువ
దేవకీతనయు డెంతయు వేడ్కతోడ
వైవాహి కోత్సవావని నొప్పుచుండె
నహిశాయి తనయల్లుఁడయ్యె నటంచు
మిహిరుఁడప్పుడు కడుమిన్నంది పొంగి
గ్రహమండలముఁ దారకా మండలమును
బహు మౌనిపతులు సంభ్రమమునఁ గొలువ (6420)
ఛాయానువృత్తి నిచ్చలుఁ గూడియుండు
ఛాయతోఁ గూడ నచ్చటి కేగుదెంచి
తరుణిఁ బుల్కడిగిన దర్పకాస్త్రంబు
కరణిఁగైసేసి చెంగటనొప్ప కన్యఁ
గనకాంబరుని పాద కమలముల్గడిగి
కనకధారా పూర్వకంబుగానిచ్చె
జలజాతమిత్ర సంజాత నీక్షించి
పలికిరి మునివరప్రముఖలు చెలఁగి
సతిబొమల్గన్ను లెంచఁగఁదగున్మీన
పతులౌటనో గురు భావంబు దాల్చి (6430)
తలపోయ నిత్యమూర్తంబైనక తనఁ
దనకౌను పరమాణు తనునెన్నఁదగును
నీలంబు విబువును నిత్యంబునగుట
బాలకీల్గొప్పు నభ్రంబనవచ్చు
నని వితర్కింపుచు నన్యోన్యమిట్టు
లనుమానమునుజెంద నంబుజాక్షుండు
వనజాప్తపుత్రి నుద్వాహమై బంధు
జలములఁ గనకభూషణములం దేల్చి
గ్రహములతోఁ గూడి గ్రహరాజముఖుల
మహితానురక్తి సన్మానంబు సేసి (6440)
గణుతింపరాని సౌఖ్యములతో నభ్ర
మణిపుత్రికా సతీమణితోడఁ గూడి
జగములు జయవెట్ట జగదేకనాధుఁ
దగణిత శ్రీయుక్తుఁడై యుండెనంత
5. పంచమ పట్టమహిషీ
శ్రీ మిత్రవిందాదేవి వివాహ వర్ణన ప్రసంగము.
రారాజుహితులుతో రంపుసంపదల
రారాజుఁ దెగడు ధరాధినాయకులు
విందానువిందులు వివరింపఁ గూర్మి
విందైనయట్టి గోవిందుఁడుండఁగను
గురునాయకుని కొఱకొఱ మాటలకును
హరిమేన బావనునాత్మఁ గైకొనక (6450)
కలకంఠి ముకురాస్య కంజాయతాక్షి
నలికులాలక బిసహస్త లతాంగి
హరిమధ్య గిరికుచ హరిచక్రజఘన
సరస రంభోరు కాంచనతూణ జంఘుఁ
గిసలయపద వల్లకీవాణి దంట
హసితకోమలకుందయగు మిత్రవింద
యనుపేర యనుజన్మ నాకామపాలు
ననుజన్మునకు నెంతయైన నీమనుచు
ధరమీఁదఁ గల్గునుదారభూనాధ
వరులు గూడఁగ స్వయంవరము చాటింప (6460)
నావార్త విని కృష్ణుఁడా మిత్రవింద
భావార్థమెంతయు భావించి తెలిసి
మీటలై సోఁగలై మించులై మిగుల
తేటగానొంటి ముత్తియములు దాల్చి
యేణాంకుమై చాయనెక సక్కెమాడు
నాణియంబగు ధౌత నాధరియించి
మృగమద కర్పూర మిళిత చందనము
నిగనిగపుటమైన నెఱిపూఁత పూసి
తరణి శీతాంశుల ధళధళల్గుల్కు
ధరచక్రముల నొప్పు తాళిఁగీల్కొల్పి (6470)
బంగారు పువులఁ బచరించునట్టి
చెంగావి దట్టిగా సించి వింతగను
సొలపు గోణముచుంగు సొంపు జూపట్ట
వలివంపు దుప్పటి వలెవాటు వైచి
కళుకుల ముద్దుటుంగరము గీలించి
వలకేలముకులపై వంకిలొలిడించి
కనుపట్టునెఱకూడె కానితనంబు
తన సొమ్మెయనఁగ నెంతయు సొంపు మిగిలి
విహగేంద్రకేతన విలసితంబైన
మహనీయ నవరత్నమయ రథంబెక్కి (6480)
యమితబలాన్వితుండై భానుకోటి
రమణ నవంతీపురంబున కరిగి
బహురాజ కోటీరపటు రత్నకాంతి
వహియించునా స్వయంవర భూమినుండ
నురుణు రాకకుఁ బద్మమలరు చందమున
హరిరాక విని పొంగి యామిత్రవింద
జలజంబుతల క్రిందు సవరించినట్లు
జిలుగు దువ్వలువ పింజలు వాఱఁగట్టి
నలువంద నెలవంక నామంబు దీర్చి
కొలఁదిగా నడువఁ గుంకుమ రేఖఁ దీర్చి (6490)
రవికాంతులొలుకు పురాణహారములు
బవి దీర్చిన కర్ణపత్రముల్దాల్చి
యరవిందశరుని మోహన పాశవితతి
సరవినొప్పెడు పంచసరములు పూని
సిరిమించు నెఱుల కుచ్చెలమీఁద జార
మురవైన మొఱపుల మొలనూలమర్చి
దివి శక్రధనువొప్పు తెఱఁగునుఁ గొప్పఁ
దవిలి చిత్రంపు పూదండ చెన్నొంద
లలితపుష్పిత కల్పలతిక చందమునఁ
గలితభూషణములుఁ గడుసొంపుమిగిలి (6500)
వాసుదేవునిఁ బోలువరుఁ గూడుమనుచు
సేనకొప్పున సతుల్సేసఁ బ్రాలిడఁగ
సతులింత నంత నెచ్చెరికలు సేయఁ
జతురంతయానంబు సరసమైనెక్కి
వాణి వాక్యప్రొఢి వరియించు కీర
వాణులప్పుడు ధరావరులఁ జూపంగ
నరుదేర నరుదార నాయింతిఁ జూచి
ధరణీశులును బౌరతరళ లోచనలు
నలిపంక్తి రంగొతొయ్యలి కప్పురంగొ
నెలవంక మురువొయా నెన్నొసల్మురువొ (6510)
కలువల మించొ యా కనుల మించొ
జలజంబుబాగొ యా సతిమోముబాగొ
శైలముల్దీరొ యీ చన్నులు తీరొ
నీలాహినలుపొ కన్నియయారునలుపొ
యనఁటులు మెఱుఁగొ యీయంకముల్మెఱుఁగొ
దొనలు వట్రువలొ లేఁదొదలు వట్రువలొ
తలిరుల సొబఁగొ పాదంబుల సొబగొ
తెలియ రాదనుచు నెంతేని జోద్యమంది
తూణంబు నెడలిన తొవయంప కాని
బానంబొ వాని కృపాణంబొయనఁగఁ (6520)
గరిసమూహము సొచ్చు కరివైరిపొల్కి
ధరణీశవరుల బృందంబు సొత్తెంచి
విందానువిందులు వెఱఁ గంద మిత్ర
విందకెంగే లరవింద లోచనుఁడు
పట్టి శతాంగంబు పైఁ బెట్టికొనుచుఁ
జుట్టి యున్నట్టి రాజులఁ బాఱబట్టి
పరమకీర్తి ప్రతాప ములతోనమర
వరులు మెచ్చఁగ ద్వారవతికే గుదెంచి
వేదవేత్తలు చతుర్వేదముల్జదువ
వాదిత్రములు పెక్కువ గలఘూర్ణిలఁగ (6530)
నాగకామినులుఁ బున్నాగకామినులు
బాగుమీఱఁగను శోభనమువాడంగఁ
బటుతరాలంకార భరితుఁడై రత్న
పటల మండిత మంటపంబులోఁ జెలఁగి
సకల బంధువులు నిర్జరులుఁ గీర్తింప
నకలంక గుణబృందయగు మిత్రవింద
నిగమోక్త విధినిఁ బాణిగ్రహంబు
ఖగరాజవాహుండు గావించియంత
నాలేమతోఁగూడ యంగజకేళి
దేలియెంతయుఁ బ్రమోదింపుచునుండె (6540)
అవనీశ నగ్నజిత్తను పేరఁ బరఁగు
నవనీధవుఁడు కోసలాధినాయకుఁడు
సురుచిరాకార సంస్తుత గుణోద్ధార
నిరుపమాలంకార నిర్మలాచార
6. షష్ఠ పట్టమహిషీ
శ్రీసత్యకీర్తీదేవి వివాహవర్ణన ప్రసంగము
నిత్యకల్యాణి వర్ణితసత్యకీర్తి
సత్యనావిలసిల్లు చంద్రబింబాస్యఁ
దన తనూభవ వసుంధరఁగల్గి నట్టి
జననాధులడుగ నచ్చటి కేదుదేరఁ
గీలికీలాహ హాకృతుఁగ్రాలు
వాలుఁబోలెడునిడు వాలుఁగొమ్ములును (6550)
నంభుదితుంగ భంగాలోలకాల
కంబళాయతగళ కంబళంబులును
బంధుర విద్యుత్ప్రభా భాసితోరు
కంధరంబుల బోలు కంధరంబులును
సమధిక శైలాగ్ర చటులశృంగముల
రమణఁ జూప్పడు మూపురములునుం గలిగి
బలిమి శంకరుగిబ్బఁ బడగిబ్బఁ జాలు
లలిమీఱనేడు మల్లరపుఁ గోడియల
నాజవరులకు నారాజు చూపి
యేరాజవరుడైన నీ వృషంబులను (6560)
బట్టియొక్కటికినిఁ బైదామకమునఁ
గట్టియెంతయు భుజాగర్వంబు నెఱుపు
నట్టి విభుండు వోనరయనాకూర్మి
పట్టి విభుండని పల్కుఁగ భూవరులు
నాయెడ వానితో నరిమురిఁ బోరి
పోయిరి కొందఱప్పుడు జముపురికి
వేయైన నిదికాదు వీడుఁడంచుఁ జడిసి
పోయిరి కొందఱప్పుడు పురంబులకు
వారి శౌర్యములకై విని దాన
వారి యాపనియెంత యని నవ్వు కొనుచు (6570)
వాలారుచంద్రిక వన్నియచుంగు
డాలువాటిల్ల మూడానంబుఁ జుట్లి
తరుణారుణోద్దామ ధామసంతతులఁ
బురణింపఁ గెంపుల పోఁగులవెట్టి
యసమసాయకుని మోహన తురంగముల
పసమించు పచ్చకబ్బాయి ధరించి
చుట్టు వజ్రంబుల సొబగు దీపింప
గట్టాణి ముత్తెంపు కడియముల్దాల్చి
తెలిమించు క్రొత్తముత్తెముల గెంటెములు
పొలుచునాణెఁపు పట్టౄ పుట్టంబు గట్టి (6580)
యచలాగ్రమున నొప్ప హరి కిషోరంబు
రచనజొప్పడ హేమరథవర్తియగుచు
బలములునరుఁడు సంభ్రమలీలఁ గొలువ
బలమును జలమును నేర్పడ శత్రుసమితి
భయమంద గోసలపట్టణంబునకు
రయమునఁ జనుదెంచి రాక్షసాంతకుఁడు
ఎదురేగి యావిభుఁ డిందిరావిభుని
బదివేల తెఱఁగులఁ బ్రణుతించి మ్రొక్కి
సకలోపచారముల్సవరించి భక్తి
నకలంక సింహాసనాసీనుఁ జేయ (6590)
నలఘ సౌధాగ్రంబునందు శోభిల్లు
జలజాతనేత్రి కోసలరాజపుత్రి
మరకతశ్యామ కోమలకల్పధాము
నరవిందదలనేత్రు హాటకనేత్రుం
గురువిందరదను నక్రూరాంశురదను
సరసమంజులహాసు చంపకనాసు
ఘనకిరీటోద్దారుఁ గౌస్తుభహారు
ననుపమాయతదేహు నాజానుబాహుఁ
జెలువొందఁ జూచియా శృంగారరసము
పొలుపారవాలుఁ జూపులనే క్రోలుచును (6600)
నీ రమేశ్వరుఁడు ప్రాణేశ్వరుండైన
ధారణి నేఁ జేయు తపమే తపంబు
భావింపనేవేల్చు భక్తమందార
మావేల్పు నాభర్తయైయుండుఁ గాక
యరయంగఁ దొలుత భావమున సత్యముగ
సిరివరునేఁ బూజ సేసితినేని
నీ మోహనాకారుఁడెన్ని బాగులను
గామించిననుఁ బత్నిఁగా నేలుఁగాక
యనుచు డెందమున నానవాలమున
ననురాగవల్లిక వలరింపుచుండె (6610)
నంతఁ గృషుండుఁ గోసలాధీశుఁ జూచి
సంతసంబునఁ బలుచని నవ్వుమోవిఁ
బెనఁగొన జలద గంభీర వాక్యమున
ననియె భూనాయకులన్యులు వేఁడఁ
దగవైన పూర్వబాంధవము చింతించి
యడిగెద నీ కూఁతుననియె మోదించి
పుడమిఱేడనియె నప్పుడు కృష్ణుతోడ
శ్రీవర భాగ్యంబు సేసితి నాకు
నీవంటి బంధులెన్నిన భూమిఁ గలరె (6620)
ఐనమున్నొకటి మర్యాద సేసితిని
నీనగంబులఁ బోలు నేడుకోడియల
నుర్విపై నొక్కనాఁడొక త్రాటఁబెనుచు
నుర్వీశునకుగాని నొసఁగఁ గన్నియను
ననియుంటి నీచిత్తమనిన దైత్యారి
విని నవ్వి యట్లకామింతునే ననుచుఁ
దనరూపు పౌరకాంతలు ఱెప్పలిడఁగ
కనుఁ గొన నగరోపకంఠంబునందు
గర్జించి లయకాల కాలమేఘములఁ
దర్జించుఱంకెల దశదిశల్వడఁకఁ (6630)
బొదరి చిందకొట్టి భువితల్లడిల్లఁ
గదిసికయ్యమునకు గాలుదువ్వుచును
గొమ్ములు పాతాళ కుహర మేర్పడఁగఁ
జిమ్ముచు నేత్రముల్జేవురింపఁగను
గాలకూటార్చుల కరణిరోషాల
వాలంబులగు ఘనవాలముల్మెఱయ
భాసురోన్నత దిగిభములచందమున
భాసిలు మదవృషభముల నీక్షించి
గట్టిగాఁ దళుకు బంగారుకానె బిగ్గఁ
గట్టిచొల్పడు బాగుగాఁ జుట్టి యపుడు (6640)
దానవారాతి నందఱునాలకింప
భూనాధుఁ బచరించి భుజమప్పళించి
యిలబెల్ల గిలగిరులెల్లఁ బెల్లగిలఁ
జలమున నార్చి మచ్చరమునఁ బేర్చిఁ
చటుల మృగాళిపై శార్దూలముఱుకు
ఘననాదబోతులఁ గడిమి వేఁడించి
మల్లడిగొననొక్క మఱిమల్లరముల
వల్లవల్గొమ్ములుద్ధతి నొల్లగిల్లఁ
దల్లడిల్లఁగఁ బట్టి దట్టించి జగతి
ద్రెళ్లంగవైవ సందిచూచు జనులు (6650)
ఝల్లున నివిగ నిర్జరులెల్లఁ జెల్లు
జెల్లునీకనియుల్ల సిల్లంగ శౌరి
యుదుటునఁదన బాహుయుగముచేవాని
మెదిచి చాగతఁగొని మెడవల్లెవైచి
పెడవెట్టు కొండలు పెంపెల్లఁ బొలిసి
యడవెట్టుకొనుచు నోండ్రనుచు స్రుక్కఁగను
వడిఁగట్టివైవఁ గవ్వడిమనబావఁ
గడఁక నీక్షించి డిగ్గన నగ్నజిత్తు
ఇచ్చనెంతయు మెచ్చి యిందిరానాధుఁ
గ్రుచ్చి కౌగిటఁ జేర్చికొని సంతసించి (6660)
వరతూర్యజల నిస్వనములుఁ నెలఁగ
నరులు గిన్నరులు నెంతయు సంతసింప
లోకేశ భువుఁడు పులోమజా విభుఁడు
నాకమౌనులు దిశానాయకోత్తములుఁ
బరిణయాలోకన పరతఁజొన్నొంద
నలినలోచనలుతోయంబుగా ముద్దు
గిలుకొట్టు శోభన గీతంబువాడ
రమణీయతర నవరత్న వేదికను
గమలాక్షు మహిత శృంగారుఁ గావించి (6670)
శృంగార మొకకుప్ప సేసినట్లున్న
శృంగారవతి నాగ్నజితి యనుకన్య
సంకల్పమన్న కోసలరాజు సత్య
సంకల్పునకు నిచ్చె సంకల్పమలర
మురవైరివర వజ్రములు దోయిలించి
తరలాయతాక్షిపైఁ దలఁబ్రాలునించి
తమములో ఖద్యోతతతి ప్రకాశించు
రమణఁ గొప్పన సేసఁబ్రాలు శోభిలఁగ
ముకురాస్య నవరత్నములు దోయిలించి
మకరకుందల ధారి మైసేసనించె (6680)
నురువైభవమున వేదోక్తమార్గమున
హరి నాగ్నజితిఁ బెండ్లియాడె నవ్వేళ
రాజకాంతలు రతిరాజుఁ గన్నట్టి
రాజీవనేత్రు విరాజి విగ్రహముఁ
గని సంతసిలి యాత్మఁ గన్యకామణికి
ననుకూల వరుఁ డయ్యెనని పొంగిరంత
నందనందను మామ నవ్యవైఖరుల
విందులకెలమిమై విందుగావించి
యంబరాదులనోలలాడించి సమ్మ (6690)
దాంబురాశుల నోలలాడించి మెఱసె
హేమాంబరుండు నయ్యెడ బాంధవులకు
హేమాంబరాదుల నేకంబులొసఁగె
తనుజాత వనజాత దళనేత్రుతోడ
ననుప నుద్యోగించి యయుత ధేనువులు
నగణితాలంకృతులగు రెండు వేలు
మృగలోచనలును దొమ్మిది వేలు కరులు
నన్ని లక్షల తేరు లశ్వరత్నములు
నన్ని కోటులు శూరులై నట్టిభటులు
పరమసాహసులు తొంబది నూఱు కోట్లు
నరణంబుగానిచ్చి నవ్వధూ వరుల (6700)
నారూఢిఁ బూజించి యరథంబు మీఁద
నారూఢులుగఁ జేసి నారాజు కొలువ
మెఱుపుతో మొగులద్రి మెఱయుచందమున
దెరవలో శోఉరి యాతేరుపై జెలఁగి
నరునితో ద్వారకానగర మార్గమున
నరుగుచో నావార్తనరసి కోపించి
వెనుకొనిమున్ను దద్వృషభ నిర్భిన్న
తనులైన రాజనందనులెల్లఁ గూడి
పరమ లజ్జా రోష భరితులై వచ్చి
హరిఁ దాకి యిభములు హరిఁ జుట్టు పగిది (6710)
నపుడు కృష్ణుఁ శాఙ్గమంది యారిపుల
కపుర మాపెదనని గమకించు విధము
భావించి యాయల బలములకెల్ల
నీవేళ నీవేల నేన చాలుదును
దేవ నన్నొక యింత దృష్టింప మనుచును
వేవేగ గాండీవి విల్లెక్కు వెట్టి
గుణ నినాదమున దిక్కులు పిక్కటిల్ల
గణుతింపరాని మార్గన పరంపరల
భూనభోంతరము లప్పుడు నిందనంప
వానలు గుఱియించి వానల మెఱసి (6720)
రథములఁ దునిమి సారథలఁ గాఱించి
రథికులఁ దెగటార్చి రథ్యముల్గూల్చి
కేతువుల్నరికి పక్కెరలెల్ల వాల్చి
హేతులు సమయించి యేఁపు తూలించి
హరులఁ దుండించి భటాళి ఖండించి
కరుల నిర్జించి భీకరములైనట్టి
కాండముల్బఱపి నల్గడవచ్చు శత్రు
కాండముల్ధరవ్రాలఁ గామోది మోది
శరనిధి మంధరశైలంబు గలఁచు
కరణిఁ బిండిలి వండుగా సేనఁ గలఁపఁ (6730)
బ్రళయ ప్రభంజన పారవేగమున
శరదాళి వీఁగిన సరవిఁ దద్బలము
బలభేది వజ్రబాణ ఘాతముల
కలికినల్గడలకే పఱివీఁగి పఱవ
దేవేంద్రసుతుఁడు నెంతే వేడ్క నగ్ని
దేవదత్తంబైన దేవదత్తంబు
పూరించెదెసలు నంబుధులు ఘూర్ణిలఁగ
శౌరి యప్పుడు ధనంజయ జయమ్మునకు
మెచ్చి వివ్వచ్చు నర్మిలిఁ బెచ్చుపెరుఁగ
గ్రుచ్చి కౌగిటఁ జేర్చికొని యాదరించి (6740)
కన్యతో జయరమా కన్యతో నబ్ధి
కన్యకాపతి ద్వారకాపురంబునకు
నరిగి యాపురవీధినరుఁదేరఁ బౌర
తరుణులు కోసలతనయు నీక్షించి
ముకురమో శశిబింబమో కాదు మోము
వెకరిమా గురుకందు వెలయదుగాన
కలువలొ మగమీలొ కాపు నేత్రంబు
లలవాడు వేడగంబులు లేవుగాన
సరసపూరమొ జలజమొ శ్యామగళము
హరికథావేద్యంబు లవిలేవు గాన (6750)
వలుకొందలొ జక్కవలొ కావు గుబ్బ
లలదంతురత ఱెక్కలవిలేవు గానఁ
బులినమో కరిశిరంబొలుకాదు జఘన
లలజారులును నేఱులవిలేవుగానఁ
గాళెలో శరధువో కావులేఁదొడలు
కామక కఠినతల్గలు గవువుగానఁ
రవికాబ్జములొ లత్తుకలొ కావొ పాద
ములు కంఠనకలత్వములు లేవుగాన
నని సన్నుతింప నందందని లింప
జనమవలోకింపఁ జలజలోచనుఁడు (6760)
చెలఁగి భూమిసురాశీర్వాదతతుల
విలసిల్లు సదన ప్రవేశంబు సేసి
ప్రణుతింప వసుదేవ బలదేవులకును
బ్రణమిల్లి కలిసి సౌభాగ్యంబు మెఱసి
సౌవర్నగాత్రి కోసలరాజపుత్రి
భావజకేలి శంబరరాశిఁ దేల్చి
యతుల శోభనవతి యమితసౌభాగ్య
వతియునునగు ద్వారవతియేలుచుండె
ఆదట మఱియును నయ్యంబుజోదరుఁడు
No comments:
Post a Comment