శ్రీసర్వజ్ఞ సింగరాజు వర్ణనము
శ్రీమన్మహా మంగళాకారు, నాకార లక్ష్మీకుమారుం, గుమారీమనోరాము, రామాంబరీషాది రాజన్య రాజదశః కాముఁ, గామాహిత క్షీరవారాశి తారాశి వాగేంద్ర మందారకుం దారవిందేహి తాకాశకల్లోలినీ కాశవిఖ్యాత సత్కీర్తిముక్తావళీభూషి తాశాంగనాలోకసీమంతు, సీమంతినీమానసారామవాటీ వసంతున్, వసంతావనినాధ సంసేవితాంచత్పదాంభోజు, నంభోజరాజీసుహృత్తేజు, దేజో జయప్రాభవోద్దాము, నుద్దామజన్యావనీభీము, భీమప్రతాపానలాభీలకిలావినిర్మూలితారతి పండ్యక్షమాపాల దుర్వార గర్వాటనీవారు, వారాధిపోరుప్రభా భాసురస్ఫార కల్యాణదుర్వారు, వారాశివేలా పరీతావనీభార ధౌరేయరాజ న్మహాబాహు, బాహాకఠోరాసిధారా వినిర్భిన్న సోమాన్వయోత్పన్న భూభృత్సమూహున్, సమూహా మహాశమూషీ కుంఠితాశేష శత్రుక్షమావల్లభున్, వల్లభామానసాదుర్లభున్, దుర్లభారిక్షమానాథ మత్తేభయూధంబులం జించి చెండాడు రాసింగమున్, సింగభూపాలు, భూపాల గోపాల గోపాలికా కృష్ణ గోపాలు, గోపాలదేవోత్సవ క్రీడలో, మేడలోనుండి జాలాంతరాళంబులన్ వారయోషాతనూజాత విద్యావయోరూప సౌందర్యచాతుర్య విఖ్యాత చంచద్గుణోపేత భృంగాంగ వాలబ్ధకేళి మహాహస్త కంజాతసంకాశ, తూణీనిరుద్ధప్రసూనేషుసూనేషునీకాశ యై యుండి తద్వైభవముల్ విమర్శించి,
వేశ్యాకన్య రాజుం జూచి మోహించుట
హర్షించి, సంతోషభాష్పంబుపూరంబు వర్షించి,కందర్పబాణాహతింజెంది, లోఁగుంది, మోహించి, సంగంబునూహించి, ' యేవేళఁ దల్లింబ్రమోషింతు, నేలీల భూపాలకుంజేరి భాషింతు, నేరీతిఁ గామానలంబున్ నివారింతు, నేనాతితోడన్ విచారింతు, నేవెంట రాచూలి వంచింతు, నేజంటఁఘొర్కుల్ ప్రపంచింతు ము న్నేప్రశస్తారవిందంబనైనన్ మహిపాలు హస్తారవిందంబుపై నేఁడు లీలారవిందంబనై యుందుఁబో, రత్నహారంబనైనన్ శుభాకారు వక్షోవిహారంబుఁ గైకొందుబో, యేల యిట్లైతి నెట్లోకదే' యంచు శోకించుచున్, నిత్యకల్యాణు లీలావతీ పంచబాణున్ మనోవీథినంకించుచున్, ఘోషమాణాలికిన్ జిత్తభూభల్లికిన్ దల్లికిన్ లోఁగి, కామానలజ్వాలలన్ వేఁగి, చింతాభరాక్రాంతయై యేఁగి, సంతాపఘర్మంబులందోఁగి, చింతించు నింతిం బరీక్షించి, బుద్ధిన్ విచక్షించి, తన్మాత
వారకన్యతల్లి వచ్చి కూఁతునవస్థఁ గనుఁగొనుట.
మాయాపరాభూత జామాత మిథ్యానయోపేత విజ్ఞాతనానావశీకార మంత్రౌషధవ్రాత లోకైకవిఖ్యాత వారాంగానాధర్మశిక్షాదిసంభూత సమ్మోహితానేక రాజన్యసంఘాత వాచాలతాబద్ధ నానామహాభూత యేతెంచినీతిన్ విచారించి, బాలన్ మిళత్కుంతల వ్రాత ఫాలన్ గరాంభోజ రాజత్కపోలన్ సమందోష్ణనిశ్శ్వాసజాలన్ విపర్యస్తసంవ్యానచేలన్ మహందోల నప్రేంఖితస్వర్ణడోలన్, మృగేంద్రావలగ్నన్, దయావృష్టిమగ్నన్, మనోజాగ్నిభగ్నన్, నిరంధన్, బరిత్రస్తధమిల్లబంధన్, సముద్విగ్న మోహానుబంధన్ నిరాలాప నావర్జితాలేప నస్వీకృతానేకకేయూరహారన్, గళద్బాష్పధారన్ బరిత్యక్తలాస్యన్ బరాభూత లీలావయస్యన్ బదాలేఖనాలక్షితక్షోణిభాగన్ బరీక్షీణ రాగన్ విలోకించి, బుద్ధిన్ వివేకించి, లోనం బరాయుత్తయై, చిత్తజాతాసి ధారాచలచిత్తయై, విన్నయై, ఖిన్న్యై, యున్న భావంబుభావించి, నెయ్యంబు
తల్లి కూఁతునకుఁ గులవృత్తి ధర్మములను బోధించి రాజుపై వలపును వారింపఁజూచుట
గావించి, రావించి 'బాలా! జడత్వంబు మేలా, వినోదింపవేలా, విచారింపనేలా, వివేకింపకేలా వయోధర్మముల్ రిత్తగాఁ బుచ్చునీ వృత్తికిన్ మెత్తురే, వత్తురే కాముకుల్డాయఁగాయంబు విద్యున్నికాయోపమేయంబు హేయంబు ప్రాయంబు ధారాధరచ్చాయ మెన్నెనుపాయంబులన్ విత్తమాయత్తంఉంజేయుమా. రిత్తవారంబు నేరంబుగా దీవిచారంబు వంశనుచారంబు, సంసారసారంబు, లాభాధికారంబు, చర్చింప నీకున్నలంకారమే కాన ధిక్కారముం జేయరా దీ వికారంబు లేలే, శుభాకార యేలే, గుణోదార యేలే, కులోద్ధార యేలే, తటిద్దేహ యేలే, వరారోహ యేలే లలాటాలకవ్యూహయేలే, మహోత్సాహ యేలే, విరాజన్ముఖాభోజ యేలే, మహోరోజ యేలే, కలాలాప యేలే, జగద్మోహనరూప యేలే, చలచ్చంచలాలోకనవ్రాత యేలే, నయోపేత యేలే, మహామర్మభేదంబులై సుప్రసాదంబులై కౌముదీమూలకందంబులై మందమందంబులై చూద నందంబులై, మోహనశ్రీవిలాసంబులై యున్న నీచారుహాసంబులన్ సోలియోలిన్ భుజంగాలి బాళింబడదార్చుటో; కాక, లోలంబులై, మోహజాలంబులై, కాము బాణంబులై, యప్రమానంబులై, మీనశోభంబులై, చంచలాంబులై, మోహితాశేషలోకంబులై యొప్పు లీలావలోకంబులన్ బ్రౌఢలోకంబులన్ సద్వివేకంబులం బాపితాపాతిరేకంబులం గూర్చుటో; కాక, రాజత్రిలోకీవశీకార మంత్రంబులై, యుల్లసత్కామతంత్రంబులై, దర్పకోద్రేకయంత్రంబులై, ంఓహవారాసిభంగంబులై, సూచితానేక నర్మప్రసంగంబులై, కాముకేళీకలాపంబులై, యొప్పు నీభాసమానానులాపంబులన్ విత్తవల్లోక చిత్తంబులన్ రాగమత్తంబులంజేసి త్తన్నిమిత్తంబులన్ నిత్యమున్ విత్తమెల్లం బ్రమోషించి దూషించి భర్జించి తర్జించుటో; కాక, తోరంబులై, మధ్యభారంబులై, నిర్జితానంగసౌధోపరి స్వర్ణకుంభంబులై యొప్పు నీ విప్పు వక్షోజకుంభంబులం జూపి పౌరావళిన్ నర్మలీలా కురంగావళింజేసి నిర్జించి వర్జించుటో; కాక, నీ కీ కులాచారముల్ మాన నే కీరసల్లాప భోదించెనో! నేడు నాతోడు నాతోడ నాతోడ మాటాడుమా. చూడుమా కన్యకాలోక చింతామణీ, గోత్రరక్షామనీ, ధీమణి, ఎవ్వ రెవ్వాని భూషించిరే, ఏమి భాషించిరే, నేఁడు నీతోడ భాసించు ప్రోడల్ కుమారీ! కుమారాన్నపో తావనీనాథ సూమన్ వధూచిత్త విత్తాపహారవధానున్ సదాదాన విద్యానిరూఢున్ మనోజాత హృద్యానవద్యైక విద్యావలిడున్ ప్రభాభాను, రాగానుసంధాను, మయూరమానాథు సర్వజ్ఞసింగక్షమానాథు నీసన్నిధానంబునం జెప్పిరో, ఏమి వాతప్పిరో, అప్పరో, అప్పయోజాతగంధుల్ సుగంధుల్ పురిన్ నీవయస్యల్ మహాసౌమన్స్యల్ సువర్ణా, సువర్ణంబు లార్జించుటల్ చూడవా. చూడ వాంచింతురా రాజులన్ వారలారాజులం గానరా. రాజుఁ గామింతురా, రాజబింబాననా! రాజరాజాధి రాజోన్నతిన్ రాజులన్ మించి రాజిల్లు నారాజు వంచింప నెంచంగ శోభిల్లునే, చెల్లునే, భూమి నీజాతి యేనాతి యీరీతిఁ బ్రీతిం బ్రకాశించి రాజిల్లునే, చెల్లదే నీ పటుత్వంబు వాచా కటుత్వంబు, బాలేంద్రుశోభాలికా! బాలికల్ సేయు యత్నంబులే నీప్రయత్నంబు? లంభోజనాళాంతరాళ స్ఫురత్తంతుయోగంబునం జిక్కునే గంధనాగంబు? కంపించునే మక్షికాపక్ష విక్షేప వాతాహతిం గాంచనాగంబు? మిథ్యామమత్వంబులన్ రంజకత్వంబులన్ గూఢయంత్రంబులన్ మోహమంత్రంబులన్ మారుతంత్రంబులన్ కిక్కఁడే. చొక్కఁడే దిక్కులం జిక్కులంబెట్టు మేధన్ మహావేధనైనన్ విరోధించి వాకట్టు, నీతిన్ బలారాతిమంత్రిం బ్రమోషించు, భాషావిషేషంబులన్ శేషుతోనైన భాషించు, మాయావిధానంబులన్ మాధవున్ మెచ్చఁ, డచ్చోట నెప్పాట మెప్పించెదే. చీటికిన్ మాటికిన్ బోటి యామేటి యిచ్చోటికిన్ రాఁడు పాటించి. నీపాటిపాఠీననేత్రల్ ధరిత్రీశుచిత్తంబు మత్తంబుగాఁజేయఁగాఁ జాలరే. ఏల రేలుంబగళ్ళున్ విచారంబు? చాలింపవే. వారావేశ్యాభుజంగుండు గాఁడే; మహారాయవేశ్యా భుజంగుండు నిన్నేలయేలున్? పరస్త్రీలకున్ వేళ యీఁడెన్నఁడున్. దత్తుఁ బాంచాలు భద్రున్ మరుంగూచిమారున్ వినం గోరవుం జీరవుం జేర వీరీతి నేనాతిచేవింటివే యింటి నీవంటి దీవెంటలం దంటయై గెంటిపోఁ? దమ్మిజంటీ, నునుంగంట యీవెంతకా? హా! కనుంఒంటినీగొంటు చెద్యంబు. దైవంబు క్రేఁగంటి కేనెంత కంటైతినో! జంట నింటింటికిన్ వెంటం వెంటం బడన్ బంటనే? దాఁట నింటిన్, జేనంటీ! చిరంటీ గుణంబేటికే? మాయలాఁడే విభుండైనఁబోఁడే వినోదింపనీఁడే నిమగ్నుండు గాఁడే మముం జేరనీడే నినుంజేరరాఁడే ప్రవేశింపరాదే ప్రమోషింపఁగాదే. ప్రవర్తింతు వెచ్చొట నచ్చోటి కేమేఁ బ్రియంబాడరామే నినుంబాయలేమే. మహోపాయవై కన్యకా! ధన్యునన్యున్ మదిం గోరుమా, చేరుమా. చేరుమా కిష్టముల్. వీటలేరేమగల్ చేరరారేనినుం గోరి తారే విహారేహులై గేహళీవాటికిన్ మాటికిన్ వచ్చు నేవారి నీవారిఁగాఁ జూడవున్ గూడవున్. వారిజామోద! యీవార రామల్ మనోరాములన్ రిత్తపోరాములంగాని నిక్కంపుఁ బోరాములం జేసి గారాములం జిక్కరే. చొక్కిరే. వారు వారాదికృత్యంబులం జేయవారక్రియల్ చెల్లవే. తల్లి రాజుల్ బహువ్యాజులే భోజులే చంచలచ్చిత్తులే మత్తులే ప్రేరకాయత్తులే నూతనాసక్తులే లోభసంయుక్తులే దోషసంసిక్తులే రంధ్రసంపాదులే వీతమర్యాదులే. వారి సేవింపఁగా రాదులే, కాదులే, వాదులేలా, నవైలాలతాదేహ! సందేహమే దేహమేలే నలంపన్, నిలింపాంగనాభా! సునాభ! మదిన్ మానవే మనవేశాభిలాషంబులన్. నిన్ను లేమా! భరింపంగలేమా? కరంగింప లేమా నరేశున్ జితశ్రీసురేశున్. గతిశ్రీజితోద్దండ వేదండ! మాదండ నేదండముంజెందదే. రాచదండంబు గండంబు పుండ్రేక్షు కోదండ విబ్రాజితభ్రూయుగా! భూమిపాలావరోధంబు లో సన్నిరోధంబు నీకున్ మహాభద్రమా? భద్రమాతంగకుంభస్తనీ! కన్నవారంబుగా మాహితాదేశముల్ సేయఁగా మాకు ధర్మంబు. కామాశుగాలోకనా! ఏల కామాతురత్వంబునుం జెంద, రామా! భవత్సంగతిన్ మున్నుగామా, త్రిలోకాభిరామాంబరానేకహేమాదులున్ నీకునీమా. కులోత్తంస! నే మాకులత్వంబునుంబొంద మామాట లేపాట వేమాటులాలింపువారిన్ నిరీకింపకీమానవాధిశుపై మానసంబేల పట్టించెదే. ముద్దుపట్టీ, భవచ్చాతురిం బట్టి సర్వజ్ఞ్సింగ క్షమానాథుఁ దప్పించి దర్పించి లోకత్రయిన్ నీకునర్పింతునే. మారునిం జారుఁ గావించి రప్పింతునే. బ్రాఁతియేపైడి? నాపైఁడి! ఏపైఁడిలేదింటిలో? వింతివా రాచపోరామి యిట్టిట్టుఁ బోరామికిన్ మూలమే. మేలమే? ఇందునవ్యారవిందాననా! ముందు విందాననే లాట కఋణాట పాంచాల బంగాళ చోళాది రాజన్య కన్యల్ వయోరూప ధన్యల్ సదాసక్తలై దాసి యున్నారటే. రారటేపాసి. తత్పాదరాజీవసందర్శ నారంభ సంరంబులై వీతహృద్దంభులై కుంభినీశుల్ బహూపాయనద్రవ్యహస్తుల్ ప్రశస్తుల్ హమాభక్తి నక్తందివంబుల్ ప్రవేశించియున్నారు. కన్నారు విన్నారు లోకుల్. వరాలోక నీకేల లీలావకాశంబు సిద్ధించు? సిద్ధించెనా మన్మథాకారుతోఁ గూడి క్రీడింపఁగాఁ బోలదే. వానివాణిన్ తద్భాహుపీఠిన్ దిశాకుంభి కుంభీన సాగేంద్ర కూర్మాదులం బాసి కూర్మిన్ విలోకంబులన్ లచ్చి వర్తించునే. దిక్కులందెల్లఁగీర్తుల్ ప్రవతించునే. దుర్లభుండే! బహుప్రేయసీవల్లభుండే! సదైకానుషంగంబు భంగంబు పణ్యాంగనాజాతికిన్ నీతికిందప్పితేఁజెప్పితిం గూన! సిద్ధంబు తద్ధాతమున్ వారభామాతనూజాతకున్ నేతగా మాతనూజ్జాత గావించె. నిర్ణీతమే యేతదర్థంబు మర్యాద నిమ్మేదిన్ వారమే నాదినుండిం బ్రయోగింతునే దాదినై. కామశాస్త్రాదివిద్యాసమేతన్ భన్మాత నుద్దామమాయాప్రభూతన్ గురంగీవిలోకా నిరంగీకృతుల్ మాని నామాట నీమాటు పాటింపవే. నందనీ! నిందనీయంబు గాదే. మహానందనీయంబుఁ జిత్తంబులోనందనీవే. జనానందనీయా! కఠోరాచలవ్రాత కాఠిణ్యమున్ డింప, రత్నాకరశ్రేణిలోఁతున్ నివేదింప, విత్తేశుగేహంబునున్ రిత్తసేయన్, జగచ్చక్షువుం గన్నుమూయన్, సదాగామినాఁకట్ట, నుద్యద్భుజంగావలింబట్ట, వారాంగనాజాతికిన్ న్యాయమే.మామకన్యాయసంపన్నవై పన్ని యోకన్య నీవన్యులన్ బౌరసంపన్నులన్ భిన్నులన్ ఖిన్నులన్ జేసి మన్మందిరాళింద భూమండలాసన్నులం జేయుమీ. రాచబిడ్డేటికే బిడ్డ! వాచాటతల్ సాఁగవే. సాఁగినన్ నీకు జూదంబులా, కాక వీణావినోదంబులా, గద్య పద్యానువాదంబులా, మాళవీముఖ్యరాగానుగానంబులా, దండలాస్యాది నృత్యవధానంబులా, ఇంద్రజాలాది మాయా విధానంబులా, వశ్యమంత్ర ప్రయోగోపసంహార విద్యావిచారంబులా, మందిరారామ వాటీలతాజాల మూలాభిషేక ప్రచారంబులా,హేమదోలావరోహంబులా, నీరజవాసవీచీసమూహావగాహంబులా, బంధుగేహప్రవేశంబులా,రాజహంసావళీ మందయానోపదేశంబులా, నీలకంఠావళీ నృత్యశిఖావిశేషంబులా, కాముకవ్రాతచిత్త ప్రమోషంబులా, బొమ్మరిండ్లాటలా, పాతలా, పాటలామోద, రాజోపకంఠానంబుల్ కఠోరాసిధారావలేహంబులే, సింహయోగంబులే, సర్పవాల్మీక భోగంబులే, శైలశృంగాగ్రవీథీ విహారావధానంబులే, తుంగతాళాగ్రకోటీతపస్సంవిధానంబులే, మత్తశార్ధూలకుంజ ప్రచారంబులే, సింధుమధ్యప్రతారంబులే, గంధశుండాల శుండావినోదంబులే, సప్రమాదంబులే, కొమ్మ, మాకొమ్మదే రాచసఖ్యం బసౌఖ్యంబు మేమొల్ల, మేమొల్లముల్ మాకులాభంబులే? డింభ కేవేళ నమ్మోము సొంపారు, నేవేళఁ బాలిండ్లు పెంపారు, నేవేళ ఫాలంబున గుంతల శ్రేణుల్లలాడు, నేవేళ మైదీఁగయున్ వీడు, నేవేళనాయాస మున్నూడు నంచు బ్రతీక్షింప నీ వంతవై యింతవై నేఁడు భూపాలుపాలై ప్రవర్తించుచోఁ గంబుకంఠీ, భవద్దర్శనోత్కంఠతన్ రాజగేహోపకంఠంబులన్ వచ్చునీవారి వారింతురే వారి దౌవారుకుల్ వారధర్మంబు వారంచు దుర్వారులై. తన్మహాగేహ నిర్యూహ సేవారతాయాత భూపాలక వ్రాత వేదండ గండస్థలీ నిస్సార ద్దానధరావళీ జాతజంబాల సంఘంబు దుర్లంఘనీయంబు మాకున్, మహాదుర్గమంబృ చొరన్ నిర్గమింపన్, మహోత్సాహవై వత్సా! మత్సాహసచర్యంబు కార్యంబు గైకొందు రమ్మంచు లెమ్మంచు వల్లించు తల్లిన్ ధనాదాన
వారకన్య తల్లి పల్కు నిరాకరించుట
విద్యామతల్లిన్ విటస్వాంతభల్లిన్ నిరూపించి కోపించి బుద్ధింబ్రదీపించి ' అమ్మా! విననొల్లఁబొమ్మా, విచారించుకొమ్మా, భవన్నీతి దుర్నీతి, సన్మానుషం బింతయున్ లేని దుర్మానవశ్రేణి నీవేల యీవేలభూషించెదే? ఏమిభాషించెదే? ఏలనన్నుం బ్రమోషించెడే. రాయ చౌహత్తమమల్లున్ వధూటీ సరోజాతభల్లున్ మహారాజవేశ్యాభుజంగున్ హయనేకపగ్రామహేమాది నానామహాదాన చంగున్ వధూలోకపాంచాలు సర్వజ్ఞసింగక్షమాపాలుఁ గైకొంట తప్పే? కకుప్పాలసంకాశుఁడే. వాని యొప్పుల్ సతుల్ చెప్పఋఏ? ఏల నొప్పింప? మాతల్ తనూజాతలన్ జాతవిత్తాశలై యాశలం బేశలత్వంబు లే కర్నిలింబాసినారోటు? రారోటు రక్షారతిన్? గోర్రుకులీరోటు? నీవింత సెగ్గింప నెగ్గేమి గావించితిన్. లోకనిర్మాత నిర్మాతగాఁ జేయకేల సదురాత్మఁగావించె! విజ్ఞాతయోషా మనోవృత్త సంఘాతవున్, మాతవున్, గామసిద్ధాంత విఖ్యాతవున్, జూడ నేతద్దురాలాపముల్ చిత్తసంతాపముల్గాఁ బ్రయోగింతురే? కూఁతుఁ జింతానదిన్ ముంతురే? పిన్ననాఁడెల్ల నాఁడెవ్వరింగోరవే, చేరవే? మున్ను రంభోర్వశీమేనకాదుల్ సుకందర్ప సిద్ధాంతవేదుల్ వశీకార విద్యాధురీణుల్ ప్రవీణుల్ వరశ్రేణి నూహింపరే! చూచి మోహింపరే! వార లూహింపరే నీతులన్? నిర్దయాలాపవైపాపవై పాపవేల మనోజవ్యథన్? నిన్ను నేమందు? నేమందులన్ మానదే మానసత్త్వంబు. చింతింపుమవ్వా! విభుండేమి దవ్వా? ఎఱిగించి రప్పించెదో, కాక, కామానలజ్వాలకున్ నన్ను నొప్పించెదో! ఇంత ఱంతేల నీకుం గొఱంతేలసద్ద్రావ్యముల్. తల్లి నే నెల్లవేళన్ మనోజాజ్ఞిచేఁ గంది లోఁ గుందగా మ్రంద, వీమందటల్ చాలు ముందేటికిం గంటివే? కెంటసంబేల ఘంటాభవై మ్రోసెదే? అన్యకుం గన్యఁగానైతి. ఉద్దామశృంగారుపై దీనమందారుపై భూమిభృద్గాయగోవాళుపైఁ గామినీలోలుపై రాయశుండాలహర్యక్షుపై రాయకందర్ప ఫాలాక్షుపై రాయగోపాంగనాబృందగోవిందుపై సంతతానందుపైఁ బోచమాంబాలసద్గర్భ సంజాతుపై లోకవిఖ్యాతుపైఁ బాదపీఠాంకితారాతిభూపావళీపాలుపై, సింగభూపాలిపై వ్రాలి, నాచిత్త మున్మత్తమై సోలి, కామానలాయుత్తమై రాదు తేరాదు. నే నామరుండైన గౌరీవరుండైన వాణీధరుండైన లక్ష్మీవిభుండైన దేవప్రభుండైన నన్యున్ మదిం గోరఁగా నొల్లనే. ఉల్లసత్ఫుల్లమందార రాజన్మరందంబు నదంబునం గ్రోలు మత్తాళిదుత్తూరముం గోరునే? హేమరాజీవరాజీరజోరాజితాకాశ గంగానదీలోల కల్లోల డోలాచల ద్రాజహంసంబు శైవాలజంబాల గండూపదీభేకభేకీ ఢులీ సంకులాసార కాసారముం జేరునే? మండితాఖండలానీత జీమూత నిర్యత్పయోధారలంద్రావుసారంగి కుంభంతరాంభఃప్రపూరంబులం ద్రావునే? మాధవోజ్జాత చూతాంకురస్వాదలీలాలసత్కోకిలేంద్రంబు ఝుల్లీరవక్రూర భిల్లాతకీశాఖకుం బోవునే? సింగభూపాలబాహా పరీరంభ సంరంభ సంజాత సంతోషముం గోరు యోషాశిరోరత్న మాశించునే నీచసంభోగ మంబా! కుతర్కావలంబా! చలంబా! విలం బానులాపంబులన్ బాలసూర్యభూనిం బాయనాడన్. పురోభాగినీ! భోగినీ రాజుకంటెన్ మహాభాగు, నాభాగ సౌభాగ్య శోభాగరిష్ఠున్, వరిష్ఠుం బ్రవేశించి నీతిం బ్రకాశించి, నృత్తవధానంబులన్ మంజుగానంబులన్ జిత్తమార్జింతునే. విత్తమున్ లేమి వర్జింతునే. ఎట్టిదిన్ విత్తమే రిత్తమై యేటికే? నిత్యదంభా! దురారంభయుక్తిం బ్రమోషింప విద్వేషినే? ఏలనే గోలనే బాలనే, మానలెనే నరధీశచూడామణిన్, వారకన్యా జనగ్రామణీ, పాపజాతీ! భవజ్జాతి దుర్జాతి పొ ' మ్మంచు ' లె 'మ్మంచు 'నోచెల్లనేఁజెల్ల రేచెర్లగోత్రోద్భవున్ మానలే ' నంచు ' నాయన్నాలా, యన్యులం జేరబో ' నంచు హృద్భల్లితో వక్రవాగ్భిల్లితోఁ దల్లితో మాటఁ జాలించి ధైర్యంబు గీలించి సంజాత శాతోదరిన్ సోదరిం జూచి
వారకన్య సోదరిని దనవెత దీర్ప వేఁడుట
'అక్కా! ప్రసూనాస్త్రుధిక్కారముం జూచితే నేడు రాకేందుతాకం దురాకంపముం బొందె డెందంబు. చైతన్య సంచాలియై కీలియై గాలి ఏతెంచె. కోదండియై, తూణియై, బాణియై, కంపిత ప్రాణియై, కాముకారాతి తోఁతెంచె. వాసంతవేళా రమాకంద మాకందశాఖావళిం గోకిలారావకోలాహలంబుల్ విటస్వాంతహాలాహలంబుల్ దిశల్ మించి యేతెంచెనే. నేఁడు బాలామనోతంతుతోఁ గంతుతో, సింగభూమీశుతో, భోగదేవేశుతో, న న్ని వేదింపవే. కాము సంతాపమున్ డింపవే డింపి
వారకన్యసోదరి దానివలపును సింగరాజునకుఁదెలిపి కావవేఁడుట.
పుణ్యంబునం బోఁగదే, రాఁగదే, లేగదే, వేగదే ' యంచుఁజింతించు నాత్మానుజాతందనూజాతశంకాసమేతం గృశీభూతఁగమ్గెంచు ' బాలా! లలాటాక్షు సేవింపుమీ, రాహుభావింపుమీ, శేషభోగిం బ్రకర్షింపుమీ, చంపకశ్రేణి వర్షింపుమీ ' యంచుభీతిన్ నివారించి నీతిన్ విచారించి యారామ యారామసౌధంత రాళస్థలిన్ నర్తనాగారవేదికన్ మణిస్వర్ణ పర్యాంకికా భాసమానున్, మనోభూసమానున్, ఘనున్, రావుసింగక్షమానాధపౌత్రున్, సమీచీనరేచర్లగోత్రంబు సంజాతమిత్రున్, మహోదారచారిత్రు, సర్వజ్ఞసింగోర్వరాధ్యక్షు నీక్షించి దండప్రణామంబు సాపేక్షఁ గావించి హస్తాబ్జముల్ మోడ్చి ' దేవా! భన్న్యస్త సౌజన్య ధన్యన్, జగన్మాన్యఁ, గన్యన్, నిరన్యాంకపీఠాధిరోహన్, నిరన్యోపగూహన్, నిరన్నాభిలాషన్, నిరన్యాభిభాషన్, నిరన్యావకాశన్, నిరన్యప్రకశన్, బ్రసూలోచనక్షిప్తభాష్పంబుపూరన్, మనోజాతబాణావళీ శంకితప్రాణభారన్, సఖీమానసన్యస్త చింతాసమూహన్, భగిన్యంక సం
సింగరాజు వారకన్యనుజేపట్టీ భోగినిఁగాఁజేయుట
ప్రాపితానేకదేహన్, భవద్వైభవాకృష్టచిత్తన్ బరాయుత్త వృత్తన్ గృపం జూడు ' మంచు ప్రశసింప నాభోగదేవేంద్రుఁ దా సత్యభాషా హరిశ్చంద్రుఁ డాకామినీలోకపాంచలుఁ డాసింగభూపలుఁ డాబాల నాబాలశీతాంశుఫాలన్, సరోజతహస్తన్, బ్రశస్తన్, శుకాధీశవాణిన్, లసన్నీలవేణిన్, మృగేంద్రావలగ్నన్, మనోకాగ్నిమగ్నన్, దయదృష్టి రావించి భావించి నెయ్యంబుగావించి బాహాపరీరంభసమ్రంభనిర్ముక్త సంతాపఁ గావించి కందర్పకేళిన్ వినోదించి సద్భోగినింగాఁ బ్రసాదించి తన్మాత నుద్యద్గజారూఢఁ జేయించి విఖ్యాతి మ్రోయించియిష్టంబు లిప్పించి యొప్పెంగడున్.
ఉ: పండితకీర్తనీయుఁ డగుబమ్మెరపోతన యాసుధాంశుమా
ర్తండకులాచలాంబునిధితారకమై విలసిల్ల భోగినీ
దండకమున్ రచించె బహుదానవిహర్తకు రావుసింగభూ
మండలభర్తకున్ విమతమానవనాధమదాపహర్తకున్
Nice one brother! Great service you are doing!
ReplyDeleteKeep it up!
వేమన శతకం!
ReplyDelete.
ఆనుకూల్యము గల అంగన కలిగిన
సతికి పతికి పరమ సౌఖ్యమమరు
ప్రాతికూల్యయైన పరిహరింప సుఖంబు
విశ్వదాభిరామ వినురవేమ!
ఒద్దిక కలిగిన భార్య ఉన్నట్టయితే ఆమెకూ ఆమె భర్తకూ సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. విరుద్ధమైతే మాత్రం ఆ దాంపత్యం నిలువదు. అట్లాంటప్పుడు ఆమెను వదిలెయ్యటం తప్ప గత్యంతరం లేదు అంటున్నాడు వేమన.
ఇది 17వ శతాబ్దంలో చెప్పిన పద్యం. మూడున్నర శతాబ్దాలు గడచిపోయాయి.
భార్యాభర్తలిద్దరికీ అసలే పడకపోతే ఇద్దరూ విడిపోవడం ఇద్దరికీ మంచిది. ఇక్కడ ఇద్దరూ ఒకరినొకరు వదిలేస్తారన్న మాట. కాని ఈ పద్యంలో అతడు ఆమెను వదిలెయ్యాలని ఉంది. అంటే ఇక్కడ పురుషాధిపత్యం ఉంది. ఇది ఒక్క వేమన్న పద్ధతే కాదు వ్యష్టి ప్రత్యేకతకూ సమష్టి ప్రయోజనానికీ సంఘర్షణ ఈనాటిది కాదు. ఒకప్పటి నిరక్షరాస్య స్త్రీకీ, నేటి చదువుకున్న మహిళకూ పరిస్థితిలో మార్పు వచ్చింది.
ఆ కాలంలో ఎదురు తిరిగే భార్యను భర్త పరిహరించాలన్నాడు వేమన. మరి ఈనాడు భర్త భార్యను పరిహరిస్తాడా? భార్య భర్తను పరిహరిస్తుందా, లేక ఇద్దరూ ఒకరినొకరు పరిహరిస్తారా అనేది ఇప్పటిదాకా గడచిన వారి జీవితం నిర్ణయిస్తుంది. వారిని కలిపి ఉంచే బలం వారి కాపురానికి లేకపోతే వారిని కలిపి ఉంచే శక్తి ఏ బాహ్య శక్తులకూ ఉండదనేది లోక సత్యం.