Friday, July 13, 2012

బమ్మెర పోతనామాత్య కృత "నారాయణ శతకం" - Part 2


మ. పసులంగాపరి యేమెఱుంగు మధురప్రాయోల్లాసద్వృత్తవా
గ్విసరారావము మోవిదా వెదురు గ్రోవిం బెట్టి నాఁడంచు నిన్
గసటుల్ సేయఁగ నాఁడు గోపికల తద్గానంబులన్ మన్మథ
వ్యసనాసక్తలఁ జేయుచందములు నేవర్ణింతు నారాయణా

మ. జడియొంతేఁ దడవయ్యె జెయ్యియలసెన్ శైలంబు మాచేతులం
దిడుమన్నన్ జిరునవ్వుతో వదలినన్ హీనోక్తిగీపెట్టనె
క్కుడుగోవుల్ బ్రియమంద నింద్రుఁ డడలంగోవర్ధనాద్రీద్రమున్
గొడుగైయుండగఁ గేలఁబూనితిగదాగోవింద నారాయణా

మ. లలితాకుంచితవేణి యందడవి మొల్లల్ జాఱ ఫాలస్థలిన్
దిలకం బొయ్యనజాఱఁ గుండలరుచుల్ దీపింపలేఁ జెక్కులన్
మొలకన్నవ్వుల చూపులోరగిల మేన్మువ్వంకన్ బోవఁగ
నలిగైకొందువుగాదె నీవు మురళీనాట్యంబు నారాయణా

శా. మాపాలం గడుగ్రొవ్వి గోపికలతో మత్తిల్లి వర్తింతువే
మాపాలెంబుల వచ్చియుండుదు వెసన్మాపాలలో నుండుమీ
మాపాలైన సుఖాబ్ధిలో మునుగుచున్ మన్నించి తాగొల్లలన్
మాపాంగల వేల్పు నీవెయని కా మన్నింతు నారాయణా.

మ. ఒక కాంతామణి కొక్కడీవు మఱియున్నొక్కరై కొక్కండవై
సకలస్త్రీలకు సంతసంబలర రసక్రీడతన్మధ్య క
ల్పకమూలంబున వేణునాదరస మొప్పంగా, బదార్వేలగో
పికలంజెంది వినోద మొందునెడ  నీపెంపొప్పు నారాయణా

మ. లలితంబైన భవత్తనూవిలసనన్ లావణ్యదివ్యామృతం
బలుఁగుల్వారఁగ నీకటాక్షమునఁ దామందంద గోపాంగనల్
తలఁపుల్పాదులుకట్టి కందళితనూత్న శ్రీలు వాటింతురా,
నెలతల్ తీవెలు చైత్రవిస్ఫురణమౌ నీయొప్పు నారాయణా

శా. లీలన్ బూతకిప్రాణవాయువులు పాలిండ్లందు వెళ్ళించి దు
శ్శాలుండై చనుబండిదానవు వెసంజిందై పడందన్ని యా
రోలన్మద్దులు గూల్చి ధేనుదనుజున్ రోఁజంగ నీల్గించి వే
కూలం గంసునిఁగొట్టి గోపికలకోర్కుల్ దీర్తు నారాయణా

మ. రసనాగ్రంబున నీదునామరుచియున్ రమ్యంబుగాఁ జెవ్లుకు
న్నసలారంగ భవత్కథాభిరతియున్ హస్తాబ్జ ముగ్మంబులన్
వెసనీపాదసుపూజితాదియుగమున్ విజ్ఞాన మధ్యాత్మకున్
వెస నింపొందనివాఁడు దాఁ బశువు సూవేదాత్మ నారాయణా

మ. వరకాళిందితరంగడోలికలలో వైకుంఠధామంబులో
వెరవొప్పార నయోధ్యలో మధురలో వ్రేపల్లెలో ద్వారకా
పురిలో నాడెడు భంగి నాదుమదిలో భూరిప్రసన్నాననాం
బురుహం బొప్ప నటించుటొప్పును సితాంభోజాక్ష నారాయణా

శా. చల్లల్వేఱొకయూర నమ్ముకొను నాసంబొవుచోఁ ద్రోవ నీ
వుల్లాసంబున నడ్డకట్టి మదనోద్యోగానులాపంబులన్
చల్లన్ జల్లనిచూపు జల్లుమని గోపస్త్రీలపైఁ జల్లు మీ
చల్లంబోరు తెఱంగు జిత్తమున నే జర్చింతు నారాయణా

మ. కలయన్వేదములున్ బురాణములు బ్రఖ్యాతంబుగా తెల్పి మీ
వలనన్ భక్తిహీనుఁడైనపిదపన్ వ్యర్థప్రయత్నంబెపో
గులకాంతామణి గొడ్డువోయినగతిం గ్రొవ్వారు సస్యంబు దా
ఫలకాలంబున నీచపోవుపగిదిన్ పద్మాక్ష నారాయణా

శా. స్నానంబుల్ నదులందుజేయుట గజస్నానంబు చందంబగున్
మౌనంబొప్ప జపించువేదమటనీ మధ్యంబులో నేడ్పగున్
నానాహోమములెల్ల బూడిదలలోన న్వేల్చునెయ్యై చను
న్నినామోక్తియు నీపదాబ్జరతియున్ లేకున్న నారాయణా

మ. అలనీటందగు రొంపిపైఁ జిలికిన న్నానీట నేపాయు నా
యిలపాపంబులు దుర్భరత్వము మహోహేయంబునం బొందినం
బలువై జీవుని దొప్పఁ దోఁగినవి యీబాహ్యంబునం బాయునే
పొలియుంగాక భవత్సుపాదజలముం బ్రోక్షింప నారాయణా

మ. తనచిత్తాబ్జము మీపదాబ్జములకుం దాత్పర్య సద్భక్తితం
తున బంధించిన బంధనంబుకతనం దుష్పాపపుంజంబు లె
ల్లను విచ్చిన్నములై యడంగు మహిమోల్లాసాబ్ధియైనట్టి దా
సున కింపొందును మోక్షవైభవము దా సుశ్లోక నారాయణా

మ. తనువుం జీవుఁడు నేకమైనపిదపన్ ధర్మక్రియారంభుఁడై
యనయంబున్మది దన్నెఱుంగక తుదిన్నామాయచే మగ్నుఁడై
తనుతత్వాది వియోగమైనపిదపం దానేర్చునే నీదుద
ర్శన మింపారఁగ భక్తివైభవ మహాసంకాశ నారాయణా

మ. తనకున్ సాత్వికసంపదాన్విత మహాదాసోహ భావంబునన్
ననయంబున్మది నన్యదైనభజనం బారంగ దూలింపుచున్
జనితాహ్లాదముతోడ నీ చరణముల్ సద్భక్తి పూజించి నిన్
గనుగొన్నంతనె కల్మషంబు లడఁగుం గర్మఘ్న నారాయణా

మ. పరికింపన్ హరిభక్తి భేషజునకున్ భవ్యంబుగా మీఁద మీ
చరణాంభోరుహ దర్శనంబు గలదే సంప్రీతి నెట్లన్నఁ దా
ధరలోఁ జోరుఁడు గన్న దుస్తర పరద్రవ్యంబుపై నాశలం
బొరయన్నేర్చునె దుర్లభంబగు గృపాంభోజాక్ష నారాయణాఉ

మ. పరమజ్ఞాన వివేక పూరిత మహాభవ్యాంతరాళంబునన్
పరగ న్నీ నిజనామమంత్ర మొనరన్ భక్తిన్ననుష్ఠింపుచుం
దురితాన్వేషణ కాలభూతము వెసన్ దూలంగ వాకట్టు వాఁ
డరుగున్ భవ్యపదంబు నొందుటకునై యవ్యక్త నారాయణా

మ. సరిఘోరంధక బోధకారణ విపత్సంసార మాలిన్యమున్
పరమానంద సుబోధకారణ లసద్భస్మంబు పై నూఁది యా
నిరతజ్ఞానసుకాంతి దర్పణమున న్నిస్సంగుఁడై తన్నుదా
నరయం గాంచిన వాఁడు నిన్నుఁ గనువాఁడబ్జాక్ష నారాయణా

మ. పరుషాలాపములాడ నోడి మదినీపాపార్జన నారంభుఁడై
నిరసించేరికిఁ గీడుసేయక మది న్నిర్ముక్త కర్ముండునై
పరమానంద నిషేధముల్ సమముగా భావించి వీక్షించునా
పరమజ్ఞాని భవత్కృపం బొరయ నో పద్మాక్ష నారాయణా

మ. ఒరులం దన్ను నెఱుంగు నియ్యెఱుకయు న్నొప్పార నేకాంతమం
దరయంబైపడు నన్యభామినులపై నాకాంక్షదూరత్వమున్
మరణావస్ఠను నీదునామములె సన్మానంబునం దోఁచుటల్
ధరలోన న్నివి దుర్లభంబులు సుధాధామాక్ష నారాయణా

మ. వెరవొప్ప న్బహుశాస్త్రమంత్రము లొగి న్వీక్షించి వేతెల్పిమీ
వరనామామృతపూర మానుచుఁ దగన్ వైరాగ్యభావంబునన్
సరి నశ్రాంతముఁ గోరువారు పిదపన్ సంద్సారమాతుఃపయో
ధరదుగ్ధంబులు గ్రోలనేరరు వెసన్ దైత్యారి నారాయణా

శా. వేదంబందు సునిశ్చయుండగు మహా వేల్పెవ్వఁడో యంచు నా
వేదవ్యాసపరాశరుల్ వెదకిన న్వేఱొండు లేఁడంచు మీ
పాదాంభోజము లెల్లప్రొద్దు మదిలో భావింతు రత్యున్నతిన్
శ్రీదేవీ వదనారవింద మధుపా శ్రీరంగా నారాయణా

మ. సుతదారాప్తజనాది విత్తములపై శూన్యాభిలాషుండునై
యతనోద్రేకయుతంబులై పొదలునయ్యై యింద్రియవ్రాతముల్
మృతిఁబొందించి దమంబునన్ శమమున్ మీఱంగవర్తించు ని
ర్గతసంసారి భవత్కృపంబొరయ నో కంజాక్ష నారాయణా

మ. ప్రమదం బారగఁ పుణ్యకాలగతులన్ భక్తిన్ననుష్ఠింపుచున్
నమర న్నన్న సువర్ణగోసలిల కన్యాధారుణిగ్రామదా
నము లామ్నాయవిధోక్తి భూసురులకున్ సన్మార్గుఁడై యిచ్చువాఁ
డమరేంద్రార్చిత వైభవోన్నతుఁడగు న్నామీఁద నారాయణా

మ. ఇల నెవ్వారిమనంబులో నెఱుకదా నెంతెంత గల్గుండునా
కొలదింజెంది వెలుంగుచుందు కలయన్గోవింద నీరూపులన్
యలర న్నంబు మితంబులై సరసిలో నంభోరుహంబుల్ దగన్
నిలనొప్పారెడుతందమొందెదెపుడు న్నీలాంగ నారాయణా

మ. మదిలో నుత్తమభక్తి పీఠముపయిన్ మానాథ మీపాదముల్
గదియం జేర్చినవానికేనొడయఁడన్ గాదంచు సత్యున్నతిన్
పదిలుండై సమవర్తి మృత్యువునకున్ బాఠంబుగాఁ బల్కు మీ
పదపద్మార్చకు లెంతపుణ్యులో కృపాపారీణ నారాయణా

మ. కులమెన్నంగొలదేల యేకులజుఁడుం గోత్రాభి మానాభిలా
షలు నజ్ఞానము బాసి జ్ఞానము మదిన్ సంధించి శుద్ధాత్ముఁడై
యలరారం బరుసంబుసోఁకు నినుమున్ హేమాకృతస్తోమమై
వెలయు న్నాగతి వాఁడుముక్తికరుగున్ వేదాత్మ నారాయణా

మ. నిరతానందనియోగులై నియతులై నిర్భాగ్యులై నీచులై
కరుణాహీనమనస్కులై మలినులై కష్టాత్ములై నష్టులై
పరుషవ్యాధినిబద్ధులై పతితులై భగ్నంగులై మ్రగ్గువై రరయ
న్నిన్నొగి నాత్మయుం దిడనివా రబ్జాక్ష నారాయణా

మ. ఘనభోగాస్పదులై గతౌఘమతులై కారుణ్యలై ముక్తులై
ధనకీర్తిప్రదులై దయాభిరతులై ధర్మాత్ములై నిత్యులై
మనుజాధీశ్వరులై మనోజనిభులై మాన్యస్థులై స్వస్థులై
యొవరన్నొప్పెడువారు నీపదరుచుల్ యూహించు నారాయణా

మ. విదితామ్నాయ నికాయభూతములలో విజ్ఞానసంపత్కళా
స్పదయోగీంద్ర మనస్సరోజములలో బ్రహ్మేంద్రదిక్పాలక
త్రిదశవ్రాతకిరీటరత్నములలో దీపించుచున్నట్టి మీ
పదపద్మంబులు భావగేహమున నే భావింతు నారాయణా

మ. వెలయన్ యౌవనకాలమునందు మరుడుఁన్ వృద్ధప్యకాలంబునన్
బలురోగంబులు నంత్యమందు యముఁడుం బాధింపఁనట్లైన యీ
పలుజన్మంబులు చాలదూలితి ననుం బాలింపవే దేవ మీ
ఫలితానంద దయావలోకనము నాపైఁజూపు నారాయణా

మ. బలుకర్మాయుత పాశబంధవితతిన్ బాహాపరిశ్రేణికిన్
జలయంత్రాన్వితబంధయాతనగతిన్ సంసారకూపంబులో
నలరం ద్రిమ్మరుచుండు నన్ను నకటా! యార్తుండనై వేఁడెదన్
వెలయ న్నీకృపచేతఁ జేకొనవె నన్ వేవేగ నారాయణా

మ. మమహంకారవికారసన్నిభ మహామత్తాది లోభాంధకా
రముచే ముక్తికి నేఁగుమార్గ మెఱుగన్ రాదింక నాలోన
విమలాపాంగదయాదివాకరరుచిన్ వెల్గింపు మింపార నో
కమలానంద విహారవక్షలలితా! కంజాక్ష నారాయణా

మ. పరిపంథిక్రియ నొత్తి వెంటఁబడు నప్పాపంబుఁ దూలించి మీ
చరణాబ్జస్థితిపంజరంబు శరణేచ్చం జొచ్చితిం గావుమీ
బిరుదుం జూడుము మీరు సూడఁగ భవధ్భృత్యుండు దుఃఖంబులం
బొరయ న్మీకపకీర్తిగాదె శరదాంభోజాక్ష నారాయణా

మ. సతతాచారము సూనృంతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్
నతి శాంతత్వము చిత్తశుద్ధి కరమున్ నధ్యాత్మయున్ ధ్యానమున్
దృతియున్ ధర్మము సర్వజీవహితముం దూరంబుగాకుండ స
మ్మతికిం జేరువ మీ నివాససుఖమున్ మానాథ నారాయణా

మ. భవనాసిన్ గయ తుంగభద్ర యమునన్ భాగీరథిం గృష్ణ
వేత్రావతి న్నర్మద పెన్న గౌతమి పయోరాశి న్వియద్గంగయుం
దవగాహంబున నైనపుణ్యములు బెంపారంగ నేఁ డిచ్చటన్
భవదంఘ్రీ స్మరణంబునం గలుగు నోపద్మాక్ష నారాయణా

మ. ధర గ్రామాధిపు నింటిదాసుఁడు వెసం దాద్రోహముం జేసినన్
పరగం జెల్లుట సూచితీ భువన సంపాద్యుండ వైనట్టి మీ
వరదాసావలి దానదాసినని దుర్వారౌఘముల్ జేసితిన్
కరుణంజేకొని కావుమయ్య త్రిజగత్కల్యాణ నారాయణా

మ. గణుతింపన్ బహుధర్మశాస్త్ర నిగమౌఘం బెప్పుడు న్ని న్న కా
రణబంధుండనిచెప్ప నతైఱఁగు దూరంబందకుండంగనే
బ్రణతుల్ జేసెదఁ గొంతయైన గణుతింపం బాడిలేకుండినన్
ఋణమానానుతి నీవు శ్రీపతివి నీకేలప్పు? నారాయణా

మ. కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై యీశ మీ
శరణంబన్నఁ గృశానుభాను శతతేజస్ఫూర్తియైనట్టి మీ
కరచక్రంబున నక్రకంఠము వెసన్ ఖండించి మించెం దయా
పరసద్భక్తభయానక ప్రకర సత్ప్రాకట్య నారాయణా

శా. ఏభావంబున నిన్ దలంచె గజయూధేంద్రుండు ఆపన్నుఁడై
యేభావంబున ద్రౌపదయ్యెడ రమాధీశా యనె న్వాయసం
బేభావంబున నీశరణ్య మనెనో యీనీకృపాదృష్టిచే
నాభావంబున నీతలంపుఁ గలుగ న్నాకిమ్ము నారాయణా

శా. నీలగ్రీవుఁడు చేతిపున్క విడిచె న్నీయింతి భిక్షంబునిన్
నీలగ్రీవుఁడు యీశ్వరాఖ్యఁ దనరె న్నీనామజప్యంబునన్
నీలగ్రీవుఁడు మించిత్రుంచెఁ బురముల్ నీ ప్రాపు సేవించినన్
నీలగ్రీవమఖాబ్జభాస్కరకృపానిత్యాత్మ నారాయణా

మ. నినువర్ణింపనివాఁడు మూఁగ మదిలో నీనామమున్ వీనులన్
విని మోధింపనివాండు చెవ్డుమరినిన్ వేడ్కన్ మనోవీధినిన్
గనిపూజింపనివాఁడు నాశకరుఁడౌ కర్మక్రియారంభుండై
తనలోఁ గాననివాఁడు నీచమతివో తత్వజ్ఞ నారాయణా

మ. నినువర్ణింపని నీచబంధమతి దానిర్మగ్నమూఢాత్ముఁడై
పెనుదైవంబులఁ గోరి తా మనమునన్ సేవించుచందంబుతా
ననలం బారిన భూతియందు వెలయ న్నాజ్యాహుతుల్ పూనివే
ల్చినచందంబున వ్యర్ధమై తనరు, జూచిద్రూప నారాయణా

మ. నిను వర్ణింపని జిహ్వదాఁబదటికా? నీలాభ్రదేహాంగకా
నినునాలింపనిచెవులు దాఁబదటికా! నీరజపత్రేక్షణా
నినుఁబూజింపని కేలు దాఁ బదటికా? నిర్వాహకక్ష్మాతలా
నినుఁ జింతింపనియాత్మ దాఁబదటికా? నిర్వాణ నారాయణా

శా. నీవేతల్లివి నీవేతండ్రి వరయన్నీవే జగన్నధుఁడౌ
నీవేనిశ్చలబాంధవుణ్డ వరయ న్నీవేమునిస్తుత్యుఁడౌ
నీవేశంకరమూలమంత్ర మరయన్ నీవే జగత్కర్తవున్
నీవేదిక్కను వారి వారలె కడు న్నీవారు నారాయణా

మ. అపరాధంబులు నిన్ను నమ్మి వినుమే నాజన్మపర్యంతమున్
విపరీతంబుగఁ జేసినాఁడనిఁక నీవేదిక్కు నాలోనికిన్
గపటం బింతయులేక దండధరుకుం గట్టీక రక్షింపుమీ
కృపకుం బాత్రుఁడనయ్య ధర్మపురిలక్ష్మీనాథ నారాయణా

శా. చెల్లంజేసితి పాతకంబులు మదిన్ శ్రీనాధ మీనామముల్
పొల్లుల్ బోవనినమ్మి పద్యశతమున్ బూర్ణంబుగాఁ జెప్పితిన్
చెల్లం బోనను నమ్మె వీఁడని దయం జేపట్టి రక్షింపుమీ
తల్లిందండ్రియు నీవుగాక యొరులో తర్కింప నారాయణా

మ. నరసింహాచ్యుత వాసుదేవ విక సన్నాళీకపత్రాక్షభూ
ధరగోవిందముకుందకేశవ జగత్త్రాతాహితల్పాంబుజో
దరదామోదరతార్క్ష్యవాహనమహాదైత్యారివైకుంఠమం
దిరపీతాంబరభక్తవత్సల కృపన్ దీపింపు నారాయణా

మ. కడకంట గడలేని సంపదలొగిం గావింపు లక్ష్మీశపా
ల్కడలిన్ బన్నగశాయివై  భువనముల్ గల్పించు సత్పుత్రినిన్
బొడమన్ జేసిన నాభిపంకజ జగత్పుణ్యాత్మ భాగీరథీ
పడతింగన్న పదార విందముల నే భావింతు నారాయణా

మ. తపముల్ మంత్రసమస్త యజ్ఞఫలముల్ దానక్రియారంభముల్
జపముల్ పుణ్యసుతీర్ధసేవాఫలముల్ సద్వేదవిజ్ఞానమున్
ఉపవాస వ్రతశీలకర్మ ఫలముల్ యొప్పార నిన్నాత్మలో
నుపమింపం గలవారికే గలుగు వేయిన్నేల నారాయణా

శా. శ్రీనారాయణా యన్నఁ జాలు దురితశ్రేణి న్నివారింపఁగా
నానందస్థితి గల్గునంచు నిగమార్థానేక మెల్లప్పుడున్
నానాభంగులఁ జెప్ప నేను విని శ్రీనారాయణా యంచు ని
న్నేనేనెప్పుడు గొల్తు బ్రోవఁగదె తండ్రీ నన్ను నారాయణా

మ. కలితాఘౌఘ వినాశకారి యగుచుం గైవల్య సంధాయియై
నలి నొప్పారెడు మంత్రరాజ మగు నీనామంబు ప్రేమంబునన్
అలరన్నెవ్వాని వాక్కునం బొరయదో యన్నీచుదేహంబు దా
వెలయన్ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ నారాయణా

మ. రమణీయంబుగ నాదిమంబు నవతారంబున్ భవద్దివ్యరూ
పము నామామృతమున్ దలంప దశకప్రాప్తయ్యెఁ గృష్ణావతా
రము సుజ్ఞానము మోక్షమున్ ద్వివిధసంప్రాప్తిన్ శతాంధ్రఖ్యకా
వ్యము నర్పించితి మీ పదాబ్జములకున్ వైకుంఠ నారాయణా

శా. నీమూర్తుల్ గన నీకథల్ వినఁ దుదిన్ నీపాదనిర్మాల్య ని
ష్ఠామోదంబు నెఱుంగ, నీచరణతోయంబాడ, నైవేద్యముల్
నీమంబొప్ప భజింప నీజపము వర్ణింపన్ గృపం జేయవే
శ్రీమించన్ బహుజన్మజన్మములకున్ శ్రీయాది నారాయణా

ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన నారాయణ శతకంబున 
సర్వంబును సంపూర్ణము.

1 comment:

  1. సుబ్రహ్మణ్యం గారు, మీ కృషి అద్భుతం.
    మీ సాహిత్య సౌరభాలు ఆస్వాదిస్తు ఆనందంలో మైమరచా.
    ఇంతటి ఉత్తమ కృషి చేస్తున్న మిమ్ము మా నల్లనయ్య
    చల్లగా చూస్తాడు.

    ReplyDelete