Monday, December 21, 2015

అష్టమహిషీ కల్యాణము - 1

అష్టమహిషీ కల్యాణము
(తాళ్ళపాక అన్నమాచార్యుల మనవడు తాళ్ళపాక తిరువెంగళనాథసూరి విరచితము)
(ద్విపద కావ్యము)

-: ప్రథమాశ్వాసము :-

శ్రీయలమేల్మంగఁ జిరకృపాపాంగఁ
గాయజుమాత సాగరతనూజాత
శ్రీవేంకటేశకాంక్షితకుచదేశ
జీవనభవపాణి శ్రీకరవాణిఁ
గనకశోభనగాత్రఁ గంజాతనేత్ర
ననుపమాయతవేణి నఖిలకల్యాణి
హారిభూషణజాల నర్ధేందుఫాలఁ
జారుగుణశ్రేణి సైకతశ్రోణి
నరుణకోమలపాద నభినవామోదఁ
బరమయోగిధేయ బ్రహ్మాదిగేయ (10)
నెఱయంగఁ జాబిల్లి నిండువెన్నెలల
మఱపించు తెలిమించు మణుగొప్పగట్టి
మంచికుందనపుఁ దామరగద్దెమీఁద
నంచితపద్మాసనాసీనయగుచుఁ
గరినాయకులు రత్నకలశామృతంబు
నిరుమేలఁ జిలుకదేవేంద్రాదినిఖిల
సురగరుడోరగస్తోమంబుగొలువఁ
గరమొప్ప వరదానకరమొప్ప నభయ
కరమున శోభనాకరమై చెలంగ
సరసిజంబులురెండు సవరించుహస్త (20)
సరసీజంబులుగల్గి జలజాక్షుఁగూడి
తిరమొందు జననినిందిరనాత్మఁ దలఁచి
శ్రీవేంకటేశుడై చేలప్రకాశు
దేవాదిదేవును ధీరప్రభావు
లలితసౌందర్య లీలాభూమిభూమి
నలకషట్మదజితహరినీలనీల
ఘనసహస్త్రార హూంకారదివ్యాస్త్ర
కనకమయాంశుచక్రంబుఁ జక్రంబుఁ
బాలితజన్యంబుఁ బాంచజన్యంబు
నాళీకనాభ నందకము నందకముఁ (30)
గనదటినీమూలఖచితేంద్రనీల
ఘనకాంతి విజితశార్జ్గంబు శార్జ్గంబు
వేదాదివిద్యాప్రవీణమౌనీంద్ర
మోదకదివ్య కౌమోదికినాత్మఁ
బ్రణుతించి గణుతించి భక్తిసేవించి
గణనీయభోగవిశేషు శేషు
జితమత్త దైతేయు శ్రీవైనతేయు
శ్రుతిదామగళదేశు సూత్రవతీశు
నురుతరభక్తి నిత్యులను నిత్యులను
గురుతపోలబ్ధ ముక్తులను ముక్తులను (40)
క్ష్మానుత ద్రావిడాగమసార్వభౌము
లైనమావారల నాళువారలను
మానితసిద్ధాంతమార్గసల్లలిత
మానుజాచార్యు రామానుజాచార్యు
సతతనిర్జిత సూనశరుఁబారాశరుని
నతులితనిగమవాక్యవ్యాసు వ్యాసుఁ
బాయకహరిభక్తి ప్రబలినతపసి
రాయనియల బాదరాయణిసతత
హరిపాదమతుల మహాభాగవతుల
నరసి నుతించి సాష్టాంగంబు లెఱఁగి; (50)

(కవివంశావళి వర్ణన)

తతమానసార్ణవోత్పన్నకాకుత్థ్స
పతికథామృతపానపరమసమ్మోద
పరమౌనిపదభక్తిభరభరద్వాజు
వరగోత్రజుఁడు నందవంశభవుఁడు
హరిభక్తుఁడాశ్వలాయనసూత్రశాలి
పరమవిద్యాసింధు పారంగతుండు
వనజాతజాతసర్వసురేంద్రముఖులు
గనలేని వేంకటగ్రావాధినాధు
పదములు శోభనాస్పదములౌ తనదు
పదములు బహుదేశపదముల జనులఁ (60)
గనఁజేసి పంచమాగమసార్వభౌముఁ
డనఁబ్రసిద్ధికినెక్కి యఖిలవిద్యలను
నన్నయాచార్యుండె యనఁదాళ్ళపాక
యన్నమాచార్యుఁడాయత కీర్తిఁజెలఁగె
ఆధీరమతికిఁ దిమ్మాంబ యక్కాంబ
శ్రీధరాధీనలౌ శ్రీధరాసతుల
కరణి నిద్దఱు కులకాంతాలలామ
లరయఁ దిమ్మాంబకు నాత్మసంభవుఁడు
పాడఁజెప్పగవర్ణపద్ధతి నీడు
జోడులేఁడని సభసొచ్చివాదించి (70)
పరఁగినధీశాలి ప్తరివాదిదైత్య
నరశింహుఁడఁనగల్గె నరసింహగురుఁడు
అమ్మహాత్మునకుఁ దొయ్యలులునాచారి
యమ్మ యనంతమ్మయనఁ బొల్చిరందుఁ
జారులక్షణకు నాచారియమ్మకును
నారాయణుఁడు రూపనారాయణుండు
గలిగె ననంతాంబ గర్భమునందు
నలఘుతేజోమూర్తి యప్పలార్యుండు
హరిపరాయణచిత్తు డన్నమార్యుండు
నురుకీర్తిమంతులై యుదయిందిరెలమి (80)
అక్కలాబుధికన్యయన నొప్పునట్టి
యక్కలాంబకు సుముఖాబ్జిబింబకును
గరిమ నంబుధిసుధాకరుడు జన్మించు
సరలిమై తిరుమలాచార్యుండువొడమె
నరసతిసన్నిభ నరసమాహ్వయును
స్థిరకార్యకీర్తియౌ తిరుమలాంబయును
జనియించిరురుయోగసామ్రాజ్యవిభవ
జనకుఁడా తిరుమలాచార్యవర్యుండు
వేదాంతవిద్యా ప్రవీణుడై యాంధ్ర
వేదాంతమొనరించె ద్విపదరూపమున (90)
హరివంశకావ్య మాయతరసస్ఫూర్తి
హరివంశమిగురొత్త ననువొందజెసి
చక్రవాళములోన సరిలేదనంగఁ
జక్రవాలముగ మంజరి రచియించి
శ్రుతులచిక్కులుదీర్చు శుకతాతవోలె
సతత రేఫఱకార సరణులేర్పఱిచి
సంగీతసాహిత్య సర్వజ్జకత్వ
మంగళసామ్రాజ్య మహితుఁడై యలరె
మండెముకోటలో మండలంబెఱుఁగ
మండలాగ్రాహతి మండితపుష్ప (100)
దామమై ధర్మాంగద స్థితిఁబొలిచె
నేమహామహునియహీనగాత్రమున
నాపావనాత్ముని యంగనామౌళి
రూపపాతివ్రత్య రుచిరభావముల
సరసిజాలయఁబోలు సాధ్వీలలామ
తిరుమలాంబయనంగఁ దేజంబుమెరసి
యరుదందనయ్యింతి యల పంచకల్ప
తరువులునానొప్పు తనయరత్నములఁ
జారుతరాష్టభాషాచక్రవర్తి
ధీరుని బినతిమ్మదేశికోత్తముని (110)
యన్ని పద్యలయందు నరయ మున్నింటి
యన్నయార్యునిబోలు నన్నయాచార్యు
సాత్త్వికశుభమూర్తి సంగీతసత్క
విత్వాధికుని దిరువేంగళాహ్వయుని
జయయుత శ్రీలబ్ధ సహజకవిత్వ
నయు తిరువేంగళనాధుని నన్ను
సదమల విద్యావిశారదు లోక
విదితుని గోనేటివేంకటనాధుఁ
గనియె వారలలోనఁ గావ్యంబుఁజెప్పి
యెనలేని శ్రీవేంకటేశు మెప్పించి (120)
సకలంబునెఱుఁగ నసాధారణాంక
మకరకుండలము లిమ్మహిఁ గొన్నవాఁడ
దినములలోననె వేయిద్విపద లింపొంద
వినుతవర్ణనలతోడ విరచించువాఁడఁ
గవిశిరఃకంపయోగ్య ప్రతిద్విపద
నవబిరుదాంకుండ నాళీకసదన
వాసినీవేంకటేశ్వరపాదపద్మ
వాసనాలోలుపస్వాంతషట్పదుఁడ
వినురశీలుఁడఁ దిరువేంగళనాధుఁ
డనుపేరఁ బ్రఖ్యాతినందినయేను (130)

(ద్విపద లక్షణము)

వాసవుల్మువ్వురు వనజాప్తుఁ దొక్కఁడు
భాసిల్లు నదియొక్క పదము శ్రీకాంత
క్రమమున నీనాల్గు గణములనడచుఁ
గ్రమదూరముగఁ ప్రయోగముసేయరాదు
ఆపాదమునకు మూఁడవగణంబాది
దీపించు యతి యంబుధిప్రియతనయ
యుపమింపనవి ప్రాసయుతములై రెండు
ద్విపదనావిలసిల్లి వికజాబ్జపాణి
ద్విపదకు ద్విపదకుఁ దెగఁ జెప్పవలయు
నెపుడు సంస్కృతమున నితరభాషలను (140)
యతులలోపలఁ బ్రాసయతి దక్క సకల
యతులుచెల్లును బ్రయోగాను సారమున
ద్విపదతో ద్విపద సంధిలనేకశబ్ధ
మపుడురెంటనుగూర్ప నదియయుక్తంబు
మఱుయుసంస్కృతపు సమాసరూపమున
నెరయనెన్నిటినైన నిర్మింపదగును
తెనుఁగునఁ గూర్చిన ద్విపదయంత్యమున
నొనరఁ గ్రియాంత సముచ్చయంతములఁ
దనరు నకార ముత్యముగూడెనేని
వినుతింప నుత్తర ద్విపదాదియందు (150)
గొనకొన్నస్వరముతోఁ గూడఁగాదనుచు
నొనరింప సుకవీంద్రులుద్దండమండ్రు
అరసున్ననొనఁగూర్ప ననువైనహల్లు
గరిమనీద్విపదాదిఁ గనుపట్టెనేని
తొలివిభక్తికిఁదక్కఁదుదివిభక్త్యంత
ములు నకారములును ముకురబింబాస్య
యానకారముచెల్లు నరసున్నలగుచు
నానీలకచభృంగ యలమేలుమంగ
యనులక్షణంబుల ననువొంద సుకవి
జనసుప్రయోగైకశరణమై నిఖిల (160)
జగదేకనుత విరాట్ఛంధోవతీర్ణ
యగుచునే ద్విపదవిఖ్యాతిచెలంగ
వితత తల్లక్షణ ద్విపదమార్గమున
మతినెన్ని కృష్ణాష్టమహిషీవివాహ
కృతియొనర్చెదఁ జమత్కృతి సంఘటింపఁ
జతురశృంగార వాచాప్రౌఢిమెఱసి

(కవి కావ్య ప్రశంస)

చికిచికియెఱుకలఁ జెప్పంగలేని
కుకవులకెల్ల మక్కువతల్లి జల్లి
చుట్టుప్రోవులఁ గొలుచులుఁ గూడఁబెట్టి
దిట్టకూళలకుఁ బూదియలు గాదియలు (170)
కొంకక తనునోరికొలఁదులఁబలుకు
మంకుఁబోతులకు గ్రామ్యంబు సామ్యంబు
ఆరీతినుడువక యలఘుశబ్దార్ధ
సారసరీతిరసప్రభావముగఁ
గులికి కస్తువీనెఁగోసినకరణిఁ
విరవాదిపొట్లంబు విడిచినమాడ్కిఁ
బరిమళించుచు గవుల్ బళిబళియనఁగఁ
గవితచెప్పిన సులక్షణునిఁ గవీంద్రుఁ
డవునందురే నేర్చినట్లు చెప్పెదను (180)

అష్టమహిషి కల్యాణ కథారంభము
(గ్రంథాంకితము)

అలమేలుమంగ మోహనకాంచనాంగ
నెలమి మత్కృతికి నధీశ్వరిఁ జేసి
దరహాసవతికి భూధవళాక్షి సవతి
కరుణ పల్లవపాదకలఘమోదకును
హిమధామవదనకు హేమాబ్జసదన
కమృతభాషణకు బ్రహ్మాదిపోషణకుఁ
గృష్ణనపాయని కిష్టదాయినికి
గృష్ణాహివేణికిఁ గీరవాణికిని
అవితదీనకుఁ గలహంసయానకును
భువనరక్షణకును బుణ్యలక్షణకు  (190)

నంకితంబుగను గావ్యంబుగావింతు
నింకఁ దత్ప్రారంభ మెయ్యది యనిన
నవిరళమన్మనసాంబుజ నిలయ
యవధరింపుము వెంకటాధీసురాణి
శుకయోగిఁగాంచనాం శుకయోగిఁగాంచి
యకలంకగుణుడైన యభిమన్యుసుతుఁడు
మౌనీంద్ర యాదేవ మౌనీంద్రసుతుఁడు
దానవారాతి యాదవ వంశమునను
జనియించె నంటివి జలజాక్షుఁడెట్లు
జనియించె నేమేమిసకిపె లోకమున      (200)

మహిమ మీరంగ మన్మధువైరి యష్ట
మహిషుల నేరీతి మహిఁబెండ్లియాడె
నాలచ్చిమగని కథామృతాంభోధి
నోలలాడింపవే యోతండ్రియనిన
రాజుఁగన్గొని యోగిరాజు రాజేంద్ర
రాజీవదళనేత్రురాజితకథలు
వినగోరునట్టి వివేక సంపన్ను
లనయంబువారెపో యఖిలపావనులు
నీవు నా హరికథలెఱుగఁ గోరితివి
గావునఁ బుణ్యసంగతుఁదవై వినుము   (210)

మునుపు పల్కుల తుదల్మునుముట్టఁజదువు
జనుల దుర్జనులునిచ్చలుబాధసేయ

(భూమిదేవి కష్టదశ)

నీరదిసురనరనికరశైలాది
ధారణియైన యాధారిణివగచి
కనలి వేల్పులగమికాని చెంగటికిఁ
జని యింద్రుఁ జూచి వెచ్చనియూర్పుతోడ
నగసమూహముల బన్నగసమూహముల
నగజాలముల సర్వఖగజాలములను
నిధులను సకలాంబునిధులనుమోచి
బుధకంటకు లక్షణమును మోవలేను  (220)
సాధుబాధకులచే జడిసితినింక
నేధీరిచేఁదీరునీభారమన్న
మున్నీటి మొలనూలి ముదితయేయి
కన్నులమేటి సంగడివారుఁ దాను
బాటీరశశికాంతిఁ బాటించుమేని
జోటిఱేఁడున్న యచ్చోటికేతెంచి
యపుడు కోరకితకరాబ్జుఁడై పలికెఁ
గపటమానసులు నిష్కపటమానసులు
తపములజపముల ధర్మకర్మముల
విపరీతముగఁజేయ విసిగి యా ఘనుల    (230)

దెసఁజూడలేక నీదెసకేగుదెంచె
వసుధాంబుజాక్షి యోవనజాతజాత
అనవిని జననికి నాతమ్మిచూలి
వినతుఁడై వినుతిగావించి సేవించి
మాపాలగలవాఁడు మాపాలగలఁడు
నీపాలగలఁ డవనీదేవియనుచు
వాణీవిభుఁడు శర్వాణీధవుఁడు
నేణాంకసారసహితులు దిక్పతులు

(క్షీరాబ్ధిగమనము)

మునులునేతేరంగ మునుమున్నుపుడమి
ననబోఁడితో సితార్ణవమునకరిగి  (240)
శతకోటి శతకోటి చకితాత్మగర్భ
గతపర్వతంబులు నాగంబులుగాగ
ఘనమీనవాలాగ్ర ఘట్టనాజస్ర
జనితశీకరతతుల్ నపరముల్గాఁగ
శ్రీకరోన్నతి వికసిత నూత్న పుండ
రీకముల్బహుపుందరీకముల్గాఁగ
నలఘుతరోగ్రరావాంచిత వివిధ
జలచరజాలముల్ సైన్యముల్గాఁగ
......... పికధ్వనులు
కరమొప్ప వందిమాగధ నుతుల్ గాఁగ  (250)
పరివృతభూజబంభరవికల్ గాఁగ
పట్టభద్రునిగతి భాసిల్లు కడలి
పట్టుఱేనికి డెంకిపట్టైనదాని
హరికిచ్చు మౌనిహస్తార్ఘ్యంబులనఁగ
నరవిందములఁ తేనియలనొప్పుదాని
గరిమనాకులఁబిల్చు కరములోయనఁగ
సురుచిరాలోలవీచులనొప్పుదాని
దనుజారి నిజపదధ్యానంబుసేయ
మునుల బకజాలములనొప్పుదాని
వనజాతలోచన వరభక్తలీల  (260)

(ఇంకాఉంది)

No comments:

Post a Comment