Saturday, December 13, 2014

లక్ష్మణదేవర నవ్వు - 2

ఆమాటవినియపుడు సంతోషముగను! కనకకుంచలవార్ని కలయబిలిపించే!
అంగళ్ళువీధులూ తుడిచేటివారు! ముత్యాలమ్రుగ్గులూ పెట్టేటివారు!
రత్నాలరంగవల్లి వ్రాసేటివారు! మాణిక్యాలదివ్వెల నెత్తేటివారు!
మకరతోరణాలు కట్టేటివారు! కడులెస్సకనక స్తంబములామీద!
మరిలెస్సదీపాలు పెట్టేటివారు! నిండుకుండలుదెచ్చి నిలిపేటివారు!
బొడ్డుమల్లెలు పోగులుబోసేటివారు! ఏడునిలువుల కనకమేడలోపలనుంచీ!
పాన్పుపైనేత్రావళి పచ్చాడముంచి! అచ్ఛచామంతులు అభ్యాంగలూను!
ఆమంచిపానుపున అవిచాలబరచిరి! ప్రొద్దుపోయిబూసినవి బొడ్డుమల్లెల్లు!
ఆమంచిపానుపున అవిచాలబరచిరి! పందెళ్ళబూసినవి పారిజాతములు!
ఆమంచిపానుపున అవిచాలబరచిరి! ఘడియోయిబూసినవి కనకరత్నములు!
ఆమంచిపానుపున అవిచాలబరచిరి! కావిళ్ళదెచ్చేరు కలువపువ్వూల్లు!
ఆమంచిపానుపున అవిచాలబరచిరి! మోపులతోదెచ్చేరు మొగలిపువ్వూల్లు!
ఆమంచిపానుపున అవిచాలబరచిరి! ఝామొయిపూసినవి జాజిపువ్వూల్లు!
ఆమంచిపానుపున అవిచాలబరచిరి! మొగలిపువురేకులా తలగడలుయుంచి!
మల్లెపువ్వులుజాజులు పానుపునాబరచిరీ! అంగదుడుహనుమంతు సుగ్రీవుడును!
చెట్టలుబట్టుకొని శీఘ్రానవచ్చీరి! ఆసొంపుచూడగా నలవియేగాదు!
రెండుకన్నులు బ్రహ్మకావిచేగాని! వెయ్యికన్నులజూడ తీరదాపేక్ష!
అంపుమీయోస్వామి అనుజ్ఞలిచ్చి! ముమ్మారువలగొని ప్రదక్షిణముజేసి
సాష్టాంగదండ నమస్కారములుజేసె! పాదములపైనున్న తమ్ముణ్ణియెత్తి!
అలసితివినాతండ్రి నిద్రబోవయ్య! వద్దనూనిలుచున్న వదినెకుమ్రొక్కి!
భద్రగజంబుపై యెక్కించిరపుడు! కంచుమద్దెలవారు కమ్ముకొనిరాగా!
బాగుశ్రీరాముని బంట్లుపొగడగను! రాజద్వారముజొచ్చె తాముతమ్మూడూ!
అటకలితలగడిగెనే అంభోజనేత్రి! పీతాంబరముగట్టె ప్రతిభమీరంగ!
నాలుగువేలూజేయు నానుమెడవేసె! పదివేలుజేయు పతకములువేసె!
చేడెకుయింపైన చెవులపువ్వులుఇబెట్టె! నవరత్నపువత్తులు నాతితానుంచె!
వయ్యారినడకతో పయ్యదజార! వారచూపులుజూస్తు వచ్చెనాదేవి!
వయ్యారితనపతి నొయ్యారగాను! పాన్పొద్దనిలుచుండె పద్మాయతాక్షి!
ఊర్మెళాభావంబు తెలిసిలక్ష్మణూడు! ఇంతినీవురాను వేళగాదనెను!
ఊర్మెళనువీడుగొలిపె శ్రీలక్ష్మణూడు! శేషునిపైనిద్ర సేయుచున్నారు!
ఓఘడియనిద్రిస్తి ఒకజాముఆయె! ఒకజామునిద్రిస్తి వకరోజుఆయె!
ఇదియేమితమ్ముడు తడవునిద్రించే! అవనిజవల్లభులు నిరువనితపొంద్రీ!
జూచిహనుమన్న జూచిరావోయి! ముద్దియతో ముచ్చటాడుచున్నాడో!
చేడెతోజెలక్రీడ లాడుచున్నాడో! ఈవలాఓజంఘ ఆవలాజూచి!
ముద్దియలేదని ముదముతోబలికె! తమ్మునిపాన్పును జూడవలెననియు!
చేడెలేదనినతనకు అభిలాషపుట్టె! అంతప్రధానుల నంతటనుంచె!
శతృఘ్నునితోడుకొని శీఘ్రానవచ్చె! అంతటశతృఘ్ను నంతటనుంచి!
పాన్పుపైగూర్చుండి శ్రీరాఘవూలు! తమ్మునిపాదములు తొడలపైనుంచి!
వొయ్యనిపాదములు వత్తుచున్నారు! ఒకమారువత్తితే నూరుకొనియుండే!
రెండవమాటికి కలగంటిననెను! మూడవమాటికి కనువిప్పిజూచి!
ధరణీశుడగుటదెలిసి ధరణిపైవ్రాలె! మీయడుగులొత్తేటీ ప్రాయమ్మువాణ్ణి!
అహల్యపావనమైన అడుగుమీయడుగు! బలిశిరసునున్నది అడుగుమీయడుగు!
మీయడుగులొత్తుదురు సమస్తదేవతలు! నాయడుగులొత్త శ్రీజగన్నాధతగదు!
పాదములపైనున్న తమ్ముణ్ణియెత్తి! కనకసింహాసనమున కూర్చుండబెట్టి!
చంద్రుడులేనిరాత్రి యెట్టిదటబోలు! తమ్ముడానీవులేని సభయట్లెబోలు!
దీపమ్ములేనిల్లు యెట్టిదటబోలు! తమ్ముడానీవులేని సభయట్లెబోలు!
పతిలేనిసతి యెట్టిదటబోలు! తమ్ముడానీవులేని సభయట్లెబోలు!
ఉదకమ్ములేని కలశయెట్టిదటబోలు! తమ్ముడానీవులేని సభయట్లెబోలు!
చిలుకలేని పంజరయెట్టిదటబోలు! తమ్ముడానీవులేని సభయట్లెబోలు!
తమ్ముడానీవిపుడు సభకుయేతెంచు! తమ్ముడుతానును సభకుయేతెంచ్రి!
ముత్యాలగద్దెపై తమ్ములనుయుంచి! రత్నసింహాసనమున తాముగూర్చుండ్రి!
సకలగుణములుగల సంపూర్ణవినుమా! హనుమంతాకీర్తి వంతరమ్మనెను!
శాంతమేడలకు నీవుయేతెంచి! శాంతమ్మనుదోడుకొని శీఘ్రానరమ్మి!
ఆపలుకులువిని సంతోషముననూ! అప్పుడూహనుమాన్లు యేతెంచెతాను!
ఏమోయిహనుమాన్లు యిటువచ్చినావు! నీవువచ్చినపనులు యెరిగించుమనెను!
అమ్మశ్రీరాములూ మిమ్ములనుయిపుడు! తోడుకురమ్మనీ సెలవిచ్చెరాజు!
ఆపలుకులువిని శాంత సంతోషమునను! వజ్రాలపల్లకీ యెక్కితావచ్చె!
అల్లంతటశాంతమ్మ రాకలూజూచి! తమ్ములుతమరును యెదురుచనుదెంచ్రీ!
ముమ్మారువలగొనీ ప్రదక్షిణములుజేసి! సాష్టాంగ దండనమస్కారములుజేసీరి!
తమసరసనుశాంతమ్మ గద్దెబెట్టించి! కొలువైగూర్చుండిరి శ్రీరాఘవూలు!
వింతివాశాంతమ్మ యిప్పుడూనీవు! వివాహము లయ్యేటినాడు!
వీరుచిన్నలువారు బాలలేసుమ్మి! ఈవెనుకపదునాల్గు యేండ్లు అడవులలో!
తిరిగిరెవ్వరోమరి గుర్తెరుగరైరి! వీరికినివారికిని తగునోలేదో!
జూడవలెననితనకు అభిలాషబుట్టె! మనవారినిమనము మనమనుకోరాదు!
వారిముందరవీరు రాణించరనెనూ! గావలీమార్గమున చూడుశ్రీరామ!
కనుదృష్టిమార్గాన చూడుశ్రీరామా! భోజనపుశాలలో చూడుశ్రీరామా!
శాంతమరుగుననుండి జూడుశ్రీరామా! సకలగుణములుగలా సంపూర్ణవినుమా!
హనుమంతాకీర్తి మంతరమ్మనను! శీఘ్రమునఋషిపల్లె నగరికేతెంచు!
మూడుకోట్లమునుల ఆరుకోట్లఋషుల! జమదగ్నిదుర్వాస సప్తమహాఋషుల!
సప్తమహారుషుల సమస్తదేవతలా! వశిష్టు మొదలైన ఋష్యశృంహులను!
దారలదోడుకొని శీఘ్రానరమ్మీ! ఆమాటవినియపుడు సంతోషముగను!
శీఘ్రాన్నవ్షిపల్లె నగరికేతెంచే! వదనమ్ములుచేసి ముందరానిలచి!
అయ్యశ్రీరాఘవులు మమ్మంపినారు! మూడుకోట్లమునులను ఆరుకోట్లఋషుల!
జమదగ్నిదుర్వాస సప్తమహాఋషుల! సప్తమహారుషులను సమస్తదేవతలా!
ఋష్యశృంగుల్నిదోడుకొని వేంచేయమనిరి! అతిశీఘ్రముగాను వేంచేయమనిరి!
అతిశీఘ్రముగవచ్చి రామునులంతా! వచ్చినవారికీ వందనముజేసి!
వారికితగిన సింహాసనాలిచ్చి! కొలువై గూర్చుండ్రిశ్రీరాఘవులు!
వింటిరావశిష్ఠ యిప్పుడుమీరు! వీరికివివాహమ్ములయ్యేటినాడు!
వీరుచిన్నలు వారు బాలలేసుమ్మీ! ఈవెనుకపదునాల్గేండ్లు యడవులలో!
తిరిగెవ్వరోమరీ గుర్తెరుగరైరి! వీరికివివాహముహూర్త మెప్పుడో!
ఆమంచిముహూర్తమ్ము బెట్టుమనిపలికె! మునులప్పుడు సంతోషమునగూరుచుండి!
అప్పుడుపంచాంగముల విప్పిజూచీరి! క్షేత్రమైనామంచి కార్తీకమాసము!
అందమైనామంచి ఆదివారమున! పంచమీఆమంచి ఆదివారమున!
ఝామేడుఘడియలా రాతిరివేళా! వీరికితగినట్టి వివాహముహూర్తమ్మూ!
నిర్ణయించీరపుడు మహామునులెల్ల! సభలోనుయున్న మహామునులజూచి!
మరదళ్ళనుజూడవచ్చు నాయనితానుబలికే! తరుణులకండ్లకు తమరుబడకుండ!
తరుణులనుజూడవచ్చు తప్పేమిలేదు! అంతఃపురములోను లోగిళ్ళలోను!
రానివాసమ్మున నేనుకొలువుండ! తరుణుబిల్వగా తమ్ముడాజూడూ!
సీతముఖమూజూచి రామచంద్రూలు! చిరునవ్వునవ్వుచు ఇట్లనిరపుడూ!
అతివరోనీతోడి చెళ్ళెళ్ళనల్లా! మరదళ్ళనేరీతి జూపెదవనెను!
రాణివాసస్త్రీలను రాజుజూచుటకు! ఇటువంటికోరికలు నేజూడలేదు!
అతివరోఅందుకూ అడ్డాడబోకు! అందుకూమాఅక్క హర్షించినదీ!
పెద్దలుమహామునులు ఒప్పుకున్నారు! ఆమాటవినియపుడు సంతోషముగను!
రావోయిహనుమన్న వాయునందనుడ! శీఘ్రానకౌసల్య నగరికేతెంచు!
అత్తలకోడళ్ళ వేంచేయుమనుమి! ఆమాతవినియపుడు సంతోషముగనూ!
శీఘ్రాన్నకౌసల్య నగరికేతెంచె! వందనంబులుజేసి ముందరానిలచి!
అమ్మశ్రీరాఘవులు మమ్మంపినారు! వార్తచెప్పెదవినుడు వరుసగామిమ్ము!
అత్తకోడళ్ళ వేంచేయుమనిరీ! మాళవినిదీసుకొని యొప్పుతోడుతను!
కౌసల్యకనక దండందనాలెక్కె! ఊర్మిళనుదీసుకొని యొప్పుతోడుతను!
కైకమ్మపచ్చల పల్లకీలెక్కె! శతకీర్తిదీసుకొని యొప్పుతోడుతను
సుమిత్రసువర్ణంపు పల్లకీలెక్కె! అత్తలుకోడళ్ళు వేంచేయగాను!
అత్తలకుముగ్గురికి వందనములుజేసి! జనకసుతచెళ్ళెళ్ళ తాకౌగిలించె!
పతిచూచిపొంగితివా పద్మాయతాక్షి! జనకసుతచెళ్ళెళ్ళు సంతోషమునను!
రావోయిహనుమన్న వాయునందనుడ! శీఘ్రానజానకి నగరికేతెంచు!
చేడెలకుశృంగారము చేయమనిచెప్పూ! శీఘ్రానజానకీ నగరికేతెంచీ!
వందనంబులుజేసి ముందరనిలచి! అమ్మశ్రీరాఘవులు మమ్మంపినారు!
చేడెలకుశృంగారము చేయమన్నారు! ఆమాటలువినియపుడు సంతోషముగను!
అరుంధతీనృసింహ పార్వతీదేవి! పాడ్యుశిరసంట్రి పణతులుముగ్గురు!
పరిమళమ్ములుదెచ్చి నలుగులుబెట్టించ్రి! అచ్చశ్రీగంధాన అటకళ్ళు గాచ్రి!
వెండెయ్యకాగుల వేణ్ణీళ్ళుదోడి! భమిడయ్యపదికాగుల జన్నీళ్ళుదోడి!
చన్నీళ్ళువేణ్ణీళ్ళు సమముగాదొలిపి! కుంకమ్మలమరినాకుదు ళ్ళనిలిపే!
ముత్యాలముంతలు ముగుదలందియ్యా! మురవైరిమరదళ్ళు మజ్జనంబాడ్రీ!
శంఖుబట్టగా బేరిజేగంటలుమ్రోయా! జనకునికూతుళ్ళు మజ్జనంబాడ్రీ!
కల్యాణజేగంట కంచుదిబేరి! కౌసల్యకోడళ్ళు మజ్జనంబాడ్రీ!
సన్నవలిపముదెచ్చి తళ్ళొప్పనొత్తిరి! కురులచిక్కులుదీసి మురువన్నెముడిచిరి!
భండారమేలేటి బ్రజలబిలిపించి! తాళాలచేతనే పెట్టెలుదీయించి!
భరిణలుదెప్పించి పైకప్పులుదీస్రీ! గట్టిమట్టెలుబెటిరి కడియమ్ములుంచిరి!
అందెలుచరణా రవిందములబెట్టిరి! చిరిగజ్జెలుపెట్టిరి శృంగారముగను!
చిటికెనబొద్దులుపెట్రి పిల్లేళ్ళుపెట్రి! అన్ని వేళ్ళకును అమరించినారు!
శుద్ధసువర్ణాన జేయించినట్టి! సూడిగాజులుబెట్రి సుదతులచేత!
చామపువువుకడియాలు హస్తకడియములు! చెన్నుమీరగ వారి చేతులనుంచ్రీ!
నవరత్నఖచితమున నరులొప్పుచున్న! గిరిగిరంబులనుంచెతాను ఆశాంతా!
సందెటిదండలుబెట్రి తావేజులుబెట్రి| దండగడియములు బన్నసరములేబెట్రి!
చేడెకుయింపైన చెవులపువులుబెట్రి! నవరత్నపుజుమకాలు నాతులకునుంచ్రి!
బలువైనముత్యాల పాపిటచేరులను! చేరుచుక్కలుంచెనే చెలియజానకి!
నవరత్నఖచితముతో నడుమచెక్కినవి! బలువైన జడలువేసిరి పణతులకపుడు!
సన్నజాజులుదెచ్చి బంతులేగట్టి! బంతులుజడపై బదిలముగనుంచ్రి!
మొగలిరేకుకుట్రి మోహమలరగను! మరదళ్లనుజూచి యోశాంతామహాదేవి!
తెమ్మనవేజానకి తొడుగులుయనెను! మునుపుగౌతముడుమెచ్చిచ్చినాడనుచు!
అవిదెచ్చిమాళవికి హస్తముననుంచ్రి! అగ్నిహోత్రుడువొచ్చి యిచ్చినాడనుచు!
అవిదెచ్చిశతకీర్తి హస్తముననుంచ్రి! ఇంద్రకావిరవికెలు ఈడుకావన్నీ!
చంద్రకావిరవికెలు జానకివన్ని! బిగుదట్టిరవికలు తొడగించిరపుడు!
అమరినయొడ్డాన మతివలకునుంచిరి! బిళ్ళలమొలత్రాళ్ళు బిగువుగానుంచిరి!
అందమైనామంచి మొహర్లపేర్లుంచిరి! కనుసోగకన్నులకాటుకదీర్చి!
తీరైనకస్తూరి తిలకములుదిద్ది! గంధంబుకస్తూరి కలపంబుజేసి!
అప్పుడుచెల్లెళ్ళ కలదెజానకి! వీవనపుచ్చుకొని విసరుచుండగను!
సంతోషవారధితేలె జానకి! బంగారుతో పరిపూర్ణమైన!
పట్టూశాలులుదెచ్చిగవిసెనలవేసిరి! రెండుకన్నులబ్రహ్మగావించెగాని!
వేయికన్నులజూడ దీరదాపేక్ష! హంసలనడకల అతివొప్పుచుండె!
భోజనపుశాలకేవేంచీసిరపుడు! నవరత్నఖచితమయి అమరాపీఠమున!
శాంతమహాదేవి నగుచుగూర్చుండె! మాళవిఊర్మిళ మగువశతకీర్తి!
శాంతకుయిరుగడల సురటివిసరగను! ఆసీతమహాదేవి ఆకుమణచిచ్చె!
అచ్చకర్పూర ఆకుమణచిచ్చె! రావోయిహనుమన్నా వాయునందనుడా!
శీఘ్రానశ్రీరామ కొలువుకేతెంచు! భోజనపుశాలకే వేంచేయమనుమీ!
ఆమాటవినియపుడు సంతోషముగను! అంతటప్రధాన్ల నంతటినుంచి!
శతృఘ్నునిదోడుకొని శీఘ్రానవచ్చె! గవాక్షమార్గాన కనుదృష్టియుంచి!
రెప్పవేయకను కనులువిప్పెమోహమున! అట్టెతొలకరిమెరుపు హంసనడకలది!
పుత్తడిబొమ్మ లేడివలెజూపు! శాంతకుచందనం బూయుచున్నది!
ఆదేవియెవ్వరు శతృఘ్నుయనెను! సౌమిత్రిభార్య ఊర్మిళయనెను!
చిగురుటాకులబోలు చిన్నిపాదములు! బోలునువజ్రాల బోలుపలువరస!
అట్టెతొలకరిమెరుపు హంసనడకలది శాంతమ్మకును సురటివిసురుచున్నది!
ఆదేవియెవ్వరు శతృఘ్నుయనెను! భరతునిపట్నంపుదేవి సుమియనెనూ!
చిగురాకుపాదములు సింహమధ్యములు! తగువింటిచేతులే తగువంటిచాయ!
శింగిణివిళ్ళులబోలు కనుబొమలతీరు! కలువరేకులబోలు కనులతీరు!
దానిమ్మగింజలే తరుణిపలువరుస! చామంతిరేకులే చెలియచెక్కిళ్ళు!
చంద్రుడుతనలోన సిగ్గుపడుచుండు! ఆదేవిముఖకాంతి సాటిరాదనెను!
తుమ్మెదలు తలలోను ఝుంకారముండు! ఆదేవికురులందము సాటిరాదనెను!
నల్లనిమేనుదీనగు మోముగలది! ఆదేవియెవ్వరో శతృఘ్నుయనెను!
తనదేవిజెప్పక తానూరకుండె! సిగ్గువడినిలుచున్న తమ్ముణ్ణిజూచి!
చిరునవ్వునవ్విరి శ్రీరాఘవులు! ముందునీవుజేసిన ఫలమేమోగాని!
యింతచక్కనిదేవి సతిగలుగుటకును! చుక్కలలోబాల చంద్రుడునట్లు!
కొలువైగూర్చున్న మనాక్కజూడు! అందరిలోపల సుందరిననుచు!
అష్టవంకర్లతో మీవదినెనుజూడు! అలాగునననరాదు అన్నరాఘవులు!
ఆదిలక్ష్మీసీత ఆలోకమాత! యిదిముహూర్తమువేళాయె యేమిమాటల్లు!
లదలుడుశీఘ్రాన కాకుత్థ్సుయనెను! రావోయిహనుమన్న వాయునందనుడ!
శీఘ్రానశాంతమ్మ నగరికేతెంచు! ఎంతోశృంగారంబు యెంతయో సొగసు!
భరతునికిసౌమిత్రికి శతృఘ్నునికినీ! అభ్యంగనమ్ములు గావలెను యనుమీ!
ఆమాటవినియప్పుడు సంతోషముగను! శీఘ్రాన్నశాంతమ్మ నగరికేతెంచె!
వందనములుజేసి ముందరనిలచి! అమ్మశ్రీరాఘవులు మమ్మంపినారు!
భరతునికిసౌమిత్రికి శతృఘ్నునికి! అభ్యంగనమ్ములు కావలెననిరి!
అరుంధతీ నృశింహపార్వతీదేవీ! పాడుచిశిరసంత్రి పనతులుముగ్గురు!
పరిమళెమ్ములుదెచ్చి నలుగుబెట్తించ్రీ! అచ్చశ్రీగంధాన అటకళ్ళుగాచిరి!
కుంకమ్ములమరి కుదుళ్ళనుంచ్రి! ముత్యాలముంతలు ముగుదలందియ్య!
మురవైరితమ్ములు మజ్జనంబాడ్రీ! లోకంబులెల్ల విలోకించెసొగసు!
దశదిశదిక్కులు దీప్తిల్లగాను! దశరధులకొమాళ్ళు మజ్జనం బాడ్రి!
చంద్రకావిగొడ్గులుచేర్చిబట్టగను! జనకుల అల్లుళ్ళు మజ్జనంబాడ్రి!
కలయాణచేగంట కంచుదిభేరి! కౌసల్యకొమాళ్ళు మజ్జనంబాడ్రి!
శంఖులుబట్టగభేరి జాగంతలుమ్రోయ! శాంతమ్మతమ్ములు మజ్జనంబాడిరి!
పసిడిచిలుకలపసిడి దుప్పట్లుదెచ్చి! భమిడితళ్ళోత్తుదురు పరమాత్ములకును!
బంగారపూజిలుగు పద్మాలపట్టూ! పట్టుపీతాంబ్రములు కట్టనిచ్చీరీ!
కురులుచిక్కులుదీసి వేలుసిగలువేసి! తిరుమణిబెట్టిరి తిరిచూర్ణమిడిరి!
చుక్కలకుమిక్కిలి గొప్పలుగవెలుగు! ఆణిముత్యమ్ములే యెంచిగుచ్చినవి!
పచ్చలపతకములు బాగుగావేస్రీ! చిన్ననాటిగోరు పులిగోరుతోను!
నేవళమ్ములుబెట్టె తమ్ములకపుడు! సందటిదందలు బెట్టితావేజుబెట్రి!
దండగడయములు బన్నస్వరములేబెట్రి! నాలుగువేలుజేయు నానుమెడవేస్రి!
పదివేలుజేయు పతకములువేసిరి! ముత్యాలపోగులు ముదముతోనుంచిరి!
ఆకిరీటంభరతునకు అమరదూని! తనశిరస్సుకిరీతము భరతునకివుంచే!
గంథమ్ముకస్తూరి కలపనంబు జేసి! అప్పుడుతమ్ములకు అలదెరాఘవులు!
వీవనబుచ్చుకు విసరుచుండగను! సంతోషవారధి తేలెరాముండు!
అచ్చకర్పూరాన తాంబూలమిచ్చె! అంతఃపురమ్ములో లోగిళ్ళలోను!
అలంకరించిరిమూడు మహలులుతమకు! ఏడునిలువుల కనకమేడల్లలోను!
పానుపుమీదనే పచ్చావళించిరి! పట్టుతలగడయో పూలటెక్కాలు!
ఆమంచిపాన్పున అవిచాలనుంచె! ప్రొద్దోయిబూసినవి పొన్నపువ్వూలు!
ఆమంచిపాన్పున అవిచాలబరచి ! నిశోయిబూసినవి నీలాంబరాలు!
ఆమంచిపానుపున అవిచాలబరచి! ఇంకానుపువ్వులు ఏమేమియైన!
కావిళ్ళుదెచ్చేరు కలువపువ్వుల్లు! ఆమంచిపాన్పున అవిచాలబరచి!
జాజికాయజాపత్రిలవంగాలు! మంచిపరిమళాదులే బాగుగానుంచిరి!
నవరత్నఖచితమౌ నడుమపీఠమున! ఫలములుపంచపదార్ధములనుంచిరి!
బంగారుచెంబుతో పానకంబుంచిరి! నిలువుటద్దమ్ములే నిలిపిరచ్చోట!
మాణిక్యదీపాలు మరివెలుగుచుండ! కర్పూరదీపాలు ఘనముగానుంచిరి!
పచ్చకర్పూరాన తాబూలాలుంచ్రీ! రావోయిహనుమన్న వాయునందనుడ!
శ్రీఘ్రానకౌసల్య నగరికేతెంచు! తల్లుల్నిదోడుకొని శీఘ్రానరమ్ము!
ఆపలుకువినిసంతోషమునను! ఏతెంచెకొసల్య నగరిలోపలికి!
ఏమోయిహనుమాన్లు యిటువచ్చినావు! నీవువచ్చినపనులు యెరిగించుమనెను!
అయ్యశ్రీరాములు మిమ్ములనుయిపుడు! తోడుకొనిరమ్మని సెలవిచ్చినారు!
ఆపలుకువిని సంతోషమునను! ముత్యాలపల్లకీ యెక్కెకౌసల్య!
పచ్చలపల్లకీ యెక్కెకైకమ్మా! సుమిత్రసువర్ణంపుపల్లకియెక్కె!
తనయులమేడలకు తల్లులేతెంచిరి! అల్లంతదూరాన తల్లులనుజూచి!
వలగొనిముమ్మారు ప్రదక్షిణముజేసె! తప్పకదండ నమస్కారములుజేసి!
ముత్యాలగద్దెపై తల్లులనుయుంచి! రత్నసింహాసనమున తమరుగూర్చుండ్రి!
తనయులశృంగారముతల్లులుజూచి! దశరధులనుతలచుకొనికన్నీరుదెచ్చె!
దశరధులులేని వెలితొక్కటేగాని! ఉన్నవెల్తులులేవు యువిదరోమనకు!
రావోయిహనుమన్న వాయునందనుడా! శీఘ్రాన్న అశ్వములసాలకేతెంచు!
ఉత్తమయినశ్వాల తోడితెమ్మనిరి! గంగజలములదెచ్చి కడిగితళ్ళొత్తి!
అర్చించిపూజించి నైవేద్యమిచ్చె! ముత్యాలహారములుముందరవేసి!
పగడాలహారములు పలకసరులేస్రీ! భెంకిభేరీవారు బిరుదులుదెచ్చి!
తెచ్చిరి అయోధ్య వీధులనుంచిరి! నివాళ్ళుదెమ్మనుచు నెలతలకుసాటించిరి!
హారతులుసతుల దెమ్మనుచుసాటిచిరి! నివాళ్ళుదెచ్చిరి నెలతలందరును!
హారతులుదెచ్చిరతివలందరును! బంగారుపాపాలు భరతునకునిచ్చె!
అంగుళీయకములు సౌమిత్రికియిచ్చె! బాహుదండలు శతృఘ్నునకిచ్చె!
అట్టియాదశరధుల యెక్కేటిగజము! శ్రీరామునిమోతునని కరముపొంగుచు!
కుడిజంఘలీడ్చుకొని పొంగుచువచ్చె! అశ్వములనెక్కుమనిరి ఆరాఘవులు!
ఈమునులుయుండగా మీరుయుండగను! అశ్వములనెక్కేటి ధర్మమాయనెను!
వివాహమప్పుడూ వేడుకప్పుడు! తప్పులేదుసుమ్మి సౌమిత్రియనెను!
అశ్వరత్నాలెక్కి రన్నదమ్ములు! భద్రగజంబునెక్కిరి శ్రీరాఘవూలు!
కంచుమద్దెలవారు కమ్ముకొనిరాగా! పాటకులుపాడగా భటులుపొగడగను!
కైవారములుజేసిరి కవులిరుగడలా! పాడుచు అప్సరా స్త్రీలుయాడగను!
రాజద్వారమువెడలిరి రామచంద్రూలు! ఒప్పైనసౌధములు యెక్కేటివారు!
ఉప్పరములమీద నిలచేటివారు! కర్పూరహారతు లిచ్చేటివారు!
కనుదృష్టితప్పక చూచేటివారు! కరుణాకరులనుజూచి పలికేటివారు!
వజ్రంపుగొడుగులు వారుపట్టగను! నగరిలోపలకొచ్చె నారాయణులు!
తనయులకుయెదురు చనుదెంచెకైకేయి! పచ్చకూళ్ళూదెచ్చి బసిడివేయించె!
అనేకశల్లాలు బసిడివేయించె! పచ్చంగవేసినా పందిళ్లలోను!
అనుజులతోనిలచి రారాఘవునిజూడ అతివేడ్కతోను!
దిక్కుదిక్కులవారు గ్రక్కునవచ్చిరి! అంజనీసుతుడయిన హనుమంతుడపుడు!
మునుచేతబెత్తములు బార్లుజేయించె! బారులుజేయగా భరతుండుజూచి!
శుభకరంబునజనులు జూడవచ్చితే! యింతనొప్పింతురా ఈప్రజలనెల్ల!
ఇందులోమనకెవరు అన్యులున్నారు! అనియిట్లుభరతుడు పలుకగావినుచు!
చెలగిచెలగీ బార్లుజేయుచున్నారు! పొట్టివారంతను నిలుచుండిచూడా!
నీలవర్ణపుస్వామిని నెలతలుజూచిరి! కరుణాకరులను జూచికాంతలిట్లనిరి!
అత్యంతపరమమూర్తియైన రాఘవులు! కారడవులలోతిరిగి కష్టింపనోపె!
మెత్తన్నిశయ్యపై మెనొత్తురామూ! పూరిశయ్యపైన పవళింపనోపె!
భక్తవత్సలుడైన పరమపావనుడు! సృష్టికొరకై సీతతోడనుబుట్టి!
అనుజులతోటి అరణ్యములకరిగే! పాపాత్మురాలైన కైకేయివల్ల!

No comments:

Post a Comment