Thursday, October 13, 2016

ఆంధ్రనామశేషము - 2 - అడిదము సూరకవి

క. వేఱొక టనఁ బైపె చ్చన
మాఱట యిమ్మడి యనన్ సమాహ్వయములు పెం
పారును వస్త్వంతరమున
(కౌరగకేయూరసహిత హతమారజితా)               (15)

టీ. వేఱొకటి, పైపెచ్చు, మాఱట, ఇమ్మడి ఈ నాలుగును వస్త్వంతరమునకు పేర్లు.

సీ. ఆఱడిపోయెను బీఱువోయను రిత్త, వోయెను వీసరవోయె ననఁగ
నుడివోయెఁ బొలివోయె సుడివోయె ననఁగను, వ్యేథమయ్యె నటంట కాఖ్యలయ్యెఁ
గడిమి బీరంబు మగంటిమి గం డన, విక్రమాహ్వయములై వెలయుచుండు
నాస్ఫాలన మొనర్చె ననుటకుఁ జఱచె నా, నప్పళించె ననంగ నాఖ్యలయ్యె

తే. నొగివరుస యోలి సొరిది నానోజ నాఁగఁ
గ్రమమునకు నాఖ్యలయ్యెను (గాలకంఠ)
కొఱ కొఱత తక్కువ వెలితి కొదవ కడమ
యనఁగ నూనంబునకు నాఖ్య లై తనర్చు              (16)

టీ. ఆఱడివోయె, బీఱువోయె, రిత్తవోయె, వీసరవోయె, ఉడివోయె, సోలివోయె, సుడివోయె - ఈ ఏడును వ్యర్థమయ్యె ననుటకు పేర్లు. కడిమి, బీరము, మగటిమి, గండు - ఈ నాలుగును విక్రమమునకు పేర్లు. చఱచె, అప్పళించె - ఈ రెండును అరచేతితో బాదెననుటకు పేర్లు. ఒగి, వరుస, ఓలి సొరిది, ఓజ - ఈ అయిదును క్రమమునకు పేర్లు. కొఱ కొఱత, తక్కువ, వెలితి, కొదవ, కడమ - ఈ ఆరును ఊనమునకు పేర్లు.

తే. నెట్టుకొనెఁ బాలిపడె నొడిగట్టె ననఁగఁ
గడఁగెఁ దొడఁగెను జెలరేఁగెఁ గాలుద్రొక్కెఁ
గవిసెఁ గదిసె ననంగ నాఖ్యలయి యొప్పు
నభిముఖుం డయ్యె ననుటకు (నగనివేశ)            (17)

టీ. నెట్టుకొనె, పాలుపడె, ఒడిగట్టె, కడగె, తొడగె, చెలరేగె, కాలుద్రొక్కె, కవిసె, కదిసె - ఈ తొమ్మిదియు అభిముఖుండయ్యె ననుటకు పేర్లు.

తే. అగపడకపోయె విచ్చుమొగ్గయ్యె ననఁగఁ
గంటఁబడదయ్యెఁ బంచబంగాళమయ్యె
ననఁగ దృగగోచరంబయ్యె ననుటపేళ్లు
(శయఘటితశూల వైయాఘ్రచర్మచేల)               (18)

టీ. అగపడకపోయె, విచ్చు మొగ్గయ్యె, కంటబడదయ్యె, పంచబంగాళమయ్యె - ఈ నాలుగును కంటికి కనపడలేదనుటకు పేర్లు.

క. వెలిచవి చీఁకటిత ప్పనఁ
బొలుపారఁగ జారభావమునకుం బేళ్లౌఁ
బులు కసటు చిలు మనంగను
మలిన మనుట కాఖ్యలయ్యె (మనసిజదమన)              (19)

టీ. వెలిచవి, చీకటితప్పు - ఈ రెండును జారభావమునకు పేర్లు. పులు, కసటు, చిలుము - ఈ మూడును మలిన మనుటకు పేర్లు.

ఆ. వింగడం బనంగ విపరీతమగు నుక్కి
వం బనఁగను గుత్సితంబు పరఁగు
నాఖ్య యగుచుఁ దనరు నామని యనఁగను
మదమునకును (జంద్రమఃకలాప)                       (20)

టీ. వింగడము అనగా విపరీతమునకు, ఉక్కివము అనగా కుత్సితమునకు, ఆము అనగా మదమునకు పేర్లు.

క. ఎల యండ్రు తరుణ మనుటకు
గొల యన దురితంబు పేరు కుడియెడమలనన్
వలపలదాపల లనఁగను
బొలుపుగ నపసవ్యసవ్యములకుం బేళ్లౌ                (21)

టీ. ఎల అనగా తరుణమునకు పేరు. కొల యనగా దురితమునకు పేరు. కుడియెడమలు, వలపలదాపలలు - ఈ రెండును వరుసగా దక్షిణవామభాగములకు పేర్లు.

క. తగు నౌధత్యము పేళ్లై
పొగరన నా మనఁగఁ ద్రుళ్లు పోతర మనఁగా
నెగడును భయంపేళ్ళై
బెగడు దిగులు వెఱపు జంకు బీ తలు కనగన్            (22)

టీ. పొగరు, ఆము, త్రుళ్లు, పోతరము - ఈ నాలుగును గర్వమునకు పేర్లు. బెగడు, దిగులు, వెఱపు, జంకు, బీతు, అలుకు - ఈ ఆరును భయమునకు పేర్లు.

క. అరి యనఁ గప్పం బనఁగాఁ
గరమునకుం బేళ్లు కాఁగు కడవ పనఁటి నాఁ
బరఁగు ఘటాఖ్యలు (నమితా
మరమౌనినికాయ భూతి మండితకాయా)                 (23)

టీ. అరి, కప్పము - ఈ రెండును పన్నుకు పేర్లు. కాగు, కడవ, పనటి (రూ. పంటి) - ఈ మూడును ఘటమునకు పేర్లు.

క. అలరుచుండును గొండ్లి రంతనఁగఁ గేళి
హాని కాఖ్యలు చేటు కీడఱ యనంగ
హెచ్చరిక హాళి సంతసం బెలమి వేడ్క
యనఁగ నానందమున కాఖ్యలై తనర్చు             (24)

టీ. గొండ్లి, రంతు - ఈ రెండును కేళికి పేర్లు. చేటు, కీడు అఱ - ఈ మూడును హానికి పేర్లు. హెచ్చరిక, హాళి,సంతసము (ప్ర. సంతోషము), ఎలము, వేడ్క (రూ. వేడుక) - ఈ అయిదును ఆనందమునకు పేర్లు.

క. సాహిణ మనఁ బాగా యన
వాహాగారంబునకును వర్తిలుఁ బేళ్లై
వ్యూహమున కాఖ్యలయ్యెను
మోహర మన నొ డ్డనంగ మొగ్గర మనఁగన్             (25)

టీ. సాహిణము, పాగా - ఈ రెండును హయమునకు పేరులు. మోహరము, ఒడ్డు,  మొగ్గరము - ఈ మూడును వ్యూహమునకు పేర్లు.

క. ఒనరించె ననఁగఁ గావిం
చె ననంగను సలిపె ననఁగఁ జేసె ననంగాఁ
జను నాచరించె ననుటకుఁ
(గనకాచలచాప చంద్రఖండకలాపా                     (26)

టీ. ఒనరించె, కావించె, సలిపె, చేసె - ఈ నాలుగును ఆచరించె ననుటకు పేర్లు.

తే. చీఁకువా లిరు లనఁగను జీఁకటి యనఁ
దిమిరమునకు నభిఖ్యలై తేజరిల్లి
నాఖ్యలై తనరారు నుపాయమునకు
సుళువనఁగ వెర వనఁగను సూటి యనఁగ            (27)

టీ. చీకువాలు, ఇరులు (ఏకవచన) చీకటి - ఈ మూడును అంధకారమునకునకు పేర్లు. సుళువు, వెరవు, సూటి - ఈ మూడును ఉపాయమునకు పేర్లు.

తే. చేరువయ్యెను డాసెను దారసిల్లె
ననఁగ సన్నిహితం బౌట కాఖ్య లయ్యె
స్థూల మనుటకు బేళ్లగుఁ దోర మనఁగఁ
గడిఁది బలుఁద యనంగను (గాలకంఠ)              (28)

టీ. చేరువయ్యె, డాసె (రూ. దాసె), తారసిల్లె - ఈ మూడును సమీపించె ననుటకు పేర్లు. తోరము, కడిది, వలుద - ఈ మూడును స్థూలమనుటకు పేర్లు.

తే. వాడెఁ గసుగందె ననఁ బుయిలోడె ననఁగ
విన్నవోయె ననంగను జిన్నవోయె
ననఁగఁ  బేళ్లగు నివి ఖిన్నుఁ డయ్యె ననుట
(కంధకాసురహరణ రౌప్యాద్రిశరణ)                   (29)

టీ. వాడె, కసుగందె, పుయిలోడె, విన్నవోయె, చిన్నవోయె - ఈ నాలుగును ఖిన్నుడయ్యె ననుటకు పేర్లు.

క. గరువము మురిపం బనఁగను
బరఁగున్ గర్వంబు పేళ్లు భటనామము లొం
టరి లెంక బం టనంగను
(బురదానవహరణ శేషభుజగాభరణా)                 (30)

టీ. గరువము, మురిపము - ఈ రెండును గర్వమునకు నామములు. ఒంటరి, లెంక, బంటు (భటశబ్ధభవము) - ఈ మూడును భటుని పేర్లు.

క. అరదంబు తే రనంగను
బరఁగు రథంబునకు బేళ్లు పరి యన్నను గా
లరు లనఁ బాదాతిసంహతి
(పురదానవహరణ శేషభుజగాభరణ)                  (31)

టీ. అరదము (రథ శబ్ధభవము) తేరు - ఈ రెండును రథమునకు నామములు. పరి, కాలరులు - ఈ రెండును కాల్బలమునకు పేర్లు.

క. సందియ మన ననుమాన మ
నం దనరును సంశయంబునకు బేళ్లై గో
బృందాహ్వయంబు లలరును
మం దనఁ గోన యనఁ (జంద్రమఃఖండధరా)          (32)

టీ. సందియము, (సందేహ శబ్ధభవము) అనుమానము - ఈ రెండును సంశయమునకు పేర్లు. మంద, కోన - ఈరెండును గోసమూహమునకు పేర్లు.

క. మొన వాఁగు దండు దళా మనఁ
దనరున్ సైన్యంబుపేళ్లు దళవాయి యనన్
మొనకాఁ డనంగఁ బడవా
లనఁగన్ సేనాధిపతికి నాఖ్యలు వొలుచున్                (33)

టీ. మొన, వాగు, దండు, దళము - ఈ నలుగురును సైన్యమునకు పేర్లు.  దళవాయి, మొనకాడు, పడవాలి - ఈ మూడును సేనాధిపతికి పేర్లు.

తే. మైకొనియె నియ్యకొనె నొడంబడియె నొప్పె
ననఁగ నంగీకరించుట కాఖ్య లయ్యె
సంఘటించుట కాఖ్యలై జానుమీఱుఁ
జెరివెఁ దుఱిమెను గీల్కొల్పెఁ జెక్కె ననఁగ             (34)

టీ. మైకొనియె, ఇయ్యకొనె, ఒడంబడె, ఒప్పె - ఈ నలుగును అంగీకరించె ననుటకు పేర్లు. చెరివె తుఱిమె, కీల్కొల్పె, చెక్కె - ఈ నాలుగును సంఘటించె ననుటకు పేర్లు.

తే. దిట్టపడియె ముక్కాఁకలు దీరె ననఁగ
నాఱితేఱె ననం గడిదేఱె ననఁగ
గసిమసంగె ననంగ నాఖ్యలు దనర్చు
నిపుణుఁ డయ్యె నటంటకు (ద్రిపురవైరి)          (35)

టీ. దిట్టపడియె, ముక్కాకలు దీరె, ఆఱితేఱె, గడిదేఱె, కసిమసంగె - ఈ అయిదును నిపుణుడయ్యె ననుటకు పేర్లు.

1 comment:

  1. Hard Rock Hotel & Casino Pittsburgh | Dr.MCD
    Hard Rock Hotel & Casino 여주 출장안마 Pittsburgh has arrived 포커 고수 in the heart of Pittsburgh 안산 출장샵 and is 사천 출장샵 offering a new taste of the best in music. Located right 평택 출장안마 at

    ReplyDelete