Saturday, May 12, 2012

కోకిలమ్మ పెండ్లి -- విశ్వనాధ సత్యనారాయణ -- Part 1

లేతబుర్రలు కొక్కిరిస్తే
అతగాళ్ళతో యేమిగానీ
తాతతాతలనాటి కతలూ
తవ్విపోస్తానోయ్

ఊగులాడే కడలి తరగలు
నాగుబాముల కోడెలల్లే
ఒడ్డుదాకా ప్రాకి ప్రాకీ
ఒరిగిపోతాయోయ్

ఒడ్డుదాకా అడివి, అడివిలో
దొడ్డచెట్లున్నాయి తరగల
వూగులాడే గాలిచేత
వూగులాడుతుంటాయోయ్

అడవిలోనూ కడలిలోనూ
అద్దరాత్తిరివేళ అప్పుడు
తొగరుకన్నుల చుక్కకన్నెలు
తొంగిచూస్తారోయ్

పొద్దుకూకేవేళ ఒడ్డున
ముద్దుముద్దుగ తిరుగుతుంటూ
సొగసునడకల గాలిపిల్లలు
సోకుపోతారోయ్

సుళ్ళు తిరిగే కడలినడుమా
చూపుకందీ అందకుండా
తెప్పలేసుకు పాముపడుచులు
తేలిపోతారోయ్

ఒడ్డునే బంగారుచేలూ
ఒడ్డునే పూవుల్లుచేత్తో
ఊరికే యిట్లంటె చాల్ పా
లుబికిపోతాయోయ్

నేను చెప్పేకతలు జరిగి
యెన్నినాళ్ళయిందో అప్పుడు
మలలు పొదలు కొండకోనలు
తెలుగునా డంతా 



కడలివొడ్డున పల్లె ఒకటి
కలదు, ఱేడున్నాడు దానికి,
అప్పటికే యీ తెలుగులంతా
గొప్ప యెకిమీళ్ళు

వెదురులో ముత్యాలపేరులు
కదురులో దారాలబట్టలు
ఎదురుగా నెలపొడిచినట్లే
ఏపుమీ రేడోయ్

దొడ్డదొర, అతగాడినేలలో
ఎడ్డెపనులే చేయ రెవ్వరు,
దొంగ నాగరికతలో దేశం
తూలిపోలేదోయ్

ఉన్నవాళ్లకు ఎంతనేలా
దున్నుకుంటే చాలుతుందో
మించి ముట్టరుకూడ పైనా
చిన్న చెక్కయినా

మిగిలినా అడవూలు, కొండల
కెగురుతూ, మబ్బుల కన్నెల
తగులుతూ, తరిలోన వానలు
కురుస్తుంటాయోయ్

అందరికి కావలసినంతా
వుంది, యెవ్వరితోడా నెవరికి
నెన్నడు చూడలేమన్నా
చిన్ని తగవైనా

ఆ దొరకి కూతుళ్ళు ఇద్దరు,
మోదుగులు పూశాయి పెదవులు
వారిపేరులు, చిలక తల్లి,
కోకిలమ్మానూ

కోకిలమ్మ నల్లనిదే
చిలకతల్లి పచ్చనిదే
చిలక తల్లికి కోకిలమ్మకు
ఎప్పుడూ పడదూ 



చిలకతల్లి చిన్ననాడే
పలుక మొదలెట్టింది ముద్దుల
మొలకలై తండ్రికీ మేనూ
పులకరించిందీ

ఎన్నో ఏళ్ళు వచ్చినాయీ
కన్నులింతగా తెరచినాదీ
పాపమేమో ! కోకిలమ్మకు
మాటలేరావూ

చిలకతల్లికి రంగురంగుల
చీరలూ తెస్తాడు తండ్రీ,
కోకిలమ్మను ఊరకేనే
కోపపడతాడూ

చిలకతల్లీ నవ్విపోతే
తండ్రి మారూ పలుకకుంటే
తల్లివంకా చూచి కోకిల
తెల్లపోతుందీ

చిలకతల్లి వెక్కిరిస్తే
తండ్రి వచ్చీ కసురుకుంటే
తల్లివెనుకా దాగిపోతూ
తల్లడిలుతుందీ

తల్లి ఏమీ చెయ్యలేకా
తాను కూడా విసుక్కుంటే
కోకిలమ్మా లోనె లోనే
కుమిలిపోతుందీ

రోజు రోజూ కడలి తరగల
రొదలలో కలిసి ఏడుస్తూ
నురుసులోపల వట్టిచూపులు
నిలిపి పోతుందీ

అడవిలో యే చెట్టుకిందో
అంత యెగ్గులు తలచుకోనీ
కూరుచున్నది కూరుచుండే
కుమిలిపోతుందీ 



చెట్టుతోనో పుట్టతోనో
చెప్పుకుందామన్న గానీ
ఎట్టివాడో వాడు నోరూ
పెట్టలేదాయే

కొండవాగుల్లోను ప్రొద్దూ
గూకులూ కూర్చుండి యిసకలో
గూళ్ళులేనీ పిచ్చికలకీ
గూళ్ళు కడుతుందీ

కొండవాగులవెంట పోతూ
కొండపువ్వుల వంక చూస్తూ
ఎంత పొద్దోయినా గానీ
యింటికే పోదూ

ఒక్కొక్కప్పుడు తెల్లవార్లు
అడివిలోనే ఉండిపోతే
తల్లి ఊరక తెల్లవార్లూ
తల్లడిల్లుతుందీ

వానరోజులు వచ్చిపోగా
చలిపగళ్ళు సాగిపోగా
ఆకురాలుట ఆగి చివురులు
జోకతాల్చాయీ

చివురులూ కొమ్మలాచివరా
గుబురులై గుబురులాచివరా
పూవులూ నాలుగూవైపుల
బుగులుకొన్నాయీ

చివురులో ఈనెల్లే, పసిరిక
పువ్వుల్లో తేనెల్లే, పలపల
చిలకతల్లికి కోకిలమ్మకు
వయసు వచ్చిందీ

చిలకతల్లీ చదువు చూచీ
చిలకతల్లీ సొగసు చూచీ
గాలిపిల్లకూడ లోపల
కలతపడ్డారూ 



చిలకతల్లీ అందమంతా
చిందిపోయీ అన్నివైపుల
కనులచూడని వారుకూడా
అనుకునేవారే

చెట్లరాణీ తలాడిస్తూ
చిలకతల్లీవోసుకతలే
నింగిలో దవ్వూన యెచటో
పొంగి పాడిందీ

పొద్దుకూకేవేళ తిరుగుతు
ముద్దులొలికే గాలిపిల్లలు
చిలకతల్లి అందమెప్పుడు
వొలకపోస్తారూ

ఎల్లవారూ చిలకతల్లినె
పెళ్ళికై కోరారు, తండ్రి
తల్లి మాత్రము పిల్లదాన్నీ
కళ్ళ కాస్తారూ

కడలీదవుల ఱేండ్లు తమలో
కలుపుకుంటారేమొ అనుకుని
గడపదాటీ చిలకతల్లిని
కదలిపోనీరూ

ఇంటిముంగిలి దాటనీకా
ఇంటిపనులూ చేయనీకా
కంటికీ రెప్పాకి మల్లే
కాచుకుంటారూ

చిలకతల్లీ సొగసులవాకలు
చిలవలై పలవలై యందపు
మొలకలై తేనెలాచినుకులు
గలపరించాయీ

చిలకతల్లీ అందమేమో
చిలకతల్లీ పెళ్ళియేమో
తల్లి తండ్రీ కోకిలమ్మను
తలచనేపోరూ
 

*        *        *        *        * 

2 comments:

  1. వివిధ కవుల సాహిత్యాన్ని తెలియని మాబోటి వారికి ఇలా బ్లాగ్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నందుకు ధన్యవాదములు సర్

    ReplyDelete
  2. You can see the whole text here - with ease of converting from english transliteration text.

    http://www.maganti.org/rachayitalu/kokilammapelli.pdf

    Oh BTW - just to let you know sometimes people donot pay attention and just copy paste it....There are some mistakes in the text.... :)

    ReplyDelete