Saturday, September 10, 2011

శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -17


ఐతమ్మ బాలునిమనోరథముఁ దెల్పుమని యడుగుట

చిత్తములోకోర్కె చెప్పుడీయనిన
నవ్వుచుబాలుడు నాతికిట్లనియె
తరుణిరో మేమునీ తనయులమగుట
సకలవైభవములు సమకూరెమాకు
ప్రియముతోమమ్ముల పంపుసేయంగ
ప్రొద్దుపోదేమిట పొసగంగనన్న
ముద్దులకొమారుని మోమువీక్షించి
ప్రొద్దుపోవకయున్న పుత్రరత్నంబ
పోకలాటలచేత బుచ్చుముప్రొద్దు
ఆడుడిముత్యమ్ము లమరుబంతులను
గుంతమాపలనాడి కొనిగెల్చుకొనుము
బైటనాడగవద్దు బడలెదుసుతుడ
కుటిలజంతులదెచ్చి గుడిలోననుంచి
విడిపించిపోరాడు విధమునుచూడు
రూకలకుప్పలు రూఢిగానడు
మనినతల్లిరొవాని నాడితిమమ్మ
వానిపైనిప్డాస పడదుచిత్తంబు
క్రొత్తలపైన మక్కువగల్గియుండు
అనిబాలుడాడిన ఐతమ్మపలికె

భారతయుద్థాదికథల వినుమని యైతమ్మ బాలచంద్రునికిఁ జెప్పుట

ఆటపాటలపైన అలసితివేని
వినవయ్యబాలుడ విశిదంబుగాను
విభుదులవిప్రుల పిల్వగబంచి
వినుముభాగవతంబు విఙ్ఞానమొదవ
భారతరనకథ పాటించివినుము
భీష్ముడొనర్చిన వివిధశౌర్యముల
అచలితబుద్ధితో ఆలింపుపుత్ర
ద్రోణుండునెరపిన దోర్బలగరిమ
మనమునబట్టింపు మానితసుతుడ
కర్ణుండుజూపిన ఘనపరాక్రమము
సూక్ష్మంపుబుద్ధితో జూడుముతనయ
శల్యునియందున్న శాస్త్రచాతురిని
జాగరూకతమెయి చర్చించువేడుక
దుర్యోధనునిమాన ధూర్వహపటిమ
ఆసక్తితోడుత అరయుమాత్మజుడ
చాపంబువిడిచిన సవ్యసాచికిని
కృష్ణుడు చెప్పిన గీతలయందు
కర్మరహస్యముల్ గాంచుకుమార
నేర్చినవానిని నేరుపుమీర
దృఢధైర్యమున ఆచరింపంగవలయు
అనినమాటలువిని ఐతమ్మతోడ
బాలుడిట్లనియె పకపకనవ్వి

బొంగరములాడుట నిజమనోరథంబని బాలుఁడు తెల్పుట

వినవమ్మతల్లిరో విమలేందువదన
ధర్మార్థకామ తత్వంబెరుంగుదును
శాస్త్రజాలంబుల చాలగవింతి
మనమునదెలిసితి మర్మంబులెల్ల
ప్రకృతకౌమార చాపల్యంబుకతన
చిత్తవిశ్రాంతికై చేరిఈవేళ
బొంగరాలాడగ బుద్ధిజనించె
సెలవిచ్చిపంపుము శీఘ్రమొమమ్మ
ఈరీతిపలికిన ఏణాక్షికలగి
వెరచియువెరవని విధమునననియె

బొంగరము లాడవలదని తల్లి బాలునికిఁ జెప్పుట

విశదంబుగాబాల వినుముద్దుతనయ
ఈబుద్ధితలపగ ఇచ్చలోవలదు
వలసలోనెన్నాము పడబొంగరాల
ఆడినజేతప్పి అతివలకైన
తగుబాలురకునైన దాకునుబోయి
పడతులుకోపించి పలుతెరంగులను
శపియింతురీమాట సత్యంబుపుత్ర
శాపింపబడుటకు సాహసమేల
నామాటగడచుట న్యాయంబుగాదు
నావుడుబాలుడు నాతికిట్లనియె

బాలుఁడు తల్లిమాటలకుఁ బ్రతివచనము సెప్పుట

ముదితరోనావంతి ముద్దులసుతులు
పుట్టరాభూమిని పుణ్యాంగనలకు
వారేలశపియింత్రు వనితరోనన్ను
అలిగితిట్టినపాప మనుభూతమగును
పూబోడినాదేహ పోషణార్థంబు
పెట్టనితావుల పెట్టిదాచెదవు
కొదమసింహముతన గురుశౌర్యమమర
ధరవిజృంభింపక దాగునాయొదిగి
ఏటికిభయమంద నింతిరోనీకు
అనవినీబ్జాక్షి ఆత్మలోగలగి

బొంగరాలాటకూడదని తల్లి మరలఁ జెప్పుట

ఏలబాలుడనీకు నింతధైర్యంబు
శాపింపబోరని సంశయమేల
దుష్టలుతులువలు దుర్భాషిణులును
తారతమ్యంబుల తగవెరుంగకయె
కచ్చెకుముందుగ గాలుదువ్వెదరు
భావంబులిట్టివి పడతులకెల్ల
నీమేలుగనిగొని నేనోర్వలేక
పలికుటకాదోయి బాలచంద్రుండ
అనిచెప్పినంతట ఆబాలుడనియె

బాలుఁడు తల్లిమాటలకుఁ దగు సమాధానము చెప్పుట

దుష్టభావుడగాను ధూర్తుడగాను
వెలదులకెల్లను వినతిచేయుదును
దయచేయుదురువారు తనయునిమాడ్కి
తడవాయనేవచ్చి తల్లిరోయిటకు
పుత్రునిమాటలు బుద్ధిలోనుంచి
నాకాంక్షలీడేర్చి నన్నంపవమ్మ
బాలచంద్రుండిట్లు పలికినవేళ
ఐతమ్మనవ్వుచు నపుడునేర్పరుల

బాలచంద్రుఁడు తల్లియొక్క లోభత్వమును దూలనాడుట

ఒజ్జలబిలిపించి యొప్పుగామీరు
బొంగరంబులుకొన్ని పూనిచేయంగ
తగునన్నబాలుండు తనలోననవ్వి
దల్లితోననియెను దయవచ్చునట్లు
శత్రువులబొజుంగు సాంద్రవిక్రముడు
గండుభీమనగర్భకంధిరత్నమవు
లోభమ్మునీకేల లోలాయతాక్షి
ఏడుకోటులసంఖ్య నెసగినధనము
కలిగినఆగండు కన్నమనీని
చెల్లెలువైయుండి సిరులుచెన్నొంద
చెనటిబొంగరములు చేయించుకొరకు
ఏరీతిమనసొప్పె ఏణాక్షినీకు
బీదవాక్యమ్ముల పెదవులపైకి
తేరాదుపెద్దల తీరుకువెలితి
భావంబులోలోభ పటిమమీరంగ
గృహకార్యములు నిర్వహింపజూచెదవు
నీవంటిదానికి నీతియేచెపుమ
నీవెయుంచికొనుము నీతండ్రిసొమ్ము
సకలదేశాధీశ సంఘంబునెల్ల
సమరరంగంబున సాధించిమించి
వారిచేమాతండ్రి వలసినయట్టు
లప్పనంబులుగొన్న అధికధనంబు
పొందుగాదెప్పించి పుటముపెట్టించి
పైడిబొంగరముల పరగజేయింపు
వెండిచేములుకులు వెలయబెట్టింపు
పట్టుచేజాలెలు పన్నిపేనింపు
ముత్యాలకుచ్చులు మొదలగూర్పింపు
తెప్పించియిప్పింపు తీవ్రంబుగాను

No comments:

Post a Comment