నలగాముఁడు గజారూఢుఁడై సేనతోఁగూడి కార్యమపూడికేగుచుండఁ ద్రోవలోఁ గొదమగుండ్లపౌరులు విన్నపంబొనర్చుట
కొదమగుండ్లకుచేరె కుంభినీశుండు
పేరైనపల్లెల బెద్దలౌరెడ్లు
కోమటిజనములు కూడియేతెంచి
కామభూమీశుని కనుగొనిమ్రొక్కి
విన్నవించిరిమహా వినయంబుతోడ
మామాటవినదగు మైలమ్మసుతుడ
వైరంబుమీకేల వసుదాధినాథ
అన్నదమ్ములుపూర్వ మవనియెరుంగ
కలహించిమడిసిరి కదనంబులోన
పగలేకయేలుట బలిమిమీకెల్ల
ప్రజలకుసుఖమౌను పరులుతగ్గుదురు
బిడ్డలవిధమున బ్రీతితోమమ్ము
రక్షించుచున్నారు రాజులుమీరు
కలహించిమడిసిన కదనంబులోన
ఇతరరాజులుమాకు నేరువచ్చెదరొ
మీరురాజ్యముచేయ మేదినియందు
దుష్టులనిర్భయోత్సుకతనశించె
శిష్ట్లకుమేలు చేకూరుచుండె
ప్రాణముల్ భద్ర ముపద్రవమడగె
కరములు హెచ్చుగ గైకొంతలేదు
అనుకూలులైమీర లవనియేలంగ
కనుగొన్నమాకెల్ల కలుగుశుభంబు
హితులముగనుకమీ కెరుగజెప్పితిమి
శక్తిచాలదుమాకు సారెకుదెల్ప
అనివిన్నవించిన అనియెవారలకు
మదమునగర్వించి మలిదేవరాజు
రనముచేయగదర్లి రమ్మనిమాకు
భట్టునుబంపెను బలమెరుంగకయె
పైనమైవచ్చితి బవరంబుచేయ
వీరులనాయుని వెసమలిదేవు
బంధుమిత్రాదుల పోరిపోదోలి
వేగమేవత్తుము విభవంబుమెరయ
ఎలమితోనుండుడి యిండ్లలోనిలిచి
ఈరీతివారికి హితములుచెప్పి
పొమ్మన్నవారలు పోయిరావేళ
మరునాడునలగామ మండలేశుండు
మనమునరోషంబు మల్లడిగొనగ
కాలోచితంబైన కర్మముల్ దీర్చి
ఘనతరశృంగార కలితుడైవెడలి
భద్రకరీంద్రముల్ పైనిగూర్చుండె
తమ్ముడునరసింగ ధరనీశ్వరుండు
ఎలమితోపాలకి నెక్కివెంబడిని
స్థిరగతిబలములు చెలగంగనేగె
అర్పులబొబ్బల అవనికంపింప
సాగరముప్పొంగి చనుదెంచినట్లు
మేఘముల్ వినువీధి మేదురంబగుచు
పరువులుపెట్టెడు భంగినిదోప
క్రమ్ముకకార్చిచ్చు కదసినరీతి
పవనుండుదట్టమై పరగినమాడ్కి
వివిధబలంబులు వేగమెనడిచె
చక్కగామిరియాల సరిహద్దుదాటి
ప్రజలమేలిచింత పల్లెయుదాటి
కౌరవుల్ పాండవుల్ కలహంబొనర్చి
నలగాముఁడు కార్యమపూడుఁ జేరుట
కూలిచచ్చినయట్తి కురుభూమిరీతి
రౌద్రగుణోద్వీర రక్తసిక్తంబు
పావనచరితంబు పలనాటిపేర
పొలుపొందుచుండెడు పుణ్యదేశమున
కాశికిసమమైన కార్యమపూడి
రణరంగభూమిని రాజుదానిల్చి
భద్రదంతినిడిగ్గె పదిలంబుగాను
చచ్చౌకమేరడ సరసంపుభువిని
హేమకుంభంబుల నెసగుచునున్న
పటకుటీరంబులు పన్నుగాగట్టి
మూలబలంబులు మొనగాండ్రువచ్చి
కూర్చున్న ఘనమైన గొల్లెనల్ కూర్చి
స్వర్ణసింహాంకంబు పరగెడునట్టి
నెరిధ్వజస్తంభంబు నిల్పిరిమ్రోల
కప్పురపువిడెంబు గావించివచ్చి
కొల్వుకూటంబున కూర్చుండెరాజు
దాపట నరసభూధవుడునుదొరలు
కొండమన్నెమరాజు కోటకేతుండు
కుడిదెసరెడ్డియు గురియైనయట్టి
చేరువకాండ్రును జేరికనలర
వీరఘంతలుగట్టి విలసిల్లుచుండు
సోమదేవరరౌతు శూరులైనట్టి
వీరరాహుత్తులు వెలయమున్నూట
అరువదిమందిదా మట్టహాసముల
రణశూరులైనట్టి రాజపుత్రులును
పోటుబంట్లనుబట్టి పొడిచెడువారు
ఊడిగలందంద యొనరికొల్వంగ
దేవతాగణయుత దేవేశురితి
భూపతిసభమందు పొల్పొందుచుండె
రాజువెంకంజేరి రమణినాగమ్మ
కార్యఖడముల ప్రఙ్ఞావిషేషముల
తెలుపుచుగూర్చుండె ధీరతతోడ
ఇతరబలంబులు హెచ్చువేగమున
తర్లెడువారును తగనడ్చువారు
విడిచెడువారునై వెరవైనచోట్ల
తగినతావులయందు తప్పకనిల్వ
మూడుసహస్రముల్ ముఖ్యులౌబంట్లు
కలనికంగణముల్ కనఏడునూర్లు
శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం ప్రచురించటం శ్లాఘనీయం. అయితే, దీనిని ఈ నాటి యువతరం కూడా అర్థం చేసుకునేలా, ప్రతి టపా దిగువున వచనంలో సరళంగా భావాన్ని వ్రాస్తే మరింత ఉపయుక్తకరంగా ఉండగలదు. Word verification తొలగించగలరు.
ReplyDelete