Thursday, January 7, 2016

అష్టమహిషీకల్యాణము - 4

(నవనీతచౌర్యాదిలీలావర్ణన)

వెనువెంటఁ జనవీధి వీధులవెంట
దొంగనునాతోడి దొంగలు మీరు
దొంగిలుండమి గడిదొంగయై శౌరి
సదనముల్ సొరఁ బారిసవరేయి యాలఁ
బిదికి వెండియునదు బిదుకింత లేక
విటులుమీరైరి విటుఁడనే గోప        (770)
కుటిలకుంతలలార గూడరమ్మనుచు
వ్రేలువ్రేతలుఁ జూడ వెన్నలు నేయిఁ
బాలు గోపాలుర పాలుగావింపఁ
జిరుతతమ్మొనరించు సేద యశోద
యెఱుఁగునోయెఱుఁగదో యెఱిఁగింతమనుచుఁ
జాలంగ విసిగివేసరి సరిగొల్ల్
వాలుఁ గంటులునందు వామాక్షిఁ జేరి
తల్లిని బిడ్డని తల్లిని యిండ్ల
నెల్లి కాపురముమే మెట్లు చేసెదము
దుడిదుడిఁబఱతేఱిఁ దొలఁగుమటన్నఁ    (780)
గడవఁ బల్కుచుఁ జన్నెకడవపాలెల్లఁ
ద్రావి యీకమ్మని తావియంతయును
భావింపుఁడనుచు మాపైలాచివైచి
నాకూఁతువెంటనానాళ్ళాడఁబోయి
కాకు గావించి చీకాకు గావించి
యానల నమ్మించి యంతలోఁగల్ల
యానవాలటు చెప్పి యానవాలెల్ల
బాఱబోయుచు గొల్లపడుచులుఁ దానుఁ
జేఱులజుఱ్ఱివాచేఱలఁ గ్రోలుఁ
గిలకిలనగుచుఁ జక్కిలములదొంతి     (790)
గలవెల్లదిని వేడుకల బర్వువిడుచు
జివి పాలు వెన్న మృచ్చివితనబలిమి
కొలదియెన్నక పొట్ట కొలదిఁ జూరాడఁ
గంతిగంటినటన్నఁ గదిసియామచ్చ
కంటికెమ్మోవిపైఁ గంటుగావించె
వేవేగఁబఱతెంచి వెలగొమ్మునమ్ము
మావెన్నమాకమ్ముమనిన మాపడుచు
అమ్మరో దేవరకన్న యీవెన్న
నమ్మరాదింక మాయమ్మతోడనఁగఁ
దొడికియేతులకు గోతులకిడినగుచు       (800)
వడిఁబోయి యొచ్చుకై వడినొక్కరింట
మునియేటనేపైఁడి ముడిచిన పడుచు
చనుగుబ్బగోరొత్తి చనుగబ్బివాఁడు
తూలుచునుల్ననే తులనట్లు జూచి
రోలుమీదఁట నెక్కిరోలుగోలలను
గుడుచుఁగూడెల్ల నాకుండలువోవ
నడుఁచుమాతోవాదులాడుఁచుమాపడుచు
మునిమాఁపె పఱతెంచి ముంగిటుపలువ
పనులకు మమునొడఁ బఱుచునీపడుచు
వేల్పులేమిటికి నావేల్పులవేడు          (810)
వేల్పునుననుమీరు వేడినమీకు
ధనధాన్యవస్తు వుల్దగనిత్తుననుచు
మునుకొనిమగపోడుములఁజేయఁబూను
నెఱవైన పెద్దలు నేఱనియట్టి
కఱపులుకఱఁచె నీ కతకారి బిడ్డ
గోడలుదుమికి నాకోడలుఁ గొడుకుఁ
గూడియుండెడు వేళగోవననార్చి
పాముపైఁబడవైచిబాములుఁ బెట్టి
భామలందఱుఁ బఱువడిఁ జూడఁ జూడఁ
బిలిచియేకతము జెప్పెదనంచు నోటఁ      (820)
బలికిచూపగరాని పలుకువలుకుఁ
బులుగాకులేల పోపొమ్మనన్నమమ్ముఁ
బలుగాకులాడు నీపలుగాకు వాఁడు
పాలిండ్లుచొఱఁ జూపఁ బట్టినగరిత
పాలిండ్లుదొడికి చేఁబట్టునే తల్లి
ఒక్కప్రొద్దుల వారికునిచిన యట్టు
లొక్కప్రొద్దునవచ్చి యొక్కఁడే మెసఁగు
నీరీతిఁ ద్రావెడివెన్నిపాలైన
భూతంబులున్నవో పొట్తలోపలను
గటకటచిన్న కూఁకటి పట్టి పట్టి      (830)
చిటులనిజడలేఁగ చిఱుడొంక తోచఁ
ముడిచియాపడుచుకొమ్ముడియను విడచి
పెడబొబ్బవిడునీదుపెడవెట్టు బిడ్డ
కట్టిన గురికొండ్లు కట్టినట్లుండఁ
వెట్టిన బీగముల్బెట్టినట్లుండఁ
నేయెల్లఁద్రావుదంతి మెసంగువెలఁగ
కాయలగతిరిత్త కడవలే చిక్కు
తనయుఁడు పిన్నని తలపోయవలదు
కినిసినఁ గొండలు గిట్టింప నోపు
పొలిజెట్లుతోడను బోరంగ నోవుఁ         (840)
జేరువప్రతిసృష్టి చేయంగఁ గలఁడు
సిరిగల్గితేనె బోసృయుటకాక
యొరులరంతులు వెట్టనొప్పునే యిట్లు
రాకొమ్మసతులచే రాకొమ్మవైన
యీకాకుబనులుసే యింతురే జగతి
మనుజుఁగానాత్మ నమ్మకు మమ్మనీకు
తనయుఁడె మాపాలి దయ్యంబుగాగఁ
బాటింపవమ్మ మాపలుకులు గొల్ల
బోటులెన్నఁడు వెల్లబోటులే యనక
కారియబెట్టి యీగరితల నిట్టి       (850)
చీరుచన్నులగోరఁ జీరునేయనుచు
వేఁదెఱంగులఁ దమదేవతలు గొల్లెతలు
పోరులు చేసి చెప్పుటకు యశోద
కలగోపికలమీఁదఁ గలకూర్మినినుక
యలతల్లియెదుటి భయంబుకన్గొనల
లీలఁ జూపుతెరంగు వేఁగుఱుల్ వ్రాల
కేలనదువ్వి చెక్కిలి చక్కనొక్కి
శారద నీరద సంఛన్నగిరుల
గౌరత పరిధానకలితంబులైన
యుదుటు పాలిండ్లపై నొత్తి యూరార్చి     (860)
యెదఁ జేర్చిపయ్యెదయింపుమైఁగప్పి
యాలోలగతినంక మాడించి కృష్ణు
లాలిబాడుచు కల్లరి దొంగతనము
లేలమాపని కింటిలోపలను
బాలేమిబ్రాతి దెప్పలఁగలవు
కాకపోకల సడిగాక యీకాకు
పోకిళ్ళ మావాఁడు పోనేర్చునటవే
యనుడూ గోపికలు సూనాస్త్రదీపికలు
మనముల లజ్జించి మడిగిరంతటను
తముఁదిట్టు శౌరియింతకుమున్ను మన్ను   (870)
నమలెఁబొమ్మని గోపనందనుల్బలుక
నేలమృత్తికఁ దింటివిప్పుడు నీకు
నాలుక పోలిక నాకింతఁ జూపు
మనుఁడు గృష్ణుఁడు వదనాబ్జంబుఁ దెఱువ
నినుపులై పొంగెడు నీరధుల్నిథులు
సురలు కిన్నరులు భూసురులు దిగ్వరులు
సరసిజాసన శీతశాతభానులును
గనుపట్టిబ్రమసి చెంగట నున్నచకిత
తనువల్లి తన తల్లి తన మాయ లొదవ
నేయెడ వీక్షింప నిట్టిది విష్ణు         (880)
మాయయేయిది కనుమాయయోయనుచుఁ
దొంటిచందమున నాతొలిమించుగంటి
చంటిడా పలఁ జేర్ప జలజ నేత్రుండు
పొదలు కొండలచెంతఁ బొదలుసింగంపుఁ
గొదమకైవడి మాతకు చముల నొరసి
ఆలీల సర్వేశుఁడయ్యెను బాలు
లీలఁ గృష్ణుఁడు తన లీలలు చూపె
ననవిని యానణ్దుఁడైన గుర్పొడువ
జననాధుఁడౌ మౌనిజననాధుఁబలికె
కందర్పజనకుఁడేకతమునవ్యాస         (890)
నందన నందనందనుఁడయ్యె ననిన
మును ద్రోణుఁడను వసుముఖ్యుఁడొక్కరుఁడు
తనయాళితోఁ గూడఁ దనయానురక్తి
నిజతపోసుష్ఠాన నియతుల నుతుత
నీజుని మెప్పించి కాయజుతండ్రిబోలు
తనయునిమ్మనఁ బద్మతనయుఁడింకొక
జననంబు నంగల్గుఁ జనుఁడంచుఁ జనిన
నానందసతియయ్యె నాతని దేవి
ధాతవరంబు సత్యము చేయుధాత          (900)
తాతనందునికి నాత్మజుఁదయ్యెననుచు
నందగేహిని యొక్కనాఁడు జెట్టాడు
నందనుచరితమానందతం బాడి
దివినంతరపువోళ్ళెఁ దిరుగు బొమ్మరపు
గవరోతిఁ దతిదివ్యఁగాఁ జన్నులదరఁ
దరితాడుకేలికెందమ్మి కెంజాయ
తరుణార్కకిరణంబుఁ దలఁపించుచుండఁ
గంగణములు గలగల మ్రోయూచుండఁ
డంకంబు బటువు తాటంకంబులులుకు
నురగ<బునుమియు మయూరంబు పోలె      (910)
నఱజారుపూదండనలవడుకొప్పు
అల్లాడఁగౌననియాడసరులు
మల్లాడనలకలు మలసి చల్లాడ
దధిమధియించు నత్తఱి తరికాఁడు
మధువైరి చేరియమ్మాయంచుఁ బిలువ
సన్నమోవుల నిం?? జప్పట్లు చఱచి
యన్నకృష్ణమ్మ మాయమ్మ రమ్మనుచుఁ
దనమోహన పుటంక తలమునఁ జేర్చి
కొనివేడ్కశిరము మార్కొనికేలనిమిరి
మొగులక్రిందటినింత మొనుపు మార్తాండు    (920)
పగిదిపయ్యెదదనర వామకుచంబు
గ్రోలుచుఁ జేతఁగైకొనియున్నబాలు
బాలువొంగినఁ బీటఁపైఁచెట్టియరుగఁ
జనుగ్రోలనీయ కచనుతల్లి మీఁది
కినుకవేఁగసరులఁ గెమ్మోవియదర
వాఁడిమిమైములు వాడివట్టునను
బాఁడియెబ్బిడిసేయు బానయుఁగొట్టి
యున్నతస్థలమున నున్నయావెన్న
కన్నవారలకిడి కబళించుచున్న
నానందుకులకాంతయరు దెంచి కాంచి      (930)
కానికాని పోదు గానిలెమ్మనుచు
యొఱపైన తనకేల నొకకోలఁబూని
తఱుమబిత్తరుము తత్తరము రెట్టింప
మాటిమాటికిఁ దల్లిమగికంగొనుచు
కాటుక సటుయేడ్పు కన్నీరుజాఱ
రంజితగతిబెదరణసమాన
మంజీరుఁడగుచు నమ్మను జీరికొనుచుఁ
బన్నీరుచిలికిన పద్మంబువోలె
చిన్నారివదనంబు చెవరింపుచుండఁ
జనువానివదనకంజము గాంచి కాంచి        (940)
గనయంబువెడజాఱఁ గాఁగరద్వయము
కూడంగఁబట్టియా కొనెనంచుదూర
నాడకకొట్టఁజే యాడకయున్నఁ
బలుచని చెక్కులపై వెన్నరవలు
కలభోరుకటపద్మ కములననొప్ప
శరదపోతంబుపై శశికళపొలయ
సరవినిబొజ్జను జాఱలు నొఱయఁ
గుండలంబులుముద్దు గునియంగ శౌరి
దండంబువిడకేలి దండంబు విడచి
కన్నవారద లింపఁగా వాడవిన్న       (950)
కన్నవారలు తిట్టఁగా సిగ్గు కాదె
పాలుకల్గినవారు పడుచని కొట్టఁ
జాలరుగానిట్లు సైరింతురన్న
యేలబుద్ధులుకల్గి యెఱుఁగనివాని
లీలనేమిటికి నీలీలఁ జేసెదవు
అనియెత్తికొనిచంకనలిమి ముద్దాడి
మినమిన మనుచెక్కు మీఁటియాబోటి
యకలంకుఁడగు బాలునాత్మగేహమున
నొకచోటఁ బెనురోల నురిద్రాటఁబెనఁచి
కట్టఁబూనిననింత గడమైన నింట      (960)
గట్టిగాఁగలుగుపగ్గ ములనుగ్గముల
ముడుచవేమిడయా సముద్రుండు కట్టు
వడియనేమిటఁ బట్టువడని బ్రహ్మంబు
అంతనా కాంతగేహాంతరంబునకు
నెంతయుఁ బనిగల్గి యేఁగెనేఁగుటయు
మలయుచుఁ గట్టుగంబముతోడనరుగు
కలభమోయననులూఖిల మీడ్చికొనుచు
నరవిందనేత్రుఁడొయ్యనఁ బోయి బోయి
యరిదిముంగిటనుద్దులగు ముద్దులుండ
నాఱోలుతరువుల కడ్డంబు వడఁగఁ    (970)
దూఱికహతిపాద ధూళిబాపాళి
ధూళిగావ్రేళ్ళతోఁ దూఱిభూస్థలిని
గాళిడిగాళిగ్రక్కదలంగఁగూల
నక్షీణమూర్తులై యందుండివెడలి
యక్షహత్యక్షుకాయక్షులేతెంచి
ఫాలసంగత హస్తపద్ములై భక్త
పాలుఁ గృపాళునాబాలు నీక్షించి
కృష్ణ కృష్ణాంబుదకృష్ణ యోగీంద్ర
జిష్ణుసేవితపాద జితసర్వఖేద
ధనదజులమువయోధన దర్పములను    (980)
మునునేము కైలాసముననుండువేళ
ననుబోడుములయంగ నలతోఁడఁ జెంతఁ
జనుగంగ నొనరంగ జలకేలిసలుపఁ
బ్రచురవిద్యావిశారదుఁడు నారదుఁడు
నచటికేతెంచిన నబ్జాక్షులెల్ల
సిగ్గుతోఁ గట్టిరి చీరలేయెగ్గు
సిగ్గులెన్నకమదాశ్రితులమైయేము
సరసీరుహాసనాస్తనసక్తభావ
పరులమై యపగతాంబరులమైయచట
దరిగానకున్న యిద్దఱి భవవార్ధి     (990)
దరిఁజేర్తుననుచు ముందఱి కార్యమెన్ని
కకబింబారాకృతిగలమీరుజగతిఁ
గకుభంబులై గొంతకాలంబు చనఁగ
భక్తవత్సలు హరిపదధూళిశాప
ముక్తులైయటమీఁద ముక్తులయ్యెదరు
అనుచుగీతముఁ బాడియరిగె నమ్మౌని
వనజాక్షమీద యవనజసంగమము
కలుగనందనక నిక్కడనుండముక్తి
గవిగెశాపవిముక్తి గలగుటయెంత
యనినలకూబరుండన మణిగ్రీవుఁ     (1000)
డనఁగమాపేరులో యఘాత్మయనుచు
వలగొనిమ్రొక్కియవ్వల గోచరించు
నెలవులకరిగిరి నృపవర్యులంత
ఆబాలగోపాల మాబాలుఁ జూడ
గాబాలుచేనంద కాయుండితనుచుఁ
జన్నిచ్చిమచ్చిక సందిత గ్రుచ్చి
చన్నిచ్చకొదవు మీఁగడ యిచ్చెనంతఁ
గరమొప్ప నెఱమంట్టి కావిపాలిండ్లు
సరివోరుజట్టుల సరవిబిట్టలుక
కుఱుమాపుఁ బయ్యెదకొక చేరఁజుట్టి      (1010)
చెఱఁగుడాపలిచెక్కు చెంత డాలింప
నకనకలాడునెన్నడుముపైఁ జికిలి
పికిలిపూదండతుంపెసలాడుచుండఁ
దఱచుగాగంపలోతని బండ్లసరము
నెఱిదేఁటులకు విందునెఱవుచునుండఁ
గాయజుమదదంతిగతి నొప్పునొక్క
బోయతయాయతంబుగ నెలుంగెత్తి
వెలదండుతావులు వెదజల్లుచుండు
ఫలములు గొనుకొండు బాలురురండు
అనివీధి వీధులనమ్మ వో యమ్మ         (1020)
యనిశౌరిచేరి పండ్లమ్మెదరనుచుఁ
బొసఁగదోయిలి చాఁచి పోనీకముద్దు
కొసరంగఁ గొసరంగఁ గొలుచు వెట్టినను
సరసిజమధ్యకే సరములపోల్కి
గరపుడస్థలిలోనఁ గరమొప్పగొలుచు
పుడమిమైతల బ్రాలువోసినరీతి
వడివడంకుచుఁ బోవవసుధమై జింద
లోలుఁడై వాని విలోకించుచున్న
బాలులిప్తాబ్జ జంచాలు గోపాలుఁ
జూచిపండులుగొల్చు సురియగుగుగ్గెళ్ళు      (1030)
చూచునాయనిగతిఁ జూచెదేమిటికి
ననుచుబోయెత శితాయత కటాక్షంబు
లనుఁగుఁజిప్పల ఱెప్పలడ్డగింపఁగను
తనగంపలోపలద్దయమెత్తి వింత
తనమింతలేక చెంతన యున్నహరికి
సమ్మతినొసఁగ శిష్టములెల్ల శోభి
తమ్ములై దివ్యరత్నములై యుండె
నొకతియనంతమేదొకటి మాధవుని
నకలంకమతి మార్త్యుఁడర్పించెనేని
గోవిందుఁడ పుడిది గోవిందులనుచు         (1040)
నావలఁ దల్లి రమ్మనఁగ నాడుచును
బాలురతోఁగామ పాకుండుఁదాను
గోలలగతిఁ జిన్ను కోలలువట్టి
పాలబానలనిడఁ బాటించికాంచి
పాలపాపండాల పాలుద్రావెడిని
పొమ్మన్నఁబోఁడెయిప్పుడు వచ్చెనమ్మ
రమ్మురమ్మనుచుఁ గరమ్ముఁ జీరుచును
గలకంఠ కంఠ హుంకారనాదములఁ
గలకంఠ ములలక్ష్మీరకంఠువిద్దఱును
బలుకుచుముద్దుసూపఁగఁ జూచిగోప       (1050)
కులనాధుఁ దాగోపకుల నెల్లఁబిలిచి
పూతనయనెడునపూత చేతనయు
నేతెంచెహరిని మున్నేతగావించెఁ
గాకయప్పటి బండిగావిరక్కసులు
పైకొన్నఁ గడతేరెఁ బద్మాక్షుకృపను
నీతఱిశిశువు ఱోవీడ్చిన వృక్ష
పాతంబుగలిగెనుత్పాతంబుగాదె
ముడువులు పసులకాల్మడినుప్పుదఱచె
దొడువుదొత్రులు కడు దూరంబులయ్యె
వీడుజోడాడెడు విటపిజాలముల            (1060)
మోడులకై పోయె నోడులు సేయ
యీడల నీడల నెండలోకున్న
వాడిగువులు లాగవంతులు దొచ్చు
కాకమువ్వెట్టి కుంగాక ఘాకములు
చేకొన్నబొరియలు చీరుమూరాడు
కసుగందు గందని కసవుతొక్కిళ్ళ
పసివాడె పసులెట్లు వసియించెనిచట
బృందారకానేక బృందావనంబు
బృందావనంబునిల్పుతననందనంబు
పాలింపచిలుక తుప్పుడు పన్నిపూరి       (1070)

(ఇంకాఉంది)

Friday, January 1, 2016

అష్టమహిషీ కల్యాణము -3

(కంసవిచార కథనాది)

నావార్తయెఱిఁగి భోజావనివిభుఁడు
పావకసఖుగూడుపాపకుఁ బోలెఁ
గనలుచు సూతికాగారంబు సొచ్చి
తనయను సంభూతతనయను బట్టి
భువివైవనడుమనే పుటముగానెగసి
దివిఁబాదుకొని నిల్చి దివిజులుమెచ్చ   (510)
గరవాలశూలముద్గర ముఖ్యరుచిర
కరసరోజతాష్టకంబుతో మెఱసి
నీచేతనొత్తునే నీచాత్మ నేను
జీచీతలంపక చేసితి విట్లు
నినుజంపజనియించె నీరదవర్ణుఁ
డని చెప్పుచును మాయమైపోయె మాయ
ఆదటఁగంసుఁడత్యాదరంబొదువ
సోదరిప్రాణేశూ సోదరిఁజూచి
ననుఁజూచి మరువుండునా కల్లయెల్ల
అనిపల్కిగళితబద్ధంగులఁ జేసి    (520)
మంతుకెక్కిన బుద్ధిమంతుల బిల్చి
యంతరంగమున సొంపారి తనునింక
హరియింపనుదయించు హరి విచారించి
హరియింపుఁడేయుపాయంబుననైన
ననుచుగ్రక్కునఁ బంచెనట యశోదకును
దనయుఁడయ్యె నటంచుఁదనయుల్లమంతె
యానందమును బొంద నానందుఁడపుడు
ధేనుసహస్త్రముల్ ద్విజులకునిచ్చి
రమణీయ చీనాంబరముల చేవ్రజము
కమనీయముగనలంకరణమొనర్చెఁ    (530)
దమలోన గోపసంతమసవేణులును
గొమరుచెక్కిళ్లఁ గుంకుమము జల్లుచును
బాలునేతుచిరువాలు వెన్నలును
గాలువలై పారఁ గాఁజల్లులాడి
నీరాడి ముదుకవన్నియ మూరకుఱుచ
చీరలు వెడఁగు కుచ్చెలు వెట్టికట్టి
తోరంపుకొలుకులతొ వింతవింత
పేరులుగలబొట్లు పేరులు వైచి
పలుచనై పసపుతోఁ బదనైనపిండి
తిలకముల్ గోపికాతిలకముల్ దీర్చి       (540)
పొంతలనీళ్లు పేర్పులదోడి పసపు
పొంతలనిడి శిరంబులనెత్తి కొనుచు
నరిగి యశోద నీరార్చినూరార్చి
రరవిరిబాగుల యతివయొకర్తు
కొలని చెంగటిపువ్వు గొమ్మచందమునఁ
గొలని చక్కటిఁ బాదుకొని గద్దెపీఁట
నాసీనయై చరణాబ్జముల్ సాఁచి
పొసరించిన కుచంబులుముదుగునియ
నరలూడ్చుననఁటి వోయననొప్పునూరు
లరగానుపడఁ జేల యమరంగఁ జెక్కి  (550)
కావుకావు మటంచుఖచరులువేఁడఁ
గావుకావనువానిఁ గరములఁ బూని
వారితోఁ బెరయ శైవాలాంకురముల
గారవంబుననలకలు నూనె నెరయ
నివురుఁబోలెడి కేలనెత్తినడ్నెత్తి
నివురంగనంటిమై నింపుగానివిరి
పెసలుఁ గుంకుమ నల్లిబిల్లిహామెదిచి
పసిమిదేఱెడు సూనపసనలంగిడుచుఁ
దేనె తమ్ములముంచితేఁటిమైఁ బోయ
పూనికహరిఁగరంబుల జలంబార్చి   (560)
తావి నేరెడుపండు తలిరులఁ బొదవు
కైవడిఁబయ్యెదకడలినీరొత్తి
కరమొప్ప మణిపేటిఁ గప్రంబునించు
కరణినుంగాయను గదిసి యుగ్గిడుచు
దెలిదమ్మిలోపలతేఁటి చెన్నొదవ
దెలిదమ్మిలోపలతేఁటి చెన్నొదవ
వలిపె పొత్తులలోన వసియింపఁ జేసి
పురుడులేనట్టి యీ పురుషోత్తమునకు
బరుడులేఁడనురీతిఁ బురుడెల్లఁగడపి
పరివేషమధ్య విభాషితుండైన
తరణియోయనఁ దొట్లఁదనరారనుపస       (570)
జీవరత్నము చలించిన మాడ్కిఁతుంటి
క్రేవలెత్తుచు నిరుగేల సామచును
నలయిలాభామకు నభిముఖుండైన
చెలువునఁ బొరలి గొజ్జిగి బోరగిలుచు
జలజాలినడుకప్పు చాయఁగెంగేలఁ
బులుముకాటుక మొగంబునదిట్టవడగఁ
బంకజాకరములో పలియంచకొడమ
క్రేంకారమొనరించు క్రియఁగేరి శౌరి
పెరుఁగవ్రేపల్లె నభీష్టవస్తువులుఁ
బెరుఁగశోభనములుఁ బెరుఁగనందుండు      (580)
పన్నగావలియేటి పన్నగావలి
మునుగానిడఁగోప ముఖ్యులతోడ
గుమికూడి భోజేంద్రుకడకేగివంద
నములు సేయుచునప్పనములు చెల్లించి
కూటమి నొకజోడుకోడలై యున్న
నాఁటి సఖ్యము మదినాటిప్రేరేప
గడగడ నీపుణ్యగరిమనొక్కరుని
గంటిగాయనిమ్రొక్కి కౌగిటఁజేర్చి
చుల్లరవెట్టు కంసుఁడు కోపగాఁడు      (590)
పల్లెనేడొకటికిఁ బడుచులున్నారు
అని వీడు కొలిపిన నరుగుచోనట
జననాథ కంస దుర్జననాధుఁడనుప
శాతనఖాగ్రసంజాతనరీన

(పూతనావృత్తాంతప్రసంగ)

చేతనయగుచు హెచ్చినపూతనాఖ్య
పలవలనగు నూనె పసపునిగ్గులను
దవలుకొత్తువలువనుందల కొంగుగట్టి
తలఁపుకల్మషత నేత్రములకు దొట్టి
చెలువున నిగుడదీర్చిన కాటుకమర
వలుదలై చనుకట్టు వదలఁబాలిండ్లు  (600)
తొలకెఁడుపాలతోఁ దుంపిళ్లుగురియ
మిసిమిమైతనగబ్బు మెఱయించుమసటు
వసతాయెత్తులు సంధివలనొప్పఁగట్టి
పసిడీరేకుబ్బెత్తు పగిదివీడెమును
బొసఁగినిగ్గంలుదేరు పుక్కిటితోడ
నువిగాయవెడనుగాను గుగింజమోవి
నులిచిన పేరు చన్నులమీఁద బెళకఁ
గప్పు మీఱిన పులుకప్పుకెమ్మోవి
గప్పుచుండఁగ నూర్పుగములు నింపుచును
బొమలునిక్కఁగఁ గరమునఫాలరేఖ    (610)
జెమటయూర్చుటుఁగేలఁ జెదరఁ జిమ్ముచును
జడియుచును వచ్చిని జాలబాలెంత
వడువుననందుని వడువునీక్షించి
నివురుగప్పినయట్టి నిప్పుకపోల్కిఁ
బవడించియున్న యబ్బాలుఁ జేకొనుచుఁ
దొడలపైనిడుకొని యొడయంత చఱచి
బిడిబుడి జోలసొంపుగ బాడిబాడి
కొనవేళ్ళదాపలి కుచముగీలించి
ఘనమైన విషమొలుకఁగ వాతనిడిన
నమృతాంశుకులభవుండగు శౌరిరాత్రి     (620)
కమలాగ్రతలము భృంగంబునుబోలి
జెలఁగితీయ్యనినోటఁ జేఁదుమేయంగఁ
బొలుచునేయని పాలబుగ్గలుబ్బించి
కలగితీపైన యక్కరటి ప్రాణములు
జలధిఁ గ్రోవెడుకలశజురీతిఁ గ్రోల
యాతనఁ బూతనయవని పై విగత
చేతనయైఁ రాక్షసీరూపఁ మడరఁ
గూలినదానిపై గుంజరిమధ్య
బాలసింహము మాడ్కి బాలుఁడాడఁగను
గనికనికరమంది గమలాక్షునెత్తి    (630)
కొని కొని వచ్చి మక్కువతోడఁదల్లి
గోపుచ్ఛ గోమూత్రఁ గోరోచనముల
తూపొడిచియుమీఁ దఁదుడిచి బొట్టిడుచుఁ
గమలజహరముఖుల్ గరిమనీపాడ
కమలముఖ్యాంగముల్గాతురటంచు
రక్షగావింప గోరక్షకాధిపుఁడు
నాక్షణంబున వచ్చి యరుదందిదాని
యవిరళకాయంబు నస్త్రశస్త్రముల
లవములు చేసి పల్లవజనుల్ దాను
కడుదవ్వుగావైచికం పలుదుంప        (640)
లడరించియనలుని నడరింప దాని
పొగలెడుకారుక్రొంబొగలు చందమునఁ
బొగసె@ బూతనమోక్షమును బొందెనంత
ఇలదేవతల తలలెత్తింతుననెడు
చెలువున హరిచిన్ని శిరమెత్తియాడె
దనుజాళినీతలా తలయొనరింతు
ననుచందమున నీవలావలఁ బొరలి
యాడెడి చిన్నప్రాయమునందు నందు
ప్రోడయు సంభ్రమమున జలజాక్షు
నవతారతారనీరాచ్చితొట్టులను       (650)
బవళింపఁ జేసి రేపడబండిక్రింద
నొడికంబుగానీడను నిచియాచెంత
బడిబండి పనులవెంబడియుండునపుడు

(శకటాసుర వృత్తాంతము)

సకలకంటకుఁడు కంసఖలాప్తవరుఁడు
శకటనామకుఁడు తచ్ఛకటఁబునందుఁ
గపటవర్తననున్నఁ గపటబాలకుఁడు
కపటపుటాఁ కటంగావుకావునను
జయకాముఁదలుగులు జళిపించిచిమ్ము
క్రియాఁగరచరణముల్ గింజి యాడుచును
లాలాసుధారసోల్లసితమై చంద్రు         (660)
పోలికముఖబింబమును దేజరిలఁగ
దొల్లిబండియు దైత్యును స్రుక్కినేల
డొల్లంఁదన్నివేడుకఁ గేరుచుండి
ప్రియనాదవంచితపికలు గోపికలు
భయపడి బాలుపై బడియెత్తుకొనుచు
జననికిచ్చినలోకజననీసమేతు
మనమునదలపోసిమైకేవ్ల నిమిరి
వెండియునొకనాఁడు వేమాఱుమారు
తండ్రిక్రిందొనరించుతనయు ముద్దాడి
తొడలపై నిడికొన్నఁ దుహినాద్రికన్నఁ  (670)
గడుబరువై యున్న కడనుంచియున్న

(తృణావర్త వృత్తాంతము)

యాసమయమునఁ దృణావర్తుఁడనెడి
యాసురసురగాలియై భోజుఁడనుపఁ
జనుదెంచెచనుఁ బ్రాలుచవిగ్రోలు బాలుఁ
గొనిపోవఁ గానకా కొమరునితల్లి
యడలనయ్యెడమింటనడరునచ్చేగుఁ
బుడమిపై గెడపియప్పుడు దేవసమితి
కొనియాడఁగుత్తు కగుడిచిప్రాణముల్
గొనియాడఁశౌరిఁ జేకొనిచెలుల్ నందు
ప్రోయాలికొసఁగు సొంపునఁజునర్జన్మ    (680)
మయన్నకయ్యె నోమగువలారనుచు
నతిమోదముననున్నపుడు సన్మార్గ
హితుఁడు యాదవపురోహితుఁడు గర్గుండు
వసుదేవు పనుపున వచ్చిననెఱిఁగి
పసులకాపరిఱేడు భక్తి బూజించి
యతఁడు వచ్చినరాక నంతయుఁదెలిసి

(రామకృష్ణాఖ్యనామ కరణప్రస్తావము)

సుతులకు యోగిసంసృతులకిద్దరకు
గరిమఁజేయుఁడూ నామకరణములనిన
గురుసమానీతమార్గుండు గర్గుండు
బలభేదిమారుత ప్రముఖసంత్యుత్య     (690)
పలుఁడై నకతమున బలుఁడనుపేర
గామ జయంతులకంటె లోకాబి
రాముఁడౌకతమున రామనామమున
రుచిరసుధాగాత్రు రోహిణీ పుత్రుఁ
బ్రచురతంబిల్వుఁ డీపట్టునమీరు
హరిణపీతారుణాస్యాంగుండుగాక
హరినీలనిభమూర్తి యగుటఁ గృష్ణాఖ్య
యలవడు శౌరికి ననితెల్పియరిగె
బలుఁడు మర్దితదైత్యబలుఁడును నంత
రవిబింబమధ్య నారాయణాకృతుల        (700)
కవకుందెనలనుండఁగా నేర్చిరంత
హీనుఁ గంసుని జంపియే వీలనుగ్ర
నేనునిల్పుదమన్న శిరులగూర్చుందె
నడుచుధర్మము భూమినాల్గు పాదముల
నడవింతమనుభావనలఁ దొంగెయాడె
మనుజేతరమార్గములు మూమార్గముల్నడక
అనుజూపుగతిఁ దప్పుటదుగులు వెట్టి
మఁదఁటఁగంసు దున్నెదరు వీరనఁగ
మీఁవిపండ్లు మిసమిసగానుపడఁగ
మనుయంత్రాదిపద్మాది మండితాక్షరము    (710)
లనఁబాదముల గజ్జియలు పొందుపడఁగ
అందులమైవలయంబులోయనఁగ
నందియలందమైనను వొందియండ
మెరుపులు చుట్టిన మేఘపోతముల
మురువునగటిసూత్రములు దేజరిలుచు
సురగిరివళిత భాసురతారకాళి
సవిరమైమొలలఁ బూసలపేరులమర
నాగబాలకులు చందనశాఖలందు
బాగొప్పుగతిఁ గీరఫణిభూషలమరఁ
దనయందు నుదయించుధవళాంశుతునుక      (720)
లనఁబులిగోరువింపారంగఁ దాల్చి
హరిదశ్వుఁడద్దంబులందు బింబించు
గరిమతోరావిరేకలు తేటపడఁగ
ఖరుఁగంసుఁ జంపనేక తమాడుశీత
కదభామలనమద్ది కాయలు చెలఁగ
మౌవులతేనెకుముసురుతుమ్మెదల
కైవడినలకలఁ గప్పుమోములు
పూరినానాటి కుబ్బినముద్దుముద్దు
గాఱెనోయనఁ జొల్లుగారనోరెత్తి
కేరపోతముగొణగిన రీతిసొంపు        (730)
దేరఁదేనియలూరఁదెగడిపల్కుచును
గనకాద్రివిహరణ కరిపోతయుగ్మ
మనధూళియుతమూర్తులై పుణ్యములకు
నాలవాలములైన యాలవాలములు
కేలగీలించి జంకించితోలుచును
జోడింతవాయక జోడుకోడియల
జాడనిద్దరునొక్క జాడనాడఁగను
అప్పలప్పలు రమ్మటన్న నాయప్ప
యప్పులుకుటలె సందాయెఁబొమ్మనుచు
గబ్బిగుబ్బెతలలోఁ గౌఁగిళ్ళకురికి     (740)
యుబ్బరంబోడుము లంటియునంటి
కంటెన్నతాణియాగముల యోగములఁ
జెందనిసౌఖ్యంబ్య్ఁ జెందఁ జేయుచును
యిందుశేఖర రవియింద్రాదిసురలు
నొందనిసౌఖ్యంబుఁ నందఁ జేయుచును
గలుషవల్లులద్రెంచు ఘనల విత్రముల
యలపునఁ జింతకాయలు తూలియాడ
గుంపులై చీకటి గుమురుల మూల
దుంపలోయన జడల్ తుంపెసలాడఁ
గొదమవెన్నెలపులుగులు గూఁటనిడిన      (750)
చందురునఁగేల లోచనములుమూసె
యంబుజోదరకేసరాగ్రంబులనగ
నంబుజోదరుఁడు దంతాళిగాన్పించెఁ
కిలకిలనగుచుఁ జక్కిలిగింతచెంత
చెలులొనర్చినగోర జీఱితిట్టుచును
ఘనయోగిమతులఁ జిక్కనివాఁడుగోప
వనితలఁకౌగిల్ల వశమయ్యెనపుడు
పొగడొందుతమదురూపులను జూపులను
బొగడనివారును బొగడుచుండఁగను
దమవిలాసములకుఁ దమముద్దులకును      (760)
బ్రమయనివారును బ్రమసిచొక్కఁగను
అంతవై యింతవై యరిదికూఁకటులు
వింతవై ముడిగూడి వెలయు ప్రాయమున
తనకదిదంటలై తనరు బాలకులు

(ఇంకాఉంది)
(వచ్చేభాగంలో "నవనీతచౌర్యాది లీలావర్ణన)

Monday, December 28, 2015

అష్టమహిషీ కల్యాణము - 2

(భగవన్మహిమానువర్ణన)

ఘనశంఖచక్రసంకలితమౌదాని
దివియనికొనియాడ ద్విజరాజహంస
జవసంచరణముల సమకూరుదాని
నకలంకమగు కుబేరవాసమనఁగ
మకరకచ్ఛపవరమహితమౌదాని
గడలి మీఁగడల నల్గడలను బాల
కడలితాకుల వెన్న గరికట్టుదాణి
చెలువుమై యేటినెచ్చెలువలనవ్వు
పొలపున డిండీరములనొప్పుదాని
గ్రమమునఁజూచిడగ్గఱి సతోషాస్య  (270)
కమలజులై నట్టి కమలజముఖులు
సకలయోగీంద్ర హృత్సత్త్వగుణంబు
లోకరూపమై యిటనొప్పెనోయనఁగ
నమృతంబై గట్టినట్టిమీఁ<గడయొ
కొమరారువెన్నెలకుప్పయోయనఁగ
మున్నీరు తరుమగమొగియైనవెన్న
తిన్నెయోయన నొప్పుతెలిదీవినడుమ
వనజోదరుని కీర్తివల్లివేవగల
ననలొత్తెనననొప్పు నాగేంద్రుమీఁదఁ
బటికపుఁ బెట్టెలోపలి నీలమనఁగఁ (280)
బటుఫణాధరసీమ భాసిల్లువాని
వరనికషాంతరోజ్జ్వలహేమరేఖ
సరవినిందిరయురః స్థలినొప్పువాని
దెలినీటిపుట్టువు తేటయైకరుణ
లొలుకుచుండెడు నేత్రయుగళంబువాని
గమలాప్తవిధుమధ్యగగనమోయనఁగ
గమనీయధరచక్ర ఘనమూర్తివాని
ఏటిజోటికిఁ బుట్టినిండ్లెరాతిఁ
బోటిఁజేసిన పదములనొప్పువాని
శ్రుతిలక్ష్మియూఁగు భాసురపుటుయ్యాల   (290)
గతిఁగుండములచే గరమొప్పువాని
గందువాసిన చంద్రగళలనొప్పు
నిందిరసవతులయెడనొప్పువాని
నహిరాజగరుడసేనాధిపముఖ్య
బహునిత్యముక్తులఁ బాలించువాని
గనిపుటీకృతకరకమలముల్ ఫాల
వనజారిరేఖల వసియింపఁజేసి
జితదైత్యరాజయాశ్రితకల్పభూజ
క్షితిరమాధారరక్షితమౌనివార
ప్రోవులుగాజపంబులు దపంబులును       (300)
గావించి నినుమునుల్గాంచుటయరుదు
అట్టే నీదర్శనం బబ్బెమాపట్టు
పట్టులన్నియునుశోభనమయ్యెనయ్య
దాతవై మాతవై తాతవై మమ్ముఁ
బ్రోతువు నీవయెప్పుడు జగన్నాధ
అని వినుతించి సాష్టాంగంబు లెరఁగి
దనుజారి దనుజాంశ ధరులు భూవరులు
బసలులై జన్నము ల్సన్నముల్ సేయ
విభుదులకుడుపులు విడుపులై పోయె
నేవెరవునైన నిఁకదేవదేవ         (310)
నీవ ద్ఫేవతల మన్నించి యీ వేల
నీజగతీభారమెడలించి కావు
మీజగతిని నిర్జరేంద్రులఁ బ్రోవు
మనుడుఁ బ్రసన్నాత్ముఁడై చెంతనున్న
వంధిమేఖలఁ జూచి వనధితల్పకుఁడు
వలవంతవలదు నీవంత యావంత
నిలువకుండఁగ ఫణినేతతో నేను

(కృష్ణావతార ప్రసంగ)

వసుమతివాసుదేవ వసుధేశ్వరునకు
నసమానబలకృష్ణులనిఁబ్రభవించి
దుష్టశిక్షణమున దుష్టరక్షణము   (320)
దేష్తసంపదయు నదృష్టసంపదయు
నొనరించి సంతోషమొనరింతు నీకు
ననుమానపడవలదణుమాన మధ్య
యని యానతిచ్చిన నవనియు నవని
తనమెల్లనుడిగి యెంతయు వేడ్కనరిగె
వేల్పుఁ బెద్దయు వేల్పు వేల్పున కెఱఁగి
వేల్పులతోఁ దొంటి వీడునకరిగె
రాజేంద్రయటభోజరాజేంద్రుఁడమర
రాజతుల్యుఁడు మధురాజనాధిపుఁడు
విగ్రహజితకామ విగ్రహుఁడనఘుఁ    (330)
డుగ్రసేనుఁడు శాత్రవోగ్రసేనుండు
శూరపుత్రునకరి శూరుచైత్రునకును
ధీరవర్తికి వసుదేవభూపతికి
సావధానంబున నాత్మజ సకల
దేవకీర్తియైన దేవకీ కన్యఁ


(దేవకీపరిణయ కథ)

బరిణయంబొనరించి బహుసీమహేమ
కరిహరులరణంబుగానిచ్చి పనుప
నారామతోఁ బుట్టువగు కంసుఁడింద్రు
తేరు సొంపులఁదేరు తేరుమీఁదటను
నావధూవరులతో నారూఢుఁడగుచు     (340)
దేవతల్ సకల భూదేవ తల్పొగడఁ
బటహభేరితూర్య పటుతరనాద
పటలమెంతయు దిశాపటలంబు నిండ
నరుగుచో నశరీరినాకంసుఁ జేరి
యరుదైన నొక మాటయనియె నీనాతి
యెనిమిదవపట్టి యిలనిన్నుఁబట్టి
తునిమెడి ననబిట్టితోఁబుట్టుగిట్టి
యఱిముఱిపూఁదీవె యఱునవ్రాలు
కఱకునూరంచులకై దువవోలె
బెడిదంపుటడిదంబుఁ బిడికిటి బలిని   (350)
మెడవ్రేయఁబూన యమ్మేదినీ విభుఁడు
భోజేంద్ర నీచేతఁ బొలియునీయబల
రాజేంద్ర సమశత్రు రాజేంద్రగణమె
బయలుమాటలు పాటిపాటించుటెల్ల
నయమౌనె కాకుండినను దీనివిడువు
మీతన్విబిడ్డలు నెల్ల నీచేతి
హేతిఘాతికినిత్తు నిటమీఁదననుచు
నొప్పంగజెప్పియా యొప్పులకుప్ప
దెప్పరంబుడిపి వాడినమోముతోడఁ
బులివాఁతబడి తప్పిపోవు చందమున   (360)
బెలనాఁగతోఁదొంటియింటికేతెంచె

(కంసోపద్రవప్రస్తావ)

అంతగొన్నాళ్లకు నాయింతి కాంతి
మంతుదౌ నొక సుకుమారుఁ గుమారుఁ
గనినం శౌరి యాగసుగందు నెత్తి
కొని కొని కంసుకువలయేంద్రునకు
నొసఁగ సత్యమునకునుబ్బి సంరుద్ద
వసుదేవుఁడంత నావసుదేవుఁ జూచి
యెనిమిదియవ పట్టియేకాక వీనిఁ
బనిలేనిపనిచంపఁ బనియేమి యనుచుఁ
గొమరునితో వీడుగొలిపిన మూర్తి         (370)
రమణతోవిజితపారదుఁడు నారదుఁడు
చనుదెంచి హితవు పిసాళించి నవ్వి
తనవావి తనముచిందగఁ జెవిఁజేరి
సరసిజాక్షుఁడు నిన్నుఁ జంపని లింప
వరుతోయాదవాన్వయమునఁ బుట్టె
మంత్రంబుగాఁగ నిమంతంబు నమ్మి
మంత్రులు నీవుఁ నేమరకుండుఁడనుచు
నరిగెనమ్మౌని భోజావనీవిభుఁడు
పరవీరభీకరాంబకుని నబ్బకుని
విరధీకృతానేకవికటునాశకటు        (380)
నురుకాంతిఁ నిర్జితాహారుఁ జాణూరు
వారిత గంధర్వవరమూరుఁ గూడి
పోరియాదవులతోఁ బోరి జయింపఁ
గొందరు కేకయకు కురుదేశములఁ
జిందరవందరై చెందిరంతటను
చెలియలిబావను జెరసాలఁ జాల
నలుకమై నిగళసంగతులఁ జేయించి
హరిమాయలొదువ నాకతని నేర్పఱుపఁ
దరముగాదనుచుఁ దత్తమునఁగినిసి
మోదంబుతోనటమును మున్నకన్న       (390)
సోదరీసుతుల సూనోపమాకృతుల
నుర్వీశయార్వుర నుడిపి సుపర్వ
గర్వముల్గుదించు కడకమైనుండఁ
గడలేని నెవ్వగ గడలినీఁదుచును
బొడిబడియదుభోజ పుత్రిగర్భమున
నంత ననంతుననంతతేజాంశ
మెంతయు నానాఁటికెదుగుచునుండ
మాయానటుండైన మరుతండ్రియోగ
మాయనీక్షించి రమ్మని యని పిలిచి
దేవియా దేవకీదేవి యందలరు      (400)
పావకాప్తాశనపతియంశమీవు
యందిమిక్కిలి భయమందికాననముఁ
జెందియుండెడి సందుశిఖరంబునందు
నున్నరోహిణియందు యునిచియావందు
నన్నుకన్నియవుగమ్మని వీడుకొలుపఁ
జనిమాయ శేషునియంశముఁ దనమాయ
కనుమాయ సేసి చుక్కల రాజునెడయు
రోహిణిగతిబొల్చు రోహిణియందు
సాహసవృత్తిమై సమకూరఁజేసి
సుదతీకదంబయశోదయశోద     (410)
యుదరంబునందుఁ దానుండె నుండుటయు
ఆరీతి బంధువులాయింతి చూలు
కరగెనేయని కర కరఁబొక్కిరంత
ననుపమ లగ్నంబునందు సుతార
గనియె రోహిణీసుధాకరుఁగుమారుఁ
నలినాక్షు గంసపంసకుఁడుగాగల మాధవుండు
కంసానుజాగర్భగతుఁడయ్యె నంత
నవ్వులెంతయు మించెననఁగ
వెలఁదియైయొప్పె నవ్వెలఁదినెమ్మోము
కలువతూఁడులుదాఁకి కందినకోక      (420)
ములముక్కులనఁ జన్నుమొనలఁగప్పొదవె
దివిఁ బాదుకొని నిల్చుతేఁటిచాలనఁగ
నవిరళరేఖగానారుచెన్నారుఁ
గమలేశవిముఖుడౌ కంసుని దోసి
యుమిసినరీతిఁ జిట్టుములుబెట్టయ్యె
హరికిఁగా పై చుట్టినట్టినాగేంద్ర
కరణి నొప్పుచునున్నకాంచియుబిగిసె
అంతరీకృత హరిణాంకబింబంబు
వింతయై యుదరంబు వెలసెనంతటను
చక్కనికర్ణభూషణ చకచకలు      (430)
చెక్కులఁ జెక్కులఁ జికిలి గావింప
బంగారురెంటెంబుపై మిసమిసలు
నింగిమై మెఱపులనెఱిఁ జూపుచుండఁ
గనుపట్టు వనమాలికారుచుల్ గగన
ఘనచక్రకోదండ ఘనతవహింప
వరవీరరసరేఖ వడువననెదను
సిరియొప్పునాచెంత శ్రీవత్సమలర
నతులితశంఖచక్రాదిదివ్యాస్త్ర
యుత బాహుయుగయుగముతోఁ జెలఁగి
తొలిదెసఁగనుపట్టు తుహినాంశుపగిది    (440)
నలరి దేవకియందు నతులలగ్నమున    

(శ్రీకృష్ణావతారమాసాదిప్రశంస)

శ్రావణమేచకాష్టమివిధితార
నావిర్భవించె శ్రీహరినడురేయి
ద్విజరాజవిష్ఫూర్తి దివిభువిఁదనర
నిజప్రతిబొరలెనెన్నెరి మౌనివరులు
సురలునుతింప నాసురులుగంపింప
విరులవానలజళ్లు విడువకకురిసె
నానకదుందుభి యాభోజసుతయు
ఘటితహస్తాబ్జసంఘటిత ఫాలేందు
నిటలువై వేడ్కలనిక్కి చొక్కుచును     (450)
గమలాకళత్ర నక్తంచరజైత్ర
భ్రమరశోభనగాత్ర భక్తబ్జమిత్ర
ఘనతరదివ్యయాగముల యోగముల
నినుగానఁ గాలేరు నిర్జరులైన
ద్విజరాజు దినరాజు దిక్కోణవరులు
అజునికాయజుని సర్వాత్మజాలంబు
గన్ననీనిజమూర్తి గన్నమాకోర్కి
కన్ననెక్కువయేది కమలాక్షయన్న
మును మీరు వరతపంబుల చేసి చేసి
ననుఁబోలు సుతువేడి ననుమెచ్చియేను   (460)
బరుఁడెవ్వఁడును బరాత్పరుఁడనే నాకుఁ
బరుడువేఁ డనియేనుపొడమితి మీకుఁ
బదరకుఁడికఁదుది పదముగాఁ గీర్తి
పదమును వైకుంఠపదము మీకిత్తు
సంతతపౌంశు నృశంసునాకంసు
నంతకుఁగూల్చెద ననుమానముడిగి

(భగవన్మాయావృత్తాంత)

నందుపాళెమునందు నామహామాయ
నందుదేవికిఁబుట్టె నన్నుమీరటకుఁ
గొని పోయియునిచి యాకొమరితనెట్టి    (470)
కొని వచ్చియిటనెలకొని యుండుఁడనుచు
నరబాలుఁదయ్యెనో నరపాలయంతఁ
గరములనాబాలుగైకొని శౌరి
తుష్టుఁడైనువస్తువుల వోకైక
దిష్టంబుగూర్చి యథేష్టంబుగాఁగ
విబుధులువొగడంగ విబుధులకిచ్చి
యబలనచ్చటనుంచి యటవోవఁదలఁచి
మురవైరిఁగని పాపముల వీడునట్లు
సరగుశృఖలల్ సడలుచువ్రేలఁ
దలవరుల్సంసారతమములో మునిఁగి
తెలియని గతినిద్రఁ దెలియకయుండ    (480)
వాటంబులగుచు గవాటంబు వెల్లఁ
జోటిచ్చి తెరువులు చూపంగ వెడలి
హరియభ్రకరుల శంపాంకుశాహతుల
బెరయింప మొఱవిడుపేర్మినురుమగను
అసమమై కంసకృత్యముల భీభత్స
రసము లోకములసాంద్రతఁగప్పెననఁగఁ
గఱటిచేతల కంసు ఖలునకపకీర్తి
నెఱసెనోయననిరుల్ నెరసికార్కమ్మ
ననిమిషానందభాష్పంబు కణంబు
లనఁజిటి పొటి చింకులవనిపైరాల     (490)

(వసుదేవభయ నివారణ)

వసుదేవభయతమోవారణుఁడగుచు
పసురుమావులఱేని పగిది శేషుండు
బెడిదంబులగు శౌరి బిరుదముల్ దాల్చు
పడగలగతిఁ బొల్కుపడగలఁబొదువ
బిసనికాయమున గంభీరతోయమున
నసమానమైన యాయమున మార్గంబు
విడిచినఁ గడతెంచి వేవేఁ గొల్ల
విడిపట్టునడునందు విచుపట్టుసొచ్చి
నిదురించునందు మానిని సెజ్జఁబెట్టి
పదిలుఁడై నట్టి యాపఁడతు తుకపట్టిఁ   (500)
జేకొనిహరిమాయజరసాలఁదిరుగఁ
జేకొని తొల్లింటి తెల్లింటిచెలువుననుండ
మాయపు బిడ్ద పల్మారువాపోవ
నాయెడదౌవారికావలిచేత


(ఇంకా ఉంది)

Monday, December 21, 2015

అష్టమహిషీ కల్యాణము - 1

అష్టమహిషీ కల్యాణము
(తాళ్ళపాక అన్నమాచార్యుల మనవడు తాళ్ళపాక తిరువెంగళనాథసూరి విరచితము)
(ద్విపద కావ్యము)

-: ప్రథమాశ్వాసము :-

శ్రీయలమేల్మంగఁ జిరకృపాపాంగఁ
గాయజుమాత సాగరతనూజాత
శ్రీవేంకటేశకాంక్షితకుచదేశ
జీవనభవపాణి శ్రీకరవాణిఁ
గనకశోభనగాత్రఁ గంజాతనేత్ర
ననుపమాయతవేణి నఖిలకల్యాణి
హారిభూషణజాల నర్ధేందుఫాలఁ
జారుగుణశ్రేణి సైకతశ్రోణి
నరుణకోమలపాద నభినవామోదఁ
బరమయోగిధేయ బ్రహ్మాదిగేయ (10)
నెఱయంగఁ జాబిల్లి నిండువెన్నెలల
మఱపించు తెలిమించు మణుగొప్పగట్టి
మంచికుందనపుఁ దామరగద్దెమీఁద
నంచితపద్మాసనాసీనయగుచుఁ
గరినాయకులు రత్నకలశామృతంబు
నిరుమేలఁ జిలుకదేవేంద్రాదినిఖిల
సురగరుడోరగస్తోమంబుగొలువఁ
గరమొప్ప వరదానకరమొప్ప నభయ
కరమున శోభనాకరమై చెలంగ
సరసిజంబులురెండు సవరించుహస్త (20)
సరసీజంబులుగల్గి జలజాక్షుఁగూడి
తిరమొందు జననినిందిరనాత్మఁ దలఁచి
శ్రీవేంకటేశుడై చేలప్రకాశు
దేవాదిదేవును ధీరప్రభావు
లలితసౌందర్య లీలాభూమిభూమి
నలకషట్మదజితహరినీలనీల
ఘనసహస్త్రార హూంకారదివ్యాస్త్ర
కనకమయాంశుచక్రంబుఁ జక్రంబుఁ
బాలితజన్యంబుఁ బాంచజన్యంబు
నాళీకనాభ నందకము నందకముఁ (30)
గనదటినీమూలఖచితేంద్రనీల
ఘనకాంతి విజితశార్జ్గంబు శార్జ్గంబు
వేదాదివిద్యాప్రవీణమౌనీంద్ర
మోదకదివ్య కౌమోదికినాత్మఁ
బ్రణుతించి గణుతించి భక్తిసేవించి
గణనీయభోగవిశేషు శేషు
జితమత్త దైతేయు శ్రీవైనతేయు
శ్రుతిదామగళదేశు సూత్రవతీశు
నురుతరభక్తి నిత్యులను నిత్యులను
గురుతపోలబ్ధ ముక్తులను ముక్తులను (40)
క్ష్మానుత ద్రావిడాగమసార్వభౌము
లైనమావారల నాళువారలను
మానితసిద్ధాంతమార్గసల్లలిత
మానుజాచార్యు రామానుజాచార్యు
సతతనిర్జిత సూనశరుఁబారాశరుని
నతులితనిగమవాక్యవ్యాసు వ్యాసుఁ
బాయకహరిభక్తి ప్రబలినతపసి
రాయనియల బాదరాయణిసతత
హరిపాదమతుల మహాభాగవతుల
నరసి నుతించి సాష్టాంగంబు లెఱఁగి; (50)

(కవివంశావళి వర్ణన)

తతమానసార్ణవోత్పన్నకాకుత్థ్స
పతికథామృతపానపరమసమ్మోద
పరమౌనిపదభక్తిభరభరద్వాజు
వరగోత్రజుఁడు నందవంశభవుఁడు
హరిభక్తుఁడాశ్వలాయనసూత్రశాలి
పరమవిద్యాసింధు పారంగతుండు
వనజాతజాతసర్వసురేంద్రముఖులు
గనలేని వేంకటగ్రావాధినాధు
పదములు శోభనాస్పదములౌ తనదు
పదములు బహుదేశపదముల జనులఁ (60)
గనఁజేసి పంచమాగమసార్వభౌముఁ
డనఁబ్రసిద్ధికినెక్కి యఖిలవిద్యలను
నన్నయాచార్యుండె యనఁదాళ్ళపాక
యన్నమాచార్యుఁడాయత కీర్తిఁజెలఁగె
ఆధీరమతికిఁ దిమ్మాంబ యక్కాంబ
శ్రీధరాధీనలౌ శ్రీధరాసతుల
కరణి నిద్దఱు కులకాంతాలలామ
లరయఁ దిమ్మాంబకు నాత్మసంభవుఁడు
పాడఁజెప్పగవర్ణపద్ధతి నీడు
జోడులేఁడని సభసొచ్చివాదించి (70)
పరఁగినధీశాలి ప్తరివాదిదైత్య
నరశింహుఁడఁనగల్గె నరసింహగురుఁడు
అమ్మహాత్మునకుఁ దొయ్యలులునాచారి
యమ్మ యనంతమ్మయనఁ బొల్చిరందుఁ
జారులక్షణకు నాచారియమ్మకును
నారాయణుఁడు రూపనారాయణుండు
గలిగె ననంతాంబ గర్భమునందు
నలఘుతేజోమూర్తి యప్పలార్యుండు
హరిపరాయణచిత్తు డన్నమార్యుండు
నురుకీర్తిమంతులై యుదయిందిరెలమి (80)
అక్కలాబుధికన్యయన నొప్పునట్టి
యక్కలాంబకు సుముఖాబ్జిబింబకును
గరిమ నంబుధిసుధాకరుడు జన్మించు
సరలిమై తిరుమలాచార్యుండువొడమె
నరసతిసన్నిభ నరసమాహ్వయును
స్థిరకార్యకీర్తియౌ తిరుమలాంబయును
జనియించిరురుయోగసామ్రాజ్యవిభవ
జనకుఁడా తిరుమలాచార్యవర్యుండు
వేదాంతవిద్యా ప్రవీణుడై యాంధ్ర
వేదాంతమొనరించె ద్విపదరూపమున (90)
హరివంశకావ్య మాయతరసస్ఫూర్తి
హరివంశమిగురొత్త ననువొందజెసి
చక్రవాళములోన సరిలేదనంగఁ
జక్రవాలముగ మంజరి రచియించి
శ్రుతులచిక్కులుదీర్చు శుకతాతవోలె
సతత రేఫఱకార సరణులేర్పఱిచి
సంగీతసాహిత్య సర్వజ్జకత్వ
మంగళసామ్రాజ్య మహితుఁడై యలరె
మండెముకోటలో మండలంబెఱుఁగ
మండలాగ్రాహతి మండితపుష్ప (100)
దామమై ధర్మాంగద స్థితిఁబొలిచె
నేమహామహునియహీనగాత్రమున
నాపావనాత్ముని యంగనామౌళి
రూపపాతివ్రత్య రుచిరభావముల
సరసిజాలయఁబోలు సాధ్వీలలామ
తిరుమలాంబయనంగఁ దేజంబుమెరసి
యరుదందనయ్యింతి యల పంచకల్ప
తరువులునానొప్పు తనయరత్నములఁ
జారుతరాష్టభాషాచక్రవర్తి
ధీరుని బినతిమ్మదేశికోత్తముని (110)
యన్ని పద్యలయందు నరయ మున్నింటి
యన్నయార్యునిబోలు నన్నయాచార్యు
సాత్త్వికశుభమూర్తి సంగీతసత్క
విత్వాధికుని దిరువేంగళాహ్వయుని
జయయుత శ్రీలబ్ధ సహజకవిత్వ
నయు తిరువేంగళనాధుని నన్ను
సదమల విద్యావిశారదు లోక
విదితుని గోనేటివేంకటనాధుఁ
గనియె వారలలోనఁ గావ్యంబుఁజెప్పి
యెనలేని శ్రీవేంకటేశు మెప్పించి (120)
సకలంబునెఱుఁగ నసాధారణాంక
మకరకుండలము లిమ్మహిఁ గొన్నవాఁడ
దినములలోననె వేయిద్విపద లింపొంద
వినుతవర్ణనలతోడ విరచించువాఁడఁ
గవిశిరఃకంపయోగ్య ప్రతిద్విపద
నవబిరుదాంకుండ నాళీకసదన
వాసినీవేంకటేశ్వరపాదపద్మ
వాసనాలోలుపస్వాంతషట్పదుఁడ
వినురశీలుఁడఁ దిరువేంగళనాధుఁ
డనుపేరఁ బ్రఖ్యాతినందినయేను (130)

(ద్విపద లక్షణము)

వాసవుల్మువ్వురు వనజాప్తుఁ దొక్కఁడు
భాసిల్లు నదియొక్క పదము శ్రీకాంత
క్రమమున నీనాల్గు గణములనడచుఁ
గ్రమదూరముగఁ ప్రయోగముసేయరాదు
ఆపాదమునకు మూఁడవగణంబాది
దీపించు యతి యంబుధిప్రియతనయ
యుపమింపనవి ప్రాసయుతములై రెండు
ద్విపదనావిలసిల్లి వికజాబ్జపాణి
ద్విపదకు ద్విపదకుఁ దెగఁ జెప్పవలయు
నెపుడు సంస్కృతమున నితరభాషలను (140)
యతులలోపలఁ బ్రాసయతి దక్క సకల
యతులుచెల్లును బ్రయోగాను సారమున
ద్విపదతో ద్విపద సంధిలనేకశబ్ధ
మపుడురెంటనుగూర్ప నదియయుక్తంబు
మఱుయుసంస్కృతపు సమాసరూపమున
నెరయనెన్నిటినైన నిర్మింపదగును
తెనుఁగునఁ గూర్చిన ద్విపదయంత్యమున
నొనరఁ గ్రియాంత సముచ్చయంతములఁ
దనరు నకార ముత్యముగూడెనేని
వినుతింప నుత్తర ద్విపదాదియందు (150)
గొనకొన్నస్వరముతోఁ గూడఁగాదనుచు
నొనరింప సుకవీంద్రులుద్దండమండ్రు
అరసున్ననొనఁగూర్ప ననువైనహల్లు
గరిమనీద్విపదాదిఁ గనుపట్టెనేని
తొలివిభక్తికిఁదక్కఁదుదివిభక్త్యంత
ములు నకారములును ముకురబింబాస్య
యానకారముచెల్లు నరసున్నలగుచు
నానీలకచభృంగ యలమేలుమంగ
యనులక్షణంబుల ననువొంద సుకవి
జనసుప్రయోగైకశరణమై నిఖిల (160)
జగదేకనుత విరాట్ఛంధోవతీర్ణ
యగుచునే ద్విపదవిఖ్యాతిచెలంగ
వితత తల్లక్షణ ద్విపదమార్గమున
మతినెన్ని కృష్ణాష్టమహిషీవివాహ
కృతియొనర్చెదఁ జమత్కృతి సంఘటింపఁ
జతురశృంగార వాచాప్రౌఢిమెఱసి

(కవి కావ్య ప్రశంస)

చికిచికియెఱుకలఁ జెప్పంగలేని
కుకవులకెల్ల మక్కువతల్లి జల్లి
చుట్టుప్రోవులఁ గొలుచులుఁ గూడఁబెట్టి
దిట్టకూళలకుఁ బూదియలు గాదియలు (170)
కొంకక తనునోరికొలఁదులఁబలుకు
మంకుఁబోతులకు గ్రామ్యంబు సామ్యంబు
ఆరీతినుడువక యలఘుశబ్దార్ధ
సారసరీతిరసప్రభావముగఁ
గులికి కస్తువీనెఁగోసినకరణిఁ
విరవాదిపొట్లంబు విడిచినమాడ్కిఁ
బరిమళించుచు గవుల్ బళిబళియనఁగఁ
గవితచెప్పిన సులక్షణునిఁ గవీంద్రుఁ
డవునందురే నేర్చినట్లు చెప్పెదను (180)

అష్టమహిషి కల్యాణ కథారంభము
(గ్రంథాంకితము)

అలమేలుమంగ మోహనకాంచనాంగ
నెలమి మత్కృతికి నధీశ్వరిఁ జేసి
దరహాసవతికి భూధవళాక్షి సవతి
కరుణ పల్లవపాదకలఘమోదకును
హిమధామవదనకు హేమాబ్జసదన
కమృతభాషణకు బ్రహ్మాదిపోషణకుఁ
గృష్ణనపాయని కిష్టదాయినికి
గృష్ణాహివేణికిఁ గీరవాణికిని
అవితదీనకుఁ గలహంసయానకును
భువనరక్షణకును బుణ్యలక్షణకు  (190)

నంకితంబుగను గావ్యంబుగావింతు
నింకఁ దత్ప్రారంభ మెయ్యది యనిన
నవిరళమన్మనసాంబుజ నిలయ
యవధరింపుము వెంకటాధీసురాణి
శుకయోగిఁగాంచనాం శుకయోగిఁగాంచి
యకలంకగుణుడైన యభిమన్యుసుతుఁడు
మౌనీంద్ర యాదేవ మౌనీంద్రసుతుఁడు
దానవారాతి యాదవ వంశమునను
జనియించె నంటివి జలజాక్షుఁడెట్లు
జనియించె నేమేమిసకిపె లోకమున      (200)

మహిమ మీరంగ మన్మధువైరి యష్ట
మహిషుల నేరీతి మహిఁబెండ్లియాడె
నాలచ్చిమగని కథామృతాంభోధి
నోలలాడింపవే యోతండ్రియనిన
రాజుఁగన్గొని యోగిరాజు రాజేంద్ర
రాజీవదళనేత్రురాజితకథలు
వినగోరునట్టి వివేక సంపన్ను
లనయంబువారెపో యఖిలపావనులు
నీవు నా హరికథలెఱుగఁ గోరితివి
గావునఁ బుణ్యసంగతుఁదవై వినుము   (210)

మునుపు పల్కుల తుదల్మునుముట్టఁజదువు
జనుల దుర్జనులునిచ్చలుబాధసేయ

(భూమిదేవి కష్టదశ)

నీరదిసురనరనికరశైలాది
ధారణియైన యాధారిణివగచి
కనలి వేల్పులగమికాని చెంగటికిఁ
జని యింద్రుఁ జూచి వెచ్చనియూర్పుతోడ
నగసమూహముల బన్నగసమూహముల
నగజాలముల సర్వఖగజాలములను
నిధులను సకలాంబునిధులనుమోచి
బుధకంటకు లక్షణమును మోవలేను  (220)
సాధుబాధకులచే జడిసితినింక
నేధీరిచేఁదీరునీభారమన్న
మున్నీటి మొలనూలి ముదితయేయి
కన్నులమేటి సంగడివారుఁ దాను
బాటీరశశికాంతిఁ బాటించుమేని
జోటిఱేఁడున్న యచ్చోటికేతెంచి
యపుడు కోరకితకరాబ్జుఁడై పలికెఁ
గపటమానసులు నిష్కపటమానసులు
తపములజపముల ధర్మకర్మముల
విపరీతముగఁజేయ విసిగి యా ఘనుల    (230)

దెసఁజూడలేక నీదెసకేగుదెంచె
వసుధాంబుజాక్షి యోవనజాతజాత
అనవిని జననికి నాతమ్మిచూలి
వినతుఁడై వినుతిగావించి సేవించి
మాపాలగలవాఁడు మాపాలగలఁడు
నీపాలగలఁ డవనీదేవియనుచు
వాణీవిభుఁడు శర్వాణీధవుఁడు
నేణాంకసారసహితులు దిక్పతులు

(క్షీరాబ్ధిగమనము)

మునులునేతేరంగ మునుమున్నుపుడమి
ననబోఁడితో సితార్ణవమునకరిగి  (240)
శతకోటి శతకోటి చకితాత్మగర్భ
గతపర్వతంబులు నాగంబులుగాగ
ఘనమీనవాలాగ్ర ఘట్టనాజస్ర
జనితశీకరతతుల్ నపరముల్గాఁగ
శ్రీకరోన్నతి వికసిత నూత్న పుండ
రీకముల్బహుపుందరీకముల్గాఁగ
నలఘుతరోగ్రరావాంచిత వివిధ
జలచరజాలముల్ సైన్యముల్గాఁగ
......... పికధ్వనులు
కరమొప్ప వందిమాగధ నుతుల్ గాఁగ  (250)
పరివృతభూజబంభరవికల్ గాఁగ
పట్టభద్రునిగతి భాసిల్లు కడలి
పట్టుఱేనికి డెంకిపట్టైనదాని
హరికిచ్చు మౌనిహస్తార్ఘ్యంబులనఁగ
నరవిందములఁ తేనియలనొప్పుదాని
గరిమనాకులఁబిల్చు కరములోయనఁగ
సురుచిరాలోలవీచులనొప్పుదాని
దనుజారి నిజపదధ్యానంబుసేయ
మునుల బకజాలములనొప్పుదాని
వనజాతలోచన వరభక్తలీల  (260)

(ఇంకాఉంది)

Sunday, December 13, 2015

లక్ష్మణదేవర నవ్వు -3

అడవులకు వెళ్ళినా అచ్యుతుండితడు! ఆమహారాజుకే అవిజయమైనా!
భరతుడు మహారాజుని జూస్తిరాయనెను! ఉత్తమైనాఆశ్వాల్ని యెక్కిఉన్నారు!
అర్కతేజముకంటె మిక్కిలిగవెలుగు! సౌమిత్రితమ్ముడే శతృఘ్నుడనిరి!
భరతుడుసౌమిత్రి శతృఘ్నుడును! వచ్చిరనిహనుమన్న ముందారజెప్పె!
ముమ్మారువలగొని ప్రదక్షిణముజేసి! సాష్టాంగదండ నమస్కారములుజేసె!
పాదములపైనున్న కొమాళ్ళనెత్తి! దీవించితల్లులూ దేవవాక్యమున!
సతులతోసౌభాగ్య పదవనుభవిస్తు! అభివృద్ధిపొందండి అయోధ్యలోను!
భరతుడుసౌమిత్రి శతృఘ్నుడును! వచ్చిరనిహనుమన్న ముందారజెప్పె!
ముమ్మారువలగొని ప్రదక్షిణముజేసి! సాష్టాంగదండ నమస్కారములుజేసె!
పాదములపైనున్న తమ్ములనుయెత్తి! దీవించె శాంతమ్మ దేవవాక్యమున!
సతులతోసౌభాగ్య పదవనుభవిస్తు! అభివృద్ధిపొందండి అయోధ్యలోను!
భరతుడుసౌమిత్రి శతృఘ్నుడును! వచ్చిరనిహనుమన్న ముందారజెప్పె!
ముమ్మారువలగొని ప్రదక్షిణముజేసి!పాదములపైనున్న మరదులయెత్తి!
దీవించెజానకి దేవవాక్యమున! సతులతోసౌభాగ్య పదవనుభవిస్తు!
అభివృద్ధిపొందండి అయోధ్యలోను! భరతునిహస్తంబు తాబట్టుకొని!
భరతుడానీవెంత బుద్ధిశాలీవి! తమ్ములు అయినాను మీరెసుమీమాకు!
మరదులూయిన మీరెసుమీమాకు! సహోదర్లులేక తమరిప్పిడూను!
అభ్రాతృకన్యలము అయివుంటిమనిరి! భరతుడుమాళవీ యిల్లడానెను!
సౌమిత్రిహస్తంబు తాబట్టుకూని! సౌమిత్రినీవెంత బుద్ధిశాలీవి!
తమ్ములుయైనను మీరెసుమీతమకు! మరదులు అయినాను మీరుసుమీతమకు!
సహోదరులులేక తమరిప్పిడూను! అభ్రాతృకన్యలము అయివుంటిమనిరి!
సౌమిత్రీఊర్మిళా ఇల్లడ అనెను! శతృఘ్ను హస్తమ్ము తాబట్టుకుని!
శతృఘ్నుడానీవెంత బుద్ధిశాలీవి! తమ్ములుయైనను మీరెసుమీతమకు!
మరదులు అయినాను మీరుసుమీతమకు! సహోదరులులేక తమరిప్పిడూను!
అభ్రాతృకన్యలము అయివుంటిమనిరి! ముగ్గురువెనుకను అబలసుమియన్న!
మూడుమాటలమీరు తప్పులెన్నకుమి! ఒకమారుతాంబూల మియ్యవచ్చినను!
వద్దనిశతకీర్తి వూరకేయున్న! గర్వియనితోచకుమి నీమనసులోను!
రెండవమాతికే పలికినగాని! గంద్రనితోచకుమి మీమనసులోను!
ముగ్ధలుగారటోమీరుజానకీ! మీవెనుకచెల్లెళ్ళు ముగ్ధలేగార!
కురులుగూదనిముందు కుంకట్లుకురుచా! పతితోనూడవులకు యేగీనదానవు!
మాయామృగమునుబట్టితెమ్మన్నదానవు! ముగ్ధలుగారటోమీరుజానకీ!
మీవెనుకచెల్లెళ్ళు ముగ్ధలేగార! అనియిట్లుశతృఘ్ను పలుకగావినుచు!
తలవంచుకొనిసిగ్గున తానూరకుండె! తలవంచుకనిలుచున్న కోడలనుజూచి!
కౌసల్యయేతెంచియిట్టనిబలికె! ముగ్గురువెనుకను నుండడేవీడు!
మూడుమాటలు ఆరుతప్పులెరుగాడు!గాండ్రపుపలుకులు పలుక నేటికి!
అనియిట్లుజానకిని ఆడనేటీకి! తల్లన భాషలు తనయునకుదెలసీ!
ముమ్మారువలగొని ప్రదక్షిణముజేసి! సాష్టాంగదండనమస్కారములుజేసె!
యెందుకుజానకీ వప్పగిస్తావు! చెల్లెళ్ళునిన్నేమి యుద్ధరిస్తారు!
శతృఘ్నుడుశతకీర్తి యిల్లడ అనిరి!ముత్యాలచౌకిలో రత్నాలపాన్పు
పణతులుభరతునికి ఆయత్నమనిరి! బంగారుచౌకిలో రత్నాలపాన్పు!
చేడెలు సౌమిత్రి కాయత్నమనిరి! చిలుకచిత్రపుమేడ చంగల్వపాన్పు!
చేడెలు శతృఘ్నుని కాయత్నమనిరి! మాళవిఊర్మిళా మగువ శతకీర్తి!
వచ్చిరనిహనుమన్నముందరజెప్పె! ముమ్మారువలగొని ప్రదక్షిణముజేసి!
సాష్టాంగదండనమస్కారములుజేసి! పాదములపైనున్న కోడళ్ళనెత్తి!
దీవించిరీత్తలు దేవవాక్యమున! పతులతోసౌభాగ్య పదవనుభవిస్తూ!
అభివృద్ధిపొందండి అయోధ్యలోను! మాళవిఊర్మిళా మగువ శతకీర్తి!
వచ్చిరనిహనుమన్న ముందరజెప్పే! ముమ్మారువలగొని ప్రదక్షిణముచేసి!
సాష్టాంగదండనమస్కారములుజేసి! పాదములపైనున్న చెల్లెళ్ళనెత్తి!
దీవించెజానకీదేవవాక్యమున! పతులతోసౌభాగ్య పదవనుభవిస్తూ!
అభివృద్ధిపొందండి అయోధ్యలోను! మాళవిహస్తంబు తాబట్టుకుని!
మాలవీనీవెంత బుద్ధిశాలీవి! భరతునివంటీ పతినిగలుగుటకు!
నీవుచేసినపూర్వ పుణ్యమేతల్లి! అతిపరాక్రమశాలి అమ్మనీవిభుడు!
మనసులోమరిజాణ వాడుసుమి అతడు!భరతునిచిత్తాన గురుతెరగితిరుగు!
ఊర్మిళహస్తములు చేతబట్టుకుని! నీకేమిజెప్పుదును నేను ఊర్మిళ!
నీవు ఎరుగవటమ్మ బుద్ధిశాలీవి! అతిమాటకారియౌ అమ్మనీవిభుడు!
వసుధలోమరిజాణ వాడుసుమి అతడు! సౌమిత్రిచిత్తమును గుర్తెరిగితిరుగు!
శతకీర్తినీజూచి యోతానుజానకి! శతకీర్తిహస్తమును చేతబట్టుకొని!
నీకేమిజెప్పుదును నేను శతకీర్తి! నీవు ఎరుగవటమ్మ బుద్ధిశాలీవి!
పుయ్యమనక చందనమునుపుయ్యబోకుమీ! పుయ్యమంటేనీవు వూరుకోకుమి!
ఒకమారిఉతాంబూల మియ్యవచ్చినను! వద్దనిశతకీర్తి వూరకేయుండ!
రెండొమాటికే బిలచినగాని! పలుకుమీశతకీర్తి పద్మాయతాక్షి!
బంగారుపావాలు తొడగరేతల్లి! వెయ్యవేమిపతి వవ్వారిలోకి!
వారివారిపాన్పున గూర్చుండబెట్రి! ఆశీర్వాదముచేసి అక్షంతలిచ్రి!
శతకీర్తినిబంపక తానూరకుండె! శతృఘుడేతెంచి యిట్లనిబలికె!
అమ్మరోవినవమ్మ అమ్మకౌసల్య! నీముద్దుకోడలిని చెప్పంపవమ్మా!
చెలికతైలాతోను ఆడుచున్నది! ఎత్తుకుపొమ్మని వెలదితాబల్కె!
చెలికత్తెలాతోఆడేటి శతకీర్తిజూచి! శతృఘునిపాన్పున ఆడుదువురమ్మి!
అనియిట్లుకౌసల్య చయ్యనబిలుచుకొని! శతృఘ్నునిశయ్యకు తానుబంపించె!
శతకీర్తివచ్చేటి తేజమ్ముజూచి! కంచుశ్రీస్తంబాలు కాంతులుమణిగె!
మాణిక్యపుదిపాలు మరివెలుగవాయె! శతృఘ్నునిపానుపున గూర్చుందబెట్రి!
ఆశీర్వాదముచేసి అక్షంతలిచ్చిరి! మాణిక్యాలఘడియలు శాంతమ్మబెట్టె!
రావోయిహనుమన్న వాయునందనుడా! శీఘ్రమునజానకి నగరికేతెంచు!
శృంగారముగాను వేంచేయుమనుమి! ఆమాటవినియపుడు సంతోషమునను!
శీఘ్రానజానకీ నగరుకేతెంచె! అమ్మశ్రీరాములు నన్నంపినారు!
శృంగారముగాను వేంచేయుమనుమి! ఆమాటవిని యపుడు సంతోషమునను!
ముత్యమ్మునాకురులు మురిపానవిప్పి! పగడంపునాకురులు బాగుగాదువ్వి!
చెంపకొప్పుబెట్టి చెలియజానకి! ముడిచెనాకొప్పులో మోదమలరగను!
మొగలిరేకులుజుట్టె మోదమలరగను! భండారమేలేటి ప్రజలబిలిపించి!
తాళములచేతనే పెట్టెలుదీయించి! భరణెలు దెప్పించి పైకప్పులుదీసి!
ఘట్టిమెట్టెలుబెట్టి కడియముబెట్టీ! అందెలుచరణారవిందములబెట్టె!
చిటికినబొద్దులుబెట్టి పిల్లేళ్ళుబెట్టి! బొబ్బిలికాయలే వీరమద్ణులను
అన్నవేళ్ళకును అమరించినారు! సుద్ధసువర్ణాన చేయించినట్టి!
సుడిగాజులుబెట్టె సుదతితనచేత! చేమపూకడియాలు హస్తకడియములు!
చెన్నుమీరగసీత చేతులనుంచే! నవరత్నఖచితమున సరులొప్పుచున్న!
గిరిగిరంబులునుంచె తనుఆకాంత! ఇంద్రకావిరవికలు ఈడుగావన్నీ!
చంద్రకాంతపురవిక తొడిగించిరపుడు! సందిటదండలుబెట్టి తావేజులుబెట్రి!
దండకడియములు భిన్నస్వరములుంచ్రీ! నవరత్నపువంకీలు నాతికినుయుంచీరి!
చేడెకుయింపైన చెవులపువులుబెట్రి! బలువైనముత్యాల పాపిటచేరులను!
చేరుచుక్కవుంచె చెలియజానకి! జానకియెంతయు చెలువారుచుండ!
చేరుచుక్కావంతి మరదల్ని జూచి! తెమ్మనవేజానకి తొడుగులూయనెను!
మునుపుగౌతముడుదెచ్చిచ్చినాడన్ని! అవిదెచ్చిజానకికి అలంకరించీరి!
నాగలోకముననున్న ఫణీంద్రుడపుడు! నవరత్నపుతొడుగులు యిచ్చినాడనుచు!
అవిదెచ్చి జానకికి అలంకరించ్రీ! అగ్నిహోత్రుడు మెచ్చిచ్చినాడనుచు!
అవిదెచ్చి జానకికి అలంకరించిరి! మూడువేలుజేయునానుమెడవేసి!
సోగకన్నుల కాటుకలుదీర్చె! కస్తూరితిలకంబు కాంతకుదీర్చి!
బంగారునీరుతోపరిపూర్ణమైన! పట్టుచీరాదెచ్చి కట్టించిరపుడు!
ఘంతలవడ్డాణము కాంతకువుంచిరి! అందమయినమొహర్ల పేరులనుంచ్రీ!
గంధమ్ముకస్తూరి కలపంబుజేసి! అప్పుడుజానకికి అలదెశాంతమ్మ!
పచ్చకర్పూరాన ఆకుమడచిచ్చి! బంగారునీరుతో పరిపూర్ణమైన!
పట్టుశాలలుదెచ్చి గవిశనలవేసిరి! వయ్యాఋఇనడకతో పరిపూర్ణమైన!
వారచూపులుజూస్తు వచ్చెనాదేవి! అల్లంతటశ్రీదేవి రాకలుజూచి!
కలకలనవ్వుతు పలికె రాఘవులు! వేసంగికాలాన పచ్చన్నిపూరి!
మేసినగోవులకు ఆనందమేను! పరమపతివ్రతలైన స్త్రీలకందరికి!
పతిరాకజూచితే సంతోషమౌను! పాలునుపంచదార కలసియున్నట్లు!
శ్రీరాములుసీత కలసిరపుడు! పాలునుబెల్లంబు కలసియున్నట్లు!
భరతుడుమాళవీ కలిసిరప్పుడు! జీలకర్రబెల్లంబు కలసియున్నట్లు!
సౌమిత్రియూర్మిళ గలసిరపుడు! ఒకమారుతాంబూల మియ్యవచ్చినను!
వద్దనిశతకీర్తి యూరకెయుండె! సంవాదముచెయ్య జాలనీతోటి!
సరగునశయ్యపై తాద్రోసివేసె! ప్రాణాలుమూర్ఛిల్లి దద్ధిల్లిపోయే!
అందరుజెప్పి అప్పగించినట్ట్లు! అప్పుడేశతృఘ్ను డతిభీతినొందె!
శతకీర్తి నెత్తియో తొడలపైనుంచి! కర్పూరరజమంత కర్నములనూదె!
అచ్చపన్నీటను కన్నులుగడగే! శతృఘ్నుకోపదారని కర్ణములనూదె!
ఎవరినోటాపైని వినిజడసితివేమొ! ఎవరికైనా కోపదారినేగాని!
నీకుశాంతుడసుమ్మి నిజమునామాట! పాలుపంచదార గలసియున్నట్లు!
శతృఘ్నుడుశతకీర్తి గలిసిరప్పూడు! అతివకలగనిలేచి అతిభీతినొంద్!
శతృఘ్నుడు శతకీర్తినేమిజేసెనో! శతృఘ్నుడు శతకీర్తినేమిజెయ్యడు!
ఆహారమార్పాళ్ళూని జెప్పసతికి! సాహసంబేడుపాళ్ళు అనిజెప్పెసతికి!
దేవిడిముందరనున్న హనుమంతుబిలచి! వేగానభేరీలు వేయించుమనిరి!
భేరీమృదంగములు భోరుగొల్పగను! అదిరిపడిలేచిరి అన్నదమ్ములును!
భరతునిపై రెండు పసుపుడాగులు! సౌమిత్రిలలాటమున కుంకుమబొట్టు!
శతృఘునిచెక్కిట కాటుకరేఖా! ఆకుంకుమబొట్టు అమరియున్నది!
ఋష్యశృంగుడుజూచితే గేలిచెయ్యడ! రావోయిహనుమన్న వాయునందనుడా!
భరతునికిసౌమిత్రికి శతృఘ్నునికీ! భోజనంబులువేగ కావలెనుసుమ్మీ!
శీఘ్రముగశాంతమ్మ నగరుకేతెంచె! వందనములుజేసి ముందరనిలచి!
అమ్మశ్రీరాములు మమ్మంపినారు! భరతునికిసౌమిత్రికి శతృఘ్నునికినీ!
భోజనంబులువేగ కావలెననిరి! ఆమాటలువినియపుడు సంతోషముగను!
నీలవేణివీపుపై కొప్పుతూలాడ! నెలతపాపిటక్రింద బొట్టుతూలాడ!
గాజులుధవళస్వరముల మ్రోయగను! ఆయత్నములుయాయె వేగరమ్మనుమీ!
ఆట్టవసరానకౌసల్య మహాదేవి! పళ్ళెరములమర్పించె పరమహర్షమున!
మేలుగంగాజలాల్పనీయముంచిరి! సుందరిపెరటిదే సోద్యంపుసురటీ!
వడ్డించేయ్యోధ్య వల్లభులపంక్తి! చిక్కుడుకాయా చిరిపొట్లకాయా!
కాకరకాయతో గారవడియములు! అరటికాయమొదలైన అరువదికూరల్లు!
అట్టెవడ్డించిరా అచ్యుతులపంక్తి! పనసకాయమొదలైన పాకంపుకూరలు!
చాలవడ్డించిరా సర్వేశ్వర్లపంక్తి! సిరసేవపాయసము చిప్పపాయసాన్నము!
సజ్జపాయసాన్నము సఖియలొడ్డించ్రి! రాజనపూన్నములు రమణిశాకలులు
సాగివడ్డించిరా సర్వేశ్వర్లపంక్తి! సెనగపప్పుమంచి శిరిశనగపప్పు!
వలపుపప్పులతోటి అమరవడ్డించీరి! అప్పుడమ్ములుమంచి అతిరసంబులును!
అమరవడ్డించిరా అచ్యుతులపంక్తి! పచ్చళ్ళుసిరికిలే పనతులేవడ్డించ్రి!
కీలుకుడకలనేతులు చాలవడ్డించిరి1 వారివారికిప్రేమ ప్రియములుజెప్పి!
బంధుకోట్లతోను తమరారగింత్రూ! ఆనాడులంకలో ముచ్చటలన్నీ!
జెప్పుకొనుచువారు భుజియింపుచుండ్రి! ఆనాడురావణుని ముచ్చటలుయన్నీ!
జెప్పుకొనుచువారు భుజియింపుచుండ్రి! ఆనాడూడవిలో దుంపలుయన్నీ!
ఇవికూరపులసనీ తమరారగింతురు! అప్పుడుహనుమన్నను మరచియుండంగ!
పులుతుపులుతుమనీ వచ్చెహనుమాన్లు! ఇంటివాడవుగనుక నూరుకుంటిమి!
పొత్తునగుర్చొమ్మి ఉత్తమపురుష! నీవంటిబంధుండునేవంకలేడు!
నీవుండగాగదా సతిని దెచ్చుకునీ! అయ్యోధ్యపట్నమ్ము యేలగలిగితిని!
నీవుండగాగదా తమ్ములపంక్తి! భుజించగలిగితిని హనుమన్నవినుమ!
పొత్తునగూర్చొమ్మి ఉత్తమపురుష! పొత్తునగూర్చొంద ఉత్తముడగాను!
సర్వేశుభోజనము తాగాగచూచి! ముందరాపళ్ళెమ్ము యెత్తుకొనిబోయే!
తాబోయి హనుమన్న అవిసిచెట్టెక్కే! ద్వాదశికి ఒకముద్దకొమ్మపైనుంచే!
అందుమీదపళ్ళెము అందిపడవేసే! వృక్షమునకెదురుగా రామచంద్రూలు!
చెయిజాచిహనుమన్నను రమ్మనిబిలచె! రామచిలుకవలె చేతిపైవ్రాలే!
చేతిపైహనుమన్నను ధరణిపైదించి! ముత్యాలహారమ్ము మెచ్చిమెడవేసే!
ఈపాటయెవరైన పాడినవిన్న! పరబ్రహ్మలోకంబుపరమాత్ములిచ్చు!

Saturday, February 28, 2015

సరస్వతీ వందన - ప్రబంద కుసుమాలు

ప్రబంధాలలోని కొన్ని సరస్వతీ ప్రార్ధనలు మీకోసం

1. వాణిన్  బురాణి పుస్తక
పాణిన్ శుకవాణిఁ గమలభవురాణి గుణ
శ్రేణి నలివేణి నుతగీ 
ర్వాణి గల్యాణిఁ గొల్తు వాక్చాతురికిన్

ప్రొఢకవి మల్లనార్య "ఏకాదశి మాహత్మ్యము" నుండి

2. సింహాసనంబు చారుసిత పుండరీకంబు, చెలికత్తె జిలువారు పలుకుఁ జిలుక
శృంగార కుసుమంబు చిన్ని చుక్కలరాజు, పసిఁడి కిన్నెరవీణ పలుకుఁదోడు
నలువనెమ్మోముఁ దమ్ములు కేళిగృహములు, తళుకుటద్దంబు సత్కవుల మనసు
వేదాదివిద్యలు విహరణస్థలములు, చక్కని రాయంచ యెక్కిరింత
యెవుడు నేదేవి కాదేవి యిందుకుంద
చంద్ర చందన మందారసార వర్ణ
శారదాదేవి మామక స్వాంతవీధి
నిండు వేడుక విహరించుచుండు గాత!

శ్రీనాథ మహాకవి "శృంగార నైషధము" నుండి

3. వీణాధర బింబోపమ 
శోణాధర మధుపనికర సురుచిరవిలాస
ద్వేణీభర పద్మోద్భవు
రాణి లసద్వాణి నన్నురక్షించు దయన్

కుమారదూర్జటి "కృష్ణరాయ విజయము" నుండి

4. సౌరతరంగిణీ కనకసారసరాజమరాళి కైవడిన్
హరి హిరణ్య గర్భ వదనాంతరసీమ వసించు వాణి శృం
గార సరోజపాణి నవకంధరవేణి, విలాసధోరణిన్
వారక నిచ్చ నిచ్చలు నివాసము చేయు మదీయ జిహ్వికన్

సముఖము వేంకటకృష్ణప్పనాయకుని "అహల్యా సంక్రందనము" నుండి

5. రవ రమణీయ కీరసుకరంబు నభీష్టఫలోదయంబు మా
ర్దవ సుమగంధయుక్తము సుధాసమవర్ణము గల్గి వర్ణనీ
యవిభుదలోక కల్పతరువై తగు పద్మజురాణి వర్తనో
త్సవము వహించుఁగాత నిరంతంబును మద్రసనాంచలంబునన్

కనుపర్తి అబ్బయామాత్యుని "అనిరుద్ధ చరిత్రము" నుండి

6. ఏసతిలావులేక నరులెవ్వరు నోరుమెదల్పలేరు ప
ద్మాసన వాసుదేవ నిటలాక్షులు లోనుగ నాత్రివిష్ట పా
వాసులు పుట్టుఁ జేరుఁ జెలువంబును నేరికిదాఁప రట్టి వా
నీసతి మన్ముఖాబ్జమున నిల్చి విశేష వరంబులీవుతన్

అనంతామాత్యుని "భోజరాజీయము" నుండి

7. వాణి న్వీణాపుస్తక
పాణిన్ శుకవాణి విపులభాసుర పులిన
శ్రోణి న్బలభిన్మణి జి
ద్వేణిం గమలభవురాణి వినుతింతు మదిన్

పాలవేకరి కదిరీపతి "శుకసప్తతి" నుండి

8. నెమలికి నాట దిద్దువగ నెయ్యపుఁజిల్కకు గౌళ మాధురిం
 దమియిడునేర్పు నీకు విదితం బగునింక వారాళిచాలిగా
త్రమున రహింపఁ జాలుటగదా! యరుదంచు విరించిమెచ్చ హా
సము ననువాతెఱం జొనుపు శారద పోల్చుఁ గృతీంద్రుసూక్తులన్

ఋగ్వేది వేంకటాచలపతి కవి "చంపూరామాయణం" నుండి

9. వాణికి మంజులవాణికి సువారిజ పుస్తక కీర వల్లకీ
పాణికి చక్రనీలసురభాసుర వేణికి రాజహంసకున్
ఖాణికి వేదవేద్య పదకంజయుగ ప్రణతిప్రవీణ గీ
ర్వాణికి పద్మసంభవునిరాణికి భక్తి నమస్కరించెదన్

ఏనుగు లక్ష్మణకవి "రామవిలాసము" నుండి

10. వరవస్తుప్రతిపత్తిధుర్య మగనైశ్వర్య మగు నైశ్వర్యంబు పంచాఁశద
క్షర సంసిద్ధసమస్త శబ్ధరచనా సంవ్యాప్తి మద్దీపమై
పరఁగ గల్పలతా సధర్మయగుచుం బ్రజ్ఞావిశేషాఢ్యులన్
గరుణం బ్రోచు సవిత్రి వాణిఁ ద్రిజగద్కల్యాణిఁ బ్రార్ధించెదన్

ఎఱ్ఱాప్రగ్గడ "హరివంశము" నుండి

11. వాణికిఁ జరణా నతగీ
ర్వాణికి నేణాంక శకలరత్నశలాకా
వేణికిఁ బుస్తక వీణా
పాణికి సద్భక్తితో నుపాసి యొనర్తున్

శ్రీనాధ మహాకవి "హరవిలాసము" నుండి

12. వాణి వైభవవిజితేం
ద్రాణి మాయమ్మ నలువరాణి వీణా
పాణి ఘనవేణి క
ల్యాణి నానాల్క కెక్కుమమ్మా లెమ్మా

పి. చిదంబరశాస్త్రి గారి "హైమవతీ విలాసము" నుండి

13. వీణా పుస్తకపాణి షట్పదలసద్వేణిన్ బృహత్సైకత
శ్రోణిన్ బద్మజురాణి సర్వసుగుణ క్షోణిన్ బురాణి న్నతేం
ద్రాణి న్నేత్రజితైణిఁ బాదగతగీర్వాణిన్ బ్రవృద్ధాశ్రిత
శ్రేణి న్వాణి నభిష్టసిద్ధికి మదిన్ సేవింతు నాశ్రాంతమున్

గోపీనాధము వేంకటకవి "గోపీనాధ రామాయణము" నుండి

14. ప్రణవపీఠంబున మంత్రపరంపరలు గొల్వ నుండు నేదేవి పేరోలగంబు
భావజ్ఞులకుఁ బరాపశ్యంతి మధ్యమా వైఖరు లేదేవి వర్ణసరణి
జపహార కీర పుస్తక విపంచి సముచితంబు లేదేవి హస్తాంబుజములు
కుందేందు మందార కదళీబృందంబు చంద మేదేవి యానందమూర్తి

కాంచె నేదేవి కాంచనగర్భచతుర, పూర్వదంతకవాట విష్వటమనోజ్ఞ
చంద్రకాంత శిరోగృహస్థలవిహార, మమ్మహాదేవి వాగ్దేవి నభినుతింతు

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి "జైమిని భారతము" నుండి

15. శారద విద్యాజాల వి
శారద ననుఁ బ్రోచుకొఱకు సారె భజింతున్
శారద నీరద నారద
పారద హారదరహీర పాండుశరీరన్

కాకునూరి అప్పకవి "అప్పకవీయము" నుండి

16. రాజీవభవుని గారాపుఁ బట్టపుదేవి, అంచబాబా నెక్కు నలరుబోణి
పసిఁడి కిన్నెర వీణెఁ బలికించు నెలనాగ, పదునాలువిద్యల పట్టుఁగొమ్మ
యీరేడు భువనంబు లేలు సంపతిచేడె, మొలకచందురుఁ దాల్చు ముద్దరాలు
వెలిచాయకొదమరాచిలుక నెచ్చెలికత్తె, ప్రణవపీఠికనుండు పద్మగంధి

మందరాచల కందరామధ్యమాన
దుగ్ధపాదోధి లహరికాధూర్తయైన
లలితసాహిత్యసౌహిత్య లక్ష్మి నొసఁగు
వరదయై మాకు వినతగీర్వాణి వాణి

శ్రీనాధ మహాకవి "భీమఖండము" (భీమేశ్వరపురాణము) నుండి

17. తతయుక్తిన్ ఘనశబ్ధము ల్వెలయ నర్ధవ్యంజకప్రక్రియల్
తతినానద్ధతమించ దత్తదుచితాలంకారము ల్మీఱ శ్రీ
పతి చారిత్రము సర్వగోచరతచే భాసిల్లఁగా భారతీ
సతి యస్మద్రసనాగ్రరంగమున లాస్యప్రౌఢిఁ బాతింపుతన్

ధరణీదేవుల రామయమంత్రి "దశావతార చరిత్ర" నుండి

18. కమనీయవిమలశృంగారాంబుసంభూత, కమలమో యన ముఖకమల మమర
బ్రహ్మాండగేహదీపంబు లనం గ్రాలు , తాటంకమణిరుచుల్ తాండవింప
సంగీతసాహిత్య సరసిజాతము లైన, కోరకంబు లనంగఁ గుచము లలర
సంపూర్ణపూర్ణిమా చంద్రిక యనుభాతి, ధవళాంబరము ధగద్ధగల నీన

దేవగజదంతతుల్యమై దేహకాంతి
చంద్రకాంతపీఠంబున సంగమింప
వివిధకవిపుంగవుల మనోవీథి మెలఁగు
వాణి నివసించుఁ గాక మత్స్వాంతమునను

భాగవతుల నృసింహశర్మ గారి "శృంగారసంధ్య" (కాళికాపురాణాంతర్గతము)నుండి

19. తొలిపల్కులౌ వేదముల స్వరూపమ్మునఁ, గమలాసనుని ముఖకమలమందు
వాగ్రూపముననెల్ల వారినూఁకొట్టించు, ప్రవిమల జిహ్వాగ్ర భాగములను
విజ్ఞానమయరూప విభవమ్మునన్ సద్గు, ణాధీశ్వరుల యంతరాత్మలందు
సాకారయై యక్షరాకారమున బహు, భాషావళీగ్రంథ పత్రములను

గుట్టుగాఁగాపురము సేసికొనుచు నేను
కోరినప్పుడు నానాల్కకొనను జేరి
నృత్యమొనరించు వాణికిఁ బ్రత్యహమ్ము
నధికభక్తిఁ బ్రణామమ్ము లాచరింతు

జగ్గకవి "కళానిధి" నుండి

20. కట్టినపుట్టముం దనువు గద్దియతమ్మియు నక్షమాలయుం
బట్టినచిల్కయు న్నగవుఁ బాపటజల్లియు నొక్కవన్నెగాఁ
బుట్టుచుఁ బుట్టువిద్యలకుఁ బుట్టినయి ల్లనఁజెల్లి బ్రహ్మవా
కట్టొనరించి తన్ముఖవికాసినియౌ సతి మమ్ముఁ గావుతన్

కొరవి గోపరాజు "సింహాసన ద్వాత్రింశిక" నుండి

21. చేర్చుక్కగానిడ్డ చిన్న జాబిల్లిచే సిందూర తిలకమ్ము చెమ్మగిల్ల,
నవతంస కుసుమంబునందున్న ఎలదేటి రుతి కించిదంచిత శ్రుతులనీన
ఘనమైన రారాపు చను దోయి రాయిడిదుంబీఫలంబు దుందుడుకుజెంద
దరుణాంగుళిచ్చాయ దంతపు సరకట్టులింగిలీకపు వింతరంగులీన

నుపనిషత్తులుబోటులై యోలగింప
బుండరీకాసనమునగూర్చుండి మదికి
నించు వేడుక వీణ వాయించు చెలువ
నలువరాణి మదాత్మలో వెలయుగాత.

అల్లసాని పెద్దన "మనుచరిత్రము" నుండి

(ఇంకా ఉంది .........)

కూచిమంచి తిమ్మకవి అచ్చ తెనుఁగు రామాయణము నుండి కొన్ని అందమైన పద్యాలు

కూచిమంచి తిమ్మకవి అచ్చ తెనుఁగు రామాయణము నుండి కొన్ని అందమైన పద్యాలు.
(శ్రీరాముని అరణ్యవాస ఘట్టము)

క. పినతల్లిం బొడగని, క
మ్మనిపలుకుల నిట్టు లనియె "మము నేదఁగ నో
పినతల్లీ! నీదెందం
బున నిటువలె లాఁతితనము పూనఁగఁ జనునే

క. ఓయమ్మ యిట్టు లఱమఱ
సేయంగ నేల, నీవు సెప్పినచెయ్వుల్
ద్రోయంగా నేర్తుమె; యిఁక
నీయానతిఁ గడవఁ బోము నీయానసుమీ

తే. "ఒనరఁ దలిదండ్రు లెలమితోఁ బనుపుదురట;
తోఁడబుట్టువు పుడమికి దొర యగునఁట;
పున్నియపునేల లొగిఁ గాంచ బోవుటయఁట;
మెలఁత! మఱి యింతకంటెను మేలు గలదె?

క. "తలఁపఁగ జగమునఁ గలవే
ల్పులు, సంగడికాండ్రుఁ జుట్టములు, మఱి సెప్పం
గలవార లెందఱేనియుఁ
దలిదండ్రుల కెన యొనర్పఁ దగుదురె యెందున్?

తే. 'అట్లు గావున, నిపుడు మీయానబత్తి
దవిలి యొనరింతు" నని యటఁ దరలి తనదు
తల్లికడ కేఁగి, యత్తెఱంగెల్లఁ దెల్పి,
యడుగులకు మ్రొక్కుటయు, నాతి యతనిఁ జూచి,

క. "కటకట! బిడ్డఁడ! కోరిక
లటమట లై చనియె నిప్పుడద్దిర! తా నొ
క్కటి దలఁచిన దయ్యం బొ
క్కటి దలఁచు నఁతన్నమాట కడు బెడఁ గగుచున్

క. 'పుడమిఁ దనకన్నకొడుకున
కడుగుకొనియెఁగాక కైక, యహహ! నినుం గా
ఱడవులకుఁ బనుపు మనుచున్
నుడువఁగ నెప్పగిదిఁ దనకు నో రాడెనొకో!

తే. "సవతితన మూని, యిట్టు లయ్యువిద వలుక,
నట్టులే తానును డేందంబు దిటము పఱుచు
కొని, యయో! నున్నుఁ గానల కనుపుకొనఁగఁ
దండ్రి యేచందమున నఱఁదలఁచెఁ జెపుమ

క. "అజ్జోటియు నొడయఁడు నీ
పజ్జం గనికరము మాలి పనిగొల్పినచో;
నిజ్జాడ మీకుఁ దగ దని
యొజ్జయుఁ బ్రెగ్గడలు నాడకుండిరె వారిన్?

క. "గడియయ యేఁ దగు మును నినుఁ
బొడగానక యుండునెడలఁ బొలుపరి నీ వి
ట్లెడవాసి దవ్వు చనుచోఁ
గొడుకా! యిఁక నెట్లు తాళుకొనఁ గలఁ చెపుమా

తే. అనుచు నడలెడు తల్లి నూరార్చి యంప
దొనలు విల్లును గయికొని చనఁ దలంచు
నెడల, నడ్డంబుగా వచ్చి పుడమికాన్పు
వలపు గులుకంగ మెల్లనఁ బలికెనపుడు

తే. "మేలు గలనాఁడు ముఱియుచు మెసవనేర్చి,
గొడవ లొదవెడుతఱిఁ బోవ విడువఁదగునె
తాలఁప నుసుఱులయొడయఁ డై తనరుమగని
వెర వెఱింగిననాడెంపు వెలఁదుకలకు

ఆ. "మగనితోడ నెలమిఁ దగిలి ముత్తయిదువ
పోణిమిని గరంబు రాణఁ బొసఁగు
చున్ననాఁడె కాక, యన్నుల కటమీఁద
నెన్నఁడైన నెమ్మియింత గలదె?

ఆ. "అట్టు లగుటఁ జేసి యరగడియయుఁ దాళఁ
జాల నిన్నుఁ బాసి నేలఱేఁడ!
మాఱుమాట లుడిగి కాఱియఁ బెట్టక
తోడుకొని కడంకతోడఁ జనుము"

క. అనవుడు నబ్బల్లిదుఁడా
ననఁబోడులమిన్నఁ జూచి నగి యిట్లనియెన్
"బెనుఁగానలబడి చెలులకుఁ
జనఁ జనునే వెరపుమాలి చెక్కెరబొమ్మా?

క. నగువారి నెల్లఁ దలఁపక
మగువా! మగవారివెంట మచ్చికతో రాఁ
దగవా? పగవాడనె నిను
దిగనాడి చనంగ? లాఁతి తెఱఁ గెన్నుదురే?

సీ. "చెలిమితో నాడంగ జింక కూనలుగావు, గద్దఱి కొదమసింగలుగాని;
కులుకుచుఁ బలికింపఁ జిలుకబారులు గావు, దుగమొగంబులపుల్గుతెగలు గాని
వలపుతోఁ బెనుప జవ్వదిపిల్లులు గావు, బలితంపుఁబొగరు బెబ్బులులు గాని
కయిసేయిఁ బువ్వుఁదీవియపందిరులు గావు, పొదలుజొంపపుఁగాఱు పొదలుగాని

గొండ్లి సలుపంగ ననుఁగుఁబూబొండ్లు గాని
తులువపొలయోగిరపుఁబొలంతుకలు గాని
గోల లెచ్చట, గాటంపుఁగోన లెచట
వలువ దుడుగుము పయనంబు తలిరుఁబోడి

క. "వల నొదవనిపని యగుటం
బలికితి రావలవగనుచుఁ బరికింపఁగ నో
యొలదీవెఁబోఁడి! నిన్నుం
గలలోపల నైనఁ బాయగలనే? చెపుమా

క. అని యిట్టు లెన్ని సెప్పిన
విననొల్లక కలువకంటి వెగ టొదవఁగఁ బ
ల్కినఁ దలఁకుచు వెంటం దో
డ్కొని చనుటకు నాతఁ డియ్యకొని యుండుటయున్

తే. అత్తలకు మ్రొక్కి వారల యానతిఁగొని
జానొదవఁ జెల్మిబోటులఁ జాలఁ గూర్మి
తోడఁ గవుఁగిటఁ బెనఁచి యాతొడవుతొడవు
నెమ్మిఁ బెనిమిటిదరిఁ జేరి నిలుచునెడను

క. లక్కుమనుఁడు సింగాణియు
నక్కజపుందొనలు పూని యరుదెంచి కడున్
మ్రొక్కులిడి యున్న నాతని
మక్కువ కెదలోన నాలరి మఱి యప్పిదపన్

తే. తమ్ముఁడును గేస్తురాలును దాను నగరు
వెడలి యమ్మేటి దమవీటి నడిమిత్రోవఁ
జనుచు నుండెడుచోఁ గనుంగొనుచు నుండి
యెల్లవారలుఁ దమలోన నిట్టు లనిరి

క. "ఇట్టినిగారపు గొనముల
తిట్టలఁ గనికరము మాని తెం పొదవంగాఁ
గట్టడవులకుం బనుపఁగఁ
గట్టా! యమ్ముదుకఁ డెంత కట్టిఁడి చెపుమా!

క. "తడవేఁడు లయ్యె దనకుం
గొడుకులు లే రనుచు ముందుఁగుందుచు నెన్నో
పడరానిపాట్లు వడి యిపు
డడవులకుం ద్రోచుకొనుట యరుదైతోచున్

క. "తప్పక యాఁడుది గోరినఁ
మెపులకై వెడఁగుఁదనము మీఱఁగ నిటులీ
యొప్పులకుప్పల విడుచుట
ముప్పుందఱి? నితని కేమొ ముది మది దప్పెన్

క. "ఆలిమాటకొఱకు బేలయై కోడలిఁ
గొడుకుఁ బోవఁ ద్రోచుకొనియె, నితని
కేటిమగతనం బిసీ! కడుఁ గొద లేని
ఱట్టు వొందె నింక ఱంతు లేల?