Sunday, July 24, 2011

శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -6


బ్రహ్మనాయుడు కార్యమపూడి యుద్ధరంగముఁ జేరబోవుట

అనుచునచ్చటివృత్త మఖిలంబుచెప్ప
వినిబ్రహ్మనాయుండు వీరధైర్యమున
ద్వాదశసూర్యులు ప్రబలినరీతి
నెవ్వరికెరిగింప కేగెనావేళ
పొలుపొందనారుద్ర భూమికేతెంచె
నాలుగుకరముల నాయుడునిలిచె
ఆరుద్రవసుమతి నాశ్చర్యముగను
కూలినశల్యముల్ కురుచతుండములు
సొక్కినచర్మముల్ చుట్టలైఉన్న
పేగులునరములు పెంటలైఉన్న
యేడుమాసంబుల యెముకలుపగిలి
రాలిదట్టంబైన రాసులుతరుచు
మునిగిదుర్గంధంబు మొనసినమెదడు
గాలికిదూలెడు ఘనశిరోజములు
కాలికుప్పలుబడ్ద కాయవిభూది
చిదిమినశవములు చెదురుకొరువులు
నానావిధంబుల నాట్యముల్ సలుపు
భూతకోటులతోడ పొందుగానుండె
తలకాయపుర్రెల దగుబంతులాడు
శాకినుల్ మొదలైన సకలభూతములు
బెదరకవాదించు భేతాళచయము
పిల్లాటలాడెడు పెనుపిశాచములు
మిణుగురుల్ దిక్కుల ముంచిరాల్పుచును
కొమరొప్పపరుగిడు కొరవిదెయ్యములు
వేదమంత్రంబులు వెసపఠించుచును
బ్రహ్మనాయునిజూచి భయసంభ్రమమున
ఆశీర్వదించుచు నళుకుచుతొలగి
పరుగులుపెట్టెడు బ్రహ్మరాక్షసులు
కలగిబ్రహ్మన్నను కనినంతలోన
పారిభయమున బలుదైత్యవితతి
ఇటువంటిరణభూమి నెసగనీక్షించి
ఘనకార్యములకెల్ల కారణంబగుచు
ఎముకలపెంటయై యేహ్యమైఉన్న
కార్యమాపురిపుణ్య ఖనియగునట్లు
కావింతుదేవతల్ గనిసంతసింప
ధీరతశ్రీవీరతిరుపతిసేయ
వలెనంచునూహించి వైరులపాలి
కాలమృత్యువువంటి ఘనుడుబ్రహ్మన్న
భయదమౌ రణభూమి ప్రబలుడైనిలిచి
మూడుకాలంబుల ముచ్చటలెల్ల
తెలిసినయెరుకల తెరవనీక్షించి
బలువైనబ్రహ్మండ పజ్త్కులనెల్ల
పుట్టింపరక్షింప పొలియింపనేర్చు
బ్రహ్మదేవునివిష్ణు ఫాలలోచనుల
ప్రార్ధించికీర్తించి ప్రణతులచేసి
హరియొక్క పదియైన యవతారములను
మనసునదలబోసి మానంబురోసి
భువనరక్షణచేయ బుద్ధిలోనిలిపి
పరమేశ్వరునిగూర్చి పలికెబ్రహ్మయ్య
"ఓచక్రధర!స్వామి ఓకంజనాభ
జలముపైపవళించు సర్వభూతేశ
ప్రమథావతారులు బలువీరవరులు
ప్రధ్నవసుమతిలోన ప్రాభవమొప్ప
ఇత్తుముప్రాణంబు లీయనినంచు
వచ్చియున్నారదె వైభవంబలర
వీరసింహంబులు వీరనాత్యంబు
చేయుదురిప్పుడు స్థిరబుద్ధితోడ
పూతత్వహీనత పొరయునీభూమి
నిర్దుష్టముగజేయ నిన్నువేడెదము
నీచరణంబున నెరిజనియించి
గంగయై ఖ్యాతినిగాంచి లోకముల
క్షాళతమ్మొనరించెగదా పూర్వమందు
ఆజలరూపమై యమరుమేఘంబు
వర్షించియీభూమి పరమపూతంబు
చేసెడునట్లుగా సెలవిమ్ముతండ్రి"
అనుచుబ్రహ్మనవేడ నాలించిహరియు
ఫణిశాయియైయుండి పంపెదేవేంద్రు
నతడుప్రేరేపింప నానీలమేఘు
మాకాశమెల్లను నల్లినట్లుండి
గాఢాందకారంబు గప్పెభూస్థలిని
ఘూర్ణిల్లుధ్వనులతో కుంభినిమీద
ఉరుములుపిడుగులు నొయ్యనబడగ
తళతళమెరుపులు తరచుగామెరయ
వడగండ్లురాలంగ వాయువువిసర
వాగువంతలనీళ్ళు వరదలైపార
గుంతమిట్టనరాక కుంభినినెల్ల
ముంచెదేవతలంత మూకలైచూడ
జలజనాభునిపాద జనితమైనట్టి
గంగలోకములెల్ల క్రమ్మెనోయనగ
ఏకార్ణవంబుగా హెచ్చివర్షించె
అప్పుడాజలమధ్య మందుండియెక్క
పునుకజలముపైన బొర్లాడికొంచు
పడమరగావచ్చి బ్రహ్మన్నవద్ద
నిల్చిహసించెను నిష్కారణముగ
అప్పుడుబ్రహ్మన్నయు నానవ్వుజూచి
తలపుర్రెతోననె దగువాక్యములను
నవ్వినహేతువు నాతోడజెప్పు
వీనులనిండగా వినగోరినాడ
అనిననాయునితోడ నాపుర్రెపలికె
నాపూర్వమంత విన్నపముచేసెదను
శంఖచక్రాంకిత సకలలోకేశ
ఇందిరామందిరా యినచంద్రనేత్ర
జలజజజనకుండ శార్ఙ్గశరానా
సకలవేదమయాత్మ శ్యామలవర్ణ
సకలధర్మంబులు సమసెడువేళ
తగినరూపముదాల్చి ధరబ్రోతువెపుడు
వేదశాస్త్రంబులు వినుతులుసేయ
చాలగజడనిధిశయనించుచుందు
దనుజేంద్రసంహార తార్క్ష్యవాహనుడ
యెత్తితీయవతార మీయుగమునందు
శోభిల్లునీమేను జూడంగగలిగె
తప్పజూదకవిను తగుమనముంచి
దానవుడనుగాను దయ్యముగాను
భూరిభయంకర భూతంబుగాను
వాసియౌయాకాశ వాణినిగాను
రహిమించగ బ్రహ్మరక్షస్సుగాను
జలనిధికోటయై చక్కనైయుండు
దక్షిణజలనిధి దండనున్నట్టి
రమపురమనుపేర రాజిల్లుచున్న
పట్టణంబేలెడు పరమధర్ముండ
జలనిధిసోముడనేను సర్వజ్ఙ్ఞతిలక
ద్వాపయుగమున ధైర్యంబుతోడ
బహుతరాక్షౌహిణుల్ బలములగూర్చి
ధూర్జటికెదిరించి దూరమొనరించి
కరులుగుర్రంబులు కాలిమానుషులు
హతమైనపిమ్మట నాలంబులోన
పడితినిపగవారి పంతంబుగెలువ
రణధూర్తుడనుగాను రాజునుగాని
సర్వయుగజనులు సమసినకలని
గతిగానకీలాగు కాలంబుబుచ్చు
చెదురుచూచుచునుంటి మెంతయుమేము
వీరాగ్రగణ్యత వెలసిననీవు
కదనవిక్రముడవై కలనికివచ్చి
శోధింపదిరిగితి శూరధర్మమున
పరమాత్మ మాజన్మ పావనంబాయె
వైకుంఠపట్టణ వైభవంబెల్ల
కంటినాయునిమూర్తి కన్నందుచేత
నీపాదములధూళి నెరసినకతన
పావనంబాయెనీ భండనభూమి
ఇటువంటికనిలో నేపునమీరు
కదననాట్యముసల్ప కడుసంతసిల్లి
శంకరుడింద్రుండు సకలదేవతలు
ఎదురుగాచనుదెంచి యిత్తురిష్టములు
ఘనపవిత్రులుగాగ కలియుగమందు
వీరపుంగవులయి వెలయంగగలరు
పరువడిచనిన భూపరులలోగలసి
దివికెగెదముమేము దేవదేవేశ
అనిచెప్పిబ్రహ్మచే నంపించికొనిరి
కరమొప్పపండ్రెండు గడియలతడవు
హుంభవర్షంబయ్యె కుంభినియందు
నీతిచేభూతముల్ నిల్చికొల్వంగ
కలనికికర్త్రియై ఘనమైనశక్తి
గరిమబ్రహ్మన్నను గాంచియునిల్చె
నిలిచినగనిగొని నీలవర్ణుండు
"ఓవిశ్వమయమూర్తి ఓవిశ్వకర్త్రి
ఓలోకపావనీ యోజగద్ధాత్రి
యోశాంభవీదేవి యోలోకసేవ్య
సమరంబునకునీవు సాక్షివైయుండు"
మనుచుప్రార్ధనజెసి యాబ్రహ్మనీడు
మగిడెమనోవేగ మానితగతిని
వేగుజాముకువచ్చి విడిదిలోనిలిచె
తెల్లవారగనప్డు దివిజులుప్పొంగ
చుక్కలకాంతులు శూన్యమైయడగె
కలువలమిత్రుని కాంతులుతగ్గె
చీకటిగుహలలో జేరియుదాగె
గుడ్లగూబలుపోయి (గొందులనణగె)
చక్రవాకంబులు సంతసంబందె
కమలముల్ వికసించె గలువలుమొగిడె
తమతమకార్యముల్ తగజెసికొంచు
మోదంబునొందిరి భూజనులెల్ల
వేదమంత్రంబుల వినుతులుజేసి
అఖిలభూసురతతి ఆర్ఘ్యంబులియ్య
పూర్వపర్వతశిరః పూజ్యాగ్రమందు
ఘనతరమాణిక్య ఖచితసౌవర్ణ
కుంభంబువలెనిల్చి గురుతేజమునను

Friday, July 22, 2011

శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -5


కార్యమపూడి రణరంగమును బరీక్షించుటకై బ్రహ్మనాయఁడు కన్నమనీని నర్ధరాత్రమునఁ బంపుట

అంతటబ్రహ్మన్న యానడిరాత్రి
కనుకులదాసుండు ఘనబాహుబలుడు
కన్నమయనువాని గ్రక్కునబిలిచి
వెనకటిరాజులు విక్రమస్ఫూర్తి
పోరాడిసమసిన బూడిదవెంట
యిలభీమమైనట్టి యెముకలపోగు
లెసగినరణమ్హూమి యెన్నికగాను
పావనంబుగజేసి బహుకాలమందు
కనిపెట్టియున్నట్టి ఘనరాజవితతి
దూరములోపలనుండి తొలగింపవలయు
ఇరవుగాకలనిలో ఈరాత్రివేళ
ఎవ్వరెవ్వరుగాచి యెట్లున్నవారో
అరసిరమ్మనిపంప నావీరఘనుడు
వాసనపెల్లైన వనమాలగదల
కరములగుజ్జరి కడియముల్ మెరయ
నేటైనపిడిఘంత నెమలిసొగసులును
నల్లనిదట్టిని నయమొప్పగట్టి
అర్థనారీఝుల్ల కాదులునమర
ఘోరభైరవగద కోరమీసములు
ఎగుభుజంబులుమించు వెరజేరుగ్రుడ్లు
ఘనమైనదేహంబు కాలిపెండెరము
వెరవైనభీకర వేషంబుతోడ
కదలెకన్నెమనీడు కదనభూమికిని
కాటుకకొండయై కదసినయట్లు
గరిమతోచీకటి గ్రమ్మినయట్లు
హరిహరాదులమూర్తి యతనికిగలిగి
నడకలనింజొచ్చి నలుదెసల్ జూచె
అక్కడకాపున్న యఖిలరాక్షసులు
గండభైరవమూర్తి ఘనభూతవితతి
గుంపులైయున్నట్టి కొరవిదెయ్యములు
ఇరవుననున్నట్టి యెరుకలసాని
యున్నతావుకువచ్చి యొయ్యనననియె
వింటివేవార్తలు వినచిత్రంబు
గొల్లెనలచ్చటకుదురుగాజేసి
యీరుద్రభూమికి నీతడువచ్చె
ఏమికార్యమొకాని యెరుగంగరాదు
ముదముననున్నాడు మముజూచివీడు
తెలిసికోవలెవీని తెరగెల్లనిప్పు
డనిఉగ్రకోపాన నార్పులనిగూడ
కత్తులుద్రిప్పుచు గదిసికూయుచును
గట్టిగానిలిచిరి కన్నమమీద
అంతటకన్నమ అధికరోషమున
కాలాగ్నిరుద్రుడై కత్తినిదీసి
మెరపుకైవడినిల్వ మెచ్చెభూతములు
వల్లకాటికిధైర్య వైభవంబెసగ
ఎవ్వడేతెంచెనో యెరుదరాదిప్పు
డీశ్మశానములోన నెసగురుద్రుండొ
బ్రహ్మవిష్ణుడో పాకశాసనుడో
అగ్నిహోత్రుదో లేక యమధర్మరాజొ
అలనైరృతుడొ లేక అంభుదిపతియొ
పవనుడోధనదుడో ఫాలనేత్రుండొ
మునివితతికినెల్ల ముఖ్యుడోయేమొ
తెలియదమంచును దిన్నగాననిరి
ఎవడవురాయోరి యీభూమిజొచ్చి
యేమికార్యముకొర కేతెంచినాడ
వేరాజుబంటువో యెరిగింపుమనిన
పలికెగన్నమనీడు పటుశక్తిమెరయ
సోమవంశమున శోభిల్లుచున్న
అనుగురాజేంద్రున కంగనయైన
విద్యలదేవికి విభవంబుమీర
ముక్కంటివరమున ముగ్గురుసుతులు
మల్లికార్జునుయొక్క మానసరూపు
లనగజన్మించిరి అందులోమేటి
పెదమలిదేవుడు పృథ్వీతలేశు
దారాజునకుమంత్రి ఆదిదేవుండు
దొరసినరేచర్ల దొడ్డనాయునికి
పడతిశీలమయను పద్మనేత్రకును
కలికికృష్ణుండైన కారుణ్యమూర్తి
పుట్టెనుబ్రహ్మన్న భూలోకమందు
అతనికిదాసుడ నౌదునునేను
మాలలకునుబుట్టి మాలనైపోక
విష్ణుపాదముబట్టి విశ్వంబులోన
తెప్పలినాయుడు తెరవయైనట్టి
వికచాబ్జలోచన పెమ్మసానికిని
శ్రీమించుమాచర్ల చెన్నునిమేన
పెంపొందెడుతులసి పెదవనమాల
వరముగన్నట్టి వరపుణ్యసుతుడ
కన్నమనాపేరు కమలాక్షివినవె
కామునికెదిరించి కదనంబుగోరి
పగరపైదండెత్తి బవరంబునకును
వచ్చిరిమావారు వైభవంబలర
భండనక్రియకిది పట్టైనచోటు
వెనకటిరాజులు విక్రమస్ఫూర్తి
పోరాడివచ్చిన పునుకలపెంట
తొలగించిశుచిచేయ వలెనంచుదలచి
కామునిబలముల ఖండించివైచి
మడియంగవచ్చిరి మన్నెనాయకులు
పరభయంకరమైన భందనభూమి
అరసిరమ్మనిపంపె నవతారపురుషు
డైనట్టిబ్రహ్మన్న యనుచుచెప్పంగ
వినియెరుకలసాని విస్మయంబంది
ప్రళయకాలేశుండు పార్వతీశ్వరుని
పాదసేవకులైన ప్రమథులువార
లిప్పుడిటు బెసగెసంతసము
మనసులోకోరిక మాకుసిద్ధించె
బ్రహ్మనాయుడువచ్చి భాండనభూమి
పాదరేణువుచేత పావనత్వమ్ము
వెలయింపవలసిన వేళయేతెంచె
కడువేగరమ్మను కన్నమానేడె
అనినకన్నమవిని యాశక్తికపుడు
దండనమస్కృతుల్ తగజేసిమగిడి
బ్రహ్మనాయునిజూచి పదములకెరగి
కమలవల్లభవిను కంటినివింత
కంతినెరుకసాని కంటిదైత్యులను
జయమగువెంచేయు జలజలోచనుడ

Monday, July 18, 2011

శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -4

నాయకులు శకటంబులకుఁ బూన్చుటకై యెద్దులనుఁ బేరు పేరున బిలుచుట

అనివీడుకొలిపిన నంతంతవారు
పేరుపేరునవాని బిలిచిరీరీతి
అందెలబసవన్న అదినాధుండ
నందులపిడిఘంట నాగవాసయ్య
గోవులవిటకాడ గోగుబయ్యన్న
వంటరిపలిజంకు వరపెరుమాళ్ళు
కట్టనికలుకోట కరినందిరంకె
అకలంకగాత్రుండ అంబుధిశయన
బిరుదుగరుత్మంత భీమునిగజమ
గోవర్ధనాచల గోపాలదేవ
కరినందిబసవన్న కంచివరదుడ
నెలబాలచంద్రుండ నీలవర్ణుండ
కల్లులదర్దజ జయకంఠనాద
వైకుంఠవాసుడ వాసుదేవయ్య
పుట్టలభూపతి పెంజెల్గుపెద్ద
ఇంద్రునివజ్రమా ఇప్పగిరీశ
గోగుభైరవమూర్తి గోవిందరాజ
చెంచులయోబయ్య చెన్నమల్లయ్య
కంచియేకామ్రుడా కాళికానాథా
మధురాపురిప్రియ మానందినాథా
కాముడాసోముడా కాయజవరుడ
రాముడాభీముడా రంకెలుసలుపు
మీరీతిపిలిచిన నేపుమీరంగ
వచ్చినయెద్దుల వరుసతోజూచి
వన్నెలుచిన్నెలు వడిజెప్పికొనుచు
నెత్తురుకొమ్ముల నేటైనవాని
గణుపుతోకలుగల కరిబొల్లివాని
అచ్చగాకరివన్నె లమరినవాని
మూపురంబులతోడ మొనసినవాని
నుదుటచుక్కలుగల నునుపైనవాని
తెల్లవన్నెల తెలివైనవాని
పచ్చనివన్నెలు ప్రబలినవాని
ఇటువంతిఎద్దుల నెంతయునేర్చి
గంతలుగజ్జలు గణగణమ్రోయ
గ్రక్కునయెద్దున గాండ్లగట్టించి
మోకులబంధించి ముందుగానపుడు
పంచవన్నెలకూడు పైబారదివిచి
కంబంముదర్లించె కమలనాభుండు
మర్రివేములుదాటి మండలేశుండు
ఘూర్ణిల్లురవముతో గుమ్మడంపాడు
చేరియచ్చటనిల్వ చిత్తంబువిడిచి
గరికెపాటికివచ్చి కాలూనకచట
కంకణంబులపల్లె కడనునాఘనులు
కంకణంబులుగట్తి కదలిరావేళ
పట్టభద్రులు పైడిపాటికివచ్చి
పరగవీరులకెల్ల వైనంబు చెప్పి
మెరసినమన్నీలు మేటినాయకులు
ప్రభువులుదొరలును బంధువర్గంబు
వీరవర్యులుగొప్ప విద్యలవారు
మిక్కిలిబిరుదులు మెరయుసాహసులు
కవులునుజెట్టీలు కలిసియందంద

మలిదేవరాజాదులు త్రిపురాంతకమునుండి మేళ్ళవాగుఁ జేరుట

మేళ్ళవాగుననిల్చె మించినదండు
అందరుగొల్లెన లమరంగనెత్తి
యుండిరినాయకు లుత్తలపడక
అంతలోదినకరు డస్తాద్రికరగె
సాంద్రమైచీకట్లు జగమెల్లగప్పె
విలసిల్లెచుక్కలు వినువీథియందు
గుమిగూడిపక్షులు గూళ్ళలోజేరె
చక్రవాకంబుల సంతసంబడగె
ఘనచకోరంబులు కౌతుకంబందె
కొలకులకమలముల్ కుందుచుమొగిడె
వికసించెకుముదముల్ విచ్చలవిడిని
జారకామినులెల్ల సంతోషమునను
మగలనిద్దురబుచ్చి మనసులుబెదర
కెరలివిటులగూడి గృహములువెడలి
మించిసాహసమున మేరలుమీరి
తోడికోడండ్రును తోడివారలును
గురువులుబంధులు గుర్తెరింగినను
నిందింతురనిశంక నిలుపకమదిని
వాగులవంతల వనములయందు
ఇసుకదిబ్బలయందు నిరవైనపొదల
కుంటెనకత్తెలు కూడికాపాడ
మనసులతమిమించ మదనుడావేళ
పూబాణములువింట బూనిసంధించి
మర్మముల్ నొవ్వంగ మాటికినేయ
మంచిగంధముబూయ మనసుభీతిల్ల
పువ్వులుముడువను బుద్ధియులేక
ఘననఖక్షతదంత ఘాతలువీడి
రతికుంజితంబుల రంతులుమాని
బంధచాతురియందు భావంబువిడక
కొందరునేలను గొందరునిలచి
నయముతోగొందరు నానావిధముల
కలసిరిమేనుల కంపంబులలర
చోరులుసాహస స్పూర్తులతోడ
ప్రాణంబులకుదెగి భార్యలనుమరచి
బ్రతికివచ్చెదమను భావంబువదలి
పట్టణంబులయందు పల్లెలయందు
ధనికులగృహముల తార్కొనిదోచి
సారెకుదిరుగంగ సాగిరావేళ

Saturday, July 16, 2011

శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర '" -- ద్విపదకావ్యం -3

మలిదేవరాజు, బ్రహ్మనాయుడు త్రిపురాంతకము జేరుట

త్రిపురాంతకమునకు తిన్నగావచ్చి
మహితచారిత్రుడు మలిదేవనృపతి
రాజులుమంత్రులు రసికులుదొరలు
పాటించిసుంకర వారితోగూడ
ఆవేళనీశ్వరు నతిభక్తిజూచి
సాష్టాంగదండముల్ చెయ్యనజేసి
హస్తముల్ముకుళించి అనియెబ్రహ్మన్న
గౌరీమనోహర గంగోత్తమాగ
నాగకంకణశివ నందివాహనుడ
కాంచనగిరిచాప కంధితూణీర
గరుడాసనాంబక కైలాసవాస
ఘనగజాసురభంగ కామభస్మాంగ
లాలితశ్రీకంఠ లయకాలకర్త
సకలభూతేశ్వర శభావతార
ఫాలాక్షభూతేశ పరమేశయిపుడు
విన్నవించెదనేను వినుముసత్కరుణ
శివపురిలోనుండి చేర్చినయట్టి
భూతరాట్త్సంభంబు పొందుగానుంచి
మితిచేసిచనితిమి మీనగరంబు
మృతివచ్చెనేటికి మీకృపచేత
కార్యమీడేర్పంగ కర్తలేమీర
యనుచుప్రార్ధనజేసి యచ్చటనున్న
కంబముగనుగొని కడుభక్తిమ్రొక్కి
యినుముపిత్తళికంచు హేమతామ్రముల
పంచలోహంబుల ప్రబలినదాన
నాలుగుముఖముల నయమొప్పమరియు
ఎనిమిదిముఖముల నెన్నికైనావు
ముగురుమూర్తులునొక్క ముఖమందునిలిచి
ఒకటసిద్ధులుమరి మొక్కటమునులు
గంగయుదుర్గయు కాలభైరవుడు
నిలిచిభూదేవియు నీయాననముల
గంధర్వపతులతో కాచుచునుందు
రనుచుప్రార్ధనజేసి ఆబ్రహ్మపలికె
ఘనకార్యమపూడి కలనులోపలను
నలగామరాజుతో నయముగాబోరి
మడియంగవచ్చిరి మన్నెనాయకులు
రణరంగపట్టపు రాజువైనీవు
సాక్షివైయుండవే సర్వభూతేశ
భుక్తినిచ్చెదనీకు భూతేశుడెరుగ
దాహంబుదీర్చుకో తడుచురక్తమున
ఇప్పుడాహారంబ యిదిగికొమ్మంచు
కంబమునకునిట్లు గట్టిగాజెప్పి
పెక్కువిధంబుల పిండివంటలును
పరమాన్నమునుమంచి పప్పుకూరలును
పానకంబులుజున్ను పచ్చళ్ళునెయ్యి
ఖండశర్కరతియ్య కందగడ్దలును
కొనితెచ్చికుంభము కొండలరీతి
కస్తూరికర్పూర కాశ్మీరసహిత
చందనలేపంబు సరివియొనర్చి
మైసాక్షిసాంబ్రాణి మంచిగుగ్గిలము
తోడుగలెస్సగ ధూపమర్పించి
ఘనమైనపోతుతో గావుజెల్లించి
ఆహారమంతట అర్పించిపిదప
కంబముంచినయట్టి ఘనశకట
నిచయంబుదరలింప నిలిచిబ్రహ్మన్న
శకటచక్రంబులు సమ్మతిగావ
నాయకావళినెల్ల నయముతోబిలిచి
వితరణచతురుడై విడియంబులిచ్చి
యెనయంగమనవీట నెసగునెద్దులను
కనుగొనితెప్పించి కాండ్లకుగట్టి
చయ్యనబండ్లను సాగింపుమనియె.

Sunday, July 10, 2011

శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర '" -- ద్విపదకావ్యం -2

మలిదేవరాజు, బ్రహ్మనాయుడు మెదలయినవారు కార్యమపూడి యుద్ధరంగమునకు బయలుదేరిపోవుట

అటమీదభూమీశు డధికోత్సవముల
ఘనకార్యమపూడి కదనరంగంబు
చేరబోవుటకునై చింతించియపుడు
ప్రజలతోమేడపి బదిలంబుసేసి
పరగమువ్వురుపతుల్ పైనంబుగాగ
ఎలమిభూసుర పురోహితులెల్లపూని
జయముహూర్తముబెట్టి చనుమని చెప్ప
తొల్లియేకాదశి దురమౌనటంచు
రణభేరివేయించె రమణీయముగాను
అతులసాహసవృత్తి నాదండువెడలె
గొల్లెనల్ గట్టిన గొప్పలౌబండ్లు
బల్లానిపెట్టెలు పట్టెమంచములు
తరుచైనపీటలు తమ్మిపడిగెలును
వింతమందసములు వెలయుగొడ్గులును
కాశ్మీరకస్తూరి గంధకర్పూర
మాదిగావాసన లమరుపెట్టెలును
బొక్కసంబులబల్వు బోనగావళ్ళు
జవ్వాదిపిట్తలు శారికాకీర
పంజరములువట్టు పరిచారకులును
కోడెకాండ్రదలించి కొట్టెడురెడ్లు
పడివాగెతేజీలు పాలకీజోళ్ళు
అష్టభాగ్యంబుల అంగళ్లవారు
సందడిపడదండు చయ్యనగదలె
పెంపైనపాలకి పెదమల్లుగదలె
పినమల్లుగదలె పృధ్వీశువెనుక
తమ్ముడుగదలెను ధరణీశువెంట
పచ్చలులింగాలు పట్టుగాజెక్కి
బాగుచేసినయట్టి పాలకియెక్కి
పలుమారుపుత్రుకై పలివరింపుచును
కొలువులోనాయుడు కొనరెట్టవట్టి
కులపగదీర్పని కొడుకితడంచు
పెట్టెనాచేతిలో ప్రియతనూజాతు
బాలునితెగువ యేపాటిదోయనుచు
కొమ్మభూమీశుండు గొబ్బునగదలె
అల్లాణరాజులు అచ్చోటినృపులు
అన్నలుదమ్ములు అందరుగూడి
సూర్యవంశమువారు సొంపుతోచనిరి.
వారికివీరికి వరమంత్రియైన
నీలవర్ణుండును నియతచిత్తుండు
బ్రహ్మన్నగదలెను పాయనివేడ్క
పట్టిరిగొడుగులు పాలకినెత్తి
సూర్యతాపంబు పైసోకనియట్లు
పాలకీలకురెండు పార్శ్వంబులందు
అందంబుగాబట్టి రరిగెలజోళ్ళు
వింజామరంబులు వెలయగానెమిలి
కుంచలవారును గూడువీవంగ
నాయడురాజులు నయముతోచనగ
ముందుడమాయీలు మురజసంఘంబు
బూరలుభేరీలు పోటుధారలును
కాహళవంకిణి కాలికొమ్ములును
శంఖసమూహంబు ముఖవీణవితతి
నరగలుతప్పెటల్ నయమైనడోళ్ళు
తమ్మటమ్ములునెంచదగువీరణములు
ఘనమైనరుంజలు కనకతప్పెటలు
చేగంతలును మరి చిరుగంటచయము
ఘనమైనమ్రోతచే గగనంబుగప్ప
కుంభిణివణకంగ కులగిరులెల్ల
మారుమ్రోతలనీదు మనసులుప్పొంగ
ఆవాలవారును ఆణెమువారు
కొండ్లవిందులవారు గోవిందువారు
ముతసానివారును ముయ్యూరువారు
నర్మాలవారును నాయనివారు
పైడిచుక్కల పాలపర్తివారలును
పాలుమూరివారును పాలెమువారు
రేవనూళ్ళలవారు రేచెర్లవారు
అట్లూరి ముట్లూరి యాఖ్యలవారు
చెవులవారునుమరి చిల్లరవారు
గురియైననాయకుల్ గూడియేతేర
గుండువారేగురు గదిసినవేడ్క
చనిరిబిరుదులతో సహసమడర
ఒప్పుగానిందరు నురువైనబండ్లు
ఘోటకంబులుమేటి కుంజరావళులు
ఉత్సాహమున హుటాహుటినడువంగ
భట్టువారలమించి బహువిధంబులను
బిరుదుపద్యంబులు పెళ్ళుగాజదువ
ఉద్ధతిమస్టీలు నొనరనిర్వంక
భైరవఖడ్గముల్ పట్టుకరాగ
శీలమ్మతనయుని సింహవిక్రముడు
కరమర్ధికనుకుల కన్నమనడిచె
సకలవీరచయంబు సంతతోత్సాహ
పొరుషంబులుమీర బ్రహ్మకిట్లనియె
"మముజూడునాయుడా మాలావుకొలది
మముజూడుబ్రహ్మన్న మాశౌర్యపటిమ
సింధూరంబులమీద జెన్నుగాదుమికి
కుంభస్థలంబులు క్రుంగజేసెదము
కొదమసింగబుల గూలద్రోసెదము
గండభేరుండాల ఖండింతుమలుక
వాయువుబోనీక వాడినాపగలము
జాతవేదునుబట్టి చమిరివేసెదము
ఘనసముద్రముజొచ్చి కలుగజేసెదము
కుంభినికాళ్ళతో క్రుంగదన్నెదము
కులగిరిలైనను కొట్టివేసెదము
గురిజాలనేలెడు కువలయేశ్వరుని
కులపగకైపట్టి క్రొవ్వణగించి
చలమునవిడువక చంపగాగలము"
అనిపెక్కుపంతంబు లాడుచునడువ
చూచినవారలు చోద్యంబుగాగ
పటువిక్రమాఢ్యులు పలనాటివీర
వరులంచుబొగడుచు వర్ణించిపలుక
మలదేవభూతి, మంత్రిబ్రహ్మన్న
కంపింపభూస్థలి కదలిరావేళ.

Thursday, July 7, 2011

శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర '" -- ద్విపదకావ్యం -1

ముందుమాట

పల్నాటివీరచరిత్ర గురించి విననివారుకానీ చదవనివారుకాని చాల తక్కువమంది ఉంటారు. బాలచంద్రుని యుద్ధము, బ్రహ్మనాయుడి శౌర్యం, నాగమనాయకురాలి తంత్రం ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉంది. ఈ పలనాటియుద్ధం మన ఆంధ్రుల చరిత్రలో ముఖ్యమైన సంఘటన. ఆనాటి యుద్ధచిహ్నాలు, ఈ వీరులు నిర్మించిన ఆలయాలు అవీ ఇప్పటికి మనం చూడవచ్చు. మాచర్ల చెన్నకేశవాలయం బ్రహ్మనాయుడు నిర్మించినట్టు చారిత్రిక దాఖలాలు ఉన్నాయి. ఈ వీరుల గాధలు ఇప్పటికి పాటలుగా, బుర్రకధలుగా ఆ ప్రాంతప్రజలు పాడుకుంటూనే ఉన్నారు. బ్రహ్మనాయడుని సాక్షాత్తు శ్రీకృష్ణుని అవతారంగా కొలుస్తారు. ఈ కధకి భారతకధకీ చాలాపోలికలుండటంతో దీనిని పల్నాటి వీరభారతం అని అభివర్ణిస్తారు.


ఈ కావ్యం చాలామంది రచించినా శ్రీనాధ భట్టరకుని ద్విపదకావ్యం చాల ప్రసిద్ధిచెందింది.  చాలాకాలంగా ఈ పుస్తకం కోసం ప్రయత్నిస్తుండగా అదృష్టవశాన నాకు నెట్ లో దొరికింది. అదే ఇప్పుడు మిత్రులందరితో పంచుకుందామని ఈ ప్రయత్నం.


శ్రీరఘునాయకు జిత్తమందెంచి
శ్రీకంఠుపరమేశు శివునాత్మ-దలచి
పార్వతీదేవికి భావించిమ్రొక్కి
శివగణంబులనెల్ల చింతించిపొగడి
ప్రాకటంబుగవిష్ణు ప్రార్ధనజేసి
యిందిరాదేవిని నిచ్చలోనిలిపి
విష్ణుభక్తులనెల్ల వినుతులు సేసి
జలజజుగొనియాడి శారదనెంచి
అఖిలవిద్యలకెల్ల ఆద్యుడైనట్టి
గజముఖవిఘ్నేశు ఘనతకీర్తించి
వీరభద్రుని శౌర్య విభవంబులెన్ని
సంగమేశ్వరునకు చక్కగామ్రొక్కి
గుర్జాలగంగను గోరిప్రార్ధించి
భక్తి గోగులపాటి భైరవుదలచి
నీలమేఘశ్యాము నిజమూర్తియయిన
శీలమ్మనాయుని చిత్తమందెంచి
కడువేడ్క పోతలింగము గొనియాడి
మాచర్ల చెన్నుని మదిలోనదలచి
ఆంధ్రకవుల నుతులమరగావించి
గీర్వాణకవులను కీర్తించి మ్రొక్కి
సంగీతసాహిత్య చాతుర్యకవిత
చెప్పనేర్చినవాడ చెలగి "మాచర్ల"
చెన్నకేశవపాదసేవారతుండ
వలను భారద్వజ వంశవర్ధనుడ
కవిసార్వభౌముడ ఘనతగన్నట్టి
శ్రీనాధుడనువాడ శివభక్తిపరుడ
శాశ్వతంబైనట్టి సద్గ్రంథమొకటి
చెప్పబూనిమనసు చెలరేగియుండ
శ్రీరమ్యవక్షుండు శ్రితవత్సలుండు
వారిజనేత్రుండు వల్లవీవిటుడు
శమితభక్తజనార్తి శాశ్వతకీర్తి
కందర్పజనకుండు కనకాంబరుండు
సురరాజవిహితుండు శుభవీక్షణుండు
కరుణాంతరంగుండు కలుషభంగుండు
ఎల్లజగముల నేలెడుఘనుడు
పాలమున్నీటిపై బవళించువాడు
సోరిదినెల్లప్డు భూసురరక్షకుండు
గిరిధర్ముడగు చంద్రగిరిరంగవిభుని
వేంకటాద్రిపునకు వెలయునొక్కొక్క
సరసునకు రణసాహసాంకునకు
అలరాజుబాకున కవతారమొంది
మలసినూటొక్క బొమ్మలపెండేరంబు
చెలగిడాకాలనుంచిన మహాఘనుడు
చిలుకలపైకోర్కె జిక్కెడివాడు
చేకొన్నమాచెర్ల చెన్నకేశవుడు
నాకలలోవచ్చి నయమొప్పబలికె
వినవోయిసత్కవి వేడ్కనామాట
మనముననాకు సమ్మతమైనదొకటి
అనవిని దేవ మహాప్రసాదంబు
దృఢముగనానతి యిమ్మునాకిప్పు
డనచెన్నకేశవు డప్పుడిట్లనియె
శౌర్యంబుపుణ్యంబు సమకూర్చినట్టి
పలనాటివీరుల భాగవతంబు
ప్రకటితంబుగనీవు రచియించిమాకు
అంకితంబొనరింప ననువొందుసూవె
అనుచును శ్రీకాంతు డరిగినపిదప
మేల్కాంచిమనమున మేలయ్యెననుచు
విలసిల్లు పలనాటి వీరులచరిత
జనులెల్ల భక్తిచే చదువుటకొరకు
మంజరీద్విపదగా మన్నించినేను
చెప్పబూనితి వచః శ్రీమెరయంగ
ప్రకటితంబైనట్టి పలనాటిలోన
భావింపగావిష్ణు భక్తిని మెరసి
నరనాధసింహంబు నలగామరాజు
మహితచారిత్రుడు మలిదేవరాజు
ధారణినేలుచు తమలోనబోరి
కార్యమపూడి శ్రీకదనంబునందు
నరపాలచంద్రుండు నలగాముతాక
పంపిన బాలుండు బాహువిక్రముడు
తోరంపుగజములు తురగచయంబు
మున్నీలబలముల మహితశౌర్యమున
చెదరిపారగబోడ్చి చీకాకుసేసి
నలగాముతమ్ముడు నరసింగునెదిరి
మర్ధించిరణమున మడిసినవిధము
ప్రచురింతువీనుల పండువుగాను.

కథా ప్రారంభం

గణుతింప తత్కథాక్రమమెట్టి దనిన
అరయ మేడపిలోన అలరాజుచావు
వీరవిక్రమతచే వీరసాహసత
పరగిన నాయకుల్ పటుపరాక్రములు
వీరనాయకులెల్ల వినివెరగంది
భావించితలపోసి బాలమాల్దేవు
బిరుదురాజునుదెచ్చి పృథ్వివెలయగ
నయమైనయట్టి లగ్నంబునందతని
పట్టంబుగట్టిరి పరగమేడపిని.
భూమీశసుతునిట్లు పుడమినినిలిపి
భాస్కరసమతేజు బాలునిదెచ్చి
సచివకార్యంబున సమ్మతినుంచి
అటకరణపుకార్య మనపోతుకిచ్చి
మాడాచియనునట్టి మగువనుదెచ్చి
రాణివాసముగావ రక్తితోనుంచి
ఆనందమునుబొంది రంతటవారు.

Monday, September 6, 2010

వైజయంతీ విలాసం

తెలుగు కావ్యాలలో "వైజయంతీ విలాసము"కి ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ కావ్యాన్ని సారంగు తమ్మయ అనే కవి రచించాడు. ఈయన గురించి పెద్దగా విషయాలేమి తెలియవు కానీ ఈయన బహుశా 1600 దశాబ్దం వాడు కావచ్చునని ఒక వాదన. 

        కథా వస్తువు: 

        వైజయంతీ విలాసము మహాభక్తుడైన విప్రనారాయణుని జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల మీద ఆధారం చేసుకుని రచించిన కావ్యం. ఇందులో వచ్చే ముఖ్య పాత్రలు... 


  1. విప్రనారాయణుడు
  2. మధుర వాణి
  3. దేవదేవి

        ఇంకా విప్రునివేషంలో వచ్చిన శ్రీరంగనాధుడు, మహారాజు మొదలైన వారు. 

        కథ క్లుప్తంగా: 

        శ్రీరంగపురం దగ్గరి కావేరీ నది తీరాన మండగుడి అనే అగ్రహారంలో నారాయణుడు అనే బ్రాహ్మణుడు, అతని భార్య లక్ష్మీ నివసిస్తూ ఉండేవారు. ఆ దంపతులకు సంతానం లేదు. ఒకనాడు ఒక యతి భిక్షకై ఆ ఇంటికి వచ్చినప్పుడు, ఆ ఇల్లాలు భిక్ష వేయపోగా "సంతాన హీనుల నుండి భిక్ష స్వీకరింపను" అని ఆ యతి నిరాకరిస్తాడు. అప్పుడు ఆ ఇల్లాలు "మహాత్మా ఇది విష్ణు ప్రసాదం. మహాత్ములు మీరు దీనిని నిరకరింప తగునా? మీరు అన్ని ధర్మములు తెలిసిన వారు కదా ?" అని ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆ యతి కొంచంసేపు ఆలోచించి భిక్ష తీసుకొని వెళ్ళిపోతాడు. 

        తరువాత ఇంటికి వచ్చిన భర్త నారాయణునితో జరిగినది అంతా వివరించి సంతానం లేనందువలననే కదా ఇట్టి పరిస్థితి అని బాధపడుతుంది. నారాయణుడు ఆమెను ఓదారుస్తాడు. ఆ రోజు రాత్రి ఆ గృహిణికి కలలో శ్రీ మాహావిష్ణువు దర్శనమిచ్చి, వైజయంతి అను నలుపు తెలుపు రంగుల పూలదండ ఇస్తాడు. ఆ పూలదండ మహిమ వలన కాల క్రమేణా ఆ గృహిణి గర్భందాల్చి ఒక శుభమూహూర్తాన మగబిడ్డని ప్రసవిస్తుంది. 

        వైజయంతి అనే మాలిక అంశన పుట్టిన బిడ్డని చరిత్రము కాబట్టి దీనికి "వైజయంతీ విలాసము" అనే పేరు వచ్చింది. 



 అలా జన్మించిన బిడ్డ విప్ర నారాయణుని పేరుతో ప్రసిద్ధి కెక్కాడు. చాలా కొద్దికాలంలోనే సర్వశాస్త్రాలలో పండితుడైనాడు. మాలికాంశమున జన్మించటం వలన ఆలయంలోని భగవానిడికి మాలికలని సమర్పించాలి అనే ఆశతో ప్రతి దినం పూలన్ని ప్రోగుచేసి మాలలు కట్టి శ్రీరంగనాధుడికి సమర్పిస్తుండేవాడు. కొంతకాలానికి కావేరీ తీరంలో శ్రీమకుటద్వీపం అనే స్థలాన్ని కొని అక్కడ ఒక పెద్ద పూలతోట పెంచి, అందులోని పూలతో రంగనాధుడిని కొలుచుకుంటు ఉండేవాడు.

        ఇలా కొంత కాలం ప్రశాంతంగా గడిచిపోయింది. ఒక నాడు శ్రీరంగం నుండి దేవదేవీ, మరియు ఆమె అక్క మధురవాణి అను వారాంగనలు వచ్చి మహారాజుని తమ ఆటపాటలతో సంతోష పరిచి, అనేక బహుమతులు పొంది సంతోషంగా మరలి ఇంటికి వెల్తున్నారు. అదే సమయాన పూజ ముగించుకొని విప్రనారాయణుడు తన నివాసానికి బయలుదేరాడు. ఆయన రాకను గమనించిన ఆ వేశ్యాంగనలు దూరము నుండే ఆయనకు నమస్కరించారు. ఏదో ఆలోచనలో ఉన్న విప్ర నారాయణుడు వారిని గమనించకనే వెళ్ళిపోయాడు.అది చూసిన దేవదేవికి ఒళ్ళుమండింది. 


మ్రొక్కిన నెవ్వరే మనఁడు, మో మటు వెట్టుక చక్కఁబోయె, నీ
దిక్కుని జూడఁడాయె, ఒక దీవెన మాటయు నాడఁడాయె, వీఁ
డెక్కడివైష్ణవుండు; మనమేటికి మ్రొక్కితిమమ్మ, యకటా!
నెక్కొని వెఱ్ఱిబుద్ధిమొయి నిద్దురయోయిన కాళ్ళకున్ !
        అందుకు మధురవాణి "వారు చూసినా చూడకున్న మనకేమిటి? పూజ్యులకు నమస్కరించటం మన విధి"అని ఎన్నో విధాల నచ్చ చెప్పింది. ఐనా దేవదేవి శాంతించలేదు. మాటా మాటా పెరిగింది. తాను ఎలాగైనా ఆ విప్రుని తన వలలో వేసుకోగలను అని దేవదేవి అన్నది. ఇద్దరూ పందెం వేసుకున్నారు. పందెం ప్రకారం దేవదేవి కనుక ఆ విప్రుని వలలో వేసుకుంటే మధురవాణి వేశ్యావృత్తి మానుకోవాలి లేదా దేవదేవి మానుకోవాలి.

        మరునాడు దేవదేవి తన ఆభరాణాలు అన్నిటిని వదిలి ఒక దాసరివేషం ధరించింది. అలా దాసరి వేషం వేసిన దేవదేవి విప్రనారాయణుని ఆశ్రమానికి వచ్చి అక్కడ మాలలని అల్లుతున్న విప్రనారాయణుని చూసి పాదాభివందనం చేసిమ్రొక్కుతు నిలుచుంది. అప్పుడు ఆమెను చూసిన విప్రనారాయణుడు, "ఎవరు నీవు? నీ పేరు ఏమి?" అని అడిగాడు.



అందుకు ఆమె "అయ్యా ! నేను శూద్ర కులము దానను. నాకెవ్వరునూ లేరు. ఏదిక్కునూ లేదు. హరిభక్తులు, జితేంద్రియులైన తమ పాద సేవకై వచ్చాను" అన్నది.

        "నీకెవ్వరు లేరనుచున్నావు. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు? ఈ విరక్తికి కారణం ఏమిటి?" అని అడిగాడు విప్రనారాయణుడు.

        "స్వామీ ! నా జన్మ పరమ నికృష్టమైనది. నాపేరు దేవదేవి. నేనొక వేశ్యాపుత్రికను. సంగీత నాట్య కళలన్నీ నేర్చుకున్నాను" అని తన వృత్తిలోని లోటు పాట్లను అన్ని వివరించి, తను ఎటుల శ్రీమద్భాగవత పురాణములోని పింగళోపాఖ్యానము విని విష్ణుభక్తురాలిగా మరినదో వివరించింది.

        "దేవదేవీ ! శ్రీవైష్ణవులకు వేశ్యలతో సహవాసం తగదు. మీతో సహవాసం చేసిన లోకులేమందురో ?" అని విప్రనారాయణుడు సందేహం వెలుబుచ్చాడు.

        "స్వామీ ! దేహవాంచ్చేయున్న యెడల తమ వద్దకు ఎందుకు వస్తానూ. అన్నిటి మీద విరక్తి చేతనే మీ వద్దకు వచ్చాను. నన్ను తమ దాసిగా స్వీకరించండి. తమకు అన్ని పనులు చేసిపెడతాను" అని ఎన్నో విధాల వేడుకున్నది.

        అందుకు విప్రనారాయణుడు ఆలోచించి చివరకు ఆమెను తన ఆశ్రమంలో ఉండటానికి అనుమతిని ఇచ్చాడు.

        దేవదేవి ఆ మాటలకు సంతోషించి, అతని ఆశ్రమంలోనే ఉంటూ అతనికి అన్ని పనులలో చేదోడు వాదోడుగా మెలగ సాగింది. అలా కొంతకాలం గడిచింది. అన్నిపనులకి చేదోడువాదోడుగా ఉంటూ తలలో నాలిక వలే ఉన్న దేవదేవి మీద విప్రనారాయణునికి నెమ్మదిగా అభిమానం పెరగ సాగింది. అది గమనించిన దేవదేవి తన ఎత్తు పారుతున్నందుకు లోలోన సంతోషించ సాగింది.

        ఇలా ఉండగా ఒకనాడు భోరున వర్షం కురవసాగింది. అది చూసిన విప్రనారాయణుడు దేవదేవిని తన కుటీరంలోనికి ఆహ్వానించాడు. దేవదేవి అందుకు కొంత బెట్టు చూపించింది. తన రాకవలన బ్రాహ్మణుడు అపవిత్రం ఐపోతాడని, అతని నిష్టని భంగం చేయటం తనకు తగదనీ ఎన్నో మార్లు చెప్పింది. ఐనా విప్రనారాయణుడు వదలక ఆమెను తన కుటీరంలోనికి తీసుకుని వెళ్ళి తన ఇచ్చని తెలియచేసాడు. ముందు కొంత బెట్టు చేసిన దేవదేవి చివరకు అంగీకరించింది. ఆవిధంగా దేవదేవి తన ప్రతిఙ్ఞ నేరవేర్చుకుంది. విప్రనారాయణుడు బ్రష్టుడయ్యాడు. 



కొంతకాలం గడిచాక తన ప్రతిఙ్ఞ నేరవేరిందికనుక ఇంక తను శలవు తీసుకోతలచి విప్రనారయణునితో"స్వామీ! నేను ఇక్కడ ఉన్న విషయం తెలిసి మా అమ్మగారు ఈ ఊరు వచ్చియున్నారు. ప్రస్తుతం మా అక్క గారి వద్ద ఉన్నారు. నేను ఈ రోజు పోయి వారిని దర్శించి మరల రేపు ఉదయం తిరిగి వస్తాను" అన్నది.

        ఆ మాటలకి విప్రనారయణుని కాళ్ళు చల్ల బడ్డాయి. అంతసేపు ఆమెని విడిచి ఉండలేక ఆమెతో బయలుదేరాడు. కానీ అక్కడా అతనికి అవమానమే ఎదురయింది. వేశ్యమాత అతనిని అనరాని మాటలతో అవమానించింది. ఆ మాటలని పడలేక విప్రనారాయణుడు కుటీరానికి తిరుగు మొహంపట్టాడు. కుటీరం చేరిన విప్రనారాయణుడు, తన దుస్థితికి చాలా విచారించాడు. తను ఎల బ్రష్టుడయ్యింది తలుచుకొని చాలా బాధ పడ్డాడు. తనని ఆ పాపం నుంచి రక్షించమని శ్రీహరిని వేడుకొన్నాడు.

        అతని బాధకి శ్రీహరికి అతని మీద జాలి కలిగింది. తను ఒక బ్రహ్మణకుమారుని వేషం ధరించి ఆలయంలోని ఒక బంగారు పాత్రని తీసుకొని వేశ్యమాతవద్దకు వెళ్ళాడు. ఆమె అ విప్ర కుమారుడిని ఆదరించి వివరాలు అడిగింది. "అమ్మా నేను ఒక బ్రహ్మణ కుమారుడను. నాపేరు రంగడు. విప్ర నారయణుని శిష్యుడను. వారు పంపగా వచ్చాను. వారు తమకు ఈ పాత్రను ఇచ్చి రమ్మన్నారు" అని ఆ బంగారు పాత్రను ఆమెకు అందచేసాడు.

        అంత బీదవాని వద్ద బంగారు పాత్ర ఉండటం నమ్మని వేశ్యమాత స్వర్ణకారుణ్ణి పిలిపించి ఆ పాత్రని పరిక్ష చేయించింది. స్వర్ణకారుడు ఆ పాత్రను గుడిలోని పాత్రగా గుర్తించినా ఏమియూ చెప్పక అది మంచి విలువైన మేలిమి బంగారమని నిర్ణయించి వెళ్ళి పోతాడు. ఆ బ్రహ్మణుని వద్ద ఇంకా బంగారు సామాగ్రి ఉండవచ్చనే అనుమానంతో వేశ్యమాత కావేరీ అను దాసిని పంపి విప్రనారాయణుని మరల తన ఇంటికి పిలిపించుకుంటుంది.

        మరునాడు నైవేద్యం సమయంలో గుడిలోని బంగారు పాత్ర కానక అర్చకులు దేవాలయాధికారికి ఆ విషయాన్ని తెలియ చేసారు. ఆతను విచారణ జరిపి చివరకు స్వర్ణకారుని ద్వారా ఆ పాత్ర వేశ్యావాటికలో ఉన్న విషయం తెలుసుకొని దేవదాసినీ, విప్రనారాయణుని రాజ సభకు పిలిపించారు. రాజ విచారణ ప్రారంభం అయ్యింది. విప్రనారాయణుడు తాను నిర్దోషి అని ఎంతచెప్పినా ఎవ్వరూ వినలేదు. అతనిని దోషిగా నిర్ణయించి దేశబహిష్కార శిక్ష విధించారు. ఆ అవమానం భరించలేని విప్రనారాయణూడు శ్రీహరిని ప్రార్ధించాడు. అప్పుడు అందరు ఆశ్చర్య పడేలాగున శ్రీ హరి ప్రత్యక్షమై జియ్యరుతో "ఈ విప్రనారాయణుడు నిర్దోషి. ఇదంతా నేను జలిపిన లీలా వినోదం. ఈ విప్రనారయణుడు నా వనమాలిక వైజయంతి అంశతో జన్మించినవాడు. మహాభక్తుడు. ఈ దేవదేవి పుర్వజన్మాన ఒక అప్సరకాంత. ఆమెకు నేను స్వయంగా ఇచ్చిన బంగారు పాత్రను వెనుకకు తీసుకొనరాదు" అని తీర్పు చెప్పి అంతర్ధానం అయ్యాడు. 



 అంత అక్కడి భక్తులందరు విప్రనారాయణునికి బ్రహ్మరధం పట్టారు. ఆయనను రంగనాధుని ఆలయానికి తీసుకొనివెళ్ళగా అక్కడ ఆయన రంగనాధుని అనేక విధాల ప్రస్తుతించాడు. అతని భక్తికి మెచ్చిన రంగనాధుడు ప్రసన్నుడై "నీకు నా సామీప్య పదవిని ఇస్తున్నాను. ఇక మీదట నీవు తొండరడిప్పాడి ఆళ్వారు అనే పేరు ప్రసిద్ధి కలుగుతుంది" అని వరమిస్తాడు.

        ఆ తరువాత విప్రనారాయణుడు స్వామిపై అచంచల భక్తితో ఆయనను సేవిస్తూ ధన్యుడయ్యాడు. దేవదాసి కూడా తనకు లభించిన బంగారు పాత్రతో పాటు తనవద్ద ఉన్న సంపద అంతా పంచివేసి దైవ ధ్యానంలో జీవితం గడిపి వేస్తుంది.

        ఇది "వైజయంతీ విలాసం" కథ. ఈ కావ్యంలోని పద్యాలు చక్కని సులువైన భాషలో ఉండి చదవటానికి ఎంతో ఆనందం కలగ చేస్తాయి. కావ్యంలో కథతో పాటు అద్భుతమైన వర్ణనలు ఎన్నో ఉన్నాయి. కథలో భక్తితో పాటుగా వేశ్యాలోలత్వం వల్ల కలిగే నష్టాలు, కష్టాలు గురించి కూడా మనకి తెలియచేస్తుంది.

        ఇది అందరు చదివి ఆనందించవలసిన ఒక మంచి కావ్యం. మీరూ చదవండి. మిగిలిన వారితో చదివించండి.