Sunday, July 17, 2016

ఆంధ్ర నామసంగ్రహము - 8

స్థావరవర్గు

సీ. వలిదిప్ప వడఁకుగుబ్బలి చలిమిరిమల, గట్టులఱేఁడు ముక్కంటిమామ
మంచుఁగొం డన హిమక్ష్మాధరాఖ్యలు చను, వేలుపుఁగొండ జేజేలగట్టు
పుత్తడిగుబ్బలి పూనుకకంచమువాని, విల్లు నా మేరువు పేళ్లు వెలయు
వెలిదిప్ప ముక్కంటిమల వెండికొండ నాఁ, గైలాసపర్వతాఖ్యలు సెలంగు

తే. వెలయుఁ దరిగొండ కవ్వంపుమల యనంగ
మంధరాఖ్యలు కడపటిమల యనంగఁ
జుట్టుఁగొం డనఁ దనరు నీక్షోణియందుఁ
జక్రవాళాద్రి (వృషవాహ శైలగేహ)                      (1)

టీ. వలిదిప్ప ( వలి = చల్లదనముగల తిప్ప = కొండ), వడకుగుబ్బలి (పా. వణకుగుబ్బలి) వడకునట్లు చేయు పర్వతము, చలిమిరిమల = చల్లని కొండ, గట్టులఱేడు = పర్వతములకు రాజు, ముక్కంటిమామ = శివునకు మామ, మంచుఁగొండ = హిమముగల పర్వతము - ఈ ఆరును హిమవత్పర్వతమునకు పేర్లు. వేలుపుఁ గొండ (వేలుపు + కొండ) = దేవతలు నివసించు పర్వతము, జేజేలగట్టు = దేవతల పర్వతము, పుత్తడుగుబ్బలి = బంగారు పర్వతము, పూనుకకంచమువాని విల్లు = ఈశ్వరుని ధనుస్సు - ఈ నాలుగును మేరు పర్వతమునకు పేర్లు. వెలిదిప్ప (వెలి + తిప్ప) = తెల్లని పర్వతము, ముక్కంటిమల = శివునకు ఉనికిపట్టగు పర్వతము, వెండికొండ = వెండివలె దెల్లని పర్వతము, - మూడును కైలాస పర్వతమునకు పేర్లు. తరిగొండ (తరి + కొండ), కవ్వంపుమల (కవ్వము + మల) - ఈ రెండును మంధర పర్వతమునకు పేర్లు. కడపటిమల = కడగా నుండెడు పర్వతము, చుట్టుఁగొండ (చుట్టు + కొండ) = భూమి చుట్టు నుండెడు పర్వతము - ఈ రెండును చక్రవాళ పర్వతమునకు పేర్లు.

ఆ. తూర్పుఁగొండ నాఁగఁ దొలుగట్టు నాఁగను
బొడుపుగుబ్బ లనఁగఁ బూర్వశిఖరి
పరఁగుఁ గ్రుంకుమెట్టు పడమటికొండ నా
వెలయు నస్తశిఖరి (విశ్వనాథ)                     (2)

టీ. తూర్పు గొండ (తూర్పు + కొండ) =పూర్వ దిక్కునందుండెడి పర్వతము, తొలుగట్టు = పూర్వదిక్కు నందలి పర్వతము, పొడుపుగుబ్బలి = సూర్యు దుదయించెడు పర్వతము, - ఈ మూడును ఉదయ పర్వతమునకు పేర్లు. క్రుంకుమెట్టు = సూర్యుడస్తమించు పర్వతము, పడమటికొండ = పడమటిదిక్కు నందుండెడి పర్వతము - ఈ రెండును అస్తమయ పర్వతమునకు పేర్లు.

తే. ఒప్పు గిరిపేళ్లు మల గట్టు తిప్ప మెట్టు
కొండ గుబ్బలి నా మేరు (కుధరచాప)
ఱాయి నాఁ గ ల్లనంగను ఱా యనంగ
శిల కభిఖ్యలు దగు నిల (శేషభూష)           (3)

టీ. మల, గట్టు, తిప్ప, మెట్టు, కొండ, గుబ్బలి, - ఈ ఆరును పర్వతమునకు పేర్లు. ఱాయి, కల్లు, ఱా - ఈ మూడును శిలకు పేర్లు.

తే. పల్లె, కొటిక కుప్పమ్ము నాఁగ
నూ రనఁగ గ్రామనామంబు లొప్పుచుండుఁ
బట్టణంబున కాఖ్యలు పరఁగుచుండుఁ
బ్రోలనఁగ వీడనంగను (శూలపాణి)              (4)

టీ. పల్లె (రూ. పల్లియ), కొట్టిక, కొటిక, కుప్పము, ఊరు - ఈ అయిదును గ్రామమునకు పేర్లు. ప్రోలు, వీడు - ఈ రెండును పట్టణమునకు పేర్లు.

ఆ. ఉనికిపట్టు తావు మనికిప ట్టిర విల్లు
తెంకి యిక్క నట్టు టెంకి యిమ్ము
నెలవు గీము నాఁగ నలరు నివాసదే
శంబునకును బేళ్లు (చంద్రమౌళి)            (5)

టీ. ఉనికిపట్టు, తావు, మనికిపట్టు, ఇరవు, తెంకి, యిక్క, నట్టు, టెంకి ఇమ్మి, నెలవు, గీము (గృహశబ్ధ భవము) - ఈ పన్నెండును నివాసస్థానమునకు పేర్లు.

సీ. తెంకాయచె ట్టనఁ డెంకాయమ్రా నన, నారికేళం బొప్పు (నగనివేశ)
మావిమ్రా ననఁగను మామిడిచెట్టన, నామ్రభూజం బొప్పు (నభ్రకేశ)
అత్తిమ్రానన మేడి యనఁగ నౌదుంబర, ధారుణీజం బొప్పు (మేరుచాపా)
యరఁటి యనఁటి నాఁగ నంశుమత్ఫలధారు, ణిరుహం బగు (ధరణీశతాంగ)

తే> యలరుఁ దుంబీశలాటుసమాఖ్య లాను
గంబు సొఱకాయ వదరు నా (గరళకంఠ)
తా డనంగను దాడి నా తాళభూరు
హంబునకు నాఖ్యలై యొప్పు (నంబికేశ)         (6)

టీ. తెంకాయచెట్టు, టెంకాయమ్రాను - ఈ రెండును కొబ్బరి చెట్టు పేర్లు. మావిమ్రాను, మామిడిచెట్టు - ఈ రెండును చూతవృక్షమునకు పేర్లు. అత్తిమ్రాను, మేడి - ఈ రెండును అత్తిచెట్టుకు పేర్లు. అరటి, అనటి - ఈ రెండును కదళీ వృక్షమునకు పేర్లు. అనుగము, సొఱకాయ వదరు - ఈ మూడును సొఱకాయ పేర్లు. తాడు, తాడి - ఈ రెండును తాటిచెట్టు పేర్లు.

సీ. మొక్క మోక నిసువు మొలక మో సనఁగ నం, కురమునకు బేళ్లు (కుధరచాప)
యిగు రనఁ దలిరు నా జిగురు నా జివు రనఁ, బల్లవనామముల్ పరఁగు (నీశ)
మ్రా ననఁ జె ట్టన మ్రాఁ కన భూరుహ, నామధేయము లగు (వామదేవ)
పువు పువ్వు పూ నాఁగఁ  బుప్పము విరి యల, రనఁ గుసుమాఖ్య లైయలరు (నీశ)

తే. గుబురు దట్టము జొంపంబు గుంపు తఱచు
నాఁగ నిబిడంబు పేళ్లొప్పు (నందివాహ)
వల్లరిసమాఖ్య లగుచు వర్తిల్లు దీఁగ
తీవ తీవియ తీవె నాఁ (ద్రిపురవైరి)                 (7)

టీ. మొక్క, మోక, నిసువు, మొలక, మోసు - ఈ అయిదును అంకురమునకు పేర్లు. ఇగురు, తలిరు, చిగురు, చివురు - ఈ నాలుగును పల్లవముల పేర్లు. మ్రాను (రూ. మాను), చెట్టు, మ్రాకు, - ఈ మూడును చెట్టునకు నామములు. పువు, పువ్వు, పూ, పుప్పము (పుష్పశబ్ధభవము) విరి, అలరు, - ఈ ఆరును పుషపు పేర్లు. గుబురు, దట్టము, జొంపము, గుంపు, తఱచు - ఈ అయిదును సందులేక యుండువానికి పేర్లు. తీగ, తీవ, తీవియ, తీవె (రూ. తీగె) - ఈ నాలుగును తీగకు పేర్లు.

ఆ. అగ్రమున కభిక్య లగుచుండుఁ దుద సుద
కొన యనంగ వేక్షకోటరమున
కలరుఁ బేళ్లు తొఱట తొలి తొఱ్ఱ తొఱ నాఁగ
(నాగహర రజతనగ విహార)                           (8)

టీ. తుద, సుద, కొన _ ఈ మూడును అగ్రమునకు పేర్లు. తొఱట, తొలొ, తొఱ్ఱ, తొఱ - ఈ నాలుగును చెట్టుతొఱ్ఱకు పేర్లు.

ఆ. ఇక్షువున కభిఖ్య లీక్షితిఁ గన్నుల
మ్రాను చెఱకు తియ్యమ్రా ననంగఁ
దనరు దవ యనంగఁ దలవాఁడె నాఁగఁ ద
దగ్రమున కభిఖ్య లగు (గిరీశ)                  (9)

టీ. కన్నులమ్రాను = గనుపులుగల చెట్టు, చెఱకు, తియ్యమ్రాను = మధురమైన వృక్షము - ఈ మూడును చెఱకునకు పేర్లు. దవ, తలవాడె - ఈ రెండును చెఱకు కొనకు పేర్లు.

క. అగుఁ బే ళ్లుత్పలమునకుం
దొగ తొవ గల్వ గలు వనఁగఁ దోయజ మొప్పుం
దగఁ దమ్మి తామరనఁగా
మొగడన మొగ్గ యబఁ దనరు ముకుళంబు (శివా)              (10)

టీ. తొగ, తొవ, కల్వ, కలువ - ఈ నాలుగును ఉత్పలములకు పేర్లు. తమ్మి తామర - ఈ రెండును తామరపువ్వు నకు పేర్లు. మొగడ, మొగ్గ - ఈ రెండును ముకుళమునకు పేర్లు.

తే. ఎసఁగుఁ జెందొవ చెందొగ యెఱ్ఱగలువ
యనఁగ రక్తోత్పలంబు రక్తాబ్జ మొప్పు
నిలను గెందమ్మి కెందామ రెఱ్ఱదామ
రనఁగఁ జెందమ్మి చెందామరన (మహేశా)        (11)

టీ. చెందొవ, చెందొగ, ఎఱ్ఱగలువ - ఈ మూడును ఎఱ్ఱని కలువకు పేర్లు. కెందమ్మి, కెందామర (కెంపు + తామర), ఎఱ్ఱదామర, చెందమ్మి, చెందామర - ఈ అయిదును ఎఱ్ఱతామరపువ్వునకు పేర్లు.

క. గొడుగు గొడు వెల్లి యనఁ జె
న్నడరు ఛత్రంబు కేతనాహ్వయము లగున్
సిడె మనఁగఁ డెక్కె మనఁగాఁ
బడగ యనన్ డా లనంగఁ (బర్వతధన్వీ)          (12)

టీ. గొడుగు, గొడువు ఎల్లి - ఈ మూడును ఛత్రమునకు పేర్లు. సిడెము, టెక్కెము, పడగ (పతాక శబ్ధ భవము), డాలు - ఈ నాలుగును ధ్వజమునకు పేర్లు.

క. మఱుఁ గనఁగ నోల మనఁగాఁ
మఱు వనఁగాఁ జా టనంగ మా టన వరుసం
బరఁగు ని వెల్ల నగోచర
ధరణీనామంబు లగుచు (దర్పకమదనా)             (13)

టీ. మఱుగు, ఓలము, మఱువు, చాటు, మాటు _ ఈ అయిదును కన్నులకు కనపడని ప్రదేశమునకు నామములు.

క. పొసఁగుఁ దృణాఖ్యలు పులు నాఁ
గస వనఁగాఁ బూరి యనఁగ గడ్డి యనంగా
వసుమతిలో నెన్నంబడు
ససి సస్సెము పై రనంగ సస్యం (బభవా)          (14)

టీ. పులు, కసవు, పూరి, గడ్డి - ఈ నాలుగును తృణమునకు పేర్లు. ససి, సస్సెము, పైరు - ఈ మూడును ధాన్యమునకు పేర్లు.

ఆ. తెలుపు దెల్ల వెల్ల తెలి వెలి నాఁగ నా
హ్వయము లమరు ధవళవర్ణమునకుఁ
గప్పు నలుపు నల్ల కఱ యన నాఖ్యలౌ
నీలవర్ణమునకు (నీలకంఠ)                       (15)

టీ. తెలుపు, తెల్ల ,వెల్ల, తెలి, వెలి, - ఈ అయిదునును ధవళవర్ణమునకు పేర్లు. కప్పు, నలుపు, నల్ల, కఱ (పా. కఱి) - ఈ నాలుహును నీలవర్ణమునకు నామములు.

ఆ. కెంపు దొగరు దొవరు గెంజాయ యెఱు పెఱ్ఱ
యనఁగ నరుణకాంతి కాఖ్యలయ్యె
నళిది పసుపుచాయ యనగ హారిద్రవ
ర్ణమునకు కాఖ్యలగుఁ (బినాకహస్త)             (16)

టీ. కెంపు, తొగరు, తొవరు, కెంజాయ (కెంపు + చాయ) ఎఱుపు, ఎఱ్ఱ _ ఈ ఆరును ఎఱ్ఱని కాంతికి పేర్లు. అళిది (రూ. హళిది) పసుపుచాయ - ఈ రెండును హారిద్ర వర్ణమునకు పేర్లు.

ఆ. శ్యామవర్ణమునకు నామంబు లగుచుండుఁ
బసరుచాయ యనఁగ బచ్చ యనఁగ
వన్నె డాలురంగు వన్నియ జిగి జోతి
చాయ యనఁగ బరఁగు జగతిఁ గాంతి           (17)

టీ. పసరుచాయ, పచ్చ - ఈ రెండును ఆకుపచ్చ వన్నెకు నామములు. వన్నె (వర్ణ శబ్ధభవము) డాలు, రంగు, వన్నియ, (ప్ర. వర్ణము), జిగి, జోతి, చాయ (ప్ర. ఛాయ) - ఈ ఏడును కాంతికి నామములు.

తే. మానికము లన రతనముల్ నా నెసంగు
నవని మాణిక్యములకు సమాహ్వయములు
మెఱుఁ గనంగను నిగ్గు నా మెఱయుచుండు
నాఖ్య లుత్కృష్టకాంతికి (నభ్రకేశ)            (18)

టీ. మానికము (ప్ర. మాణిక్యము) రతనము (ప్ర. రత్నము), - ఈ రెండును రత్నములకు పేర్లు. మెఱుఁగు, నిగ్గు - ఈ రెండును విశేషకాంతికి పేర్లు.

తే. జడధిపే ళ్లగు మున్నీరు కడలి సంద్ర
మనఁగ మడుఁగన మడువు నా హ్రదము దనరుఁ
బరఁగు నాఱవసంద్రంబు పాలవెల్లి
జిడ్డుకడలి పాల్కడలి నా క్షీరజలధి               (19)

టీ. మున్నీరు (మును + నీరు)= మొదటిసృష్టి, కడలి, సంద్రము (ప్ర. సముద్రము), - ఈ మూడును సముద్రమునకు పేర్లు. మడుగు, మడువు - ఈ రెండును హృదము పేర్లు. ఆఱవ సంద్రము, (లవణ, ఇక్షు, సుర, సర్పి, దధి, క్షీర, నీర సముద్రములలో ఇది ఆరవది), పాలవెల్లి (పాలు + వెల్లి) = క్షీర ప్రవాహము, జిడ్డుకడలి = జిడ్డుకల సముద్రము, పాల కడలి = క్షీర సముద్రము - ఈ నాలుగును క్షీర సముద్రమునకు పేర్లు.

క. నంజె యన మడి యనంగను
మంజుల కేదారభూసమాఖ్యలు వెలయుం
బుంజె యనఁ జేను పొల మనఁ
గం జన మరుభూమిపేళ్లు (కాయజదమనా)              (20)

టీ. నంజె, మండి _ ఈ రెండును మాగాణిభూమికి పేర్లు. పుంజె, చేను, పొలము - ఈ మూడును మెట్టభూమి పేర్లు. కంజ యనగా నిర్జల ప్రదేశమునకు పేరు.

క. ధరణిన్ వివరాఖ్య లగున్
బొఱియ కలుగు లాఁగ బొక్క బొంద యనంగా
దరి యొడ్డు గట్టనంగాఁ
బరఁగుం దీరంబు పేళ్లు (ప్రమథగణేశా)              (21)

టీ. బొఱియ, కలుగు, లాగ, బొక్క, బొంద - ఈ అయిదును బొంద పేర్లు. దరి, ఒడ్డు, గట్టు - ఈ మూడును తీరమునకు పేర్లు.

ఆ. అస లనంగను ఱొంపి నా నడు సనంగ
బుఱద నా నొప్పు గర్దమంబునకు బేళ్లు
భూమికి సమాఖ్యలగు బువి పుడమి నేల
మన్ను పంటవలంతి నా (మదనదమన)                   (22)

టీ. అసలు ఱొంపి, అడుసు, బుఱద - ఈ నాలుగును అడుసునకు పేర్లు. బువి (ప్ర. భువి), పుడమి (ప్ర. పృథివి), నేల మన్ను, పంటవలంతి = పంతలనొసగు దేవి - ఈ అయిదును భూమి పేర్లు.

Sunday, July 10, 2016

ఆంధ్రనామ సంగ్రహము - 7

క. బెడఁద దెస చేటు చేడ్పా
డ్గొడ వాత్రం బంగలార్పు గోరంబు దొసం
గిడుమ వెత కస్తి యంగద
కడగం డ్లనఁ జను విపత్తు (గౌరీరమణా)            (59)

టీ. బెడద, దెస చేడ్పాటు, గొడవ, ఆత్రము, అంగలార్పు, గోరము, దొసంగు, ఇడుము, వెత, కస్తి, అంగద, కడగండ్లు - ఈ పదునాల్గును ఆపదకు పేర్లు.

క. వెల జట్టి విలువ రో యనఁ
గలనుడువులు దనరుచుండు గ్రయనామము లౌ
వెలయంగ వంగసము నాఁ
గొల మన వంగడము నాఁగఁగుల మొప్పు (శివ)         (60)

టీ. వెల, జట్టి, విలువ, రో - ఈ నాలుగును క్రయమునకు పేరులు. వంగసము, కొలము, వంగడము - ఈ మూడును కులమునకు పేర్లు.

క. క్రమ్మఱ నెప్పటి వెండియుఁ
గ్రమ్మఱి తిరుగన్ మఱిన్ మరల మగుడను నా
నిమ్మహిఁ బునఃపదంబున
కిమ్ముల నివియాఖ్యలగు (మహీధరచాపా)          (61)

టీ. క్రమ్మఱన్, నెప్పటి, వెండియున్, క్రమ్మఱి, తిరుగన్, మఱి, మరలను, మగుడను - ఈ ఎనిమిదియు ఇంకను అను నర్ధముగలవి.

ఒకమరి యొకపరి యొకమా
టొకసా రొకతేప యనఁగ నొకపా రనఁగా
నొకవిడుత యొక్కతూ కన
నొకతడవ యనంగ మఱియు నొకతుఱి యనన్      (62)

తే. ఏకవారం బనుట కొప్పు నిన్ని పేళ్ళు
జగతిఁ బల్మాఱు వేమాఱు సారె పెక్కు
మాఱు లెన్నెనిమార్లనఁ బరగు నాఖ్య
లగుచు నివి బహువారంబు లనుట (ఖీశ)            (63)

టీ. ఒకమరి, ఒకపరి, ఒకమాటు, ఒకసారి ఒకతేప, ఒకసారి, ఒకవిడుత, ఒకతూకు, ఒకతడవ, ఒకతూరి _ ఈ పదుయును ఏకపర్యాయమనుటకు పేర్లు. పల్మాఱు (రూ.పలుమాఱు) పలుమాఱు, వేమాఱు, సారె, పెక్కు మాఱులు, ఎన్నేని మాఱులు - ఈ నాలుగును మాటిమాటికి అనుటకు పర్యాయములు.

తే. త్వరితమున కొప్పుఁ బేళ్లు చెచ్చరను సరగ
వేగిరము, వేగ వేళము వెసను వడిగ
గ్రక్కునను గ్రద్దన ననంగఁ గ్రన్న ననఁగ
గొబ్బునను దిగ్గున ననాంగఁ (గుధరచాపా)        (64)

టీ. చెచ్చెర (చర+చర) సరగ, వేగిరము, వేగ, వేళము, వెసన్, వడిగన్, గ్రక్కునన్, గ్రద్దనన్, క్రన్నన, గొబ్బునను, దిగ్గునన్, - ఈ పండ్రెండును శీఘ్రముగా అనుటకు పేర్లు.

క. కలవు వివరింపఁగా నా
ఖ్యలు వరుసన్ నిర్గమించె  ననుటకు ధరలో
వెలువడియె వెళ్లె వెడలెను
వెలలెననం (జిత్ప్రకాశ విశ్వాధిపతీ)             (65)

టీ. వెలువడియెను, వెళ్లెను, వెడలెను, వెలలెను -ఈ నాల్గును పయనమయ్యె ననుటకు పేర్లు.

క. వినుతియొనరించె ననుటకుఁ
దనరున్ నామంబు లగుచు ధరపై నగ్గిం
చెను గైవారము సేసెన్
గొనియాడెను బొగడె ననఁగ గొండాడె ననన్          (66)

టీ. అగ్గించెను, కైవారము సేసెను = స్తోత్రము చేసెను, కొనియాడెను, పొగడెను, కొండాడెను - ఈ ఐదును స్తోత్రము చేసెననుటకు నామములు.

సీ. చుట్టలు విందులు చుట్టాలు బందుగు, లనఁ జను బంధు సమాహ్వయములు
వఱలు నన్యుఁడు లాతివాఁ డనఁగా వింత, వాఁ దనఁగాఁ బెఱవాఁ దనంగ
వ్యాజంబునకు నామమౌ నెపం బనఁగ న, న్వేషించె ననుటకౌ వెదకె నెమకె
నరసె రోసె ననంగ నారసెఁ దడవె నాఁ, గాంక్షకుఁ బేరు లౌఁ గ్రమముతోడఁ

తే. గ్రచ్చు కోరిక తమి కోర్కి యిచ్చ యనఁగ
నెపుడు నెడపక యుడుగక యెల్లపు డన
నిచ్చ యనయంబు నాఁగను నిచ్చ లనఁగఁ
దనరు నాఖ్యలు సతతం బనుట (కీశ)                  (67)

టీ. చుట్టలు (ఏక. చుట్టము ) విందులు, చుట్టాలు, బందుగులు - ఈ నాలుగును బంధువునకు పేర్లు. లాతివాడు, వింతవాడు, పెఱవాడు - ఈ మూడును అన్యుడనుటకు పేర్లు. నెపము, వ్యాజమునకు పేరు. వెదకెను, నెమకెను, అరసెను, రోసెను, అరసెను, తడవెను - ఈ ఆరును విచారించెననుటకు పేర్లు. క్రచ్చు, కోరిక, తమి, కోర్కి, ఇచ్చ - ఈ నాలుగును ఆపేక్షకు పేర్లు. ఎపుడు, ఎడపక, ఉడుగక, ఎల్లపుడు, నిచ్చ, అనయము, నిచ్చలు - ఈ ఏడు ను సర్వదా అనుటకు పర్యాయములు.

సీ. తనరుఁ బ్రవేశించె ననుటకు నాఖ్యలు, తూకొనెఁ జొచ్చెను దూఱె ననఁగ
నంఘ్రితాడితుఁ జేసె ననుటకు బేళ్లగుఁ, దాఁచెఁ గాళ్ల గ్రుమ్మెఁ దన్నె ననఁగ
నాలస్య మొనరించె ననుటకుఁ జెల్లు నా, మమ్ములు తడసెను మసలె ననఁగఁ
ద్యక్తంబు గావించె ననుటకు నాఖ్య లౌ, వీడెను వదలెను విడిచె ననఁగ

తే. దాఱుమాఱయ్యె వీడ్వడెఁ దడఁబడె నన
నాఖ్య లొప్పు విపర్యస్తమయ్యె ననుట
కలరుఁ బ్రహరించె ననుట కాహ్వయము లడిచెఁ
గొట్టె మొత్తెను మోఁదె నాఁ (గుధరనిలయ)               (68)

టీ. తూకొనెను, చొచ్చెను, తూఱెను - ఈ మూడును ప్రవేశించెను అనుటకు పేర్లు. తాచెను, కాళ్ళ గ్రుమ్మెను, తన్నెను - ఈ మూడును కాలితో దన్నెననుటకు పేర్లు. తడసెను మసలెను - ఈ రెండును ఆలస్యము చేసెను అనకు పేర్లు. వీడెను, వదలెను, విడిచెను - ఈ మూడును పరిత్యజించెను అనుటకు నామములు. తాఱుమాఱయ్యెను, వీడ్వడెను, తడబడెను - ఈ మూడును హెచ్చుతక్కువయ్యెను అనుటకు పేర్లు. అడిచెను, కొట్టెను, మొత్తెను, మోదెను - ఈ నాలుగును ప్రహరించె ననుటకు పేర్లు.

సీ. ముందట నెదుటను మ్రోల ముంగల నాఁగ, నాఖ్యలౌ సముఖమందనుట (కభవ)
యలయిక బడలిక యలపు సేద యనంగ, శ్రమమున కాఖ్యలౌ (శమనదమన)
తాలిమి యోరుపు తాలిక నాఁగను, క్షమకు నాహ్వయములౌ (జర్మవసన)
ఠవళి బవంతంబు టక్కు దుత్తూరంబు వెడ్డు నా ఛద్మమౌ (విషమనేత్ర)

తే. వెఱ పనఁగ నెద యనఁగను వెఱ యనంగ
నళు కనఁగ భీతి కాఖ్యలౌ (నసితకంఠ)
నిమ్మళం బన నెమ్మి నా నెమ్మది యనఁ
దనరుఁ బేళ్లు నిరాతంకమునకు (నీశ)                  (69)

టీ. ముందటను, ఎదుటను, మ్రోలన్, ముంగలన్ - ఈ నాలుగును సమ్ముఖమందనుటకు పేర్లు. అలయిక, బడలిక, అలపు, సేద - ఈ నాలుగును శ్రమమునకు పేర్లు. తాలిమి (రూ. తాల్మి) ఓరుపు, (రూ. ఓర్పు) తాలిక - ఈ మూడును క్షమకు పేరులు. ఠవళి, బవంతము, టక్కు, దుత్తూరము, వెడ్డు _ నాల్గును కపటమునకు పేర్లు. నిమ్మళము, నెమ్మి, నెమ్మది, (నెఱ + మది = నిండు మనస్సు) - ఈ మూడుని నిర్భయమునకు పేర్లు.

సీ. అసదు కొంచెము సైక మలఁతి యన్నుప చిన్న, నలికంబు సన్నంబు నాఁ దనర్చు
స్వల్ప మెక్కుడు నాఁగఁ జాల నెంతేనియు, మిగులఁ దద్దయుఁ దద్ద మిక్కిలి యనఁ
బెద్దయు ననునివి పేళ్లగు భృశముగా, ననుటకు నుత్కటమయ్యె ననుట
కగుఁ బేళ్లు వెగ్గలంబయ్యెఁ గ్రిక్కిఱిసె వె, క్కసమయ్యె ననునివి క్రమముతోడ

తే. స గ్గెఁ గుందె డోంకెఁ దగ్గెను సడలెను
క్రుంగె సుబ్బణంగె స్రుక్కె ననఁగఁ
దనరుఁ బేళ్లు క్షీణదశ నొందె ననుటకు
(నీశ్వరీసనాథ విశ్వనాథ)                    (70)

టీ. అసదు, కొంచము, సైకము, అలతి, అన్నువ, చిన్న నలికము, సన్నము - ఈ ఎనిమిదియు కొంచమనుటకు పేర్లు. ఎక్కుడు, చాలన్, ఎంతేనియున్, మిగులన్, తద్దియున్, తద్ద, మిక్కిలి, పెద్దయున్, - ఈ ఎనిమిదియు అధికముగా ననుటకు పేర్లు. వెగ్గలమయ్యెను, క్రిక్కిఱిసెను, వెక్కసమయ్యెను, - ఈ మూడును హెచ్చయ్యె ననుటకు పేర్లు. సగ్గె, కుందె, డొంకె, తగ్గె, సడలె, క్రుంగె, ఉబ్బణగె, స్రుక్కె - ఈ ఎనిమిదియు క్షీణదశనొందె ననుటకు పేర్లు.

ఆ. మించు వాసి మేలు మేటి పె చ్చె చ్చన
నధికమునకు నాఖ్య లగుచు వెలయుఁ
బసులు నాఁగఁ జెయువులనఁ జేత లన నొప్పుఁ
గర్మమునకుఁ బేళ్లు (చర్మవసన)                          (71)

టీ. మించు, వాసి, మేలు, మేటి, పెచ్చు, ఎచ్చు - ఈ ఆరును అదిక మనుటకు పేర్లు. పనులు, చెయివులు, చేతలు - ఈ మూడును కార్యమునకు పేర్లు.

ఆ. అనిపె ననిచెఁ బనిపెఁ బనిచె నంపెను బంపెఁ
బుచ్చె గెలుపుమనియె బొమ్మటనియె
ననఁగ నివి సమాహ్య లగును ప్రస్థాపించె
ననెడు క్రియకు (నీశ యభ్రకేశ)                          (72)

టీ. అనిపెను, అనుచెను, పమిపెను, పనిచెను, అంపెను, పంపెను, పుచ్చెను, గెలుపుమనెను, పొమ్మటనియె _ ఈ తొమ్మిదియు పయనముచేసి పంపెను అనుటకు నామములు.

తే. కొదవ కొద కుందు తగ్గు తక్కువ కొఱంత
వెలితి కొఱ లొచ్చు కడమ నా వెలయు న్యూన
సమభిధానము లర సాము సగము సవము
నాఁగ నర్ధాహ్వయంబు లౌ (నాగభూష)               (73)

టీ. కొదవ, కొద, కుందు, తగ్గు, తక్కువ, కొఱత, వెలితి, కొఱ, లొచ్చు, కడమ - ఈ పదియును న్యూనతకు పేర్లు. అర, సాము, సగము, సవము _ ఈ నాలుగును అర్ధమనుటకు పేర్లు.

తే. పేళ్లు పశ్చాత్తనుటకును జెల్లు వెనుకఁ
బిదపఁ దర్వాతఁ బదపడి పిమ్మట నన
మునుపు మును మున్ను తొలి తొల్లి ముందు తొలుత
ననఁగఁ బూర్వపదార్థఖ్య లౌ (గిరీశ)             (74)

టీ. వెనుకన్, పిదపన్, తర్వాతన్, పదపడి, పిమ్మటన్ - ఈ ఐదును అనంతరం అనుటకు పేర్లు. మునుపు, మును, మున్ను, తొలి, తొల్లి, ముందు, తొలుత - ఈ ఏడును పూర్వమనుటకు పేర్లు.

ఆ. పాఱుఁబోతు పిఱికి పంద కోఁచ యనంగఁ
బేళ్లు దనరు సమర భీరువునకు
దిట్ట యుక్కుతునియ గట్టిడెందంబువాఁ
డనఁగ ధైర్యవంతుఁ డలరు (నీశ)                (75)

టీ. పాఱుబోతు, పిఱికి, పంద, కోచ, - ఈ నాలుగును యుద్ధమున భయపడువానికి పేర్లు. దిట్ట, ఉక్కుతునియ, గట్టిడెందమువాడు - ఈ మూడును ధైర్యవంతునకు పేర్లు.

తే. పౌజు చేరువ మొత్తంబు బారు తుటుము
దండు పరి గమి కూటువ పిండు దాఁటు
మూఁక దళమును బేళ్లు సమూహమునకు
(భుజగవరహార యవిముక్తపురవిహార)               (76)

టీ. పౌజు, చేరువ, మొత్తము, బారు, తుటుము, దండు, పరి, గమి, కూటువ, పిండు,, దాటు, మూక దళము - ఈ పదమూడును సమూహమునకు పేర్లు.

సీ. పూనె నూనెను దాల్చె నానెను మోచె నా, వహియించె ననుట కౌ (నహివిభూష)
నామము లిచ్చాటనము చేసె ననుటకు, వరుసతోఁ దఱిమెను బఱపె వెలిచెఁ
దోలెను ఱొప్పె నా (ద్రుహిణాదిసురనుత), త్రిప్పెను నాఁ గ్రమ్మరించె ననఁగ
మగిడించె ననఁగను మరలించె నన సమా, హ్వాయములై పరఁగు నివర్తితంబు

తే. చేసె ననుటకు (సురముని సిద్ధసేవ్య)
యడ్డగించెను నా నిల్పె ననఁగ నాఁగె
నన నివారించె ననుటకు నాక్య లమరు
(నగసుతానాథ గుహగజాననసనాథ)                (77)

టీ. పూనెను, ఊనెను, తాల్చెను, ఆనెను, మోచెను - ఈ ఐదును ధరించె ననుటకు పేర్లు. తఱిమెను, పఱపెను, వెలిచెను, తోలెను, ఱొప్పెను - ఈ అయిదును ఊచ్ఛాటనము చేసె ననుటకు పేర్లు. త్రిప్పెను, క్రమ్మఱించెను, మగిడించెను, మరలించెను, నిల్పెను, ఆగెను - ఈ మూడును నిరోధించెననుటకు పేర్లు.

తే. దండ చేరువ సంగడి దాపు చెంత
సరస చెంగట యొద్ద డగ్గఱ కురంగ
టండ పజ్జయు నా సమీపాఖ్య లమరు
(రమ్యధవళాంక కలశనీరధినిషంగ)                 (78)

టీ. దండ, చేరువ, సంగడి, దాపు, చెంత, సరస, చెంగట, ఒద్ద, డగ్గఱ, కురంగట, అండ, పజ్జ, - ఈ పన్నెండును సమీపమందనుటకు పేర్లు.

తే. అచట నచ్చట నచ్చోట నందు నాడ
నచొట నచ్చొట నక్కడ నయ్యెడ నట
ననఁగఁ దత్ప్రదేశంబునం దనుట కాహ్య
లయ్యె (భక్తవిధేయ యార్యాసహాయ)                       (79)

టీ. అచట, అచ్చట అచ్చోట, అందు, ఆడ, అచొట, అచ్చొట, అక్కడన్, (ఆ+కడన్)= ఆ దిక్కున, ఆయ్యెడన్ (ఆ = యెడన్) = ఆ ప్రదేశమున, అటన్ - ఈ పదియు ఆప్రదేశమం దనుటకు పేర్లు.

క. ఇరుగెలఁకుల నిరువంకల
నిరుదెస నిరుచక్కియందు నిరుపక్కియలం
దిరుగ్రేవల నిరుగడ నన
బొరిఁ బేళ్లగు నుభయపార్శ్వముల ననుట (కజా)          (80)

టీ. ఇరుగేలకులన్, ఇరువంకలన్, ఇరుదెసన్, ఇరుచక్కియందున్, ఇరుపక్కియలందున్, ఇరుగ్రేవలన్, ఇరుగడన్ - ఈ ఏడును రెండువైపులందు అనుటకు పేర్లు.

క. నవముగ ధరలో నీమా
నవవర్గువు వేడ్కఁ జదివినను వ్రాసిన మా
నవులకు ననవరతంబును
శివుఁ డవిముక్తేశ్వరుండు చెలువం బొసఁగున్          (81)

ట. ఎవరీ మానవవర్గు వ్రాయుచున్నారో లేక చదువుచున్నారో, వారికి కాశీవిశ్వేశ్వరుని దయవలన సకలసంపదలు కలుగును.

మానవవర్గు సమాప్తము.

Wednesday, July 6, 2016

ఆంధ్రనామ సంగ్రహము - 6

ఆ. ఎడసెఁ బాసె వేఱుపడెఁ బురివిచ్చె నా
నలరు భేద మయ్యె ననుట పేళ్ళు
స్వవశ మయ్యె ననుట కవుఁ బేళ్లు లోనయ్యె
నగ్గమయ్యె ననఁగ (నసమనేత్ర)              (37)

టీ. ఎడసెన్, పాసెన్, వేఱుపడెన్, పురివిచ్చెన్ - ఈ నాలుగును వియోగమయ్యె ననుటకు బేరులు. లోనయ్యెన్ అగ్గమయ్యెను - ఈ రెండును స్వాధీనపడె ననుటకు పేర్లు.

ఆ. అగు గృహీతమయ్యె ననుటకుఁ బేళ్లగ
పడియెఁ జేపడియెను బట్టువడియెఁ
జిక్కువడియెఁ దగిలెఁ జిక్కెఁ దగుల్పడె
ననఁగ (నగనివేశ యభ్రకేశ)                (38)

టీ. అగపడియెన్ (అగ్గము+పడియెను) = ఆధీనమయ్యెను, చేపడియెను (చే+పడియెను) = చేత చిక్కెను, పట్టువడియెను = పట్టుచిక్కెను, చిక్కువడియెను, తగిలెను, చిక్కెను, తగుల్పడెను, ఈ తొమ్మిది యును గృహీతమయ్యె ననుటకు పేర్లు.

తే. అనియె నొడివె వక్కాణించె నాడెఁ జెప్పె
వినిచె వాక్రుచ్చెఁ బలికె నాఁ జను వచించె
ననుట కాలించె నాలకించెను వినె నన
నలరు నవధరించె నంటంట కాఖ్య (లీశ)         (39)

టీ. అనియెను, నొడివెను, వక్కాణించెను, ఆడెను, చెప్పెను, వినిచెను, వాక్రుచ్చెను, పలికెను - ఈ ఎనిమిదియు చెప్పె ననుటకు పర్యాయములు. ఆలించెను, ఆలకించెను, వినెను - ఈ మూడును అవధరించె ననుటకు పేర్లు.

క. కనియెను చూచెను కాంచెను
కనుఁగొనెఁ గన్గొనె ననంగ హలయవి పేళ్లె
చను వీక్షించె నటంటకు
(ఘనతరగోరాజగమన కాయజదమన)              (40)

టీ. కనియెను, చూచెను, కాంచెను, కనుఁగొనెను, కన్గొనెను - ఈ అయిదును దర్శించెననుటకు పేర్లు.

క. చనుఁ గృతగమనుఁడ నయ్యెద
ననుటకు నామంబు లగుచు నవని నరిగెదన్
జనియెదఁ బోయెద నేగెద
పనివినియెద ననెడునట్టి పలుకులు (రుద్ర)            (41)

టీ. అరిగెను, చనియెను, పోయెను, ఏగెను, పనివినియెను - ఈ అయిదును బయలుదేఱె ననుటకు పేర్లు.

ఆ. ద్విగుణమున కభిఖ్యలగు తిబ్బ డిమ్మడి
జంట దంట దుగయు జమిలి రెట్టి
యినుమడి యన మిథునమున కాఖ్యలగు జోడు
దోయి కవ యనంగ (ధూతకలుష)                   (42)

టీ. ఇబ్బడి, ఇమ్మడి, జంట, దంట, దుగ, జమిలి, రెట్టి (రెంట) ఇనుమడి - ఈ ఎనిమిదియు రెండింతలకు పేర్లు. జోడు, దొయి, కవ - ఈ మూడును మిధునమునకు పేర్లు.

సీ. ఒండొకఁ డొకటి యెండొక్కొం డన నగు నేక, మీరు రెండిరు నాఁగ నెసఁగు ద్వయము
తిగ మూఁడు మూ ర్నాఁగ దగు ద్రయి తీవంచ, నాలు నాల్గు చౌ యన నగుఁ జతుష్క
మెసఁగుఁ జౌవంచ యైదే ననఁ బంచకం, బా ఱిరుమూఁడి తిగనగ నొప్పు
షట్కంబు ఋషిసంఖ్య నత చక్కుపగడ యే, డన నొప్పు నష్ట సంఖ్యకును బేళ్లు

తే. దనరు నిరునాలు గెనిమిది దచ్చి యనఁగఁ
బరఁగు నీరాఱు పండ్రెండు బార యనఁగఁ
ద్వాదశమునకు నాఖ్యలు ధరణియందు
(వినుతకరుణాసనాథ శ్రీవిశ్వనాథ)               (43)

టీ. ఒండు, ఒక్కఁడు, ఒకటి, ఒక్కండు - ఈ నాలుగును ఏకసంఖ్యకు నామములు. ఈరు, రెండు, ఇరు - ఈ మూడును ద్వయమునకు పేర్లు. తిగ, మూఁడు, మూరు - త్రితయమునకు పేర్లు. తీవంచ = మూడునొక్కటియు, నలు, నాలుగు, చౌ - ఈ నాలుగును నాలుగునకు పేర్లు. చౌవంచ = నాలుగునొక్కటియు, ఐదు (రూ. అయిదు) ఏను - ఈ మూడును పంచసంఖ్యా నామములు. ఆఱు, ఇరుమూడు = రెండు మూడులు, ఇత్తుగ (ఇరు+తీగ) = రెండు మూడులు, - ఈ మూడును షత్సంఖ్యా నామములు. సత (సప్త శబ్ధభవము) చక్కుపగడ = ఆఱునొక్కటియు, ఏడు - ఈ మూడును సప్తసంఖ్యకు పేర్లు. ఇరు నాలుగు = రెండు నాలుగులు, ఎనిమిది, దచ్చి - ఈ మూడును అష్ట సంఖ్యకు నామములు. ఈరాఱు = రెండాఱులు, పండ్రెండు, బార - ఈ మూడును ద్వాదశ సంఖ్యకు పేర్లు.

తే. జరిగె నూడెను జాఱెను నుఱికే వెళ్లెఁ
బాఱెఁ బఱచెను దెలఁగె నప్పలుకు లెల్ల
నవనిలోనఁ బలాయితుండయ్యె ననుట
కాఖ్యలై యొప్పుఁ (జెంద్ర రేఖావతంస)             (44)

టీ. జరిగెను, ఊడెను, జాఱెను, ఉఱికెను, వెళ్లెను, పాఱెను, పఱచెను, తొలగెను, _ ఈ ఎనిమిదియు పరుగెత్తె ననుటకు పేర్లు.

క. వేంచేసెను వచ్చెం జను
దెంచెను విచ్చేసె నరుగుదెంచె ననఁగ నే
తెంచె నన నయ్యె నాగతుఁ
డంచుం బలుకుటకు నాఖ్య (లంబరకేశా)        (45)

టీ. వేంచేసెను, వచ్చెను, చనుదెంచెను (చను+ తెంచెను) విచ్చేసెను, అరుగుదెంచెను, అరుదెంచెను, ఏతెంచెను (పా> ఏగుదెంచెను) - ఈ తొమ్మిదియు ఆగతుడయ్యె ననుటకు పేర్లు.

తే. నాఁటిసుత నాఁటినుండియు నాఁటఁగోలె
నాఁటఁబట్టి నాఁడుమొదలు నాఁగ నాహ్వ
యమ్ము లయ్యె దదారభ్య యనుట కవని
(వినుతకరుణాసనాథ శ్రీవిశ్వనాథ)            (46)

టీ. నాఁటిసుత, నాఁటినుండి, నాఁటఁగోలె, నాఁటఁబట్టి, నాఁడు మొదలు _ ఈ అయిదును, ఆదిమొదలు = ఆదినము నుండి అనుటకు పేర్లు.

తే. వైరమునకును ధర సమాహ్వయము లమరుఁ
గంటు పగ మచ్చరంబు సూడోంటమి యన
వలపు కూరిమి మేలు నా నలరుఁ బేళ్ళు
మోహమునకును (శారదాంబుదనిభాంగ)            (47)

టీ. కంటు, పగ మచ్చరము, (మత్సర శబ్ధభవము) సూడు, ఒంటమి - ఈ అయిదును విరోధమునకు పేర్లు. వలపు, కూరిమి (కూర్మి) మేలు - ఈ మూడును మోహమునకు పేర్లు.

క. పెనఁకువ జగడము కయ్యం
బని బవరము కలను చివ్వయాలము పోట్లా
టన దురము పోరు నాఁగాఁ
జను యుద్ధంబునకుఁ బేళ్ళు (చంద్రార్ధధరా)       (48)

టీ. పెనఁకువ, జగడము, కయ్యము (కలహ శబ్ధభవము) అని, బవరము, కలను, చివ్వ, ఆలము, పోట్లాట, దురము, పోరు - ఈ పదకొండును యుద్ధమునకు పేర్లు.

ఆ. సదమదంబు సేసెఁ జక్కాడె నుగ్గాడెఁ
జదిపెఁ బీఁచమడచెఁ జంపెఁ గెడపె
నుఱుముసేసెఁ గ్రుంచెఁ బరిమార్చెఁ దెగటార్చె
మన్ని గొనియెఁ దునిమె మడిపె ననఁగ               (49)

తే. హతము గావించె ననుటకు నాఖ్యలయ్యె
మనిపె నేలెను బ్రతికించె మంచెఁ బ్రోచె
సాఁకె నన నొప్పు నాఖ్యలు సరవితోడ
నరయఁ బోషించె ననుటకు (నంబికేశ)              (50)

టీ. సదమదంబు సేసె, చుక్కాడె, నుగ్గాడెన్, చదిపెన్, పీచమడఁచెన్, చంపెన్, కెడపెన్, నుఱుముచేసెన్, త్రుంచెన్, తెగటార్చెను, మన్నిగొనియెన్, తునిమెను, నుడిపెను _ ఈ పదునాల్గును సంహరించెననుటకు పేర్లు. మనిపెను, ఏలెను, బ్రతికించెను, మంచెను, ప్రోచెను, సాకెను _ ఈ తొమ్మిదియును రక్షించెననుటకు పేర్లు.

క. ధరలో శూరాహ్వయములు
పరఁగున్ మొనకాఁ డనంగ బం టనఁగా బో
టరియన వడిగలవాఁ డన
బిరు దన వాఁడిమగఁ డనఁగ (భీమకపర్ధీ)             (51)

టీ. మొనకాడు, బంటు (భట శబ్ధభవము) పోటరి (పోటు+ అరి)= శౌర్యము గలవాడు, వడిగలవాడు, బిరుదువాడిమగడు - ఈ ఆరును శూరునికి పేర్లు

తే. బాసట యనంగఁ దోడ్పాటు నా సమాహ్వ
యంబు లగుచుండు రెండు సాహాయ్యమునకు
నాఖ్యలు శుభంబునకును లగ్గనఁగ బా గ
నంగ మేలన లెస్స యనంగ (నీశ)                          (52)

టీ. బాసట, తోడ్పాటు, - ఈ రెండును సాహాయ్యమునకు పేర్లు. లగ్గు, బాగు, మేలు, లెస్స - ఈ నాలుగును క్షేమమునకు పేర్లు.

ఆ. కూలె నీల్గెఁ జచ్చెఁ గాలంబు సేసెను
గడసె సమసె నాఱె మడిసెఁ జెల్లెఁ
బెద్దనిదురవోయె బిద్దె దోరెను గంతు
గొనియె ననుటపేళ్లగును మృతునకు              (53)

టీ. కూలెను, నీల్గెను, చచ్చెను, కాలంబుచేసెను, కెడసెను, సమసెను, ఆఱెను, మడిసెను, చెల్లెను, పెద్దనిదురపోయెను, బిద్దెను, దీరెను, గంతు గొనియెను - ఈ పదమూడును మృతి నొందెననుటకు పేర్లు.

సీ. తిమ్మనైనది యనఁ దిన్ననైనది యన, జానైన దనఁగ బాగైన దనఁగ
నాణెమైన దన విన్నాణమైనది యన, మానైన దనఁగ లెస్సైన దనఁగ
బిన్ననైనది యనఁ జెన్నైన దన నలు, వైనది యనఁగ జెల్వైన దనఁగఁ
బొనరినయది యన నొనరిన దనఁగఁ జొ, క్కటమైన దనఁగ జక్కని దనంగ
సొబగైన దనఁగను సొంపైన దనఁ గొమ, రైనది యన గొనబైన దనఁగఁ
దోరమైన దన సింగారమైనది యన, మేలైన దనఁగ మెచ్చైన దనఁగ

తే. మురువుగలయది యొప్పైన దొఱపుగలది
యందమైనది తనరిన దలరినట్టి
దనఁగఁ బరఁగిన దనఁ బేళ్ళు తనరుచుండు
మంజులం బైన దనుటకు (మదనదమన)                   (54)

టీ. తిమ్మనైనది, తిన్ననైనది, జానైనది, బాగైనది, నాణెమైనది, విన్నాణమైనది, మానైనది, లెస్సైనది, పిన్ననైనది, చెన్నైనది, నలువైనది, చెల్వైనది, పొనరినయది, ఒనరినది, చొక్కటమైనది, చక్కనిది, సొబగైనది, సొంపైనది, కొమరైనది, గొనబైనది, తోరమైనది, సింగారమైనది, మేలైనది, మెచ్చైనది, మురుపుగలయది, ఒప్పైనది, ఒఱుపు గలది, అందమైనది, తనరినది, అలరినట్టిది, పరగినది - ఈ ముప్పదిఒకటియు సౌందర్యమునకు పేర్లు.

తే. కపుర మనఁ గప్పురం బన గప్ర మనఁగఁ
బుడమిఁ గర్పూర మొప్పుఁ దాంబూల మొప్పు
వీడియము వక్కలాకులు విడెము తమ్మ
లంబు వీడెంబు వీడ్య మనం (బురారి)                    (55)

టీ. కపురము, కప్పురము, కప్రము - ఈ మూడును కర్పూరమునకు పేర్లు. వీడియము - రూ. విడియము, వక్కలాకులు, విడెము, తమ్మలము, వీడెంబు, వీడ్యము - ఈ ఆరును తాంబూలమునకు పేర్లు.

తే. వెలయుచుండును సిరి లచ్చి కలిమి యనెడు
పేళ్ళ సంపద యెద్దడి పేదఱికము
లేమి నిప్పచ్చరము నెవ్వలేమి డనఁగ
నలరు దారిద్ర్యమునకు నాఖ్యలు (గిరీశ)               (56)

టీ. సిరి (శ్రీ శబ్ధభవము) లచ్చి కలిమి - ఈ మూడును సంపదకు పేర్లు. ఎద్దడి, పేదఱికము, లేమి, నిప్పచ్చరము, నెవ్వ, లేమిడి - ఈ ఆరును దారిద్ర్యమునకు పేర్లు.

తే. మగతనం బన గండన మగఁటిమి యనఁ
బౌరుషంబున కాఖ్యలై పరఁగుచుండు
నుక్కు చేగ దిటము చేవ యుదుటు గట్టి
దిట్ట ముఱిది బిగువు నాగ ధృతికిఁ బేళ్ళు             (57)

టీ. మగతనము, గండు, మగటిమి - ఈ మూడును పౌరుషమునకు పేర్లు. ఉక్కు, చేగ, దిటము, చేవ, ఉదుటు, గట్టి, దిట్టము, ఉఱిది, బిగువు - ఈ ఆరును ధైర్యమునకు పేర్లు.

తే. నద్ధు నా బొంకు నాఁగ దబ్బర యనంగఁ
గల్ల నాఁగ హుళిక్కి నాఁజెల్లుఁ బేళ్లు
ధర నసత్యమునకును సత్యంబు పరఁగు
నిజ మనగఁ నిక్కువం బన నిక్క మనగ             (58)

టీ. బద్దు, బొంకు, దబ్బర, కల్ల, హుళిక్కి - ఈ అయిదును అసత్యమునకు పేర్లు. నిజము,  నిక్కువము, నిక్కము - ఈ మూడును సత్యమునకు పేర్లు.

Monday, July 4, 2016

అష్టమహిషీ కల్యాణము - 19 (చివరి భాగము)

7. సప్తమ పట్టమహిషీ
శ్రీ భద్రాదేవీ వివాహ వర్ణన ప్రసంగము

మేదినీశ్వర తమ మెనత్తయైన                  (6770)
శ్రుతకీర్తి తనయ విశ్రుతకీర్తి వినయ
(నతిదివ్యరూ)ప మోహనభద్రభద్రఁ
తకు గేకయ మహీధవుఁడు కల్యాణ
మొనరింపఁ గోరి కెయ్యునను బుత్తేత
నాననవిల్కాని యయ్య సొంపంది
యాన్నన చంద్ర సేవాసక్తి వచ్చు
నక్షత్రమాలిక నటనమైఁ దాల్చి
యిక్షు చాపుని తండ్రియింపు సొంపలర
చటుల నిజపాంగ చంద్రికా సార
ఘటికలో యన ముద్దుగులు కుచౌ కట్టు             (6780)
ధరియించి జాతిప్రదళుకు వజ్రములఁ
గరమొప్ప రవిపదకంబు గీలించి
యరవిందమూల మత్తాళి చక్రముల
కరణిఁ జేతుల నీలకంతకంబు లలరఁ
ధవళాంశు రుచి ధాళధాళ్యమైనట్టి
నవదుకూలంబు వింతలుమీఱఁ గట్టి
పసనిడుపాగంబు పట్టుకుళ్లాయి
యెసపరిచందంబు లొలుకంగఁ దాల్చి
దేవకీ వసుదేవ దేవకుల్పలుఁడు
దేవేంద్రసుతుఁడునే తేరన్ల్గడల                  (6790)
నరి వీరప్రదరంబున రథంబునెక్కి
పరివారమును సర్వబంధువుల్గొలువ
ఘనతర పటహ ఢక్కాహు డుక్కాది
నినదముల్దిక్కుల నిండ ఘూర్ణిల్లఁగ
గరిమమైఁ గదలి కేకయపురంఉనకు
నరుగనప్పుడు కేకయాధీశ్వరుండు
తత శుభద్రవ్య సంతతులతో భూమి
పతులతో విప్రదంపతులతోఁ గూడఁ
గొమరు మీఱఁగ నెదుర్కొని వసుదేవు
కొమరు నవ్వేళఁ దోఁకొని యేగుదెంచి              (6800)
యనుపమ హేమగేహమునందు నునిచె
జననాథ కేకయ జననాథ వరుఁడు
అప్పుడు శుభలగ్నమాసన్న మగుటఁ
జెప్పి పుత్తేర రాజీవలోచనుఁడు
రత్నకంబళ దివ్య రత్న పల్యాణ
నూత్న చామరజాలనుత పుష్పధామ
కాంచన ఘంట నానాశూంభ పట్ట
చంచదలంకార సహితమై మించి
హసిత దిశాదంతియగు దంతి నెక్కి
వసుమతీసురలు దీవనలు గావింప                 (6810)
బ్రచుర మార్తాండబింబ ప్రభల్దెగడు
రుచులఁ జూపట్టు కర్పూర దీపికలు
పుష్పబాణుని బ్రాణముల రీతిఁ బొల్చు
పుష్పబాణంబు లద్భుతములై తనర
సురలకు నీవార్త సూచింపనరుగు
కరణి శోభిల్లె నాకాశబాణములు
భ్రదంశు విజిత చంద్రజ్యోతులైన
రమణీయముగను సాంద్రజ్యోతలెసఁగఁ
నిక్షు కోదండుఁ డనేక రూపములఁ
బక్షివాహనుగెల్వఁ బఱతెంచెననాఁగ           (6820)
దండిమై రాజనందనులోలి యిక్షు
కాండముల్గొని పెక్కుగతినే తేర
వడిమీట ఖణిఖణి వాగుచు గిరుల
బొడఁగుఁ గైకొను జిగిబిగిచున్నుఁ గవల
మెఱుఁగు దీవల నవ్వుమేనుల నొప్పు
మెఱుఁగుబోణులు సంభ్రమించి యంతంత
పరమ సంతోషాబ్ధిఁ బ్రబలించుమించు
నురువులోయన మించు నురువులగములు
తళుకు గుబ్బలతోడఁ దడబడి సిరులు
గలిగి ప్రకాశించు గజి నిమ్మపండ్లు             (6830)
పొలుపైన పలుకునొప్పుల కుప్పలనఁగ
లలితంబులైన బెల్లంపుటచ్చులును
వరకపోలముల భావంబులఁ దెలుపు
వరుస నొప్పెడు నాగవల్లీ దళములుఁ
గరమొప్పుచును భాతికలయురోజముల
కరణిఁ జూపట్టు పూగముల జాలముల
జిగిమించుతమ నవ్వు చిఱుతవెన్నెలలు
నిగిడినరీతి మానికములౌవిరులు
కమ్మవిల్కాని చక్రములననొప్పు
కమ్మదోవులుఁ బెక్కుగతుల వస్తువులు            (6840)
కనక పాత్రములందు ఘటియించిచెంతఁ
గనుపట్టుఁగా వింతగాఁగ్రంత నడువఁ
దఱుచుగా వాద్యనాదంబులు చెలఁగ
మెఱసి గోవిందుఁ డమ్మేదినీవిభని
నగరువాకిటను మాతంగంబుడిగ్గి
నగరకామినులు క్రన్నన సేసలిడఁగ
వరుసనేతెంచి వివాహమంతపము
సరసఁ జెన్నొందనా సమయమునందుఁ
జికిలి చేసినమారు చేవాలుబోలె
నకలంక శృంగార హారిణియైన                      (6850)
కేకయాధిపపుత్రి కిసలయగాత్రి
రాకేందువదనలు రమణఁదో తేర
నారాజువిమలతో యములనింపొదవ
మారాజు పాదపద్మములఁ గడిగి
యర్చించి మధుపర్కమర్పించి యాత్మఁ
జర్చించి హరిమానసంబున నిలిపి
తనుజన్మ వసుదేవతనుజన్మునకును
ఘనత ధారాపూర్వకంబుగా నొసఁగఁ
గందువాయుచుఁ బూర్ణకలలతోఁ బొదలి
యిందుండు నిందుండు నెదురించెననఁగ                (6860)
నపుడు వధూవరు లాననాబ్జముల
నిపుణతతో నిక్కి నిక్కికన్గొనిరి
ఆగమవేద్యుఁ డిట్లాగమోక్తముగ
బాగుమీఱఁగ భద్రఁ బరిణయంబయ్యె
హరియు నాజనపాలుఁ డన్యోన్యమిట్లు
సరవిమై నుచితముర్సలిపి రంతటను
భద్రతో నాబలభద్రసోదరుఁడు
భద్ర శతాంగంబుపై నెక్కి మెఱసి
సురలు నప్సరలు భూసురలు దిర్తింప
వరభాగ్యవతి ద్వారవతి బ్రవేశించి            (6870)
రాజమార్గమున దీరతనేగఁ బౌర
రాజపద్మాక్షులా రాజస్యఁ జూచి
పలుమాఱూరకమిట్టి పడిటింతె కాని
కలికి కన్నుల సరిరావు బేడెసలు
తముఁ జూడగాఁ గొంత తఱితిపకాని
బొమయీడగునెకం పొలయించు విండ్లు
కలఁగక యెంతమూఁకలు సేసెనేని
నలకంబులకు సాటియగునే యీయలులు
వెక్కసంబుగనెంత విదిరించికొన్న
జక్కవల్దామేలచనుఁ దోయి బోలు                 (6880)
మునుకొనిలోలోన మొరసిననేమి
యెన రావు గళమున కీయంబుజములు
వెలిమీఱిక్రంతులు వేయుటేకాక
పలుకుల సొగసేల పట్టుచిల్కలకు
నెలమిఁ గూర్చినవారి నెంతల్లుకొన్న
నల బాహులకుఁ బురుఁదగునె యీలతలు
మానుగా నెన్నిసూక్షములు బోయినను
కౌనుఁ దీగకుసాటిగా నేరవణులు
సుడిగొని తామెంత సొబగైననేమి
తొదలకు సరిరావు తుదఁ గదళికలు                  (6890)
తమవారిగూడి యెంతయునుబ్బెనేని
సమమౌనె తత్పదాబ్జముల కబ్జములు
అని కొని యాడంగ ననిమిషోత్తములు
వినుతింప సదనప్రవేశంబుఁ జేసి
యల రోహిణీయుక్తుఁడగు రోహిణీశు
చెలువున భద్రతోఁ జెలఁగి నిచ్చలును
నించువిల్తుని తండ్రి యెనలేక యాత్మ
నించు రాగమున నభీష్టభోగమున
ద్వారకాంచన ప్రవర్ణితమైన
ద్వారకానగరి నెంతయు వేడ్కనుండె                      (6900)


8. అష్టమ పట్టమహిషీ
శ్రీలక్షణాదేవీ వివాహవర్ణన ప్రసంగము

ధరణీశయట మద్రధరణీశ పుత్రి
మరుని సామ్రాజ్యపద్మా పద్మనేత్రి
ధరణి సంచారి నూతన చంద్రరేఖ
నిరుపమ భూషణాన్విత కల్పలతిక
తరళితాదూర సౌదామనీలతిక
గరమొప్ప సప్రాణ కాంచనప్రతిమ
యక్షిణ శుభమూర్తి యవిరళ భవ్య
లక్షణయగునట్టి లక్షణాకన్య
నారద మహతీ నినాద సంభూత
శౌరి కథామృతసారంబు గ్రోలి                (6910)
యితరంబు మఱచి యా యిందిరాపతినిఁ
బతిగాఁగఁ గోరి తత్పరబుద్ధితోడ
సారసమ్ములకుఁ గన్నియచాలనులికి
ముడివడు విరులు క్రొమ్ముడి సఖీజనము
తడవదురారాము తమ్మునినోట
నుడువదు చింతతో నూల్కొన్నచింత
విడువదు ...............
లల మద్ర భూవరుం డంతనానాఁటఁ
జెలులచేఁ దనుజాత చెలువంబుఁ దెలిసి
తనయకు ననుకూల ధవుఁడెందుఁగల్గు         (6920)
నని తానెయొక యుపాయంబు చింతించి
పుష్కరంబునఁ జూడఁ బొడగానరాక
పుష్కరాంతరమునఁ బొడకట్టుచుండ
మీనయంత్రంబు నిర్మించి యాదేవ
మానవులకు భరియింప రానట్టి
బాణాసనంబును బటువజ్ర నిసిత
బాణంబుఁ జూపించి ప్రార్థించి యునిచి
యీ విల్లుమోపెట్టి యీమార్గణంబు
ఠీవిమైఁ దొడివి దృష్టించి యిమ్మీను
ధరఁగూలవైచు నాధారుణీనాధ                  (6930)
వరుఁడు నాపట్టికి వరుఁడంచుఁ బలికి
పాటించి యఖిల భూపతులెల్ల వినఁగఁ
జాటించి యంతనా జననాధవరులు
పటుతర సైంధవ భద్రేభ వీర
భటపటాలంబు లుద్భటవృత్తిఁ గొలువ
రయమున వచ్చి మద్రపురంబు సొచ్చి
భయద భుజాగర్వ భరితులై యుండ
నది విని దనుజారి యా రాకుమారి
నిదే పోయి వేవేగ నేఁ దెత్తుననుచు
గురుకాంతిజిత రవికోటి కోటీర                   (6940)
మరకతమకుటంబు మస్తమందుంచి
ముకురకపోలాగ్ర ములుడాలు గులుక
మకరకుండలములు మహిమమైఁ దాల్చి
ఘనచంచలోదీర్ణ ఘనవైభవంబు
గనుపట్ట వనమాలి కాయుతుండగుచు
నాతతాంచలచంచ దంశుసందోహ
పీతాంబరంబైన పీతాంబరంబు
ధరియించి మ్ర్ఱుఁగు గాఁ దావి కస్తూరి
తిరునామమొకకొంత తీరుగా దీర్చి
రటధంఘ్రి కటక సారససుమాణిక్య                 (6950)
కటకాంగుళీయక గ్రైవేయ హార
సురుచిరుండై శైబ్య సుగ్రీవముఖ్య
హరిణవర్ణ సమిద్ధ హరి బద్ధవిష్ణు
రథకేతనోదీర్ణ రథమెక్కిమేటి
రథికులు భటులు వారణతురంగములు
చనుదేర మురజ జర్ఝరశంఖ ముఖ్య
ఘనవాద్యఘోషము ల్గగనంబు బొదువ
రాజసందోహ సంరాజిత మద్ర
రాజధానికిని దీవ్రత నేగుఁదేర
మద్రేశుడఁపుడు సంభ్రముతో వచ్చి                (6960)
భద్రేశు గనుఁగొని ప్రణుతిగావించి
తోకొని పోయి సంతుష్టుఁడై భక్తిఁ
జేకొని శౌరిఁ బూజించె నవ్వేళ
గురుతర మాణిక్య కోటీరకోటి
నిరత ఘర్షణజాత నిబిడగాంగేయ
ఘనధూళి శబలిత గగనాంతరాళ
కనకమంచాంతర కలితులైనట్టి
భూనాధులా రమా భూనాధుఁ జూచి
భానుబింబ ప్రభాపటలంబు నెదుట
ఖద్యోతకాంతులు గనరానియట్లు               (6670)
ఖద్యోతులయ్యు ముఖద్యోతమాన
కాంతులు దక్కి భూకాంతులారజని
కాంతునిఁ గనుఁగొని కైవాలుచున్న
తమ్ములు భాతి మోదమ్ములు సడలి
బిమ్మరిఁ గొనిలోన భీతిల్లిరంత
అంతరంగంబున నారాజకన్య
సంతసం బొదువఁ గజనకు సమ్మతిని
మరిమళమిళిత శుంభత్కమలముల
సరఁగున మంగళస్నానంబుఁ జేసి
నెఱయ గోధుమగింజ నెఱివట్టినట్టి          (6980)
మెఱయు చెంగావొప్పు మీఱంగఁ గట్టి
నెలవంకతూఁపు పూనిన కంతుశాఙ్గన్
మలరికఁ బొమదోయి నలరు నామంబు
నడుమను మృగమద నవచిత్రకంబు
కడుఁ జిత్రరీతులఁ గనుపట్టఁ దీర్చి
కొఱనెల నఱమ్రింగు కుముదాప్తవైరి
నెఱఁ గేతకీ దళాన్వితవేణి యలర
రవిచక్కఁ దనమసారసమిత్రఠేవ
ఠవణించు రత్నతాటంకముల్దాల్చి
హరికథామృతము కర్ణాంతరాళములఁ                       (6990)
బరిపూర్ణమగుచుఁ బైపైనుబ్బెననఁగఁ
బ్రవిమలచ్ఛాయల పండుముత్యముల
బవరులఁ గనుపట్టు బవెరలు వెట్టి
నిగిడి శైలములపై నిర్ఝరుల్వొలుచు
పగిఁది హారములు గుబ్బలమీఁద గసర
మలయు వెన్నెల సోఁగమైఱాలుగులుకు
మలుకు సొమ్ములను దీమంబుగాఁ బూని
మరకత వైడూర్య మణులు సొంపొందు
సరిలేని దొకబన్నసరము గీలించి
జిగిమించు కెంపులు జేర్చి సోయగపు                        (7000)
మొగపు తీవబిటారముగ సవరించి
రమణీయ దూర్వాంకురములమై చాయఁ
గనిపించు పచ్చల కడుయముల్దాల్చి
కొందలవలెనున్న కుచములనాను
చుండులేఁ గౌనునకురు సత్త్వమొదవ
నలువవైచినకట్టు నానొప్పు మీఱి
తలుకొత్తు నుదరబంధంబు చొప్పడఁగ
నాహరి కనుఁ దోయి యక్కఱ దీర్చు
మోహనంబగు నొక్కమక్కరవెట్టి
తళుకు గుబ్బలమీఁది ధగధగల్మించు           (7010)
జిలుఁగు దువ్వలువ కుచ్చెలమీఁది కురుక
బహువిధ శృంగార భాసితయగుచు
గురుతరంబుగ వాద్యఘోషంబు లడర
నరుదేరఁ జూచి పౌరాంగనామణులు
చేరుకొలంది నూర్చిన నెడలేక
నూరకుండినమేలె యువిదకెమ్మోవి
యురిదిచేకొలఁ దినినూదినఁ బెచ్చు
పెఱుఁగుచుండెను లేమ బిగిచన్నుఁదోయి
యొఱుపులై యొక్కటికొక్కటి మిన్నేల
మెఱవ కుండినఁ జూడ మెలఁత నేత్రములు         (7020)
అండఁ జొప్పడ నిల్పి యలమనందిటను
నిండ కుండినఁ గాంతనెఱిఁ గప్పుకొప్పు
అని యిట్లుకొని యాడి యలరి వెండియును
గనుఁగొని పల్కి రుత్కంఠ దీపింపఁ
గనక కూటములనుఁ గావిందు మఱియు
వనకాక్షి పాలిండ్ల వలనుండఁ బోలు
గరివైరి నడుమనఁ గావిందు మదియుఁ
దరుణిమధ్యంబు చందంబుగానోపు
కంతువిల్లదియనఁ గావిందు మదియుఁ
గాంతనూగారు సంగతినుండఁ బోలుఁ                (7030)
గలహంస గతియనఁ గావింతుమదియు
వలనొప్పు గతినడవడ్డంబు బోలు
నని మెచ్చి పొగడ స్వయంవరాయాత
జననాధులెల్లను జలజాక్షిఁ జూచి
నగుమొ గంబమరెఁబో నగుమొగంబునకుఁ
దగిన యీ విపులనేత్రములెట్లు గల్గెఁ
గనుదోయిఁ గలిగెఁబో కన్నుందములకుఁ
నొనరిన యాకర్ణయుగమెట్ల కల్గె
వీనులుగల్గెఁబో వీనులచెంత
నానీల ధమిల్ల మదియెట్లుకల్గెఁ                (7040)
దురుముచెన్నొందెఁబో తురుముమై గౌను
మెఱుఁగు సంకునదల్చు మెడయెట్లు గల్గె
గళము శోభిల్లెఁబో గళము చెంగటను
దళుకొత్తు కుచపర్వతము లెట్లుగల్గె
పాలిండ్లు గల్గెఁబో పాలిండ్ల బరువు
దాళులేఁ గౌఁదీవతానెట్లు కల్గె
నడుము శోభిల్లెఁబో నడుమనకొక్క
బెడఁగు సంపాదించు పిఱుఁదెట్లుగల్గె
ఘన కటికలిగెఁబో కటిచక్రమునకు
బెబసిననును దోవలే రీతిఁ గల్గె                   (7050)
నల యూరులమరెఁబో యాయూరువులకు
నెలమిఁ జూపెడి జంఘలేరీతిఁ గల్గెఁ
జిఱుతొడల్మించెఁబో జిగిఁజిఱు దొడలు
కొఱపుఁ గొప్పడు పాదయుగ మెట్లుగల్గె
ననుచు శ్రీదేవి రెండవ మూర్తియనుచుఁ
గనుఁ గొన రాజమార్గమున కేతెంచె
తలకొన్నకడిమి నత్తఱివచ్చి కొంద
ఱలఘుబితోద్ధతులైన పార్థివులు
హరువిల్లనఁగఁ జెల్లు నావిలుఁ జేరి
ధరయంటువాయ యనెత్తఁగలేక చనిరి             (7060)
లయ కాలదండంబులాగు దీపించి
భయదమైఁ యెదుట జూపట్టు నమ్మేటి
విలువంచలేక భూవిభులలో నెల్లఁ
దలవంపులైనఁ గొందఱు విన్ననైరి
చేనంటి యెక్కు ద్రోచియు ద్రోవలేక
హీనతనొంది రయ్యెడఁ గొందఱంత
భీమ విక్రములైన భీమ రాధేయు
లామహాధనువు సజ్యంబుఁ గావించి
శరము సంధించి ఖేచర సీమమీన
చరముపైఁ బూని తజ్జలముల దాని             (7070)
తిరుగుడువడిఁ గాంచి తెలియంగ లేక
తిరుగుఁడు వడిరంత దేవేంద్రతనయుఁ
డేయుబాగెఱిఁగి తానేయఁగాఁ బోవ
నేయునుపాయముఁ గన కేటిది తొలఁగ
కని దానవారి యక్కడనున్న వారిఁ
గనుఁగొని చెలఁగి క్రేఁగంట నవ్వుచును
నలవోకడాకేల నలధనువంటి
వలకేల మౌర్వి చువ్వన నెక్కువెట్టి
యంబకంబరి వోసి యంబరమధ్య
శంబరచర వరచ్ఛ్యాయభూ భూగ             (7080)
శంబరంబునఁ గాంచి సరఁగున మీను
శంబరాంతకు తండ్రి చక్కఁగా నిగిడి
ధరఁగూలనే సెనత్తఱిఁ బుష్పవృష్టి
గురుసె దుందుభులు గ్రక్కునమింటమెఱసె
నారాజనందన యానందమంది
యారూఢ మణి కంకణారవంబెసఁగఁ
నడుము జవ్వాడ నాననమింత యెత్తి
బెడఁగు గుబ్బలు జిగిచిగి రాయుచుండఁ
గేలి సౌరభారసాకీర్ణ గాంగేయ
మాలిక నవ్వన మాలికంఠమున                       (7090)
వైచవైచుటయు శ్రీవరుఁడు నమ్మేటి
రాచకూతును దన రథమువై వేగ
మెక్కించుకొని చలంచేచనంతంత
కెక్కించుకొని సైన్యమిరుమేలఁ గొలువఁ
దేరు దారకుఁ డతి తీవ్రతఁ బఱప
ద్వారకాపురము త్రోవన యేగుచుండె
దుర్వార గర్వ బంధురులైన యట్టి
యుర్వీశులప్పుడు చూపోపకేతెంచి
భటులతో నిరుపమార్భటులతో నాగ
ఘటలతో సకలదిక్తటముల శార్ఙ్గి                 (7100)
రాము తమ్ముని జుట్టి రాక్షసుల్వోలె
శరవృష్టి గురిసి మార్జనములు సేయ
నాదట గోపించి హసితామరేంద్ర
కోదండమగు శార్ఙ్గకోదండమంది
మలునారి మ్రోయించి బలునారి మఱఁది
బలునార సములఁ దద్బాణముల్దునిమి
ప్రలయ ధరాధర పటలంబు కెరలి
కలిశ బృందంబుల గురియుచందమున
దారుణ బాణసంతతుల భూపతుల
ఘోర సైన్యములపైఁ గురిసి వెండియును                   (7110)
బగరకు నుత్పాతభావంబు దోపఁ
బగలు చుక్కలు గనుపట్టెనోయనఁగ
శరజాల దారుణ చటుల ఘటనలఁ .....
నగలనందలి ముత్తియంబులు మింటి
కెగసి చూపట్ట నియ్యెడ శార్ఙ్గపాణి
తఱచుగా రిపులనుద్ధతి పింజ పింజ
గఱవనేయుచుఁ బూరిఁ గఱవఁ జేయుచును
నందంద శరముల నలిగి కొందఱును
జిందర వందరల్ సేసి నల్గడలఁ
బాఱఁజేయుచు విజృంభణ వృత్తి మెఱసి ....                (7120)
బానముల్దునిమి కృపానముల్విఱిచి
ప్రానముల్గొనుచు శౌర్యంబు చూపుచును
రథుల ఖండించి సారథులఁ దుండించి
పృథుల రథ్యంబుల పిండి సేయుచును
రదనముల్వదనముల్రాలఁ గొట్టుచును
బదములు మదములు వాయమోదుచును
గాత్రముల్నేత్రముల్గత్తిరింపుచును
ఛత్రముల్పత్రముజుక్కు సేయుచును
దొడవిన తూప్రునుఁ దోడ్తోడ వింట
వెడలిన తూపును వివరింపకుండ                       (7130)
శరజాలముల రిపుసైన్యంబుఁ బొదివి
పరివేష యుక్త ప్రభాకరుండనఁగఁ
గుడివడువిలుతోఁడ గూడి శాత్రవులు
సుడివడ వడినంప సోననింపుచును
సోలి లోకములొక్క జూఱగాఁ గొనెడి
కాల సంకర్షణుగతి నుగ్రుఁ డగుచు
నఱిముఱి సమయింప నలవేఁడివెఱచి
పఱచిరి హతశేష పార్థివులంత
భగ్నారి జన్యంబు పాంచజన్యంబు
నగ్నజితీసుఁ డున్నతగతి నొత్తి                   (7140)
సంగతి నాగరాజ స్ఫూర్తి గలిగి
నింగియు భువిబలి నిలయంబు పోలెఁ
ఘన కబంధావాస కలితమై ఘోర
వనమును నగరంబు వనధియుఁ బోలె
నారూఢ వర్ధిత హరిమహాస్ఫురణ
నారయ హరి నిలయంబులు వోలె
గణుతికి నెక్కి భీకరమైనయట్టి
రణముఁ గన్గొనుచు వారణముఖ్య తురఁగ
యదు వృష్టి భోజాంధకాదులు గొలువఁ
గదియుచు వంది మాగధులు గీర్తింప                   (7150)
నక్షీణబలుఁడు పద్మాక్షుండు భవ్య
లక్షణయగునట్టి లక్షణతోడ
సురలు సన్నుతి సేయ సురుచిర గతుల
వరకీర్తి ద్వారకావతిఁ బ్రవేశించి
యారాజమార్గంబు నందేగుదేర
నారాజవదనఁ బౌరాంగనల్జూచి
పొలఁతి కన్నులుదాఁకఁ బోలునే దీని
చలితకాంతియఁ జాలు సంపంగిఁ గెలువ
భూలతికలదాఁకఁ బోలునే దీని
వాలుఁ జేతులు చాలు వల్లికల్లెలువఁ                (7160)
బొదలు చేతులుదాఁక బోలునే దీని
పదములె చాలుసజ్జంబులు గెలుప
నని కొని యాడ మహావైభవమునఁ
దన రాజనగరమత్తఱిఁ బ్రవేశించె
నల శౌరితనయక్కుఁ డగుటకు వేడ్కఁ
దొలుక మద్రుఁడు సముద్రుఁడు వోలెఁ జొంగి
వాహినీయుక్తుఁడై వరమణి వస్తు
వాహనాదులతోడ వచ్చెనవ్వేళ
మామఁ బూజించి యమ్మా మనో హరుఁడు
హైమ విశాల గేహమునందు నునిచి                   (7170)
చేలమ్ములు ననుప చిత్రితకేతు
జాలమ్ములును ఘనచామర పుష్ప
వారమ్ములును జంద్రవాసిత గంధ
సారమ్ములును భవ్యసౌరభ మిళిత
ధూపంబులును భానుతోతాయు రత్న
సీపంబులును సర్వదివ్యవస్తువుల
బాగుగా నిర్జరపతి రాజధాని
లాగుగా నగరు నలంకరింపించి
నందాదులును శతానందాది భూమి
బృందారకులు బంధుబృందంబునపుడు                  (7180)
రావించి తత్కాల రమ్యకృత్యములఁ
గావించి యంతరంగమున భావించి
పసిఁడి ఱెక్కలడాలుభానుభానువుల
పసలకు మించనొప్పము వెట్టుచుండ
మండిత ముఖచంద్ర మండలద్యుతులు
నిండుచందురులోని నెఱకందు దీర్ప
మానిత ఘనదేవమణి రోచమాన
మాన పక్షీంద్రవాహన మేగుదేర
నానందనందనుఁడా వైనతేయ
నానందమును గంధమప్పళించుచును                 (7190)
నారుఢుఁడై యనంతాది నిత్యులను
నారద సనక సనందనాదులను
భవుఁ డబ్జభవుఁడగి భవుఁడును నదితి
భవుఁ డబ్ధిభవుఁడు దిక్పతులును గొలువ
నాపూర్ణకలలతో నఖిలతారకలు
దీపిత మూర్తులై తేజరిల్లఁ గను
నతను శోభనురేఖ యాచిత్రరేఖ
యతుల మంజుల భాషయగు చిత్రఘోష
చారూరు విజిత కాంచన రంభ రంభ
తారుణ్యయుత వధూత్తమ తిలోత్తమయు                 (7200)
మొదలైన యప్సరో ముకురాస్యవెదుట
ముదమంది నర్తనములు సేయుచుండ
ఠీవిమై మడ్డు డిండిమ ఝర్ఝరాది
రావముల్భూమి నభ్రమున ఘూర్ణిలఁగ
నురగులు సిద్ధసాధ్యులును యక్షులును
సురలు గంధర్వులు సొరిది సేవింప
చందంబులా శోఉరిచందంబులెన్ని
వందిమాగధులు భావంబులు దాల్చి
మంగళం బరవింద మందిరాపతికి
మంగళం బహివైరి మహితకేతునకు                 (7210)
మంగళం బమృతాబ్ధి మధ్యగేహునకు
మంగళం బనువరు మధుసూధనునకు
నని సన్నుతింప గానమహోత్సవముఁ
గని వాసుదేవుండు కామపాలుండు
దక్కిన యాదవోత్తములు వాహనము
లెక్కి సంభ్రమముననేతేరఁ బురము
నేగి తార్క్ష్యునిడిగ్గి యేణలోచనలు
భద్ర నీరాజనల్పలుమాఱు నొసఁగ
భద్రవిభుండు సుభద్రావిభుండు                 (7220)
కైదండ గావింపఁగా మద్రసుతులు
పాదమజ్జనమొ నర్పఁగ నేగుదెంచి
కాంత రత్నోజ్జ్వన కల్యాణమంట
పాంతరంబుననిల్చెనంత నారాజు
హరిని గాంచనపీఠి నాసీనుఁ జేసి
చరణపంకజములు జలజంబులార్చి
మధుర మంత్ర స్వర మంత్రస్వరముగ
మధుపర్క మొసఁగి ప్రేమంబుతోమున్ను
కైసేసియున్న లక్షణను లక్షణసు
భానుర సంఫుల్ల పంకజేక్షణను               (7230)
జెలువలుదోతేరఁ జెలువమేపారఁ
గలహంసగతుల నక్కన్యయేతేర
నా సమయంబున యజుఁడుఁ గాయజుఁడు
భాసిల్లఁగాఁ దెర వట్టిరవ్విభుఁడు
వొనరంగ నాగమప్రోక్త మార్గమునఁ
దనయను వసుదేవతనయున కొసఁగె
దేవకామినులు భూదేవకామినులు
భావజగురుపెండ్లి సౌవర్ణపాత్రికలఁ
గనుపట్టునెడకుడు కలుసేసఁబ్రాలు               (7240)
సవరింప మంగళాష్టకములు చదివి
రవళిమీఱఁగ మూహూర్తంబనిచెంత
గురుఁడు వచింపనిక్కుచుఁ బంచబాణ
గురుఁడు లక్షణయును గుడజీరకముల
నొండొరు శిరముల నునిచినెమ్మోము
లొండొరు వీక్షించి యురుతరప్రేమఁ
దనదు కటాక్ష సుధాబిందుజాల
మననొప్పు తెలిముత్తియముల దోయిటను
బలసోదరుఁడు ముంచి పట్టిచేముంచి
తలబ్రాలునింప దాత్పర్యంబు మెఱసి                (7250)
కంకనములదండ గలియనొండొరులు
కంకణంబులు పొందుగాఁ గట్టిరంతఁ
కల్యాణ చేలుండు కల్యాణిఁ గూడి
కల్యాణ వేదిపై ఘనరత్నపీఠి
నాసీనుఁ డగుచు హోమాది కృత్యములు
సేసి యాశీర్వాద శ్రీలఁ బెంపొందఁ
దళుకుఁ జూపులుబేడసలు జాడసలుపు
తళుకుఁగన్ను విరిదమ్మిమోములును
వీగిననెఱికప్పు వేనలురెదురు
గాఁ గీలుకొనినకర్కశఁపు పాలిండ్లు             (7260)
గలకలకంఠులు కలధౌతపాత్ర
ములను నీరాజనమును సమర్పింప
హరి యిట్లు లక్షణ నతివైభవమునఁ
బరిణ్యంబై యాత్మఁ పరిణామమొదవఁ
దదనంతరమున శాస్త్రప్రకారమునఁ
దుదలేని యర్థి చతుర్థికావించి
వీడువఁగల బంధువితతి సంతనము
వీడుఁజోడారంగ వీడులువెట్టి
మతినుబ్బియల పితామహ మహాదేవ
దివిజారి నాధారి దేవతావరుల                     (7270)
సురుచిరాంశుక ఘనాంశుకములతోడఁ
గరమర్థివేర్వేఱ కట్న ముల్జదువ
హరియుదానందఱ కన్నిలాగులను
వర భూషణాదుల వరుసతోనొసఁగి
భూసురాశీర్వాదములఁ జెందివారి
భాసుర కాంచనవ్రతతులఁ దనిపి
వందిత జనులకు వంది మాగధుల
కందందవేడ్క నిష్టార్థంబు లొసఁగి    
యలరుచువీరు వారనక సంపదలు
వలసినవారికి వలసినట్లిచ్చి                    (7280)
లక్షణతో భవ్యలక్షణ వేళ
లక్షణానాధుఁ డుల్లమున సొంపొదవ
విబుధులతో ధరావిబుధులతోడ
సబలులైనట్టి రాజన్యులతోడ
నగధరుండర్ధేశుఁ డనుపంగ నాత్మ
నగరప్రవేశమున్నతిఁ జేసియపుడు
దేవకీవిభునకు దేవకీసతికి
దేవతీసవతికెంతే వేడ్కమ్రొక్కి
రేవతీవిభునకు రేవతీదేవి
నావలవరుసతో నభినుతుండయ్యు                (7290)
నాముద్రసుతయుఁ దానత్తమామలకు
రామునకా బలరాము దేవికిని
సవతులైనట్టి యాసవతులకెలమి
నవిరళభక్తిమై నభినుతుల్సేసె
నప్పుడు పద్మ పద్మాయతనేత్రుఁ
డప్పద్మభవు శివు నమరేంద్రముఖుల
గారవంబున శుభాగతులైన యట్టి
వారిఁ గృపామృతా వారినోలార్చి
మదవతీకుల శిరోమణి రుక్మిణికిని
వదనేందు సౌభాగ్యవతి జాంబవతిని           (7300)
నమిత గుణస్థేమయగు సత్యభామఁ
గమల శోభనగాత్రి కమలాప్తుపుత్రి
నమితశోభనవిందయగు మిత్రవింద
నమరజాలస్తుత్యయైనట్టి సత్యఁ
బ్రకట లావణ్యసంపద్భద్ర భద్ర
సకలకల్యాణ లక్షణను లక్షణను
గనుఁగొని యంతరంగమునఁ బ్రేమంబు
ననలొత్తఁ దన్మోహనతఁ జూచి పలికె
నిప్పడంతులకొప్పులింద్రనీలముల
కుప్పలో యొప్పుల కుప్పలో యనుచుఁ               (7310)
గొమ్మల నేత్రముల్కోమల జలచ
రమ్ములో వరచకోరమ్ములోయనుచుఁ
వ్రవిమలాంగుల యధరములంబరాగ
లవములో బాల పల్లవములో యనుచు
పొలతులమాట లబ్బురమైన చిలుక
పలుకులోకప్రంపుఁ బలుకులోయనుచు
నంబుజాననల సొంపారుగళములు
కంబులో తజ్జన కంబులోయనుచుఁ
గువలయాక్షులగుచన్ను గుబ్బలు గిరుల
కవలో క్రొమ్మెఱుఁగు జక్కవలొయటాంచు         (7320)
ఉరుపయోధరులూరు లున్నతకుంభి
కరములో మోహనాకరములో యనుచు
నమ్మానినుల మించులైన పాదములు
తమ్ములోకూర్మ మొత్తమ్ములోయనుచు
నీరీతిఁ గొనియాడి యిందిరావిభుఁడు
వారితోవేడ్క గైవారనందంద
వారితపంచాస్త్ర వరకేళిఁ దేలి
వారిజాసన దేవవరముఖుల్గొలువ
నిచ్చకల్యాణముల్నెరయంగనింటఁ
బచ్చతోరణములు భాసిల్లుచుండ                     (7330)
నారూఢి లోకారాధ్యుఁ డగుచు
ద్వారకానగరి నెంతయువేడ్కనుండె
ఈకృష్ణచరితంబు నెవ్వరు విన్న
వాక్రుచ్చి తలఁచినవారి కెల్లపుడు
చిరతరాయువులును జింతితార్థములు
సిరియుఁ గృష్ణుని కృప జెందుదురనఘ
అని యోగిజనపాలుఁ డాజనపాలుఁ
డనుమోదమంద నిట్లనియానతిచ్చె
అని సుధావాణికి నబ్జపాణికిని
వనజాస్త్రుమాతకు వనధిజాతకును                 (7340)
ననుగన్నతల్లి కనమ్రభల్లికిని
కనకగాత్రికిని ప్రకామ దాత్రికిని
వాణీశనుతకు సువ్రతకక్షి విచల
దేణికి శ్రీవేంకటేశు రాణికిని
సారసగేహకుఁ జారుబాహుకును
సారలావణ్యకు సకలగణ్యకును
బరమకల్యాణికి భ్రమరవేణికిని
దరుణేందుఫాల కుదారశీలకును
రామాభిరామ కప్రతిమధామకును
హైమసంవ్యానకు హంసయానకును               (7330)

(నిజకావ్యసమర్పణము. కవివంశకావ్యప్రశంస. గ్రంథనిగమనము)

నింద్రభావితకు గజేంద్రసేవితకుఁ
జంద్రికాహాసకుఁ జారునానకును
నగసుతానుతకుఁ బన్నగతల్బయుతకు
మృగమదాంగకు నలయేలుమంగకను
నంకితంబుగాను శ్రీహరిభక్త నికర
పంకజార్యమ తాళ్ళపాకాన్నమార్య
తనయ తిమ్మార్య నందిత రత్నశుంభ
దనుపమ శ్రీవేంకటాద్రీశ దత్త
మకర కుండల యుగ్మ మండితకర్ణ
సుకవి జీవంజీవ సోమరాజీవ
సదనావధూ లబ్ధ సరసకవిత్వ                (7360)
విదితమానస తిరువేంగళనాథ
విరచితంబగు ప్రతిద్విపద సంశ్రవణ
తరళిత విబుధ మస్త ప్రణీతోరు
మనసిజ జనకాష్ట మహిషీవివాహ
మనుకావ్యమునఁ బంచమాశ్వాసమయ్యె

అష్టమహిషీకల్యాణ ద్విపద కావ్యము సంపూర్ణము

Thursday, June 30, 2016

ఆంధ్రనామసంగ్రహము - 5

ఆ. వటుసమాఖ్య లగును వసుధలోఁ గొండిక
వాఁ డనంగఁ బడుచు వాఁ డనంగఁ
బిన్నవాఁ డనంగఁ జిన్న వాఁడనఁగను
(వినుతగుణసనాథ విశ్వనాథ)              (13)

టీ. కొండికవాఁడు, పడుచువాఁడు, పిన్నవాఁడు, చిన్నవాఁడు - ఈ నాలుగు బాలునికి పేర్లు

సీ. గిటక పొట్టి కుఱుచ గిట్ట గుజ్జనఁగ వా, మనుఁ డొప్పుఁ జను నవ స్మారిపేళ్లు
వెడఁగు వేఁదుఱు వెఱ్ఱి వీఱిఁడి వేఱిఁడి, వెంగలి వెంబర విత్తనంగ
జతురునకును బేళ్ళు జాణ దంట వలంతి, వెరవరి ప్రోడ నేర్పరి యనంగ
ప్రన్ననివాఁడు రూపరి చూడఁగలవాఁడు, చక్కనివాఁడు నా జగతిఁ బరఁగు
తే. సుందరాకారవంతుండు సొగసుకాఁడు
వన్నెకాఁదన శృంగారి వసుధ వెలయు
సంధకునిపేళ్లు చీకు గ్రుడ్డనఁగ మూఁగ
మూవ యన మూకనామముల్ (దేవ దేవ)               (14)

టీ. గిటక, పొట్టి కుఱుచ, గిట్ట, గుజ్జు - ఈఅయిదును పొట్టివాని పేళ్లు. వెడఁగు, వేఁదుఱు, వెఱ్ఱి, వీఱిఁడి, వేఱిఁడి, వెంగలి, వెంబరవిత్తు - ఈ ఏడును మూర్ఖునికి పేర్లు. జాణ, దంట, వలంతి, వెరవరి = ఉపాయము కలవాడు, ప్రోడ, నేర్పరి = నేర్పు కలవాడు - ఈ ఆరును సమర్థునికి పేర్లు. ప్రన్ననివాడు, రూపరి=అందము కలవాడు, చూడగలవాడు= ఇతరులచే చూడతగినవాడు, చక్కనివాడూ - ఈ అయిదును సౌందర్యవంతునికి పేర్లు. సొగసుకాడు = వేడుక కలవాడు, వన్నెకాడు = వన్నె కలవాడు - ఈ రెండును సింగారించుకొనిన వానికి పేర్లు. చీకు, గ్రుడ్డి - ఈ రెండును అంధునికి నామములు, మూగ, మూవ - ఈ రెండును మూగవాని పేర్లు.

కం. కాయముపేళ్ళై వెలయును
మే యన వొడ లనఁగ మేను మెయి యన భోగ్య
ప్రాయము పేళ్ళగుఁ బరువము
పాయము జవ్వన మనంగ (భావజదమనా)               (15)

టీ. మే, ఒడలు, మేను మెయి - ఈ నాలుగు ను శరీరమునకు నామములు, పరువము, పాయము, జవ్వనము, - ఈ మూడును యౌవ్వనమునకు నామములు.

తే. నెఱులు కురులు వెండ్రుకలు నా నెఱక లనఁగఁ
గొప్పు తుఱు మన వేనలి క్రొవ్వెద యనఁ
గేశధమిల్లములు మించుఁ గీలుగంటు
క్రొమ్ముడి యనంగఁ గేశబంధమ్మగు (భవ)         (16)

టీ. నెఱులు,కురులు, వెండ్రుకలు, నెఱకలు - ఈ నాలుగును కేశముల నామములు. కొప్పు, తుఱుము, వేనలి, క్రొవ్వెద (క్రొత్త+వెద) - ఈ నాలుగును స్త్రీల కొప్పునకు పేర్లు, కీలుగంటు, క్రొమ్ముడి (క్రొత్త+ ముడి) - ఈ రెండునును వెండ్రుకలముడికి పేర్లు.

తే. నొసలు నెన్నొసల్ నుదురు నెన్నుదు రనంగఁ
దనరు ఫాలంబు చూడ్కి చూపనఁగ నొప్పు
నాహ్వయము లీక్షణమునకు నక్షికాఖ్య
లలరుఁ గన్ గను కన్ను నా ( నభ్రకేశ)           (17)

టీ. నొసలు నెన్నొసలు, నుదురు, నెన్నుదురు - ఇవి నాలుగును ఫాలభాగమునకు పేర్లు. చూడికి (చూడ్కి) చూపు - ఈ రెండును చూచుటకు పేర్లు. కన్ కను కన్ను - ఈ మూడును నేత్రమునకు పేర్లు.

క. వీను లనఁ జెవులనంగా
జానుగు లన నాహ్వయములు శ్రవణంబులకున్
గౌ నన నడు మనఁగ నభి
ధానము లగు మధ్యమునకు (దరుణేందుధరా)         (18)

టీ. వీను, చెవి, జానుగు - ఈ మూడును చెవులకు నామములు. కౌను, నడుము - ఈ రెండును నడుమునకు పేర్లు

తే. అక్కు ఱొ మ్మెద బోర నా నలరు వక్ష
మాస్యమున కొప్పుచుండు నాఖ్యలు మొగంబు
మోర మో మనఁ బేళ్ళొప్పు నూరువునకుఁ
బెందొడ యనంగఁ గుఱువు నా (నందివాహ)      (19)

టీ. అక్కు, ఱొమ్ము, ఎద, బోర - ఈ నాలుగును వక్షస్థలంబునకు పేర్లు. మొగంబు, మోర, మోము - ఈ మూడును ముఖమునకు పేర్లు. పెందొడ, కుఱువు - ఈ రెండును ఊరువుకు నామములు.

తే. వదనగుగ యొప్పు నోరు నావాయి యనఁగఁ
బల్లు పలు నాఁగ దంతంబు పేళ్లు వెలయుఁ
బెదవి వాతెఱ మోవి యన్పేళ్లఁ దనరు
చుండు నోష్ఠంబు (శీతాంశుఖండమౌళి)        (20)

టీ నోరు, వాయి - ఈ రెండును నోటిరంధ్రమునకు పేర్లు. పల్లు, పలు _ రెండును దంతనామములు. పెదవి, వాతెఱ, మోవి - ఈ మూడును ఓష్ఠమునకు నామములు.

క. కయి యనఁ గైనాఁ గే లనఁ
జెయి యనఁ జై నాఁగఁ జెయ్యి చే వాహస్త
హ్వయము లగు (నన్నపూర్ణా
ప్రియవల్లభ కాశికాపురీవరనిలయా)              (21)

టీ. కయి, కై, కేలు, చెయి, చై, చెయ్యి, చే - ఈ ఏడును కస్తములు.

క. ఎద యన డెందం బనఁగ
మది యనఁగా నెడఁ దనంగ మఱి యుల్లము నా
హృదయమునకు నివి యెసఁగును
విదితంబుగ నాహ్వయములు (విశ్వాధిపతీ)           (22)

టీ. ఎద, డెందము, మది, ఎడద (ఎడ) ఉల్లము - ఈ ఐదును మనస్సునకు పేర్లు.

క. లోఁజె య్యన నఱచె య్యనఁ
గాఁ జెల్లును బేళ్లు రెండు కరతలములకున్
మీఁజె య్యన బెడచెయ్యి యు
నాఁ జనుఁ గరచరమభాగనామములు (శివా)         (23)

టీ. లోఁజెయ్యి=చేతి యొక్క లోపలి ణాగము, అఱజెయ్యి = లోపలి చెయ్యి - ఈ రెండును అఱచేతికి పేర్లు.  మీఁజెయ్యి - చేతియొక్క మీది భాగము, పెడచెయ్యి = చేతికి వెనుకటి భాగము - ఈ రెండును హస్తము యొక్క వెనుకటి భాగమునకు పేర్లు.

ఆ. పొట్ట డొక్క కడుపు బొజ్జ బొఱ్ఱ యనంగ
నొప్పుచుండు నాఖ్య లుదరమునకు
నాభిబీలమునకును నామధేయము లగు
బొడ్డు నాఁగ మఱియుఁ బొక్కి లనఁగఁ            (24)

టీ. పొట్ట, డొక్క, కడుపు, బొజ్జ, బొఱ్ఱ - ఈ ఐదును ఉదరమునకు పేర్లు. బొడ్డు, పొక్కిలి - ఈ రెండును నాభికి పేర్లు.

తే. వెన్ననంగను వీఁపు నా వెనుకమేను
నాఁగఁ జరమాంగమున కొప్పు నామములుగఁ
బుఱ్ఱె తలపాల నాఁ బున్క పుఱియ నాఁగ
ఫాలమున కాఖ్య లై యొప్పు (ఫాలనేత్ర)              (25)

టీ. వెన్ను, వీపు, వెనుకమేను =  శరీరము యొక్క వెనుకటి భాగము - ఈ మూడును వీపుకు పేర్లు. పుఱ్ఱె, తలపాల, పునుక, పుఱియ - ఈ నాల్గును కపాలమునకు పేర్లు.

క. అడు గంజ హజ్జ యనఁగఁ
బుడమిఁ బదంబునకు నామములు విలసిల్లున్
మెడ కుత్తు కఱ్ఱు గొం తన
నడారు గళంబునకుఁ బే(ళ్లనంగధ్వంసీ)            (26)

టీ. అడుగు, అంజ, హజ్జ - ఈ మూడును పాదమునకు పేర్లు. మెడ, కుత్తుక, అఱ్ఱు, గొంతు - ఈ నాలుగును గొంతునకు పేర్లు.

ఆ. బువ్వ వంటకంబు బోనంబు మెతుకు కూ
డోగిరము పసాద మోరె మనఁగ
నన్న మొప్పుఁ జేల మలరుఁ బుట్తంబు దు
వ్వలువ చీర కోక వలువ యనఁగ                 (27)

టీ. బువ్వ, వంటకము, బోనము, మెతుకు, కూడు, ఓగిరము, పసాదము, ఓరెము - ఈ ఎనిమిది అన్నమునకు నామములు. పుట్టము, దువ్వలువ, చీర (చీరె), కోక, వలువ - ఈ నాలుగును వస్త్రమునకు నామములు.

తే. మెసవె నారోగిణమొనర్చె మెక్కెఁ దినియెఁ
గుడిచె నారగించెను, బసాపడియె నమలె
సాపడె ననంగ నొప్పు భోజనము సేసె
ననుటకివి యాఖ్యలై (యీశయభ్రకేశ)            (28)

టీ. మెసవెను (మెసగెను) అరోగిణమొనర్చెను, మెక్కెను, తినియెను, కుడిచెను, ఆరగించెను, పసాపడియె, నమలెను, సాపడెను, - ఈ తొమ్మిదియు భోజనము చేసెననుటకు పేర్లు.

క. నాన యన సిగ్గు సిబ్బితి
నా నివి వ్రీడాపదంబు నామంబు లగుం
బానము సేయుట పేళ్లగు
నానుట త్రాపుటనఁ ద్రాగుటనఁ గ్రోలుటనన్             (29)

టీ. నాన, సిగ్గు, సిబ్బితి - ఈ మూడును లజ్జకు పేర్లు. ఆనుట, త్రాగుట, త్రాపుట, క్రోలుట - ఈ నాలుగును మద్యాది ద్రవ్యముల బానము సేయుటకు పేర్లు.

ఆ. తళియ పళ్లెరంబు తెలె హరివాణంబు
తట్టి కంచ మనఁగ దనరుఁ బాత్ర
చెల్లుఁ జషకమునకు బేళ్లు డబ్బుర కోర
గిన్నె యనఁగ (రజితగిరి నివాస)                   (30)

టీ. తళియ, పళ్ళెరము, తెలె, హరివాణము, తట్టి, కంచము, - ఈ ఆరును భోజనపాత్రమునకు పేర్లు. డబ్బుర, కోర, గిన్నె - ఈ మూడును పానపాత్రమునకు పేర్లు.

తే. నతికిఁ బేళ్లొప్పు జోత దండము జొహారు
మ్రొక్కు జేజే యనంగఁ గేల్ మొగిచెఁ గొలిచె
నెఱఁగెఁ జేమోడ్చె నన నమస్కృతి యొనర్చె
ననుట కివి యాఖ్యలగు (నీశ యభ్రకేశ)          (31)

టీ. జోత, దండము, జొహారు, మ్రొక్కు, జేజే - ఈ అయిదును నమస్కారమునకు పేర్లు. కేల్మొగిచెన్ = చేతులు జోడించెను, కొలిచెను, ఎఱఁగెన్ (ఎరఁగెన్) చేమోడ్చెను = చేతులు జోడించెను - ఈ నాలుగును నమస్కారము చేసెననుటకు పేర్లు.

తే. ఒప్పు శయనించుటకును బన్నుండెఁ బండెఁ
బవ్వడించెఁ బరుండెను బవ్వళించె
నత్తమిల్లె నన న్మఱి మెత్త సెజ్జ
పఱపు పాన్పనఁ తగు శయ్య (ఫాలనేత్ర)        (32)

టీ. పన్నుండెను, పండెను, పవ్వడించెను, పరుండెను, పవ్వళించెను, అత్తమిల్లెను - ఈ తొమ్మిదియు శయనించెననుటకు పేర్లు. మెత్త, సెజ్జ (శయ్య - వికృ సెజ్జ)పఱపు, పాన్పు - ఈ నాలుగును శయ్యకు పేర్లు.

తే. ఒప్పు ధ్వనిపేళ్లు రొదయన నులిపు నాఁగ
సద్దనంగను గూఁత నాఁ జప్పు డనఁగఁ
నలుకు డన రోదనము సేసె ననుట కాఖ్య
లెసఁగు నఱచెను వాపోయె నేడ్చె ననఁగ         (33)

టీ. రొద, ఉలిపు, సద్దు (శబ్దశబ్ద వికృతి) కూత, చప్పుడు, అలుకుడు - ఈ ఆరును శబ్దమునకు పేర్లు. అఱచెను, వాపోయెను, ఏడ్చెను - ఈ మూడును రోదనము చేసెననుటకు పేర్లు.

క. అగుఁ బేళ్లు నీరువ ట్టన
దగ దప్పిము దూప యనఁగ దాహంబునకున్
నగవు నగు నవ్వు నవు నా
నగు నాఖ్యలు హాసమునకు (నగజాధీశా)          (34)

టీ.  నీరువట్టు, దగ, దప్పి, దూప - ఈ నాలుగును దాహమునకు పేర్లు. నగవు, నగు, నవ్వు నవు - ఈ నాలుగును హాసమునకు పేర్లు.

క. చాగము నాఁ బుడు కనఁగా
నీగి యనఁగ నిడుట యనఁగ నీవి యనంగాఁ
దేగము నాఁ బెట్టుడు నాఁ
ద్యాగమునకు నాఖ్య లగుచు ధరఁబరఁగు (శివ)      (35)

టీ. చాగము, పుడుకు, ఈగి, ఇడుట, ఈవి, తేగము (త్యాగ శబ్దభవము) పెట్టుడు - ఈ ఏడును దానమునకు పేర్లు.

ఆ. ఎలసె బెరసె హత్తె నెనసె నదికెఁ జెందె
బొందె దొరసెఁ గూడె నొందె చెనకె
ననఁగ సక్తమయ్యె ననుటకు నివి యాఖ్య
లగు (గిరీశ యీశ యభ్రకేశ)                      (36)

టీ. ఎలసెన్, బెరసెన్, హత్తెన్, ఎనసెన్, అదికెన్, చెందెన్, పొందెన్, దొరసెన్, కూడెన్ ఒందెన్, చెనకెన్ - ఈ పదకొండును ను కలిసి కొనెననుటకు పేర్లు.

Sunday, June 26, 2016

అష్టమహిషీ కల్యాణము - 18

4. చతుర్థ పట్టమహిషీ
శ్రీకాళిందీదేవి వివాహవర్నన ప్రసంగము

యేను గాళిందిని యనున్ కన్యఁ గన్యఁ
గాను శ్రీపతి పతిగాఁ గోరి యిచట
నున్నతిఁ దపము సేయుచునుంటినన్న
మున్నంది కృష్ణుండు మెలత నీక్షించి
యాతపంబునఁ జేయు నాతపంబెల్ల
నాతినీకొనఁ గూడె ననుఁగూడుమిప్పు               (6390)
డనిశంబు భర్తగానాత్మనీవెన్ను
వనమాలినేనయో వనజాప్తపుత్రి
యనుచు నూదార్చి యొయ్యననెదఁణ్ జేర్చి
ఘనతర కుతుకాబ్ధిఁ గడునోల లార్చి
కమలాప్తుఁ డపుడు కమలాప్తు కూర్మి
కొమరితఁ దోకొని కొమరు దీపింప
మును వసించిన వనమునకేఁగుదెంచి
యనుపమ సకలసైన్యంబులు గొలువఁ
బౌరులునల నాకపౌరులుఁ బొగడ
ద్వారకాపురికిఁ దీవ్రనేగుదెంచి                (6400)
వరమణిమునులాది వస్తుసంతతులఁ
బురముకై సేయించి పురమెల్లఁ బొగడఁ
బాండవేయుల సర్వ బంధుజాలముల
వెండియుఁ బిలిపించి విభవంబుమెఱయ
వేదోక్తి వేధవిధు లాచరించి
యాదేవదేవుఁడ డత్యాదరంబొదువఁ
జారు ప్రసూన కాంచనచేల గంధ
భూరి భూషణగణ భూషితుండగుచు
శ్రుతులు ఘోషింప సంస్తుతులతో నాక
పతులు గంధర్వదంపదులుఁ బాడంగ                (6410)
హరిపిత దేవకి యాదవుల్దాము
హరిరాణిఁ గొనివచ్చి యర్థిఁ బూజింప
ఝుల్లరీ కాహళీ శంఖ మృదంగ
వల్లకీధ్వనులు దిగ్విలయంబుఁ బొదువ
దేవకీతనయు డెంతయు వేడ్కతోడ
వైవాహి కోత్సవావని నొప్పుచుండె
నహిశాయి తనయల్లుఁడయ్యె నటంచు
మిహిరుఁడప్పుడు కడుమిన్నంది పొంగి
గ్రహమండలముఁ దారకా మండలమును
బహు మౌనిపతులు సంభ్రమమునఁ గొలువ           (6420)
ఛాయానువృత్తి నిచ్చలుఁ గూడియుండు
ఛాయతోఁ గూడ నచ్చటి కేగుదెంచి
తరుణిఁ బుల్కడిగిన దర్పకాస్త్రంబు
కరణిఁగైసేసి చెంగటనొప్ప కన్యఁ
గనకాంబరుని పాద కమలముల్గడిగి
కనకధారా పూర్వకంబుగానిచ్చె
జలజాతమిత్ర సంజాత నీక్షించి
పలికిరి మునివరప్రముఖలు చెలఁగి
సతిబొమల్గన్ను లెంచఁగఁదగున్మీన
పతులౌటనో గురు భావంబు దాల్చి                     (6430)
తలపోయ నిత్యమూర్తంబైనక తనఁ
దనకౌను పరమాణు తనునెన్నఁదగును
నీలంబు విబువును నిత్యంబునగుట
బాలకీల్గొప్పు నభ్రంబనవచ్చు
నని వితర్కింపుచు నన్యోన్యమిట్టు
లనుమానమునుజెంద నంబుజాక్షుండు
వనజాప్తపుత్రి నుద్వాహమై బంధు
జలములఁ గనకభూషణములం దేల్చి
గ్రహములతోఁ గూడి గ్రహరాజముఖుల
మహితానురక్తి సన్మానంబు సేసి                      (6440)
గణుతింపరాని సౌఖ్యములతో నభ్ర
మణిపుత్రికా సతీమణితోడఁ గూడి
జగములు జయవెట్ట జగదేకనాధుఁ
దగణిత శ్రీయుక్తుఁడై యుండెనంత

5. పంచమ పట్టమహిషీ
శ్రీ మిత్రవిందాదేవి వివాహ వర్ణన ప్రసంగము.

రారాజుహితులుతో రంపుసంపదల
రారాజుఁ దెగడు ధరాధినాయకులు
విందానువిందులు వివరింపఁ గూర్మి
విందైనయట్టి గోవిందుఁడుండఁగను
గురునాయకుని కొఱకొఱ మాటలకును
హరిమేన బావనునాత్మఁ గైకొనక                 (6450)
కలకంఠి ముకురాస్య కంజాయతాక్షి
నలికులాలక బిసహస్త లతాంగి
హరిమధ్య గిరికుచ హరిచక్రజఘన
సరస రంభోరు కాంచనతూణ జంఘుఁ
గిసలయపద వల్లకీవాణి దంట
హసితకోమలకుందయగు మిత్రవింద
యనుపేర యనుజన్మ నాకామపాలు
ననుజన్మునకు నెంతయైన నీమనుచు
ధరమీఁదఁ గల్గునుదారభూనాధ
వరులు గూడఁగ స్వయంవరము చాటింప            (6460)
నావార్త విని కృష్ణుఁడా మిత్రవింద
భావార్థమెంతయు భావించి తెలిసి
మీటలై సోఁగలై మించులై మిగుల
తేటగానొంటి ముత్తియములు దాల్చి
యేణాంకుమై చాయనెక సక్కెమాడు
నాణియంబగు ధౌత నాధరియించి
మృగమద కర్పూర మిళిత చందనము
నిగనిగపుటమైన నెఱిపూఁత పూసి
తరణి శీతాంశుల ధళధళల్గుల్కు
ధరచక్రముల నొప్పు తాళిఁగీల్కొల్పి                   (6470)
బంగారు పువులఁ బచరించునట్టి
చెంగావి దట్టిగా సించి వింతగను
సొలపు గోణముచుంగు సొంపు జూపట్ట
వలివంపు దుప్పటి వలెవాటు వైచి
కళుకుల ముద్దుటుంగరము గీలించి
వలకేలముకులపై వంకిలొలిడించి
కనుపట్టునెఱకూడె కానితనంబు
తన సొమ్మెయనఁగ నెంతయు సొంపు మిగిలి
విహగేంద్రకేతన విలసితంబైన
మహనీయ నవరత్నమయ రథంబెక్కి                   (6480)
యమితబలాన్వితుండై భానుకోటి
రమణ నవంతీపురంబున కరిగి
బహురాజ కోటీరపటు రత్నకాంతి
వహియించునా స్వయంవర భూమినుండ
నురుణు రాకకుఁ బద్మమలరు చందమున
హరిరాక విని పొంగి యామిత్రవింద
జలజంబుతల క్రిందు సవరించినట్లు
జిలుగు దువ్వలువ పింజలు వాఱఁగట్టి
నలువంద నెలవంక నామంబు దీర్చి
కొలఁదిగా నడువఁ గుంకుమ రేఖఁ దీర్చి             (6490)
రవికాంతులొలుకు పురాణహారములు
బవి దీర్చిన కర్ణపత్రముల్దాల్చి
యరవిందశరుని మోహన పాశవితతి
సరవినొప్పెడు పంచసరములు పూని
సిరిమించు నెఱుల కుచ్చెలమీఁద జార
మురవైన మొఱపుల మొలనూలమర్చి
దివి శక్రధనువొప్పు తెఱఁగునుఁ గొప్పఁ
దవిలి చిత్రంపు పూదండ చెన్నొంద
లలితపుష్పిత కల్పలతిక చందమునఁ
గలితభూషణములుఁ గడుసొంపుమిగిలి                 (6500)
వాసుదేవునిఁ బోలువరుఁ గూడుమనుచు
సేనకొప్పున సతుల్సేసఁ బ్రాలిడఁగ
సతులింత నంత నెచ్చెరికలు సేయఁ
జతురంతయానంబు సరసమైనెక్కి
వాణి వాక్యప్రొఢి వరియించు కీర
వాణులప్పుడు ధరావరులఁ జూపంగ
నరుదేర నరుదార నాయింతిఁ జూచి
ధరణీశులును బౌరతరళ లోచనలు
నలిపంక్తి రంగొతొయ్యలి కప్పురంగొ
నెలవంక మురువొయా నెన్నొసల్మురువొ                  (6510)
కలువల మించొ యా కనుల మించొ
జలజంబుబాగొ యా సతిమోముబాగొ
శైలముల్దీరొ యీ చన్నులు తీరొ
నీలాహినలుపొ కన్నియయారునలుపొ
యనఁటులు మెఱుఁగొ యీయంకముల్మెఱుఁగొ
దొనలు వట్రువలొ లేఁదొదలు వట్రువలొ
తలిరుల సొబఁగొ పాదంబుల సొబగొ
తెలియ రాదనుచు నెంతేని జోద్యమంది
తూణంబు నెడలిన తొవయంప కాని
బానంబొ వాని కృపాణంబొయనఁగఁ                  (6520)
గరిసమూహము సొచ్చు కరివైరిపొల్కి
ధరణీశవరుల బృందంబు సొత్తెంచి
విందానువిందులు వెఱఁ గంద మిత్ర
విందకెంగే లరవింద లోచనుఁడు
పట్టి శతాంగంబు పైఁ బెట్టికొనుచుఁ
జుట్టి యున్నట్టి రాజులఁ బాఱబట్టి
పరమకీర్తి ప్రతాప ములతోనమర
వరులు మెచ్చఁగ ద్వారవతికే గుదెంచి
వేదవేత్తలు చతుర్వేదముల్జదువ
వాదిత్రములు పెక్కువ గలఘూర్ణిలఁగ                (6530)
నాగకామినులుఁ బున్నాగకామినులు
బాగుమీఱఁగను శోభనమువాడంగఁ
బటుతరాలంకార భరితుఁడై రత్న
పటల మండిత మంటపంబులోఁ జెలఁగి
సకల బంధువులు నిర్జరులుఁ గీర్తింప
నకలంక గుణబృందయగు మిత్రవింద
నిగమోక్త విధినిఁ బాణిగ్రహంబు
ఖగరాజవాహుండు గావించియంత
నాలేమతోఁగూడ యంగజకేళి
దేలియెంతయుఁ బ్రమోదింపుచునుండె                    (6540)
అవనీశ నగ్నజిత్తను పేరఁ బరఁగు
నవనీధవుఁడు కోసలాధినాయకుఁడు
సురుచిరాకార సంస్తుత గుణోద్ధార
నిరుపమాలంకార నిర్మలాచార

6. షష్ఠ పట్టమహిషీ
శ్రీసత్యకీర్తీదేవి వివాహవర్ణన ప్రసంగము

నిత్యకల్యాణి వర్ణితసత్యకీర్తి
సత్యనావిలసిల్లు చంద్రబింబాస్యఁ
దన తనూభవ వసుంధరఁగల్గి నట్టి
జననాధులడుగ నచ్చటి కేదుదేరఁ
గీలికీలాహ హాకృతుఁగ్రాలు
వాలుఁబోలెడునిడు వాలుఁగొమ్ములును                (6550)
నంభుదితుంగ భంగాలోలకాల
కంబళాయతగళ కంబళంబులును
బంధుర విద్యుత్ప్రభా భాసితోరు
కంధరంబుల బోలు కంధరంబులును
సమధిక శైలాగ్ర చటులశృంగముల
రమణఁ జూప్పడు మూపురములునుం గలిగి
బలిమి శంకరుగిబ్బఁ బడగిబ్బఁ జాలు
లలిమీఱనేడు మల్లరపుఁ గోడియల
నాజవరులకు నారాజు చూపి
యేరాజవరుడైన నీ వృషంబులను                (6560)
బట్టియొక్కటికినిఁ బైదామకమునఁ
గట్టియెంతయు భుజాగర్వంబు నెఱుపు
నట్టి విభుండు వోనరయనాకూర్మి
పట్టి విభుండని పల్కుఁగ భూవరులు
నాయెడ వానితో నరిమురిఁ బోరి
పోయిరి కొందఱప్పుడు జముపురికి
వేయైన నిదికాదు వీడుఁడంచుఁ జడిసి
పోయిరి కొందఱప్పుడు పురంబులకు
వారి శౌర్యములకై విని దాన
వారి యాపనియెంత యని నవ్వు కొనుచు                 (6570)
వాలారుచంద్రిక వన్నియచుంగు
డాలువాటిల్ల మూడానంబుఁ జుట్లి
తరుణారుణోద్దామ ధామసంతతులఁ
బురణింపఁ గెంపుల పోఁగులవెట్టి
యసమసాయకుని మోహన తురంగముల
పసమించు పచ్చకబ్బాయి ధరించి
చుట్టు వజ్రంబుల సొబగు దీపింప
గట్టాణి ముత్తెంపు కడియముల్దాల్చి
తెలిమించు క్రొత్తముత్తెముల గెంటెములు
పొలుచునాణెఁపు పట్టౄ పుట్టంబు గట్టి               (6580)
యచలాగ్రమున నొప్ప హరి కిషోరంబు
రచనజొప్పడ హేమరథవర్తియగుచు
బలములునరుఁడు సంభ్రమలీలఁ గొలువ
బలమును జలమును నేర్పడ శత్రుసమితి
భయమంద గోసలపట్టణంబునకు
రయమునఁ జనుదెంచి రాక్షసాంతకుఁడు
ఎదురేగి యావిభుఁ డిందిరావిభుని
బదివేల తెఱఁగులఁ బ్రణుతించి మ్రొక్కి
సకలోపచారముల్సవరించి భక్తి
నకలంక సింహాసనాసీనుఁ జేయ                        (6590)
నలఘ సౌధాగ్రంబునందు శోభిల్లు
జలజాతనేత్రి కోసలరాజపుత్రి
మరకతశ్యామ కోమలకల్పధాము
నరవిందదలనేత్రు హాటకనేత్రుం
గురువిందరదను నక్రూరాంశురదను
సరసమంజులహాసు చంపకనాసు
ఘనకిరీటోద్దారుఁ గౌస్తుభహారు
ననుపమాయతదేహు నాజానుబాహుఁ
జెలువొందఁ జూచియా శృంగారరసము
పొలుపారవాలుఁ జూపులనే క్రోలుచును                     (6600)
నీ రమేశ్వరుఁడు ప్రాణేశ్వరుండైన
ధారణి నేఁ జేయు తపమే తపంబు
భావింపనేవేల్చు భక్తమందార
మావేల్పు నాభర్తయైయుండుఁ గాక
యరయంగఁ దొలుత భావమున సత్యముగ
సిరివరునేఁ బూజ సేసితినేని
నీ మోహనాకారుఁడెన్ని బాగులను
గామించిననుఁ బత్నిఁగా నేలుఁగాక
యనుచు డెందమున నానవాలమున
ననురాగవల్లిక వలరింపుచుండె                       (6610)
నంతఁ గృషుండుఁ గోసలాధీశుఁ జూచి
సంతసంబునఁ బలుచని నవ్వుమోవిఁ
బెనఁగొన జలద గంభీర వాక్యమున
ననియె భూనాయకులన్యులు వేఁడఁ
దగవైన పూర్వబాంధవము చింతించి
యడిగెద నీ కూఁతుననియె మోదించి
పుడమిఱేడనియె నప్పుడు కృష్ణుతోడ
శ్రీవర భాగ్యంబు సేసితి నాకు
నీవంటి బంధులెన్నిన భూమిఁ గలరె                (6620)
ఐనమున్నొకటి మర్యాద సేసితిని
నీనగంబులఁ బోలు నేడుకోడియల
నుర్విపై నొక్కనాఁడొక త్రాటఁబెనుచు
నుర్వీశునకుగాని నొసఁగఁ గన్నియను
ననియుంటి నీచిత్తమనిన దైత్యారి
విని నవ్వి యట్లకామింతునే ననుచుఁ
దనరూపు పౌరకాంతలు ఱెప్పలిడఁగ
కనుఁ గొన నగరోపకంఠంబునందు
గర్జించి లయకాల కాలమేఘములఁ
దర్జించుఱంకెల దశదిశల్వడఁకఁ                     (6630)
బొదరి చిందకొట్టి భువితల్లడిల్లఁ
గదిసికయ్యమునకు గాలుదువ్వుచును
గొమ్ములు పాతాళ కుహర మేర్పడఁగఁ
జిమ్ముచు నేత్రముల్జేవురింపఁగను
గాలకూటార్చుల కరణిరోషాల
వాలంబులగు ఘనవాలముల్మెఱయ
భాసురోన్నత దిగిభములచందమున
భాసిలు మదవృషభముల నీక్షించి
గట్టిగాఁ దళుకు బంగారుకానె బిగ్గఁ
గట్టిచొల్పడు బాగుగాఁ జుట్టి యపుడు                      (6640)
దానవారాతి నందఱునాలకింప
భూనాధుఁ బచరించి భుజమప్పళించి
యిలబెల్ల గిలగిరులెల్లఁ బెల్లగిలఁ
జలమున నార్చి మచ్చరమునఁ బేర్చిఁ
చటుల మృగాళిపై శార్దూలముఱుకు
ఘననాదబోతులఁ గడిమి వేఁడించి
మల్లడిగొననొక్క మఱిమల్లరముల
వల్లవల్గొమ్ములుద్ధతి నొల్లగిల్లఁ
దల్లడిల్లఁగఁ బట్టి దట్టించి జగతి
ద్రెళ్లంగవైవ సందిచూచు జనులు                           (6650)
ఝల్లున నివిగ నిర్జరులెల్లఁ జెల్లు
జెల్లునీకనియుల్ల సిల్లంగ శౌరి
యుదుటునఁదన బాహుయుగముచేవాని
మెదిచి చాగతఁగొని మెడవల్లెవైచి
పెడవెట్టు కొండలు పెంపెల్లఁ బొలిసి
యడవెట్టుకొనుచు నోండ్రనుచు స్రుక్కఁగను
వడిఁగట్టివైవఁ గవ్వడిమనబావఁ
గడఁక నీక్షించి డిగ్గన నగ్నజిత్తు
ఇచ్చనెంతయు మెచ్చి యిందిరానాధుఁ
గ్రుచ్చి కౌగిటఁ జేర్చికొని సంతసించి                    (6660)
వరతూర్యజల నిస్వనములుఁ నెలఁగ
నరులు గిన్నరులు నెంతయు సంతసింప
లోకేశ భువుఁడు పులోమజా విభుఁడు
నాకమౌనులు దిశానాయకోత్తములుఁ
బరిణయాలోకన పరతఁజొన్నొంద
నలినలోచనలుతోయంబుగా ముద్దు
గిలుకొట్టు శోభన గీతంబువాడ
రమణీయతర నవరత్న వేదికను
గమలాక్షు మహిత శృంగారుఁ గావించి                     (6670)
శృంగార మొకకుప్ప సేసినట్లున్న
శృంగారవతి నాగ్నజితి యనుకన్య
సంకల్పమన్న కోసలరాజు సత్య
సంకల్పునకు నిచ్చె సంకల్పమలర
మురవైరివర వజ్రములు దోయిలించి
తరలాయతాక్షిపైఁ దలఁబ్రాలునించి
తమములో ఖద్యోతతతి ప్రకాశించు
రమణఁ గొప్పన సేసఁబ్రాలు శోభిలఁగ
ముకురాస్య నవరత్నములు దోయిలించి
మకరకుందల ధారి మైసేసనించె                       (6680)
నురువైభవమున వేదోక్తమార్గమున
హరి నాగ్నజితిఁ బెండ్లియాడె నవ్వేళ
రాజకాంతలు రతిరాజుఁ గన్నట్టి
రాజీవనేత్రు విరాజి విగ్రహముఁ
గని సంతసిలి యాత్మఁ గన్యకామణికి
ననుకూల వరుఁ డయ్యెనని పొంగిరంత
నందనందను మామ నవ్యవైఖరుల
విందులకెలమిమై విందుగావించి
యంబరాదులనోలలాడించి సమ్మ                           (6690)
దాంబురాశుల నోలలాడించి మెఱసె
హేమాంబరుండు నయ్యెడ బాంధవులకు
హేమాంబరాదుల నేకంబులొసఁగె
తనుజాత వనజాత దళనేత్రుతోడ
ననుప నుద్యోగించి యయుత ధేనువులు
నగణితాలంకృతులగు రెండు వేలు
మృగలోచనలును దొమ్మిది వేలు కరులు
నన్ని లక్షల తేరు లశ్వరత్నములు
నన్ని కోటులు శూరులై నట్టిభటులు
పరమసాహసులు తొంబది నూఱు కోట్లు
నరణంబుగానిచ్చి నవ్వధూ వరుల                       (6700)
నారూఢిఁ బూజించి యరథంబు మీఁద
నారూఢులుగఁ జేసి నారాజు కొలువ
మెఱుపుతో మొగులద్రి మెఱయుచందమున
దెరవలో శోఉరి యాతేరుపై జెలఁగి
నరునితో ద్వారకానగర మార్గమున
నరుగుచో నావార్తనరసి కోపించి
వెనుకొనిమున్ను దద్వృషభ నిర్భిన్న
తనులైన రాజనందనులెల్లఁ గూడి
పరమ లజ్జా రోష భరితులై వచ్చి
హరిఁ దాకి యిభములు హరిఁ జుట్టు పగిది       (6710)
నపుడు కృష్ణుఁ శాఙ్గమంది యారిపుల
కపుర మాపెదనని గమకించు విధము
భావించి యాయల బలములకెల్ల
నీవేళ నీవేల నేన చాలుదును
దేవ నన్నొక యింత దృష్టింప మనుచును
వేవేగ గాండీవి విల్లెక్కు వెట్టి
గుణ నినాదమున దిక్కులు పిక్కటిల్ల
గణుతింపరాని మార్గన పరంపరల
భూనభోంతరము లప్పుడు నిందనంప
వానలు గుఱియించి వానల మెఱసి                (6720)
రథములఁ దునిమి సారథలఁ గాఱించి
రథికులఁ దెగటార్చి రథ్యముల్గూల్చి
కేతువుల్నరికి పక్కెరలెల్ల వాల్చి
హేతులు సమయించి యేఁపు తూలించి
హరులఁ దుండించి భటాళి ఖండించి
కరుల నిర్జించి భీకరములైనట్టి
కాండముల్బఱపి నల్గడవచ్చు శత్రు
కాండముల్ధరవ్రాలఁ గామోది మోది
శరనిధి మంధరశైలంబు గలఁచు
కరణిఁ బిండిలి వండుగా సేనఁ గలఁపఁ              (6730)
బ్రళయ ప్రభంజన పారవేగమున
శరదాళి వీఁగిన సరవిఁ దద్బలము
బలభేది వజ్రబాణ ఘాతముల
కలికినల్గడలకే పఱివీఁగి పఱవ
దేవేంద్రసుతుఁడు నెంతే వేడ్క నగ్ని
దేవదత్తంబైన దేవదత్తంబు
పూరించెదెసలు నంబుధులు ఘూర్ణిలఁగ
శౌరి యప్పుడు ధనంజయ జయమ్మునకు
మెచ్చి వివ్వచ్చు నర్మిలిఁ బెచ్చుపెరుఁగ
గ్రుచ్చి కౌగిటఁ జేర్చికొని యాదరించి                   (6740)
కన్యతో జయరమా కన్యతో నబ్ధి
కన్యకాపతి ద్వారకాపురంబునకు
నరిగి యాపురవీధినరుఁదేరఁ బౌర
తరుణులు కోసలతనయు నీక్షించి
ముకురమో శశిబింబమో కాదు మోము
వెకరిమా గురుకందు వెలయదుగాన
కలువలొ మగమీలొ కాపు నేత్రంబు
లలవాడు వేడగంబులు లేవుగాన
సరసపూరమొ జలజమొ శ్యామగళము
హరికథావేద్యంబు లవిలేవు గాన                            (6750)
వలుకొందలొ జక్కవలొ కావు గుబ్బ
లలదంతురత ఱెక్కలవిలేవు గానఁ
బులినమో కరిశిరంబొలుకాదు జఘన
లలజారులును నేఱులవిలేవుగానఁ
గాళెలో శరధువో కావులేఁదొడలు
కామక కఠినతల్గలు గవువుగానఁ
రవికాబ్జములొ లత్తుకలొ కావొ పాద
ములు కంఠనకలత్వములు లేవుగాన
నని సన్నుతింప నందందని లింప
జనమవలోకింపఁ జలజలోచనుఁడు                       (6760)
చెలఁగి భూమిసురాశీర్వాదతతుల
విలసిల్లు సదన ప్రవేశంబు సేసి
ప్రణుతింప వసుదేవ బలదేవులకును
బ్రణమిల్లి కలిసి సౌభాగ్యంబు మెఱసి
సౌవర్నగాత్రి కోసలరాజపుత్రి
భావజకేలి శంబరరాశిఁ దేల్చి
యతుల శోభనవతి యమితసౌభాగ్య
వతియునునగు ద్వారవతియేలుచుండె
ఆదట మఱియును నయ్యంబుజోదరుఁడు

Monday, June 20, 2016

ఆంధ్రనామసంగ్రహము - 4

మానవవర్గు

తే. పాఱుఁ డనగఁ బుడమివేల్పు బాఁపఁ డనఁగ
జన్నిగట్టన విప్రుండు జగతిఁ బరఁగు
నొడయఁ డేలిక యెకిమీడు పుడమిఱేఁడు
ఱేఁడు గొర సామి యన నొప్పు నృపతి పేర్లు            (1)

టీ. పాఱుఁడు, పుడమివేల్పు= భూదేవుఁడు, బాపడు, జన్నిగట్టు = యజ్ఞోపవీతమును ధరించువాడు - ఈ నాల్గును బ్రాహ్మణుని పేర్లు. ఓడయుఁడు, ఏలిక, ఎకిమీడు, పుడమిఱేఁడు = భూపాలుఁడు, ఱేఁడు, సామి, దొర - ఈ ఏడు ను క్షత్రీయునికి పేర్లు

సీ. కోమట్లు మూఁడవ కోలమువాండ్రన బేరు, లన వైశ్యనామము ల్దనరుఁ గాఁపు
వాండ్రు నా నాలవవాండ్రు, నా బలిజెవాం, డ్రనఁ జను శూద్రసమాహ్వయములు
వడుగు నా గోఁచిబాపఁడు నాఁగ బ్రహ్మచా, రికి బేళ్లు నడచు ధరిత్రియందు
నాలుబిడ్డలు గల యతఁ డిలుఱేఁడు గేస్తన నొప్పుఁ బేళ్లు గృహాధిపతికి

ఆ. నడవిమనికిపట్టు జడదారి యన వన
వాసి యొప్పునిల్లువాసి తిరుగు
బోడ తపసి కావి పుట్టగోఁచులసామి
యన యతీంద్రుఁ డలరు (నలికనేత్ర)             (2)

టీ. కోమట్లు, మూఁడవకొలమువారు, బేరులు - ఈమూడును వైశ్యునికి పేర్లు. కాఁవాండ్రు, నాలవవాండ్రు, బలిజెవాండ్రు - ఈ మూడును శూద్రునికి పేర్లు, వడుగు, గోఁబాపఁడు - ఈ రెండును బ్రహ్మచారికి పేర్లు, ఆలుబిడ్దలుగల యతండు = పెండ్లాము పిల్లలు గలవాడు, ఇలుఱేఁడు= ఇంటియజమానుడు, గేస్తు - ఈ మూడును గృహస్థుని పేర్లు. అడవిమనికిపట్టు = అరణ్యమునందు ఉండువాడు, జడదారి = జడలను ధరించినవాడు, - ఈ రెండును వానప్రస్థునికి పేర్లు, ఇల్లువాసి తిరుగు = ఇంటిని విడిచిపెట్టి తిరుగువాడు, బోడ, తపసి, కావిపుట్టగోచులసామి = కావిరంగుగల పుట్తగోచులను బెట్టుకొనువాడు - ఈ నాల్గును సన్న్యాసికి పేర్లు

సీ. అమ్మ నాఁ దల్లి నా నవ్వ నాఁ గన్నది, యన మాతృకాఖ్యలౌ (నభ్రకేశ)
అబ్బ నాయన యయ్య యనఁ దండ్రి యన నప్ప, యన జనకాఖ్యలౌ (నగనివేశ)
తోడఁబుట్టనఁగ సైదోడు తోఁబుట్టన, సోదరాహ్వయము లౌ (నాదిదేవ)
భర్తృసహోదరు భార్యకుఁ దోడికో, దలన నేరా లన నలరు (నభవ)

తే. చెలియ లనఁజెల్లె లనఁగను వెలయుచుండు
నాహ్వయములు కనిష్ఠికన్యకు (గిరీశ)
జేష్ఠకన్యకు నాఖ్యలై క్షితిని వెలయు
నప్ప యన నక్క యనఁగఁ (జంద్రార్ధమకుట)         (3)

టీ. అమ్మ, తల్లి అవ్వ, కన్నది _ ఈ నాల్గును మాతకు పేర్లు, అబ్బ, నాయన, అయ్య తండ్రి, అప్ప ఈ ఐదును తండ్రికి పేర్లు, తోడఁబుట్టు (పా. తోడబుట్టగు), తోడఁబుట్టువు, సైదోడు, తోఁబుట్టు (పా. టోబుట్టువు), తోబుట్టువు - ఈ మూడును సోదరునుకి పేర్లు, తోడికోడలు = తనతో సమానురాలగు కోడలు, ఏరాలు = అన్యుని భార్య (ఎరవు+ఆలు) - ఈ రెండును తోడికోడలికి పేర్లు, చెలియలు, చెల్లెలు అను ఈ రెండు చిన్న ఆడుతోబుట్టువునకు పేర్లు, అప్ప, అక్క - ఈరెండును పెద్ద ఆడుతోబుట్టువునకు పేర్లు

సీ. ముగ్ధకుఁ బేళ్ళగు ముగుద యనన్ ముద్ద, రాలు నా గోల నా బేల యనఁగ
గట్టివాయి యనంగ గయ్యాళి యన ఱాఁగ, యన ధూర్తసతికి నాహ్వయము లమరు
నైదువ నాఁగము నాఁ ముత్తైదువ నా నయి, దువరాలు నా బుణ్యయువతి వెలయు
మృతచిరంటికి నాఖ్య లెనఁగుఁ బేరంటాలు, నాఁగను జిక్కిని నా ధరిత్రి

తే. గేస్తురా లనునాఖ్యచే గృహిణి వెలయు
నాలు పెండ్లాము రాణి యిల్లా లనంగ
భార్య దనరును దొత్తన బానిసె యన
వరవుడన దాసికాహ్యలౌ (గరళకంఠ)         (4)

టీ. ముగుద, ముద్దరాలు, గోల బేల - ఈ నాలుగును పదునారు సంవత్సరములు వయసు గల గల పడుచునకు పేర్లు, గట్టివాయి = పెద్దగొంతు కలది, గయ్యాళి, ఱాగ - ఈ మూడును ధూర్తస్త్రీకి పేర్లు, ఐదువ, ముత్తైదువ, అయిదువరాలు (మంగళసూత్రము, పసుపు, కుంకుమము, గాజులు, చెవ్వాకు అను ఐదు వస్తువులు గలది), - ఈ మూడును సుమంగళియగు స్త్రీకి పేర్లు, పేరంటాలు, జక్కిని - ఈ రెండును మృతినొందిన ముత్తైదువరాలికి పేర్లు, గేస్తురాలు, ఆలు, పెండ్లాము, రాణి ఇల్లాలు, - ఈ అయిదును భార్యకు పేర్లు, తొత్తు, బానిసె, వరపుడు - ఈ మూడును దాసికి పేర్లు.

సీ. కన్నియ కన్నె వాఁ గన్యకుఁ బే ళ్ళొప్పు, జవరాలు కొమరాలు జవ్వని యనఁ
దనరు యువతి ప్రోడ యన గట్టివయసుది, యనఁ బ్రౌడ దాల్చునీ యాహ్వయములు
ముసలి మిండలకోర ముప్పదియాఱేండ్లు, చనినది యనుపేళ్ల నెనయు లోల
ముసలిది ముదుసలి ముదియ పెద్దన నివి, యాఖ్యలై తనరు వేధ్థాంగనకును

ఆ. చెడిప ఱంకులాడి చెడ్డతొయ్యలి వెలి
చవులుగనిన దనఁగ జార దనరు
నిలను విటులదూత యెడకాఁడు కుంటెన
కాఁ డనంగఁ దనరుఁ (గరళకంఠ)         (5)

టీ. కన్నియ, కన్నె - ఈ రెండు ను పెండ్లికాని పడుచు పేర్లు. జవరాలు, కొమరాలు, జవ్వని - ఈ మూడును యౌవ్వనయువతికి పేర్లు. ప్రోడ, గట్టివయసుది = దిటవైన వయసు గలది - ఈ రెండును ముప్పది యేండ్ల వయసు గలదాని పేర్లు, ముసలి, మిండలకోర, ముప్పదియాఱేండ్లు చనినది - ఈ మూడును లోలస్త్రీకి పేర్లు. ముసలిది, ముదుసలి, ముదియ, పెద్ద  - ఈ  నాలుగును వృద్ధాంగనకు పేర్లు. చెడిప, ఱంకులాడి, చెడ్డతొయ్యలి = చెడు గుణము గల యాడుది, వెలిచ్వులుగనినది= పరపురుషుల వలన పొందు మరిగినది - ఈ అయిదును వ్యభిచారిణికి పేర్లు. ఎడకాఁడు, కుంటెనకాఁడు = స్త్రీ పురుషులను చేర్చునట్టివాడు - ఈరెండును విటునిదూత పేర్లు.

తే. వేల్పుబానిసె వెలయాలు వేడ్కకత్తె
లంజె బోగముచాన వెల్లాటకత్తె
పడపుఁజెలి యాటచేడియ గడనకత్తె
నాఁగ నివి వేశ్య కాఖ్యలౌ (నగనివేశ)       (6)

టీ. వేల్పుబానిసె = దేవతల పనికత్తె, వెలయాలు = రొక్కమునకు వచ్చెడి భార్య, (వెల+ఆలు=వెలయాలు), వేడ్కకత్తె, లంజె, బోగముచాన = అనుభవించుటకైన స్త్రీ, వెల్లాటకత్తె (పెల్లాట్ల కత్తె) = ఎక్కువ నాత్యము చేయునది, పదపుఁజెలి = స్రవ్య సంపాదనము చేసెడి స్త్రీ (పడపు + చెలి), ఆటచేడియ = ఆటాడునట్టి ఆడుది, గడనకత్తె = సంపాదన చేయు స్త్రీ - ఈ ఆరును బోగముదాని పేర్లు.

ఆ. వెచ్చకాఁడు బొజఁగు వేడుకకాఁడు మిం
డండు ననుపుకాఁడు మిండగీఁడు
లంజెకాఁడు నాధరం జనుఁ బల్ల వ
నామధేయములు (పినాకహస్త)                (7)

టీ. వెచ్చకాఁడు = ద్రవ్యవ్యయము చేయువాడు, బిజగు, వేడుకకాఁడు = సొగసు కలవాడు, మిండడు, ననుపుకాఁడు= మెత్తదనము గలవాడు, మిండగీఁడు, లంజకాఁడు = లంజె కలవాడు - ఈ ఏడును విటుని పేర్లు

ఆ. కోడెకాఁ డనంగ గోవాళ్లు నాఁగను
యువజనాఖ్య లొప్పుచుండు రెండు
నాగవాస మనఁగ నామ మౌ వేశ్యాజ
నంబుమేలమునకు (నంబికేశ)                (8)

టీ. కోడెకాఁడు = యౌవ్వనవంతుడు, గోవాళ్లు = యౌవ్వనము గలవాడు (గోవ+వారలు = గోవాళ్లు) - ఈ రెండును ప్రాయముగలవానుకి పేర్లు, నాగవాసము ఇది వేశ్యజన కూటమునకు పేరు.

సీ. నెలఁతుక క్రాల్గంటి పొలఁతుక ముద్దియ, వ్చాలుఁగంటి మగువ పడఁతి మడఁతి
చెలి మచ్చకంటి యుగ్మలి యింతి తొయ్యలి, నవలా కలువకంటి నాతి గోతి
పూఁబోఁడి చిగురాకు బోఁడి పైదలి మించు, బోఁడి ముద్దుల గుమ్మ పొలఁతికొమ్మ
ప్రోయా లువిద తీఁగబోఁడి చేడియ యించు, బోఁడి యన్ను వెలంది బోటీ జోటి

తే. చాన తెఱవ వెలందుక చామ లేమ
చెలువ యెలనాగ చిలకలకొలికి కలికి
తలిరుఁబోఁడి యలరుఁబోఁడి నెలఁత పొల్తి
గరిత యతివ నా స్త్రీ సమాఖ్యలు (మహేశ)               (9)

టీ. నెలఁతుక, క్రాల్గంటి = ప్రకాశించెడి కన్నులు గలది, పొలంతుక, ముద్దియ, వాలుఁగంటి= వెడల్పు నేత్రములు గలది, మగువ, పడఁతి, మాడఁతి, చెలి, మచ్చెకంటి = మీననేత్ర, ఉగ్మలి, ఇంతి, తొయ్యలి, నవలా, కలువకంటి = కలువలను పోలు కన్నులు గలది, నాతి, గోతి, పూఁబోఁడి = పువ్వువంటి శరీరము గలది, చిగురాకుబోఁడి = చిగురువంటి మేను గలది, పైదలి, మించుబోఁడి = మెఱపు వలె వెలిగెడు స్వరూపము గలది, ముద్దులగుమ్మ = ముద్దుల మూట గట్టునది, పొలఁతి, కొమ్మ, ప్రోయలు, ఉవిద, తీఁగెబోఁడి = తీగెవంటి శరీరము గలది, చేడియ, ఇంచుబోఁడి = చెఱకువలె ప్రియమైన శరీరము గలది, అన్ను, వెలది, బోటి, జోటి, చాన తెఱవ, వెలందుక, చామ, లేమ, చెలువ, ఎలనాగ, చిలుకలకొలికి = చిలుక ముక్కు వంటి కన్నుల కొనలు కలది, కలికి, తలిరుబోడి = చిగురువలె మెత్తని దేహము గలది, అలరుబోడి = పువ్వువంటి మెత్తని దేహము గలది, నెలత, పొల్తి, గరిత, అతివ - ఈ 48 యును స్త్రీకి పేర్లు.

తే. చెలిమి నేస్తంబు పొందు నా స్నేహ మలరు
నెచ్చెలి యనుంగు సంగాతి నేస్తకాఁడు
సంగడీఁ డనఁ జెలికాఁడనంగఁ దనరు
స్నేహితునకు సమాఖ్యలు (శ్రీమహేశ)              (10)

టీ. చెలిమి నేస్తము, పొందు - ఈ మూడును స్నేహమునకు పేర్లు. నెచ్చెలి, అనుంగు, సంగాతి, నేస్తకాఁడు, సంగడీఁడు, చెలికాఁడు - ఈ ఆరును స్నేహితునకు పేర్లు.

సీ దొంగ తెక్కలికాఁడు దొరకోలుసన్నాసి, ముచ్చెత్తుబరికాఁడు ముడియవిడుపు
తెరవాటుకాఁడు కత్తెరదొంగ చేవాఁడి, కాఁడు వల్లడికాఁడు కన్నగాఁడు
మునిముచ్చు గడిదొంగ యనఁ దస్కరాఖ్యలౌఁ, జెండిపోతు గరాసు మొండికట్టె
టకటొంకు టాటోటు టక్కులాడు పిసాళి, టక్కరి ముడికాఁడు ఠవళికాఁడు

తే. కల్లరియు గొంటు కైలాటకాఁడు చెడుగు
బేరజము కుచ్చితుఁడు దోసకారి చెనఁటి
పాలసుఁడు నాలిబూతంబు పలువ తులువ
కూళ గడు సన వర్తిల్లు గుజనుపేళ్లు        (11)

టీ. దొంగ, తెక్కలికాఁడు= బందిపోటు వేయువాడు, దొరకోలు సన్నాసి= వేషముదాల్చి యితరులను నమ్మించి సొమ్మూపహరించుకొని పోవువాడు, ముచ్చు, ఎత్తుబరికాడు, ముడియవిడుపు = ముడివిచ్చి యెత్తుకొని పోవువాడు, తెరువాటుకాడు = దారి యడ్డగించి కొట్టి తీసుకొని పోవువాడు, కత్తెరదొంగ = కత్తిరించి దొంగిలించువాడు, చేవడికాడు = చేతిపనితనము గలవాడు, వల్లడికాడు = కొల్ల పెట్టువాడు, కన్నగాడు = కన్నము వేసి దొంగిలించు వాడు, మునిముచ్చు = మునివలె మౌనముతో ఏమీ తెలియనట్లుండెడివాడు, గడిదొంగ = ఆంతర్యము నెరింగినవాడు - ఈ పదమూడును దొంగకు పేర్లు, చెండిపోతు = మూఢబుద్ధి కలవాడు, గరాసు, మొండికట్టె, టకటొంకు, టాటోటు, టక్కులాడు = కల్లలాడువాడు, పిసాళి, టక్కరి, ముడికాడు, ఠవళికాడు = మోసము కలవాడు, కల్లరి = బొంకులాడు వాడు, గొంటు, కైలాటకాడు = మాయోపాయముల నెరిగినవాడు, చెడుగు, బేరజము, కుచ్చితుడు, దోసకారి = పాపములు చేయువాడు, చెనటి, పాలసుడు, నాలిభూతము, పలువ, తులువ, కూళ, గడుసు - ఈ ఇరువదినాలుగు కుత్సితునకు పేర్లు.

ఆ. పాప బుడుత చిఱుత పట్టి సిసువు కందు
కూన నిసువు బిడ్డ కుఱ్ఱ బొట్టె
యనఁగ శిశుసమాఖ్య లగుఁ గొమరుండు నాఁ
గొడుకు నాఁ కుమారకుండు వెలయు                  (12)

టీ. పాప, బుడుత, చిఱుత, పట్టి, సిసువు (శిశు శబ్ధభవము) కందు, కూన, నిసువు, బిడ్డ, కుఱ్ఱ బొట్టె - ఈ పదకొండు శిశువునకు పేర్లు. కొమరుడు, కొడుకు - ఈ రెండును పుత్రునిపేర్లు