Saturday, December 13, 2014

లక్ష్మణదేవర నవ్వు - 2

ఆమాటవినియపుడు సంతోషముగను! కనకకుంచలవార్ని కలయబిలిపించే!
అంగళ్ళువీధులూ తుడిచేటివారు! ముత్యాలమ్రుగ్గులూ పెట్టేటివారు!
రత్నాలరంగవల్లి వ్రాసేటివారు! మాణిక్యాలదివ్వెల నెత్తేటివారు!
మకరతోరణాలు కట్టేటివారు! కడులెస్సకనక స్తంబములామీద!
మరిలెస్సదీపాలు పెట్టేటివారు! నిండుకుండలుదెచ్చి నిలిపేటివారు!
బొడ్డుమల్లెలు పోగులుబోసేటివారు! ఏడునిలువుల కనకమేడలోపలనుంచీ!
పాన్పుపైనేత్రావళి పచ్చాడముంచి! అచ్ఛచామంతులు అభ్యాంగలూను!
ఆమంచిపానుపున అవిచాలబరచిరి! ప్రొద్దుపోయిబూసినవి బొడ్డుమల్లెల్లు!
ఆమంచిపానుపున అవిచాలబరచిరి! పందెళ్ళబూసినవి పారిజాతములు!
ఆమంచిపానుపున అవిచాలబరచిరి! ఘడియోయిబూసినవి కనకరత్నములు!
ఆమంచిపానుపున అవిచాలబరచిరి! కావిళ్ళదెచ్చేరు కలువపువ్వూల్లు!
ఆమంచిపానుపున అవిచాలబరచిరి! మోపులతోదెచ్చేరు మొగలిపువ్వూల్లు!
ఆమంచిపానుపున అవిచాలబరచిరి! ఝామొయిపూసినవి జాజిపువ్వూల్లు!
ఆమంచిపానుపున అవిచాలబరచిరి! మొగలిపువురేకులా తలగడలుయుంచి!
మల్లెపువ్వులుజాజులు పానుపునాబరచిరీ! అంగదుడుహనుమంతు సుగ్రీవుడును!
చెట్టలుబట్టుకొని శీఘ్రానవచ్చీరి! ఆసొంపుచూడగా నలవియేగాదు!
రెండుకన్నులు బ్రహ్మకావిచేగాని! వెయ్యికన్నులజూడ తీరదాపేక్ష!
అంపుమీయోస్వామి అనుజ్ఞలిచ్చి! ముమ్మారువలగొని ప్రదక్షిణముజేసి
సాష్టాంగదండ నమస్కారములుజేసె! పాదములపైనున్న తమ్ముణ్ణియెత్తి!
అలసితివినాతండ్రి నిద్రబోవయ్య! వద్దనూనిలుచున్న వదినెకుమ్రొక్కి!
భద్రగజంబుపై యెక్కించిరపుడు! కంచుమద్దెలవారు కమ్ముకొనిరాగా!
బాగుశ్రీరాముని బంట్లుపొగడగను! రాజద్వారముజొచ్చె తాముతమ్మూడూ!
అటకలితలగడిగెనే అంభోజనేత్రి! పీతాంబరముగట్టె ప్రతిభమీరంగ!
నాలుగువేలూజేయు నానుమెడవేసె! పదివేలుజేయు పతకములువేసె!
చేడెకుయింపైన చెవులపువ్వులుఇబెట్టె! నవరత్నపువత్తులు నాతితానుంచె!
వయ్యారినడకతో పయ్యదజార! వారచూపులుజూస్తు వచ్చెనాదేవి!
వయ్యారితనపతి నొయ్యారగాను! పాన్పొద్దనిలుచుండె పద్మాయతాక్షి!
ఊర్మెళాభావంబు తెలిసిలక్ష్మణూడు! ఇంతినీవురాను వేళగాదనెను!
ఊర్మెళనువీడుగొలిపె శ్రీలక్ష్మణూడు! శేషునిపైనిద్ర సేయుచున్నారు!
ఓఘడియనిద్రిస్తి ఒకజాముఆయె! ఒకజామునిద్రిస్తి వకరోజుఆయె!
ఇదియేమితమ్ముడు తడవునిద్రించే! అవనిజవల్లభులు నిరువనితపొంద్రీ!
జూచిహనుమన్న జూచిరావోయి! ముద్దియతో ముచ్చటాడుచున్నాడో!
చేడెతోజెలక్రీడ లాడుచున్నాడో! ఈవలాఓజంఘ ఆవలాజూచి!
ముద్దియలేదని ముదముతోబలికె! తమ్మునిపాన్పును జూడవలెననియు!
చేడెలేదనినతనకు అభిలాషపుట్టె! అంతప్రధానుల నంతటనుంచె!
శతృఘ్నునితోడుకొని శీఘ్రానవచ్చె! అంతటశతృఘ్ను నంతటనుంచి!
పాన్పుపైగూర్చుండి శ్రీరాఘవూలు! తమ్మునిపాదములు తొడలపైనుంచి!
వొయ్యనిపాదములు వత్తుచున్నారు! ఒకమారువత్తితే నూరుకొనియుండే!
రెండవమాటికి కలగంటిననెను! మూడవమాటికి కనువిప్పిజూచి!
ధరణీశుడగుటదెలిసి ధరణిపైవ్రాలె! మీయడుగులొత్తేటీ ప్రాయమ్మువాణ్ణి!
అహల్యపావనమైన అడుగుమీయడుగు! బలిశిరసునున్నది అడుగుమీయడుగు!
మీయడుగులొత్తుదురు సమస్తదేవతలు! నాయడుగులొత్త శ్రీజగన్నాధతగదు!
పాదములపైనున్న తమ్ముణ్ణియెత్తి! కనకసింహాసనమున కూర్చుండబెట్టి!
చంద్రుడులేనిరాత్రి యెట్టిదటబోలు! తమ్ముడానీవులేని సభయట్లెబోలు!
దీపమ్ములేనిల్లు యెట్టిదటబోలు! తమ్ముడానీవులేని సభయట్లెబోలు!
పతిలేనిసతి యెట్టిదటబోలు! తమ్ముడానీవులేని సభయట్లెబోలు!
ఉదకమ్ములేని కలశయెట్టిదటబోలు! తమ్ముడానీవులేని సభయట్లెబోలు!
చిలుకలేని పంజరయెట్టిదటబోలు! తమ్ముడానీవులేని సభయట్లెబోలు!
తమ్ముడానీవిపుడు సభకుయేతెంచు! తమ్ముడుతానును సభకుయేతెంచ్రి!
ముత్యాలగద్దెపై తమ్ములనుయుంచి! రత్నసింహాసనమున తాముగూర్చుండ్రి!
సకలగుణములుగల సంపూర్ణవినుమా! హనుమంతాకీర్తి వంతరమ్మనెను!
శాంతమేడలకు నీవుయేతెంచి! శాంతమ్మనుదోడుకొని శీఘ్రానరమ్మి!
ఆపలుకులువిని సంతోషముననూ! అప్పుడూహనుమాన్లు యేతెంచెతాను!
ఏమోయిహనుమాన్లు యిటువచ్చినావు! నీవువచ్చినపనులు యెరిగించుమనెను!
అమ్మశ్రీరాములూ మిమ్ములనుయిపుడు! తోడుకురమ్మనీ సెలవిచ్చెరాజు!
ఆపలుకులువిని శాంత సంతోషమునను! వజ్రాలపల్లకీ యెక్కితావచ్చె!
అల్లంతటశాంతమ్మ రాకలూజూచి! తమ్ములుతమరును యెదురుచనుదెంచ్రీ!
ముమ్మారువలగొనీ ప్రదక్షిణములుజేసి! సాష్టాంగ దండనమస్కారములుజేసీరి!
తమసరసనుశాంతమ్మ గద్దెబెట్టించి! కొలువైగూర్చుండిరి శ్రీరాఘవూలు!
వింతివాశాంతమ్మ యిప్పుడూనీవు! వివాహము లయ్యేటినాడు!
వీరుచిన్నలువారు బాలలేసుమ్మి! ఈవెనుకపదునాల్గు యేండ్లు అడవులలో!
తిరిగిరెవ్వరోమరి గుర్తెరుగరైరి! వీరికినివారికిని తగునోలేదో!
జూడవలెననితనకు అభిలాషబుట్టె! మనవారినిమనము మనమనుకోరాదు!
వారిముందరవీరు రాణించరనెనూ! గావలీమార్గమున చూడుశ్రీరామ!
కనుదృష్టిమార్గాన చూడుశ్రీరామా! భోజనపుశాలలో చూడుశ్రీరామా!
శాంతమరుగుననుండి జూడుశ్రీరామా! సకలగుణములుగలా సంపూర్ణవినుమా!
హనుమంతాకీర్తి మంతరమ్మనను! శీఘ్రమునఋషిపల్లె నగరికేతెంచు!
మూడుకోట్లమునుల ఆరుకోట్లఋషుల! జమదగ్నిదుర్వాస సప్తమహాఋషుల!
సప్తమహారుషుల సమస్తదేవతలా! వశిష్టు మొదలైన ఋష్యశృంహులను!
దారలదోడుకొని శీఘ్రానరమ్మీ! ఆమాటవినియపుడు సంతోషముగను!
శీఘ్రాన్నవ్షిపల్లె నగరికేతెంచే! వదనమ్ములుచేసి ముందరానిలచి!
అయ్యశ్రీరాఘవులు మమ్మంపినారు! మూడుకోట్లమునులను ఆరుకోట్లఋషుల!
జమదగ్నిదుర్వాస సప్తమహాఋషుల! సప్తమహారుషులను సమస్తదేవతలా!
ఋష్యశృంగుల్నిదోడుకొని వేంచేయమనిరి! అతిశీఘ్రముగాను వేంచేయమనిరి!
అతిశీఘ్రముగవచ్చి రామునులంతా! వచ్చినవారికీ వందనముజేసి!
వారికితగిన సింహాసనాలిచ్చి! కొలువై గూర్చుండ్రిశ్రీరాఘవులు!
వింటిరావశిష్ఠ యిప్పుడుమీరు! వీరికివివాహమ్ములయ్యేటినాడు!
వీరుచిన్నలు వారు బాలలేసుమ్మీ! ఈవెనుకపదునాల్గేండ్లు యడవులలో!
తిరిగెవ్వరోమరీ గుర్తెరుగరైరి! వీరికివివాహముహూర్త మెప్పుడో!
ఆమంచిముహూర్తమ్ము బెట్టుమనిపలికె! మునులప్పుడు సంతోషమునగూరుచుండి!
అప్పుడుపంచాంగముల విప్పిజూచీరి! క్షేత్రమైనామంచి కార్తీకమాసము!
అందమైనామంచి ఆదివారమున! పంచమీఆమంచి ఆదివారమున!
ఝామేడుఘడియలా రాతిరివేళా! వీరికితగినట్టి వివాహముహూర్తమ్మూ!
నిర్ణయించీరపుడు మహామునులెల్ల! సభలోనుయున్న మహామునులజూచి!
మరదళ్ళనుజూడవచ్చు నాయనితానుబలికే! తరుణులకండ్లకు తమరుబడకుండ!
తరుణులనుజూడవచ్చు తప్పేమిలేదు! అంతఃపురములోను లోగిళ్ళలోను!
రానివాసమ్మున నేనుకొలువుండ! తరుణుబిల్వగా తమ్ముడాజూడూ!
సీతముఖమూజూచి రామచంద్రూలు! చిరునవ్వునవ్వుచు ఇట్లనిరపుడూ!
అతివరోనీతోడి చెళ్ళెళ్ళనల్లా! మరదళ్ళనేరీతి జూపెదవనెను!
రాణివాసస్త్రీలను రాజుజూచుటకు! ఇటువంటికోరికలు నేజూడలేదు!
అతివరోఅందుకూ అడ్డాడబోకు! అందుకూమాఅక్క హర్షించినదీ!
పెద్దలుమహామునులు ఒప్పుకున్నారు! ఆమాటవినియపుడు సంతోషముగను!
రావోయిహనుమన్న వాయునందనుడ! శీఘ్రానకౌసల్య నగరికేతెంచు!
అత్తలకోడళ్ళ వేంచేయుమనుమి! ఆమాతవినియపుడు సంతోషముగనూ!
శీఘ్రాన్నకౌసల్య నగరికేతెంచె! వందనంబులుజేసి ముందరానిలచి!
అమ్మశ్రీరాఘవులు మమ్మంపినారు! వార్తచెప్పెదవినుడు వరుసగామిమ్ము!
అత్తకోడళ్ళ వేంచేయుమనిరీ! మాళవినిదీసుకొని యొప్పుతోడుతను!
కౌసల్యకనక దండందనాలెక్కె! ఊర్మిళనుదీసుకొని యొప్పుతోడుతను!
కైకమ్మపచ్చల పల్లకీలెక్కె! శతకీర్తిదీసుకొని యొప్పుతోడుతను
సుమిత్రసువర్ణంపు పల్లకీలెక్కె! అత్తలుకోడళ్ళు వేంచేయగాను!
అత్తలకుముగ్గురికి వందనములుజేసి! జనకసుతచెళ్ళెళ్ళ తాకౌగిలించె!
పతిచూచిపొంగితివా పద్మాయతాక్షి! జనకసుతచెళ్ళెళ్ళు సంతోషమునను!
రావోయిహనుమన్న వాయునందనుడ! శీఘ్రానజానకి నగరికేతెంచు!
చేడెలకుశృంగారము చేయమనిచెప్పూ! శీఘ్రానజానకీ నగరికేతెంచీ!
వందనంబులుజేసి ముందరనిలచి! అమ్మశ్రీరాఘవులు మమ్మంపినారు!
చేడెలకుశృంగారము చేయమన్నారు! ఆమాటలువినియపుడు సంతోషముగను!
అరుంధతీనృసింహ పార్వతీదేవి! పాడ్యుశిరసంట్రి పణతులుముగ్గురు!
పరిమళమ్ములుదెచ్చి నలుగులుబెట్టించ్రి! అచ్చశ్రీగంధాన అటకళ్ళు గాచ్రి!
వెండెయ్యకాగుల వేణ్ణీళ్ళుదోడి! భమిడయ్యపదికాగుల జన్నీళ్ళుదోడి!
చన్నీళ్ళువేణ్ణీళ్ళు సమముగాదొలిపి! కుంకమ్మలమరినాకుదు ళ్ళనిలిపే!
ముత్యాలముంతలు ముగుదలందియ్యా! మురవైరిమరదళ్ళు మజ్జనంబాడ్రీ!
శంఖుబట్టగా బేరిజేగంటలుమ్రోయా! జనకునికూతుళ్ళు మజ్జనంబాడ్రీ!
కల్యాణజేగంట కంచుదిబేరి! కౌసల్యకోడళ్ళు మజ్జనంబాడ్రీ!
సన్నవలిపముదెచ్చి తళ్ళొప్పనొత్తిరి! కురులచిక్కులుదీసి మురువన్నెముడిచిరి!
భండారమేలేటి బ్రజలబిలిపించి! తాళాలచేతనే పెట్టెలుదీయించి!
భరిణలుదెప్పించి పైకప్పులుదీస్రీ! గట్టిమట్టెలుబెటిరి కడియమ్ములుంచిరి!
అందెలుచరణా రవిందములబెట్టిరి! చిరిగజ్జెలుపెట్టిరి శృంగారముగను!
చిటికెనబొద్దులుపెట్రి పిల్లేళ్ళుపెట్రి! అన్ని వేళ్ళకును అమరించినారు!
శుద్ధసువర్ణాన జేయించినట్టి! సూడిగాజులుబెట్రి సుదతులచేత!
చామపువువుకడియాలు హస్తకడియములు! చెన్నుమీరగ వారి చేతులనుంచ్రీ!
నవరత్నఖచితమున నరులొప్పుచున్న! గిరిగిరంబులనుంచెతాను ఆశాంతా!
సందెటిదండలుబెట్రి తావేజులుబెట్రి| దండగడియములు బన్నసరములేబెట్రి!
చేడెకుయింపైన చెవులపువులుబెట్రి! నవరత్నపుజుమకాలు నాతులకునుంచ్రి!
బలువైనముత్యాల పాపిటచేరులను! చేరుచుక్కలుంచెనే చెలియజానకి!
నవరత్నఖచితముతో నడుమచెక్కినవి! బలువైన జడలువేసిరి పణతులకపుడు!
సన్నజాజులుదెచ్చి బంతులేగట్టి! బంతులుజడపై బదిలముగనుంచ్రి!
మొగలిరేకుకుట్రి మోహమలరగను! మరదళ్లనుజూచి యోశాంతామహాదేవి!
తెమ్మనవేజానకి తొడుగులుయనెను! మునుపుగౌతముడుమెచ్చిచ్చినాడనుచు!
అవిదెచ్చిమాళవికి హస్తముననుంచ్రి! అగ్నిహోత్రుడువొచ్చి యిచ్చినాడనుచు!
అవిదెచ్చిశతకీర్తి హస్తముననుంచ్రి! ఇంద్రకావిరవికెలు ఈడుకావన్నీ!
చంద్రకావిరవికెలు జానకివన్ని! బిగుదట్టిరవికలు తొడగించిరపుడు!
అమరినయొడ్డాన మతివలకునుంచిరి! బిళ్ళలమొలత్రాళ్ళు బిగువుగానుంచిరి!
అందమైనామంచి మొహర్లపేర్లుంచిరి! కనుసోగకన్నులకాటుకదీర్చి!
తీరైనకస్తూరి తిలకములుదిద్ది! గంధంబుకస్తూరి కలపంబుజేసి!
అప్పుడుచెల్లెళ్ళ కలదెజానకి! వీవనపుచ్చుకొని విసరుచుండగను!
సంతోషవారధితేలె జానకి! బంగారుతో పరిపూర్ణమైన!
పట్టూశాలులుదెచ్చిగవిసెనలవేసిరి! రెండుకన్నులబ్రహ్మగావించెగాని!
వేయికన్నులజూడ దీరదాపేక్ష! హంసలనడకల అతివొప్పుచుండె!
భోజనపుశాలకేవేంచీసిరపుడు! నవరత్నఖచితమయి అమరాపీఠమున!
శాంతమహాదేవి నగుచుగూర్చుండె! మాళవిఊర్మిళ మగువశతకీర్తి!
శాంతకుయిరుగడల సురటివిసరగను! ఆసీతమహాదేవి ఆకుమణచిచ్చె!
అచ్చకర్పూర ఆకుమణచిచ్చె! రావోయిహనుమన్నా వాయునందనుడా!
శీఘ్రానశ్రీరామ కొలువుకేతెంచు! భోజనపుశాలకే వేంచేయమనుమీ!
ఆమాటవినియపుడు సంతోషముగను! అంతటప్రధాన్ల నంతటినుంచి!
శతృఘ్నునిదోడుకొని శీఘ్రానవచ్చె! గవాక్షమార్గాన కనుదృష్టియుంచి!
రెప్పవేయకను కనులువిప్పెమోహమున! అట్టెతొలకరిమెరుపు హంసనడకలది!
పుత్తడిబొమ్మ లేడివలెజూపు! శాంతకుచందనం బూయుచున్నది!
ఆదేవియెవ్వరు శతృఘ్నుయనెను! సౌమిత్రిభార్య ఊర్మిళయనెను!
చిగురుటాకులబోలు చిన్నిపాదములు! బోలునువజ్రాల బోలుపలువరస!
అట్టెతొలకరిమెరుపు హంసనడకలది శాంతమ్మకును సురటివిసురుచున్నది!
ఆదేవియెవ్వరు శతృఘ్నుయనెను! భరతునిపట్నంపుదేవి సుమియనెనూ!
చిగురాకుపాదములు సింహమధ్యములు! తగువింటిచేతులే తగువంటిచాయ!
శింగిణివిళ్ళులబోలు కనుబొమలతీరు! కలువరేకులబోలు కనులతీరు!
దానిమ్మగింజలే తరుణిపలువరుస! చామంతిరేకులే చెలియచెక్కిళ్ళు!
చంద్రుడుతనలోన సిగ్గుపడుచుండు! ఆదేవిముఖకాంతి సాటిరాదనెను!
తుమ్మెదలు తలలోను ఝుంకారముండు! ఆదేవికురులందము సాటిరాదనెను!
నల్లనిమేనుదీనగు మోముగలది! ఆదేవియెవ్వరో శతృఘ్నుయనెను!
తనదేవిజెప్పక తానూరకుండె! సిగ్గువడినిలుచున్న తమ్ముణ్ణిజూచి!
చిరునవ్వునవ్విరి శ్రీరాఘవులు! ముందునీవుజేసిన ఫలమేమోగాని!
యింతచక్కనిదేవి సతిగలుగుటకును! చుక్కలలోబాల చంద్రుడునట్లు!
కొలువైగూర్చున్న మనాక్కజూడు! అందరిలోపల సుందరిననుచు!
అష్టవంకర్లతో మీవదినెనుజూడు! అలాగునననరాదు అన్నరాఘవులు!
ఆదిలక్ష్మీసీత ఆలోకమాత! యిదిముహూర్తమువేళాయె యేమిమాటల్లు!
లదలుడుశీఘ్రాన కాకుత్థ్సుయనెను! రావోయిహనుమన్న వాయునందనుడ!
శీఘ్రానశాంతమ్మ నగరికేతెంచు! ఎంతోశృంగారంబు యెంతయో సొగసు!
భరతునికిసౌమిత్రికి శతృఘ్నునికినీ! అభ్యంగనమ్ములు గావలెను యనుమీ!
ఆమాటవినియప్పుడు సంతోషముగను! శీఘ్రాన్నశాంతమ్మ నగరికేతెంచె!
వందనములుజేసి ముందరనిలచి! అమ్మశ్రీరాఘవులు మమ్మంపినారు!
భరతునికిసౌమిత్రికి శతృఘ్నునికి! అభ్యంగనమ్ములు కావలెననిరి!
అరుంధతీ నృశింహపార్వతీదేవీ! పాడుచిశిరసంత్రి పనతులుముగ్గురు!
పరిమళెమ్ములుదెచ్చి నలుగుబెట్తించ్రీ! అచ్చశ్రీగంధాన అటకళ్ళుగాచిరి!
కుంకమ్ములమరి కుదుళ్ళనుంచ్రి! ముత్యాలముంతలు ముగుదలందియ్య!
మురవైరితమ్ములు మజ్జనంబాడ్రీ! లోకంబులెల్ల విలోకించెసొగసు!
దశదిశదిక్కులు దీప్తిల్లగాను! దశరధులకొమాళ్ళు మజ్జనం బాడ్రి!
చంద్రకావిగొడ్గులుచేర్చిబట్టగను! జనకుల అల్లుళ్ళు మజ్జనంబాడ్రి!
కలయాణచేగంట కంచుదిభేరి! కౌసల్యకొమాళ్ళు మజ్జనంబాడ్రి!
శంఖులుబట్టగభేరి జాగంతలుమ్రోయ! శాంతమ్మతమ్ములు మజ్జనంబాడిరి!
పసిడిచిలుకలపసిడి దుప్పట్లుదెచ్చి! భమిడితళ్ళోత్తుదురు పరమాత్ములకును!
బంగారపూజిలుగు పద్మాలపట్టూ! పట్టుపీతాంబ్రములు కట్టనిచ్చీరీ!
కురులుచిక్కులుదీసి వేలుసిగలువేసి! తిరుమణిబెట్టిరి తిరిచూర్ణమిడిరి!
చుక్కలకుమిక్కిలి గొప్పలుగవెలుగు! ఆణిముత్యమ్ములే యెంచిగుచ్చినవి!
పచ్చలపతకములు బాగుగావేస్రీ! చిన్ననాటిగోరు పులిగోరుతోను!
నేవళమ్ములుబెట్టె తమ్ములకపుడు! సందటిదందలు బెట్టితావేజుబెట్రి!
దండగడయములు బన్నస్వరములేబెట్రి! నాలుగువేలుజేయు నానుమెడవేస్రి!
పదివేలుజేయు పతకములువేసిరి! ముత్యాలపోగులు ముదముతోనుంచిరి!
ఆకిరీటంభరతునకు అమరదూని! తనశిరస్సుకిరీతము భరతునకివుంచే!
గంథమ్ముకస్తూరి కలపనంబు జేసి! అప్పుడుతమ్ములకు అలదెరాఘవులు!
వీవనబుచ్చుకు విసరుచుండగను! సంతోషవారధి తేలెరాముండు!
అచ్చకర్పూరాన తాంబూలమిచ్చె! అంతఃపురమ్ములో లోగిళ్ళలోను!
అలంకరించిరిమూడు మహలులుతమకు! ఏడునిలువుల కనకమేడల్లలోను!
పానుపుమీదనే పచ్చావళించిరి! పట్టుతలగడయో పూలటెక్కాలు!
ఆమంచిపాన్పున అవిచాలనుంచె! ప్రొద్దోయిబూసినవి పొన్నపువ్వూలు!
ఆమంచిపాన్పున అవిచాలబరచి ! నిశోయిబూసినవి నీలాంబరాలు!
ఆమంచిపానుపున అవిచాలబరచి! ఇంకానుపువ్వులు ఏమేమియైన!
కావిళ్ళుదెచ్చేరు కలువపువ్వుల్లు! ఆమంచిపాన్పున అవిచాలబరచి!
జాజికాయజాపత్రిలవంగాలు! మంచిపరిమళాదులే బాగుగానుంచిరి!
నవరత్నఖచితమౌ నడుమపీఠమున! ఫలములుపంచపదార్ధములనుంచిరి!
బంగారుచెంబుతో పానకంబుంచిరి! నిలువుటద్దమ్ములే నిలిపిరచ్చోట!
మాణిక్యదీపాలు మరివెలుగుచుండ! కర్పూరదీపాలు ఘనముగానుంచిరి!
పచ్చకర్పూరాన తాబూలాలుంచ్రీ! రావోయిహనుమన్న వాయునందనుడ!
శ్రీఘ్రానకౌసల్య నగరికేతెంచు! తల్లుల్నిదోడుకొని శీఘ్రానరమ్ము!
ఆపలుకువినిసంతోషమునను! ఏతెంచెకొసల్య నగరిలోపలికి!
ఏమోయిహనుమాన్లు యిటువచ్చినావు! నీవువచ్చినపనులు యెరిగించుమనెను!
అయ్యశ్రీరాములు మిమ్ములనుయిపుడు! తోడుకొనిరమ్మని సెలవిచ్చినారు!
ఆపలుకువిని సంతోషమునను! ముత్యాలపల్లకీ యెక్కెకౌసల్య!
పచ్చలపల్లకీ యెక్కెకైకమ్మా! సుమిత్రసువర్ణంపుపల్లకియెక్కె!
తనయులమేడలకు తల్లులేతెంచిరి! అల్లంతదూరాన తల్లులనుజూచి!
వలగొనిముమ్మారు ప్రదక్షిణముజేసె! తప్పకదండ నమస్కారములుజేసి!
ముత్యాలగద్దెపై తల్లులనుయుంచి! రత్నసింహాసనమున తమరుగూర్చుండ్రి!
తనయులశృంగారముతల్లులుజూచి! దశరధులనుతలచుకొనికన్నీరుదెచ్చె!
దశరధులులేని వెలితొక్కటేగాని! ఉన్నవెల్తులులేవు యువిదరోమనకు!
రావోయిహనుమన్న వాయునందనుడా! శీఘ్రాన్న అశ్వములసాలకేతెంచు!
ఉత్తమయినశ్వాల తోడితెమ్మనిరి! గంగజలములదెచ్చి కడిగితళ్ళొత్తి!
అర్చించిపూజించి నైవేద్యమిచ్చె! ముత్యాలహారములుముందరవేసి!
పగడాలహారములు పలకసరులేస్రీ! భెంకిభేరీవారు బిరుదులుదెచ్చి!
తెచ్చిరి అయోధ్య వీధులనుంచిరి! నివాళ్ళుదెమ్మనుచు నెలతలకుసాటించిరి!
హారతులుసతుల దెమ్మనుచుసాటిచిరి! నివాళ్ళుదెచ్చిరి నెలతలందరును!
హారతులుదెచ్చిరతివలందరును! బంగారుపాపాలు భరతునకునిచ్చె!
అంగుళీయకములు సౌమిత్రికియిచ్చె! బాహుదండలు శతృఘ్నునకిచ్చె!
అట్టియాదశరధుల యెక్కేటిగజము! శ్రీరామునిమోతునని కరముపొంగుచు!
కుడిజంఘలీడ్చుకొని పొంగుచువచ్చె! అశ్వములనెక్కుమనిరి ఆరాఘవులు!
ఈమునులుయుండగా మీరుయుండగను! అశ్వములనెక్కేటి ధర్మమాయనెను!
వివాహమప్పుడూ వేడుకప్పుడు! తప్పులేదుసుమ్మి సౌమిత్రియనెను!
అశ్వరత్నాలెక్కి రన్నదమ్ములు! భద్రగజంబునెక్కిరి శ్రీరాఘవూలు!
కంచుమద్దెలవారు కమ్ముకొనిరాగా! పాటకులుపాడగా భటులుపొగడగను!
కైవారములుజేసిరి కవులిరుగడలా! పాడుచు అప్సరా స్త్రీలుయాడగను!
రాజద్వారమువెడలిరి రామచంద్రూలు! ఒప్పైనసౌధములు యెక్కేటివారు!
ఉప్పరములమీద నిలచేటివారు! కర్పూరహారతు లిచ్చేటివారు!
కనుదృష్టితప్పక చూచేటివారు! కరుణాకరులనుజూచి పలికేటివారు!
వజ్రంపుగొడుగులు వారుపట్టగను! నగరిలోపలకొచ్చె నారాయణులు!
తనయులకుయెదురు చనుదెంచెకైకేయి! పచ్చకూళ్ళూదెచ్చి బసిడివేయించె!
అనేకశల్లాలు బసిడివేయించె! పచ్చంగవేసినా పందిళ్లలోను!
అనుజులతోనిలచి రారాఘవునిజూడ అతివేడ్కతోను!
దిక్కుదిక్కులవారు గ్రక్కునవచ్చిరి! అంజనీసుతుడయిన హనుమంతుడపుడు!
మునుచేతబెత్తములు బార్లుజేయించె! బారులుజేయగా భరతుండుజూచి!
శుభకరంబునజనులు జూడవచ్చితే! యింతనొప్పింతురా ఈప్రజలనెల్ల!
ఇందులోమనకెవరు అన్యులున్నారు! అనియిట్లుభరతుడు పలుకగావినుచు!
చెలగిచెలగీ బార్లుజేయుచున్నారు! పొట్టివారంతను నిలుచుండిచూడా!
నీలవర్ణపుస్వామిని నెలతలుజూచిరి! కరుణాకరులను జూచికాంతలిట్లనిరి!
అత్యంతపరమమూర్తియైన రాఘవులు! కారడవులలోతిరిగి కష్టింపనోపె!
మెత్తన్నిశయ్యపై మెనొత్తురామూ! పూరిశయ్యపైన పవళింపనోపె!
భక్తవత్సలుడైన పరమపావనుడు! సృష్టికొరకై సీతతోడనుబుట్టి!
అనుజులతోటి అరణ్యములకరిగే! పాపాత్మురాలైన కైకేయివల్ల!

Thursday, October 9, 2014

లక్ష్మణదేవర నవ్వు -1

లక్ష్మణదేవర నవ్వు

వెన్నెలబైటనే వేలసంఖ్యలను ! గద్దెలుబెట్టించ్రీ కరుణాకరూలు!
అఖిలాండకోటి బ్రహ్మాండనయకులు! కోసలేంద్రులంత కొలువు గూర్చుండ్రి!
విభీషణుడూపెక్కు వీడెములుదెచ్చి! ఆరాఘవేశ్వర్ల హస్తానయుంచే!
వీడెములుదెచ్చినా విప్రూలకెల్లా! వరుసతోదయచేస్రి వాలిమర్దనులూ!
వాలిమర్దనులచే వామభాగమునా! వానర్లసేనంత వసియించికొలువా!
వస్త్రంబరమ్ములే వరభూషణములు! విస్తారముగదెచ్చి విభీషణుకిచ్చె!
తగినాందానాలు తురగములుపసిడి! ధరణిపతికనబోయె ఏడుకోట్లతోనూ!
మ్రొక్కిముందరనిలిచి నిజభక్తుడనియె! పనిలేమియనుచునో పరదిక్కులానా!
సింహాసనముగద్దె చేరియిరిగడలా! సింహవిక్రములైన శ్రీరామపాద!
పద్మములువత్తుచూ వరములడుగుచును! దివాకరసుతుడైన సుగ్రీవుడొచ్చికొలువ!
ఉన్నంతకొలువులో యురవమైయుండె! బద్ధకమువిజయ భూపాలుతమ్మునకు!
అధికశ్రీరాఘవులు అనుగుతమ్మునికి! ఘనుడులక్ష్మణ సన్నిధిదేవునకును!
జననాధవంట్లోను జాడ్యమైతోచె! భావించిపలుకులు బలుపులయియుండె!
మెల్లమెల్లలేచి మేలుకునికునికీ! తనలోనెతలయూచి తలవంచుకొనెను!
వజ్రదళమూర్తయిన అన్నకొలువులో! ఆలకించీలేచినవ్వె లక్ష్మణుడు!
కిలకిలనవ్వె లక్ష్మణదేవరపుడు! కలతలుబుట్టేనూ కపులకందరికి
కిలకిలనవ్వె లక్ష్మణదేవరపుడు! కిలకిలనవ్వగా ఖిన్నుడాయెరాజు!
ఇందరిచిత్తమ్ము యీవిధమ్ముననూ! నిండినకొలువెల్ల కడుచిన్నబోయే!
శంకరుడుతనలోను తలచియిట్లనెను! జాలారివీధులా నీలకన్యకను!
జడలెత్తిశిరసునా ధరియిస్తిననీ! తలచిలక్ష్మణనేడు తానవ్వననీ!
శంకరుడుకొలువులో తలవంచుకొనెను! జాంబవంతుడుతనలోను తలచియిట్లనెను!
ఈశ్వరునిపెండ్లికి ఈజగమంతా1 పిలువనంపిరి తన్నుప్రేమతోడు తను!
గునగుననడువగా కురచజంఘ్యలను! పనిపూనినడువగా పదములోపలను!
నడుమువిరిగెనుతనకు నాడుమొదలుకొనీ! తలచీలక్ష్మణనేడు తానవ్వననుచు!
జాంబవంతుడుకొలువులో తలవంచుకొనెను! శేషుడుతనలోను తలచియిట్లనెను!
ఎల్లకాలమురాజు పాన్పుగానుండి! పగవానికీవీడు భక్తుడాయెననుచు!
తలచిలక్ష్మణనేడు తానవ్వననుచు! శేషుడుకొలువులో తలవంచుకొనెను!
నీలుడూతనలోను తలచియిట్లనెను! తండ్రిదేవాపూజ తగుననుచుచేసె!
నీళ్ళలోపలాముంచి నిండంగబట్టీ! తేలకుండాబట్టీ చెప్పకుండాను!
తలచిలక్ష్మణనేడు తానవ్వననుచు! నీలుడుకొలువులో తలవంచుకొనెను!
అంగధుడుతనలోను తలచియిట్లనెను! సాహసమ్మునతండ్రి చంపినారాజూ!
తలచివేడుకకూడు కుడిచెవీడనుచూ! తలచిలక్ష్మణునేడు తనవ్వననుచు!
అంగదుడుకొలువులో తలవంచుకొనెను! సుగ్రీవుడుతనలోను తలచియిట్లనెను!
తనవెనుకతన అన్న ఆవాలిజంపి! చంపితనవదినెను సతిచేసుకొని!
కానకయున్నాడు కపీంద్రుడనుచు! కిష్కింధరాజ్యమ్ము యేలెవీడనుచు!
తలచిలక్ష్మణవేడు తానవ్వననుచు! సుగ్రీవుడుకొలువులో తలవంచుకొనెను!
విభీషణుడుతనలోను తలచియిట్లనెను! ఆయువులుదెలిపి యుపాయముమరచి!
అక్షోహిణిబలగములు అందరినిజంపి! లంకకుపట్నపు రాజైతిననుచు!
తలచిలక్ష్మణవేడు తానవ్వననుచు! విభీషణూడుకొలువులో తలవంచుకొనెను!
హనుమంతుడు తనలోనుతలచియిట్లనెనూ!  పెద్దవాడినెంతయిన పేరులకుపెద్దా!
పడుచువానిచేత పట్టుబడితిననుచు! తలచిలక్ష్మణవేడు తానవ్వెననుచు!
అంజనీసుతుడైన హనుమతలవాల్చె! భరతశత్రుఘ్నులు భయమందిరంతా!
ధరణెల్లబుచ్చుకొని తమతల్లికైకా! పంపెనుయుగ్రంపు నడవులకనుచు!
ఇమ్మహివత్తురే ఈమహీపతులు! ఇష్టసంపదలతో నిట్లున్నవారు!
తలలుగానీతలలు వాల్చిరిద్దరును! ధాత్రిసుతతనలోను తలచియిట్లనెను!
కారడవిలో దశకంఠునిచేత! పట్టుపడ్డట్టి సతితొడలమీద!
పెట్టుకొనియున్నాడు సృష్టీశ్వరుడనుచు! అతివయారు నెలలుబాసియీరాజు!
ప్రాణములుయెట్లుండెయో కోమలాంగి! ఆడరానిమాటలాడి తివనుచూ!
ఆడావారిమాట నమ్మరాదనుచు! తలచిలక్ష్మణవేడు తానవ్వెననుచు!
ధాత్రిసుతకొలువులో తలవంచుకొనెను! సభవిడిచిచెడియున్న శర్వేళ్వరూలు!
సతిముఖముజూచియు తాచిన్నబోయె! ఇంతకాలమాయె నీకపులనేలి!
కలకలబుట్టుటకు కారణంబేమి! కొలువులోనవ్వుటకు కోపించెరాజు!
తలతెగవేతునని తాఖడ్గమెత్తి! వారుఎత్తుకబోయిరి వనజనాభులను!వనితశంభూలంత తమరడ్డుపడిరి! భూమీశలక్ష్మన్న బాలుండుగాడా!ధరణీశతగదయ్య సౌమిత్రినరుక! వీరుడా శూరుడా శౌర్యపరుండా!కారణమునవ్వేమి అనుజుడాచెపుమా! ధరణీశతమ్ముడని సయ్యబిలిచినను!ధరణిజాతావణకె చెమ్మటగురిసెఏ! గడగడావణకుచు కమలాయతాక్షి!వెరపుతోవత్తెతన విభునిపాదములు! అత్యంతవరమూర్తి అతిదాయకుడవు!శ్రితకల్పవృక్షమా సిరిదాయకుడవు! రాజులభోజుడవు రామచంద్రుడవు!ధర్మచారిత్రుడవు తర్కమేమిటికి! ఇందిరానాయకా ఇక్ష్వాకులతిలకా!నాదొక్కవిన్నపము నరనాధవినుమి! ముందునునడవులకు పోయున్ననాడు!ఆపర్ణశాలలో మనముండగాను! పరమాత్మమీసేవ చేయగాజూచి!
ఉండగానేవచ్చె ఉత్తమ్మునిద్రా! రెండుజాములవేళ్ళ నిద్రయేతెంచె

వాలేటీంబులను లక్కబంతులను! పొందవచ్చినప్పుడే వాలుటంబులను!
సతిరూపుజేకొనీ దిగబడియెడ్వా! అతివనీవెవ్వరే అంగలార్చేవు!
భూమీశపుట్టు నిద్రాదేవితాను! అష్టదిగ్గజములను ఆదిఋషులా!
వైకుంఠనాభులను వసియింతునేను! సప్తస్సాగరంబులను చవటాపడుగులను!
పారేటినదులను భ్రమియింతునేను! పక్షులజాతులలోను పర్వతంబులను!
వృక్షాలపైనుండి విహరింతునేను! నరులుఎవ్వారును ననుగెల్వలేరు!
దీనతపడియుందు నీయాజ్ఞాలేదు! నిలువరానివ్వదే దీనిచేతాజ్ఞ!
వలగొనిముమ్మారు ప్రదక్షిణముజేసి! సాష్టాంగ దండనమస్కారములుజేసీ!
మాయన్నరఘుపతికి మావదినకూను! ఈపర్ణశాలకే తానుకాపనెను!
పొమ్ముడీయోధ్య వేగపురినగరు! తన్నుబాసితన సతియుండతగదు!
రాత్రియునుపగలును లేవకుండగను! తనువిడచిపొందు మీధవళాక్షినిద్ర!
కడువేడ్కాయ్యోధ్య కనకపట్నాన! కాకుత్థ్సతిలకుడూ గట్టిననాడు!
సేనలుమంత్రులూ కొలువైయుండగను! అపుడుతనుపొందుమని పలికీతిననెను!
తప్పకయొకఘడియ తడబడకుండ! తనునిద్రపొందితే నవ్వీతిననెను!
అనుతమ్మునిపల్కు లాలించివినుచు!  అతచేతికన్నీరు అతిసహస్రమాయె!
జలము అంజలిపైని కలయగురిపించే! ఈపాపభయంబు తనకేవిధంబునను
పరిహరించేటి యుపాయంబులేదు! తనలోనెతలవిడవ తలచెరాఘవులు!
ఆఋషులువాశిష్టు అప్పుడిట్లనిరి! భూమీశమీకిట్లు బుద్ధిగాదయ్య!
మీరులక్ష్మన్నకే నిద్రపటమమర్చీ! పాదలువత్తుమని పలికెరాముని!
(ఆపైన ఏమిజరిగిందో రెండోభాగంలో చదవండి....) :)

Sunday, October 5, 2014

శ్రీకృష్ణుని జననము - 2 (కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటి రంగరంగా)

ప్రేమ కృష్ణుణ్ణి చూచీ - పూతకి - ప్రియముతో బుజ్జగించి
నాయన్న ఊరుకోర - నాతండ్రి - పాలు ఇచ్చెదను రార
మూడు గుక్కలు పీల్చగా - పూతకి - భూమిపైకొరిగి పడగా
గోపెమ్మ చూచి అపుడూ - బంగారు - గిన్నెలో బువ్వపెట్టి
ప్రొదున్న ఉగ్గుపోసి - కృష్ణుణ్ణి - యొడలోను పందవేస
అంతలో కంసహితుడూ - బండిరూ - పై యెదురుగవచ్చెనూ
పాదములు రెండు పిడుగు - లావలే - దడదడా విసిరెనపుడూ
వృషభమై వచ్చినిలువ - ఒక్కలఘు - వున చంపివేసెనపుడూ
చల్లమ్ము వారలెల్లా - ఈకబురు - చల్లగా చెప్పిరపుడు
రేపల్లె వాడలోను - ఉన్నట్టి - గోపికల గుంపుగూడి
"మాయిళ్ళ కొచ్చునమ్మా - కృష్ణూడు - మమురవ్వ చేసునమ్మా
తాళలేమమ్మ మేము - మీ సుతుడు - తాలిమితొ ఉండడమ్మా
మగనివలె పనులుసేయా - నీ సుతుడు - మా యిండ్లలోకి వచ్చూ
ఇనైకన బుద్ధిచెప్పీ - ఇంతిరో - పదిలమ్ము సేయుమమ్మా"
అనుచును గట్టిగానూ - మనమంత - గోపెమ్మ కడకుబోయి
చెప్పుదామనుచు వారు - గోపెమ్మ - చెంతకేగగ నప్పుడు
గోపాలకృష్ణు డపుడూ - అచటనే - పాలుత్రాగుచు నుండెనూ
ఇదియేమి యాశ్చర్యమే - ఓ చెలియ - ఇదియేమి చోద్యమమ్మ
కనుపాపలను దీసునే - కృష్ణుడు - దొంగతనములు చేసునే
ఇకనేమి చేసునోను - మన ముబులు - పాటమున వస్తిమమ్మా
అమ్మనే నెరుగనమ్మా - నాత్రోవ - నేబోవు చుండగాను
ననురవ్వ చేసిరమ్మ - నేనంత - భయపడీ వస్తినమ్మా
కొబ్బరి కుడకలనుచు - గోపికలు - గొబ్బున పిలువబోవ
కొబ్బరి కుడకలనుచు - గోపికలు - గుబ్బలను చూపినారు
పొరుణమి రోజులందు - జలజాక్షు - లందరూ కూడకోనీ
చీరలటు తీసివేసి - గోపికలు - జలకమాడుచు నుండగా
తీసివుంచిన చీరలు - కృష్ణుండు - వేసె ఆ పొన్నమీద
వేసియూ వేణునాదం - వూదుచూ - వుండె నా మాధవుండూ
జలమమ్ము చాలించియూ - గోపికలు - మన చీర లేమాయెనే
నమ్మరాదమ్మ కృష్ణుని - ఇకను ఈ - చినగొల్లవాని నెపుడూ
ఎంతపని చేసెనమ్మా - ఓ చెలియ - ఏమి యాశ్చర్యమమ్మా
వెదకుచూ కొందరుండీ - నీళ్ళలో - మునిగియుండిరి కొందరూ
అప్పుడూ గోపికలో - ఒకయింతి - తాజూచి శ్రీకృష్ణునీ
ఇవ్వరా మా చీరెలూ - ఓ కృష్ణ - ఇవ్వరా మా రవికలూ
దండంబు పెట్టెదార - కృష్ణయ్య - దయయుంచి దయచేయరా
అందరూ ఒకచేతితో - దండంబు - పెట్టగా చూచితాను
పొందుగా మీరందరూ - దండంబు - రెండుచేతుల బెట్టరే
ఎంతపని వచ్చెననుచూ - గోపికలు - మానభంగము నొందిరీ
వసుదేవ తనయునకునూ - దండంబు - రెండుచేతుల బెట్టిరీ
పొందుగా వలువలన్నీ - కృష్ణుండు - పేరుపేరున ఇచ్చెను
నాయత్త తిట్టునేమో - యనుచు నొక - రొకరితో వగచిరపుడూ
మాయాడు బిడ్డ యిపుడూ - కొట్టునో - నా బావ దండించునో
నా మగడు నన్ను బ్రతుక - నివ్వడూ - నేనేమి చేతునమ్మా
కస్తూరి రంగరంగా - నా యన్న - కావేటిరంగ రంగా
శ్రీరంగ రంగరంగ - నిను బాసి - యెట్లు నేమరుచుందురా

శ్రీకృష్ణుని జననము - 1 (కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటి రంగరంగా)

కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటి రంగరంగా 
శ్రీరంగ రంగరంగా - నినుబాసి - యెట్లునే మరచుందురా
కంసుణ్ణి సంహరింపా - సద్గురుడు - అవతారమెత్తెనపుడూ
దేవకీ గర్భముననూ - కృష్ణావ - తారమై జన్మించెనూ
యేడు రత్రులు చేరిచీ - ఒకరాత్రి - యేకరాత్రిగజేసెను
ఆదివారము పూటనూ - అష్టమీ - దినమందు జన్మించెను
తలతోను జన్మమైతే - తనకు బహు - మోసంబు వచ్చుననుచు
ఎదురు కాళ్ళను బ్ట్టెను - ఏడుగురు - దాదులను జంపెనపుడు
నెత్తురుతొవుండి యపుడూ - ఆబాల - కావుకావున ఏడ్చుచు
నన్నేల యెత్తుకొనవే - ఓతల్లి - దేవకీ వందనంబు
ఒళ్ళెల్ల హీనంబుతో - ఈరీతి - నున్నాను కన్నతండ్రి
నిన్నెట్లు ఎత్తుకొందూ - నీవొక్క - నిముషంబు తాళరన్నా
గంగనూ ప్రార్ధించెనూ - జలనిధుల - గంగతా నుప్పొంగెను
గంగనదిలో నప్పుడూ - దేవకీ - జలకంబు లాడెనపుడు
ఇకనైన యెత్తుకొనవే - నాతల్లి - దేవకీ వందనంబు
కాని బాలుని వలెను - నన్నిట్లు - యెడబాసి యుండతగునా
నీ పుణ్యమయె కొడకా - యింకొక్క - నిముషంబు తాళుమనుచూ
కామధేనువు నప్పుడూ - దేవకీ - కడగి ప్రార్థించగాను
పాలవర్షము గురిసెను - అప్పుడా - బాలుపై చల్లగానూ
తడివస్త్రములు విడచెనూ - దేవకి - పొడివస్త్రమును కట్టెను
పొత్తిళ్ళమీద నపుడూ - బాలుండు - చక్కగా పవళించెను
తనరెండు హస్తములతో - దేవకి - తనయుణ్ణి యెత్తుకొనెను
అడ్డాలపై వేసుక _ ఆబాలు - నందచందము చూచెను
వసుదేవు పుత్రుడమ్మా - ఈబిడ్డ - వైకుంఠ వాసుడమ్మా
నవనీత చోరుడమ్మా - ఈబిడ్డ - నందగోపాలుడమ్మ
సితపత్ర నేత్రుడమ్మా - ఈబిడ్డ - శ్రీరామచంద్రుడమ్మ
శిరమున చింతామణి - నాతండ్రి - నాలుకను నక్షత్రము
పండ్లను పరుసవేది - భుజమున - శంఖచక్రములు గలవు
వీపున వింజామరం - నాతండ్రి -బొడ్డున పారిజాతం
అరికాళ్ళ పద్మములను - అన్నియూ - అమరెను కన్నతండ్రీ
నీరూపు నీచక్కనా - ఆ బ్రహ్మ - యెన్నాళ్ళు వ్రసెతండ్రీ
అన్నెకరి కడుపునా - ఓ అయ్య - ఏల జన్మిస్తివయ్య
మా యన్న కంసరాజు - ఇప్పుడూ - వచ్చు వేళాయెరన్నా
నిన్ను నే నెత్తుకోని - ఏ త్రోవ - నేగుదుర కన్నతండ్రి
ఆ చక్కదనము జూచి - దేవకి -శోకింపసాగె నపుడు
తల్లి శోకము మాంపగా - మాధవుడు - గట్టిగా ఏడ్వసాగె
శోకంబు చాలించియూ - దేవకి - బాలుణ్ణి యెత్తుకొనెను
నాయన్న వూరుకోరా - నాతండ్రి - గోపాల పవళించరా
అల్లడుగొ బూచివాడు - నాతండ్రి - వస్తాడు పవళించరా
బూచులను మర్ధించనూ - నలినాక్షి - బుద్ధిమంతుడను అమ్మా
బూచేమి చేసునమ్మా - నాతల్లి - బూచి నన్నెరుగు నమ్మా
నీ పుణ్యమాయె కొడుక - నీవొక్క - నిముషంబు తాళుమనుచు
అల్లడుగొ జోగివాడూ - నాతండ్రి - వస్తాడు పవళించరా
జోగి మందుల సంచులూ - ఏవేళ - నాచంక నుండగాను
జోగేమి చేసునమ్మా - నా తల్లి - జోగి నన్నెరుగునమ్మా
నీ పుణ్యమాయె కొడకా - నీవొక్క - నిముషంబు తాళుమనుచు
అల్లదుగొ పాము వచ్చె - నాతండ్రి - గోపాల పవళించరా
పాముల్ల రాజె అయిన - శేషుండు - పానుపై యుండగానూ
పామేమి చేసునమ్మా - నళినాక్షి - భయము నీకేలనమ్మా
నీలి మేఘపు చాయలూ - నీమేను - నీలాల హరములునూ
సద్గురుడు వ్రాసె నాడు - నాతండ్రి - నీరూపు నీచక్కన
నిన్ను నే నెత్తుకోనీ - యే త్రోవ - పొదురా కన్నతండ్రీ
నాకేమి భయములేదే - నాతల్లి - నకేమి కొదువలేదే
మా మామ కంసుకుండు - ఈ వేళ - నన్ను వెరపించవస్తే
మా మామ నాచేతనూ - మరణామై - పొయ్యేది నిజముసుమ్మూ
వచ్చు వేళాయెననుచూ - నాతల్లి - వసుదేవు పిలువనంపూ
గోపెమ్మ బిడ్డ నిపుడ్ - శీఘ్రముగ - తెచ్చి నీవుంచవమ్మా
అంతలో వసుదేవుడూ - బాలుణ్ణి - తలమీద ఎత్తుకొనెనూ
రేపల్లె వాదలోనూ - గోపెమ్మ - ఇంటనూ వచ్చెనపుడూ
గోపెమ్మ పుత్రినపూడూ - వసుదేవు - భుజముపై నెక్కించుకూ
దేవకీ తనయు డపుడు - పుట్టెనని - కంసునకు కబురాయెను
ఝల్లుమని గుండెలదర - కంసుండు - పీఠంబు దుమికె నపుడూ
జాతకంబులు చూచెనూ - గండంబు - తగిలెనని కంసుకుండు
చంద్రాయుధము దూసుకా - శీఘ్రముగ - దేవకి వద్దకొచ్చె
తెమ్మని సుతునడిగెను - దేవకి - అన్నదీ అన్నతోనూ
మగవాడు కాదురన్న - ఈ పిల్ల - ఆడపిల్ల నమ్మరా
ఉపవాసములు నోములూ - నోచి ఈ - పుత్రికను గంటినన్నా
పుత్రి దానము చేయరా - నాయన్న - పుణ్యవంతుడవురన్నా
దేవాదిదేవులైన - బ్రహ్మ రు - ద్రాదులకు పూజచేసి
పూజ ఫలములచేతనూ - వారికృప - వల్ల పుత్రికను గంటీ
నీ పుణ్యమాయెరన్న - నీవు పు - త్రికను దయచేయుమన్నా
నిర్దయాత్మకుడవగుచు - నీవిట్లు - చేయుటతగదురన్నా
ప్రేమతో చెల్లెలపుడు - అన్నను - చెయిబట్టి బ్రతిమాలెనూ
గంగాది నదులయందూ - పుత్ర దా - నము చేయమని వేడెనూ
కాదు కాదని కంసుడు - దేవకి - పుత్రికను అడిగె నపుడు
అడ్డాలపై బాలనూ - పుచ్చుకొని - ఎగరేశి నరకబోయె
అంబరమునకు ఎగురగా - వేయునపు - డా బాల కంసు జూచి
నన్నేల చంపెదవురా - నీయబ్బ - రేపల్లె వాడలోను
పెరుగుతున్నాడ వినరా - కృష్ణావ - తారమై జన్మించెనూ
నిజముగా దోచెనపుడూ - కంసుండు - యేతెంచి పవళించెనూ
రేపల్లె వాడలోనూ - పెరుగుచు - న్నాడనీ దిగులొందెను
నీ యబ్బ నీ తాతరా - కంసుడా - కృష్ణుండు పుట్టెననుచూ
చల్లమ్ము వారలెల్లా - ఆకబురు - చక్కగా చెప్పగాను
పూతకికి కబురాయెను - అప్పుడా - పూతకి చనుదెంచెను
శృంగారముగ పూతకీ - స్తనములకు - విషధార పూసుకొనెను
రేపల్లె వాడలందూ - కృష్ణుండు -  తిరుగుచున్నా చోటకూ
చనుదెంచి విషపు పాలూ - ఇవ్వనూ - సమకట్టి ఇవ్వగానూ
బాలురతొ బంతులాడ - కృష్ణూని - బాలురందరు కొట్టగా
కావుకావున ఏడ్చుచు - పరుగెత్తి - వీధినడుమన నిలచెనూ

Sunday, January 20, 2013

శతకసాహిత్యం గురించి....


శతకాల గురించి తెలియని తెలుగువాడు ఈ తెలుగుగడ్డ మీద ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. మన చిన్నప్పటినుంచి అన్నిటితో పాటు తెలుగువాచకంలో మనకి నేర్పిన వాటిలో ఇవి ఇప్పటికి మన జ్ఞాపకాల్లో చెక్కు చెదరకుండా నిలిచిపోయాయి. వేమన శతకం (ఉప్పుకప్పూరంబు నొక్కపోలికనుండు), సుమతీ శతకం (శ్రీరాముని దయచేతను), కృష్ణ శతకము (నీవే తల్లియు తండ్రియు), దాశరధీ శతకము, కాళహస్తీశ్వర శతకము, లోని పద్యాలు మన చిన్నప్పుడు అర్ధం తెలిసినా తెలియకపోయినా బట్టియం వేసినవాళ్ళమే. తరవాత కాలేజీలలో అంత పెద్దగా చదువక పోయినా చిన్నప్పటి పద్యాలు గుర్తుకొచ్చినప్పుడు అహా ఎంత బాగుంది, ఎంత అర్థం ఉంది అనుకోవటము చాలమందికి అనుభవంలోకి వచ్చిన విషయమే. నాకు సరిగా ఇలాగే జరిగింది. ఎలాగంటే ......

ఒకరోజు అంతర్జాలంలో దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారి పుస్తకం ఒకటి దొరికింది.  పంతులుగారు ఆ పుస్తకంలో ఒక పూర్త్తి చాప్టర్ శతక సాహిత్యానికి కేటాయించటమే కాకుండా వారికి దొర్కిన చాలా శతకాలను ఆ పుస్తకంలో పొందు పరిచారు. ఆ పుస్తకం చదివిన తరువాత నాకు అసలు ఎన్ని శతకాలున్నాయి అన్న ప్రశ్న మొదలయింది. అందుకోసం అంతర్జాలంలో వెదుకులాట ప్రారంభించాను. ఆ వెదుకులాట నాకు దాదాపు 450 శతకాలను సంపాదించి పెట్టింది. వాటి వివరాలన్ని ఒక పట్టిక తయారు చెయ్యటం దాదాపు పుర్తి అయ్యింది. ఐతే ఈమధ్యనే పండిత వంగూరి సుబ్బారావు గారు రచించిన "శతక కవుల చరిత్రము" (1950) చదవటం జరిగింది. అందులో ఆ మహానుభావుడు దాదాపు 1200 శతకాలు 900 మంది శతక రచయితలను పరిచయం చేసారు. ఈ సంఖ్య దాదాపు 60 ఏళ్ళ క్రితం వరకు జరిగిన శతకాలాను సూచిస్తుంది. ఆ తరువాత అంటే 1950 నుండి ఇప్పటివరకు ఎన్ని శతకాలు వచ్చాయో ఆ వివరాలను కలిపితే ఈ సంఖ్య 3000 నుంచి 5000 వరకు వెళ్ళవచ్చును అనేది ఒక వాదన. మన తెలుగు సాహిత్యంలో ఎంతో అమూల్యమైన ఈ శతక సాహిత్యం లో దొరికిన మణులతో పోలిస్తే దొరకని ఆణిముత్యాలు ఎన్నెన్నో అనిపించింది. అంతర్జాలంలో కూడా ఏ సహిత్య సంభందిత సైటులో చూసినా 10 నుండి 15 శతకాల కంటే ఎక్కువ కనపడవు. తెలుగు వికిలో కూడా దాదాపు ఇదే సంఖ్య ఉన్నట్లు గుర్తు. మిగిలిన శతకాలు వాటి వివరాలు వాటి అతీగతి ఎవ్వరికి పట్టినట్లు కనిపించటం లేదు. తెలుగు సాహిత్యాభిమానులకు గర్వకారణమైన ఈ శతక సాహిత్యాన్ని కాలగర్భంలో కలిసిపోక ముందే రక్షించుకొనే అవసరం ఎంతైనా ఉంది. అటు ప్రభుత్వం ఇటు పండితులు, సాహిత్యాభిమానులు కలిసి ఈ సంపదను పరిరక్షించుకోకపొతే అపూర్వసాహితీ సంపదని కోల్పోయిన వారవుతాము.  ఇంత అద్భుతమైన మన సాహిత్య సంపదను కాపాడుకోకపోతే శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. 

ఈ ఆలోచనతోనే నాకు ఇంతవరకు లభించిన శతకాల వివరాలను ఒకచోట పొందుపరిచి తెలుగు భాషాభిమానులతో పంచుకుందామనే ఉద్దేశ్యాన్ని నా ముఖచిత్రం (facebook) మిత్రులతో పంచుకోవటం జరిగినది. ఈ విషయంలో వారి ప్రోత్సాహం నాకు ఎంతో ఉపకరించింది. ప్రోత్సాహమే కాక వారు వారిదగ్గర ఉన్న శతక వివరాలను కూడా నాతో పంచుకొన్నారు. వారిలో శ్రీ గంటి లక్ష్మీనారాయణ మూర్తి గారు వారి వద్ద నున్న దాదాపు 40 శతకాల వివరాలను దయతో నాకు పంపించారు. ఆలాగే శ్రీ అనంత కృష్ణ గారు వారి స్వీయరచనలయిన రెండు శతకాలను నాకు పంపించారు. బొమ్మిరెడ్డి మురళీకృష్ణ గారు ఒక శతకం పంపించారు. ఇలా చెప్పుకొంటుపోతే ప్రతివక్కరు ప్రత్య్క్షంగా లేక పరోక్షంగా సహాయం చేసారు. వారందరికీ నా కృతజ్ఞతలు. 
ఈ సందర్భంగా అంతర్జాల మిత్రులకు నా మనవి: మీదగ్గర ఉన్న శతకాల వివరాలు (శతకం పేరు, రచయిత, ప్రకటించిన/రచించిన సంవత్సరం, మకుటం) లాంటి వివరాలు నాకు పంపితే  బ్లాగులో పొందుపరుస్తాను. ఇందుకోసమై  అన్ని వివారాలు ఒకేచోట పొందు పరచటానికి వీలుగావిడిగా ఒక బ్లాగు "శతకసాహిత్యం" అనే పేరున తెరుస్తున్నాను.

Saturday, August 4, 2012

భోగినీ దండకము - బమ్మెరపోతన


శ్రీసర్వజ్ఞ సింగరాజు వర్ణనము

శ్రీమన్మహా మంగళాకారు, నాకార లక్ష్మీకుమారుం, గుమారీమనోరాము, రామాంబరీషాది రాజన్య రాజదశః కాముఁ, గామాహిత క్షీరవారాశి తారాశి వాగేంద్ర మందారకుం దారవిందేహి తాకాశకల్లోలినీ కాశవిఖ్యాత సత్కీర్తిముక్తావళీభూషి తాశాంగనాలోకసీమంతు, సీమంతినీమానసారామవాటీ వసంతున్, వసంతావనినాధ సంసేవితాంచత్పదాంభోజు, నంభోజరాజీసుహృత్తేజు, దేజో జయప్రాభవోద్దాము, నుద్దామజన్యావనీభీము, భీమప్రతాపానలాభీలకిలావినిర్మూలితారతి పండ్యక్షమాపాల దుర్వార గర్వాటనీవారు, వారాధిపోరుప్రభా భాసురస్ఫార కల్యాణదుర్వారు, వారాశివేలా పరీతావనీభార ధౌరేయరాజ న్మహాబాహు, బాహాకఠోరాసిధారా వినిర్భిన్న సోమాన్వయోత్పన్న భూభృత్సమూహున్, సమూహా మహాశమూషీ కుంఠితాశేష శత్రుక్షమావల్లభున్, వల్లభామానసాదుర్లభున్, దుర్లభారిక్షమానాథ మత్తేభయూధంబులం జించి చెండాడు రాసింగమున్, సింగభూపాలు, భూపాల గోపాల గోపాలికా కృష్ణ గోపాలు, గోపాలదేవోత్సవ క్రీడలో, మేడలోనుండి జాలాంతరాళంబులన్ వారయోషాతనూజాత విద్యావయోరూప సౌందర్యచాతుర్య విఖ్యాత చంచద్గుణోపేత భృంగాంగ వాలబ్ధకేళి మహాహస్త కంజాతసంకాశ, తూణీనిరుద్ధప్రసూనేషుసూనేషునీకాశ యై యుండి తద్వైభవముల్ విమర్శించి, 

వేశ్యాకన్య రాజుం జూచి మోహించుట

హర్షించి, సంతోషభాష్పంబుపూరంబు వర్షించి,కందర్పబాణాహతింజెంది, లోఁగుంది, మోహించి, సంగంబునూహించి, ' యేవేళఁ దల్లింబ్రమోషింతు, నేలీల భూపాలకుంజేరి భాషింతు, నేరీతిఁ గామానలంబున్ నివారింతు, నేనాతితోడన్ విచారింతు, నేవెంట రాచూలి వంచింతు, నేజంటఁఘొర్కుల్ ప్రపంచింతు ము న్నేప్రశస్తారవిందంబనైనన్ మహిపాలు హస్తారవిందంబుపై నేఁడు లీలారవిందంబనై యుందుఁబో, రత్నహారంబనైనన్ శుభాకారు వక్షోవిహారంబుఁ గైకొందుబో, యేల యిట్లైతి నెట్లోకదే' యంచు శోకించుచున్, నిత్యకల్యాణు లీలావతీ పంచబాణున్ మనోవీథినంకించుచున్, ఘోషమాణాలికిన్ జిత్తభూభల్లికిన్ దల్లికిన్ లోఁగి, కామానలజ్వాలలన్ వేఁగి, చింతాభరాక్రాంతయై యేఁగి, సంతాపఘర్మంబులందోఁగి, చింతించు నింతిం బరీక్షించి, బుద్ధిన్ విచక్షించి, తన్మాత 

వారకన్యతల్లి వచ్చి కూఁతునవస్థఁ గనుఁగొనుట.

మాయాపరాభూత జామాత మిథ్యానయోపేత విజ్ఞాతనానావశీకార మంత్రౌషధవ్రాత లోకైకవిఖ్యాత వారాంగానాధర్మశిక్షాదిసంభూత సమ్మోహితానేక రాజన్యసంఘాత వాచాలతాబద్ధ నానామహాభూత యేతెంచినీతిన్ విచారించి, బాలన్ మిళత్కుంతల వ్రాత ఫాలన్ గరాంభోజ రాజత్కపోలన్ సమందోష్ణనిశ్శ్వాసజాలన్ విపర్యస్తసంవ్యానచేలన్ మహందోల నప్రేంఖితస్వర్ణడోలన్, మృగేంద్రావలగ్నన్, దయావృష్టిమగ్నన్, మనోజాగ్నిభగ్నన్, నిరంధన్, బరిత్రస్తధమిల్లబంధన్, సముద్విగ్న మోహానుబంధన్ నిరాలాప నావర్జితాలేప నస్వీకృతానేకకేయూరహారన్, గళద్బాష్పధారన్ బరిత్యక్తలాస్యన్ బరాభూత లీలావయస్యన్ బదాలేఖనాలక్షితక్షోణిభాగన్ బరీక్షీణ రాగన్ విలోకించి, బుద్ధిన్ వివేకించి, లోనం బరాయుత్తయై, చిత్తజాతాసి ధారాచలచిత్తయై, విన్నయై, ఖిన్న్యై, యున్న భావంబుభావించి, నెయ్యంబు

తల్లి కూఁతునకుఁ గులవృత్తి ధర్మములను బోధించి రాజుపై వలపును వారింపఁజూచుట

గావించి, రావించి 'బాలా! జడత్వంబు మేలా, వినోదింపవేలా, విచారింపనేలా, వివేకింపకేలా వయోధర్మముల్ రిత్తగాఁ బుచ్చునీ వృత్తికిన్ మెత్తురే, వత్తురే కాముకుల్డాయఁగాయంబు విద్యున్నికాయోపమేయంబు హేయంబు ప్రాయంబు ధారాధరచ్చాయ మెన్నెనుపాయంబులన్ విత్తమాయత్తంఉంజేయుమా. రిత్తవారంబు నేరంబుగా దీవిచారంబు వంశనుచారంబు, సంసారసారంబు, లాభాధికారంబు, చర్చింప నీకున్నలంకారమే కాన ధిక్కారముం జేయరా దీ వికారంబు లేలే, శుభాకార యేలే, గుణోదార యేలే, కులోద్ధార యేలే, తటిద్దేహ యేలే, వరారోహ యేలే లలాటాలకవ్యూహయేలే, మహోత్సాహ యేలే, విరాజన్ముఖాభోజ యేలే, మహోరోజ యేలే, కలాలాప యేలే, జగద్మోహనరూప యేలే, చలచ్చంచలాలోకనవ్రాత యేలే, నయోపేత యేలే, మహామర్మభేదంబులై సుప్రసాదంబులై కౌముదీమూలకందంబులై మందమందంబులై చూద నందంబులై, మోహనశ్రీవిలాసంబులై యున్న నీచారుహాసంబులన్ సోలియోలిన్ భుజంగాలి బాళింబడదార్చుటో;  కాక, లోలంబులై, మోహజాలంబులై, కాము బాణంబులై, యప్రమానంబులై, మీనశోభంబులై, చంచలాంబులై, మోహితాశేషలోకంబులై యొప్పు లీలావలోకంబులన్ బ్రౌఢలోకంబులన్ సద్వివేకంబులం బాపితాపాతిరేకంబులం గూర్చుటో; కాక, రాజత్రిలోకీవశీకార మంత్రంబులై, యుల్లసత్కామతంత్రంబులై, దర్పకోద్రేకయంత్రంబులై, ంఓహవారాసిభంగంబులై, సూచితానేక నర్మప్రసంగంబులై, కాముకేళీకలాపంబులై, యొప్పు నీభాసమానానులాపంబులన్ విత్తవల్లోక చిత్తంబులన్ రాగమత్తంబులంజేసి త్తన్నిమిత్తంబులన్ నిత్యమున్ విత్తమెల్లం బ్రమోషించి దూషించి భర్జించి తర్జించుటో; కాక, తోరంబులై, మధ్యభారంబులై, నిర్జితానంగసౌధోపరి స్వర్ణకుంభంబులై యొప్పు నీ విప్పు వక్షోజకుంభంబులం జూపి పౌరావళిన్ నర్మలీలా కురంగావళింజేసి నిర్జించి వర్జించుటో; కాక, నీ కీ కులాచారముల్ మాన నే కీరసల్లాప భోదించెనో! నేడు నాతోడు నాతోడ నాతోడ మాటాడుమా. చూడుమా కన్యకాలోక చింతామణీ, గోత్రరక్షామనీ, ధీమణి, ఎవ్వ రెవ్వాని భూషించిరే, ఏమి భాషించిరే, నేఁడు నీతోడ భాసించు ప్రోడల్ కుమారీ! కుమారాన్నపో తావనీనాథ సూమన్ వధూచిత్త విత్తాపహారవధానున్ సదాదాన విద్యానిరూఢున్ మనోజాత హృద్యానవద్యైక విద్యావలిడున్ ప్రభాభాను, రాగానుసంధాను, మయూరమానాథు సర్వజ్ఞసింగక్షమానాథు నీసన్నిధానంబునం జెప్పిరో, ఏమి వాతప్పిరో, అప్పరో, అప్పయోజాతగంధుల్ సుగంధుల్ పురిన్ నీవయస్యల్ మహాసౌమన్స్యల్ సువర్ణా, సువర్ణంబు లార్జించుటల్ చూడవా. చూడ వాంచింతురా రాజులన్ వారలారాజులం గానరా. రాజుఁ గామింతురా, రాజబింబాననా! రాజరాజాధి రాజోన్నతిన్ రాజులన్ మించి రాజిల్లు నారాజు వంచింప నెంచంగ శోభిల్లునే, చెల్లునే, భూమి నీజాతి యేనాతి యీరీతిఁ బ్రీతిం బ్రకాశించి రాజిల్లునే, చెల్లదే నీ పటుత్వంబు వాచా కటుత్వంబు, బాలేంద్రుశోభాలికా! బాలికల్ సేయు యత్నంబులే నీప్రయత్నంబు? లంభోజనాళాంతరాళ స్ఫురత్తంతుయోగంబునం జిక్కునే గంధనాగంబు? కంపించునే మక్షికాపక్ష విక్షేప వాతాహతిం గాంచనాగంబు? మిథ్యామమత్వంబులన్ రంజకత్వంబులన్ గూఢయంత్రంబులన్ మోహమంత్రంబులన్ మారుతంత్రంబులన్ కిక్కఁడే. చొక్కఁడే దిక్కులం జిక్కులంబెట్టు మేధన్ మహావేధనైనన్  విరోధించి వాకట్టు, నీతిన్ బలారాతిమంత్రిం బ్రమోషించు, భాషావిషేషంబులన్ శేషుతోనైన భాషించు, మాయావిధానంబులన్ మాధవున్ మెచ్చఁ, డచ్చోట నెప్పాట మెప్పించెదే. చీటికిన్ మాటికిన్ బోటి యామేటి యిచ్చోటికిన్ రాఁడు పాటించి. నీపాటిపాఠీననేత్రల్ ధరిత్రీశుచిత్తంబు మత్తంబుగాఁజేయఁగాఁ జాలరే. ఏల రేలుంబగళ్ళున్ విచారంబు? చాలింపవే. వారావేశ్యాభుజంగుండు గాఁడే; మహారాయవేశ్యా భుజంగుండు నిన్నేలయేలున్? పరస్త్రీలకున్ వేళ యీఁడెన్నఁడున్. దత్తుఁ బాంచాలు భద్రున్ మరుంగూచిమారున్ వినం గోరవుం జీరవుం జేర వీరీతి నేనాతిచేవింటివే యింటి నీవంటి దీవెంటలం దంటయై గెంటిపోఁ? దమ్మిజంటీ, నునుంగంట యీవెంతకా? హా! కనుంఒంటినీగొంటు చెద్యంబు. దైవంబు క్రేఁగంటి కేనెంత కంటైతినో! జంట నింటింటికిన్ వెంటం వెంటం బడన్ బంటనే? దాఁట నింటిన్, జేనంటీ! చిరంటీ గుణంబేటికే? మాయలాఁడే విభుండైనఁబోఁడే వినోదింపనీఁడే నిమగ్నుండు గాఁడే మముం జేరనీడే నినుంజేరరాఁడే ప్రవేశింపరాదే ప్రమోషింపఁగాదే. ప్రవర్తింతు వెచ్చొట నచ్చోటి కేమేఁ బ్రియంబాడరామే నినుంబాయలేమే. మహోపాయవై కన్యకా! ధన్యునన్యున్ మదిం గోరుమా, చేరుమా. చేరుమా కిష్టముల్. వీటలేరేమగల్ చేరరారేనినుం గోరి తారే విహారేహులై గేహళీవాటికిన్ మాటికిన్ వచ్చు నేవారి నీవారిఁగాఁ జూడవున్ గూడవున్. వారిజామోద! యీవార రామల్ మనోరాములన్ రిత్తపోరాములంగాని నిక్కంపుఁ బోరాములం జేసి గారాములం జిక్కరే. చొక్కిరే. వారు వారాదికృత్యంబులం జేయవారక్రియల్ చెల్లవే. తల్లి రాజుల్ బహువ్యాజులే భోజులే చంచలచ్చిత్తులే మత్తులే ప్రేరకాయత్తులే నూతనాసక్తులే లోభసంయుక్తులే దోషసంసిక్తులే రంధ్రసంపాదులే వీతమర్యాదులే. వారి సేవింపఁగా రాదులే, కాదులే, వాదులేలా, నవైలాలతాదేహ! సందేహమే దేహమేలే నలంపన్, నిలింపాంగనాభా! సునాభ! మదిన్ మానవే మనవేశాభిలాషంబులన్. నిన్ను లేమా! భరింపంగలేమా? కరంగింప లేమా నరేశున్ జితశ్రీసురేశున్. గతిశ్రీజితోద్దండ వేదండ! మాదండ నేదండముంజెందదే. రాచదండంబు గండంబు పుండ్రేక్షు కోదండ విబ్రాజితభ్రూయుగా! భూమిపాలావరోధంబు లో సన్నిరోధంబు నీకున్ మహాభద్రమా? భద్రమాతంగకుంభస్తనీ! కన్నవారంబుగా మాహితాదేశముల్ సేయఁగా మాకు ధర్మంబు. కామాశుగాలోకనా! ఏల కామాతురత్వంబునుం జెంద, రామా! భవత్సంగతిన్ మున్నుగామా, త్రిలోకాభిరామాంబరానేకహేమాదులున్ నీకునీమా. కులోత్తంస! నే మాకులత్వంబునుంబొంద మామాట లేపాట వేమాటులాలింపువారిన్ నిరీకింపకీమానవాధిశుపై మానసంబేల పట్టించెదే. ముద్దుపట్టీ, భవచ్చాతురిం బట్టి సర్వజ్ఞ్సింగ క్షమానాథుఁ దప్పించి దర్పించి లోకత్రయిన్ నీకునర్పింతునే. మారునిం జారుఁ గావించి రప్పింతునే. బ్రాఁతియేపైడి? నాపైఁడి! ఏపైఁడిలేదింటిలో? వింతివా రాచపోరామి యిట్టిట్టుఁ బోరామికిన్ మూలమే. మేలమే? ఇందునవ్యారవిందాననా! ముందు విందాననే లాట కఋణాట పాంచాల బంగాళ చోళాది రాజన్య కన్యల్ వయోరూప ధన్యల్ సదాసక్తలై దాసి యున్నారటే. రారటేపాసి. తత్పాదరాజీవసందర్శ నారంభ సంరంబులై వీతహృద్దంభులై కుంభినీశుల్ బహూపాయనద్రవ్యహస్తుల్ ప్రశస్తుల్ హమాభక్తి నక్తందివంబుల్ ప్రవేశించియున్నారు. కన్నారు విన్నారు లోకుల్. వరాలోక నీకేల లీలావకాశంబు సిద్ధించు? సిద్ధించెనా మన్మథాకారుతోఁ గూడి క్రీడింపఁగాఁ బోలదే. వానివాణిన్ తద్భాహుపీఠిన్ దిశాకుంభి కుంభీన సాగేంద్ర కూర్మాదులం బాసి కూర్మిన్ విలోకంబులన్ లచ్చి వర్తించునే. దిక్కులందెల్లఁగీర్తుల్ ప్రవతించునే. దుర్లభుండే! బహుప్రేయసీవల్లభుండే! సదైకానుషంగంబు భంగంబు పణ్యాంగనాజాతికిన్ నీతికిందప్పితేఁజెప్పితిం గూన! సిద్ధంబు తద్ధాతమున్ వారభామాతనూజాతకున్ నేతగా మాతనూజ్జాత గావించె. నిర్ణీతమే యేతదర్థంబు మర్యాద నిమ్మేదిన్ వారమే నాదినుండిం బ్రయోగింతునే దాదినై. కామశాస్త్రాదివిద్యాసమేతన్ భన్మాత నుద్దామమాయాప్రభూతన్ గురంగీవిలోకా నిరంగీకృతుల్ మాని నామాట నీమాటు పాటింపవే. నందనీ! నిందనీయంబు గాదే. మహానందనీయంబుఁ జిత్తంబులోనందనీవే. జనానందనీయా! కఠోరాచలవ్రాత కాఠిణ్యమున్ డింప, రత్నాకరశ్రేణిలోఁతున్ నివేదింప, విత్తేశుగేహంబునున్ రిత్తసేయన్, జగచ్చక్షువుం గన్నుమూయన్, సదాగామినాఁకట్ట, నుద్యద్భుజంగావలింబట్ట, వారాంగనాజాతికిన్ న్యాయమే.మామకన్యాయసంపన్నవై పన్ని యోకన్య నీవన్యులన్ బౌరసంపన్నులన్ భిన్నులన్ ఖిన్నులన్ జేసి మన్మందిరాళింద భూమండలాసన్నులం జేయుమీ. రాచబిడ్డేటికే బిడ్డ! వాచాటతల్ సాఁగవే. సాఁగినన్ నీకు జూదంబులా, కాక వీణావినోదంబులా, గద్య పద్యానువాదంబులా, మాళవీముఖ్యరాగానుగానంబులా, దండలాస్యాది నృత్యవధానంబులా, ఇంద్రజాలాది మాయా విధానంబులా, వశ్యమంత్ర ప్రయోగోపసంహార విద్యావిచారంబులా, మందిరారామ వాటీలతాజాల మూలాభిషేక ప్రచారంబులా,హేమదోలావరోహంబులా, నీరజవాసవీచీసమూహావగాహంబులా, బంధుగేహప్రవేశంబులా,రాజహంసావళీ మందయానోపదేశంబులా, నీలకంఠావళీ నృత్యశిఖావిశేషంబులా, కాముకవ్రాతచిత్త ప్రమోషంబులా, బొమ్మరిండ్లాటలా, పాతలా, పాటలామోద, రాజోపకంఠానంబుల్ కఠోరాసిధారావలేహంబులే, సింహయోగంబులే, సర్పవాల్మీక భోగంబులే, శైలశృంగాగ్రవీథీ విహారావధానంబులే, తుంగతాళాగ్రకోటీతపస్సంవిధానంబులే, మత్తశార్ధూలకుంజ ప్రచారంబులే, సింధుమధ్యప్రతారంబులే, గంధశుండాల శుండావినోదంబులే, సప్రమాదంబులే, కొమ్మ, మాకొమ్మదే రాచసఖ్యం బసౌఖ్యంబు మేమొల్ల, మేమొల్లముల్ మాకులాభంబులే? డింభ కేవేళ నమ్మోము సొంపారు, నేవేళఁ బాలిండ్లు పెంపారు, నేవేళ ఫాలంబున గుంతల శ్రేణుల్లలాడు, నేవేళ మైదీఁగయున్ వీడు, నేవేళనాయాస మున్నూడు నంచు బ్రతీక్షింప నీ వంతవై యింతవై నేఁడు భూపాలుపాలై ప్రవర్తించుచోఁ గంబుకంఠీ, భవద్దర్శనోత్కంఠతన్ రాజగేహోపకంఠంబులన్ వచ్చునీవారి వారింతురే వారి దౌవారుకుల్ వారధర్మంబు వారంచు దుర్వారులై. తన్మహాగేహ నిర్యూహ సేవారతాయాత భూపాలక వ్రాత వేదండ గండస్థలీ నిస్సార ద్దానధరావళీ జాతజంబాల సంఘంబు దుర్లంఘనీయంబు మాకున్, మహాదుర్గమంబృ చొరన్ నిర్గమింపన్, మహోత్సాహవై వత్సా! మత్సాహసచర్యంబు కార్యంబు గైకొందు రమ్మంచు లెమ్మంచు వల్లించు తల్లిన్ ధనాదాన 

వారకన్య తల్లి పల్కు నిరాకరించుట

విద్యామతల్లిన్ విటస్వాంతభల్లిన్ నిరూపించి కోపించి బుద్ధింబ్రదీపించి ' అమ్మా! విననొల్లఁబొమ్మా, విచారించుకొమ్మా, భవన్నీతి దుర్నీతి, సన్మానుషం బింతయున్ లేని దుర్మానవశ్రేణి నీవేల యీవేలభూషించెదే? ఏమిభాషించెదే? ఏలనన్నుం బ్రమోషించెడే. రాయ చౌహత్తమమల్లున్ వధూటీ సరోజాతభల్లున్ మహారాజవేశ్యాభుజంగున్ హయనేకపగ్రామహేమాది నానామహాదాన చంగున్ వధూలోకపాంచాలు సర్వజ్ఞసింగక్షమాపాలుఁ గైకొంట తప్పే? కకుప్పాలసంకాశుఁడే. వాని యొప్పుల్ సతుల్ చెప్పఋఏ? ఏల నొప్పింప? మాతల్ తనూజాతలన్ జాతవిత్తాశలై యాశలం బేశలత్వంబు లే కర్నిలింబాసినారోటు? రారోటు రక్షారతిన్? గోర్రుకులీరోటు? నీవింత సెగ్గింప నెగ్గేమి గావించితిన్. లోకనిర్మాత నిర్మాతగాఁ జేయకేల సదురాత్మఁగావించె! విజ్ఞాతయోషా మనోవృత్త సంఘాతవున్, మాతవున్, గామసిద్ధాంత విఖ్యాతవున్, జూడ నేతద్దురాలాపముల్ చిత్తసంతాపముల్గాఁ బ్రయోగింతురే? కూఁతుఁ జింతానదిన్ ముంతురే? పిన్ననాఁడెల్ల నాఁడెవ్వరింగోరవే, చేరవే? మున్ను రంభోర్వశీమేనకాదుల్ సుకందర్ప సిద్ధాంతవేదుల్ వశీకార విద్యాధురీణుల్ ప్రవీణుల్ వరశ్రేణి నూహింపరే! చూచి మోహింపరే! వార లూహింపరే నీతులన్?  నిర్దయాలాపవైపాపవై పాపవేల మనోజవ్యథన్? నిన్ను నేమందు? నేమందులన్ మానదే మానసత్త్వంబు. చింతింపుమవ్వా! విభుండేమి దవ్వా? ఎఱిగించి రప్పించెదో, కాక, కామానలజ్వాలకున్ నన్ను నొప్పించెదో! ఇంత ఱంతేల నీకుం గొఱంతేలసద్ద్రావ్యముల్. తల్లి నే నెల్లవేళన్ మనోజాజ్ఞిచేఁ గంది లోఁ గుందగా మ్రంద, వీమందటల్ చాలు ముందేటికిం గంటివే? కెంటసంబేల ఘంటాభవై మ్రోసెదే? అన్యకుం గన్యఁగానైతి. ఉద్దామశృంగారుపై దీనమందారుపై భూమిభృద్గాయగోవాళుపైఁ గామినీలోలుపై రాయశుండాలహర్యక్షుపై రాయకందర్ప ఫాలాక్షుపై రాయగోపాంగనాబృందగోవిందుపై సంతతానందుపైఁ బోచమాంబాలసద్గర్భ సంజాతుపై లోకవిఖ్యాతుపైఁ బాదపీఠాంకితారాతిభూపావళీపాలుపై, సింగభూపాలిపై వ్రాలి, నాచిత్త మున్మత్తమై సోలి, కామానలాయుత్తమై రాదు తేరాదు. నే నామరుండైన గౌరీవరుండైన వాణీధరుండైన లక్ష్మీవిభుండైన దేవప్రభుండైన నన్యున్ మదిం గోరఁగా నొల్లనే. ఉల్లసత్ఫుల్లమందార రాజన్మరందంబు నదంబునం గ్రోలు మత్తాళిదుత్తూరముం గోరునే? హేమరాజీవరాజీరజోరాజితాకాశ గంగానదీలోల కల్లోల డోలాచల ద్రాజహంసంబు శైవాలజంబాల గండూపదీభేకభేకీ ఢులీ సంకులాసార కాసారముం జేరునే? మండితాఖండలానీత జీమూత నిర్యత్పయోధారలంద్రావుసారంగి కుంభంతరాంభఃప్రపూరంబులం ద్రావునే? మాధవోజ్జాత చూతాంకురస్వాదలీలాలసత్కోకిలేంద్రంబు ఝుల్లీరవక్రూర భిల్లాతకీశాఖకుం బోవునే? సింగభూపాలబాహా పరీరంభ సంరంభ సంజాత సంతోషముం గోరు యోషాశిరోరత్న మాశించునే నీచసంభోగ మంబా! కుతర్కావలంబా! చలంబా! విలం బానులాపంబులన్ బాలసూర్యభూనిం బాయనాడన్. పురోభాగినీ! భోగినీ రాజుకంటెన్ మహాభాగు, నాభాగ సౌభాగ్య శోభాగరిష్ఠున్, వరిష్ఠుం బ్రవేశించి నీతిం బ్రకాశించి, నృత్తవధానంబులన్ మంజుగానంబులన్ జిత్తమార్జింతునే. విత్తమున్ లేమి వర్జింతునే. ఎట్టిదిన్ విత్తమే రిత్తమై యేటికే? నిత్యదంభా! దురారంభయుక్తిం బ్రమోషింప విద్వేషినే? ఏలనే గోలనే బాలనే, మానలెనే నరధీశచూడామణిన్, వారకన్యా జనగ్రామణీ, పాపజాతీ! భవజ్జాతి దుర్జాతి పొ ' మ్మంచు ' లె 'మ్మంచు 'నోచెల్లనేఁజెల్ల రేచెర్లగోత్రోద్భవున్ మానలే ' నంచు ' నాయన్నాలా, యన్యులం జేరబో ' నంచు హృద్భల్లితో వక్రవాగ్భిల్లితోఁ దల్లితో మాటఁ జాలించి ధైర్యంబు గీలించి సంజాత శాతోదరిన్ సోదరిం జూచి 

వారకన్య సోదరిని దనవెత దీర్ప వేఁడుట

'అక్కా! ప్రసూనాస్త్రుధిక్కారముం జూచితే నేడు రాకేందుతాకం దురాకంపముం బొందె డెందంబు. చైతన్య సంచాలియై కీలియై గాలి ఏతెంచె. కోదండియై, తూణియై, బాణియై, కంపిత ప్రాణియై, కాముకారాతి తోఁతెంచె. వాసంతవేళా రమాకంద మాకందశాఖావళిం గోకిలారావకోలాహలంబుల్ విటస్వాంతహాలాహలంబుల్ దిశల్ మించి యేతెంచెనే. నేఁడు బాలామనోతంతుతోఁ గంతుతో, సింగభూమీశుతో, భోగదేవేశుతో, న న్ని వేదింపవే. కాము సంతాపమున్ డింపవే డింపి 

వారకన్యసోదరి దానివలపును సింగరాజునకుఁదెలిపి కావవేఁడుట.

పుణ్యంబునం బోఁగదే, రాఁగదే, లేగదే, వేగదే ' యంచుఁజింతించు నాత్మానుజాతందనూజాతశంకాసమేతం గృశీభూతఁగమ్గెంచు ' బాలా! లలాటాక్షు సేవింపుమీ, రాహుభావింపుమీ, శేషభోగిం బ్రకర్షింపుమీ, చంపకశ్రేణి వర్షింపుమీ ' యంచుభీతిన్ నివారించి నీతిన్ విచారించి యారామ యారామసౌధంత రాళస్థలిన్ నర్తనాగారవేదికన్ మణిస్వర్ణ పర్యాంకికా భాసమానున్, మనోభూసమానున్, ఘనున్, రావుసింగక్షమానాధపౌత్రున్, సమీచీనరేచర్లగోత్రంబు సంజాతమిత్రున్, మహోదారచారిత్రు, సర్వజ్ఞసింగోర్వరాధ్యక్షు నీక్షించి దండప్రణామంబు సాపేక్షఁ గావించి హస్తాబ్జముల్ మోడ్చి ' దేవా! భన్న్యస్త సౌజన్య ధన్యన్, జగన్మాన్యఁ, గన్యన్, నిరన్యాంకపీఠాధిరోహన్, నిరన్యోపగూహన్, నిరన్నాభిలాషన్, నిరన్యాభిభాషన్, నిరన్యావకాశన్, నిరన్యప్రకశన్, బ్రసూలోచనక్షిప్తభాష్పంబుపూరన్, మనోజాతబాణావళీ శంకితప్రాణభారన్, సఖీమానసన్యస్త చింతాసమూహన్, భగిన్యంక సం

సింగరాజు వారకన్యనుజేపట్టీ భోగినిఁగాఁజేయుట

ప్రాపితానేకదేహన్, భవద్వైభవాకృష్టచిత్తన్ బరాయుత్త వృత్తన్ గృపం జూడు ' మంచు ప్రశసింప నాభోగదేవేంద్రుఁ దా సత్యభాషా హరిశ్చంద్రుఁ డాకామినీలోకపాంచలుఁ డాసింగభూపలుఁ డాబాల నాబాలశీతాంశుఫాలన్, సరోజతహస్తన్, బ్రశస్తన్, శుకాధీశవాణిన్, లసన్నీలవేణిన్, మృగేంద్రావలగ్నన్, మనోకాగ్నిమగ్నన్, దయదృష్టి రావించి భావించి నెయ్యంబుగావించి బాహాపరీరంభసమ్రంభనిర్ముక్త సంతాపఁ గావించి కందర్పకేళిన్ వినోదించి సద్భోగినింగాఁ బ్రసాదించి తన్మాత నుద్యద్గజారూఢఁ జేయించి విఖ్యాతి మ్రోయించియిష్టంబు లిప్పించి యొప్పెంగడున్.

ఉ: పండితకీర్తనీయుఁ డగుబమ్మెరపోతన యాసుధాంశుమా
ర్తండకులాచలాంబునిధితారకమై విలసిల్ల భోగినీ
దండకమున్ రచించె బహుదానవిహర్తకు రావుసింగభూ
మండలభర్తకున్ విమతమానవనాధమదాపహర్తకున్

Friday, July 13, 2012

బమ్మెర పోతనామాత్య కృత "నారాయణ శతకం" - Part 2


మ. పసులంగాపరి యేమెఱుంగు మధురప్రాయోల్లాసద్వృత్తవా
గ్విసరారావము మోవిదా వెదురు గ్రోవిం బెట్టి నాఁడంచు నిన్
గసటుల్ సేయఁగ నాఁడు గోపికల తద్గానంబులన్ మన్మథ
వ్యసనాసక్తలఁ జేయుచందములు నేవర్ణింతు నారాయణా

మ. జడియొంతేఁ దడవయ్యె జెయ్యియలసెన్ శైలంబు మాచేతులం
దిడుమన్నన్ జిరునవ్వుతో వదలినన్ హీనోక్తిగీపెట్టనె
క్కుడుగోవుల్ బ్రియమంద నింద్రుఁ డడలంగోవర్ధనాద్రీద్రమున్
గొడుగైయుండగఁ గేలఁబూనితిగదాగోవింద నారాయణా

మ. లలితాకుంచితవేణి యందడవి మొల్లల్ జాఱ ఫాలస్థలిన్
దిలకం బొయ్యనజాఱఁ గుండలరుచుల్ దీపింపలేఁ జెక్కులన్
మొలకన్నవ్వుల చూపులోరగిల మేన్మువ్వంకన్ బోవఁగ
నలిగైకొందువుగాదె నీవు మురళీనాట్యంబు నారాయణా

శా. మాపాలం గడుగ్రొవ్వి గోపికలతో మత్తిల్లి వర్తింతువే
మాపాలెంబుల వచ్చియుండుదు వెసన్మాపాలలో నుండుమీ
మాపాలైన సుఖాబ్ధిలో మునుగుచున్ మన్నించి తాగొల్లలన్
మాపాంగల వేల్పు నీవెయని కా మన్నింతు నారాయణా.

మ. ఒక కాంతామణి కొక్కడీవు మఱియున్నొక్కరై కొక్కండవై
సకలస్త్రీలకు సంతసంబలర రసక్రీడతన్మధ్య క
ల్పకమూలంబున వేణునాదరస మొప్పంగా, బదార్వేలగో
పికలంజెంది వినోద మొందునెడ  నీపెంపొప్పు నారాయణా

మ. లలితంబైన భవత్తనూవిలసనన్ లావణ్యదివ్యామృతం
బలుఁగుల్వారఁగ నీకటాక్షమునఁ దామందంద గోపాంగనల్
తలఁపుల్పాదులుకట్టి కందళితనూత్న శ్రీలు వాటింతురా,
నెలతల్ తీవెలు చైత్రవిస్ఫురణమౌ నీయొప్పు నారాయణా

శా. లీలన్ బూతకిప్రాణవాయువులు పాలిండ్లందు వెళ్ళించి దు
శ్శాలుండై చనుబండిదానవు వెసంజిందై పడందన్ని యా
రోలన్మద్దులు గూల్చి ధేనుదనుజున్ రోఁజంగ నీల్గించి వే
కూలం గంసునిఁగొట్టి గోపికలకోర్కుల్ దీర్తు నారాయణా

మ. రసనాగ్రంబున నీదునామరుచియున్ రమ్యంబుగాఁ జెవ్లుకు
న్నసలారంగ భవత్కథాభిరతియున్ హస్తాబ్జ ముగ్మంబులన్
వెసనీపాదసుపూజితాదియుగమున్ విజ్ఞాన మధ్యాత్మకున్
వెస నింపొందనివాఁడు దాఁ బశువు సూవేదాత్మ నారాయణా

మ. వరకాళిందితరంగడోలికలలో వైకుంఠధామంబులో
వెరవొప్పార నయోధ్యలో మధురలో వ్రేపల్లెలో ద్వారకా
పురిలో నాడెడు భంగి నాదుమదిలో భూరిప్రసన్నాననాం
బురుహం బొప్ప నటించుటొప్పును సితాంభోజాక్ష నారాయణా

శా. చల్లల్వేఱొకయూర నమ్ముకొను నాసంబొవుచోఁ ద్రోవ నీ
వుల్లాసంబున నడ్డకట్టి మదనోద్యోగానులాపంబులన్
చల్లన్ జల్లనిచూపు జల్లుమని గోపస్త్రీలపైఁ జల్లు మీ
చల్లంబోరు తెఱంగు జిత్తమున నే జర్చింతు నారాయణా

మ. కలయన్వేదములున్ బురాణములు బ్రఖ్యాతంబుగా తెల్పి మీ
వలనన్ భక్తిహీనుఁడైనపిదపన్ వ్యర్థప్రయత్నంబెపో
గులకాంతామణి గొడ్డువోయినగతిం గ్రొవ్వారు సస్యంబు దా
ఫలకాలంబున నీచపోవుపగిదిన్ పద్మాక్ష నారాయణా

శా. స్నానంబుల్ నదులందుజేయుట గజస్నానంబు చందంబగున్
మౌనంబొప్ప జపించువేదమటనీ మధ్యంబులో నేడ్పగున్
నానాహోమములెల్ల బూడిదలలోన న్వేల్చునెయ్యై చను
న్నినామోక్తియు నీపదాబ్జరతియున్ లేకున్న నారాయణా

మ. అలనీటందగు రొంపిపైఁ జిలికిన న్నానీట నేపాయు నా
యిలపాపంబులు దుర్భరత్వము మహోహేయంబునం బొందినం
బలువై జీవుని దొప్పఁ దోఁగినవి యీబాహ్యంబునం బాయునే
పొలియుంగాక భవత్సుపాదజలముం బ్రోక్షింప నారాయణా

మ. తనచిత్తాబ్జము మీపదాబ్జములకుం దాత్పర్య సద్భక్తితం
తున బంధించిన బంధనంబుకతనం దుష్పాపపుంజంబు లె
ల్లను విచ్చిన్నములై యడంగు మహిమోల్లాసాబ్ధియైనట్టి దా
సున కింపొందును మోక్షవైభవము దా సుశ్లోక నారాయణా

మ. తనువుం జీవుఁడు నేకమైనపిదపన్ ధర్మక్రియారంభుఁడై
యనయంబున్మది దన్నెఱుంగక తుదిన్నామాయచే మగ్నుఁడై
తనుతత్వాది వియోగమైనపిదపం దానేర్చునే నీదుద
ర్శన మింపారఁగ భక్తివైభవ మహాసంకాశ నారాయణా

మ. తనకున్ సాత్వికసంపదాన్విత మహాదాసోహ భావంబునన్
ననయంబున్మది నన్యదైనభజనం బారంగ దూలింపుచున్
జనితాహ్లాదముతోడ నీ చరణముల్ సద్భక్తి పూజించి నిన్
గనుగొన్నంతనె కల్మషంబు లడఁగుం గర్మఘ్న నారాయణా

మ. పరికింపన్ హరిభక్తి భేషజునకున్ భవ్యంబుగా మీఁద మీ
చరణాంభోరుహ దర్శనంబు గలదే సంప్రీతి నెట్లన్నఁ దా
ధరలోఁ జోరుఁడు గన్న దుస్తర పరద్రవ్యంబుపై నాశలం
బొరయన్నేర్చునె దుర్లభంబగు గృపాంభోజాక్ష నారాయణాఉ

మ. పరమజ్ఞాన వివేక పూరిత మహాభవ్యాంతరాళంబునన్
పరగ న్నీ నిజనామమంత్ర మొనరన్ భక్తిన్ననుష్ఠింపుచుం
దురితాన్వేషణ కాలభూతము వెసన్ దూలంగ వాకట్టు వాఁ
డరుగున్ భవ్యపదంబు నొందుటకునై యవ్యక్త నారాయణా

మ. సరిఘోరంధక బోధకారణ విపత్సంసార మాలిన్యమున్
పరమానంద సుబోధకారణ లసద్భస్మంబు పై నూఁది యా
నిరతజ్ఞానసుకాంతి దర్పణమున న్నిస్సంగుఁడై తన్నుదా
నరయం గాంచిన వాఁడు నిన్నుఁ గనువాఁడబ్జాక్ష నారాయణా

మ. పరుషాలాపములాడ నోడి మదినీపాపార్జన నారంభుఁడై
నిరసించేరికిఁ గీడుసేయక మది న్నిర్ముక్త కర్ముండునై
పరమానంద నిషేధముల్ సమముగా భావించి వీక్షించునా
పరమజ్ఞాని భవత్కృపం బొరయ నో పద్మాక్ష నారాయణా

మ. ఒరులం దన్ను నెఱుంగు నియ్యెఱుకయు న్నొప్పార నేకాంతమం
దరయంబైపడు నన్యభామినులపై నాకాంక్షదూరత్వమున్
మరణావస్ఠను నీదునామములె సన్మానంబునం దోఁచుటల్
ధరలోన న్నివి దుర్లభంబులు సుధాధామాక్ష నారాయణా

మ. వెరవొప్ప న్బహుశాస్త్రమంత్రము లొగి న్వీక్షించి వేతెల్పిమీ
వరనామామృతపూర మానుచుఁ దగన్ వైరాగ్యభావంబునన్
సరి నశ్రాంతముఁ గోరువారు పిదపన్ సంద్సారమాతుఃపయో
ధరదుగ్ధంబులు గ్రోలనేరరు వెసన్ దైత్యారి నారాయణా

శా. వేదంబందు సునిశ్చయుండగు మహా వేల్పెవ్వఁడో యంచు నా
వేదవ్యాసపరాశరుల్ వెదకిన న్వేఱొండు లేఁడంచు మీ
పాదాంభోజము లెల్లప్రొద్దు మదిలో భావింతు రత్యున్నతిన్
శ్రీదేవీ వదనారవింద మధుపా శ్రీరంగా నారాయణా

మ. సుతదారాప్తజనాది విత్తములపై శూన్యాభిలాషుండునై
యతనోద్రేకయుతంబులై పొదలునయ్యై యింద్రియవ్రాతముల్
మృతిఁబొందించి దమంబునన్ శమమున్ మీఱంగవర్తించు ని
ర్గతసంసారి భవత్కృపంబొరయ నో కంజాక్ష నారాయణా

మ. ప్రమదం బారగఁ పుణ్యకాలగతులన్ భక్తిన్ననుష్ఠింపుచున్
నమర న్నన్న సువర్ణగోసలిల కన్యాధారుణిగ్రామదా
నము లామ్నాయవిధోక్తి భూసురులకున్ సన్మార్గుఁడై యిచ్చువాఁ
డమరేంద్రార్చిత వైభవోన్నతుఁడగు న్నామీఁద నారాయణా

మ. ఇల నెవ్వారిమనంబులో నెఱుకదా నెంతెంత గల్గుండునా
కొలదింజెంది వెలుంగుచుందు కలయన్గోవింద నీరూపులన్
యలర న్నంబు మితంబులై సరసిలో నంభోరుహంబుల్ దగన్
నిలనొప్పారెడుతందమొందెదెపుడు న్నీలాంగ నారాయణా

మ. మదిలో నుత్తమభక్తి పీఠముపయిన్ మానాథ మీపాదముల్
గదియం జేర్చినవానికేనొడయఁడన్ గాదంచు సత్యున్నతిన్
పదిలుండై సమవర్తి మృత్యువునకున్ బాఠంబుగాఁ బల్కు మీ
పదపద్మార్చకు లెంతపుణ్యులో కృపాపారీణ నారాయణా

మ. కులమెన్నంగొలదేల యేకులజుఁడుం గోత్రాభి మానాభిలా
షలు నజ్ఞానము బాసి జ్ఞానము మదిన్ సంధించి శుద్ధాత్ముఁడై
యలరారం బరుసంబుసోఁకు నినుమున్ హేమాకృతస్తోమమై
వెలయు న్నాగతి వాఁడుముక్తికరుగున్ వేదాత్మ నారాయణా

మ. నిరతానందనియోగులై నియతులై నిర్భాగ్యులై నీచులై
కరుణాహీనమనస్కులై మలినులై కష్టాత్ములై నష్టులై
పరుషవ్యాధినిబద్ధులై పతితులై భగ్నంగులై మ్రగ్గువై రరయ
న్నిన్నొగి నాత్మయుం దిడనివా రబ్జాక్ష నారాయణా

మ. ఘనభోగాస్పదులై గతౌఘమతులై కారుణ్యలై ముక్తులై
ధనకీర్తిప్రదులై దయాభిరతులై ధర్మాత్ములై నిత్యులై
మనుజాధీశ్వరులై మనోజనిభులై మాన్యస్థులై స్వస్థులై
యొవరన్నొప్పెడువారు నీపదరుచుల్ యూహించు నారాయణా

మ. విదితామ్నాయ నికాయభూతములలో విజ్ఞానసంపత్కళా
స్పదయోగీంద్ర మనస్సరోజములలో బ్రహ్మేంద్రదిక్పాలక
త్రిదశవ్రాతకిరీటరత్నములలో దీపించుచున్నట్టి మీ
పదపద్మంబులు భావగేహమున నే భావింతు నారాయణా

మ. వెలయన్ యౌవనకాలమునందు మరుడుఁన్ వృద్ధప్యకాలంబునన్
బలురోగంబులు నంత్యమందు యముఁడుం బాధింపఁనట్లైన యీ
పలుజన్మంబులు చాలదూలితి ననుం బాలింపవే దేవ మీ
ఫలితానంద దయావలోకనము నాపైఁజూపు నారాయణా

మ. బలుకర్మాయుత పాశబంధవితతిన్ బాహాపరిశ్రేణికిన్
జలయంత్రాన్వితబంధయాతనగతిన్ సంసారకూపంబులో
నలరం ద్రిమ్మరుచుండు నన్ను నకటా! యార్తుండనై వేఁడెదన్
వెలయ న్నీకృపచేతఁ జేకొనవె నన్ వేవేగ నారాయణా

మ. మమహంకారవికారసన్నిభ మహామత్తాది లోభాంధకా
రముచే ముక్తికి నేఁగుమార్గ మెఱుగన్ రాదింక నాలోన
విమలాపాంగదయాదివాకరరుచిన్ వెల్గింపు మింపార నో
కమలానంద విహారవక్షలలితా! కంజాక్ష నారాయణా

మ. పరిపంథిక్రియ నొత్తి వెంటఁబడు నప్పాపంబుఁ దూలించి మీ
చరణాబ్జస్థితిపంజరంబు శరణేచ్చం జొచ్చితిం గావుమీ
బిరుదుం జూడుము మీరు సూడఁగ భవధ్భృత్యుండు దుఃఖంబులం
బొరయ న్మీకపకీర్తిగాదె శరదాంభోజాక్ష నారాయణా

మ. సతతాచారము సూనృంతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్
నతి శాంతత్వము చిత్తశుద్ధి కరమున్ నధ్యాత్మయున్ ధ్యానమున్
దృతియున్ ధర్మము సర్వజీవహితముం దూరంబుగాకుండ స
మ్మతికిం జేరువ మీ నివాససుఖమున్ మానాథ నారాయణా

మ. భవనాసిన్ గయ తుంగభద్ర యమునన్ భాగీరథిం గృష్ణ
వేత్రావతి న్నర్మద పెన్న గౌతమి పయోరాశి న్వియద్గంగయుం
దవగాహంబున నైనపుణ్యములు బెంపారంగ నేఁ డిచ్చటన్
భవదంఘ్రీ స్మరణంబునం గలుగు నోపద్మాక్ష నారాయణా

మ. ధర గ్రామాధిపు నింటిదాసుఁడు వెసం దాద్రోహముం జేసినన్
పరగం జెల్లుట సూచితీ భువన సంపాద్యుండ వైనట్టి మీ
వరదాసావలి దానదాసినని దుర్వారౌఘముల్ జేసితిన్
కరుణంజేకొని కావుమయ్య త్రిజగత్కల్యాణ నారాయణా

మ. గణుతింపన్ బహుధర్మశాస్త్ర నిగమౌఘం బెప్పుడు న్ని న్న కా
రణబంధుండనిచెప్ప నతైఱఁగు దూరంబందకుండంగనే
బ్రణతుల్ జేసెదఁ గొంతయైన గణుతింపం బాడిలేకుండినన్
ఋణమానానుతి నీవు శ్రీపతివి నీకేలప్పు? నారాయణా

మ. కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై యీశ మీ
శరణంబన్నఁ గృశానుభాను శతతేజస్ఫూర్తియైనట్టి మీ
కరచక్రంబున నక్రకంఠము వెసన్ ఖండించి మించెం దయా
పరసద్భక్తభయానక ప్రకర సత్ప్రాకట్య నారాయణా

శా. ఏభావంబున నిన్ దలంచె గజయూధేంద్రుండు ఆపన్నుఁడై
యేభావంబున ద్రౌపదయ్యెడ రమాధీశా యనె న్వాయసం
బేభావంబున నీశరణ్య మనెనో యీనీకృపాదృష్టిచే
నాభావంబున నీతలంపుఁ గలుగ న్నాకిమ్ము నారాయణా

శా. నీలగ్రీవుఁడు చేతిపున్క విడిచె న్నీయింతి భిక్షంబునిన్
నీలగ్రీవుఁడు యీశ్వరాఖ్యఁ దనరె న్నీనామజప్యంబునన్
నీలగ్రీవుఁడు మించిత్రుంచెఁ బురముల్ నీ ప్రాపు సేవించినన్
నీలగ్రీవమఖాబ్జభాస్కరకృపానిత్యాత్మ నారాయణా

మ. నినువర్ణింపనివాఁడు మూఁగ మదిలో నీనామమున్ వీనులన్
విని మోధింపనివాండు చెవ్డుమరినిన్ వేడ్కన్ మనోవీధినిన్
గనిపూజింపనివాఁడు నాశకరుఁడౌ కర్మక్రియారంభుండై
తనలోఁ గాననివాఁడు నీచమతివో తత్వజ్ఞ నారాయణా

మ. నినువర్ణింపని నీచబంధమతి దానిర్మగ్నమూఢాత్ముఁడై
పెనుదైవంబులఁ గోరి తా మనమునన్ సేవించుచందంబుతా
ననలం బారిన భూతియందు వెలయ న్నాజ్యాహుతుల్ పూనివే
ల్చినచందంబున వ్యర్ధమై తనరు, జూచిద్రూప నారాయణా

మ. నిను వర్ణింపని జిహ్వదాఁబదటికా? నీలాభ్రదేహాంగకా
నినునాలింపనిచెవులు దాఁబదటికా! నీరజపత్రేక్షణా
నినుఁబూజింపని కేలు దాఁ బదటికా? నిర్వాహకక్ష్మాతలా
నినుఁ జింతింపనియాత్మ దాఁబదటికా? నిర్వాణ నారాయణా

శా. నీవేతల్లివి నీవేతండ్రి వరయన్నీవే జగన్నధుఁడౌ
నీవేనిశ్చలబాంధవుణ్డ వరయ న్నీవేమునిస్తుత్యుఁడౌ
నీవేశంకరమూలమంత్ర మరయన్ నీవే జగత్కర్తవున్
నీవేదిక్కను వారి వారలె కడు న్నీవారు నారాయణా

మ. అపరాధంబులు నిన్ను నమ్మి వినుమే నాజన్మపర్యంతమున్
విపరీతంబుగఁ జేసినాఁడనిఁక నీవేదిక్కు నాలోనికిన్
గపటం బింతయులేక దండధరుకుం గట్టీక రక్షింపుమీ
కృపకుం బాత్రుఁడనయ్య ధర్మపురిలక్ష్మీనాథ నారాయణా

శా. చెల్లంజేసితి పాతకంబులు మదిన్ శ్రీనాధ మీనామముల్
పొల్లుల్ బోవనినమ్మి పద్యశతమున్ బూర్ణంబుగాఁ జెప్పితిన్
చెల్లం బోనను నమ్మె వీఁడని దయం జేపట్టి రక్షింపుమీ
తల్లిందండ్రియు నీవుగాక యొరులో తర్కింప నారాయణా

మ. నరసింహాచ్యుత వాసుదేవ విక సన్నాళీకపత్రాక్షభూ
ధరగోవిందముకుందకేశవ జగత్త్రాతాహితల్పాంబుజో
దరదామోదరతార్క్ష్యవాహనమహాదైత్యారివైకుంఠమం
దిరపీతాంబరభక్తవత్సల కృపన్ దీపింపు నారాయణా

మ. కడకంట గడలేని సంపదలొగిం గావింపు లక్ష్మీశపా
ల్కడలిన్ బన్నగశాయివై  భువనముల్ గల్పించు సత్పుత్రినిన్
బొడమన్ జేసిన నాభిపంకజ జగత్పుణ్యాత్మ భాగీరథీ
పడతింగన్న పదార విందముల నే భావింతు నారాయణా

మ. తపముల్ మంత్రసమస్త యజ్ఞఫలముల్ దానక్రియారంభముల్
జపముల్ పుణ్యసుతీర్ధసేవాఫలముల్ సద్వేదవిజ్ఞానమున్
ఉపవాస వ్రతశీలకర్మ ఫలముల్ యొప్పార నిన్నాత్మలో
నుపమింపం గలవారికే గలుగు వేయిన్నేల నారాయణా

శా. శ్రీనారాయణా యన్నఁ జాలు దురితశ్రేణి న్నివారింపఁగా
నానందస్థితి గల్గునంచు నిగమార్థానేక మెల్లప్పుడున్
నానాభంగులఁ జెప్ప నేను విని శ్రీనారాయణా యంచు ని
న్నేనేనెప్పుడు గొల్తు బ్రోవఁగదె తండ్రీ నన్ను నారాయణా

మ. కలితాఘౌఘ వినాశకారి యగుచుం గైవల్య సంధాయియై
నలి నొప్పారెడు మంత్రరాజ మగు నీనామంబు ప్రేమంబునన్
అలరన్నెవ్వాని వాక్కునం బొరయదో యన్నీచుదేహంబు దా
వెలయన్ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ నారాయణా

మ. రమణీయంబుగ నాదిమంబు నవతారంబున్ భవద్దివ్యరూ
పము నామామృతమున్ దలంప దశకప్రాప్తయ్యెఁ గృష్ణావతా
రము సుజ్ఞానము మోక్షమున్ ద్వివిధసంప్రాప్తిన్ శతాంధ్రఖ్యకా
వ్యము నర్పించితి మీ పదాబ్జములకున్ వైకుంఠ నారాయణా

శా. నీమూర్తుల్ గన నీకథల్ వినఁ దుదిన్ నీపాదనిర్మాల్య ని
ష్ఠామోదంబు నెఱుంగ, నీచరణతోయంబాడ, నైవేద్యముల్
నీమంబొప్ప భజింప నీజపము వర్ణింపన్ గృపం జేయవే
శ్రీమించన్ బహుజన్మజన్మములకున్ శ్రీయాది నారాయణా

ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన నారాయణ శతకంబున 
సర్వంబును సంపూర్ణము.