Saturday, February 28, 2015

సరస్వతీ వందన - ప్రబంద కుసుమాలు

ప్రబంధాలలోని కొన్ని సరస్వతీ ప్రార్ధనలు మీకోసం

1. వాణిన్  బురాణి పుస్తక
పాణిన్ శుకవాణిఁ గమలభవురాణి గుణ
శ్రేణి నలివేణి నుతగీ 
ర్వాణి గల్యాణిఁ గొల్తు వాక్చాతురికిన్

ప్రొఢకవి మల్లనార్య "ఏకాదశి మాహత్మ్యము" నుండి

2. సింహాసనంబు చారుసిత పుండరీకంబు, చెలికత్తె జిలువారు పలుకుఁ జిలుక
శృంగార కుసుమంబు చిన్ని చుక్కలరాజు, పసిఁడి కిన్నెరవీణ పలుకుఁదోడు
నలువనెమ్మోముఁ దమ్ములు కేళిగృహములు, తళుకుటద్దంబు సత్కవుల మనసు
వేదాదివిద్యలు విహరణస్థలములు, చక్కని రాయంచ యెక్కిరింత
యెవుడు నేదేవి కాదేవి యిందుకుంద
చంద్ర చందన మందారసార వర్ణ
శారదాదేవి మామక స్వాంతవీధి
నిండు వేడుక విహరించుచుండు గాత!

శ్రీనాథ మహాకవి "శృంగార నైషధము" నుండి

3. వీణాధర బింబోపమ 
శోణాధర మధుపనికర సురుచిరవిలాస
ద్వేణీభర పద్మోద్భవు
రాణి లసద్వాణి నన్నురక్షించు దయన్

కుమారదూర్జటి "కృష్ణరాయ విజయము" నుండి

4. సౌరతరంగిణీ కనకసారసరాజమరాళి కైవడిన్
హరి హిరణ్య గర్భ వదనాంతరసీమ వసించు వాణి శృం
గార సరోజపాణి నవకంధరవేణి, విలాసధోరణిన్
వారక నిచ్చ నిచ్చలు నివాసము చేయు మదీయ జిహ్వికన్

సముఖము వేంకటకృష్ణప్పనాయకుని "అహల్యా సంక్రందనము" నుండి

5. రవ రమణీయ కీరసుకరంబు నభీష్టఫలోదయంబు మా
ర్దవ సుమగంధయుక్తము సుధాసమవర్ణము గల్గి వర్ణనీ
యవిభుదలోక కల్పతరువై తగు పద్మజురాణి వర్తనో
త్సవము వహించుఁగాత నిరంతంబును మద్రసనాంచలంబునన్

కనుపర్తి అబ్బయామాత్యుని "అనిరుద్ధ చరిత్రము" నుండి

6. ఏసతిలావులేక నరులెవ్వరు నోరుమెదల్పలేరు ప
ద్మాసన వాసుదేవ నిటలాక్షులు లోనుగ నాత్రివిష్ట పా
వాసులు పుట్టుఁ జేరుఁ జెలువంబును నేరికిదాఁప రట్టి వా
నీసతి మన్ముఖాబ్జమున నిల్చి విశేష వరంబులీవుతన్

అనంతామాత్యుని "భోజరాజీయము" నుండి

7. వాణి న్వీణాపుస్తక
పాణిన్ శుకవాణి విపులభాసుర పులిన
శ్రోణి న్బలభిన్మణి జి
ద్వేణిం గమలభవురాణి వినుతింతు మదిన్

పాలవేకరి కదిరీపతి "శుకసప్తతి" నుండి

8. నెమలికి నాట దిద్దువగ నెయ్యపుఁజిల్కకు గౌళ మాధురిం
 దమియిడునేర్పు నీకు విదితం బగునింక వారాళిచాలిగా
త్రమున రహింపఁ జాలుటగదా! యరుదంచు విరించిమెచ్చ హా
సము ననువాతెఱం జొనుపు శారద పోల్చుఁ గృతీంద్రుసూక్తులన్

ఋగ్వేది వేంకటాచలపతి కవి "చంపూరామాయణం" నుండి

9. వాణికి మంజులవాణికి సువారిజ పుస్తక కీర వల్లకీ
పాణికి చక్రనీలసురభాసుర వేణికి రాజహంసకున్
ఖాణికి వేదవేద్య పదకంజయుగ ప్రణతిప్రవీణ గీ
ర్వాణికి పద్మసంభవునిరాణికి భక్తి నమస్కరించెదన్

ఏనుగు లక్ష్మణకవి "రామవిలాసము" నుండి

10. వరవస్తుప్రతిపత్తిధుర్య మగనైశ్వర్య మగు నైశ్వర్యంబు పంచాఁశద
క్షర సంసిద్ధసమస్త శబ్ధరచనా సంవ్యాప్తి మద్దీపమై
పరఁగ గల్పలతా సధర్మయగుచుం బ్రజ్ఞావిశేషాఢ్యులన్
గరుణం బ్రోచు సవిత్రి వాణిఁ ద్రిజగద్కల్యాణిఁ బ్రార్ధించెదన్

ఎఱ్ఱాప్రగ్గడ "హరివంశము" నుండి

11. వాణికిఁ జరణా నతగీ
ర్వాణికి నేణాంక శకలరత్నశలాకా
వేణికిఁ బుస్తక వీణా
పాణికి సద్భక్తితో నుపాసి యొనర్తున్

శ్రీనాధ మహాకవి "హరవిలాసము" నుండి

12. వాణి వైభవవిజితేం
ద్రాణి మాయమ్మ నలువరాణి వీణా
పాణి ఘనవేణి క
ల్యాణి నానాల్క కెక్కుమమ్మా లెమ్మా

పి. చిదంబరశాస్త్రి గారి "హైమవతీ విలాసము" నుండి

13. వీణా పుస్తకపాణి షట్పదలసద్వేణిన్ బృహత్సైకత
శ్రోణిన్ బద్మజురాణి సర్వసుగుణ క్షోణిన్ బురాణి న్నతేం
ద్రాణి న్నేత్రజితైణిఁ బాదగతగీర్వాణిన్ బ్రవృద్ధాశ్రిత
శ్రేణి న్వాణి నభిష్టసిద్ధికి మదిన్ సేవింతు నాశ్రాంతమున్

గోపీనాధము వేంకటకవి "గోపీనాధ రామాయణము" నుండి

14. ప్రణవపీఠంబున మంత్రపరంపరలు గొల్వ నుండు నేదేవి పేరోలగంబు
భావజ్ఞులకుఁ బరాపశ్యంతి మధ్యమా వైఖరు లేదేవి వర్ణసరణి
జపహార కీర పుస్తక విపంచి సముచితంబు లేదేవి హస్తాంబుజములు
కుందేందు మందార కదళీబృందంబు చంద మేదేవి యానందమూర్తి

కాంచె నేదేవి కాంచనగర్భచతుర, పూర్వదంతకవాట విష్వటమనోజ్ఞ
చంద్రకాంత శిరోగృహస్థలవిహార, మమ్మహాదేవి వాగ్దేవి నభినుతింతు

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి "జైమిని భారతము" నుండి

15. శారద విద్యాజాల వి
శారద ననుఁ బ్రోచుకొఱకు సారె భజింతున్
శారద నీరద నారద
పారద హారదరహీర పాండుశరీరన్

కాకునూరి అప్పకవి "అప్పకవీయము" నుండి

16. రాజీవభవుని గారాపుఁ బట్టపుదేవి, అంచబాబా నెక్కు నలరుబోణి
పసిఁడి కిన్నెర వీణెఁ బలికించు నెలనాగ, పదునాలువిద్యల పట్టుఁగొమ్మ
యీరేడు భువనంబు లేలు సంపతిచేడె, మొలకచందురుఁ దాల్చు ముద్దరాలు
వెలిచాయకొదమరాచిలుక నెచ్చెలికత్తె, ప్రణవపీఠికనుండు పద్మగంధి

మందరాచల కందరామధ్యమాన
దుగ్ధపాదోధి లహరికాధూర్తయైన
లలితసాహిత్యసౌహిత్య లక్ష్మి నొసఁగు
వరదయై మాకు వినతగీర్వాణి వాణి

శ్రీనాధ మహాకవి "భీమఖండము" (భీమేశ్వరపురాణము) నుండి

17. తతయుక్తిన్ ఘనశబ్ధము ల్వెలయ నర్ధవ్యంజకప్రక్రియల్
తతినానద్ధతమించ దత్తదుచితాలంకారము ల్మీఱ శ్రీ
పతి చారిత్రము సర్వగోచరతచే భాసిల్లఁగా భారతీ
సతి యస్మద్రసనాగ్రరంగమున లాస్యప్రౌఢిఁ బాతింపుతన్

ధరణీదేవుల రామయమంత్రి "దశావతార చరిత్ర" నుండి

18. కమనీయవిమలశృంగారాంబుసంభూత, కమలమో యన ముఖకమల మమర
బ్రహ్మాండగేహదీపంబు లనం గ్రాలు , తాటంకమణిరుచుల్ తాండవింప
సంగీతసాహిత్య సరసిజాతము లైన, కోరకంబు లనంగఁ గుచము లలర
సంపూర్ణపూర్ణిమా చంద్రిక యనుభాతి, ధవళాంబరము ధగద్ధగల నీన

దేవగజదంతతుల్యమై దేహకాంతి
చంద్రకాంతపీఠంబున సంగమింప
వివిధకవిపుంగవుల మనోవీథి మెలఁగు
వాణి నివసించుఁ గాక మత్స్వాంతమునను

భాగవతుల నృసింహశర్మ గారి "శృంగారసంధ్య" (కాళికాపురాణాంతర్గతము)నుండి

19. తొలిపల్కులౌ వేదముల స్వరూపమ్మునఁ, గమలాసనుని ముఖకమలమందు
వాగ్రూపముననెల్ల వారినూఁకొట్టించు, ప్రవిమల జిహ్వాగ్ర భాగములను
విజ్ఞానమయరూప విభవమ్మునన్ సద్గు, ణాధీశ్వరుల యంతరాత్మలందు
సాకారయై యక్షరాకారమున బహు, భాషావళీగ్రంథ పత్రములను

గుట్టుగాఁగాపురము సేసికొనుచు నేను
కోరినప్పుడు నానాల్కకొనను జేరి
నృత్యమొనరించు వాణికిఁ బ్రత్యహమ్ము
నధికభక్తిఁ బ్రణామమ్ము లాచరింతు

జగ్గకవి "కళానిధి" నుండి

20. కట్టినపుట్టముం దనువు గద్దియతమ్మియు నక్షమాలయుం
బట్టినచిల్కయు న్నగవుఁ బాపటజల్లియు నొక్కవన్నెగాఁ
బుట్టుచుఁ బుట్టువిద్యలకుఁ బుట్టినయి ల్లనఁజెల్లి బ్రహ్మవా
కట్టొనరించి తన్ముఖవికాసినియౌ సతి మమ్ముఁ గావుతన్

కొరవి గోపరాజు "సింహాసన ద్వాత్రింశిక" నుండి

21. చేర్చుక్కగానిడ్డ చిన్న జాబిల్లిచే సిందూర తిలకమ్ము చెమ్మగిల్ల,
నవతంస కుసుమంబునందున్న ఎలదేటి రుతి కించిదంచిత శ్రుతులనీన
ఘనమైన రారాపు చను దోయి రాయిడిదుంబీఫలంబు దుందుడుకుజెంద
దరుణాంగుళిచ్చాయ దంతపు సరకట్టులింగిలీకపు వింతరంగులీన

నుపనిషత్తులుబోటులై యోలగింప
బుండరీకాసనమునగూర్చుండి మదికి
నించు వేడుక వీణ వాయించు చెలువ
నలువరాణి మదాత్మలో వెలయుగాత.

అల్లసాని పెద్దన "మనుచరిత్రము" నుండి

(ఇంకా ఉంది .........)

కూచిమంచి తిమ్మకవి అచ్చ తెనుఁగు రామాయణము నుండి కొన్ని అందమైన పద్యాలు

కూచిమంచి తిమ్మకవి అచ్చ తెనుఁగు రామాయణము నుండి కొన్ని అందమైన పద్యాలు.
(శ్రీరాముని అరణ్యవాస ఘట్టము)

క. పినతల్లిం బొడగని, క
మ్మనిపలుకుల నిట్టు లనియె "మము నేదఁగ నో
పినతల్లీ! నీదెందం
బున నిటువలె లాఁతితనము పూనఁగఁ జనునే

క. ఓయమ్మ యిట్టు లఱమఱ
సేయంగ నేల, నీవు సెప్పినచెయ్వుల్
ద్రోయంగా నేర్తుమె; యిఁక
నీయానతిఁ గడవఁ బోము నీయానసుమీ

తే. "ఒనరఁ దలిదండ్రు లెలమితోఁ బనుపుదురట;
తోఁడబుట్టువు పుడమికి దొర యగునఁట;
పున్నియపునేల లొగిఁ గాంచ బోవుటయఁట;
మెలఁత! మఱి యింతకంటెను మేలు గలదె?

క. "తలఁపఁగ జగమునఁ గలవే
ల్పులు, సంగడికాండ్రుఁ జుట్టములు, మఱి సెప్పం
గలవార లెందఱేనియుఁ
దలిదండ్రుల కెన యొనర్పఁ దగుదురె యెందున్?

తే. 'అట్లు గావున, నిపుడు మీయానబత్తి
దవిలి యొనరింతు" నని యటఁ దరలి తనదు
తల్లికడ కేఁగి, యత్తెఱంగెల్లఁ దెల్పి,
యడుగులకు మ్రొక్కుటయు, నాతి యతనిఁ జూచి,

క. "కటకట! బిడ్డఁడ! కోరిక
లటమట లై చనియె నిప్పుడద్దిర! తా నొ
క్కటి దలఁచిన దయ్యం బొ
క్కటి దలఁచు నఁతన్నమాట కడు బెడఁ గగుచున్

క. 'పుడమిఁ దనకన్నకొడుకున
కడుగుకొనియెఁగాక కైక, యహహ! నినుం గా
ఱడవులకుఁ బనుపు మనుచున్
నుడువఁగ నెప్పగిదిఁ దనకు నో రాడెనొకో!

తే. "సవతితన మూని, యిట్టు లయ్యువిద వలుక,
నట్టులే తానును డేందంబు దిటము పఱుచు
కొని, యయో! నున్నుఁ గానల కనుపుకొనఁగఁ
దండ్రి యేచందమున నఱఁదలఁచెఁ జెపుమ

క. "అజ్జోటియు నొడయఁడు నీ
పజ్జం గనికరము మాలి పనిగొల్పినచో;
నిజ్జాడ మీకుఁ దగ దని
యొజ్జయుఁ బ్రెగ్గడలు నాడకుండిరె వారిన్?

క. "గడియయ యేఁ దగు మును నినుఁ
బొడగానక యుండునెడలఁ బొలుపరి నీ వి
ట్లెడవాసి దవ్వు చనుచోఁ
గొడుకా! యిఁక నెట్లు తాళుకొనఁ గలఁ చెపుమా

తే. అనుచు నడలెడు తల్లి నూరార్చి యంప
దొనలు విల్లును గయికొని చనఁ దలంచు
నెడల, నడ్డంబుగా వచ్చి పుడమికాన్పు
వలపు గులుకంగ మెల్లనఁ బలికెనపుడు

తే. "మేలు గలనాఁడు ముఱియుచు మెసవనేర్చి,
గొడవ లొదవెడుతఱిఁ బోవ విడువఁదగునె
తాలఁప నుసుఱులయొడయఁ డై తనరుమగని
వెర వెఱింగిననాడెంపు వెలఁదుకలకు

ఆ. "మగనితోడ నెలమిఁ దగిలి ముత్తయిదువ
పోణిమిని గరంబు రాణఁ బొసఁగు
చున్ననాఁడె కాక, యన్నుల కటమీఁద
నెన్నఁడైన నెమ్మియింత గలదె?

ఆ. "అట్టు లగుటఁ జేసి యరగడియయుఁ దాళఁ
జాల నిన్నుఁ బాసి నేలఱేఁడ!
మాఱుమాట లుడిగి కాఱియఁ బెట్టక
తోడుకొని కడంకతోడఁ జనుము"

క. అనవుడు నబ్బల్లిదుఁడా
ననఁబోడులమిన్నఁ జూచి నగి యిట్లనియెన్
"బెనుఁగానలబడి చెలులకుఁ
జనఁ జనునే వెరపుమాలి చెక్కెరబొమ్మా?

క. నగువారి నెల్లఁ దలఁపక
మగువా! మగవారివెంట మచ్చికతో రాఁ
దగవా? పగవాడనె నిను
దిగనాడి చనంగ? లాఁతి తెఱఁ గెన్నుదురే?

సీ. "చెలిమితో నాడంగ జింక కూనలుగావు, గద్దఱి కొదమసింగలుగాని;
కులుకుచుఁ బలికింపఁ జిలుకబారులు గావు, దుగమొగంబులపుల్గుతెగలు గాని
వలపుతోఁ బెనుప జవ్వదిపిల్లులు గావు, బలితంపుఁబొగరు బెబ్బులులు గాని
కయిసేయిఁ బువ్వుఁదీవియపందిరులు గావు, పొదలుజొంపపుఁగాఱు పొదలుగాని

గొండ్లి సలుపంగ ననుఁగుఁబూబొండ్లు గాని
తులువపొలయోగిరపుఁబొలంతుకలు గాని
గోల లెచ్చట, గాటంపుఁగోన లెచట
వలువ దుడుగుము పయనంబు తలిరుఁబోడి

క. "వల నొదవనిపని యగుటం
బలికితి రావలవగనుచుఁ బరికింపఁగ నో
యొలదీవెఁబోఁడి! నిన్నుం
గలలోపల నైనఁ బాయగలనే? చెపుమా

క. అని యిట్టు లెన్ని సెప్పిన
విననొల్లక కలువకంటి వెగ టొదవఁగఁ బ
ల్కినఁ దలఁకుచు వెంటం దో
డ్కొని చనుటకు నాతఁ డియ్యకొని యుండుటయున్

తే. అత్తలకు మ్రొక్కి వారల యానతిఁగొని
జానొదవఁ జెల్మిబోటులఁ జాలఁ గూర్మి
తోడఁ గవుఁగిటఁ బెనఁచి యాతొడవుతొడవు
నెమ్మిఁ బెనిమిటిదరిఁ జేరి నిలుచునెడను

క. లక్కుమనుఁడు సింగాణియు
నక్కజపుందొనలు పూని యరుదెంచి కడున్
మ్రొక్కులిడి యున్న నాతని
మక్కువ కెదలోన నాలరి మఱి యప్పిదపన్

తే. తమ్ముఁడును గేస్తురాలును దాను నగరు
వెడలి యమ్మేటి దమవీటి నడిమిత్రోవఁ
జనుచు నుండెడుచోఁ గనుంగొనుచు నుండి
యెల్లవారలుఁ దమలోన నిట్టు లనిరి

క. "ఇట్టినిగారపు గొనముల
తిట్టలఁ గనికరము మాని తెం పొదవంగాఁ
గట్టడవులకుం బనుపఁగఁ
గట్టా! యమ్ముదుకఁ డెంత కట్టిఁడి చెపుమా!

క. "తడవేఁడు లయ్యె దనకుం
గొడుకులు లే రనుచు ముందుఁగుందుచు నెన్నో
పడరానిపాట్లు వడి యిపు
డడవులకుం ద్రోచుకొనుట యరుదైతోచున్

క. "తప్పక యాఁడుది గోరినఁ
మెపులకై వెడఁగుఁదనము మీఱఁగ నిటులీ
యొప్పులకుప్పల విడుచుట
ముప్పుందఱి? నితని కేమొ ముది మది దప్పెన్

క. "ఆలిమాటకొఱకు బేలయై కోడలిఁ
గొడుకుఁ బోవఁ ద్రోచుకొనియె, నితని
కేటిమగతనం బిసీ! కడుఁ గొద లేని
ఱట్టు వొందె నింక ఱంతు లేల?